RSS
Wecome to my Blog, enjoy reading :)

’ఏమీ లేదు’ అన్నదాన్నే ఇవ్వు!

అనగా అనగా.....

అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే ఊరు.

ఆ ఊళ్ళోని ఓ కట్టెలు కొట్టుకునే వాడు దాపులనే ఉన్న అడవికి కట్టెల కోసం వెళ్ళాడు. కష్టపడి ఓ పెద్దమోపు కట్టెలు కొట్టాడు. ఎత్తి నెత్తిన పెట్టుకొనేందుకు సాయం అవసరమై చుట్టూ చూశాడు.

దారిన పోతున్న ఓ బాటసారి కనబడ్డాడు.

"అయ్యా! కాస్త ఈ మోపు ఎత్తి నానెత్తిన పెట్టుకొనేందుకు సాయం పడతారా?" అర్ధించాడు కట్టెలు వాడు.

"అలాగే! దానికేం భాగ్యం! కానీ సాయం చేస్తే నాకేమిస్తావు?" కళ్ళెగరేస్తూ అడిగాడు బాటసారి.

"ఏమి లేదు బాబయ్య!” యధాలాపంగా జవాబిచ్చాడు కట్టెల వాడు.

"మాట తప్పకూడదు సుమా!” అంటూ కట్టెల మోపు ఎత్తుకోడానికి సాయపడ్డాడు బాటసారి.

మోపు నెత్తికెత్తుకొని ఇంటిదారిపట్టాడు కట్టెల వాడు.

"ఏమయ్యోయ్! నాకిస్తానన్నది ఇవ్వకుండా పోతున్నావు. ఇదేం న్యాయం?" అంటూ వెంటపడ్డాడు బాటసారి.

"నేనేమిస్తానన్నాను బాబయ్య! ఏమీ లేదనే చెప్పానే?" అయోమయంగా అడిగాడు కట్టెల వాడు.

"ఆ. అదే! అ ’ఏమిలేదు’ అన్నదాన్నే నా మొహాన పారేస్తే నా దారిన నేపోతా” విసుగ్గా అన్నాడు బాటసారి.

"ఏమీ లేని దాన్ని ఎక్కడి నుండి తెచ్చివ్వను బాబయ్య!” ఘోల్లుమన్నాడు కట్టెల వాడు.

"అదంతా నాకు తెలియదు. ’ఏమీ లేదు’ అన్నదాన్ని ఇస్తానన్నావు. మాట తప్పకూడదని ముందే హెచ్చరించాను కూడా. ఏమైనా సరే! నువ్వు నాకు ’ఏమీ లేదు’ అన్న దాన్ని బాకీ పడ్డావు. నా ’ఏమీ లేదు’ నాకిచ్చేస్తే సరి, లేకపోతే మర్యాద దక్కదు” పెడసరంగా హెచ్చరించాడు బాటసారి.

కట్టెల వాడు లబోదిబో మన్నాడు. బాటసారి అతడి వెంటపడి వేధించసాగాడు.

అలా గొడవపడు తూనే ఇద్దరు ఊళ్ళోకి వచ్చారు.

వారికి నసీరుద్దీన్ తారస పడ్డాడు.

"ఏమిటి గొడవ?" అడిగాడాయన.

విషయమంతా చెప్పుకొని బావురుమన్నాడు కట్టెల వాడు.

గట్టిగా తన వాదన వినిపించాడు బాటసారి.

చిరునవ్వు నవ్వాడు నసీరుద్దీన్.

"కట్టెల మోపు నెత్తికెత్తుకోవడానికి సాయం పడితే ఏమిస్తానన్నాడు ఇతడూ?" నిర్ధారణ కోసం అన్నట్లుగా బాటసారిని అడిగాడు.

గొంతు సవరించుకొని “ఏమిస్తావని నేను అడిగినప్పుడు ఈ మనిషి, ’ఏమీ లేదు’ అన్నాడు. ఆ ’ఏమీ లేదు’ అన్నదే ఇచ్చేయమనండి. నాదారిన నేను పోతాను” మరింత రచ్చచేస్తూ అన్నాడు బాటసారి.

"తప్పకుండా నీ దారిన నువ్వు పోదూగాని! ఇంతకీ ఇప్పటికి ఏమిచ్చాడు ఈ కట్టెల వాడు నీకు?" ఆరాగా అడిగాడు నసీరుద్దీన్.

"ఏమీ లేదూ. అందుకేగా ఈ గొడవంతా” చిరాగ్గా చెప్పాడు బాటసారి.

"మరింకెందుకు గొడవ? నీ ’ఏమీ లేదు’ అన్నదాన్ని నీకిచ్చేశాడుగా!” అన్నాడు నసీరుద్దీన్.

అప్పటికే చుట్టుమూగిన జనం ఘోల్లున నవ్వుతూ చప్పట్లు చరిచారు.

సిగ్గుతో తలదించుకొన్నాడు బాటసారి.

"రక్షించారు బాబయ్య!” అంటూ కట్టెలు వాడు నసీరుద్దీన్ కి దండం పెట్టెశాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఆనందించడానికి ఇదీ ఒక మార్గమే !

అనగా అనగా.....

మౌల్వీ నసీరుద్దీన్ ఓసారి ఏదో పని ఉండి వీధిలో నడుచుకొంటూ పోతుండగా ఓ ధనికుడు తారసపడ్డాడు. అతడు చాలా ఖరీదైన దుస్తులు వేసుకొని ఉన్నాడు. కాని అతడి ముఖంలో ఏదో దిగులు, విచారం! నసీరుద్దీన్ అతణ్ణి తేరిపారా చూశాడు. కుతూహలంగా తోచింది. ఆగి పలకరించాడు. “ఈ పట్టణానికి కొత్తలా ఉన్నారు? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకలా దిగులుగా ఉన్నారు?" అడిగాడు నసీరుద్దీన్.

ధనికుడు భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు.

"ప్రక్క నున్న పల్లె నుండి వచ్చాను” అన్నాడు.

నసీరుద్దీన్ కొనసాగించమన్నట్లుగా చూశాడు.

ధనికుడు “నాకు పది తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపద ఉంది. కాని ఆనందం మాత్రం లేదు. నేనెప్పడూ సంతోషంగా గడపలేదు” అన్నాడు విచారంగా.

"అదేం? ఆరోగ్యం లేదా?" అడిగాడు నసీరుద్దీన్.

"నాకేం. పిడిరాయిలా ఉన్నాను”.

"మరి సంతానం లేదా?"

"రత్నాల్లాంటి బిడ్డలు నలుగురున్నారు”కించిత్తు గర్వంగా చెప్పాడు ఆ ధనికుడు.

"వాళ్ళుత్త బడుద్దాయిలా?" అనుమానంగా అడిగాడు నసీరుద్దీన్.

"చాలా బుద్ధిమంతులు. నే గీచిన గీత దాటరు. చక్కగా వ్వాపారం చేసి భారీగా లాభాలు గడిస్తున్నారు?"

"మరేమిటి మీ సమస్య? ఎందుకు విచారం?" మరింత ఆరాగా అడిగాడు నసీరుద్దీన్.

"నాకన్నీ ఉన్నాయి, ఆనందం తప్ప. ఈ పట్టణం గురించి అందరూ చెప్పగా విన్నాను. అందుకే చూడటానికి వచ్చాను. ఇక్కడైనా నాక్కొంచెం సంతోషం దొరుకుతుందేమోనని ఆశ. అదీ తీరేటట్లుగా కనబడటం లేదు.”

నిర్వేదంగా చెప్పి నీరసంగా ముందుకు కదిలిపోయాడు ధనికుడు. సాలోచనగా అటువైపే చూస్తూ నిలబడ్డాడు నసీరుద్దీన్.

ఆ ధనికుడికి అన్నీ ఉన్నాయి. మరి ఆనందం ఎందుకు లేదు. తళుక్కున బుర్రవెలిగింది నసీరుద్దీన్ కి.

వెనుక నుండి పరిగేట్టుకుంటూ వెళ్ళి, ఒక్క ఉదుటున ధనికుడి చేతిలోంచి డబ్బు సంచీ లాక్కుని, ఇంకా వేగంగా పరుగెట్టి సందు మలుపులో దాగుండిపోయాడు.

"అయ్యో! అయ్యో. నాడబ్బు. నాడబ్బు” ఘొల్లుమన్నాడు ధనికుడు.

అతడి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కంగారూ, దుఃఖం, హడావుడీ, వత్తిడీ ముప్పరిగొన్నాయితణ్ణి, తేరుకొని గట్టిగా అరిచాడు.

"నాడబ్బు సంచీ లాక్కొని పారిపోతున్నాడు. దొంగా! పట్టుకోండి” భయంతో కీచుమంది ధనికుడి గొంతు.

వీధంతా హడావుడిగా ఉంది. ఎవరి పరుగులో వారున్నారు. ఎవ్వరూ అతడి గోల పట్టించుకోలేదు.

ధనికుడికేం చేయాలో పాలుపోలేదు. చాటుగా నసీరుద్దీన్ అతణ్ణి అనుసరిస్తూ, పరిశీలిస్తూనే ఉన్నాడు.

ధనికుడికి ఆకలి వేసింది. నీరసంగా ఉంది. అలిసిపోయాడు. ఎక్కడైనా బస చేద్దామన్నా, తిండి తిందామన్నా చేతిలో డబ్బులేదు.

దాదాపు ఏడుపొచ్చేసింది అతడికి. “ఈ ఉళ్ళో తెలిసిన వాళ్ళు కూడా లేరు. నేరకపోయి వచ్చాను. ఆనందం లేకపోతే పోయింది. ఇప్పడు తిండీ తిప్పలూ లేవు, నిద్రానిప్పులూ లేవూ. వెనక్కి వెళ్ళెందుకు దారి ఖర్చులు కూడాలేవు. ఏం చేయాలిరా బాబూ” అని గొణుక్కుంటూ రోడ్డుప్రక్కన చెట్టు క్రింద కూలబడ్డాడు.

అతణ్ణీ అనుసరిస్తున్న నసీరుద్దీన్ చెట్టు చాటు నుండి అతడు ముందు పడేలాగా డబ్బు సంచీ విసిరేసాడు.

నీరసంగా తూగుతున్న ధనికుడి ముందు ఖణేల్ మంటూ నాణాల సంచి పడింది. తనదే. అచ్చంగా తనదే.

ఒక్క గెంతులో పైకి లేచాడు ధనికుడు. డబ్బు సంచి మీదకి ఒక్క దూకు దూకాడు. చేతిలోకి తీసికొని అనందంతో కెవ్వున కేక పెట్టాడు. కుప్పిగంతులు వేశాడు.

"ఓ హోహో! దొరికింది. నాడబ్బు దొరికింది” సంతోషంగా అరిచాడు.

చిరునవ్వుతో ఎదురుగా నిలబడ్డాడు నసీరుద్దీన్.

ఒక్కక్షణం అయోమయంగా చూశాడు ధనికుడు. మరుక్షణం నసీరుద్దీన్ ని గుర్తుపట్టాడు.

నవ్వుతూ చెప్పాడు నసీరుద్దీన్ “ఆనందించడానికి ఇదీ ఒక మార్గమే.”

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

నమ్మకానికి, అహంకారానికి ఫలితాలివి

అనగా అనగా.....

ఒక గురువు గారు ఓ పల్లె ప్రక్కన గల అడవిలో ఓ గురుకులం నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులుండే వారు. వారిలో ఒక శిష్యుడు గురువు పట్ల ఎంతో వినయం, గౌరవం, మీదు మిక్కిలి నమ్మకం కలవాడు.

ఓ రోజు గురువుగారు కొద్దిమంది శిష్యులతో కలిసి చిన్ననది పాయకి స్నానానికి వెళ్ళారు. ఆ సమయంలో ఈ శిష్యుడు నదికి ఆవలి వైపున ఉన్నాడు. గురువు గారు శిష్యుణ్ణి తన దగ్గరికి రావలసినదిగా సైగ చేసారు. శిష్యుడు పడవకోసం వేచి చూడలేదు. నది కడ్డంపడి నడవసాగాడు. గురువు మీద నమ్మకం ఉంచి, గురునామం ధ్యానిస్తున్నాడు.
ఆశ్చర్యం! అతడు నీటిలో మునిగి పోలేదు. నడవ గలుగుతున్నాడు.

గురువు అది చూశాడు. తన శిష్యుడి శక్తి చూసి అతడికి చాలా సంతోషం, గర్వం కలిగాయి. ’నా పేరుకే ఇంత మహిమ ఉంటే నాకు మరింత మహిమ ఉండి ఉండాలి. నేను నడుస్తాను నీళ్ళమీద’ అనుకున్నాడు గురువు.

నదిలోకి దిగి నడవడానికి ప్రయత్నిస్తూ ’నేను నేను’ అని తన పేరు జపించసాగాడు.

అంతే! నీళ్ళల్లో మునిగి చనిపోయాడు.

నమ్మకానికి, అహంకారానికి ఫలితాలివి.

ఇదీ కథ!

~~~~~~~

అనగా అనగా...

ఓ ఊరిలో ఒక అమాయకుడుండేవాడు. వాడోసారి పనిమీద ప్రక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. దారిలో చిన్న నదిని దాటవలసి వచ్చింది. మన వాడికి భయమేసింది. అంతలో అక్కడికొక యోగి వచ్చాడు. ఈ అమాయకుడు తననీ నది దాటేలా చేయమని యోగిని ప్రార్ధించాడు. ఆయోగి ఇతడి కొక రాగి తాయత్తునిచ్చాడు. దాని మీద బీజాక్షరాలు [మంత్రాక్షరాలు] వ్రాసి ఉన్నాయని, చెప్పి అది వాడి కిచ్చి “నాయనా! ఈ తాయత్తునూ చేతబట్టి, శ్రీరామ శ్రీరామ అని జంపిస్తూ నది దాటూ. ఒరవడిని తట్టుకొని నీట నడవగలవు” అని అన్నాడు.

ఈ అమాయకుడు యోగికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. యోగి తన దారిన తాను పోయాడు. అమాయకుడు ’శ్రీరామ శ్రీరామ’ అని జపిస్తూ నదిలో దిగాడు. ఆశ్చర్యం! వాడు నీటిమీద నడవగలుగుతున్నాడు. వాడికి పిచ్చి సంతోషం వేసింది. కించిత్తు గర్వంగా అనిపించింది. అప్పటికి సగం నది దాటాడు. ఉండీ ఉండీ వాడికి ఆ రాగి తాయత్తుమీద ఏమంత్రం వ్రాసి ఉందో అన్న కుతూహలం పుట్టింది. మడిచి ఉన్న రాగి తాయత్తు విప్పిచూశాడు. దాని మీద ’శ్రీరామ’ అని వ్రాసి ఉంది. అది చదివి ‘ఒట్టి రామా అనేనా? మంత్రమో, తంత్రమో కాదా!’ అనుకున్నాడు.

ఆ క్షణమే వాడు నీటిలో మునిగి పోయాడు.

ఇదీకథ!


మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వెళ్ళిన దారినే రావాలి!

అనగా అనగా.....

ఓ అడవి. అందులో ఎన్నో జంతువులూ ఉన్నాయి.

వాటిల్లో ఓ నక్క.

దాని దురదృష్టం కొద్దీ, దానికి 10 రోజులుగా తిండి దొరక లేదు. నీరసించిపోయింది. డొక్క ఎండి పోయింది.

అలాగే కాళ్ళీడ్ఛుకొంటు ఆహారం వెదకసాగింది.

అదృష్టం!

ఓ చెట్టు తొర్రలో దానికి ఆహారం కన్పించింది.

చెట్లు కొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళో, లేక వేటగాళ్ళో లేక యాత్రికులో దాచుకున్న అన్నం మూట దానికి కన్పించింది.

చెట్టు తొర్ర సన్నగా ఉంది.

లోపల తిండి దండిగా ఉంది.

వాసన నోరూరిస్తోంది, ఆకలి ఆగనంటోంది.

ఎండిన డొక్కతో ఉన్న నక్క ఒక్క ఉదుటున తొర్రలోకి దూరింది.

అన్నం పప్పు, కూరలు, అప్పడం, అప్పాలతో కమ్మటి భోజనం.

కడుపునిండా మెక్కెసింది.

పొట్టలావుగా అయ్యింది.

ఇప్పడు ఓ చిక్కొచ్చింది నక్కకి.

దాని శరీరం తొర్ర వెడల్పు కన్నా ఎక్కువలావుగా ఉంది. బయటకి రావడం కుదరటం లేదు.

లోపలే ఉంటే, తిండి దాచుకొన్న మనుషులొచ్చి నాలుగు పీకితేనో?

లేక తన్ని తగలేస్తే నో!

తలుచుకొంటేనే వళ్ళు జలదరించింది దానికి.

కుయ్యోమొర్రో మంటూ మొత్తుకోవటం మొదలుపెట్టింది.

ఆ దారినే పోతున్న ఓ కుందేలు నక్క ఏడుపు విన్నది.

దగ్గరికొచ్చి చెట్టుతొర్ర కేసి చూసింది.

ఏడుస్తున్న నక్కని చూసి, "ఏమిటి సంగతి నక్కబావా" అంది.

నక్క వివరంగా చెప్పింది వెక్కిళ్ళుపెడుతూ.

"మరి లోపలికి వెళ్ళేటప్పడు ఎలా వెళ్ళావు?" లాజికల్ గా అడిగింది కుందేలు ప్రశ్నార్ధకపు ముఖం పెట్టి.

"ఆకలితో డొక్క ఎండి అప్పడు సన్నగా ఉన్నాను" అంది నక్క ఏడుపుముఖపెట్టి.

"అయితే వెళ్ళిన దారిలోనే తిరిగి రా నక్క బావా?" అంది కుందేలు చిరునవ్వుతో కళ్ళు మెరుస్తుండగా.

"అంటే మళ్ళీ 10 రోజులు పస్తుండలా?" భోరుమంది నక్క.

"అంతే మరి! కాకపోతే ఈసారి 10 రోజులు పట్టదులే. పస్తులయితే తప్పదు" అంది కుందేలు నింపాదిగా.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఏనుగు - గ్రుడ్డి వాళ్ళు

అనగా అనగా.....

ఒకసారి నలుగురు గ్రుడ్డివాళ్ళు కలిసి ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకొన్నారట. నలుగురు ఏనుగుని చేరారు.

ఒకడు దాని కాళ్ళని తడిమాడు “ఒరేయ్! ఏనుగు స్తంభంలా ఉంటుందిరా. మాఇంటి వసారాలో స్తంభాలిలాగే ఉంటాయి” అన్నాడు.

మరొకడు దాని చెవులు తడిమాడు. “కాదురా! ఏనుగు చేటలా ఉంటుంది. మా అమ్మ రోజూ బియ్యం చెరిగే చేట నాకు బాగా తెలుసు. ఏనుగు చేటలా ఉంది” అన్నాడు.

ఇంకొకడు దాని కడుపు తడిమాడు. “ఛస్! నోరు ముయ్యండిరా! మీకేం తెలీదు. ఏనుగు పెద్ద బాన లాగా ఉంటుంది. మాదొడ్లో బాన కన్నా కూడా పెద్దది” అన్నాడు.

నాలుగో వాడు దాని తోక తడిమాడు. నెత్తి నోరూ కొట్టుకుంటూ “అయ్యయ్యో! కాదర్రా. మీరలా పొరపాటు పడుతున్నారు. ఏనుగు బారెడు తాడులా ఉంటుంది. మీకర్ధం కావటం లేదు” అన్నాడు

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

విభజించి - పాలించు అని చెప్పే కణిక నీతి కథ

అనగా అనగా.....

ఈ కథ మహా భారతం, ఆది పర్వంలోనిది.

కౌరవ పాండవుల విద్యా ప్రదర్శన ముగిసింది. ప్రజల్లో పాండవుల పట్ల ఆదరణా, ఆరాధనా పెరిగిపోతున్నాయి. అనివార్యమై ధర్మరాజుకి యువరాజుని చేశాడు ధృతరాష్ట్రుడు. సద్గుణ సంపన్నుడూ, దయార్ధ్ర హృదయుడూ, ధెర్యస్ధెర్య సమన్వితుడూ అయిన ధర్మరాజు తన ప్రవర్తనతో ప్రజల మనస్సులను గెలుచుకున్నాడు. అర్జునుడు సోదరులతో జైత్రయాత్ర చేసివచ్చాడు. నానాటికి పాండవుల కీర్తి పెరిగిపోయింది.

ఇది ధృతరాష్ట్రుని హృదయాన్ని కలచివేసింది. ధృతరాష్ట్రునికి ముగ్గురు మంత్రులు.

అందులో ప్రధాని విదురుడు. ఈయన విద్వాంసుడు, ధర్మపరుడు, నీతికోవిదుడు. నిష్కర్షగా రాజు లోటుపాట్లని నిస్సంకోచంగా ముఖమ్మీదే చెప్పగల ధైర్యశాలి.

రెండవ వాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వహిస్తూ నిరంతరం ధృతరాష్ట్రుని ఆంతరంగిక సలహాదారుగా ఉంటాడు. వినయశీలి.

మూడవ వాడు కణికుడు. ఈయన కూటనీతి కుశలుడు. అంటే మోసంతో, కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు.

అలాంటి కణికుడిని ధృతరాష్ట్రుడు ఏకాంతానికి రప్పించి తన బాధ, కాంక్ష తెలియజేశాడు.

ఆ నీతివేత్త “మహారాజా! శతృనాశనానికి ముందు వారి ఉత్సాహ, ఐశ్వర్య, మంత్రాంగాలనే మూడు మార్గాలను నాశనం చేయాలి. అమాత్య[అంటే మంత్రులు, కార్యదర్శులన్న మాట], దుర్గ[అంటే పట్టణాలు, నగరాలన్న మాట], కోశ[అంటే ధనపునిల్వలు], సేన[పాలనా యంత్రాంగం, సైన్యాలు], రాష్ట్రాలు[రాజ్యంలోని అంతర్భాగాలన్న మాట] ఈ ఐదు వర్గాలనూ నాశనం చేయాలి.

సామ దాన భేద దండ ఉద్భంధన విషప్రయోగ అగ్ని ప్రసరణ మార్గాలలో శత్రువుల్ని నాశనం చేయాలి. శతృబలాన్ని మొదలంటూ నాశనం చేసి, తర్వాత వారి ఆశ్రయు వర్గాన్ని [అంటే అనుచరవర్గం అన్నమాట] నాశనం చేయాలి.

శతృవులని విభజించి గెలవాలి.

మహారాజా! వారిలో పిరికి పందల్ని భయపెట్టాలి. లోభికి ధనమిచ్చి లోబరుచుకోవాలి. బలహీనుడయితే పరాక్రమంతో స్వాధీనం చేసుకోవాలి. సమబలునితో స్నేహం చేయాలి. విషం తినిపించి గానీ, మోసగించి గాని శతృవుని క్రమంగా కడతేర్చాలి.

ఇది నీతి శాస్త్రం చెప్పే విషయం!

శతృవుని సాధించ దలిచినప్పడు [అంటే హెరాజ్ చెయ్యాలనుకొన్నప్పడు] క్రోధం పనికిరాదు. చిరునవ్వుతో చరిస్తూ వాడికి విశ్వాసం కలిగించి పాములా కాటు వేయాలి. ఎటువంటి ఘాతకం తలపెట్టినా ఆ విషయం పైకి తెలియకుండా, చిరునవ్వుతో, మృదుభాషణ తో ఓరిమి వహించి అదునెరిగి నెరవేర్చుకోవాలి.

ఆశలు రేకెత్తించాలి కాని అవి నెరవేర్చకూడదు. అలాగని ఆ భావం ఎదుటి వారికి తెలియనివ్వకుండా వాయిదాలు వేస్తుండాలి. ఇనుముతో చేసిన కత్తిని తోలు కవచంతో భద్రపరచి, అవసరానికి తీసి కేశ ఖండనానికి వినియోగించి నట్లుండాలి. మన మంత్రాంగం, మనం ఏ పనిచేసినా అది మనకి మరిన్ని ఆపదలు తెచ్చిపెట్టకూడదు.

ఒక కథ చెబుతాను వినండి మహారాజా!

అనగా అనగా ...

ఓ మహారణ్యం.

ఆ అడవిలో ఎన్నో కౄరమృగాలు యధేచ్చగా విహరిస్తూన్నాయి. అక్కడి ఓ నక్క ఉంది. అది చాలా తెలివైనది, కుటిల బుద్ది కలది. తన పనులన్నీ ఇతరులు చేత చేయించుకొని, పని పూర్తి కాగానే వారిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది.

ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు.

పులి, తోడేలు, ముంగిస, ఎలుక.

ఈ నక్క వీటితో కలిసి మెలిసి ఉన్నట్లు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నది.

ఆరోజులలో ఒకనాడు --

పిక్కబలిసి నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ, చెంగుచెంగున దూకుతూ పోయే లేడి దాని కంటపడింది. ఆలేడి ఈ మిత్రబృందాన్ని దూరం నుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. దాన్ని తినాలని నక్కకు కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టడం సాధ్యం కావడం లేదు.

బాగా ఆలోచించింది నక్క.

మిత్రులను చుట్టూ కూర్చో బెట్టుకుని,

"స్నేహితులారా! ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది. అయితే దానితో పరుగెత్తే శక్తి మనకెవరికీ లేదు. కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. ఇప్పడు మనం ఒక కుట్రపన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం అరగించవచ్చు” అని నాలుక చప్పరించి, అది ఎంత రుచిగా ఉంటుందో చూపించింది.

అన్నిటికీ నోరూరించి.

"ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం” అన్నాయి అవి ఆతురతతో అటే చూస్తూ.

అది కొంత సేపు ఆలోచన అభినయించింది.

"ఆ! ఇప్పడు ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి.ఈ లేడి మెలకువగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలిసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పడు చప్పడు కాకుండా పాకుతూపోయే ఈ ఎలక బావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అదనులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే!” అంది.

దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి.

అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతులేస్తూ, పచ్చికమేసి, సెలయేటి ఒడ్డున నీరు త్రాగి, బాగా అలిసి విశ్రాంతిగా కాళ్ళు జాపి నిద్రపోతున్నది లేడి.

నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలకవెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతుండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది.

నక్కతో పాటు దాని స్నేహితులు నలుగురూ సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి.

అప్పడా నక్క:

"న్నేహితులారా! ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పడు మీ శరీరాలన్నీ దుమ్మూ ధూళితో ఉన్నాయి. అందుచేత ఆకొండ లోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు” అంది.

అవి నాలుగూ సంతోషంతో స్నానానికి వెళ్ళాయి.

అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలని.

నక్క బొటబొటా కన్నీరు కారుస్తూంటే చూసిన పులి,

"బావా! ఎందుకు విచారిస్తున్నావు?" అంది.

"ఏం చెప్పను పులిబావా! ఆ ఎలక లేదూ! అది ఏమన్నదో తెలుసా! ’పులి ఎంత పెద్ద జంతువైతే ఏంలాభం? నేను కాళ్ళు కొరికితే గాని అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తూంది సిగ్గులేకుండా,’ అని వేళాకోళం చేస్తే
నాకు బాధ కలిగింది” అంటూ నక్క కన్నీరు విడిచింది.

పులికి పౌరుషం వచ్చింది.

"మిత్రమా! ఎలక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను. ఒకరిమీద ఆధారపడను” అంటూ వెళ్లిపోయింది.

అంతలో ఎలక రాగా, నక్క

"విన్నావా, ఎలక బావా! ఈ లేడిని పులి ముట్టుకుంది కనుక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎలకనూ తినేస్తా అంటూ ముంగిస బయలుదేరింది” అనగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది.

మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. “విన్నావా! పులి బావకు నీ మీద కోపం వచ్చి, నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట”, అనడంతో తోడేలు దౌడు తీసింది.

అప్పడు ముంగిస రాగా, “చాలా ఆశగా వచ్చావు. వాళ్ళ ముగ్గుర్నీ చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను” అనగా అది తోక ముడిచి పారిపోయింది.

హాయిగా ఆ లేడి మాంసం ఆరగించింది నక్క.

విన్నారా! మహారాజా! తెలివితో, వంచనతో మనకార్యలు చక్క బెట్టుకోవాలి” అన్నాడు కణికుడు.

ఇదే కణిక నీతి.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

కోకిలమ్మ వైద్యం

అనగా అనగా.....

ఓ అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులూ, పక్షులూ ఉండేవి. అప్పటికి గుడ్లగూబలు కూడా పగలు తిరుగుతూ రాత్రి నిద్రపోయేవి.

ఓరోజు ఆ అడవి దాపులనే ఉన్న ఓగ్రామం నుండి ఓ కుర్రాడు ఉండేలు తీసుకొని అడవికి వచ్చాడు. వాడు బంక మట్టితో చిన్న గోళీకాయలంత ఉండలు చేసి ఉండేలులో బెట్టి పక్షుల్ని కొడుతున్నాడు. ఒకటి రెండు పిట్టలు వాడి బారిన పడ్డాయి. కొమ్మ మీద కూర్చొని దిక్కులు చూస్తున్న గుడ్లగూబకి రెక్కక్రింద ఉండేలు మట్టి ఉండ గుచ్చుకొంది. బాధతో కీచు మంది గుడ్లగూబ.

అంతలో అటువైపు కౄరజంతువులు రావడంతో ఉండేలు కుర్రాడు అక్కణ్ణుండి పారిపోయాడు.

గుడ్లగూబ బాధతో చెట్టుకొమ్మల్లో చతికిలబడింది. గట్టిగా ఏడవడం మొదలెట్టింది. కాకి దాన్ని చూసి మెల్లిగా దగ్గరికొచ్చింది.

"ఏం జరిగింది గూబమామా? ఎందుకు ఏడుస్తున్నావు?" అంది. గుడ్లగూబ ఎక్కిళ్ళుపెడుతూ “ఎవడో కుర్రవెధవ! రాయితో కొట్టాడు అల్లుడూ” అంది.

"అయితే వైద్యుడి దగ్గరికి పోరాదూ?" అంది కాకి సానుభూతిగా.

"వైద్యుడెక్కడున్నాడు?" మూలుగుతూ అడిగింది గుడ్లగూబ.

"కోకిలమ్మ చాలాబాగా వైద్యం చేస్తూంది. కాకపోతే వూరికే చేయదు. మనమే దైనా ప్రత్యుపకారం చెయ్యాలి" అంటూ కాకి వివరించింది.

గుడ్లగూబకి నొప్పి మరీ ఎక్కువై ఇంకా గట్టిగా ఏడుస్తోంది. పాపం! కాకికి దాన్ని చూసి చాలా జాలివేసింది.

గుడ్లగూబ రెక్కకి తన రెక్కలానించి మెల్లిగా దాన్ని కోకిలమ్మ దగ్గరికి తీసికెళ్ళింది.

"ఎవరికి జబ్బూ?" పరిశీలనగా చూస్తు అడిగింది కోకిలమ్మ.

"గూబ మామాకి. ప్రొద్దునే ఎవరో కుర్రకుంక రాయితో కొట్టాట్టా" చెప్పింది కాకి.

కోకిలమ్మ గుడ్లగూబని పరిక్షించింది. రెక్కక్రింద బంకమన్ను రాయి ముద్ద కనబడింది.

"వూ. వైద్యం చేస్తాను. మరి నాపారితోషికం ఎవరిస్తారు?" అంది ముందు జాగ్రత్తగా.

గూబ కుయ్యు మందిగాని “సరే నేనిస్తాను” అనలేదు.

కోకిలమ్మ మళ్ళీ అదే ప్రశ్నవేసింది.

ఈసారి గుడ్లగూబ మరింత గట్టిగా ఏడుపులూ పెడబొబ్బలూ పెట్టింది గానీ, వైద్యం ఖర్చు నేనిస్తాననలేదు.

ఇదంతా చూస్తూన్న కాకి, "ఫీజు దేముంది కోకిలమ్మ? ముందు రోగి ప్రాణం ముఖ్యం కదా? వైద్యం చెయ్యి” అంది ఆదుర్దాగా.

"మరి నా ఫీజు?" సందేహంగా అడిగింది కోకిలమ్మ.

"గూబమామా ఇస్తాడులే. నాదీ పూచీ!” అంది పుచిక్కని కాకి. ఎంతైనా వైద్యం చేయించుకొని ఫీజు ఎగ్గొట్టదులే గుడ్లగూబ అన్న భరోసాతో.

"సరే” అంటూ వైద్యం ప్రారంభించింది కోకిలమ్మ.

గుడ్లగూబని ఆ అడవిలో ఉన్న వేడినీటి బుగ్గ దగ్గరికి తీసికెళ్ళి వేడినీటిలో ఓ ఘడియ సేపు గుడ్లగూబ రెక్కలు తడిసేలా కూర్చోబెట్టింది. వెచ్చని నీటికి మట్టి ఉండ కరిగిపోయింది. గుడ్లగూబకి నొప్పి తగ్గిపోయింది. హుషారుగా పైకి లేచింది గుడ్లగూబ.

"నా ఫీజు?" వెంట బడింది కోకిలమ్మ.

"ఏం ఫీజు? నేనిస్తానన్నానా?" అంది దబాయింపుగా గుడ్లగూబ.

కోకిలమ్మ కాకి నడిగింది.

కాకి “అదేమిటి గూబ మామా! కోకిలమ్మ నీకు వైద్యం చేసింది కదా! మరి ఆఖర్చు ఇవ్వద్దూ” అంది.

"ఎవరు చెయ్యమన్నారు వైద్యం? నేనిస్తానన్నానా ఫీజు?" పెడసరంగా అంది గుడ్లగూబ. మరుక్షణమే అక్కణ్ణుంచి ఎగిరిపోయింది.

"కాకి! అదంతా నాకు తెలీదు. నువ్వు రోగిని నాదగ్గరికి తెచ్చావు. నీది పూచీ అంటేనే నేను వైద్యం చేసాను. కాబట్టి నువ్వే నా ఫీజు కట్టు” అంది కోకిలమ్మ.

"బాగుంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుంది. పోన్లే పాపం ఏడుస్తోందని సాయం వస్తే నేనేందుకు ఫీజు కట్టాలి? నువ్వు నాకు వైద్యం చేసావా ఏమిటి?" కాకి వాదన పెట్టుకొంది.

కాస్సేపటికి తగవు పెద్దదయ్యింది.

పది పక్షులు చుట్టూ చేరాయి. రాజు దగ్గర ఫిర్యాదు చేయటం మేలని అన్ని పక్షులూ సలహా ఇచ్చాయి.

సరేనని కాకి, కోకిలా, నెమలి రాజు ఆస్ధానానికి వెళ్ళివిన్నవించుకొన్నాయి.

పక్షుల రాజు నెమలి గుడ్లగూబని పిలిపించి విచారణ మొదలుపెట్టింది.

కోకిలమ్మ, కాకి వివరంగా అన్ని విషయాలూ చెప్పాయి. నెమలి గుడ్లగూబని సంజాయిషీ అడిగింది.

"రాజా! నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు. నాపాటికి నేను ఏడుస్తూంటే కాకి తీసుకెళ్ళింది. కోకిలమ్మ కి వైద్యం ఖర్చు చెల్లిస్తాననలేదు. కావాలంటే కోకిలమ్మనే అడగండి” అంది గుడ్లగూబ తన వాదనని బలంగావినిపిస్తూ.

కోకిలమ్మ “నిజమే ప్రభూ! అక్కడికీ నేను రెండు మూడు సార్లు నొక్కి అడిగాను. ఈ గుడ్లగూబ కుయ్యిమంది గాని వైద్యంకు కూలీ ఇస్తానన లేదు. కాకే నాదీ పూచి అంది. అందుకే వైద్యం చేసాను” అంది వినయంగా.

కాకి “అవును ప్రభూ! నొప్పితో ఏడుస్తూంటే నేనే గుడ్లగూబ వైద్యడి దగ్గరికి తీసికెళ్ళాను. కోకిలమ్మ కూలీ అడిగినప్పడు నొప్పితో జవాబు చెప్పలేక పోతుందను కొని నాదీ పూచి అన్నాను. ముందు వైద్యం అందితే గుడ్లగూబ ప్రాణం నిలబడుతుంది గదా అన్న తొందరలో అన్నాను. అంతే గాని ఏరు దాటి తెప్ప తగలేసినట్లు వైద్యం చేయించుకొని గుడ్లగూబ మాట మారుస్తూందనూ కోలేదు” అంది ఏడుపు గొంతుతో.

"అసలు నేను మాటే ఇవ్వలేదు ప్రభూ! ఇక మాట మార్చేందుకేముంది?" న్యాయచుక్క[లా పాయింట్] లేవనెత్తింది గుడ్లగూబ.
రాజ్యాంగ సంక్షోభంలో పడిపోయాడు నెమలి రాజు. పక్షి మేధావులతో చట్టసభా సంఘాన్ని [పార్లమెంటరీ సంఘాన్ని] నియమించాడు. వాళ్ళుకొన్నినెలలు అధ్యయనం చేసి రాజుకి నివేదిక ఇచ్చారు.

రాజు తీర్పు ఇచ్చేరోజు పక్షుల సభ కిక్కిరిసి పోయింది. అందరూ రాజు ఏం తీర్పు చెబుతాడా అని ఆత్రంగా ఎదురుచూస్తూన్నారు.

చివరకి నెమలి రాజు తీర్పు చెప్పాడు.

"కోకిలమ్మ, గుడ్లగూబకే వైద్యం చేసినా, కూలీ గురించి గుడ్లగూబతో ఒప్పందం చేసుకోలేదు. ఆ విషయమై ముందే కోకిలమ్మ పక్కా ఒప్పందం ఉంటే సమస్య లేక పోయేది. అయితే కాకి పూచిని నమ్మింది. ఆ విషయం కాకి కూడా ఒప్పకుంది. కాబట్టి కోకిలమ్మకి కాకి వైద్యపు కూలీ ఇచ్చితీరాలి”.

తీర్పు విని గుడ్లగూబ చప్పట్లు చరిచింది.

కోకిలమ్మ “హమ్మయ్య!” అనుకొంది.

పక్షులన్నీ బిత్తరపోయాయి.

కాకి ఘోల్లుమంది.

"మహాప్రభో! నాదగ్గర డబ్బెక్కడిది? ఏదో సాటి పక్షి బాధ పడుతోంది కదా అని సాయం వెళ్ళినందుకు నాకా శిక్ష” అక్రోశంతో అడిగింది కాకి.

"న్యాయశాస్త్ర పరంగా అంతే” అంది చట్టసభాసంఘం. అంగీకారంగా తలవూపింది నెమలి రాజు.

"పేదవాణ్ణి. కనికరించండి బాబోయ్!” ఏడుపులంకించుకొంది కాకి.

"డబ్బులేక పోతే నీ సేవతో బకాయి చెల్లించు” ఇదే తుది తీర్పన్నట్లు నెమలి రాజు సభాచాలించి ఇంటికెళ్ళి పోయింది.

ఆనాటి నుండి కోకిలమ్మ గుడ్లని కాకి పొదిగి, పిల్లల్ని పెంచసాగింది. ఆవిధంగా సేవ చేసి బకాయి తీర్చుకొంటుంది.

కానీ ఈ అన్యాయం చూసి పక్షులకి ఒళ్ళుమండింది. అన్నీ కలిసి గుడ్లగూబ అన్యాయాన్ని, అనైతికతనీ తిట్టి పోసాయి. అది కన్పిస్తే చాలు అసహ్యంతో మొహం తిప్పుకొన్నాయి. శాపనార్దాలు పెట్టాయి. అవమానించాయి.

దానితో గుడ్లగూబకి పక్షుల ముందుకు రావడానికి మొహం చెల్లక పగలు గూట్లోనో, చెట్టు తొర్రల్లోనో దాక్కుని రాత్రిళ్ళు ఆహారం వెదుక్కోవడం మొదలెట్టింది.

ఆనాటి నుండి ఈనాటి వరకూ కోకిల గుడ్లని పొదిగి పిల్లల్ని చేస్తూ కాకులూ, పగలు నిద్రపోయి రాత్రి సంచరిస్తూ గుడ్లగూబలు బ్రతకసాగాయి.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

హైసర బజ్జా

అనగా అనగా.....

రామాపురం అనే ఊర్లో రాజశేఖరం అనే యువకుడుండే వాడు. ఇతడు కొంచెం అమాయకుడు. దానికి తోడు ఙ్ఞాపకశక్తి పెద్దగా ఉండేది కాదు. అతడికి పెళ్ళై భార్య విశాలాక్షి కాపురానికొచ్చింది. విశాలాక్షి అణకువ గల పిల్ల. పనీ పాటలు తెలిసిన అమ్మాయి.

ఓసారి రాజశేఖరుడు ఏదో పని ఉండి ప్రక్కఊరు రాఘవాపురం వెళ్ళాడు. పని పూర్తయ్యాక ఆ ఊళ్ళోనే ఉన్న మేనత్తని చుట్టపు చూపు చూడబోయాడు. రాక రాక వచ్చిన మేనల్లుణ్ణి అతడి మేనత్త ఎంతో సంతోషంగా ఆహ్వానించి ఆదరించింది. పిండి వంటలతో భోజనం పెట్టింది. భోజనంలో వడ్డించిన బూరెలు రాజశేఖరానికి తెగనచ్చేసాయి. ఒకటికి రెండు అడిగి పెట్టించుకొని తిన్నాడు.

“అత్తా! వీటి పేరేంటి?” మొహమాట పడుతూ అడిగాడు రాజశేఖరుడు. ఆవిడ అభిమానంగా నవ్వుతూ “బూరెలంటారు నాయనా? మరి నాలుగు కట్టివ్వనా?”అంది.

"వద్దులే అత్తా! విశాలాక్షికి అన్నీ వచ్చు. వండించుకు తింటాలే!” అంటూ ఇంటికి బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణం అంటే కాలినడక లేదా ఎద్దుల బళ్ళే శరణ్యం కదా! మనవాడు నడుచుకుంటూ బయలుదేరాడు. ఎక్కడ పిండి వంట పేరు మరిచిపోతానో అనుకుంటూ “బూరెలు, బూరెలు” అని వల్లిస్తూ అడవిదారి వెంట నడవ సాగాడు.

దారిలో చిన్న నీటి పాయ వచ్చింది. ఎగిరి దాని మీదుగా దూకూతూ వూపు కోసం “హైసర బజ్జ” అన్నాడు.

అంతే!

బూరెల పేరు మరిచిపోయి, ’హైసరబజ్జా’ అని జపం చేస్తూ ఇల్లు చేరాడు. ఇంటికి రాగానే భార్యని పిలిచి తన మేనత్త వడ్డించిన పిండివంట రుచిని తెగ వర్ణించి, తనకు వండి పెట్టమన్నాడు.

"వాటినే మంటారని చెప్పారు, మీ మేనత్త గారు?" అనడిగింది విశాలాక్షి.

"హైసరబజ్జ!” టక్కున చెప్పాడు రాజశేఖరం.

అదేం పిండి వంటో విశాలాక్షి కి అర్ధం కాలేదు.

"ఎలా ఉన్నాయి? తియ్యగానా, కారంగానా?" అంది.

"తియ్యగా ఉన్నాయి. గుండ్రంగా అరచేతి మందాన ఉన్నాయి?" అన్నాడు.

“దేనితో చేస్తారో?” మెల్లిగా గొణిగినట్లు అడిగింది.

“వరిపిండి తో నట” కొంచెం కరుగ్గా చెప్పాడు రాజశేఖరం.

ఇంకా ఏమంటే భర్తకి ఎంత కోపం వస్తుందోనని విశాలాక్షి లోపలికెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా భర్తకంత నచ్చిన ఆ
‘హైసర బజ్జ’ ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు.

చివరకి కుడుములై ఉంటాయను కొని, బియ్యప్పిండి, బెల్లం కలిపి, అరచేతి మందాన ఆవిరిలో ఉడికించి గుండ్రని కుడుములు చేసింది. చిన్నపళ్ళెంలో తెచ్చి భర్త ముందు పెట్టింది.

ఎంత నచ్చినా, మేనత్త ఇంట్లో తనివి తీరా బూరెలు తినడానికి మొహమాట పడ్డ రాజశేఖరం, ఇప్పడు భార్య వండి పెడితే తెగ లాగించెయ్యాలని ఆశగా ఎదురుచూస్తూన్నాడు. భార్య తెచ్చిన కుడుములు చూసేసరికి అతనికి కోపం నషాళానికంటింది. [కోరిక లేదా కామం తీరక పోతే క్రోధం పర్యవసానమని భగవద్గీత చెబుతుంది]

భార్య అలుసుగా కనబడి ఒక్క పెట్టున ఆ పిల్ల చెంప ఛెళ్ళుమనిపించాడు. విశాలాక్షి ఘోల్లుమంది.

ఈ గొడవుకి ప్రక్కింటి పిన్నిగారు పరుగెత్తుకొచ్చింది. అప్పటికే విశాలాక్షి చెంప వాచి పోయింది.

అది చూసి ప్రక్కింటి పిన్నిగారు “అయ్యో! అదేమిటి నాయనా, అమ్మాయిని అలా కొట్టావు? పిల్లబుగ్గ బూరెలా పొంగి పోయింది చూడు” అంది మందలింపుగా.

"ఆ అదే పిన్నిగారు, అదే! బూరె బూరె!” అన్ని మరిచి పోయి ఆనందంగా గావుకేక పెట్టాడు రాజశేఖరం.

నొప్పి, అవమానం మరిచిపోయి ఫక్కున నవ్వింది విశాలాక్షి.

విషయం తెలిసాక విరగబడి నవ్వారు ప్రక్కింటి పిన్నిగారు.

రాజశేఖరం భార్యకి క్షమాపణ చెప్పుకొన్నాడు.

బియ్యం నానపోసి దంచి విశాలాక్షి తియ్యటి బూరెలు చేసి పెట్టింది.

ప్రక్కింటి పిన్నిగారితో సహా అందరూ ఆనందంగా ఆరగించారు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes