RSS
Wecome to my Blog, enjoy reading :)

మేధో సాహసాల మేలు కలయిక![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 12]

ఆ శిలాశాసనాన్ని చదవగానే భట్టికి సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. తన ‘అన్న విక్రమాదిత్యుడు అట్టి సాహస కార్యాన్ని తప్పక నెరవేర్చగలడు’ అనుకున్నాడు. తాము ఆశించినదే ఎదురుగా ఉన్నట్లు తోచి భట్టికెంతో ఆనందం కలిగింది.

భట్టి దేవాలయంలోకి ప్రవేశించి, అక్కడ గల మహంకాళికా దేవిని అర్చించాడు. మనో వాక్కాయ కర్మల, ఇష్టపూర్తిగా పూజాదికాలు నిర్వహించాడు. కోవెలలో అమ్మవారి కంటి చూపుకు ఎదురుగానే, సరోవరం ఉండటాన్ని, దాని మధ్యలో త్రిశూలం ఏ ఆధారమూ లేకుండానే నిలిచి ఉండటం గమనించాడు. అది అమ్మవారి మహిమగా గ్రహించాడు.

దేవీ కోవెలలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, కన్యాపురానికి తిరుగు ప్రయాణమయ్యాడు. నగరం చేరి, తనకు అన్న, రాజూ అయిన విక్రమాదిత్యుడి దగ్గరి కెళ్ళి, వినయంగా నమస్కరించాడు.

భట్టిని చూడగానే విక్రమాదిత్యుడికెంతో సంతోషం కలిగింది. ప్రేమాప్యాయతలతో భట్టిని కౌగిలించుకున్నాడు. "నా ప్రియమైన తమ్ముడా, భట్టీ! నీవు నన్ను కంటికి రెప్పవలె కాపాడు ఆత్మబంధువవు. నీ విక్కడ నుండి వెడలి ఆరుమాసాలు గడిచినవి. మనం ఆశించినట్లుగా ఏదైనా ప్రదేశాన్ని కనుగొన్నావా?" అని అడిగాడు.

"అన్నా! కనుగొంటిని" అన్నాడు భట్టి. సవిస్తరంగా తాను చూచిన ప్రదేశాన్ని, దేవీ ఆలయాన్ని, శిలా శాసనాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించాడు.

విక్రమాదిత్యుడికి ఎంతో ఆనందమూ, ఉత్సాహమూ కలిగాయి. వెంటనే అక్కడికి వెళ్లాలని నిశ్ఛయించుకున్నారు. తమ అనుచరులలో ఒక సమర్దుడిని ఎంపిక చేసి, కన్యాపుర రాజ్యపు బాగోగులు చూడవలసిందిగా ఆదేశించారు.

ఒక పుణ్య తిధినాడు, సుముహుర్తం చూసుకుని భట్టి విక్రమాదిత్యులిద్దరూ మారువేషాలు ధరించి వింధ్యాటవికి ప్రయాణ మయ్యారు. దట్టమైన అందమైన అరణ్యాలని, కొండకోనలని, వాగు వంకలనీ దాటుకుంటూ వెళ్ళారు. దుర్గమారణ్యాలలో ప్రయాణిస్తూ... ప్రకృతి రమణీయతనీ, వన్యమృగ సంచారాన్ని ఎంతగానో ఆనందించారు.

కొన్ని దినాల ప్రయాణానంతరం, ఇద్దరూ వింధ్య పర్వత ప్రాంతాన్ని, గుణవతీ నదీ తీరాన్నీ చేరారు. ఉత్సాహంగా మహంకాళీ దేవీ పురాతన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. పుష్కరిణిలో స్నానమాచరించి, దేవళంలోకి ప్రవేశించారు.

విక్రమాదిత్యుని చూసి, మహంకాళి దేవి ఎంతో ప్రసన్నురాలైంది. గోవు తన వత్సలని చూసినట్లుగా, తల్లి తన బిడ్డలని చూసినట్లుగా మహంకాళి దేవి, భట్టి విక్రమాదిత్యులని వాత్సల్యంతో చూసింది. విక్రమాదిత్యుని సాహస లక్షణాలని చూసి ‘ఈతడి చేత ఇక్కడ నగరాన్ని నిర్మింప చేయాలని, పురాతన ఆలయానికి ప్రాభవం తేవాలనీ’ సంకల్పించింది. విక్రమాదిత్యుని సామర్ధ్యమందుకు తగినదో కాదో పరీక్షింపనెంచి, అదృశ్య రూపంలో భట్టి విక్రమాదిత్యుల వెంట నడిచింది.

దేవళంలోని దేవీ మూర్తికి పూజాదికాలు, సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, భట్టి విక్రమాదిత్యులు సరోవరం దగ్గరికి చేరారు. విక్రమాదిత్యుడు శిలాశాసనాన్ని మరోసారి చదివాడు. సరస్సు మధ్యలో ఆధార రహితంగా, నీటిపై నిట్టనిలువుగా నిలిచి ఉన్న త్రిశూలాన్నీ, సరస్సు పైకి వ్యాపించి ఉన్న మర్రి కొమ్మలకు వ్రేలాడుతున్న ఏడు ఉట్లనీ పరీక్షగా చూశాడు.

ఆధారరహితమైన త్రిశూలాన్ని చూసి "తమ్ముడా! భట్టి! నీటిలో ఈ త్రిశూలము ఆధారము లేకనే ఎట్లు నిలిచి ఉన్నది?" అని అడిగాడు.

భట్టి "మహారాజా! గుడిలోని దేవికి ఎదురుగా నున్నది గనుక, ఆ తల్లి మహిమతోనే అది అట్లు నిలిచి ఉన్నదని తలంచుచున్నాను" అన్నాడు.

విక్రమాదిత్యుడి కది చూసి ఎంతో ఉద్వేగమూ, భక్తి పరవశమూ కలిగాయి. శిలా శాసనం మీద వ్రాసి ఉన్న సాహస కార్యము చేసి తీరాలన్న పట్టుతల కలిగింది. ఒకవేళ దేవీ దర్శనము పొందలేక, ప్రాణాలు కోల్పోయినా పోయేదేం లేదనిపించింది.

మరోసారి భక్తిగా సరోవరంలో పుణ్యస్నానమాచరించి, గుడిలోని తల్లిని స్మరించుకున్నాడు. భట్టిని వటవృక్షము మొదలులో నిలబడమని చెప్పాడు. వృక్ష రాజానికి నమస్కరించి చెట్టెక్కాడు.

ఒర నుండి కత్తి తీసి నోటబెట్టి, చెట్టు కొమ్మలపైని ఉట్ల దగ్గరికి చేరాడు. విక్రమాదిత్యుడికి తాను చేయబోయే సాహసకార్యం ఎంత ప్రమాదకరమైనదో తెలుసు. అయితే, అందుకు రెట్టింపుగా, విక్రమాదిత్యుని మనస్సు, మహంకాళి దేవిపై భక్తితోనూ, నమ్మకంతోనూ నిండిపోయింది. కళ్ళు నిగిడ్చి ఏడు ఉట్లని పరిశీలించాడు. అవి ఒకే కొమ్మకు వరుసగా లేవు; ఒక్క వేటులో తెగ వెయ్యటానికి! వర్తులా కారంలో ఉన్నాయి.

విక్రమాదిత్యుడు "తమ్ముడా భట్టి! ఈ ఏడు ఉట్లునూ ఒకే తాటికి కట్టిలేవు. ఒకే వరుసలోనూ లేవు. వలయాకృతిలో అమర్చబడ్డాయి. ఒక్క వేటుతో వీటిని తెగ వేయిటెట్లు? ఆలోచించి ఉపాయం చెప్పు!"అన్నాడు.

అప్పటికే భట్టి దానిని పరిశీలనగా చూస్తున్నాడు. అతడికీ చిక్కు అర్దమయ్యింది. "అన్నా! నీ కుడిపాదమును ఒక ఉట్టిపై ఉంచి, దాని ప్రక్కనున్న ఉట్టిని ఎడమ చేత బట్టుకొనుము. ఊయల ఊగినట్లుగా, కుడివైపుకు ఊపు తెచ్చుకొనిన, అవి గుండ్రముగా తిరిగి పురి ఎక్కగలవు. అప్పుడు ఏడు ఉట్లు తాళ్ళు పెనవేసుకుపోయి, ఏక తాడు వలె బలంగా, గట్టిగా కాగలవు. అప్పుడు కత్తితో, ఒక్కవేటుతో వాటిని తెగనరక వచ్చును. తెగిన ఉట్లు నీటిని చేరక ముందే, తల్లక్రిందులుగా త్రిశూలము పైకి దూకుము. ఆపైన దేవీ కృప!" అన్నాడు.

విక్రమాదిత్యుడు మరోమారు ఉట్లను పరిశీలనగా చూశాడు. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని సాహస క్రియకు పూనుకున్నాడు. కొన్నిలిప్తల పాటు కాళీ మాతని స్మరించాడు. శ్రద్ద, పట్టుదల కలగలిపి, ఒక ఉట్టిపై కుడిపాదము నుంచాడు. దాని ప్రక్కన గల మరియొక ఉట్టిని ఎడమ చేత బట్టుకుని, శరీరాన్ని కుడివైపుకు వంచి, ఒక్క ఉదుటున ఊపు తెచ్చుకున్నాడు. రంగుల రాట్నము తిరిగినట్లుగా ఉట్లు తిరిగి, ఏడు తాళ్ళూ పెన వేసుకు పోయి పురి ఎక్కాయి.

విక్రమాదిత్యుడు ఆ ఏక తాటిని, కత్తితో ఒక్క వేటున తెగ వేశాడు. మరుక్షణమే తాను తల్లక్రిందులుగా త్రిశూలము పైకి దూకాడు. ఉట్లు నీటిని చేరక మునుపే అతని శిరస్సు త్రిశూలాన్ని తాకింది.

భట్టి ఇదంతా రెప్పవాల్చక, ఊపిరి పీల్చక చూస్తున్నాడు. విక్రమాదిత్యుడి శిరస్సు త్రిశూలాన్ని తాకిన క్షణాన, భట్టి కళ్ళ ముందు పెద్ద మెరుపు మెరిసినట్లయ్యింది. ఆ వెలుగుకతడు కళ్ళు మూసుకున్నాడు. క్షణం తర్వాత కళ్ళు తెరిచి చూస్తే... అతడి ముందు ట్రిశూలమూ లేదు, విక్రమాదిత్యుడి దేహమూ లేదు.

~~~~~~

4 కామెంట్‌లు:

తార చెప్పారు...

లక్ష్మి గారు, మొత్తం ఎన్ని భాగాలుగా రాస్తుంన్నారు అండి? నాకైతే అన్నీ పీడియఫ్ గా చేసుకొని దాచుకోవాలనిపిస్తున్నది.

బాగా రాస్తున్నారు..

amma odi చెప్పారు...

తార గారు: మీ అభిమానానికి కృతజ్ఞతలండి! అవి చాలా మాంచి కథలూ, పొడవాటి కథలండి! రోజుకో కథ చెప్పినా సంవత్సరం పడుతుంది.365 కథలు మరి! పని ఒత్తిడి వలన కొంచెం కొంచెంగా వ్రాస్తున్నాను. :)

కాకి చెప్పారు...

మీరు రాజకీయాల వివరణలు ఆపి ఈ కథలు ఎక్కువ రాస్తే పని వత్తిడి తగ్గుతుంది ..... హహ .. రాజకీయాలలో కూడా మీరు ఉదాహరిస్తున్న కథలు చాలా సందర్భోచితం గా బావుంటున్నాయి..

amma odi చెప్పారు...

కాకి గారు: మొత్తానికీ స్థారక నామధేయులు! :)

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes