RSS
Wecome to my Blog, enjoy reading :)

దేవేంద్రుని ఆహ్వానం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 15]

ఇంకా ఆలస్యం చేస్తే.... నారద మహర్షికి ఆగ్రహం కలిగి శపించగలడని, మాతలికి భయం కలిగింది. దేవేంద్రుని రధాన్ని అలంకరించి, ఆకాశమార్గాన భూలోకానికి ప్రయాణ మయ్యాడు. రాత్రి పదహారు ఘడియలకు అతడు ఉజ్జయినీ నగరాన్ని చేరాడు. [ఘడియలన్నవి ఆనాటి కాలమానం.]

మాతలి దేవరధాన్ని ఉజ్జయినీ మహంకాళి ఆలయ సమీపంలో నిలిపాడు. విక్రమాదిత్యుని మందిరాని కేగి, విక్రమాదిత్యుని చూచి నమస్కరించాడు. "ఓ రాజేంద్రా! దేవేంద్రుడు మిమ్ము జూడగోరి యున్నాడు. నేను ఇంద్ర సారధి యగు మాతలిని. దేవపతి ఆనతి మీద మిమ్ములను స్వర్గమునకు తీసికొని పోవుటకు రధమును తెచ్చిన వాడను. మీ అభిప్రాయం బేమి?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు ప్రక్కనే ఉన్న భట్టిని సాభిప్రాయముగా తిలకించాడు. భట్టి కొన్ని క్షణాలు ఆలోచించి, "మహారాజా! ఇది ఎంతో విశేషమూ, ప్రత్యేకమూ కూడా! మీ కీర్తి చంద్రికలు స్వర్గలోకానికీ పరివ్యాప్తి చెంది ఉండవచ్చు. లేకున్న దేవేంద్రుడే మిమ్మల్ని ఆహ్వానించడు గదా? మీరు జాగు సేయక, తక్షణమే ప్రయాణమవ్వండి. ఇందులో శంకించడానికేమీ లేదు" అన్నాడు.

విక్రమాదిత్యుడు పట్టుపుట్టములనూ, రత్నాభరణములనూ ధరించి, భద్రకాళీ దేవాలయమునకు పోయినాడు. మహంకాళీ దివ్యదర్శనము చేసి కొని "ఓ దేవీ! ఓ తల్లీ! నీవు సమస్త లోకమాతవు. నన్నూ, ఈ లోకమును గాచు అమ్మవు. నేను నీ బిడ్డను. నీ భక్తుడను. దయతో నన్ను అనుగ్రహించు! కరుణా మూర్తివై నన్ను రక్షించు!!" అని ప్రార్దించాడు.

మహంకాళీ మాత అతడి ముందు ప్రత్యక్షమైంది. చిరునవ్వుతో "వత్సా, విక్రమాదిత్యా! నీవు స్వర్గమునకు వెళ్ళుము. ఈ యాత్ర నీకు శుభాన్నీ, కీర్తినీ కలిగించ గలదు. స్వర్గ భూలోకములలోని అందరికీ అది సంతోషాన్ని ఇవ్వగలదు" అని దీవించి... విభూతి, నిమ్మపండుల నిచ్చింది.

విక్రమాదిత్యుడు భక్తితో వాటిని స్వీకరించి, దేవరధాన్ని చేరాడు. అది దేవ రధమైనందున విక్రమాదిత్యుడు, ఎక్కబోయే ముందు దానికి ప్రదక్షిణలాచరించి, భక్తితో నమస్కరించాడు. పిదప కుడిపాదమెత్తి రధం మీద ఉంచాడు. అతడు రెండవ పాదమెత్తి రధములోనికి ఎక్కక మునుపే, మాతలి రధాన్ని, వాయువేగంతో ముందుకి ఉరికించ బోయాడు.

అయితే విక్రమాదిత్యుడు ఆందోళన చెందలేదు. అతడు తన పాదాలని భూమి మీద, రధం మీదా గట్టిగా నొక్కి ఉంచి స్థిరంగా నిలబడ్డాడు. ఆశ్చర్యం! రధం అంగుళం కూడా ముందుకి కదలలేదు.

మాతలి ఆశ్చర్యం పోయాడు. "ఏమిటది? రధం ఎందుకు కదలటం లేదు. ఏమి ఆశ్చర్యం ఇది? కారణమేమై ఉంటుంది?" అని ఆలోచిస్తూ వెనుదిరిగి చూశాడు. చిరునవ్వుతో స్థిరంగా నిలిచి ఉన్న విక్రమాదిత్యుణ్ణీ, అతడి ప్రయత్నాన్నీ గమనించాడు. మాతలికి భయమూ, విభ్రమమూ కలిగాయి.

‘నారద మహర్షి చెప్పినది సత్యమే! నేను దానిని సరికాదనుకొంటిని. ఇప్పుడీ వింతను కనులారా చూచితిని. మానవ మాత్రుడీ అద్భుతము చేయజాలడు. ఈ విక్రమాదిత్య మహారాజు నిజముగా దేవతా సముడే!’ అనుకున్నాడు.

వెంటనే మాతలి రధము దిగి వచ్చి, విక్రమాదిత్యుని ఎదుట నిలిచాడు. విక్రమాదిత్యునికి నమస్కరించి, "ఓ విక్రమాదిత్యా! రాజోత్తమా! నా తప్పును మన్నించు" అని ప్రార్దించాడు. మాతలికి ఎంతో సిగ్గుగానూ, పశ్చాత్తాపం గానూ తోచింది. అతడి మాటల్లో వినయం ఉంది. ముఖంలో దైన్యం ఉంది.

విక్రమాదిత్యుడు సాదరంగా చిరునవ్వు నవ్వి అతణ్ణి ఆశ్వాశించాడు. పిదప రధారూఢుడైన విక్రమాదిత్యుని మాతలి అమరావతికి ఆకాశ మార్గాన తీసికెళ్ళాడు. ఎంతో వినయ విధేయతలతో అతణ్ణి ఇంద్రసభకు తోడ్కొని పోయాడు.

విక్రమాదిత్యుడు ఇంద్రుడికి నమస్కరించాడు. దేవేంద్రుడు విక్రమాదిత్యుని చూడగానే ఎంతో ప్రసన్నుడయ్యాడు. తనలో ‘నారద మహర్షి సత్యము పలికినాడు. ఈతడి తేజస్సు దేవతలతో సరితూగు నట్టిది’ అనుకున్నాడు.

దేవేంద్రుడు విక్రమాదిత్యుడిని ఎంతో గౌరవంగా, ఆత్మీయ అతిధిగా ఆదరించాడు. సభలో విక్రమాదిత్యుడు సుఖాసీనుడయ్యాక, దేవేంద్రుడు "విక్రమాదిత్య మహరాజా! మీ రాజ్యము సస్యశ్యామలంగా, సిరిసంపదలతో నిండి ఉన్నదా? మీ ప్రజలు మీ పట్ల గౌరవ విధేయతలతో మొలుగు తున్నారు కదా? నీవు ప్రజల యోగ్యతా యోగ్యతలనీ, సామర్ద్య అసమర్దతలనీ ఎరింగి, వారికి కావలసిన అన్ని సదుపాయములూ సమకూర్చుతున్నావా? నీ రాజ్యమున ప్రజలకు నీ మంత్రులూ, రాజోద్యోగులూ ఇష్టులై ఉన్నారా?" అంటూ ప్రశ్నించాడు.

[చూడండి! ఒక రాజును అడిగిన ప్రశ్నలలోనే ఒక రాజ్యం, ఎలా ఉండాలో, పరిపాలనా విధానం (Administration) ఎలా ఉండాలో స్ఫురింపు ఉంది. రాజు ప్రజలకి అన్నీ సమకూర్చాలి. రాజు ప్రజల చేత గౌరవింపబడాలి. ప్రజలు ఉద్యోగులంటే ఇష్టం కలిగి ఉండాలి. ఇప్పటి స్థితో?]

విక్రమాదిత్యుడు "దేవేంద్రా! మీ దయతో మా రాజ్యంలో అన్నీ శుభప్రదంగానూ, ప్రవర్ధమానంగానూ ఉన్నాయి" అని ప్రత్యుత్తర మిచ్చాడు. దేవేంద్రుడు విక్రమాదిత్యునికి అతిధి గృహన్ని, అతిధి మర్యాదలని అమరించాడు. కామధేనువు విక్రమాదిత్యునికి కావలసిన వస్తు సంబరాలని, అమృతమయ ఆహారాన్ని సమకూరుస్తోంది.

విక్రమాదిత్యుడీ విధంగా పక్షం రోజుల పాటు దేవలోకములో గడిపాడు. ప్రతిదినమూ రెండు సార్లు దేవసభకు హాజరయ్యాడు. శాస్త్ర చర్చలలోనూ, ఆధ్యాత్మక చర్చలలోనూ పొల్గొనే వాడు. వివిధ విషయాలపై విక్రమాదిత్యుడి ఆకళింపును చూచి దేవేంద్రుని కెంతో ఆనందమూ, ప్రీతీ కలిగాయి.

ఒకనాటి సభలో... రంభ, ఊర్వశులిద్దరూ నాట్య చేయసాగారు. ఇద్దరూ అందంగా, ధగధగలాడే రత్నాభరణ భూషణులై, మిలమిల లాడే వస్త్రధారులై మెరిసి పోతున్నారు.

వారి నాట్య ప్రదర్శన సాగుతుండగా దేవేంద్రుడు, "ఓ విక్రమాదిత్య మహరాజా! రంభ, ఊర్వశి లిద్దరిలో ఎవరు గొప్ప నాట్య ప్రవీణులో నీవు నిర్ణయించాలి" అన్నాడు.

విక్రమాదిత్యుడు "రేపటి సభలో నా నిర్ణయం చెబుతాను. ఇప్పటికి వారిద్దరి నృత్యాన్ని ఆపించండి" అన్నాడు.

వారి నృత్య పోటీ మరునాడు కొనసాగించ వలసిందిగా ఆజ్ఞాపించ బడింది.
~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes