RSS
Wecome to my Blog, enjoy reading :)

చేజారిన మంత్రం కథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 44]

విక్రమాదిత్యుడు మరోసారి మోదుగ చెట్టెక్కి శవాన్ని దించి, భుజానికెత్తుకుని బృహదారణ్యం కేసి నడవసాగాడు. శవంలోని భేతాళుడు పదమూడవ కథ చెప్పడం ప్రారంభించాడు.

ఒకప్పుడు పుష్పపురం అనే నగరం ప్రక్కన ఓ శిధిలాలయం ఉండేది. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో అలమటిస్తూ ఆ కోవెలలో పడుకున్నాడు.

అంతలో అక్కడికి ఓ యోగి వచ్చాడు. ఆ బ్రాహ్మణుణ్ణి చూడగానే యోగికి అతడి పరిస్థితి మొత్తం అర్ధమయ్యింది. యోగికి అతడిపై జాలి కలిగింది. అతడికి సాయపడదలిచాడు. వెంటనే ఆ యోగి ఒక మంత్రాన్ని జపించాడు.

వెంటనే అక్కడొక ఇల్లు సృష్టింపబడింది. చుట్టూ ఉద్యానవనం, ప్రక్కనే చిన్న సరస్సు, ఇంటి లోపలంతా అందమైన, విలువైన వస్తువులూ, సామాగ్రితో సర్వ సంపన్నంగా ఉంది. ఆ ఇంటి వంట గదిలో రుచికరమైన భక్ష్యభోజ్యాలు, మధురఫలాలూ, పానీయాలూ ఉన్నాయి.

యోగి బ్రాహ్మణుడిని ఆ యింటి లోనికి తీసుకు వెళ్ళాడు. అక్కడి మృష్టాన్న భోజనాన్ని చూచి బ్రాహ్మణుడి కళ్ళు మెరిసాయి. యోగి అతడిని వాటిని తినవచ్చునని ఆదేశించాడు. ఆ పేద బ్రాహ్మణుడు ఎంతో సంతోషంతో ఆకలి తీర్చుకున్నాడు.

యోగికి ఆ అభాగ్యుడి పట్ల ఎంతో వాత్సల్యం కలిగింది. అతడికి మంత్రోపదేశం చేయదలిచి “నాయనా, నీకు దివ్య మంత్రం ఉపదేశిస్తాను. పవిత్ర స్నానం ఆచరించాలి. పద!” అంటూ అతణ్ణి సరస్సు దగ్గరికి తీసికెళ్ళాడు. అందులో పుణ్యస్నానమాచరించి రావలసిందని పంపాడు. బ్రాహ్మణుడు సరస్సులో మునిగాడు.

తొలి మునక వేసిన క్షణం అతడి కొక దృశ్యం మనోఫలకం మీద గోచరించింది. అందులో అతడి కుమారుడు అతని ఎదురుగా నిలబడి ఉన్నాడు. రెండవ మునకలో అతడికి అతడి భార్య కనిపించింది. మూడో మునకలో అతడి వృద్ధులైన తల్లిదండ్రులు కనిపించారు.

స్నానం ముగించి గట్టు మీది కొచ్చాక బ్రాహ్మణుడికి అదంతా తన ఊహేగాని, తన భార్యాపుత్రులూ, తల్లిదండ్రులూ అక్కడ లేరని అర్ధమయ్యింది.

బ్రాహ్మణుడు తన అనుభవాన్నంతా యోగికి వివరించి చెప్పాడు. యోగి ఒక్కక్షణంతో తన ప్రయత్నం వృధా అయ్యిందని గ్రహించాడు. విచారం నిండిన స్వరంతో “నాయనా! అనవసరంగా నిన్ను శ్రమకు గురి చేసాను, నేనూ శ్రమ తీసుకున్నాను. ఈ మంత్రం నీకు ఉపయోగించదు. భగవదనుగ్రహమిట్లున్నది. నీవు ఇంటికి పోయి తోచిన రీతిన బ్రతుకు” అని అతడిని దీవించి తన దారిన తాను పోయాడు.

బ్రాహ్మణుడు కొంత సేపు విచారించి, చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఇదీ కథ!

భేతాళుడింత వరకూ కథ చెప్పి “ఓ విక్రమాదిత్యా! యోగి ఎందుకా విధంగా చెప్పాడు? మంత్రం యోగికి ఫలవంతమైనప్పుడు, ఆ పేద బ్రాహ్మణుడికెందుకు ఫలించదు? బ్రాహ్మణుడు సరస్సులో స్నానమాడి వచ్చేంతలో యోగి మనస్సు మార్చుకున్నాడా? యోగికి అతడిపై కలిగిన వాత్సల్యం అంతలోనే కరిగి పోయిందా? తెలిసీ జవాబు చెప్పకపోతే నీ తల వేయి వక్కలౌతుందని నీకు తెలుసు. మౌనభంగమైతే నీ ఈ ప్రయత్నం ఫలిందనీ, నీకు తెలుసు కదా! ఇక జవాబు చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు ఓ సారి దీర్ఘ శ్వాస తీసుకుని “ఓ భేతాళా! విను! ఆ యోగి అమృత హృదయుడు. ఆ పేదవాడిపై ప్రేమా జాలీ కలవాడై మంత్రోపదేశం చేసి అతడికి సహాయం చేయాలనుకున్నాడు. యోగి వాత్సల్యం కరిగి పోలేదు, మనస్సూ మారిపోలేదు.

అయితే… పుణ్యవ్రతం ఆచరించాలన్నా, దైవధ్యానం చెయ్యాలన్నా, యోగాభ్యాసమూ మంత్రోచ్ఛాటనా చేయాలన్నా, ఏకాగ్రత అవసరం. పూర్తిగా మనస్సుని లగ్నం చేసి సాధన మీదే దృష్టి కేంద్రీకరించి, ఇతరమైన ఆలోచన లేవీ లేకుండా ఏకాగ్రచిత్తులైతేనే… ఏ వ్యక్తి అయినా సాధన చెయ్యగలడు. ఆ పేద బ్రాహ్మణుడికి మనస్సుని ఏకాగ్రం చేసే శక్తి లేదు. అది గ్రహించిన వాడై, యోగి తన ప్రయత్నం విరమించుకొని, తన దారిన తాను పోయాడు. అంతే! అది బ్రాహ్మణుడి అసక్తత గానీ యోగి అనాదరణ కాదు” అన్నాడు.

భేతాళుడీ జవాబుకి సంప్రీతుడైనాడు గానీ తక్షణమే అదృశ్యుడూ అయ్యాడు.

కథా విశ్లేషణ: దేన్ని సాధించాలన్నా, ఏకాగ్రత అవసరం అనే విషయాన్ని పిల్లల మనస్సుకి హత్తుకునేలా చెబుతుందీ కథ! అందునా మాయమంత్రాలు నేర్చుకోవటమనే కథలంటే పిల్లలకి మహా సరదా! అలాంటి చోట మంత్రం నేర్చుకునే అవకాశం పోవటమంటే, పిల్లలకది బాగా గుర్తుండి పోతుంది. ఆ విధంగా ‘ఏకాగ్రత సాధించాలి’ అనే ఆలోచన వాళ్ళలో రేకెత్తుతుంది.

మంత్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 43]

నీతి వర్ధనుడు తన దేశాటన విశేషాలన్నిటినీ వివరించాడు. వర్తక శ్రేష్ఠితో స్నేహం, సముద్ర ప్రయాణం, తుపానులో దారి తప్పి కనీవినీ ఎరగని దీవికి చేరటం, అక్కడి ఆలయం, అందులోని అపురూప సుందరి గురించీ… ఏదీ దాచకుండా పూసగుచ్చినట్లు వర్ణించాడు.

రాజు వంశమార్గుడికి ఆ దీవిని చూడాలనే కోరిక కలిగింది. ఓ రోజు, నీతి వర్ధనుణ్ణి వెంటబెట్టుకుని, తగిన సిబ్బందితో నౌకా ప్రయాణం ప్రారంభించి, గతంలో నీతి వర్ధనుడు చేరిన దీవికి ప్రయాణమయ్యారు. కొన్నిరోజుల తర్వాత ఆ దీవికి చేరారు.

రాజు పరివారంతో గుడిలోకి ప్రవేశించాడు. అద్భుతమైన శిల్పాలతో అలరారుతున్న కోవెల అది. ఆవరణలో చెట్టు క్రింద నిదురిస్తున్న లావణ్య రాశిని చూశాడు రాజు. ఆమె చాలా అందంగా ఉంది. రాజుకి ఆమె పట్ల అనురాగం కలిగింది.

అలికిడికి నిద్ర లేచిన ఆ యువతి, రాజుని చూసి ఆశ్చర్య పోయింది. రాజు వంశమార్గుడు తీయని మాటలతో తన ప్రేమను ఆమెకు తెలిపాడు. అతడి మాట తీరుకు, గంభీరమైన అతడి రూపానికీ ఆమె ముగ్ధురాలైంది. అంగీకార సూచకంగా ఆమె కళ్ళు మెరిసాయి.

తనలో ‘ఇతడు గొప్ప చక్రవర్తై ఉంటాడు. ఇతడి రూపురేఖ మన్మధుణ్ణి, రాచఠీవి దేవేంద్రుణ్ణి తలపిస్తున్నాయి’ అనుకొంది.

మెల్లిగా తలెత్తి “ఓ రాజా! నీవు రాజులలో ఇంద్రుడి వలె ఉన్నావు. నేను నీ ప్రేమని తిరస్కరించినట్లయితే, ఇంత అందమైన శరీరం కలిగి ఉండీ నిరర్ధకమే! అయితే, నీవు కొంత సమయం వేచి ఉండక తప్పదు. రానున్న అష్టమి లేదా అమావాస్య వరకూ వేచి ఉండగలవు” అంది.

అప్పటి వరకూ రాజు తన పరివారంతో కోవెలలోని దుర్గామాతని ఆరాధిస్తూ, ఆ యువతితో తీయని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసాడు. అష్టమి రానే వచ్చింది.

ఆమె కోవెలలో ఒక వత్రమాచరింప ప్రారంభించింది. అందుకోసం గుడి ఆవరణలోని పవిత్ర పుష్కరిణిలో స్నానానికి వెళ్ళింది. ఆ కోనేటిలో కలువలూ, తామరలూ ఉన్నాయి. నీరు స్వచ్ఛంగా ఉంది. సన్నని అలలతో మనోహరంగా ఉంది.

రాజు “నీటిలో పసిబిడ్డని ఒంటరిగా విడిచి పెట్టరాదు. అదే విధంగా… అందమైన యువతినీ ఏ వేళలోనూ ఒంటరిగా ఉంచరాదు” అనుకొని, కత్తి చేతబూని, ఆమెకు కనబడకుండా ఆమెకి రక్షణగా ఉన్నాడు.

అంతలో… భీకరమైన శబ్దం వచ్చింది. అదేమిటో గమనించే లోగానే, ఓ భీకరాకారుడైన రాక్షసుడు వచ్చాడు. అమాంతం ఆమెని ఎత్తి నోట్లో పెట్టుకు మింగేసాడు.

ఒక్కక్షణం రాజు వంశమార్గుడు నివ్వెర పడ్డాడు. మరుక్షణం, ఆ రాక్షసుడి ముందుకు దూకి, ఒక్క ఉదుటున కత్తితో వాడి పొట్ట చీల్చాడు. అందులో నుండి ఆ యువతి సురక్షితంగా బయటపడింది.

ఆశ్చర్యంగా చూస్తున్న రాజుతో ఆమె “ఓ రాజా! నేను మృగాంకుడి పెద్ద కుమార్తెను. నా తండ్రి దేవసభలో ఇంద్రుడికి ప్రీతిపాత్రుడైన పండితుడు. నా పేరు మృగనయని (జింక కన్నుల వంటి కన్నులు కలది అని ఆ పేరుకు అర్ధం.)

నా తర్వాత నా తండ్రికి నూరుగురు కొడుకులున్నారు. నా సోదరులందరి కంటే నా తండ్రికి నేనంటే అమిత ప్రేమ. ఏనాడూ నన్నూ చూడకుండా ఉండలేడు, నేను లేనిది భోజనమైనా చేయడు.

ఆ రోజులలో ఓ అష్టమినాడు, నేను గౌరీ వ్రతాన్ని ప్రారంభించాను.

దాంతో గుడిలో పూజాది కార్యక్రమాలు ఆలస్యం కావటంతో, ఆ రోజు భోజనానికి చాలా సమయం గడిచినా ఇంటికి వెళ్ళలేక పోయాను. నా తండ్రి నాకోసం చాలా సేపు వేచి ఉన్నాడు. అలసిపోయి, ఆకలితో ఎదురు చూస్తుండగా, నేను ఇల్లు చేరుకున్నాను.

ఆకలితో వివశుడై ఉన్న నా తండ్రి కోపం పట్టలేక, నిగ్రహం కోల్పోయి, ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో, నన్ను “నీవు రాక్షసుడి చేత మ్రింగ బడెదవు గాక!” అని శపించాడు.

నేను కొయ్యబారి పోయాను. ఉత్తర క్షణం ఆయన కాళ్ళ మీద పడి విలపించాను. నా తప్పేమీ లేదనీ, ఆలయంలో పూజ ఆలస్యమైందనీ విన్నవించాను. శాపాన్ని ఉపసంహరించమని వినయంతో అర్ధించాను. దుఃఖాతిశయంతో వణుకుతున్న నన్ను చూసి, నా తండ్రికి తెలివి వచ్చింది. అప్పటి వరకూ దయ్యంలా ఆయన్ని పట్టి ఉంచిన క్రోధం ఒక్కసారిగా చల్లారింది. తానేం చేసాడో స్పృహ కలిగింది. నాకంటే వ్యగ్రంగా ఆయన దుఃఖించాడు.

నన్ను దగ్గరికి తీసుకొని తల నిమురుతూ “నా చిట్టి తల్లి! రాక్షసుణ్ణి చంపి నిన్ను కాపాడి ప్రేమించగల సాహసి నీకు తారసపడి నప్పుడు ఈ శాపం ముగుస్తుంది. అప్పటి వరకూ ఆ పార్వతీ దేవినే సేవించు. అయితే ప్రతీ అష్టమి, అమావాస్యలనాడు రాక్షసుడు వచ్చి నిన్ను మ్రింగుతూనే ఉంటాడు. మరునాడు రాక్షసుడు నిన్ను బయటకు కక్కుతాడు” అని శాప విమోచనం అనుగ్రహించాడు.

ఆనాటి నుండీ, నేనీ ఆలయంలో దేవిని సేవిస్తూ, ఇక్కడే ఉంటున్నాను. ప్రతీ అష్టమికీ, అమావాస్యకీ రాక్షసుడి చేత మ్రింగబడుతూ, మర్నాడు విడుదల అవుతూ, నన్ను ఉద్దరించగల సాహస వీరుడి కోసం ఎదురు చూస్తూ గడుపుతున్నాను. ఇన్నాళ్ళకి నా పుణ్యం ఫలించి, నీవు వచ్చి రాక్షసుణ్ణి సంహరించి, నన్ను ఉద్దరించావు.

ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది. ఓ రాజా! నేను నీ సొత్తుని. నీవు నన్ను వివాహం చేసుకొని జీవితాన్ని ఆనందించ వచ్చు” అన్నది.

ఆమె మాటలకు వంశమార్గుడెంతో ఆనందించాడు. మృగనయని నిష్టగా తన గౌరీ వ్రతాన్ని పూర్తి చేసింది. కోవెలలోని దుర్గామాత ఎదుట వారిద్దరూ వివాహం చేసుకున్నారు. మృగనయనితో కలిసి రాజు వంశమార్గుడు, మంత్రి నీతి వర్ధనుణ్ణి, ఇతర పరివారాన్ని వెంట బెట్టుకుని తిరిగి వారణావతం చేరుకున్నారు. రాణి చంద్రవదన నూతన వధూవరులకు స్వాగత సత్కారాలు చేసింది.

నగరానికి చేరిన మరునాడు మంత్రి నీతి వర్ధనుడు ఉరిపోసుకుని చనిపోయాడు.

ఇదీ కథ!

అని చెప్పిన భేతాళుదు “ఓ విక్రమాదిత్య మహారాజా! ఇప్పుడు చెప్పు. నీతి వర్ధనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? మృగనయనిని పొందిన రాజుని చూచి ఈర్ష్య చెందాడా?” అని అడిగాడు.

విక్రమాదిత్యుడు అడ్డంగా తల నాడిస్తూ “భేతాళా! నీతి వర్ధనుడికి రాజు పట్ల గానీ, అతడి అదృష్టం పట్ల గానీ ఈర్ష్యాసూయల వంటివి ఉన్నట్లుగా తోచదు. బహుశః అతడు ఇలా ఆలోచించి ఉండవచ్చు. ‘చెడ్డవాడైన వ్యక్తికి నీతులు బోధించ రాదు. అది వ్యర్ధమైన పని. అదే విధంగా మిఠాయిలు ఇష్టపడే బాలుడికి మరిన్ని తీపి వస్తువులు ఈయరాదు. అది ఆ బాలుడి ఆరోగ్యానికి చేటు తెస్తుంది.

అయితే నేను… ‘అసలుకే స్త్రీ సౌందర్యం పట్ల మితిలేని మోహం గల వంశమార్గుడి’కి, ఉన్న పట్టమహిషి చాలదన్నట్లు మరొక సుందరిని కట్టబెట్టాను. ఇప్పుడు ఖచ్చితంగా రాజు మరింతగా సుఖ భోగాలలో తేలియాడతాడే తప్ప రాజ్య వ్యవహారాలు చూడడు.
దీనంతటికీ కారకుడను నేను గనుక ప్రజలు మళ్ళీ నన్ను నిందించక మానరు. ఇవేవీ ఆలోచించకుండా రాజుకు నేను ఏకాంత ద్వీపం గురించీ, అందులోని అందమైన యువతి మృగనయని గురించీ చెప్పి, రాజామెను వివాహమాడే పరిస్థితులు తెచ్చాను. ప్రజానింద భరింప శక్యం కానిది’ అనుకొన్నవాడై ఆత్మహత్యకు పాల్పడ్డాడు” అన్నాడు.

భేతాళుడు “భళా విక్రమాదిత్యా భళా! నీ సునిశిత మేధావిత్వానికి ఇవే నా జోతలు” అంటూ ప్రశంసిస్తూనే చప్పున మాయమై పోయాడు. చిరునవ్వు నవ్వుతూ విక్రమాదిత్యుడు మోదుగ చెట్టు వైపుకు దారి తీసాడు.

కథా విశ్లేషణ: ఈ కథలో విక్రమాదిత్యుడు… ‘మంత్రి నీతి వర్తనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోగలడు?’ అనే ప్రశ్నకు సునిశితమైన ఆలోచనతో జవాబిస్తాడు. ఒక వ్యక్తి ఒక పనిని నిర్వహించడానికి ఏయే ‘మోటివ్స్’ ఉండగలవో, వాటి గురించి ఎలా ఆలోచించాలో పిల్లలకి నేర్పే కథ ఇది!

దాదాపుగా ఇప్పుడు మన ఆధునిక నేరపరిశోధక విభాగాలు పనిచేసే తీరు ఇది! ఒక సంఘటన, ఓ దోపిడి, ఓ హత్య, ఓ నేరం… ఏది జరిగినా… ఎవరికి ఏ మోటివ్ ఉంది? ఏ పరిస్థితి ఇందుకు దారి తీసింది? – అనే కార్యకారణ సంబంధాన్ని ఛేదించే ఆలోచనా విధానం ఇది!

ఇలాంటి కథలు పిల్లలకి, ఆడుతూ పాడుతూ, చదువుతూ, వింటూనే, వాళ్ళకి తెలియకుండానే వారిలో సునిశిత ఆలోచనా శక్తిని ప్రేరేపిస్తాయి.
~~~~~~~~~

వంశ మార్గుడి కథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 42]

తర్వాతి ప్రయత్నంలో భేతాళుడు విక్రమాదిత్యుడికి మరొక కథ చెప్పటం ప్రారంభించాడు.

ఒకానొకప్పుడు వారణావతం అనే రాజ్యముండేది. దానికి రాజు వంశ మార్గుడు. [వంశానికే మార్గం చూపే వాడని అతడి పేరుకు అర్ధం.] అతడికి ఓ అందమైన భార్య ఉండేది. ఆమె పేరు చంద్రవదన. [చంద్రబింబం వంటి అందమైన ముఖం కలది అని అర్ధం.] పేరుకి తగ్గట్టే ఆమె అందాల భరిణె! అందానికి చందమామ!

రాజుకి భార్యంటే అమిత ప్రేమ, ఆకర్షణ. రాచకార్యాలన్నీ విడిచిపెట్టి దినమంతా ఆమెతోనే గడిపేవాడు.

ఆ రాజ్యపు మంత్రి పేరు నీతి వర్ధనుడు. [నీతిని వృద్ధి చేసే వాడని అర్ధం.] అతడెంతో మంచివాడు, తెలివైన వాడు. రాజు పరిపాలనా భారమంతా తనపై వదిలేసి అంతఃపురంలో రాణితో ఆటపాటలతో కాలం గడపటంతో మంత్రి రాజ్య భారమంతా వహించేవాడు.

నీతి నిజాయితీలతో, ధర్మబద్ధంగా పరిపాలన సాగేందుకు అన్ని విధాలా శ్రద్ధ తీసుకునేవాడు. కాలమిలా గడుస్తోంది. క్రమంగా ప్రజలు మంత్రిని శంకించ సాగారు. అతణ్ణి సందేహిస్తూ “ఈ మంత్రి చాలా తెలివైన వాడు. తన తెలివితేటలతో రాజుని ఏమార్చి, మరేవో విషయాలలో మునిగి తేలేటట్లు చేసాడు. ఆ నెపాన తానే అధికారమంతా చేతుల్లోకి తీసుకొని రాజ్యపాలన చేస్తున్నాడు” అని చాటుగా గుసగుసలు పోసాగారు.

ఆనోటా ఈ నోటా ఈ మాట మంత్రి చెవిన బడింది. అతడు దానికి చాలా మనస్తాపం చెందాడు. వికలమైన మనస్సుతో, దేశం విడిచి తీర్ధయాత్రకు బయలుదేరాడు. మంత్రి నీతి వర్ధనుడి దేశాటన గురించి ఇతర రాజోద్యోగులు వంశమార్గుడికి తెలియజేసారు.

రాజది విని విచారించాడు. ఇతర మంత్రులకూ, రాజోద్యోగులకూ పరిపాలనా బాధ్యతలు అప్పగించాడు.

నీతివర్ధనుడు పుణ్యక్షేత్రాలనీ, ఆయా ప్రదేశాల్లోని వింతలూ విశేషాలనీ చూస్తూ యాత్ర కొనసాగిస్తున్నాడు. మార్గవశాత్తూ అతడో రేవు పట్టణాన్ని చేరాడు. ఆ ఊళ్ళో ఓ వర్తక శ్రేష్ఠి ఉన్నాడు. అతడి తో మంత్రి నీతి వర్ధనుడికి చెలిమి కలిసింది.

ఇద్దరి అభిప్రాయాలూ, దృక్పధాలూ ఒకటి కావడంతో ఇరువురూ ఎన్నో విషయాలు చర్చిస్తూ హాయిగా కాలం గడపసాగారు. ఇద్దరూ తెలివైన వాళ్ళూ, పండితులూ కావటంతో, శాస్త్ర సాహిత్య విషయాలూ, కళాస్వాదనలూ, సత్సంగాలూ! రోజులు గడవసాగాయి.

రానూ రానూ వారి మైత్రి మరింత గాఢమైంది. ఓ రోజు… వర్తకుడు మంత్రితో “ఓ మిత్రుడా! నేను వ్యాపారనిమిత్తమై నా నౌకలో దేశాంతరం బయలు దేరనున్నాను. కొద్ది రోజులలోనే తిరిగి రాగలవాడను. నిన్ను వీడి వెళ్ళడానికి మనస్సొప్పడం లేదు. అయినా ఉదర పోషణార్ధం వృత్తి వ్యాపారాలు తప్పవు గదా! నేను తిరిగి వచ్చు వరకూ దయతో నీవిక్కడనే ఉండవలసిందిగా నా కోరిక” అన్నాడు.

నీతి వర్ధనుడు చిరునవ్వు నవ్వుతూ “ప్రియమిత్రుడా! నీవు లేని చోట నాకు మాత్రం పని యేమి ఉన్నది? ప్రపంచమున గల వింతలూ విడ్డూరాలూ చూడ వేడుక తోనే నేనిట్లు పుట్టిన భూమీ వదలి వచ్చితిని. కావున నీ నౌకలో నన్నూ గొనిపొమ్ము. ఇరువురమూ కలిసే వెళ్ళెదము గాక!” అన్నాడు.

వర్తక శ్రేష్ఠి ఇందుల కెంతో సంతోషించాడు. ఓ మంచి ముహుర్తాన నౌక బయలు దేరింది. నీలి సాగరపు అలలపై హుందాగా పయనిస్తోంది. సాగర సౌందర్యాన్ని, నీటి పక్షుల కోలాహలాన్ని, చల్లని గాలుల్నీ ఆనందిస్తూ మంత్రి తన ప్రియమిత్రుడితో మంచీ చెడు మాట్లాడుతూ కాలం గడుపుతున్నాడు.

దురదృష్టవశాత్తూ వాళ్ళ నౌక సముద్రపు తుఫానులో చిక్కుకుంది. సుడిగాలికి, రాకాసి అలలకీ ఆకులా అలల్లాడింది. నావికులెట్లో నౌకని నియంత్రంచ ప్రయత్నించసాగారు. తుఫాను తగ్గేటప్పటికి నౌక దారి తప్పి మరెటో పయనించింది.

నావికులకి అది పూర్తిగా కొత్త దారి కావటంతో, వారు కొంత వెఱగొంది, జాగరూకతతో నౌకని నడపసాగారు. అదృష్టం బాగుండి, భగవంతుడి కరుణ వారిపై ప్రసరించి, వారి నౌక ఓ దీవి చేరింది. నౌకకి లంగరు వేసారు. నావికులూ, సిబ్బంది దీవిలో చెట్లు నరికి నౌకలో వంట చెరకుకీ, ఇంధనానికీ ఏర్పాట్లు చేయదలిచారు. నౌక దిగి దీవిలో తిరగాడారు.

ఆ దీవిలో వారికొక ప్రాచీన ఆలయం కనిపించింది. అద్భుత శిల్ప సౌందర్యంతో చూడటానికి రెండు కళ్ళూ చాలననేంత అందంగా ఉంది. అయితే చిత్రంగా ఆ దేవాలయంలో గానీ, దీవిలో గానీ నరమానవ సంచారం లేదు. గర్భగుడి ఎదురుగా ఓ పెద్ద అశ్వత్ధ వృక్షం ఉంది. దాని క్రింద ఓ సౌందర్యవతి కూర్చొని ఉంది.

ఆలయమూ, ఆ యువతీ కూడా దేవలోకానికి చెందినట్లుగా ఉన్నారు తప్ప, భూలోకంలో అంతటి అందమైన దేవళం గానీ, అలాంటి యువతి గానీ ఉండరనిపించింది. దాంతో నావికులూ, నౌకా సిబ్బంది ఎంతో భీతిల్లారు. దేవతాలోకంలో అడుగుపెడితే శాపాలకు గురి కావచ్చొన్న వెరపుతో వడి వడిగా నౌక చేరి లంగరు తీసి, తెర చాపలెత్తి ప్రయాణం ప్రారంభించారు.

కొన్ని నాళ్ళకే తమ స్వస్థలానికి చేరారు. నీతి వర్ధనుడూ, అతడి మిత్రుడైన వర్తకుడూ కూడా వారితో పాటే తిరిగి వచ్చారు. ప్రయాణ ముచ్చట్లలో మరి మూడు నాలుగు దినాలు గడిచాయి. నీతి వర్ధనుడికి స్వదేశం మీదికి గాలి మళ్ళింది.

అతడు తన మిత్రుడైన వర్తక శ్రేష్ఠికి తన అభీష్టం చెప్పి వీడ్కొలు తీసుకున్నాడు. ప్రియమిత్రుడికి తగిన కానుకలిచ్చి ఆత్మీయంగా వీడ్కొలిచ్చాడు వర్తకశ్రేష్ఠి. నీతి వర్ధనుడు నేరుగా స్వదేశం బయలు దేరి కొన్నాళ్ళకు వారణావతం చేరాడు.

రాజు వంశమార్గుడతణ్ణి సాదరంగా ఆహ్వానించాడు.

“ఓ మంత్రీ! నీతి వర్ధనా! ఇన్నినాళ్ళూ నీవు క్షేమంగా ఉన్నావు కదా? ఎందుకు నీవు నన్నూ, మన దేశాన్నీ విడిచి వెళ్ళావు?” అని అడిగాడు.

నీతి వర్ధనుడు “మహారాజా! ప్రజలు నా గురించి ‘నేను మీకు బదులుగా రాజ్యాధికారం చలాయిస్తున్నాననీ, అందుకే మీరు ఇతరత్రా కాలం గడిపేటట్లుగా ప్రణాళికలు వేసాననీ’ నీలాపనిందలుగా అనుకోసాగారు. అందుచేత నాకు బాధ తోచింది. అందుకే మిమ్మల్నీ, దేశాన్నీ విడిచి తీర్ధయాత్రలకు పోయాను. దేశాటనంలో భాగంగా ఎక్కడెక్కడో తిరిగాను. ఎన్నెన్నో వింతలు చూసాను. అయితే నాకెక్కడా మనశ్శాంతి లభించలేదు. చివరికి మాతృభూమికి తిరిగి వచ్చాను” అన్నాడు.

రాజు వంశమార్గుడిది విని కొంత విచారించాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత “మంచిది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు, గతంలో వలె నీవు రాజ్యవ్యవహారాలు చక్క పెట్టగలవు. ఇంతకూ నీవు దేశాటనంలో ఏయే వింతలు చూచిన వాడవు. వినాలని కుతుహలంగా ఉంది. వివరించి చెప్పు” అన్నాడు.
~~~~~~

ఎవరు అత్యంత సుకుమారి! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 41]

విక్రమాదిత్యుడు అలసట గానీ, విసుగుదల గానీ తలచకుండా, మళ్ళీ మోదుగ వృక్షం చేరి భేతాళుని పట్టి బంధించి, భుజాన వేసుకుని బృహదారణ్య కేసి నడవసాగాడు. అది పదకొండవ ప్రయత్నమే అయినా ఆ మహారాజు జ్ఞాన శీలుడి కిచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చడంలో తొలిప్రయత్నమప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడో ఇప్పుడూ అంతే ఉత్సాహంగా ఉన్నాడు.

విక్రమాదిత్యుడు నడక ప్రారంభించగానే శవంలోని భేతాళుడు కథ ప్రారంభించాడు. “ఓ రాజాధిరాజా! ఇక కథ విను!” అంటూ కొనసాగించాడు.

పూర్వకాలంలో ఢిల్లీ నగరాన్ని వంశకేతుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడికి ముగ్గురు భార్యలు. రాణులు ముగ్గురూ కూడా సౌందర్యానికీ, సౌకుమార్యానికీ ప్రసిద్ధి చెందారు.

ఓనాటి సాయం సమయాన మహారాజు తన రెండవ భార్యతో రాజోద్యాన వనంలో చల్లగాలికి విహరిస్తున్నాడు. ఆ సమయంలో ఓ చిన్ని సీతాకోక చిలుక, రాణి సిగలోని పువ్వుల మీద వాలింది. దాని బరువుకి రాణికి శిరోభారం కలిగి స్పృహ తప్పి పడిపోయింది.

చందనం, శీతల పానీయాలతో దాసీ లామెను సేద తీర్చారు.

మరునాటి రాత్రి వేళ, మహారాజు మొదటి రాణితో రాజాంతఃపురపు ఉప్పరిగ (మేడ) మీద కూర్చుని కబుర్లు చెబుతున్నాడు. అది పున్నమి రాత్రి! వెన్నెల పుచ్చపువ్వులా పృధివంతా వెదజల్లుతోంది.

పూర్ణ చంద్రుని నిండు కాంతికి రాణి తెల్లని శరీరం మీద ఎర్రటి దద్దుర్లు లేచాయి. బాధతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దాస దాసీజనాలు, రాణిని అంతఃపుర మందిరం చేర్చి, చందనం, వట్టి వేళ్ళతో చికిత్స చేసి, శీతల పానీయాలతో సేద తీర్చారు.

ఆ మరునాటి మధ్యాహ్నం రాజు, మూడవ రాణితో కలిసి సంగీతాన్ని వింటూ ఆనందిస్తున్నాడు. సంగీత విద్వాంసుడు శ్రావ్యంగా పాడుతున్నాడు. ప్రక్క వాయిద్యాలతో ఇతర సంగీత కారులు అతడికి సహకరిస్తున్నారు. మంద్రంగా పరచుకున్న సంగీతం, శ్రోతలని ఏదో లోకాలలో విహరింప చేస్తోంది.

అంతలో ఎక్కడి నుండో…రోట్లో ధాన్యం పోసి రోకలితో దంచుతున్న చప్పుడు వినబడింది. ఆ రోకటి పోటు చప్పుడు వినగానే, మూడవ రాణి అరచేతుల్లో బొబ్బలెక్కి పోయాయి. బాధతో ఆమె చిన్నగా అరిచింది. ఆమె అరచేతులు చూస్తే… లేత గులాబి పువ్వుల్లా ఉన్న ఆమె అరచేతుల్లో కుంకుమపొడి చల్లినట్లుగా బొబ్బలు లేచాయి. బాధతో కన్నీరు తిరగగా, ఆమె స్పృహ తప్పి పడిపోయింది.

దాసీలు వచ్చి ఆమె అరచేతులకి వెన్నరాసి శైత్యోపచారాలు చేసారు.

భేతాళుడింత వరకూ కథ చెప్పి, “ఓ విక్రమాదిత్య రాజేంద్రా! ఈ ముగ్గురు రాణులలో, ఎవరు అత్యంత సుకుమారులు? వివరించి చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులు చిలిపి నవ్వుతో మెరుస్తుండగా, భేతాళుడి వైపు కోర చూపు చూస్తూ “భేతాళా! రెండవ రాణి కొప్పులో సీతాకోక చిలుక బరువుని అనుభవించి బాధకి స్పృహ తప్పిపోయింది. సీతా కోక చిలుక చిన్నదే అయినా, దాని భారం ఆ చిన్నది భరించలేక పోయింది. ఆమె అంతటి సుకుమారి!

అలాగే పెద్దరాణి చంద్రుని పున్నమి కాంతిని అనుభవించింది. అందరికీ చల్లని వెన్నెలగా తోచే నిండు పున్నమి వెలుగులోని వేడికి సొక్కి సోలి పోయింది. ఆమె సౌకుమార్యం అంతటిది.

అయితే మూడవ రాణి, ప్రత్యక్షంగా ఏ అనుభవమూ పొందకుండానే, దూరాన వేరెవరో దంచుతుండగా, ఆ శబ్దానికే చేతులు బొబ్బలెక్కి, స్పృహ తప్పి పోయింది. మొదటి ఇద్దరు రాణుల అనుభవం శారీరకమైతే, మూడవ రాణి అనుభవం మానసికం. కాబట్టి మూడవ రాణి సౌకుమార్యమే గొప్పది. ముగ్గురిలోకి మూడవ రాణి అత్యంత సుకుమారి” అన్నాడు.

భేతాళుడూ నవ్వుతూ విక్రమాదిత్యుడి భుజం మీద నుండి మాయమై మళ్ళీ చెట్టేక్కేసాడు.
~~~~~~~

భర్త, మోహితుడు, దొంగ – ఎవరు గొప్ప! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 40]

దొంగ ఓ క్షణం ఆలోచనలో పడ్డాడు. ఏమనుకున్నాడో ఏమో ఆమెను వెళ్ళనిచ్చాడు. అక్కడే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు.

మదన సేన నేరుగా చారు దత్తుడి ఇంటికి వెళ్ళింది. ఆమెని చూసి నిర్ఘాంత పడిన చారు దత్తుడితో “చారు దత్తా! నా మునుపటి ప్రమాణాన్ని నిలబెట్టుకుంటూ నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నువ్వు నా సౌందర్యాన్ని ఆనందించవచ్చు” అంది.

చారుదత్తుడు మరింతగా చేష్టులుడిగి పోయాడు. మరుక్షణం పశ్చాత్తాప పడ్డాడు. అతడు తనలో ‘ఈ యువతి, మదన సేన సామాన్యురాలు కాదు. ఈమె నిజాయితీ గలది, శీలవతి కూడాను. ఈమె పట్ల నేను చెడుగా ఆలోచించ కూడదు. ఈమె పతివ్రత’ అనుకున్నాడు.

అతడు ఆమె పాదల మీద వాలి క్షమార్పణ అడిగాడు. భర్తతో కలిసి నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో జీవించాల్సిందిగా దీవించి, వీడ్కొలిచ్చాడు. చారుదత్తుడు చూపిన పరిణతికీ, వాత్సల్యానికీ మదన సేన ఎంతో సంతోషించింది. అక్కడి నుండి వెనుదిరిగింది.

నేరుగా దొంగ ఎదురుచూస్తున్న చోటికి వచ్చింది. ఆమె తిరిగి వస్తుందో రాదో అనే అనుమానంతో అసహనంగా ఉన్న దొంగ, ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు, నమ్మశక్యం గానట్లు చూస్తున్న దొంగకి ఆమె జరిగిందంతా చెప్పింది. దొంగ అది విని నిరుత్తరు డయ్యాడు.

‘ఈ యువతి నిజంగా సామాన్యురాలు కాదు. పారిపోగల అవకాశం ఉన్నా కూడా ఇచ్చిన మాట కోసం తిరిగి వచ్చింది. ఈమె పాతివ్రత్యం కలది. కాబట్టే ఈమెపట్ల పాప చింతనని వదలిపెట్టాడు చారుదత్తుడు. ఈమెకు కీడు చేసినట్లయితే భగవంతుడు నన్ను క్షమించడు. ఈమె ఇప్పుడు నిస్సహాయంగా నాకు లొంగిపోయినా ఈమె కన్నీరైనా నన్ను శపించ గలదు’ అనుకున్నాడు.

పశ్చాత్తాపంతో ఆమె పాదాలపై బడ్డాడు. “అమ్మా! మన్నించు. నీవు నా సోదరీ తుల్యవు.” అంటూ క్షమాపణ కోరుకున్నాడు. అన్న వలె ఆదరించి, తన దగ్గరున్న ఆభరణాలని ఆమెకు కట్నంగా ఇచ్చి వీడ్కొలిచ్చాడు.

ఆమె సంతోషంగా భర్త దగ్గరికి తిరిగి వచ్చింది. జరిగిన విషయాలన్నీ భర్తకి పూసగుచ్చినట్లుగా చెప్పింది. తను నమ్మిన సత్యం తనను కాపాడినందుకు ఆమె ముఖం దీప్తిమంతంగా ఉంది. మంచితనాన్ని ఆస్వాదించిన ఆమె కళ్ళు కోటి చంద్రుల కాంతిని గుమ్మరిస్తున్నాయి.

అట్టి యువతీ రత్నాన్ని భార్యగా పొందిన తన అదృష్టానికి సముద్ర దత్తుడు ఎంతగానో మురిసిపోయాడు. ఆమెను దగ్గరికి తీసుకుని ఆశీర్వదించాడు. భార్యాభర్తలిద్దరూ చిరకాలం సుఖ సంతోషాలతో జీవించారు.

భేతాళుడు ఇంత వరకూ కథ చెప్పి, విక్రమాదిత్యుడితో “ఓ రాజాధిరాజా! మదన సేన భర్త సముద్రదత్తుడూ, ఆమె పై మోహం చెందిన చారుదత్తుడు, దొంగ – వీరందరిలో ఎవరు గొప్ప వారు? చెప్పు” అని అన్నాడు.

విక్రమార్కుడు గిరజాల జుట్టు ఊగుతుండగా సన్నగా నవ్వుతూ “భేతాళా విను! అందరిలోకి దొంగే గొప్పవాడు. మదన సేన భర్త సముద్ర దత్తుడు భార్య నిజాయితీ మీద నమ్మకంతో ఆమెకు అనుమతి ఇచ్చాడు. అతడి నమ్మకం నిజమైంది.
చారుదత్తుడు ఆమె నిజాయితీకి, సత్యవ్రతానికి బద్దుడై పశ్చాత్తాప్తుడైనాడు. అయితే దొంగ ప్రాధమికంగా చోరవృత్తిలో ఉన్నవాడు, దయా దాక్షిణ్యాలు లేని కౄరవృత్తి అది. అతడు యధేచ్ఛగా మదన సేన నగలతో పాటు, ఆమె పై అత్యాచారం జరిపి అయినా సరే, ఆమె అందాన్ని పొందగల అవకాశం ఉన్నవాడు.

అయినా గానీ, ఆమె పాతివ్రత్యానికి భయపడి, నిజాయితీకి అధీనుడై, పశ్చాత్తాపంతో చలించాడు. కాబట్టే ఆమెని స్వంత సోదరి వలె ఆదరించి పంపించాడు. తానెలా ప్రవర్తించినా, దొంగ కాబట్టి తన ఆచూకీ ఎవరికీ తెలియదు. అదే చారుదత్తుడికైతే అప్పటికి కోరికకి ప్రలోభపడినా, తర్వాత అపరాధానికి బాధ్యుడయ్యే అవకాశం ఉంది. దొంగకి అలాంటి ప్రమాదం లేదు. అయినా స్వయంగా తప్పు చేయడం నుండి విరమించు కున్నాడు. కాబట్టి దొంగే గొప్పవాడు” అన్నాడు.

విక్రమాదిత్యుడి సమాధానం వినగానే భేతాళుడు బిగ్గరగా నవ్వుతూ తిరిగి మోదుగ చెట్టు ఎక్కేసాడు.

కథా విశ్లేషణ: ఈ కథలో విక్రమాదిత్యుడు చూపించే తర్కం చక్కగా ఉంటుంది. ఒకే పని చేసిన వ్యక్తుల్ని వారి పరిస్థితుల్ని బట్టి విశ్లేషించడం పిల్లల్ని బాగా ఆకర్షిస్తుంది. ఇలాంటి కథల వలన వారిలో కుతూహలం కొద్దీ పఠనాసక్తి పెరుగుతుంది. వివేచనా శక్తి, విశ్లేషణా సామర్ధ్యం పెరుగుతాయి.

కట్టుబాటు వీడని మదన సేన! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 39]

మరోసారి విక్రమాదిత్యుడు భేతాళుని పట్టి బంధించి, బృహదారణ్యం వైపు నడవసాగాడు. భేతాళుడు ఎప్పటి లాగే కథ ప్రారంభించాడు. ఇది భేతాళుడు చెప్పిన పదవ కథ. భేతాళుడు “విక్రమార్క మహారాజా! విను” అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు ‘మగధ’ అనే రాజ్యం ఉండేది. దాని రాజధాని పేరు కోసల నగరం. మగధకు రాజు ధీర వీరుడు. అతడెంతో పరిపాలనా దక్షత గలవాడు.

ఆ నగరంలో ధనదత్తుడనే భాగ్యవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతడికి సంతానం లేదు. దాంతో అతడు శివుని గురించి భక్తి శ్రద్దలతో తపమాచరించాడు. మహాదేవుడి వరంతో అతడికొక కుమారుడు, కుమార్తె కలిగారు. కుమారుడికి ‘ధర్మదత్తుడ’నీ, కుమార్తెకు ‘మదన సేన’ అనీ పేర్లు పెట్టుకుని, ధనగుప్తుడు వాళ్ళిద్దరినీ అపురూపంగా పెంచసాగాడు.

పిల్లలిద్దరూ పెరిగి పెద్దయ్యారు. ధర్మదత్తుడు గురుకులంలో చేరి విద్యాబుద్దులు నేర్చాడు. అతడికొక స్నేహితుడున్నాడు. అతడి పేరు చారు దత్తుడు. ధర్మదత్తుడూ, చారు దత్తుడూ ఎంతో ప్రాణ మిత్రులైనందున, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. ‘ఒకే కంచం, ఒకే మంచం’ అన్నంతగా విడిపోని స్నేహంతో మెలిగే వారు.

ధనదత్తుడి కుమార్తె మదనసేన యుక్త వయస్కురాలైంది. ఆమె చాలా చక్కనిది. సుగుణ శీలి. ఒక నాడామె తలారా స్నానం చేసి జారుగా వేసిన జడతో, స్నేహితురాళ్ళతో కలిసి ఇంటి తోటలో బంతాట ఆడుకుంటోంది. గాలికి ఆమె ముంగురు లూగుతున్నాయి. పరుగెత్తి బంతిని పట్టుకుంటూ ఆమె ఆడుతుంటే, మెరుపు తీగ మెలికలు తిరిగినట్లుంది. ఆమె కిలకిల నవ్వులు చిలుకా కోకిలలు కబుర్లు చెబుతున్నట్లున్నాయి.

ఆ సమయంలో చారు దత్తుడు ధర్మదత్తుడితో కలిసి వచ్చాడు. మదన సేనను చూసి చారుదత్తుడు ముగ్ధుడైనాడు. ఆమె అందం, నవ్వు, మాట తీరు అతడికి మతి పోగొట్టాయి. మరునాడు అతడామెని తోటలో ఒంటరిగా కలుసుకున్నాడు.

ఆర్తితో “మదన సేనా! నీవు సౌందర్యవతివి. నీ అందాన్ని మరిచి పోలేకున్నాను. నీ మీద ప్రేమ, విరహంతో నిదుర రాకున్నది. దయ చేసి నన్ను అంగీకరించు.” అంటూ ప్రాధేయ పడ్డాడు.

మదన సేన తలెత్తి అతడి వైపు చూసింది. ఓ క్షణం మౌనంగా ఉంది. తర్వాత “చారు దత్తా! నా తల్లిదండ్రులు నన్ను సముద్ర దత్తుడికిచ్చి వివాహం చేయ నిశ్చయించారు. నేను వాగ్దత్తని. అది నీకూ తెలుసనుకుంటున్నాను. అయినా నీవు నా ముందు ప్రేమ ప్రసంగం తెచ్చావు. కానీ నేను కట్టుబాటు మీర గల దానిని కాను” అంది.

మదన సేనపై కోరికతో వివేకం కోల్పోయిన చారుదత్తుడు అక్కడే నిలబడి పోయాడు. ఆమె వైపు జాలిగా, అభ్యర్ధనగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.

మదన సేన “చారు దత్తా! నిన్ను నిరాశ పరచటం నా అభిమతం కాదు. త్వరలో నా వివాహం జరగనుంది. నా వివాహమైన మరునాడు, తొలిరాత్రికి పూర్వమే, నేను నీ వద్దకు రాగలను. నీ కోరిక తీర్చగల దానను. ఇదే నా ప్రమాణం. అప్పటి వరకూ నేను నా కట్టుబాటును దాటను. దయ చేసి వెళ్ళు” అంది.

చేసేది లేక చారు దత్తుడు వెనుదిరిగి పోయాడు. అప్పటి నుండి వారి ఇంటికి రాకపోకలు తగ్గించాడు. ధర్మదత్తుడెంత అడిగినా ఏదీ చెప్పలేదు.

కొన్ని రోజులు గడిచాయి. మదన సేన వివాహం సముద్ర దత్తుడితో అతి వైభవంగా జరిగింది. అందమైన భార్యని చూసుకుని సముద్ర దత్తుడెంతో మురిసిపోయాడు. తొలి రాత్రి నూతన వధూవరులిద్దరూ పడక గదికి చేరారు.

పూల సౌరభాలతో, వెన్నెల సోయగాలతో… పోటీ పడుతూ, మదన సేన శరీర గంధమూ, సౌందర్యమూ అతిశయిస్తున్నాయి. సముద్ర దత్తుడు ప్రేమగా భార్యను చేరబోయాడు. ఆమె అతణ్ణి ఆపుతూ “ఓ నా ప్రియపతీ! నాదొక ప్రార్ధన! దయ యుంచి వినుడు. మన వివాహానికి పూర్వం, నేను నా యింట నుండగా ఒక యువకుడు నా దగ్గరి కొచ్చాడు. నా మీద ప్రేమాతిశయాన్ని వివరించాడు.

నా వివాహమైన తొలి రాత్రి, నేనతడి కోరిక తీర్చగలనని ప్రమాణం చేసి ఉన్నాను. నా కట్టుబాటును దాటలేనని, కన్యాత్వమును వీడ జాలనని ఆ విధంగా ప్రమాణం చేసాను. ఇప్పుడా ప్రమాణాన్ని తృణీకరించుట ధర్మము కాదని మీకు చెబుతున్నాను. ఆపై మీ ఇచ్ఛ ఎట్లయిన, అట్లు నిర్ణయించి, నాకు ఆనతి నీయగలరు” అని విన్నవించింది.

ఇదంతా విని సుముద్ర దత్తుడు ఆశ్చర్య పోయాడు. ‘లోకంలో ఇట్టి కోరికలు కోరు వారుండవచ్చు గానీ, ఇట్టి ప్రమాణములు చేయు వారుందురా? ఈమె గుట్టు చప్పుడు గాక, ఏ తీరుగ నైనా ప్రవర్తించ వచ్చు. అట్లు చేయక, నా అనుమతి అడుగుతున్నది. ఈమె లోకంలో ఉండే ఇతర సాధారణ యువతుల వంటిది కాదు. ఈమెకు మోసపు బుద్ధి లేదు. ఈమెను విశ్వసించ దగు” అనుకున్నాడు.

మదన సేన వైపు చూస్తూ “మంచిది. పోయి రా!” అన్నాడు. ఆ విధంగా మదన సేన భర్త అనుమతి తీసుకుని, ఆ అర్ధరాత్రి సమయాన చారుదత్తుడి ఇంటికి బయలు దేరింది.

దారిలో ఒక గజదొంగ ఆమెను చూశాడు. ఆమె అందాన్ని చూసి అబ్బురపడ్డాడు. దారి కడ్డం వచ్చి ఆమె నాపాడు. తనతో గడపవలసిందిగా కోరాడు. మదన సేన చేతులు జోడిస్తూ “అయ్యా! ఎందుకు నా సాంగత్యాన్ని కోరుతావు? దాని తో ఒనగూడే ప్రయోజన మేముంది? నీవు దొంగవు. చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. నా ఈ నగలన్నీ తీసికొని, నన్ను విడిచి పెట్టు. విలువైన ఈ నగలన్నిటితో సంతోషంగా నీ దారిన నీవు పో” అంది.

దొంగ విలాసంగా నవ్వి “ఓ యువతీ రత్నమా! నీవంటి సౌందర్యవతితో గడపటం అన్నిటి కంటే విలువైనది” అన్నాడు. మదన సేన నిస్సహాయంగా నిలబడింది. ఓ క్షణం తర్వాత, తన కథంతా అతడికి వివరించి చెప్పింది.

“ఇప్పుడు నేను చారు దత్తుడికిచ్చిన మాట నిలుపుకునేందుకై వెళ్తున్నాను. దయ చేసి నన్ను వెళ్ళ నివ్వు. తిరిగి వచ్చేటప్పుడు నీ దగ్గరకు రాగలను” అంది.

~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes