RSS
Wecome to my Blog, enjoy reading :)

విక్రమాదిత్యుడి పట్టాభిషేకం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 11]

అప్పటి వరకూ, భర్తృహరి వృత్తాంతాన్ని వివరించిన వినోద రంజిత ప్రతిమ "ఓ భోజరాజా! ఇప్పటి వరకూ నేను చెప్పినది, భట్టి విక్రమాదిత్యుల తండ్రి, తోబుట్టువుల గాధ! ఇప్పుడు అసహాయ శూరుడైన విక్రమాదిత్యుడు, అనన్య మేధావి అయిన భట్టిల కథను చెబుతున్నాను. శ్రద్దగా విను" అని, ఇలా చెప్పసాగింది.

విక్రమాదిత్యుడు, తన సోదరుడైన భట్టిని ప్రధానమంత్రిగా నియుక్తుణ్ణి చేసి, రాజ్య పరిపాలన సాగించాడు. పాలనా విధానాలనీ, రాజ్య పరిస్థితులనీ అభివృద్ది చేశారు.

ఒకనాడు.... విక్రమాదిత్యుడు, భట్టిని పిలిచి "ప్రియమైన తమ్ముడా, భట్టీ! నా మనస్సులో ఒక కోరిక ఉన్నది. దానిని సాధించికునేందుకు నాకు నీ సహాయ సహకారాలు కావాలి. నా మదిలో ఒక ప్రణాళిక ఉన్నది. భావోద్రేకాలు లేకుండా దాని గురించి ఆలోచించి, విశ్లేషించి, దాని మంచి చెడుగుల గురించి నాకు చెప్పు. నీవు దానిని వ్యతిరేకించినట్లేయితే, నిర్మొహమాటంగా అదే చెప్పు. అంతేగానీ ‘అన్న అడిగాడు కదా!’ అనో, ‘రాజుగా నొచ్చుకుంటాననో’ భావించకు. క్షుణ్ణంగా ఆలోచించి, నీ ఇష్టాయిష్టాలను చెప్పు.

తండ్రి గారి నుండి మనకు సంక్రమించిన ఈ రాజ్యము చాలా చిన్నది. దీనితో సంతృప్తి పడటం నాకు ఇచ్చ గించకుండా ఉంది. సబబుగానూ తోచటం లేదు. ఇలాగే మనం జీవితాంతమూ గడిపితే, కూపస్థ మండూకాల వలె ఉండగలదు.

జీవితంలో పేరు ప్రఖ్యాతులు గానీ, సంతృప్తీ, సుఖసంపదలు గానీ ఉండవు. ఈ ప్రపంచమున జనియించినందుకు, మనము కొన్ని ఘన కార్యములు సాధించాలి. జనులది గాంచి మనలను ప్రశంసించాలి. సుదీర్ఘకాలము మనము ప్రజలకు గుర్తుండి పోవాలి.

కాబట్టి, మనము జైత్రయాత్ర కేగి, పలు రాజ్యములు జయించి, మన సామ్రాజ్యమును విస్తరించుదాం. తదుపరి మనమో గొప్ప, అందమైన నగరాన్ని, మన రాజధానిగా నిర్మిద్దాం. అందుకు తగిన ప్రదేశమును నీవే పోయి వెదకి రావాలి. అట్టి ప్రదేశము, నలు దిక్కులా పర్వత వలయములతో ఆవరించి ఉండాలి. నదీ పరివాహ ప్రాంతమై ఉండాలి. ప్రకృతి సౌందర్యముతో ఒప్పి ఉండాలి. అలాంటి చోట, సర్వశోభితమైన నగరాన్ని నిర్మిస్తే, అది దేవతల అమరావతి వలె అలరారు తుండాలి.

అటువంటి రాజధానిని నిర్మించి, సువిశాల ధరణీ వలాన్ని, సుదీర్ఘ కాలము సర్వ సమర్దంగా పరిపాలించాలి. తమ్ముడా! భట్టీ! ఇందుకు నీవే మంటావు?" అన్నాడు.

భట్టి చిరునవ్వుతో, "అన్నా! సత్యము చెప్పినావు. నా మనస్సున ఉన్నదే నీ నోట పలికావు. మన శరీరాలు వేరే గానీ, ఆత్మ లొక్కటే యనునట్లు, మన ఆలోచనలు ఒకటే, దృక్పధమూ ఒకటే! నీవు చెప్పినట్లే చేసేదము గాక! ముందుగా మన రాజ్యమును విస్తరిద్దాం. ఆ తర్వాత రాజధానికై స్థల విచారణ, సేకరణ, నిర్మాణమూ చేయవచ్చు" అన్నాడు.

ఒక సుముహుర్తాన, దైవపూజలు నిర్హహించి, భట్టి విక్రమాదిత్యులు, తమ సైన్య సమూహాలతో జైత్రయాత్రకు బయలు దేరారు. అది యుద్దానికి వెళ్తున్నట్లూ ఉంది, పండుగ ఉత్సాహంతో ఊరేగింపు వెళ్తున్నట్లూ ఉంది! సైనిక దళాలతో బాటుగా.... సంగీత వాయిద్యాలూ, యుద్దోత్సాహ పూరిత రాగాలతో మేళ తాళాలూ, సైనికులని రజోగుణంతో ఉర్రూతలూగిస్తున్నాయి. కవులు, గాయకులు, నటులూ, నర్తకులూ... ఒక వైపు యుద్ద భీకర స్థితిలో గడిపే సైన్యాలకు.... మరో వైపు ఉత్సాహ ఉల్లాసాలని అందిస్తున్నారు.

భట్టి విక్రమాదిత్యులు, ఎందరో రాజులని ఓడించి, తమ సామంతులుగా చేసుకుని, కప్పం కట్టించుకున్నారు. ఏడాది కింతని, ఆయా రాజ్యాల రాజులు భట్టి విక్రమాదిత్యులకు కప్పంగా సమర్పించుకోవటమే గాక, ఎన్నో విలువైన కానుకలని సమర్పించి, తమ చక్రవర్తిగా విక్రమాదిత్యుణ్ణి అంగీకరించారు.

ఆ విధంగా తమ సామ్రాజ్యాన్ని సువిశాలంగా విస్తరించి, భారీ సంపదలతో, విలువైన కానుకలతో, అనన్యమైన గెలుపుతో, తిరిగి కన్యాపురాన్ని చేరారు భట్టి విక్రమాదిత్యులు.

తర్వాత, ఒకరోజు.... ముందుగా అనుకున్న ప్రకారం, భట్టి అన్న అనుమతి తీసుకుని, రాజధానీ నగర నిర్మాణానికై తగిన ప్రదేశాన్ని వెదకబోయాడు. వాగులూ వంకలూ, కొండలూ గుట్టలూ... దుర్గమారణ్యాలూ, నదీ తీరాలు.... సవిస్తరంగా అన్వేషించాడు. అలా వెళ్తూ... భట్టి వింధ్య పర్వత ప్రాంతాలను చేరాడు. అతడికొక అందమైన ప్రదేశం కనిపించింది. చుట్టూ కొండలతో ఆవరించి ఉంది. గుణవతి నది ఓ ప్రక్కగా ప్రవహిస్తోంది. కనుల కింపైన అరణ్యం, అడవిలా గాక అందమైన ఉద్యానవనంలా ఉన్నది. భట్టికి అలాంటి చోటును చూసి ఎంతో సంతోషం, సంతృప్తీ కలిగాయి.

అక్కడ తమ రాజధానీ నగరాన్ని నిర్మించవచ్చని నిర్ణయించుకున్నారు. ఈ విషయాలన్నీ తన అన్నయైన విక్రమాదిత్యునికి ఎప్పుడెప్పుడు చెప్పుదునా అనే ఆతృతతో భట్టి తిరుగు ప్రయాణమయ్యాడు. కొద్ది దూరం నడిచినంతనే.... అతనికొక అందమైన సరోవరం, ఆ ప్రక్కనే ఒక పురాతన ఆలయం కనబడింది.

సరోవరంతో స్నానమాచరించి, దేవాలయంలోకి కెళ్లాడు. అది మహంకాళి ఆలయం. భట్టి, దేవీ దర్శనానికి ముందు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణం చేయబోయాడు. అతడి కొక శిలాశాసనం కంటబడింది. దానిపై చెక్కబడిన శాసనం అతడినాకర్షించింది. అందులో

"బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర భేదము లేక, ఏ వ్యక్తియైననూ దీని నాచరింప వచ్చును. సాహసియైన వాడు, ఈ ఆలయములోని పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించవలెను. సరోవరపు ఒడ్దున గల మఱ్ఱి వృక్షము నధిరోహించ వలెను. వటవృక్షము కొమ్మలు, సరోవరము పైకి వ్యాపించి ఉన్నవి. దానికి ఏడు ఉట్లు గలవు. సరోవరపు నీటి మధ్యలో శూలము కలదు. సరిగా దాని పైనే ఉట్లు వ్రేలాడు చున్నవి.

సాహసి ఆ ఏడుట్లును ఏక వ్రేటుగా తెగవేసి, ఉట్లు నీరు జేరక మునుపే, తల్లక్రిందులుగా శూలముపైకి ఉఱక వలెను. ఇవ్విధముగా ఎవరైతే ప్రాణత్యాగము చేయదురో, అట్టి వానికి మహంకాళి దర్శనమిచ్చి వరములనిచ్చును. దేవి కరుణ బొందిన అట్టి సాహసి, ఈ ధరావలయమునకు చక్రవర్తియై, సుదీర్ఘ కాలము రాజ్య పాలనము చేసి, భోగ భాగ్యములనూ, కీర్తి ప్రతిష్ఠలను పొందగలరు" అని వ్రాసి ఉంది.

~~~~~~~~~~~

భర్తృహరి కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 10]

భర్తృహరి కన్యాపురానికి రాజుగా, భట్టి విక్రమాదిత్యులిద్దరూ అన్ని విషయాలనీ పర్యవేక్షిస్తుండగా సుఖంగా ఉన్నాడు. అతడు పెక్కు మంది అమ్మాయిలను వివాహం చేసుకున్నాడు. అతడికి తండ్రికిచ్చిన మాట గుర్తుంది. అందుచేత తన రాణులు ఋతుమతులైన పన్నెండు రోజుల పర్యంతమూ వారి మందిరాలకు వెళ్ళక, ఇతర భార్యలతో గడుపుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఆ విధంగా సంతాన సాఫల్యతని నిరోధించటమన్నది అతడి ఉద్దేశం.

[ఆ రోజులలో సంతాన నిరోధక ఔషధాల వంటివి లేవు కదా!]

ఇలా రోజులు గడుస్తుండగా... ఒకనాడు...

చాంద్యోగ ఋషి అను గొప్ప తపస్సంపన్నుడు ఉండేవాడు. ఆయనని అందరూ సాక్షాత్తు శివ స్వరూపుడని కొనియాడేవారు. ఋష్యోత్తమడైన చాంద్యోగ మహర్షి, ఒకనాడు పదునాలుగు లోకాలను సందర్శించబోయాడు. దేవలోకం నుండి భూలోకానికి వస్తున్నప్పుడు, మార్గవశాన ఆయన ఒకింత సేపు నందనోద్యాన వనంలో విశ్రమించాడు. అక్కడ ఆయన కొక దివ్యఫలం లభించింది.

ఆయన భూలోకంలో ప్రవేశించాక, నేరుగా భర్తృహరి ఆస్థానానికి వచ్చాడు. భర్తృహరి చాంద్యోగ మహర్షిని చూడగానే, ఆ బ్రహ్మతేజస్సు చూసి ఎవరో మహానుభావుడని పోల్చుకున్నాడు. వెంటనే సింహాసనం దిగి వచ్చి, మహర్షికి పాదాభివందనం చేసి, స్వాగత సత్కారాలు చేశాడు.

మహర్షి పాదాలు కడిగి, అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు. తన సింహాసనం మీద మహర్షిని కూర్చుండబెట్టి సేవకుడి మాదిరిగా భక్తి శ్రద్దలతో పరిచర్యలు చేశాడు. వినయ విధేయతలతో కూడిన అతడి ప్రవర్తనకు మహర్షి ఎంతో సంప్రీతుడయ్యాడు.

వాత్సల్యంతో "రాజా! భర్తృహరీ! నేను చాంద్యోగ ఋషిని. నా తపశ్శక్తితో పదునాలుగు లోకాల్లోనూ సంచరించ గలవాడిని. నేను స్వర్గలోకములో ఉండగా, ఇంద్రుని నందనోద్యాన వనంలో నాకీ పండు లభించినది. ఇది దివ్య ఫలము. దీని నారగించిన వారు, నిత్య యవ్వనులై జరామరణ భయము లేక యుందురు. నిత్య యవ్వనుడనై, జరామరణాలు లేక నేను బ్రతికిననూ, నా వలన ఈ జగత్తునకుపయోగమేమిటి? నీవీ ఫలమును భుజించినట్లయితే, ధర్మపాలన చేయగలవు. నీ రాజ్య ప్రజలు సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యలతో ఉండగలరు. ధర్మము పరిరక్షింపబడగలదు. కాబట్టి, రాజువైన నీవు ఈ ఫలమును తినుటకు అర్హుడవు. అందుచేత నీకీ ఫలమును కానుకగా నీయవలెనని వచ్చితిని. ఈ దివ్యఫలమును స్వీకరింపుము. నీకు జయమగు గాక!" అని భర్తృహరిని ఆశీర్వదించాడు.

భర్తృహరి భక్తి శ్రద్దలతో పండుని స్వీకరించి, చాంద్యోగ మహర్షికి కృతజ్ఞతలు తెల్పుకున్నాడు. అతిధి సత్కారాలు పొంది, చాంద్యోగ మహర్షి వీడ్కొలు తీసుకున్నాడు.

రాచకార్యాల అనంతరం, భర్తృహరి తన అంతఃపురానికి వెళ్ళాడు. అతడికి ఎందరో రాణులున్నా, పట్టపు రాణి మోహనాంగి పట్ల భర్తృహరికి అనురాగము మెండు. [మోహనాంగి అనగా మోహము కలిగించు దేహము కలది అని అర్దం.]

ఆమె అతడి మొదటి భార్య. భర్తృహరి మోహనాంగికి దివ్యఫల మహిమను వివరించి చెప్పాడు. ఎంతో ప్రేమగా "ప్రియసఖి! ఈ ఫలమును నేను ఆరగించినట్లయితే, నిత్యయవ్వనుడనై చిరకాలము జీవించగలను. కానీ నా కళ్ళ ముందు నువ్వు ఈ అందమైన రూపము వయో వృద్ద భారమై మరణిస్తావు. అది నేను భరించలేను. నాకు నీపైన అంత ప్రేమ! కాబట్టి ఈ పండును నీవు ఆరగించు" అన్నాడు.

మోహనాంగి వయ్యారంగా పండు నందుకొని ప్రక్కన ఉంచింది. మధురమైన మాటలతో, ప్రేమాస్పద చర్యలతో భర్తకు ఆనందం కలిగించింది. అయితే ఈ మోహనాంగి, భర్త పట్ల నిజమైన ప్రేమ గలది కాదు. ఆమెకు రధ సారధియైన ‘సాహిణి’ అనువానితో రహస్య ప్రేమాయణం ఉన్నది.

మరునాటి ఉదయం మోహనాంగి, రహస్యంగా సాహిణికి ఆ పండునిస్తూ దాని విశిష్టతని తెలియబరిచింది. ఈ రధసారధి ‘సాహిణి’కి రాజ ప్రసాదంలో పరిచారికగా పనిచేయ మరొక మహిళతో రహస్య ప్రేమ సంబంధం ఉంది. ఆ పరిచారిక రాజాంతఃపురాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. పేడ, మట్టితో అంతఃపుర పరిసరాలని అలికి ముగ్గులు పెడుతూ ఉంటుంది.

సాహిణి ఆ పరిచారికని ఆ రోజు సాయంత్రం కలుసుకున్నాడు. కాసేపు ఇష్టాపూర్తిగా గడిపాక, సాహిణి పరిచారికకి పండునిచ్చి, దాని ప్రత్యేకతని చెప్పాడు. ఆ పరిచారిక "సరే! ఇంటికెళ్ళి స్నానం చేశాక, ఈ పండు తింటాను" అనేసి పోయింది.

పరిచారిక పండుని పేడ గంప మీద పెట్టుకొని, గంప నెత్తిన పెట్టుకుని, ఇంటికి బయలు దేరింది. ఆమె రాజవీధిలో నడిచి పోతుండగా... అప్పుడే భర్తృహరి రాజ ప్రాసాదపు ఉప్పరిగ [మేడ] మీద చల్లగాలిని ఆస్వాదిస్తూ, పచార్లు చేస్తూ ఉన్నాడు. రోజు వారీ దినచర్య నుండి ఆ విధంగా విశ్రాంతి పొందడం రాజుకు అలవాటు.

యధాలాపంగా వీధిలోకి చూసిన భర్తృహరికి, పరిచారిక నెత్తి మీది గంపలో పేడ మీద దివ్యఫలం కనిపించింది. మరుక్షణమే దాన్ని అతడు గుర్తు పట్టాడు. అతడికి చాలా ఆశ్చర్యం కలిగింది. తాను పట్టపు రాణి కిచ్చిన దివ్యఫలం ఈ పేడ గంపలోకి ఎలా వచ్చింది?

భర్తృహరి వెంటనే భటులని పిలిచి, ఆ పరిచారికని తన సముఖానికి రప్పించమని అజ్ఞాపించాడు. క్షణాలలో ఆమె రాజు ముందు ప్రవేశ పెట్టబడింది.

భర్తృహరి ఆమెను "చూడమ్మా! ఈ పండు నీకెక్కడిది?" అని అడిగాడు. ఉత్తర క్షణంలో పరిచారిక గడగడ వణుకుతూ "మహారాజా! క్షమించండి! అంతఃపుర రధసారధి సాహిణి నాకీ పండునిచ్చాడు. అతడికిది ఎలా వచ్చిందో నేనెరుగను" అన్నది.

రాజు సాహిణిని తీసుకు రమ్మన్నాడు. భటులదే చేశారు. అక్కడున్న పరిచారికనీ, దివ్యఫలాన్ని చూసే సరికే, సాహిణికి పైప్రాణాలు పైనే పోయాయి. అతడికి ప్రమాదం అర్ధమయ్యింది. "నేను సత్యాన్ని దాచిపెట్టలేను. అలా చేసినట్లయితే నిజం బైటపడ్డాకనైనా రాజు నా తల తీయించగలడు" అనుకున్నాడు.

భయంతో వణుకుతూ రాజు పాదాలపై పడ్డాడు. "మహారాజా! దయ చేసి నన్ను క్షమించండి. మహారాణి మోహనాంగీ దేవి నాకీ పండునిచ్చింది" అన్నాడు.

రథసారధి వాలకాన్ని బట్టి, భర్తృహరికి సత్యమేమిటో అప్పటికే బోధపడింది.

పరిచారిక నుండి పండుని గ్రహించి శుభ్రపరచమని దాసీలకు ఆజ్ఞాపించాడు. రధసారధినీ, పరిచారికనీ మన్నించి పంపించి వేసాడు.

పండు చేత బట్టుకొని రాణీ వాసానికి వెళ్ళాడు. మోహనాంగి చిరునవ్వుతో రాజుకు స్వాగతం పలికింది. ‘వేళ కాని వేళ ఎందుకు వచ్చాడా?’ అని మనస్సులో ఆలోచిస్తూనే ఉంది. ఇంతలో భర్తృహరి "మోహనాంగీ! నిన్నటి దినం నీకు నేనొక దివ్య ఫలాన్ని ఇచ్చాను కదా? అది ఎక్కడ?" అని అడిగాడు.

మోహనాంగి "దాని నప్పుడే ఆరగించాను మహాప్రభూ!" అంది.

భర్తృహరి గుంభనంగా "అయితే మరి ఇది నా చేతికి ఎలా వచ్చింది?" అన్నాడు.

భర్త చేతిలో పండుని చూసి మోహనాంగి దిగ్ర్భాంతికీ, భయానికీ గురైంది. ఏం జరిగి ఉంటుందో, ఏం జరగ బోతోందో ఆమె కర్థమయ్యింది. నిజం దాచి ప్రయోజనం లేదనిపించింది. మరుక్షణం భర్త పాదాల మీద వ్రాలి క్షమించమని ప్రార్దించింది.

భర్తృహరి స్వయంగా పండితుడు. జ్ఞాని. అతడామెపై కోపగించలేదు. అసలతడికి ఎవరి మీదా కోపం రాలేదు. ఇహలోకం మీద మాత్రం విరక్తి కలిగింది. అతడు తన భార్యల నందరినీ పిలిచి, "నేను అరణ్యాలకు పోయి తపస్సు చేసుకోవాలని నిశ్ఛయించుకున్నాను. ఈ క్షణమే మిమ్మల్ని త్యజిస్తున్నాను. మీరు మీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు. మీ నగలను, ఇతర సంపదను తీసుకుని, మీకు ఇష్టమైన వారిని వివాహమాడి, సుఖంగా ఉండండి" అంటూ రాణీ వాసపు స్త్రీలందరికీ అనుమతి నిచ్చాడు.

తన సోదరులైన విక్రమాదిత్యుని రాజు గానూ, భట్టిని మంత్రిగానూ పట్టాభిషిక్తులని చేసి, సన్యాసాశ్రమం స్వీకరించాడు. సోదరులిద్దరినీ మనస్ఫూర్తిగా దీవించి, దివ్యఫలం భుజించి, తపస్సుకై అడవులకు వెళ్ళాడు.

[భారతీయుల సంస్కృత సాహిత్యంలో భర్తృహరి సుభాషితాలు జగత్ర్పసిద్ది పొందాయి. కవితా ఝరితో నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలుగా గల ఈ సుభాషిత త్రిశతి మనోహరంగా ఉంటుంది. ప్రకృతితో సరిపోల్చుతూ, కవితాత్మకంగా, మనో విశ్లేషణని సైతం వెలువరించిన భర్తృహరి శ్లోకాలను, తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి, తీయ తీయగా అనువదించాడు. ఆ సుభాషిత త్రిశతి కర్త ఈ భర్తృహరియే అని ప్రతీతి!

ఇక్కడ మరో అంశం ఆసక్తి కరమైనది.... చాంద్యోగ మహర్షికి దివ్య ఫలం లభించింది. దాన్ని భుజిస్తే జరామరణ భయం లేకుండా నిత్య యవ్వనులై జీవించవచ్చు. అయితే మహర్షి ‘ఆ విధంగా జీవించే తన వలన, ప్రపంచానికి లాభమేమిటి?’ అనుకొని పండు తెచ్చి రాజైన భర్తృహరికి ఇచ్చాడు.

భర్తృహరి దాన్ని, భార్య మీద ప్రేమ కొద్దీ, ఆమెకిచ్చాడు. చివరికి అదే పండు కారణంగా... ఇహలోక బంధాలను రోసి తపస్సుకై అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళేటప్పుడు పండు నారగించాడు. రాజుగా సుఖభోగ జీవితాన్ని ఆనందించేందుకు పండును భుజించడానికి ఇష్టపడని వాడు, అడవికి తపస్సు చేసుకునేందుకు వెళ్తూ భుజించాడు.

ఎందుకంటే - సుదీర్ఘ కాలం తపస్సు చేసైనా ‘సత్యాన్ని తెలుసుకోవాలి, ముక్తిని పొందాలి’ అదీ అతడి ఆకాంక్ష! రాజుగా ఉన్నప్పుడు తన సుఖం కంటే తన వారి సుఖం ఆశించాడు. సన్యసించాక సత్యాన్ని కాంక్షించాడు. అదీ అతడి దృక్పధం!]

భట్టి విక్రమాదిత్యుల జననం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 09]

ఒక శుభముహుర్తమున బ్రాహ్మణ యువతి కళ్యాణి, వైశ్య యువతి కోమలాంగి, క్షత్రియ యువతి చిత్రరేఖ, శూద్ర యువతి అలంకార వల్లిలతో చంద్రవర్ణుడి వివాహం మహా వైభవంగా జరిగింది.

రోజులు హాయిగా గడుస్తున్నాయి. చంద్రవర్ణుడు తన మాట తీరు, నడవడికతో అందరి మనస్సులనూ ఆకట్టుకున్నాడు. అతడికి నలుగురు కుమారులు కలిగాడు. ఒకో భార్యకూ ఒకో పుత్రుడన్న మాట. బ్రాహ్మణ యువతి కళ్యాణి కన్న కుమారుడికి పల్లవర్షి అనీ, క్షత్రియ యువతి చిత్రరేఖ కుమారుడికి విక్రమాదిత్యుడనీ, వైశ్య యువతి కుమారుడికి భట్టి అనీ, శూద్ర యువతి అలంకార వల్లి కుమారుడికి భర్తృహరి అనీ, చంద్రవర్ణుడు నామ కరణం చేశాడు.

పిల్లలందరూ శుక్ల పక్ష చంద్రుడిలా దిన దిన ప్రవర్దమానమౌతున్నారు. వారికి విద్యాభ్యాసం చేయవలసిన వయస్సు రాగానే అక్షరాభ్యాసం చేయించారు. బాలురు చక్కగా విద్యల నభ్యసిస్తున్నారు.

కాలక్రమంలో రాజు శుద్దవర్మ పరలోకగతుడైనాడు. అతడికి చిత్రరేఖ ఒక్కగానొక్క కుమార్తె అయినందున, ఆమె భర్త అయిన చంద్రవర్ణుడు కన్యాపురానికి రాజైనాడు. అతడి రాజ్య పరిపాలన ఆదర్శనీయంగా సాగుతోంది. ధర్మబద్దంగా రాజ్య పరిపాలన సాగిస్తున్నాడు. ప్రజలంతా ఎంతో ఆనందంగా కాలం గడుపుతున్నారు. వాతావరణమూ అనుకూలంగా ఉండి పంటలు బాగా పండుతున్నాయి. అంతటా ప్రశాంతమూ, సంతోషమే!

చంద్రవర్ణుడు ఒక ప్రక్క రాజ్యభారం వహిస్తూనే, మరో ప్రక్క తన తనయుల విద్యాబుద్దుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు. తానే స్వయంగా విద్యలు నేర్పుకున్నాడు.

[ఎవరైతే తల్లిదండ్రులే గురువులుగా, తల్లిదండ్రుల నుండి విద్యల నభ్యసించారో, వారు జీవితంలో మరింత సఫలీ కృతులయ్యారు, చరిత్రలో ప్రసిద్దులయ్యారు. భట్టి విక్రమాదిత్యులు తమ తండ్రి చంద్రవర్ణుని కంటే కూడా మరింత ప్రసిద్దులు. చంద్రవర్ణుడు, శాపవశాత్తు బ్రహ్మరాక్షసుడైన దివ్య పురుషుడి వద్ద విద్యలనభ్యసించినా, స్వయంగా తండ్రి వద్దే విద్యలనభ్యసించిన భట్టి విక్రమాదిత్యులు మరింత ఘనకార్యాలు సాధించారు.

తల్లిదండ్రులే గురువులైతే, పిల్లలు మరింత శోభిల్లుతారు. అంటే నేనిక్కడ గురువులను తక్కువ చేసి మాట్లాడటం లేదు. గురువులతో పాటు, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు గురుత్వం వహిస్తే, వారు మరింత వృద్దిలోకి వస్తారని చెప్పటమే నా ఉద్దేశం. మన భారతదేశ చరిత్రలో కూడా ఇందుకు ఎందరో మహానుభావులు ఉదాహరణలై నిలిచారు. ఛత్రపతి శివాజీ, తల్లి జిజియా భాయి నుండి స్ఫూర్తి పొందిన వాడే!

ఇప్పటికీ, ఎందరో కవి గాయక పండితులు, తమ అభిరుచి తల్లిదండ్రుల నుండీ సంక్రమించిందనీ, తొలి పాఠాలు తల్లి లేదా తండ్రి గారి నుండి నేర్చామనీ చెప్పటం మనం చూస్తూనే ఉన్నాం.]

మరికొన్ని వసంతాలు గడిచాయి. చంద్రవర్ణుడి నలుగురు పుత్రులూ పెరిగి పెద్దయ్యారు, చంద్రవర్ణుడు వృద్దుడైనాడు. వార్ధక్య సహజంగా చంద్రవర్ణుడికి మరణకాలం సమీపించింది. మరణశయ్యపై ఉన్న చంద్రవర్ణుడు, తన చుట్టూ నిలిచి ఉన్న పుత్రులను చూసాడు. అతడి దృష్టి భర్తృహరి మీద నిలిచింది. తదేకంగా అతడి వైపు చూస్తూ కన్నుల నీరు నింపుకున్నాడు.

చుట్టూ ఉన్న అందరూ అది గమనించారు. ‘బహుశః చంద్రవర్ణుడికి అలంకార వల్లిపైన, ఆమె పుత్రుడైన భర్తృహరి పైన మమకారం మెండుగా ఉంది కాబోలు!’ అనుకున్నారు.

భర్తృహరి తండ్రివైపే చూస్తున్నాడు. తండ్రి మనస్సులో మెదలుతున్న ఆలోచనలు భర్తృహరికి స్పురించాయి. అతడు మెల్లిగా తండ్రిని సమీపించి "తండ్రీ! మీరు దిగులు చెందకండి. సద్భాహ్మణ సంజాతులైన మీరు, శూద్ర వనిత యందు నన్ను కన్నందున, ఉత్తమగతులు పొందలేరేమో నని దుఃఖిస్తున్నట్లుగా ఉన్నారు. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. మీకు ఉత్తమ లోకాలు ప్రాప్తించుటకై నేను వివాహం చేసుకోను. అధవా వివాహం చేసుకున్నా, సంతానాన్ని పొందను. మీరు నిశ్చింతగా ఉండండి. మీకు ముక్తి కలుగుతుంది" అన్నాడు.

[వర్ణాశ్రమ నమ్మకాలు అప్పటి కాలంలో ఉండేవి. జానపద కథల్లోని అలాంటి ఘట్టాలను పట్టుకొని తింగరి హేతువాదులూ, తిక్క ఆధునిక వాదులూ వాదనలు చేస్తే.... వాళ్ళకి దండేసి దండం పెట్టడం తప్పితే ఏమీ చెప్పలేం!]

చంద్రవర్ణుడది విని ప్రశాంత చిత్తుడయ్యాడు. మిగిలిన పుత్రులని తన శయ్యకు దగ్గరగా రమ్మని పిలిచాడు. నెమ్మదైన కంఠంతో "నాయనలారా! నేను మీ తల్లులను వివాహమాడటానికీ, ఈ రాజ్యానికి రాజుని కావటానికీ, భర్తృహరి తల్లియైన అలంకార వల్లి యే కారణం. ఆమె నా ప్రాణదాత! కాబట్టి నాదో కోరిక! నా తర్వాత భర్తృహరి రాజు కావాలి. మీరంతా యువరాజులై అతణ్ణి సేవిస్తూ సహకరించండి" అన్నాడు.

భట్టి విక్రమాదిత్యులు వినయంగా తండ్రి ఆజ్ఞను స్వీకరించారు. పల్లవర్షి ఓ అడుగు ముందుకు వేసి "తండ్రీ! నన్ను మన్నించండి. నాకీ రాజ్య సంపద మీద గానీ, ఇహలోక సౌఖ్యం గురించి గానీ ఆసక్తి లేదు. నేను తపమాచరించి తరించ గోరుచున్నాను. కాబట్టి సన్యాసాశ్రమ వృత్తి స్వీకరించి, అడవులకు బోయి తపస్సు చేసుకో దలిచాను. దయయుంచి నాకు అనుమతి ఇవ్వండి" అని ప్రార్దించాడు.

చంద్రవర్ణుడికి పల్లవర్షి పరిణితి, భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తి తెలుసు. అందుచేత అతణ్ణి అర్ధం చేసుకున్న వాడై, కుమారుణ్ణి దీవించి, అడవులకు పోయి తపస్సు చేసుకునేందుకు అనుమతించాడు.

ఆపైన చంద్రవర్ణుడు మంత్రి పురోహితులను దీవించి, భర్తృహరిని రాజు గానూ, భట్టి విక్రమాదిత్యులను యువరాజులు గానూ పట్టాభిషేకం చేసేటందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు.

పట్టాభిషేక మహోత్సవం అతి వైభవంగా నిర్వహించబడింది. చంద్రవర్ణుడు సంతృప్తిగా, మనశ్శాంతిగా అనుభూతించాడు. ఒకనాటి ఉత్తమ ఘడియలలో అతడు దివంగతుడయ్యాడు.

మనల్ని మనం కాదని నమ్మించగలిగే మాటకారి వాడు!

అనగా అనగా…..

రామాపురం అనే ఊరిలో రంగయ్య అనే సామాన్య రైతు ఉండేవాడు. ఇతడు కొంచెం అమాయకుడు. ఇతడికి ఓ పాడి ఆవు ఉండేది. కొన్నేళ్ళకి అది కాస్తా ఒట్టిపోయింది. రంగయ్య దాన్ని సంతలో అమ్మేసి మరో ఆవును కొనుక్కోవాలనుకున్నాడు. సంతకు తోలుకెళ్ళి ఆవును అమ్మజూపాడు. సంతలో ఓ కొనుగోలుదారుడు “ఏమయ్యా! నీ ఆవు పాలిస్తుందా?" అంటే “లేదు బాబయ్యా! ఒట్టిపోయింది” అని చెప్పాడు.

మరో కొనుగోలుదారుడు “ఏమన్న! నీ ఆవు గాట్లో చక్కగా మేస్తుందా, గడ్డంతా చిందర వందరగా తొక్కేస్తుందా?" అని అడిగితే “నా ఆవు గాట్లోనే పేడవేసేస్తుంది బాబయ్యా” అని చెప్పాడు.

మరొకడు “కొంపదీసి నీ ఆవుగాని పొడుస్తుందా?" అంటే

"అవును బాబయ్యా! ముందుకొస్తే కొమ్మువిసురుతుంది. వెనక్కొస్తే కాల్తో తంతుంది” అన్నాడు అమాయకంగా, అన్నీ నిజాలే చెబుతూ!

దాంతో అతడి ఆవుని కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. క్రమంగా అతడి చుట్టూ గుంపు పల్చబడింది. చివరకు బిక్కుబిక్కుమంటూ రంగయ్య, ఆవు ప్రక్కనే నిలబడి దిక్కులు చూడసాగాడు. సాయంత్రమయ్యింది. పొద్దున్నుంచీ ఈ తతంగమంతా గమనిస్తున్న మాటకారి వాడొకడు రంగయ్యని సమీపించి “ఏమయ్యా! ఆవుని అమ్ముకోవాలంటే ఇలా కాదు. నేను అమ్మిపెడతాను. ప్రతిఫలంగా నాకు కొంత సొమ్ము ముట్టచెప్పాలి” అన్నాడు. రంగయ్య అందుకు ఒప్పుకున్నాడు.

వెంటనే మాటకారి వాడు ఆ ఆవుని సంతలో మరోచోటికి తీసుకుని వెళ్ళి, గొంతు సవరించుకుంటూ “రండి బాబయ్యా! రండి! ఆలస్యంచేస్తే మంచి అవకాశం పోతుంది. గంగిగోవు బాబూ! కుండేడు పాలిస్తుంది. చక్కగా గాట్లో మేస్తుంది. పసిబిడ్దలాంటి ఆవు. కుమ్మటమే ఎరగని మాతల్లి. అవసరం వచ్చి అమ్ముతున్నాను గానీ లేకుంటే అమ్మకపోదును. రండి బాబూ రండి” అంటూ కేకలు పెట్టాడు. దాంతో జనం బాగా మూగారు. మాటకారి వాడు పదేపదే ఇదే చెప్పసాగాడు. దాంతో కొనుగోలుదారులు పోటీ పడి బేరమాడటం మొదలెట్టారు.

ఇదంతా చూసిన రంగయ్య, "ఛస్! ఇంత మంచి ఆవుని నేనేందుకు అమ్ముతాను? అమ్మను గాక అమ్మను!” అంటూ తన ఆవుని, తన ఇంటికి తోలుకెళ్ళిపోయాడు.

మాటకారి వాడు మొదట నివ్వెరపోయాడు. తర్వాత తన చాతుర్యాన్ని చూసుకుని తానే మురిసిపోయాడు. బహుశః కాలక్రమంలో, ఇదెంతో లాభసాటిగా ఉండటంతో, తానే ఇక నుంచి సంతలో సరుకమ్మి పెట్టే వాణిజ్య ప్రకటనదారు అవతారం ఎత్తి ఉంటాడు. కాలక్రమంలో ఆ మాటకారి వాడి లాంటి వాళ్ళే మీడియాగా రూపాంతరం చెంది ఉంటారు.

ఈ కథలో అమాయకుడిలాంటివారం మనం, మాటకారి వంటిది మీడియా.

ఆ విధంగా మనల్ని, మనం కాదని, మనచేతే నమ్మించగలదు, మీడియా!

చంద్రవర్ణుడి వివాహం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 08]

తొమ్మిదో రోజున చంద్రవర్ణుడికి స్పృహ వచ్చింది. ఆ సమయానికి అలంకార వల్లి ఆ గదిలో లేదు. చంద్రవర్ణుడు చుట్టూ పరికించి చూశాడు. గది అలంకారాన్ని, పరిసరాలనీ చూసే సరికి, అతడికి ఆ ఇల్లు బ్రాహ్మణులది కాదనీ, వేశ్యాంగన ఇల్లనీ అర్ధమైంది. తన ఆకుల మూటను తీసుకుని, ఆ ఇంటి నుండి బయట పడాలని, చప్పుడు చెయ్యకుండా బయలు దేరాడు.

ఇంతలో అలంకార వల్లి చూడనే చూసింది. చప్పున అతడి చేయి పట్టుకుని ఆపింది. "ఓ యీ బ్రాహ్మణ యువకుడా? నేను నీకు పరిచర్యలు చేశాను. నీకు స్పృహ లేని ఇన్నిరోజులూ కంటికి రెప్పవలె నిన్ను కాపాడాను. ఈ ఎనిమిది రోజులుగా నేనే స్వయంగా నిద్రాహారాలు మాని, నీకు సేవలు చేశాను. స్పృహ లేని నీకు వైద్యం చేయించాను. నీ ప్రాణాలు కాపాడాను. ఆ విధంగా చెప్పాలంటే నేను నీ ప్రాణదాతను. అటువంటిది, కనీసం ఒక్కమాటయినా మాట్లాడకుండా, అధమపక్షం కృతజ్ఞత అయినా చెప్పకుండా నా ఇల్లు విడిచి పోతున్నావు. ఇదేమైనా న్యాయంగా ఉందా? నిన్ను నేను ఎట్టిపరిస్థితులలోనూ వెళ్ళ నివ్వను" అంటూ అడ్డం పడింది.

చంద్రవర్ణుడు బిత్తరపోయాడు. ఉత్తర క్షణం తేరుకుని "నర్తకీమణీ! నన్ను కాపాడినందుకు ఎంతగానో కృతజ్ఞుణ్ణి. కానీ నన్ను వెళ్ళనీయక ఎందుకు అభ్యంతర పెడుతున్నావు?" అన్నాడు.

ఒక్కక్షణం అలంకార వల్లి మౌనంగా తలవంచుకుంది. వెంటనే "ఓ బ్రాహ్మణ సుందరుడా! నేను నీయందు ప్రేమ కలిగి ఉన్నాను. నిన్ను పెండ్లియాడ గోరుతున్నాను. నీ ప్రాణములను కాపాడిన నా పైన కోపగించక, నా కోరికని మన్నింపుము" అన్నది.

చంద్రవర్ణుడిది విని హతాశుడైనాడు. అలంకార వల్లి అతడి ఎదుట నిలబడి ఆర్తితో చూస్తూ ఉన్నది. నిజానికి ఆమె అందగత్తె! మెరుపు తీగకు మాటలోచ్చినట్లు ఎదురుగా నిలబడి ఉంది.

చంద్రవర్ణుడు మార్దవంగా "నర్తకీమణి! నేను బ్రాహ్మణుడను. మన వివాహము పొసగదు. దయ యుంచి నన్ను వెళ్ళనివ్వు" అన్నాడు.

అలంకార వల్లి అందుకు అంగీకరించలేదు. క్రమంగా వారి మధ్య వాదులాట రేగింది. చంద్రవర్ణుడు ఆమెని దాటుకుని వీధిలోకి వచ్చాడు. అలంకార వల్లి విడిచి పెట్టలేదు. వీధిలో జరిగే ఈ జగడాన్ని చూడటానికి చుట్టూ జనం మూగారు.

చారుల వలన ఈ వార్త రాజుకు చేరింది. కన్యాపురానికి రాజు శుద్దవర్మ[అతడి పేరుకు అర్దం శుద్దుడు అని, అంటే Mr.Clean అన్నమాట.] అతడు రాజ భటులని పిలిచి వాళ్ళని సభకి తీసుకురమ్మన్నాడు. భటులు అలంకార వల్లినీ, చంద్రవర్ణుడినీ రాజసభకు తీసుకువెళ్ళారు.

రాజు చంద్రవర్ణుని చూసినంతనే ముచ్చట పడ్డాడు. ‘ఏమి ముఖవర్చస్సు! ఈతడు బాల బృహస్పతి వలె నున్నాడు’ అనుకున్నాడు.

పైకి "ఎందుకు మీరు వీధినబడి అనాగరికుల వలె జగడము లాడు చున్నారు?" అని ప్రశ్నించాడు.

చంద్రవర్ణుడు "మహారాజా! క్షమించాలి. నేను బ్రాహ్మణుడను. కొన్ని దినముల క్రిందట నేను, ఈ యువతి ఇంటి ఆరుగుపైన నిద్రించితిని. అది బ్రాహ్మణుల ఇల్లై ఉండవచ్చని తలచితిని. అది ఈ వెలయాలి ఇల్లని తెలియనైతిని. నా అలసట కారణంగా నేనే విషయము ఎరుగనైతిని.

ఇప్పుడీమె, నాకు స్పృహ లేనన్ని దినములూ నాకు వైద్యము చేయించినదనీ, నాకు స్వయముగా సపర్యలు చేసినదనీ, నా ప్రాణములు నిలిపిదనీ చెప్పుచున్నది. ప్రత్యుపకారముగా ఆమెను వివాహ మాడవలెనని నన్ను బలవంత పెట్టుచున్నది" అన్నాడు.

అతడి దంతా చెబుతున్నంత సేపూ, రాజు శుద్దవర్మ అతడి వైపే చూస్తున్నాడు. మనస్సులో ‘ఇతడి ముఖవర్చసు చూడగా బ్రహ్మజ్ఞానిలా కనబడుతున్నాడు. అందం, విద్వత్తూ ఇతడిలో పోటీ పడుతున్నవి. సుగుణ శీలియైన ఇతడికి నా కుమార్తె చిత్రరేఖ నిచ్చి వివాహము చేసిన బాగుండును కదా?’ అని ఆలోచించినాడు.

[చిత్ర రేఖ అంటే చిత్రమైన రేఖ అని అర్ధం. ]

అతడిలా ఆలోచిస్తున్నప్పుడే, సభలోని మంత్రి, రాజ పురోహితుడూ కూడా సరిగ్గా ఇలాగే ఆలోచించారు. రాజు శుద్దవర్మ సభలోని శాస్త్రపురోహితులని, పెద్దలని... అలంకార వల్లి, చంద్రవర్ణుల తగువుని తీర్చమని అడిగాడు.

పండితులు "మహారాజా! అలంకార వల్లి వాదనలోనూ న్యాయముంది. ఆమె సమయానికి ఆదుకోకపోయి ఉంటే, చంద్రవర్ణుడు జీవించి ఉండేవాడు కాదు. చంద్రవర్ణుడి వాదనలోనూ న్యాయమున్నది. బ్రాహ్మణుడైన అతడు, వేశ్యాంగన అయిన అలంకార వల్లిని నిరాకరిస్తున్నాడు. అలంకార వల్లి పుట్టుకే, చంద్రవర్ణుడి అభ్యంతరమైతే ఇందుకొక తరుణోపాయముంది.

ఒక బ్రాహ్మణుడు ఇతర వర్గమునకు చెందిన స్త్రీని వివాహమాడదలిచిన ఒక మార్గమున్నది. అతడు అదే ముహుర్తమున ఒక బ్రాహ్మణ యువతినీ, క్షత్రియ యువతినీ, వైశ్య యువతినీ, శూద్ర యువతినీ వివాహ మాడవలెను.

అలాగ్గాక, బ్రాహ్మణుడు ఒక్క యువతనే వివాహమాడదలిచిన, ఆ యువతి బ్రాహ్మణ యువతియే అయి ఉండవలెను" అని తేల్చి చెప్పారు.

రాజు శుద్దవర్మ "చంద్రవర్ణుని చూడ నాకు ముచ్చట కలిగినది. అతడి అందచందాలకు, గుణశీలాలకూ మెచ్చితిని. అందుచేత నా ఒక్కగానొక్క పుత్రికయైన చిత్రరేఖను, ఇతడికిచ్చి వివాహము చేయ సంకల్పించితిని" అన్నాడు, సాభిప్రాయంగా చంద్రవర్ణుడి వైపు చూస్తూ!

వెంటనే మంత్రి సోమశేఖరుడు లేచి "మహారాజా! నేనూ అట్టి ఆలోచననే చేసి ఉన్నాను. నేను వైశ్యుడను. నా పుత్రిక కోమాలాంగిని ఇతడి కిచ్చి వివాహము చేసేదను" అన్నాడు. [కోమలాంగి అంటే సుకుమారమైన దేహము కలది అని అర్ధం.]

అంతలో రాజపురోహితుడు లేచి "ప్రభూ! నేనూ నా కుమార్తె కళ్యాణిని ఇతడి కిచ్చి వివాహము చేయగలవాడను" అన్నాడు.

చంద్రవర్ణుడిందుకు సమ్మతించాడు. వధువుల సమ్మతి బడసి అందరూ సంతోషించారు.

ఒక శుభముహుర్తమున బ్రాహ్మణ యువతి కళ్యాణి, వైశ్య యువతి కోమలాంగి, క్షత్రియ యువతి చిత్రరేఖ, శూద్ర యువతి అలంకార వల్లిలతో చంద్రవర్ణుడి వివాహం మహా వైభవంగా జరిగింది.
~~~~~

కొత్త రూకో-----కొక్కొరొకో

నా బ్లాగు చుట్టాలందరి ఇళ్ళలోని చిన్నారులందరికీ అమ్మఒడి అందిస్తున్న చిన్ని కానుక. మీ పాపలకి ఈ కథ చెప్పి ఆనందింపజేస్తారని ఆశిస్తాను.

అనగా అనగా……..

ఓ నెమలి, ఓ మేక, ఓ కోడిపుంజు ఎంతో స్నేహంగా ఉండేవి. కలిసి తిరిగేవి. కలిసిమేసేవి. కలిసి కాలం గడిపేవి.

ఇలా ఉండగా, ఓ రోజు నెమలికి ఒక రూక [రూపాయి నాణేం] దొరికింది. నెమలి దాన్ని దాచమని మేకకు ఇచ్చింది. మేక దాన్ని గడ్డిలో దాచి పెట్టింది. కొన్నిరోజులు గడిచాయి. ఓరోజు నెమలికి తన రూకని చూసుకోవాలన్పించింది. మేకని తన రూకని తెచ్చి ఇమ్మంది. మేక ఆ రూకని గడ్డిలో ఎక్కడ దాచిందో మరచిపోయింది. దాంతో పోయి, తోచిన చోట వెదికింది. ఎక్కడ వెదికినా రూక దొరకందే! దాంతో, పాపం మేక, విచారంగా తిరిగి వచ్చి నెమలితో రూక దొరకలేదని చెప్పింది.

నెమలికి చాలా బాధనిపించింది. తన రూకని మేక పారేసినందుకో లేక అదీ దాచేసి తనకి దొరకలేదంటూ అబద్ధం చెప్పి తనని మోసగిస్తోందనుకుందో గానీ, దిగులుతో నెమలి స్నేహితుల్ని వదిలేసి అడవి వైపు మళ్ళింది. పాపం మేక, కోడిపుంజు నెమలిని తమని విడిచిపోవద్దని ఎంతో బతిమిలాడాయి. అయినా నెమలి అడవిలోకి వెళ్ళిపోయింది. ఎలాగైనా ఆ రూకని వెదకి మళ్ళీ తమ నేస్తాన్ని తిరిగి తమ దగ్గరికి రప్పించుకోవాలని మేక, కోడిపుంజు నిర్ణయించుకున్నాయి. అప్పటినుండీ మేక గడ్డిలో వెదుకుతూనే ఉంది. మధ్య మధ్యలో తలెత్తి “లేఁ “ అంటూనే ఉంది. జాగ్రత్తగా గమనించి చూడండి. మేక ‘మేఁ’ అన్న అరుపు, జాగ్రత్తగా వింటే “లేఁ” అన్నట్లే ఉంటుంది. రూక దొరకలేదన్న బాధతో స్నేహితులకి “లేఁ” [దొరకలేదని] చెబుతూ ఉంటుందన్న మాట.

ఇంతలో ఓ రోజు కోడిపుంజుకు ఓ కొత్తరూక దొరికింది. అది పల్లెలో ఇల్లెక్కి “కొత్తరూకో. కొత్తరూకో!” అని అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విని అడవిలోకి వెళ్ళిపోయిన తమ నేస్తం నెమలి తిరిగి వస్తుందని కోడిపుంజు ఆశ. అందురూ కోడిపుంజు ‘కొక్కోరొకో’ అని అరుస్తుందనుకుంటారు గానీ, నిజానికి అది “కొత్త రూకో” అని అరుస్తుంది.

అయితే కోడిపుంజు ఎంతగా “కొత్త రూకో” అని అరిచినా నెమలికి అది వినబడలేదు. అడవిలో నుండి బయటకు రానేలేదు. బాధతో అది “రూక్! రూక్!” అని అరుస్తూనే ఉంది.

ఆ విధంగా నెమలి “రూక్!” అని

మేక “మేఁ” అని

కోడిపుంజు “కొత్త రూకో!” అని ఇప్పటికీ అరుస్తునే ఉన్నాయి.

ఇదీ కథ!

ఈ కథ విని చిన్నారులంతా తమ స్నేహితులు తమకేదైనా పని చెప్పినప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూదదని, తర్వాత ఎంత బాధపడినా ఒకసారి చెడిన స్నేహం తిరిగి అతకుపడదనీ! అంచేత జాగ్రత్తగా ఉండాలని అర్ధం చేసుకుంటారుగా.

అలంకార వల్లి – చంద్రవర్ణుడు [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 07]

అప్పుడు సంభవించిందొక అద్భుతం!

ఆకాశం నుండి దేవరధం రెక్కలల్లార్చుతూ దిగి వచ్చింది. బ్రహ్మ రాక్షసుడు దివ్య పురుషుడిగా మారిపోయాడు. చంద్రవర్ణుడు సంభ్రమంగా చూస్తూన్నాడు.

ఆ దివ్యపురుషుడు చంద్రవర్ణుడు వైపు తిరిగి "ప్రియ శిష్యా, చంద్రవర్ణా! నేనొక యక్షుడను. సకల శాస్త్రాలూ నేర్చిన వాణ్ణి. అయితే దురదృష్టవ శాత్తూ ఆ పాండిత్యం నాలో అహంకారాన్ని పెంచింది. విద్యా గర్వాంధుడినై మహర్షులని అగౌరవించాను. కోపోద్రిక్తులై వారు, నన్ను ‘రాక్షసుడవు కమ్మని’ శపించారు. క్షమించమని వారి పాదాల బడి ప్రార్దించగా, దయతో వాళ్ళు నాకు శాపవిమోచనం అనుగ్రహించారు. యోగ్యుడైన శిష్యుడికి విద్యాదానం చెయ్యవలసిందిగా చెప్పారు. ఆనాటి నుండి, ఈ రావి చెట్టుపై నివసిస్తూ, తగిన శిష్యుని కోసం ఎదురు చూస్తూ, తపమాచరిస్తూ కాలం నడుపుతున్నాను.

నా భాగ్యమా అన్నట్లు, దైవమే అనుగ్రహించి నిన్ను నా వద్దకు పంపించాడు. జ్ఞానతృష్ణతో నీవు నన్ను వెదుక్కుంటూ వచ్చావు. వినయ విధేయలతో విద్యార్జన చేశావు. నీ కారణంగా ఇన్నాళ్ళకు శాప విముక్తుడ నైనాను.

నాయనా చంద్రవర్ణా! నీకివే నా ఆశీస్సులు. జీవితంలో శాంతి సంతోషాలు, సకల భాగ్యాలూ పొందెదవు గాక! నేనిదే నా లోకమునకు బోవుచున్నాను. దేవుడు నిన్ను అనుగ్రహించు గాక!" అంటూ, అప్పటి వరకూ బ్రహ్మరాక్షసుడులా ఉన్న యక్షుడు, చంద్రవర్ణుడి తలపై చేయి ఉంచి దీవించాడు.

చంద్రవర్ణుడు గురువుకి వినయంగా నమస్కరించి, సంతోషమూ, ఎడబాటు దుఃఖమూ ముప్పిరిగొనగా వీడ్కొలు పలికాడు. దివ్యవిమానం ఆకసాన అంతర్హితమైంది.

చంద్రవర్ణుడు అప్పటి వరకూ గురువు చెప్పిన శ్లోకాలు వ్రాసి ఉన్న రావి ఆకులని మూటగట్టుకున్నాడు. ఇక తిరుగుప్రయాణమైనాడు. మార్గవశాన అతడు కన్యాపురం అనే పట్టణాన్ని చేరాడు. అప్పటికే అతడు బాగా అలిసిపోయాడు. యక్షుడు చెప్పిన మంత్ర ప్రభావం పూర్తి కావస్తుండటంతో, అతణ్ణి ఆకలి, దప్పిక, నిద్ర ముప్పిరిగొన్నాయి.

అప్పటికి అతడొక ధనికుల ఇంటి ముందరికి చేరాడు. ఆ ఇంటి గుమ్మం అందమైన దీపాలతో, తోరణాలతో అలంకరించి ఉంది. ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు పరచి ఉన్నాయి. అదెవరో సదాచార సంపన్నులైన బ్రాహ్మణుల ఇల్లయి ఉంటుందనుకున్నాడు చంద్రవర్ణుడు.

ఆ ఇంటి అరుగుపై జారగిలబడ్డాడు. అప్పటికే అతణ్ణి ఆక్రమించిన నిస్సత్తువ కారణంగా క్షణాలలో స్పృహ కోల్ఫోయాడు.

అతడనుకున్నట్లు అది బ్రాహ్మణుల ఇల్లు కాదు. [ఆ రోజులలో భారత దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఆచరణలో ఉండేది. సమాజంలో నాలుగే వర్గాలుండేవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర!] ఆ భవంతి రాజ నర్తకియైన ఒక వేశ్యది.

ఆమె పేరు అలంకార వల్లి. [ఆమె పేరుకు అర్ధం అలంకారం కొరకు ఉపయోగించు దండ లేదా లత అని!] అలంకార వల్లి, అందమైన లత వంటి శరీర సౌందర్యం కలది. ఒంపు సొంపులతో కూడిన ఎంత అందమైన దేహము కలదో, అంతకంటే సౌకుమార్యమైన మనస్సు కలది. నర్తకిగా దైవభక్తీ, ధర్మనిరతీ గలది. తన వృత్తి ధర్మం పాటించడంలో నీతి నియమాలు పాటించునట్టిది.

అప్పటికి రాత్రియైనది. దేవాలయములో నాట్యం వంటి పనులన్నీ ముగించుకొని, అలంకార వల్లి ఇల్లు చేరవచ్చింది. చీకటి మాటున ఆమె తన ఇంటి అరుగుపై ఎవరో ఒరిగి ఉండటాన్ని గమనించింది.

"ఎవరూ?" అంటూ తట్టి లేప ప్రయత్నించింది గానీ, అరుగుపై బడి ఉన్న వ్యక్తి పలక లేదు, ఉలకలేదు. అంతట ఆమె ఇంటిలోనికి బోయి పెద్ద దీపము తెచ్చి చూసినది.

చూడగా ఏమున్నది?

ఇంటి అరుగుపై ఆదమరిచి పడి ఉన్న అందమైన యువకుడు[చంద్రవర్ణుడు]. రావి ఆకుల మూట అతడి తలక్రింద ఉన్నది. అలంకార వల్లి దాస దాసీ జనాన్ని పిలిచి, అతణ్ణి లోపలికి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. చంద్రబింబము వంటి ముఖము, చంద్రకాంతి వంటి దేహకాంతి గల చంద్రవర్ణుని చూసి ఆమె ఆశ్చర్యాన్ని పొందింది. అతడిపై ఆమెకు మోహము, ఆకర్షణా కలిగాయి.

అతడి వివరాల కోసమై మూట విప్పి చూసింది. రావి ఆకులపై సంస్కృత శ్లోకాలున్నాయి. అతడెవ్వరో గొప్ప పండితుడై ఉంటాడని తోచింది. ఆమెకతడిపై ఎంతో ప్రేమ కలిగింది.

వెంటనే అలంకార వల్లి వైద్యులని రప్పించింది. వాళ్ళతణ్ణి క్షుణ్ణంగా పరీక్షించి "ఓ అలంకార వల్లీ! ఈ యువకుడు ఆరునెలలు నుండి నిద్రాహారాలు లేక యున్నాడు. కాబట్టే ఈ విధముగా స్పృహ కోల్పోయినాడు. ఇతడి నిట్లే వదలి వైచిన మరణించట తధ్యం" అన్నారు.

ఇది విని అలంకార వల్లి మిగుల దిగులు చెందింది. ఆందోళన నిండిన హృదయంతో "అయ్యా! మీరు గొప్ప వైద్యులు! శాస్త్రములు తెలిసిన వారు. ఇతడి నెట్లు కాపాడ గలము? దయ చేసి చెప్పండి" అన్నది.

వైద్యులు "ప్రతి దినమునా నీవు ఒక పడి బియ్యమును వండి, ఒక పడి ఆవు నేతితో కలిపి, మెత్తని లేహ్యము వలె చేయుము. ఆ లేహ్యముతో ఈతని దేహమును తల నుండి కాలి వేళ్ళ వరకూ మర్ధనా చేయవలయును. దినమున కిట్లు రెండు మారులు చేయవలెను. నెయ్యి, అన్నముల సారము, సూక్ష్మమైన ఇతడి దేహ రంధ్రములు ద్వారా నరములకు చేరి, ఇతడికి శక్తి రాగలదు. ఆ విధంగా అతడి ప్రాణాలు కాపాడవచ్చును. కొన్ని దినములు లిట్లు చేసిన ఇతడు నిద్ర నుండి లేచినట్లుగా స్పృహ చెందగలడు" అన్నారు. [పడి అన్నది ఇప్పటికీ గ్రామీణుల్లో ఆదరణ ఉన్న కొలమానం. ఒక పడి అంటే ఒకటిన్నర కిలో గ్రాములు.]

అలంకార వల్లి ఎంతో సంతోషంతో వైద్యులకు కృతజ్ఞతలు తెల్పింది. విలువైన బహుమతులూ ఇచ్చింది.

దాసీజనుల చేత సిద్దము చేయించిన నేయి అన్నముల లేహ్యముతో, చంద్రవర్ణుడి దేహానికి మర్ధనా చేస్తూ, స్వయంగా తానే దగ్గరుండి సేవలు చేసింది. ఈ విధంగా ఎనిమిది రోజులు గడిచాయి.
~~~~~~~~~

చంద్రవర్ణుడి కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 06]

ప్రాచీన కాలంలో, కర్మభూమియైన భారత ఖండంలో నంది పురమనే పట్టణ ముండేది. అందులోని బ్రాహ్మణ వాడలో, మిగుల సౌందర్యవంతుడైన యువకుడు ఒకడుండేవాడు. అతడి పేరు చంద్రవర్ణుడు. [చంద్రవర్ణుడు అంటే - చంద్రుని కాంతి వంటి శరీర ఛాయ గలవాడు అని అర్ధం.] చంద్రవర్ణుడు మంచివాడు. నీతి నియమాలు, ధర్మచింతనా గలవాడు. పైగా పండితుడు. అతడెన్నో శాస్త్రాలనూ, కళలనూ అభ్యసించాడు. అయినా గానీ, తాను నేర్చిన విద్యల పట్ల అతడికి సంతృప్తి లేదు.

"ఈ జగత్తున ఇంకనూ నేర్వవలసిన కళలూ, శాస్త్రాలూ, విద్యలూ ఎన్నిగలవో ఎవరూ చెప్పలేరు. నేనింకా నేర్వవలసింది ఎంతో ఉంది. ఇలాగే ఉంటే నా తృష్ణ తీరదు. సద్గురువును ఆశ్రయించి, విద్యల నభ్యసించవలసిందే" అని నిశ్చయించుకున్నాడు.

స్థిర నిశ్చయానికి వచ్చిన చంద్రవర్ణుడు ఇల్లు విడిచి పెట్టాడు. సద్గురువుని అన్వేషిస్తూ బయలు దేరాడు. ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. పుణ్యక్షేత్రాలు చుట్టబెట్టాడు. విద్వాంసులున్నారని పేరున్న చోటునల్లా సందర్శించాడు. తన జ్ఞానతృష్ణని తీర్చే గురువుని కనుక్కోలేక పోయాడు. అయితే చంద్రవర్ణుడు తన సంకల్పాన్ని మాత్రం విడిచి పెట్టలేదు.

సద్గురు అన్వేషణనీ మానలేదు. ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా సాగుతూ... ఒక నిర్జనారణ్యాన్ని చేరాడు. అతడప్పటికే బాగా అలిసిపోయి ఉన్నాడు. అతడికి ఎదురుగా చిన్న కొండ ఉంది. ఆ ప్రక్కనే ప్రశాంతంగా ఓ నది ప్రవహిస్తోంది. నది ఒడ్డున ‘ఆకాసాన్నంతటినీ ఆవరించి ఉందా?’ అన్నట్లు రావి చెట్టొకటి ఉంది. నది నీటి గలగలలతో, రావి ఆకుల గలగలలు పోటీ పడుతున్నాయి.

చంద్రవర్ణుడు నదిలోకి దిగి దాహం తీర్చుకున్నాడు. ఆ చల్లని నీటిలో స్నానమాచరించాడు. అలసిన శరీరం, మనస్సు కూడా సేదతీరాయి. రావి చెట్టు క్రింద చేరగిలబడ్డాడు. చల్లని గాలి మెల్లిగా వీస్తోంది. చంద్రవర్ణుడు విశ్రాంతిగా ఆ చెట్టు నీడలో నిద్రించాడు.

భారీగా ఉన్న ఆ రావి చెట్టు మీద, చాలా కాలం నుండీ ఓ బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. [రాక్షసులు తామస గుణాత్ములు. వారిలో సత్వగుణం గల రాక్షసులని బ్రహ్మరాక్షసులంటారు. రాక్షసులలో వీరు మహర్షుల వంటి సాధు పురుషులన్న మాట.] అతడా రావి చెట్టు కొమ్మలపై ఉంటూ, ప్రతీరోజూ తపమాచరిస్తూ ఉన్నాడు. సంధ్యా వందనం చేసుకోవటానికి బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చాడు. నది వైపు అడుగులు వేయబోయి, చెట్టు నీడన నిద్రిస్తున్న చంద్రవర్ణుణ్ణి చూశాడు.

ఆ బ్రాహ్మణ యువకుడి ముఖ వర్ఛస్సు, దేహకాంతిని బట్టి అతడి జ్ఞానతృష్ణని గ్రహించాడు. సుందరుడూ, సుకుమారుడూ అయిన చంద్రవర్ణుడి పట్ల బ్రహ్మరాక్షసుడికి ఎంతో వాత్సల్యం కలిగింది. నదిలో స్నానాదికాలు ముగించుకొని, సూర్య భగవానుడికి సంధ్యావందనాది అనుష్టానాలు ఆచరించి, చంద్రవర్ణుడి దగ్గరికి వచ్చాడు. అతణ్ణి తట్టి లేపాడు.

నిద్రలేచిన చంద్రవర్ణుడు, ఎదురుగా ఉన్న బ్రాహ్మ రాక్షసుడిని చూసి, నమస్కరించి నిలబడ్డాడు. బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడి వైపు ప్రేమగా చూస్తూ "వత్సా! ఎవరు నీవు? ఈ నిర్జనారణ్యానికి ఎందుకు వచ్చావు? మానవ మాత్రులెవరూ ఈ దుర్గమారణ్యంలోకి అడుగు పెట్టేందుకు సాహసించరే? నీవెందుకు వచ్చావు?" అని అడిగాడు.

చంద్రవర్ణుడు వినమ్రత ఉట్టిపడే స్వరంతో "మహాత్మా! నా పేరు చంద్రవర్ణుడు. ‘నందిపురం’ అనే పట్టణ వాసిని. నన్ను ఉద్దరించగల సద్గురువును అన్వేషిస్తూ తిరుగుతున్న వాడిని! నా దురదృష్టం కొద్దీ, నా ప్రయత్నాలు సఫలం కాలేదు. చూడగా మీరెవ్వరో, పండితుల వలె కనబడుతున్నారు. మీ ముఖ కాంతి, జ్ఞానదీప్తి ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దయ ఉంచి, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి" అన్నాడు.

బ్రహ్మరాక్షసుడికి, చంద్రవర్ణుడిపై కలిగిన వాత్సల్యం, అతడి మాటలు వినేసరికి రెట్టింపయ్యింది. ఎంతో దయగా "నాయనా! తప్పకుండా నిన్ను నా శిష్యుడిగా అంగీకరిస్తాను. భగవంతుడే నిన్ను నా దగ్గరికి పంపినట్లున్నాడు. నాకు తెలిసిన విద్యలన్నిటినీ నీకు ఆరునెలల్లో నేర్పుతాను. అయితే ఒక నియమం ఉన్నది" అని ఆగాడు.

చెప్పమన్నట్లుగా చేతులు జోడించాడు చంద్రవర్ణుడు. బ్రహ్మరాక్షసుడు కొనసాగిస్తూ "ఆరునెలలు పాటు నువ్వు ఆకలిదప్పలు, అలసటా మరిచిపోవాలి. అన్నపానాదులు, నిద్రా విశ్రాంతులు మాని, అనుశృతంగా నేర్చినట్లయితేనే నీకు నేను విద్యలు నేర్పగలను" అన్నాడు.

చంద్రవర్ణుడు ఆందోళన నిండిన కళ్ళతో, గురువు పాదాల మీద వ్రాలాడు. "స్వామీ! అందుకు తగిన తరుణోపాయం మీరే చెప్పండి" అని ప్రార్దించాడు. బ్రహ్మరాక్షసుడు అతడి పట్ల మరింత సంప్రీతుడై "నాయనా! దిగులు చెందకు. నేను నీకో మంత్రోపదేశిస్తాను. ఆ ప్రభావంతో నీకు ఆరునెలలుపాటు తరగని శక్తి లభిస్తుంది. దాని సహాయంతో నీవు అలసట, నిద్ర, ఆకలి, దప్పికలని నియంత్రించుకోగలవు.

నేనీ రావిచెట్టు కొమ్మలపై కూర్చుండి, రావి ఆకులపై శ్లోకములను వ్రాసి క్రింద పడవేస్తాను. నీవా ఆకులని గ్రహించి, వాటిపై శ్లోకములను పఠించవచ్చు" అన్నాడు.

[ప్రాచీన కాలంలో కాగితాలు లేవు కదా! తాటి ఆకులపై పక్షి ఈకతో వ్రాసేవారు. ఈ కథలో రావి ఆకుల మీద వ్రాసారు. అందుకేనేమో "ఫలానా వారి కంటే ఇతడు నాలుగాకులు ఎక్కువే చదివాడు" అనే సామెత పుట్టింది. ఒకరిని మించిన వాడు మరొకడు తారసిల్లి నప్పుడు, తరచుగా ఈ సామెత వాడుతుంటారు.]

చంద్రవర్ణుడి సంతోషం అవధులు దాటింది. బ్రహ్మరాక్షసుడికి గురుభావంతో, వినయంగా, తలవంచి నమస్కరించాడు. విద్యాభ్యాసం ప్రారంభమైంది. నిద్రాహారాలు లేకుండా బ్రహ్మరాక్షసుడు విద్యల నేర్పుతున్నాడు, చంద్రవర్ణుడు నేర్చుకుంటున్నాడు. ఆరునెలల కాలం గడిచింది.

అప్పుడు సంభవించిందొక అద్భుతం!

వినోద రంజిత ప్రారంభించిన కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 05]

మంగళ వాద్యాలు మిన్నంటి మ్రోగుతున్నాయి. భోజరాజు సంతోషంగా, సింహాసనాధిష్టిత కాంక్షతో, సుతారంగా కుడిపాదం ఎత్తి, తొలిమెట్టుపై ఉంచబోయాడు.

ఆశ్చర్యం!

ఆ క్షణం.... సింహాసనపు 32 మెట్ల మీదా ఉన్న సువర్ణ ప్రతిమలన్నీ, ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్లు రెండు చేతులా చప్పట్లు చరుస్తూ, భోజరాజుని చూసి పక పకా నవ్వాయి.

సభలోని వారంతా విభ్రాంతితో స్థబ్ధులయ్యారు. ఒక్క క్షణం భోజరాజు లజ్జితుడైనాడు. మరుక్షణం తాను భ్రాంతి పడ్డానా అనుకున్నాడు. మరోసారి తొలిమెట్టుపై కాలు మోపబోయాడు. మళ్ళీ బొమ్మలన్నీ ఒక్కసారిగా ఘొల్లున నవ్వాయి. నేల మీద మువ్వలు జారినట్లు, ముత్యాలు దొర్లినట్లు, కోటి కోయిలలు కిలకిల లాడినట్లు సవ్వడి చుట్టు ముట్టింది.

కొద్దిక్షణాలకు భోజరాజు తేరుకున్నాడు. గొంతు సవరించుకొని "ఓ సువర్ణ ప్రతిమలారా! ఇదేమీ వింత? ఏల నన్ను జూచి నవ్వుతున్నారు? నేను సింహాసన మధిష్టించ మెట్టుపై కాలూన బోవగా, చప్పట్లు చరిచి మరీ నవ్వుతున్నారే! నేను మీకింతగా చులకన ఎట్లయ్యాను? ఎందుకిలా పరిహాసం చేస్తున్నారు?" అన్నాడు.

సింహాసనపు తొలిమెట్టుపై నున్న బొమ్మ, కలస్వనంతో...

"ఓ భోజరాజా! నీవు మాకెందుకు చులకన అవుతావు? నీపై మేము ఎందుకు పరిహాసమాడుతాము? ఎంతో ప్రయత్నము చేసి, మీరు, మీ పరివారమూ, మంత్రివర్యులూ, ఈ సింహాసనాన్ని మట్టిలో నుండి వెలికి తీసి, శుభ్రపరిచి, మెరుగులు దిద్ది, ఈ సభాభవనమున నిలిపినారు. ఈ సింహాసనముపై కూర్చుని ప్రజాపాలన చేయగల అర్హత గల వారెవ్వరూ లేనందువల్లనే ఇది మట్టిలో కూరుకుపోయినది.

ఈ సింహాసనంపై కూర్చొన వలెనను ఆశ నీకు ఉంటే, నీవు దీని చరిత్ర తెలుసుకోవాలి, మరింకెన్నో నేర్చుకోవాలి. అదేదీ తెలియక నీవీ గద్దె నెక్కనుద్యుక్తుడవైనావు.

‘ఇతడీ సింహాసనము నెక్కిన ఎక్కనిమ్ము. మనకేమి గావలె’ నని తలపోసి మేమూరక యుంటిమేని మాకు ‘ఉదాసీనత దోషం’ అంటుకోక మానదు. ఏదైనా దుష్కృతి జరుగుయెడల, ఆ పాపం పాపకర్తయైన మానవుని కొక్కనికే చెందదు, ఆ పాప కార్యమును చూచియూ, దాని గురించి తెలిసియూ, దానినాపక, కేవలము ప్రేక్షకత్వం వహించి చూచువారల కెల్ల యా పాపమంటును.

అందుకే.... ఇదేవీ తెలియక సింహాసనము నెక్కబోయిన నిన్ను ఆపుటకే, మేమిట్లు నిన్ను ఆటంకపరిచితిమి. ఈ సింహాసనముపై కూర్చొని ప్రజా పాలన చేయ అర్హత గలవారే దీనిపై కూర్చొన వలెను. అట్లుగాక ఎవరైనా అనర్హులయ్యీ, సింహాసనము నధిష్టింపబ్రయత్నించినచో వారి తల శతసహస్ర ముక్కలవ్వగలదు.

పూర్వం విక్రమాదిత్యుడనే మహారాజు ఈ సింహాసనముపై కూర్చొని, తన మంత్రియైన భట్టితో కలిసి, రెండువేల ఏళ్ళు రాజ్యమేలినాడు. భట్టి అపర బృహస్పతి. విక్రమాదిత్యుడు గొప్పజ్ఞాని, అంతకంటే గొప్ప సాహసికుడు, అరివీరయోధుడు. అతడు అరువది నాలుగు కళల నామూలాగ్రమూ తెలిసిన వాడు. ధైర్యసాహసాలు, పౌరుషము, పరాక్రమమూ, దానగుణమూ కలవాడు. దయా సముద్రుడు. సకల శాస్త్ర పారంగతుడు.

విక్రమాదిత్యునికి గల సుగుణాలలో, వెయ్యింట ఒక వంతైననూ నీవు కలిగి ఉంటే, ఈ సింహాసనము నెక్కుటకు సాహసింపుము. లేదా నీ కోరికని కట్టిపెట్టుకొమ్ము.

ఇది అంతా తెలిసి ఉండుట చేతనే, గద్దెనెక్కు నుత్సుకత చూపుతున్న నిన్ను చూసి నవ్వినాము. భోజరాజా! ఇకపై ఆలోచించి ఏమి చేయుదువో నిర్ణయించుకోగలవు. ఇంతకూ నా పేరు చెప్పనైతిని. ఈ తొలిమెట్టుపై నిలిచిన నా నామధేయము వినోద రంజిత" అన్నది.

అప్పటి వరకూ... శీతాకాలపు సాయంత్రం తుషార బిందువులు కురిసినట్లు, సంధ్య వేళ సన్నజాజులు మెల్లిగా నేలకు జారినట్లు నెమ్మదిగా, అదే సమయంలో జలపాతం దుమికినట్లు, సెలయేరు ప్రవహించినట్లు అనుశృతంగా, నిరంతరాయంగా ధ్వనించిన ఆమె కంఠం, నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది.

[వినోద రంజిత అంటే వినోదముతో రంజిత i.e. ఆనందితమైనది, వినోదంతో రంజింపజేయునది అనే అర్దాలున్నాయి.
ఉదాసీనత దోషం:
చెడు చేయటమే కాదు, చెడు చూస్తూ ఊరుకోవటం కూడా తప్పే! ఇదే వినోద రంజిత కథలోనూ ద్యోతకమౌతోంది. ఒకప్పుడు ఇలాంటి భావనలు ప్రజలలో ఉండేవి. చెడు నాప ప్రయత్నించే వాళ్ళమీద, ఇతరులకి సాయం చేయ ప్రయత్నించే వాళ్ల మీద జోకులు వేసి [వీడికేం పని లేనట్లుంది. కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నాడు గట్రా!]మరీ, సమాజంలో చెడుపట్ల ‘ఉదాసీనత’ కలిగేటట్లు ప్రజలను ప్రభావపరిచారు.

ఈ నేపధ్యంలో.... కథాపూర్వకంగా చెప్పబడే ఇలాంటి మంచి భావనలు, చిన్నారులలో బలంగా నాటుకుంటాయి. సింహాసనం మీది బొమ్మలు ‘పోతే పోనీ! సింహాసనాన్ని భోజరాజు ఎక్కితే ఎక్కనీ’ అనుకుంటే భట్టి విక్రమార్క కథలే ఉండేవి కాదుగదా!]

ఇది విని భోజరాజు ఆశ్చర్యచకితుడైనాడు. సభలోని వారెల్లరూ ఈ విడ్డూరాన్ని చూసి శిలాప్రతిమల్లా అప్రతిభులైనారు.

కొన్ని క్షణాల తర్వాత భోజరాజు "ఓ ప్రతిమామణీ! వినోద రంజితా! నీవింత వరకూ విక్రమాదిత్య మహరాజు గురించి చెప్పితివి. ఎవరా మహరాజు? అతడి చరిత్ర ఏమిటి? ఆయన గుణగణాలెటు వంటివి? నేనది తెలియగోరుచున్నాను. నీకు సమ్మతమైతే, భట్టి విక్రమాదిత్యుల గురించిన మా కుతుహలాన్ని, ఆసక్తిని మన్నించి, ఆ వివరాలు మాకు చెప్పవలసిందిగా నా కోరిక!" అని మృదువుగా పలికాడు.

వినోద రంజిత ప్రతిమ అంగీకార సూచకంగా తలాడించింది. సభాసదనమంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ ఆశ్చర్యంతో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, మనసంతా చెవులుగా పరుచుకొని కథ వినేందుకు సంసిద్దలుయ్యారు.

వినోద రంజిత భోజరాజు వైపు సాదరంగా చూస్తూ "భోజరాజా! ఇప్పుడు నేను విక్రమాదిత్య మహరాజుకు పూర్వగాధ చెప్పబోతున్నాను. సావధానుడవూ, భక్తి వినమ్రుడవూ అయి వినెదవు గాక...." అంటూ ఇలా చెప్పసాగింది.

సువర్ణ సింహాసనం – మెట్టుకో బొమ్మ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక –04]

బుద్దిసాగరుడు కూలీల చేత మంచె ఉన్న చోట తవ్వించాడు. కూలీలు తగినంత లోతు తవ్వారు.

అద్భుతం!

భారీ పరిమాణంలో ఉన్న బంగారు సింహాసనం బయటపడింది. మట్టి అంటుకుపోయినా దాని అందం అందర్నీ ఆకర్షిస్తోంది. లతలూ, పువ్వూలూ, చూడచక్కని శిల్పకళతో అలరారుతోంది. అచ్చమైన బంగారంతో, మరకత మాణిక్యాధి రత్నాలతో పొదిగి ఉంది. దానికి 32 విశాలమైన మెట్లున్నాయి. మెట్లపైన సింహాసనం కళ్ళు మిరమిట్లు గొల్పుతోంది.

ప్రతీ మెట్టుకూ నిలువెత్తులో ఒకో సువర్ణ ప్రతిమ ఉంది. అందమైన అమ్మాయిల బొమ్మలు! అంతకంటే అందమైన వస్త్రాలూ, నగలూ ధరించినట్లుగా మలచబడిన శిల్పాలు! సువర్ణంతో చేసిన సౌందర్య రాశులు! చీర అంచుల్లో, నగల ధగధగల్లో, ధరించిన పువ్వుల్లో... ప్రతీ ఆకృతిలో, అందంగా ఒదిగిన వజ్రాలూ, కెంపులూ, మణులూ, మరకతాలు! అచ్చంగా అందమైన అమ్మాయిలు, విభిన్న భంగిమల్లో నిల్చున్నట్లున్నాయి.

జుట్టు విరబోసుకున్నట్లు ఓ బొమ్మ ఉంటే, ముడి వేసుకుని పూలు ముడుచుకున్నట్లు మరో బొమ్మ! ఓ బొమ్మది వాలు జడ, మరో బొమ్మది పూల జడ! హొయలు కురిపిస్తూ, వయ్యారాలు ఒలికిస్తూ, విభిన్న భంగిమల్లో, జీవం ఉట్టిపడుతూ, అచ్చంగా రమణీయ రమణీమణులు మెట్టు మెట్టుపై నిలబడి నట్లుగా ఉన్న బంగారు బొమ్మలు!

అది చూసిన అందరిలో ఆనందం పెల్లుబికింది. బుద్దిసాగరుడు సింహాసానాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ "ఇదన్నమాట సంగతి! ఈ సింహాసనం పూర్వం ఏ మహా చక్రవర్తిదో అయి ఉంటుంది. కాలగతిలో ఇక్కడ మట్టిలో కూరుకుపోయింది. కాబట్టే, ఈ చోటులో నిర్మించిన మంచె మీద ఉన్నంత సేపూ ఆ రైతు, ఈ సింహసనాన్ని గతంలో అధిష్టించిన మహానుభావుడి గొప్ప గుణాన్ని ప్రతిబింబిస్తూ, వితరణ శీలాన్ని చూపించాడు. మంచె దిగి రాగానే మామూలు మనిషిలా మాటలాడాడు. అదంతా ఈ సింహాసనపు విశిష్టతే!" అనుకున్నాడు.

[బుద్దిసాగరుడి ఆలోచనా తీరు, పిల్లల్ని సహజంగానే ప్రభావితం చేస్తుంది. భోజరాజూ, బుద్దిసాగరుడూ, శరవణ భట్టు విచిత్ర ప్రవర్తన చూసి "ఏమోలే! వీడో తిక్కలోడు" అనుకోలేదు. దానికేదో కార్యకారణ సంబంధముండి ఉండాలని శోధించారు. శరవణ భట్టు వైరుధ్య ప్రవర్తనలని పట్టించుకోకుండా తమ దారిన తాము పోయి ఉన్నట్లేతే, వాళ్లకి ఇంత గొప్ప సింహాసనం లభించేది కాదు. ఈ కథలూ ఉండేవి కావు.

ఇది గ్రహించినప్పుడు, పిల్లలు, తమ చుట్టూ జరిగే విషయాల పట్ల కూడా, ఒక కుతుహలాన్ని పెంపొందించుకుంటారు. కార్యకారణ సంబంధాల పట్ల విశేషణాత్మక దృష్టి కలిగి ఉంటారు. కథల వల్ల ప్రయోజనాలలో సౌశీల్య నిర్మాణం, వ్యక్తిత్వ వికాసమూ ప్రధానమైనవి.

నిజానికి, శరవణ భట్టు చూపిన వితరణ గుణం అతడిది కాదు. విక్రమార్కుడి సింహాసనానిది. మనలోనూ... శరవణ భట్టు చూపినట్లు ‘శివాలు’ అప్పుడప్పుడూ కన్పిస్తుంటుంది. ఏదైనా పని విజయవంతంగా చేసినప్పుడు ఇక అన్ని పనులూ చేసేయగలం అనుకోవటం, ఇటువంటిదే! ఎవరైనా ప్రక్కనున్నప్పుడో, పనిరంధి లేదా అటువంటిదే ఏదైనా విభిన్నమైన [మూడ్] మనఃస్థితిలో ఉన్నప్పుడు "అదెంత లెండి! చేసేద్దాం!" అంటూ ఇతరులకి హామీలిచ్చేస్తుంటాం. తీరా ఆ హామీలు నిలబెట్టుకోవాల్సి వచ్చినప్పుడు నొప్పి తెలుస్తుంటుంది.

అలాంటి సందర్భాలలో మేము "భోజరాజు సింహాసనం ఎక్కి నప్పటి మాటలొద్దు" అనో లేదా "విక్రమార్క సింహసనం ఎక్కేసి శివాలెక్కించుకోవద్దు" అనో అనుకుంటూ, పరస్పర హెచ్చరికలు చేసుకుంటూ ఉంటాము. ఆ విధంగా మనస్సుని నియంత్రించుకో ప్రయత్నిస్తామన్న మాట. అందుకు మా short cut formula వంటి పద ప్రయోగం ‘భోజరాజ సింహాసనమా?/ విక్రమార్క సింహసనమా?’ ఇక కథలోకి వస్తే...]

బుద్దిసాగరుడు సింహాసనాన్ని ధారా నగరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. భోజరాజు సింహాసనాన్ని చూసి ఆశ్చర్యం, ఆనందం పొందాడు. కూలీలకి, అక్కడ పనిచేసిన ఇతరులకి, భోజరాజు విలువైన బహుమతులు ఇచ్చాడు. సింహాసనాన్ని శుభ్రపరిచి, మెరుగులు దిద్దారు.

స్వర్ణ సింహసనాన్ని భోజరాజు సభాభవనంలో ప్రతిష్ఠించారు. దాని పనితనాన్ని చూసి యావత్ర్పజానీకం నివ్వెర పోయింది. ‘అపూర్వం! అద్భుతం!’ అని అందరూ వేనోళ్ళ కొనియాడారు. భోజరాజు ఆస్థాన జ్యోతిష్యులని, పండితులని సంప్రదించాడు. వారి మార్గదర్శకత్వంలో మంచి ముహుర్తం నిర్ణయించారు.

ఆ పుణ్య దినాన దైవపుజాదికాలు నిర్వహించారు. తదుపరి సింహాసనానికీ పూజ చేసి, హారతులు ఇచ్చారు. భోజరాజు, పండితుల, పురోహితుల, పెద్దల ఆశీర్వాదాలు పొంది, సింహాసనాన్ని సమీపించి నమస్కరించాడు.

పండిత పురోహితుల వేదమంత్రాలతో సభాభవనం మార్మోగుతుంది. ప్రజలు విభ్రమాశ్చర్యానందాలతో చూస్తున్నారు. మంగళ వాద్యాలు మిన్నంటి మ్రోగుతున్నాయి. భోజరాజు సంతోషంగా, సింహాసనాధిష్టిత కాంక్షతో, సుతారంగా కుడిపాదం ఎత్తి, తొలిమెట్టుపై ఉంచబోయాడు.

ఆశ్చర్యం!

ఆ క్షణం....

క్రీస్తు చెప్పిన కథ – చేట !

ఇది నాచిన్నప్పుడు మాపాఠశాలలో మా పంతులమ్మ చెప్పారు. పెద్దయ్యాక నేనూ బైబిలులో చదివాను. బైబిలు లో క్లుప్తంగా ఉన్న కథని మా పంతులమ్మ విపులంగా అనువర్తించి చెప్పారు. అది నాకేంతగానో నచ్చింది. మీకూ నచ్చుతుందని వ్రాస్తున్నాను.

ఒకరైతు తనపొలంలో చల్లటానికి , బలమైన, మంచి ధాన్యపు వితనాలను తెచ్చాడు. పొలం దున్ని సిద్ధం చేశాడు. గంపలో గింజలు పోసుకొని పొలంలో చల్లటం మొదలు పెట్టాడు.

కొన్ని గింజలు రాతిబండలపై పడ్డాయి. కొన్ని గింజలు పొలంగట్టు మీద, డొంక దారి మీద పడ్డాయి. కొన్ని గింజలు ముళ్ళపొదల్లో పడ్డాయి. కొన్ని గింజలు పొలంలో పడ్డాయి. బండలమీద పడ్డ గింజలు ఎండవేడికి మాడిపోయాయి. గట్టుమీద, దారి మీదా పడ్డగింజల్ని పిట్టలొచ్చి తినిపోయాయి. ముళ్ళపొదల్లో పడ్డ గింజలు మొలకెత్తాయిగానీ పెరగలేదు. నాలుగు రోజులకే మొలకలు వాడిపోయాయి. సారవంతమైన పొలంలో పడ్డ గింజలు మొలకెత్తి, పెరిగి పైరై, పండి మరెన్నో గింజల్ని ఇచ్చాయి.

అలాగే మహాత్ములు, గొప్పవారు, పెద్దవారు మనకు ఎన్నో మంచి మాటలు చెబుతారు. అయితే శ్రోతల్లో కొందరి హృదయాలు బండరాళ్ళవంటివి. పెద్దల సూక్తులు, మంచిమాటలు అటువంటి వారిని ఏమాత్రం ప్రభావితం చెయ్యలేవు. కొందరి హృదయాలు పొలంగట్టు, డొంకదారి వంటివి. అక్కడ పడిన గింజలవంటి మంచి మాటలనీ, నీతి సూత్రాలనీ పిట్టలనే విషయవాంఛలు, ప్రలోభాలు తినేసి పోతాయి.

కొందరి హృదయాలు ముళ్ళపొదల వంటివి. మంచిమాటలు వారి హృదయాల్లో నాటుకొని మొలకెత్తుతాయి గానీ ఎక్కువకాలం ఉండవు. వారిలోని విషయలాలస, అరిషడ్వర్గాల వంటి ముళ్ళు ఈ మొలకల్ని బ్రతకనీయవు. కొందరి హృదయాలు మాత్రం సారవంతమైన పొలం లాంటివన్న మాట. అక్కడ పడిన గింజల వంటి మంచిమాటలు, ఆలోచనలు మొలకెత్తి నారై, పైరై, పండుతాయి. మరికొన్ని మంచిమాటలని, ఆలోచనలని ఫలిస్తాయి.

ఈ కథని మా పంతులమ్మ తను నేర్పుతున్న చదువుకూ, విద్యార్ధుల మనస్సుకూ అనువర్తించి చెప్పింది.

ఈ సెలవు రోజున, పండుగరోజున మీ ఇంట్లోని చిన్నారులకి ఈ కథని, అనువర్తననీ చెప్పి ఆనందింపజేస్తారని ఆశిస్తాను.

ఈ సందర్భంలో భర్తృహరి సుభాషితం ఒకటి గుర్తు తెచ్చుకోవటం సమయోచితంగా ఉంటుంది. శ్లోకం గుర్తులేదు. భావం వ్రాస్తున్నాను. ఏనుగుల లక్ష్మణ కవి పద్యం ఎవరికైనా గుర్తు ఉంటే వ్రాయమని అర్ధిస్తున్నాను.

ఇంతకీ భర్తృహరి శ్లోక భావం ఏమిటంటే – మనిషి మనస్సు చేటలా ఉండాలట. చేట – తప్పి, తాలు, పొట్టు, పుచ్చు గింజల్ని వదిలేసి, మంచి గింజల్ని తనలో ఉంచుకుంటుందట. జల్లెడ మంచిపదార్ధాన్నంతా వదిలేసి పొట్టుని తనలో మిగుల్చు కుంటుందిట.

కాబట్టి మనిషి మనస్సు చేటలా ఉండాలని, తాము చూసిన, విన్న, చదివిన విషయాల్లో మంచి గ్రహించి చెడు వదిలేయాలని చెబుతుంది ఈ సుభాషితం. అలాగే జల్లెడలా ఉండకూడదని, చెడు గ్రహించి మంచి వదిలేయటం మంచిది కాదని చెబుతుంది. [ఈ జల్లెడ లక్షణాన్నే ‘గూట్లే’ తనమంటారని జల్సా సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం సునీల్ కు చెబుతాడు.]

శరవణ భట్టు మంచె కథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 03]

అడవిలో భోజరాజు, అతడి పరివారమూ వారం రోజుల పాటు వేట కొనసాగించారు. అడవిలో కౄర, వన్యమృగాల సంఖ్య నియంత్రణలోకి వచ్చిందని రాజుకు తోచింది. వేట ముగించాలని నిర్ణయించాడు.

మరునాటి ఉదయాన్నే.... భోజరాజు, తన పరివారంతో కలిసి తన రాజధానియైన ధారా నగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు. వేటాడి సంపాదించిన దుప్పికొమ్ములు, పులిచర్మాలు వంటి వస్తువులని గుర్రాలపై వేశారు. ప్రయాణం ప్రారంభించారు.

ఆ రోజున ఎండ మండిపోతోంది. నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నట్లుంది. వారం రోజులుగా వేటలో అలిసిపోయిన భోజరాజు, సూర్యతాపానికి మరింత అలసటకి గురై, గుర్రపు స్వారి మాని, పల్లకిలో ప్రయాణించసాగాడు. అతడి పరివారంలోని సైనికులు, యువకులూ కూడా ఎండ బడలికల కారణంగా నెమ్మదిగా నడవసాగారు.

దారిలో వాళ్ళు ఓ పొలం ప్రక్కగా వెళ్ళసాగారు. పచ్చని పైరుతో ఆ పొలం నిండుగా ఉంది. అది శరవణ భట్టు అనే బ్రాహ్మణుడది. [సాధారణంగా ‘శరవణ’ అన్న పేరు తమిళులకు ఉంటుంది. భోజరాజు పరిపాలించిన రాజ్యం, మధ్య భారతదేశంలో, తమిళనాడు దాకా విస్తరించి ఉందేమో ‘నిజమైన చరిత్ర’ తెలిసిన చరిత్రకారులకి తెలియాలి.]

శరవణ భట్టు తన పొలంలో పంటని జంతువుల బారి నుండి, పక్షుల బారి నుండి కాపాడుకోవటానికి, పొలం మధ్య ఎత్తుగా మంచె కట్టుకున్నాడు. అదీగాక, మంచె మీద కూర్చుని పొలానికి కావలి కాయటం సులభం కూడాను. భోజరాజు, పరివారమూ పొలం ప్రక్కగా సాగుపోతున్నప్పుడు, శరవణ భట్టు ఆ మంచె మీదే ఉన్నాడు.

అతడు వారిని చూసి "ఓ యన్నలారా! చూస్తే మీరు దూరం నుండి వస్తున్నట్లున్నారు. అలిసిపోయి ఉన్నారు. ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొండి. ఈ పొలం గట్టున నేనో చింత చెట్టు పెంచాను. ఆ చెట్టు నీడలో రవ్వంత సేపు విశ్రమించండి. ప్రక్కనే దిగుడు బావి ఉన్నది. అందులో నీళ్ళు చల్లగా, తియ్యగా ఉంటాయి. చూస్తే మీరంతా బాగా ఆకలితోనూ, దాహంతోనూ ఉన్నట్లుగా తోస్తోంది. మా బావి నుండి చల్లని నీటిని తాగండి.

పొలంలో నేను మొక్కజొన్న పంట వేసాను. పైరు ఏపుగా ఎదిగి కంకి బట్టి ఉంది. కంకులు పాలుబట్టి ఉన్నాయి. కడుపునిండా తినండి. మొక్కజొన్న కంకులు మీకు నచ్చకపోతే.... చాళ్ళ మధ్యన దోసపాదులు పెంచాను. దోస కాయలు దోరగా పండి, పగుళ్ళు వారి ఉన్నాయి. పనసతొనల్లా తీయగా, సువాసన వీనుతున్నాయి. ఆకలి దప్పలూ అలసటా, తీర్చుకుని, అప్పుడు పోదురు గానీ, కాస్సేపు ఆగండి" అన్నాడు.

భోజరాజు, అతడి పరివారమూ ఈ మాటలు విని ఎంతో సంతోషించారు. తన రాజ్యంలోని సామాన్య రైతు సైతం, ఇంతటి వితరణ గుణం కలిగి ఉన్నందుకు రాజుకు సంతృప్తి కలిగింది. అతడు తన పరివారానికి, మొక్కజొన్న కంకులూ, దోసకాయలూ తినడానికి, చేని బావినీరు తాగటానికీ అనుమతినిచ్చాడు.

ఉత్సాహంగా సైనికులూ, యువకులూ, పల్లకీ బోయిలూ పొలంలో జొరబడి ఆకలిదప్పలు తీర్చుకోసాగారు. కొన్ని నిముషాలు గడిచాయి.

ఇంతలో శరవణ భట్టు మంచె దిగి క్రిందికొచ్చాడు.

అంతే! ఒక్కసారిగా గావుకేక పెట్టాడు. "ఏయ్! ఎవరయ్యా మీరు? ఏం చేస్తున్నారు? నా పంటంతా ఎందుకు నాశనం చేస్తున్నారు? చూడబోతే రాజుగారి సైనికుల్లా ఉన్నారు! దొంగల్లా పొలంలో చొరబడి పంటంతా తినేస్తున్నారే!? మిమ్మల్ని కట్టడి చేసేందుకు గానీ, శిక్షించేందుకు గానీ ఎవరూ లేరా?

నాలాంటి అమాయక రైతులకి, ఇంకెవరికైనా కష్టం కలిగిస్తే, రాజు గారి దగ్గరికెళ్ళి న్యాయం చెయ్యమని మొరపెట్టుకుంటాము. అలాంటిది... రాజూ, అతడి పరివారమే, నాలాంటి వాడికి అన్యాయం చేస్తే, ఇంకెవరి దగ్గరి కెళ్ళి మొత్తుకోవాలి? పేద బ్రాహ్మణుడి పంట దోచుకునే పాపానికి ఒడిగట్టారు. మిమ్మల్ని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు" అంటూ శాపనార్దాలు పెడుతూ అరవసాగాడు.

శరవణ భట్టు మాటలకి భోజరాజు పరివారం దిగ్ర్భమ చెందారు. విషణ్ణ వదనాలతో నిలబడిపోయారు. వారి ముఖాల్లో, కొంత అయోమయం, కొంత అపరాధ భావన, కలగలసి పోయాయి. పొలం నుండి బయటకి వచ్చేసారు.

ఇంతలో శరవణ భట్టు మళ్ళీ మంచె పైకి ఎక్కాడు. వెళ్ళుపోతున్న సైనికుల్ని చూసి "అయ్యో భగవంతుడా! అన్నలారా ఆగండి! ఎందుకని వెళ్ళిపోతున్నారు? మీ ఆకలి తీర్చుకోకుండానే పొలం వీడి పోతున్నారేం? నా ఆతిధ్యంలో ఏమైనా లోపమున్నదా? ప్రియమైన సోదరులారా! రండి. దయచేసి వెళ్ళకండి! ఆకలీ దాహమూ తీర్చుకొండి. విశ్రాంతి తీసుకోండి. ఎండవేడి తగ్గాక, తిరిగి ప్రయాణం ప్రారంభిద్దురు గానీ!" అన్నాడు ఎంతో వేడికోలుగా!

పూర్తిగా విభిన్నమైన, విచిత్రమైన ఈ రకపు ప్రవర్తనకు, శరవణ భట్టుని చూసి, భోజరాజు అతడి పరివారమూ నివ్వెర పోయారు.

భోజరాజు తన ప్రధానమంత్రిని పిలిచి "బుద్దిసాగారా! గమనించావా!? ఈ బ్రాహ్మణుని ప్రవర్తన కడు వింతగా నున్నది. మంచె మీద ఉన్నప్పుడు అతడి మాటతీరు ఎంత దయాపూర్ణమై ప్రేమపూరితమై ఉన్నది. మంచె దిగినంతనే కర్ణ కఠోరమైన మాటలాడుచున్నాడు. ముందటి ప్రవర్తనకు, దీనికీ పొంతనే లేదు. దీని కేదో ప్రబల కారణం ఉండి ఉండాలి" అన్నాడు.

బుద్ది సాగరుడు "నిజము మహారాజా! నేనూ దీని గురించే ఆలోచించుతూ ఉన్నాను. ‘మంచె ఉన్న స్థానంలోని మట్టిలో ఏదో మహత్తు ఉండి ఉండవచ్చు’ అని నా ఊహ" అన్నాడు, సాలోచనగా!

భోజరాజు "అదీ నిజమై ఉండవచ్చు. మనము ఆ రైతుతో మాట్లాడెదము గాక! అతణ్ణి వెంటనే పిలిపించండి" అన్నాడు.

ఉత్తర క్షణంలో శరవణ భట్టు భోజరాజు ఎదుట ఉన్నాడు. భోజరాజు మందహాసంతో "ఓయీ శరవణ భట్టూ! మాకు నీ పొలము పై ఆసక్తిగా ఉన్నది. నీకు ఇంతే సారవంతమైనదీ, విస్తీర్ణము గలదీ అయిన మరియొక భూమినిచ్చెదను. ఇంకనూ నీకు అయిదు గ్రామములపై పన్ను వసూలు చేసుకొను హక్కునిచ్చెదను. బదులుగా నీ పొలమును నాకు అమ్మివేయుము" అన్నాడు.

శరవణ భట్టు వినమ్రతతో "మహారాజా! ఈ రాజ్యమున ఏదైనా మీ సొత్తు! అన్నిటిపైనా మీకు అధికారమున్నది. మీరు నా పొలము ఊరికినే తీసికొన్ననూ, మిమ్ములను అభ్యంతర పరచు వారెవ్వరూ లేరు. అట్టిచో మీరు నాపట్ల ఎంతో దయ చూపించుచున్నారు. మీరు ఆదర్శ ప్రభువులు! మీ ధర్మబుద్ది దేవతలకు సరితూగ గలది. నా పొలమునకు బదులుగా మీరు ఎంతో ఇచ్చుచున్నారు. నేనెంతో సంతోషముగా నా పొలమును ఈ క్షణమే మీ పరము చేయిచున్న వాడను" అన్నాడు.

బుద్దిసాగరుడు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. శరవణ భట్టుకు వేరొక పొలమునూ, ఇతర బహుమతులూ ఇచ్చాడు. శరవణ భట్టు పొలంలో మంచె నిర్మించిన చోట తవ్వేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఒక మంచి ముహుర్తాన, పూజాదికాలు నిర్వహించి, తవ్వకం ప్రారంభించారు.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes