RSS
Wecome to my Blog, enjoy reading :)

భేతాళుని కథలో భాగవత గాథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 53]

ఇన్ని ప్రయత్నాలతో విక్రమాదిత్యుడు విసుగు చెందలేదు. పైగా భేతాళుడు చెబుతున్న కథల పట్ల తడవ తడవకీ మరింత కుతూహల పడసాగాడు. దాంతో పందొమ్మిదో మారు మోదుగ చెట్టెక్కి భేతాళుడున్న శవాన్ని దించి, భుజాన పెట్టుకుని బృహదారణ్యం వైపు నడక సాగించాడు. భేతాళుడూ ఊరుకోలేదు. మరో కథ ప్రారంభించాడు.

“విక్రమాదిత్య ధరణీ పాలా! విను” అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు పద్మపురం అనే నగరముండేది. దానికి రాజు జీమూత వాహనుడు. (నిజానికి ఇది భాగవతంలోని కథ. భట్టి విక్రమార్క కథల్లోకి చొప్పించబడి ఉండాలి.) ఆనాటి రాజులందరిలో జీమూత వాహనుడు ఉత్తమోత్తముడు. అతడికి సుసంపన్నమైన సైన్యం ఉండేది. సుశిక్షితులైన అధికార యంత్రాంగం ఉండేది.

అయినా గానీ.... రాజు, ప్రచ్ఛన్న వేషంలో స్వయంగా రాజ్యమంతటా పర్యటించి, ప్రజల బాగోగులు తెలుసుకుంటూ, వారిని కన్నబిడ్డల్లా కాపాడుతూ ఉండేవాడు. వేగులు తెచ్చే సమాచారంతో, తను స్వయంగా తెలుసుకున్న విషయాలను సరిపోల్చుకుని, పాలనా పరిస్థితులనీ, ప్రజల స్థితిగతులనూ అంచనా వేసుకునేవాడు.

అందుకే తరచుగా మారువేషంలో నగర పర్యటన చేసేవాడు.

ఆ రోజులలో పద్మపురం ప్రక్కనే ఓ చిన్నపాటి అడవి ఉండేది. అందులో చాలా పాములుండేవి. ప్రతీ రోజూ గరుడుడు వచ్చి పాముల్ని చంపి తినేవాడు. మహా విష్ణువు వాహనమైన గరుడుడు మహాబల సంపన్నుడు. అలాంటి గరుత్మంతుడు ప్రతీ రోజూ, ఏమాత్రం కనికరం లేకుండా, కనబడిన పాముల్ని కనబడినట్లు పట్టుకుని చంపి తినే వాడు.

ఆ కారణంనా ఆ చిట్టడివిలోని పాములన్ని భయోతాత్పతంలో పడి ఉన్నాయి. ఓ రోజు పాములన్నీ ఓ చోట సమావేశమైనాయి. తమ మృత్యు ప్రమాదం గురించి చర్చించుకున్నాయి. చివరికి తామంతా కలిసి గరుడుడికి ఓ విన్నపం చేయాలని నిశ్చయించుకున్నాయి. ఆపైన గరుడుడి రాక కోసం ఎదురు చూసాయి. అంతలో గరుడుడు రానే వచ్చాడు.

పాములన్నీ కలిసి ఏక కంఠంతో “హే గరుడా! మాదో ప్రార్ధన. దయతో ఆలకించు” అన్నాయి. గరుడుడు “ఏమిటి?” అన్నాడు. పాములు “గరుడా! నీవు మహావిష్ణువు వాహనుడవు. ఆ దేవదేవుని నీ బలమైన రెక్కల మధ్య మోసి మహిమాన్వితుడవైనావు. మేము నీ సేవకులం. నీకు ఆహారంగా అనుగ్రహించబడిన వాళ్ళం.

మా ఈ చిన్న పాముల గుంపు, గుట్టుగా ఈ చిట్టడవిలో బ్రతుకుతూ ఉంది. ప్రతీ రోజూ నీవు వచ్చి, కనబడిన పాముని కనబడినట్లు చంపి తింటున్నావు. దాంతో మేం దినదినం ప్రాణ గండంగా జీవిస్తున్నాం. ప్రతి దినమూ మృత్యువు మా వాకిట నిలిచే ఉంటోంది. నిత్యం భయంతో బ్రతుకు లీడుస్తున్నాం.

బ్రతికి ఉన్న క్షణాలైనా ప్రశాంతత లేకుండా పోయింది. దానితో మొత్తంగా మా జాతే సర్వనాశనం అయ్యే స్థితిలో ఉంది. ఆవల నీకూ ఆహార లభ్యతలో లోపం ఏర్పడగలదు. కావున మాది ఓ చిన్న విన్నపం. దయతో ఆలకించ వలసింది.

ప్రతీ దినం నీకు ఆహారంగా, మేం ఇంటి కొకరంగా వంతు లేసుకుని రోజు కొకరంగా వస్తాము. ఈ వంతుల పద్ధతిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ జవదాటం. దయ చేసి నీవు, నీకు ఆనాటికి ఆహారమయ్యే వంతు గల పామును తప్ప, ఇతర వాటి జోలికి రానట్లయితే మేం బ్రతికిన నాలుగు నాళ్ళయినా ప్రశాంతంగా, భయరహితంగా బ్రతక గలము.

ఇదీ మా ప్రార్ధన! ఓ గరుడా! దయతో అంగీకరించగలవు. నీవు బలాఢ్యుడవు. మేము అల్పులము. కరుణతో చూడు!” అని ప్రార్ధించాయి.

గరుడుడు వాటి ప్రార్ధన మన్నించాడు. ఆనాటి నుండి గరుడుడు, విచ్చల విడిగా పాముల్ని వేటాడి, చంపి తినడం మాని వేసాడు. ఆ రోజుటి వంతు ప్రకారం, తనకి ఆహారంగా వచ్చే పాముని మాత్రమే భుజించి వెళ్ళిపోసాగాడు. రోజులు గడుస్తున్నాయి.

ఒక రోజు.... ఆనాటి వంతుగా శంఖచూడుడు అనే పాము వంతు వచ్చింది. అది దాని తల్లికి ఏకైక సంతానం. ఆ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడ్వసాగింది. సరిగ్గా ఆనాడే జీమూత వాహనుడు తన రాజ్యపు మంచి చెడులను పర్యవేక్షించేందుకు నగర పర్యటనకి వచ్చాడు. నగరానికి దాపులనే ఉన్న ఈ చిట్టడివిలో, ఈ పాము తల్లి దుఃఖం చూసి, ఆయన చలించి పోయాడు.

“తల్లీ! ఎందుకిలా దుఃఖిస్తున్నావు?” అని అడిగాడు.

ఆ తల్లి తన శోక కారణాన్ని వివరించి చెప్పింది. జీమూత వాహనుడు ఆమెను ఓదార్చి, ఆమె పుత్రుణ్ణి కాపాడగలనని అభయమిచ్చాడు. అప్పటికే గరుడుడికి ఆహారంగా కొండకొమ్ముకి చేరిన శంఖచూడుణ్ణి వెదుక్కుంటూ వెళ్ళి కలిసాడు.

“శంఖచూడా! నీప్రాణం కాపాడతానని నీ తల్లికి మాట ఇచ్చాను. ఈ రోజు గరుడునికి ఆహారమయ్యే వంతు నీదని నాకు తెలుసు. నీ బదులుగా నేను గరుడునికి ఆహారమౌతాను. నీవు ఇంటికి వెళ్ళి, నీ తల్లికి సంతోషం కలిగించు” అన్నాడు.

దానికి శంఖచూడుడు “ఓ రాజా! ఈ లోకానికి నా జీవితం వల్ల ఒనగూడే ప్రయోజనమేమిటి? నేను అల్ప జీవిని. అంతేగాక విష ప్రాణిని. నీవు జీవించి ఉన్నట్లయితే.... మన దేశానికెంతో మేలు చేకూర గలదు. నీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. నీవు స్వార్ధపూరితుడైన పాలకుడవు కావు. నీతి పరుడవు. అట్టి ఉత్తముడవైన నీవు, నా వంటి అల్పప్రాణికి బదులుగా మరణించటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అందుచేత నీవన్న దానికి నేను సమ్మతించను” అన్నాడు.

జీమూత వాహనుడు.... శంఖచూడుడి నిబ్బరానికి, ఉన్నత వ్యక్తిత్వానికి ముచ్చట పడ్డాడు. దాంతో, సర్పబాలుడికి రాజు “నేను నీ తల్లికి, నిన్ను కాపాడతానని ప్రమాణం చేసాను. దాన్ని అతిక్రమించ లేను. కావున నీవు ఇంటికెళ్ళు. గరుడిడికి నేను ఆహారమౌతాను” అంటూ నచ్చ జెప్ప జూసాడు.

ఈ విధంగా వారిద్దరూ వాదించుకుంటుండగానే, గరుడుడు అక్కడికి వచ్చాడు. అందునా ఆకలి గొని ఉన్నాడు. జీమూత వాహనుడు గరుడినితో

“ఓ గరుడా! పక్షీంద్రా! ఈ రోజు నీకు అహారం కావలసిన వంతు ఈ శంఖచూడునిది. అయితే దయ చేసి, అతడిని విడిచిపెట్టు. బదులుగా నన్ను నీ ఆహారంగా గ్రహించు. ఇతడు తన తల్లికి ఒకే ఒక్క బిడ్డడు” అన్నాడు చేతులు జోడిస్తూ!

ఆ మాటలకు గరుడుడు ఆశ్చర్యపోయాడు. పరోపకారానికై శరీర త్యాగానికి సిద్దపడిన జీమూత వాహనుణ్ణి చూసి, గరుడునికి ముచ్చట కలిగింది. వాత్సల్యంగా అతడి వైపు చూస్తూ “ఓ రాజా! నీ మంచితనం, త్యాగనిరతి చూసి నాకెంతో సంతోషం కలిగింది. పరోపకారివైన నీ పట్ల నేనెంతో అపేక్ష పొందాను. నీవేది కోరినా అనుగ్రహిస్తాను. చెప్పు. నీకేది కోరిక” అని అడిగాడు.

జీమూత వాహనుడు గరుడునికి నమస్కరిస్తూ “ఓ గరుడా! విష్ణు వాహనా! నా కొరకై నేనేది నిన్ను కోరను. అయితే ఈ రోజు నుండి నీవీ అడవిలోని పాములని చంపి తినకు. ఇదే నేను నిన్ను కోరే వరం!” అన్నాడు.

గరుడుడు జీమూత వాహనుడిని అనుగ్రహించాడు. నాటి నుండి ఆ అడవికి రావడం మాని వేసాడు. అప్పటి నుండీ ఆ అడవిలోని పాములన్ని నిర్భయంగా బ్రతికాయి.

ఇదీ కథ!

భేతాళుడు ఇంత వరకూ కథ చెప్పి “ఓ విక్రమాదిత్య రాజేంద్రా! శంఖచూడుడు, జీమూత వాహనుడు, గరుడుడు.... ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప?” అని అడిగాడు.

విక్రమాదిత్యుడు “భేతాళా! విను! జీమూత వాహనుడు ఆ దేశానికి రాజు. రాజుగా తన రాజ్యంలోని వారి క్షేమం చూడటం, ఆశ్రితులందరి ప్రాణాలు కాపాడటం అతడి బాధ్యత. అందుచేత, శంఖచూడుడికి బదులుగా తాను గరుడుడికి ఆహారమవ్వాలని, జీమూత వాహనుడు భావించడం సబబే! అది అతడి బాధ్యతే తప్ప వేరు కాదు.

అదే విధంగా ఆ రాజ్య నివాసిగా శంఖచూడుడి బాధ్యత రాజును సేవించడం! అందుచేత జీమూత వాహనుడి ప్రతిపాదనని తిరస్కరించి, గరుడునికి తానే ఆహారం కావాలనుకోవటంలో శంఖచూడుడు చూపినదీ, బాధ్యతే తప్ప వేరే కాదు.

అయితే.... గరుడునికి పాములు భగవంతుడిచ్చిన ఆహారం. అంతేగాక, గరుడుడు శంఖచూడుడు వంటి పాముల కన్నా, జీమూత వాహనుడి వంటి రాజుల కన్నా బలవంతుడు. అతడికి ఎదురు లేదు. అయినా.... రాజుకి ప్రమాణం చేసిన రీత్యా, అడవిలోని పాముల జోలికిక రాలేదు. కాబట్టి గరుడుడే గొప్ప!” అన్నాడు.

ఆ విధంగా మౌనం భంగమైంది. భేతాళుని శవం మాయమైంది.

కథా విశ్లేషణ: ఈ కథ భాగవతంలోనిది. జానపదుల కల్పనలో నుండి విక్రమాదిత్యుడికి భేతాళుడు చెప్పిన కథగా పరిణమించి ఉంటుంది. అయితే ఎవరు గొప్ప అనే ప్రశ్ననూ, దానికి విక్రమాదిత్యుడి జవాబుగా..... చక్కని తర్కాన్ని అందించే ఈ కథ, పిల్లలనే గాక పెద్దలనీ అలరిస్తుంది.
~~~~~~~

పిల్లనిచ్చి పెళ్ళి చేయటం అంటే ఏమిటి? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 52]

కొత్తగా వచ్చిన సుకేశిని పట్ల యువరాణి అమిత ప్రేమతో, స్నేహంతో ఉంటోందనీ, ఇద్దరూ ఒకరొనొకరు వీడనంత మైత్రితో మెలుగు తున్నారనీ అందరూ అనుకున్నారు. రోజులిలా గడుస్తున్నాయి.

ఇంతలో.... ఒక రోజు, పొరుగు రాజ్యపు యువరాజు, కార్తికేయుణ్ణి చూడవచ్చాడు. అతడిది ఆర్ధికంగా, సైన్యపరంగా కార్తికేయుడి కంటే బలమైన రాజ్యం. అతడు కార్తికేయుణ్ణి భగవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని అర్ధించాడు. పైకి అది అర్ధింపులా కనబడినా, అందులో ఉన్నది ఆజ్ఞే!

అయితే ఇతడు కౄరుడు. అందుచేత కార్తికేయుడికి, తన కుమార్తెను అతడికిచ్చి వివాహం చేయటం ఇష్టం లేదు. అది పైకి చెబితే..... ఇతడు వియ్యం వదిలి కయ్యానికి కాలు దువ్వగలడు. ఎలా ఈ విపత్తు దాటటం? రాజుకేమీ పాలుపోలేదు.

దిగులుగా కార్తికేయుడు, భగవతి మందిరానికి వచ్చాడు. అతడికి కుమార్తె ప్రక్కనే సుకేశిని (మారు వేషంలో ఉన్న ధనస్వామి) కనబడింది. ఒక్కసారిగా రాజు బుర్రలో ఉపాయం మెరిసింది. తన కూతురికి బదులుగా, సుకేశిని నిచ్చి, పొరుగు దేశపు యువరాజుకిచ్చి వివాహం జరిపించాడు.

తన కూతురు అందమైనదని తెలుసు గానీ ఎలా ఉంటుందో తెలియదు గనుక అందులో ఏ ప్రమాదమూ లేదనుకున్నాడు రాజు. అదీగాక, సుకేశిని తండ్రి అయినా, ఇందుకు కోపగించుకోడనుకున్నాడు.

పెళ్ళి అయ్యాక..... చీరె సారెలిచ్చి వీడ్కొలిచ్చేసాడు. సుకేశిని రూపంలో ఉన్న ధనస్వామికీ, భగవతికీ ముంచుకొచ్చిన ఈ సంఘటనతో, ఏం చెయ్యాలో బోధపడలేదు. ఇంతలోనే సుకేశిని(ధనస్వామి) భర్తతో అత్తవారింటికి పోవలసి వచ్చింది. దాంతో దారిలో, పెళ్ళి బృందంలో నుండి తప్పించుకున్నాడు. ఆడవేషం తీసేసి పరుగందుకున్నాడు. ఎలాగోలాగ, ఎవరూ చూడకుండానే గండం గడిచి బయట పడ్డాడు.

అటుప్రక్క, ఏమయ్యిందో ఏమోననే గుండె గుబిల్లుతో ఉంది భగవతి.

ఇంతలో లోకదేవుడు, తమ పూర్వపు ప్రణాళిక ప్రకారం, రాజు కార్తికేయుణ్ణి కలుసుకున్నాడు. వెంట చూడచక్కని ఓ యువకుణ్ణి తీసుకు పోయాడు. రాజుతో “రాజోత్తమా! ఆ కాశీ విశ్వేశ్వరుడి కరుణతో, నీ సహకారంతో, సుఖంగా కాశీయాత్ర ముగించుకు వచ్చాను. ఇదిగో ఈతడు నా మిత్రుడి శిష్యుడు. నా కుమార్తె సుకేశిని ని ఇతడికిచ్చి వివాహం చేయ తలచి వచ్చాను. ఇన్నాళ్ళూ నా బిడ్డను సంరక్షించినందుకు ఎంతగానో కృతజ్ఞణ్ణి. దయతో నా కుమార్తెను నాతో పంపగలరు” అన్నాడు. ఆ విధంగా ధనస్వామిని రాజమందిరం నుండి గుట్టుగా బయటకు తీసుకు వెళ్ళాలన్నది, వాళ్ళు పూర్వం రచించుకున్న ప్రణాళిక.

రాజిది ఊహించలేదు. ముందు పొరుగు రాజుతో యుద్దం తప్పించుకోవటమే ధ్యాసగా సుకేశిని తో వివాహం జరిపించేసాడు. మెల్లిగా సమస్య పరిష్కరించు కోవచ్చనుకున్నాడు. ఇప్పుడీ మునితో అసత్యమాడ సాహసించలేక పోయాడు. ముని శపించగలడని రాజు భయం.

దానితో ముని పాదాల మీద పడి “స్వామీ! దయ చేసి నన్ను క్షమించండి. మీ అనుమతి లేకుండా, మీ కుమార్తె వివాహం పొరుగు దేశపు యువరాజుతో జరిపించేసాను. అతడితో నా కుమార్తె వివాహం తప్పించేందుకు మీ కుమార్తె నిచ్చి పెళ్ళి చేసాను. క్షమించండి” అని ప్రాధేయపడ్డాడు.

ఇది ఏమాత్రం ఊహించని లోకదేవుడు, నివ్వెరపడి, నోటమాట రాక నిలబడి పోయాడు. మునికి కోపం వచ్చిందను కొని, రాజు వణికి పోయాడు. మరుక్షణం “మీ కుమార్తెకు బదులుగా, ఇదిగీ నా కుమార్తెను ధారబోస్తాను. భగవతికి ఈ యువకుడితో పెళ్ళి జరిపిస్తాను. నన్ను మన్నించండి” అంటూ... మారుమాటకు తావివ్వకుండా, లోకదేవుడు వెంట దెచ్చిన యువకుడికి భగవతినిచ్చి వివాహం జరిపించాడు.

దాంతో ఇక ఏ విషయమూ మాట్లాడేందుకు లోకదేవుడు అమితంగా భయపడి పోయాడు. ఏమాత్రం ఊహించని సంఘటనలు, వరుసగా, వేగంగా జరిగి పోతున్నాయయ్యె! రాజు కన్నీటితో తన కుమార్తెకు వీడ్కొలిచ్చి ‘విధి వ్రాతకు తల వొగ్గక ఎవరికైనా తప్పదు గదా!’ అని సరిపెట్టుకుని, దుఃఖాన్ని దిగమింగుకున్నాడు.

కిమ్మనకుండా లోకదేవుడు, తన మిత్రుడి శిష్యుడిగా చెప్పుకున్న యువకుణ్ణీ, భగవతినీ వెంట బెట్టుకుని, తన ఇంటికి బయలు దేరాడు. దారిలో ధనస్వామి వచ్చి వాళ్ళని కలిసాడు.

ధనస్వామి ఆ యువకుడితో “భగవతీ నేనూ.... పరస్పరం ప్రేమించుకున్నాం. ఆమె నన్ను వరించింది. నేనామెని వరించాను. ఆమె నా భార్య. కాబట్టి ఆమెను నాకు అప్పగించు” అన్నాడు.

దానికా యువకుడు “ఈమె తండ్రి ఈమెను నాకిచ్చి పెళ్ళి చేసాడు. వేదమంత్రాల సాక్షిగా, రాజమందిరంలో, ఈమె తండ్రి ఈమెను నాకు ధారపోసాడు. కాబట్టి ఈమె నా భార్య. నేను విడిచి పెట్టను” అన్నాడు.

భేతాళుడింత వరకూ కథ చెప్పి “విక్రమార్క ధరణీ పాలా! యువరాణి భగవతి ఎవరికి చెందుతుందో చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు చిరునవ్వు నవ్వాడు. ఆ అమవాస్య నిశిలో, నిండు చంద్రుడిలా అతడి మోము వెలిగి పోయింది. మంద్ర గంభీర స్వరంతో “నా అభిప్రాయంలో వివాహం అంటే.... ‘ఇదిగో ఇక నుండీ ఈ యువతీ ఈ యువకుడూ ఒకరికొకరు చెందుతారు’ అని ప్రకటన! వారిద్దరూ కలిసి జీవయాత్ర సాగిస్తారనే ప్రకటన! అటువంటి వివాహం, అందరి చేతా అంగీకరింపబడుతుంది, అధికృతమైనది.

ఆ విధంగా, రాజు కార్తికేయుడు, తన కుమార్తె భగవతిని, ఆ యువకుడి కిచ్చి పెళ్ళి చేసాడు. పదుగురి ఎదుటా ‘వారి జీవితాలు కలిసి సాగనున్నాయని’ ఆ విధంగా ప్రకటించాడు. భగవతీ, ధనస్వామీ ఒకరినొకరు ప్రేమించి ఉండవచ్చు. ఒండొరుల సాన్నిహిత్యాన్ని ఆనందించి ఉండొచ్చు.

అయితే వారి అనుబంధం ప్రకటితమైనది కాదు. అది రహస్యమై కొనసాగింది. అది పాపంతో కలగలిసి పోయింది. కనీసం తన వివాహ సందర్భంలోనైనా, భగవతి తమ అనుబంధాన్ని ప్రకటించి ఉన్నా, ధనస్వామి సుకేశినిగా తన వివాహం పొరుగు దేశపు యువరాజుతో నిర్వహింపబడుతున్నప్పుడు ప్రకటించి ఉన్నా, అది కొంత సరియైన బాట తొక్కి ఉండేది.

కాబట్టి ఇప్పుడు భగవతీ ధనస్వాముల అనుబంధం అక్రమమైనది గానే తలంచాలి. కనుక, తండ్రి పెళ్ళి చేసి యిచ్చిన యువకుడికే ఆమె దక్కాలి. అదే న్యాయం!” అన్నాడు.

విక్రమార్క మహారాజు ఈ విధంగా సమాధానం చెప్పగానే భేతాళుడు మోదంతో తల ఊపి చెట్టెక్కేసాడు.
~~~~~~~~

యువరాణి ప్రేమాయణం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 51]

పునః ప్రయత్నాల వల్ల విక్రమాదిత్యుడు అలసిపోలేదు. సరికదా, రెట్టించిన ఉత్సాహంతో, భేతాళుడు చెప్పే కథల పట్ల ఆసక్తితో...మరోసారి మోదుగ చెట్టెక్కి, శవాన్ని దించి భుజాన వేసుకొని, బృహదారణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడూ అలిసి పోలేదు. మరో కథ, పద్దెనిమిదో కథ చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు.

“ఓ రాజోత్తమా! పరాక్రమ శాలీ! ధైర్యశీలీ! విను...” అంటూ ఇలా కొనసాగించాడు.

ఒకప్పుడు గోపాలపురం అనే నగరం ఉండేది. అదెంతో సువిశాలమైనది, సుందరమైనది. దానికి రాజు కార్తికేయుడు. అతడా నగరాన్ని నిజాయితీగా పరిపాలిస్తుండేవాడు. దాంతో అతడు ప్రజల కెంతో ప్రీతిపాత్రుడయ్యాడు.

అతడికొక కుమార్తె ఉంది. ఆమె పేరు భగవతి. ఆమె యుక్తవయస్సులో ఉంది. సౌందర్యంతో శోభిల్లుతూ ఉంది. ప్రజలామెని గని ‘అందాల గని’ అని పొగుడుతూ ఉండేవాళ్ళు. ఆటపాటల్లో సంగీత సాహిత్యాల్లో ఆమెది అందె వేసిన చెయ్యి.

ఓనాటి సాయం సంధ్య వేళ.... భగవతి తలారా స్నానం చేసి, తన పొడవాటి అందమైన కురులని ఆర్చుకుంటున్నది. వేళ్ళతో అలవోకగా చిక్కులు తీస్తూ సంజ కెంజాయ రంగులని ఆస్వాదిస్తున్నది. పిల్లగాలికి ఆ పిల్ల కురులూగుతూ హొయలొలికిస్తున్నాయి.

ఆ సమయంలో.... రాజవీధిలో ఓ బ్రాహ్మణ యువకుడు పోతున్నాడు. అతడి పేరు ధనస్వామి. అతడెంతో అందంగా ఉన్నాడు. గిరజాల జుట్టు, కోరమీసం, తెల్లని దేహచ్ఛాయ... మూర్తీభవించిన మన్మధుడిలా ఉన్నాడు. యధాలాపంగా అతడు భగవతిని చూసాడు. సౌందర్యాధిదేవతలా ఉన్న యువరాణిని చూసి అతడు అబ్బురపడ్డాడు.

సరిగ్గా ఆ క్షణమే.... భగవతీ అతణ్ణి చూసింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా తళుక్కుమన్నాయి. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. ఒకరొకరిపై చూపుల తూపులు విసురు కున్నారు. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉదయించిందని ఇద్దరికీ అర్ధమైంది. కానీ ఎలా కలుసుకోగలరు?

భగవతి రాచకన్య. ధనస్వామి సాధారణ బ్రాహ్మణ యువకుడు. అలాంటి చోట, ధనస్వామి యువరాణినెలా కలుసుకోగలడు? దాంతో ఇద్దరూ భారమైన హృదయాలతో, దీనంగా చూస్తూ ఊర్కున్నారు.

అయితే ధనస్వామి ఇంటికి వెళ్ళినా క్షణం కుదురుగా ఉండలేకపోయాడు. నిద్రాహారాలు పట్టలేదు. ప్రతీక్షణం, పగలూ రాత్రి, అదే థ్యాసగా యువరాణి భగవతిని ఎలా కలుసుకోవాలా అని ఆలోచించసాగాడు. చివరికి అతడో నిర్ణయానికి వచ్చాడు.

ఆ ప్రకారం ధనస్వామి, తన మిత్రుడైన లోకదేవుణ్ణి కలుసుకున్నాడు. లోకదేవుడు చాలా తెలివైన వాడు. యుక్తి పరుడు. నేర్పరి. ధనస్వామి లోకదేవుడికి విషయమంతా చెప్పి ‘యువరాణిని కలుసుకునేందుకు ఉపాయమేదైనా చెప్పి పుణ్యం కట్టుకో’మన్నాడు.

లోకదేవుడు మిత్రుడి కోరిక విని మ్రాన్పడి పోయాడు. తేరుకున్నాక “మిత్రమా, ధనస్వామి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమి మాట్లాడుతున్నావు? ఎక్కడ నీవు? ఎక్కడ యువరాణి? తేడా వస్తే కుత్తుకలు తెగిపోగలవు సుమా!” అని హెచ్చరించాడు. దాంతో ఖిన్నుడైన ధనస్వామి ముఖం చూసి లోకదేవుడికి జాలి కలిగింది. మిత్రుడి యందు ప్రేమాతిశయంతో.... సాహసానికి పూనుకున్నవాడై “ప్రియమిత్రుడా! నీ కోరిక తీర్చుట కష్టసాధ్యం. ప్రమాదభరితం కూడా! అయినా నీవు నా ప్రాణసఖుడవు. నీ కోసం నేను పూనుకుంటున్నాను. నీకో ఉపాయం చెబుతాను. నువ్వు చింతించకు” అన్నాడు.

దాంతో ధనస్వామికి ఎంతో ఊరట కలిగింది. బాగా ఆలోచించి లోకదేవుడు ఓ ఉపాయం చెప్పాడు. ఆ ప్రకారం, లోకదేవుడు ఓ మునిలా వేషం ధరించాడు. ధనస్వామికి అందమైన యువతి వేషం వేసాడు.

ఇద్దరూ రాజు కార్తికేయుడి సభకు వెళ్ళారు. లోకదేవుడు రాజుకు నమస్కరించి “మహారాజా! నీకు సర్వసుఖాలూ కలుగుగాక! భగవంతుడు నీకు ఆయురారోగ్య భోగభాగ్యాలూ ఇచ్చుగాక!” అని దీవించాడు.

రాజతణ్ణి గౌరవించి, అతిధి సత్కారాలు ఆచరించాడు. లోకదేవుడు “రాజోత్తమా! నేను కాశీ యాత్రకు పోవుచున్నాను. ఇదిగో ఈ పిల్ల నా కుమార్తె సుకేశిని. (అందమైన మంచి శిరోజాలు కలది అని ఆ పేరుకు అర్ధం.) తల్లి లేని ఈ బిడ్డని అల్లారు ముద్దుగా పెంచాను. ఇప్పుడు ఈ అందమైన యవ్వనవతిని వెంటబెట్టుకుని, కాశీ యాత్ర వంటి దూరప్రయాణం చెయ్యలేను. అది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి నిన్ను సాయమర్ధించ వచ్చాను. నేను తిరిగి వచ్చు వరకూ, నాబిడ్డను నీకు అప్పగిస్తాను. ఆమె రక్షణ భారం వహించవలసిందిగా నా ప్రార్ధన” అన్నారు.

రాజందుకు సంతోషంగా సమ్మతించాడు. సుకేశిని రూపంలో ఉన్నది స్త్రీ కాదనీ, పురుషుడనీ తెలియని రాజు, ఆమెని తన కుమార్తె భగవతి మందిరానికి పంపించాడు. సమ వయస్కులవ్వటం చేత, ఇద్దరూ స్నేహంగా మెలగ గలరని అతడనుకున్నాడు.

భగవతి మందిరం చేరిన సుకేశిని వేషధారణలో ఉన్న ధన స్వామి, యువరాణితో ఏకాంత సమయం కోసం వేచి ఉన్నాడు. ఓ రోజు ఎవరూ లేకుండా చూసుకుని, ధనస్వామి ‘తాను స్త్రీ కాదనీ, సుకేశినిగా ఉన్న తాను పురుషుడననీ, తన పేరు ధనస్వామి అనీ’ వివరించాడు.

అది విని భగవతి ఆశ్చర్యంతో కొయ్యబారి పోయింది. ఆమెకతడి మీద ప్రేమ ఉప్పొంగింది. కానీ అది పైకి కనబడనివ్వకుండా, కోపం నటిస్తూ “ఏమిటీ? ఎంత ధైర్యం నీకు, ఈ విధంగా రాజమందిరంలోకి రావటానికి? నేనంత చులకనగా తోచానా నీకు? ఇదంతా మా తండ్రికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చూడు, నేను నిన్ను ఏం చేస్తానో?” అంది.

అయితే బ్రాహ్మణ యువకుడు ధనస్వామి అందుకు బెదరలేదు. చెదరని చిరునవ్వుతో “ప్రేయసీ! నీ మీది ప్రేమకొద్దీ నేనిలా ప్రాణాలకు తెగించాను, అంతే తప్ప మరిక దేని కోసమూ కాదు. తొలి చూపులోనే నీవూ నాపై వలపు కలిగి ఉన్నావని నాకు తెలుసు. కాబట్టి నన్ను బెదిరించ ప్రయత్నించకు. అది వృధా.

ప్రేమతో నన్ను అంగీకరించు. ఎందుకిదంతా మీ తండ్రికి చెప్పేందుకు ఆతృత చూపిస్తావు? నీవు నన్ను రక్షించగలవు. నన్ను కాపాడేందుకు నీవే సమర్ధరాలవు. నేను ప్రాణాధికంగా నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నిన్ను చేరేందుకు ఇంత ప్రమాదానికైనా పాలుపడ్డాను. ఇక ఇప్పుడు నన్ను రక్షిస్తావో లేక శిక్షిస్తావో నీదే నిర్ణయం. నీవేది చేసినా నాకు ఇష్టమే! నీ ప్రేమ పొందలేనప్పుడు రాజు చేతిలో మరణం పొందడమైనా నాకు ఆనందమే!” అన్నాడు.

ధనస్వామి తన కొరకు అంత సాహసానికి పూనుకోవటం, ప్రాణాలకు తెగించటం.... భగవతికి ఎంతో ఆనందం కలిగించింది. ఆపైన అతడి తీయని మాటలకీ తెగింపుకీ మరింత ముగ్దురాలైంది. కిలకిలా నవ్వుతూ “ప్రియా! నేను చేయగలిగింది ఇదే!” అంటూ అతడి చెక్కిలిపై ముద్దు పెట్టుకుంది. ధనస్వామి పరవశించి పోయాడు.

అది మొదలు ఏకాంతంగా ఇద్దరూ ఒండొకరి సాన్నిహిత్యాన్ని ఆనందించ సాగారు. ఇది ఇతరులెవరు కనిపెట్ట లేక పోయారు.

దొంగల నాయకుడు చచ్చేముందు ఎందుకు నవ్వి, ఏడ్చాడు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 50]

కళ్ళెదుట దొంగల నాయకుడి మరణాన్ని చూసిన రత్నావళి విహ్వలచిత్త అయ్యింది. అప్పటి కప్పుడు ఆ శశ్మాన వాటికలో చితి పేర్చుకుంది. దొంగల నాయకుడి తలను చేతబట్టి, చితి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. మండుతున్న అగ్నికీలలకి నమస్కరించి నిప్పుల్లోకి దూకింది.

ఆకాశం నుండి, జరుగుతున్నదంతా గమనిస్తున్నారు జగదాంబ, పరమేశ్వరులు. మాత పార్వతికి రత్నావళిని చూసి జాలి కలిగింది. పతి వంక సాభిప్రాయంగా చూసిందామె. అనుమతిస్తున్నట్లుగా నవ్వాడు జంగమ దేవర. మరుక్షణం పార్వతీ పరమేశ్వరులు, రత్నావళి ముందు ప్రత్యక్షమయ్యారు.

అంతే! నిప్పుల గుండం పూల రాశిలా మారి పోయింది.

పార్వతీదేవి “అమ్మాయీ! అంత సాహసం చేయకు. ఏం కావాలో కోరుకో!” అంది ప్రేమగా! ఆది దంపతులని చూసి రత్నావళి పరవశించి పోయింది. సంతోషాంతరంగంతో చేతులెత్తి నమస్కరిస్తూ, వారిని స్తుతించింది. “తండ్రీ గిరిశా! తల్లీ గిరిజా దేవి! మీరు జగత్తుకే తల్లిదండ్రులు. నామీద మీకు కరుణ ఉంటే నా మనోనాయకుడయిన ఈ దొంగల నాయకుడిని సజీవుణ్ణి చెయ్యండి. అతణ్ణి నేను పతిగా వరించాను. నామీద దయ యుంచి, నాకు పతి భిక్ష పెట్టండి. ఇది తప్ప నాకు మరో కోరిక లేదు” అని ప్రార్ధించింది.

శివపార్వతులు రత్నావళి పట్టుదలనీ, నిజాయితీ గల ప్రేమనీ చూసి ముచ్చట పడ్డారు. ‘తధాస్తు’ అన్నారు. వారిచ్చిన వర ప్రభావంతో, చచ్చిపడి ఉన్న దొంగల నాయకుడు పునర్జీవితుడైనాడు. నిద్ర నుండి లేచినట్లుగా కసిగంద కుండా ఉన్నాడు. వారిద్దరినీ ఆశీర్వదించి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యారు.

వీరకేశుడు, అతడి భార్యా, ఇదంతా చూసి ఆనందంతో తబ్బిబ్బయ్యారు. తల నరకబడిన దొంగ పునర్జీవితుడు కావటం చూసి, ప్రజలు ఆశ్చర్యం పట్టలేక పోయారు. అందరూ రత్నావళినీ, ఆమె ప్రేమ బలాన్నీ ఎంతగానో ప్రశంసించారు.

వీరకేశుడు, కూతురూ అల్లుడిని ఇంటికి తీసికెళ్ళి, బంధుమిత్రులందరినీ ఆహ్వానించి, రత్నావళిని దొంగల నాయకుడికిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

ఈ సమాచారమంతా వేగుల ద్వారా విన్న రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. రత్నావళి పట్టుదలనీ, నిజమైన ప్రేమనీ చూసి వెరగు పడ్డాడు. ఆమె స్వచ్ఛమైన ప్రేమ, భక్తి తలచి, పార్వతీ పరమేశ్వరులనే మెప్పించిన ఆమె పట్టుదలని చూసీ, వారిని గౌరవించటం తన విధి అనుకున్నాడు.

వీరకేశుణ్ణి దొంగల నాయకుణ్ణి సభకు పిలిపించి ఆదరించాడు. దొంగల నాయకుణ్ణి తన సైన్యానికి అధిపతిగా నియమించి సత్కరించాడు. దొంగల నాయకుడు కూడా, జరిగిందంతా చూసి చాలా మధనపడ్డాడు. ప్రేమ, పట్టుదల, భక్తి, మంచి చెడు... వంటి మానవీయ విలువలు అర్ధం చేసుకుని, అంకిత భావంతో పని చేయాలని నిశ్చయించుకున్నాడు. కొన్నాళ్ళకే ఎంతో సమర్ధుడైన, ధైర్యశాలి అయిన సైన్యాధిపతిగా ప్రజలందరి మన్ననా పొందాడు.

ఇదీ కథ!

భేతాళుడు ఈ కథ చెప్పి “ఓ విక్రమాదిత్య మహీపాలా! విన్నావు కదా కథ!? ఇప్పుడు చెప్పు. భటులతడి మరణ శిక్ష అమలు చేయబోయే ముందు, దొంగల నాయకుడు ముందు క్షణం నవ్వాడు. ఆ తర్వాత ఏడ్చాడు? ఎందుకలా చేసాడో చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు మృదుగంభీర స్వరంతో “భేతాళా! దొంగల నాయకుడు రత్నావళిని చూసి నవ్వాడు. తన గురించి ఏమీ తెలియకుండా, దొంగనని తెలిసీ, ఇంతటి సౌందర్యవతి తనని ప్రేమించి ఏడ్చుట చూసి అతనికి నవ్వు వచ్చింది. ఆమె తల్లిదండ్రుల దుఃఖం చూసి మనస్సు కరిగింది. అందుకోసమే మొదట నవ్వి పిదప ఏడ్చాడు” అన్నాడు.

భేతాళుడు గలగల నవ్వుతూ “మౌనభంగమైంది మహారాజా! అందుకో నా పరుగు” అంటూ మాయమై మోదుగ చెట్టెక్కాడు.

కథా విశ్లేషణ: ‘కట్టె కొట్టె తెచ్చె’ అన్నట్లుగా, ఈ కథని క్లుప్తంగా చెప్పేస్తే చాలా సామాన్యమైన కథ. రాజు దొంగని బంధించాడు, వ్యాపారి కూతురు ప్రేమించింది, దేవిని మెప్పించి బ్రతికించుకుంది – ఇలా! కానీ కథనంలో ‘పోతురాజు’ అంటూ... రాజూ దొంగల మధ్య సంభాషణ, వీరకేశుడూ రత్నావళిల మధ్య సంభాషణ, వీరకేశుడూ రాజుల మధ్య సంభాషణ... ఎంతో చక్కగా ఆసక్తికరంగా ఉంటాయి.

ఇలాంటి కథలు... కథనం ఎంతో ఆసక్తికరంగా ఉండి, చక్కని సంభాషణా శైలిని పిల్లలకు నేర్పుతాయి. ఎంతో కాలం, డబ్బూ వెచ్చించి నేర్చుకునే ‘కమ్యూనికేషన్ స్కిల్స్’ని అలవోకగా నేర్పే కథలివి.

మన పెద్దలు మనకందించిన వరాల మూటలివి.

~~~~~~~~~

తల తెగి పడిన దొంగ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 49]

రాజభటులు దొంగల నాయకుడికి ఎర్రని దుస్తులు వేసి, మెడలో వేపదండ వేసారు. నుదుట పెద్ద బొట్టు తీర్చి, బండి మీది కెక్కించి, బండి స్తంభానికి కట్టి ఊరంతా డప్పు మోగిస్తూ ఊరేగించ సాగారు. అలాంటి శిక్షలు చూసిన ప్రజలలో నేరప్రవృత్తి మాసిపోతుందని రాజలా ఆజ్ఞాపించాడు.

వీధులలో కోలాహలంగా సాగుతున్న ఆ ఊరేగింపుని, ప్రజలంతా గుంపులుగా కూడి కుతూహలంతో తిలకించసాగారు. ఊరేగింపు వీరకేశుడు వీధిలోకి ప్రవేశించింది. రత్నావళి తన గది గవాక్షం నుండి దొంగలనాయకుణ్ణి చూసింది.

అప్పటికి ఆమె అవివాహితగా ఉండి పోవాలన్న ఆకాంక్షతో ఎన్నో పెళ్ళి సంబంధాలను తిరస్కరించి ఉంది. అలాంటి రత్నావళి… దొంగల నాయకుణ్ణి చూసిన వేళా విశేషమో, లేక అతడి రూప విలాసమో గానీ, తొలిక్షణంలోనే అతనిపై ప్రేమలో పడింది.

మరుక్షణం ఆమె తన తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తి “తండ్రీ! ఇప్పుడు సైనికులు వధ్యశిలకు తీసుకువెళ్తున్న దొంగల నాయకుణ్ణి చూశారు కదా! అతడే నా మనో నాయకుడు. పెళ్ళి చేసుకుంటే అతణ్ణే చేసుకుంటాను. మీరు అతణ్ణి ఎలాగైనా విడుదల చేయించి, నన్నిచ్చి వివాహం చేయండి. లేనట్లయితే నాకు మరణం తప్ప శరణ్యం లేదు” అంది.

ఇది విని ఒక్కసారిగా ఆమె తల్లిదండ్రులు మ్రాన్పడి పోయారు. రత్నావళికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. వీరకేశుడు “నా చిట్టి తల్లి! ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు? ఈ ప్రపంచంలో మరణశిక్ష పడిన దొంగని ఎవరైనా వరిస్తారా? తల్లీ! నువ్వు ఓ దొంగని వివాహమాడితే… ప్రజలు, బంధుమిత్రులూ అందరూ మమ్మల్నీ దొంగలనే నిందించరా?

అలాంటి వివాహంతో మన కుటుంబ గౌరవం, వంశగౌరవం కూడా నాశన మౌతాయి. నీ ప్రియమైన తల్లిదండ్రులుగా, మేము లోక నిందకి గురౌతాము. కనుక నువ్వు! ఓ దొంగని పెళ్ళాడాలని ఆలోచించటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అందమైన, సిరిసంపదలు గల, విద్యాబుద్దులు గల, గౌరవనీయమైన కుటుంబాల నుండి వచ్చిన ఎందరో యువకులు, నిన్నుపెళ్ళాడ గోరి వచ్చారు. వారందరినీ తిరస్కరించిన నువ్వు, ఇలా ఓ దొంగని వరించటం సరైనదేనా? ఆలోచించు తల్లీ!” అని నెత్తీ నోరూ కొట్టుకున్నారు.

కానీ వీరకేశుడి సొదంతా రత్నావళి ముందు, చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లయ్యింది. తల్లిదండ్రుల మాటలు ఆమె చెవికెక్కలేదు. ఇక ఆ వాణిజ్యవేత్త వీరకేశుడు ఏం చెయ్యగలడు? కుమార్తె పట్టుదల తెలిసిన వీరకేశుడు దిగులు చెందాడు. ఏం చెయ్యడానికీ తోచలేదు. భార్యతో సంప్రదించాడు. ఏదో ఒకటి చేయక తప్పదు.

అతడు, అపురూపమైన మణిమాణిక్యాలు, రత్నఖచిత అభరణాల వంటి విలువైన కానుకలు తీసుకొని, రాజ దర్శనానికి వెళ్ళాడు.

రాజు పాదాల ముందు తాను తెచ్చిన కానుకలుంచి నమస్కరించాడు. ఏమిటన్నట్లుగా చూసాడు రాజు. వీరకేశుడు “ఓ రాజా! నీవు గొప్పవాడివి. ప్రజారంజకుడవి. రాజులలో పేరెన్నిక గలవాడివి. నీకు వేనవేల నమస్కారాలు. ఇంతకాలం ప్రజలని బాధించిన దొంగలని పట్టుకున్న వీరుడవు నీవు. చోరనాయకుడికి నీవు మరణశిక్ష విధించావు.

అయితే ఓ రాజా! నా యందు దయ యుంచి, అతణ్ణి విడుదల చేయాల్సిందిగా ఆజ్ఞాపించు. వధ్యశిలకు గొనిపోతున్న దొంగల నాయకుణ్ణి చూసి, నా కుమార్తె ప్రేమలో పడింది. అతడిని పెళ్ళాడ గోరుతున్నది.

నాకున్నది ఈ కుమార్తె ఒక్కతే! అదీ మా వివాహమైన తర్వాత, ఎన్నో ఏళ్ళకు, ఎన్నో నోములు పూజలూ చేయగా జన్మించిన బిడ్డ! అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ! ఇప్పటి వరకూ ఎవరినీ పెళ్ళాడనని భీష్మించుకు కూర్చున్నది. ఇప్పుడీ దొంగని వరించినది. లేనట్లయితే మరణిస్తానని పంతం పట్టింది.

మహారాజా! ఆమె మరణిస్తే నేనూ నా భార్యా కూడా బ్రతక లేం. ఇలాంటి నిస్సహాయ స్థితిలో, నిన్ను చూడ వచ్చాను. దయయుంచి ఆ దొంగని విడుదల చెయ్యి. ఇది నా ప్రార్ధన!” అన్నాడు కన్నీటితో!

రాజది చూసి మొదట ఆశ్చర్యపోయాడు. విషయం అర్ధమయ్యాక ఆగ్రహోదగ్రుడయ్యాడు. అగ్గి మీద గుగ్గిలంలా చిటపట లాడుతూ “ఏయ్! వణిక శ్రేష్టీ! నీకేమైనా పిచ్చి ఎత్తినదా? ఎందుకు నీవు, ఆ దొంగల నాయకుణ్ణి కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకిలా కట్టు కథలల్లి నన్ను నమ్మించ జూస్తున్నావు? బహుశః నువ్వు ఇంకా పెద్ద దొంగవై ఉంటావు. అందుకే మరణశిక్ష పడ్డ దొంగని కాపాడ యత్నిస్తున్నావు.

బహుశః తాను దొంగిలించిన సొత్తు నుండి నీకు బంగారం, రత్నాలు, ధనం నీకు వాటాగా ఇస్తున్నాడు కాబోలు! లేకపోతే నీ కూతుర్ని సాకుగా చూపి దొంగని కాపాడే సాహసం చేస్తావా?

నాకు మీ వ్యాపార టక్కుటమారాలన్నీ తెలుసు. తక్షణం ఇక్కడి నుండి వెళ్ళు! ఇంకొక్క క్షణం నువ్విక్కడే ఉంటే, ఆ దొంగకి పడ్డ శిక్ష వంటిదే, నీకు కూడా పడుతుంది. ఫో! తక్షణం ఇక్కడి నుండి ఫో!” అన్నాడు.

రాజు కళ్ళ నుండి నిప్పులు రాలుతున్నట్లనిపించింది వీరకేశుడికి. భయంతో కాళ్ళు తడబడుతుండగా ఇంటికి పరిగెత్తుకు వచ్చాడు. జరిగిందంతా కూతురికి చెప్పి, మనస్సు మార్చుకోమన్నాడు. అది విన్న రత్నావళి మొదలు నరికిన అరటి చెట్టులా నేలపై కూలిపోయింది. క్షణాల్లో ఆమెకి స్పృహ తప్పింది.

తల్లిదండ్రులు, దాసీలు ఆమెకి శైత్యోపచారాలు చేసారు. కొద్ది క్షణాలకి సేద తీరి పైకి లేచింది. మరుక్షణం వీధిలోకి ఉరికింది. గుండెలు బాదుకుంటూ, బిగ్గరగా రోదిస్తూ, దొంగని ఊరేగిస్తున్న చోటికి చేరింది. అప్పటికే ఆమె జుట్టు ముడి ఊడింది. విరబోసుకున్న జుట్టుతో, చెదిరిన బొట్టుతో, చెమటలూ కన్నీరు వరదై కారుతున్న ముఖంతో, ఆమె మూర్తీభవించిన శోక దేవతలా ఉంది.

కుమార్తె స్థితి చూసి గుండె చెరువైన వీరకేశుడు, అతడి భార్య ఇంటిలో ఉండలేక పోయారు. వాళ్ళు కూడా బిగ్గరగా ఏడుస్తూ, ఆమె వెనక బడ్డారు.

ఇదంతా ఊళ్ళో పాకింది. ప్రజలెంతో ఆశ్చర్యపోయారు. గొప్ప కుతుహలం, ఆసక్తితో వారి చుట్టూ గుమిగుడారు. ముందు డప్పులు, వెనక దొంగని కట్టిన బండి, ఆ వెనక శోకిస్తూ రత్నవళి, ఆమె తల్లిదండ్రులు! మెల్లిగా ఊరేగింపు వధ్యశిలకు చేరింది. ఊరి జనమంతా అక్కడే పోగయ్యింది.

భటులు దొంగని బండి దింపి, వధ్యశిల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అతడి తలను వధ్యశిలపై ఆన్చి పరుండ బెట్టారు. అప్పటికే వాళ్ళూ వీళ్ళూ అనుకుంటున్న మాటల్ని బట్టి, దొంగల నాయకుడికి విషయం అర్ధమైంది. అతడి చూపు రత్నావళి మీద నిలిచింది. ఆ పిల్ల సౌందర్యం, శోకం చూసి అతడికి ఆశ్చర్యం కలిగింది.

ఆమెనీ, ఆమె తల్లిదండ్రుల్ని ఒక్కక్షణం తదేకంగా చూసాడు. క్రమంగా అతడి చూపు రత్నావళి మీద నిలిచి పోయింది. ఒక్కక్షణం బిగ్గరగా పగలబడి నవ్వాడు. మరుక్షణం గట్టిగా ఏడ్చాడు. ఉత్తరక్షణం అతడి తల తెగి పడింది. భటులు తమ కర్తవ్యాన్ని తాము నిర్వహించారు.
~~~~~~~~~~~~~~~

దొంగపై తొలిప్రేమ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 48]

యధాప్రకారం విక్రమార్కుడు మోదుగ చెట్టు చేరి, భేతాళుని బంధించి నడక ప్రారంభించాడు. భేతాళుడు కథ ప్రారంభించాడు.

“ఓ విక్రమాదిత్య మహారాజా! నీ పట్టుదల చూడ ముచ్చటగా ఉంది. శ్రమ తెలియకుండా ఈ కథ విను!” అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు అయోధ్యా నగరం అనే రాజ్యం ఉండేది. ఆ నగరంలో ఒక ప్రముఖ వణిక శ్రేష్ఠి ఉండేవాడు. అతడి పేరు వీరకేశుడు. అతడికొక కుమార్తె ఉంది. ఆమె పేరు రత్నావళి. ఆ పిల్ల చాలా చక్కనిది. ప్రజలామెని చూసి దేవకన్యలలో కూడా అంత అందమైన అమ్మాయి ఉండదని ప్రశంసించే వాళ్ళు.

అందంతో పాటు రత్నావళి వినయవిధేయతలూ, దయ వంటి సద్గుణాలూ కలది. కళాభినివేశం కలది.

ఆమె అందచందాల గురించీ, సుగుణ సంపద గురించీ విన్న చాలామంది యువకులు, ఆమెను వివాహమాడాలని ఉవ్విళ్ళూరే వారు. వారిలో కొందరు రత్నావళి తల్లిదండ్రులని సంప్రదించారు. వారిలో యోగ్యుడైన ఒక యువకుడికిచ్చి రత్నావళి వివాహం జరిపించాలని వీరకేశుడు, అతడి భార్య నిర్ణయించారు.

అది విని రత్నావళి, తల్లిదండ్రుల వద్దకు చేరి ‘తాను ఎవరినీ వివాహమాడననీ, తనకు వివాహేచ్ఛ లేదనీ’ తెగేసి చెప్పింది. అది విని కలవర పడ్డారు వీరకేశుడూ, అతడి భార్య!

తమ గారాల పట్టిని బుజ్జగించి వివాహం పట్ల విముఖత వీడమని పరిపరి విధాల నచ్చచెప్పారు. అయినా లాభం లేకపోయింది. రత్నావళి తన పట్టు వీడలేదు. చేసేది లేక వీరకేశుడు, అతడి భార్య బిడ్డని కంటికి రెప్పలా కాపాడ సాగారు.

రోజులు ఇలా గడుస్తున్నాయి.

ఆ సమయంలో అయోధ్యా నగరంలో దొంగల బెడద పెరిగిపోయింది. దొంగలు ఇళ్ళకి కన్నాలు వేసి, చాకచక్యంగా డబ్బూ దస్కం, నగానట్రా దోచుకు పోతున్నారు. ఎవరూ దొంగల్ని పట్టుకోలేక పోయారు. ప్రజలంతా కూడా దొంగల బాధకి చాలా కలవర పడ్డారు.

వారంతా గుంపుగా అయోధ్యా నగరపు రాజు దగ్గరికి పోయి ‘తమని దొంగల బారి నుండి కాపాడవలసింది’గా మొరపెట్టుకున్నారు. ఆ నగరపు రాజు మంచి వాడు, సమర్ధుడు! అతడు ప్రజలకి దొంగల బాధ నుండి విముక్తి కలిగిస్తానని హామీ ఇచ్చాడు.

వెంటనే సైనికులనీ, దళాధిపతులనీ పిలిచి, దొంగలను పట్టుకోవలసిందిగా ఆజ్ఞాపించాడు. కానీ లాభం లేక పోయింది. ఈ వార్త విని దొంగలు అప్రమత్తమయ్యారు. మరింత జాగ్రత్తగా ఇళ్ళకి కన్నాలు వేయటం, దొంగతనాలు చేయటం సాగించారు. సైనికులు, దళాధిపతులు ఒక్క దొంగని కూడా పట్టుకోలేక పోయారు.

ఇక లాభం లేదని రాజే స్వయంగా రంగంలోకి దిగాడు. మారు వేషం ధరించి, ఆయుధాల చేతబూని రాత్రివేళ నగర వీధుల్లో తిరగ సాగాడు.

ఆ రోజు అమావాస్య! అర్ధరాత్రి కావస్తోంది. నగర వీధుల్లో ఎంత చీకటిగా ఉందంటే – ఎదురుగా ఏముందో కూడా కనిపించటం లేదు. హఠాత్తుగా రాజుకు, తనకు కొద్ది దూరంలో భారీకాయుడొకడు నిలిచి ఉన్నట్లు లీలగా తోచింది.

రాజు బిగ్గరగా “ఏయ్! ఎవరు నువ్వు?”అనడిగాడు. అక్కడ నిలబడి ఉంది దొంగల నాయకుడు. అతడు రాజు కంఠ స్వరాన్ని గుర్తు పట్టాడు. గొంతు సవరించుకుని “ఓ రాజా! నేను ఈ నగర దేవత మహంకాళి కొడుకును. పోలేరమ్మ గుడిలో ఉండే దేవర పోతురాజును”అన్నాడు.

రాజు అతణ్ణి దొంగల నాయకుడిగా అనుమానించాడు. కానీ దొంగల నాయకుడు చెప్పినట్లుగా అతణ్ణి పోతురాజని నమ్మినట్లుగా నటిస్తూ “ఓ పోతురాజా! నిన్ను గుర్తించక ఎవరు నువ్వని అడిగినందుకు మన్నించు. నువ్వు మా నగర దేవత మహాంకాళి కుమారుడివి. కాబట్టి నువ్వూ మాకు దేవుడవే! మీ తల్లి మా నగరాన్ని, మమ్మల్నీ కాపాడుతుంది. నా మనస్సులో ఒక కోరిక ఉంది. చాలా రోజులుగా నీవు మా నగరానికి రక్షణగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నా కోరికని నిర్లక్ష్యం చెయ్యకుండా, నీవు నాకా వరాన్ని ఇవ్వాలి. నిన్ను వెయ్యి విధాల ప్రార్థిస్తూన్నాను. నువ్వు నా ప్రార్ధనని మన్నించి తీరాలి. నీవు మా నగరానికి రక్షణగా ఉండాలి” అన్నాడు. ఆ విధంగా అతణ్ణి మాటల్లో పెట్టటమే రాజు ఉద్దేశం.

అయితే ఆ ప్రార్ధన విన్న దొంగల నాయకుడు మనస్సులో ‘ఈ రాజు నన్ను ‘పోతురాజు’ అని నమ్మినట్లున్నాడు. నేను ఆ నమ్మకాన్ని చెడగొట్టకూడదు. తగిన సమయం చూసి ఈ రాజుని చంపగలిగినట్లయితే, ఆనక నేనే రాజుని అయిపోవచ్చు’ అనుకున్నాడు.

పైకి రాజుతో “ఓ రాజా! నీ ప్రార్ధన మన్నించాను. ఇద్దరమూ కోటగుమ్మం దగ్గరికి పోదాం పద!” అన్నాడు. రాజు సరేనన్నాడు.

దొంగల నాయకుడు రాజప్రాసాదం దగ్గరికి దారి తీసాడు. రాజతణ్ణి అనుసరించాడు. అప్పటికే రాజు అతడు దొంగల నాయకుడని నిర్ధారణ చేసుకున్నాడు. రాజప్రాసాదం దగ్గరికి చేరాక, మరోసారి రాజు దొంగల నాయకుడిని పోతురాజుగా సంభోదిస్తూ, నగరాన్ని రక్షించమని అర్ధించి లోపలికి వెళ్ళిపోయాడు.

దొంగల నాయకుడు సంతోష పడుతూ, తన అనుచర దొంగలందరినీ పిలిచి, తన పన్నాగం గురించి చెప్పాడు. ఆ ప్రకారం రాజుని చంపి, నగరాన్ని ఆక్రమించాలని చెప్పేసరికి, దొంగలందరికీ భలే హుషారు వచ్చేసింది. ఎంతో ఉత్సాహంతో తమ నాయకుణ్ణి సమర్ధించారు. దాంతో దొంగల ముఠా అంతా, తమ ప్రణాళికని అమలు చేయడానికి సిద్ధపడసాగారు.

రాజాజ్ఞ ప్రకారం, రాజు గూఢచారులంతా… దొంగల బృందంపైన నిఘా వేసి ఆనుపానులు కనిపెడుతున్నారు. దొంగల పన్నాగం గురించి రాజుకి అన్ని వివరాలూ తెలియజేసారు. తగిన సమయంలో రాజు తన సైనికులతో కలిసి, దొంగల ముఠాపై దాడి చేసి అందర్నీ బంధించాడు. చాలామంది దొంగలు సైనికుల చేతుల్లో మరణించారు. రాజు దొంగల నాయకుణ్ణి బంధించి, సభకు తీసుకురమ్మని భటులని ఆజ్ఞ యిచ్చాడు.

మర్నాటి సభలో, ప్రజల సమక్షంలో రాజు దొంగల నాయకుడికి శిరచ్ఛేదం శిక్షగా విధించాడు. ఆ ప్రకారం దొంగల నాయకుణ్ణి ఊరంతా ఊరేగించి, బహిరంగంగా వధ్యశిల దగ్గర తలనరికి చంపుతారు.

రాజభటులు దొంగల నాయకుడికి ఎర్రని దుస్తులు వేసి, మెడలో వేపదండ వేసారు. నుదుట పెద్ద బొట్టు తీర్చి, బండి మీది కెక్కించి, బండి స్తంభానికి కట్టి ఊరంతా డప్పు మోగిస్తూ ఊరేగించ సాగారు. అలాంటి శిక్షలు చూసిన ప్రజలలో నేరప్రవృత్తి మాసిపోతుందని రాజలా ఆజ్ఞాపించాడు.

వీధులలో కోలాహలంగా సాగుతున్న ఆ ఊరేగింపుని, ప్రజలంతా గుంపులుగా కూడి కుతూహలంతో తిలకించసాగారు. ఊరేగింపు వీరకేశుడు వీధిలోకి ప్రవేశించింది. రత్నావళి తన గది గవాక్షం నుండి దొంగలనాయకుణ్ణి చూసింది.

అప్పటికి ఆమె అవివాహితగా ఉండి పోవాలన్న ఆకాంక్షతో ఎన్నో పెళ్ళి సంబంధాలను తిరస్కరించి ఉంది. అలాంటి రత్నావళి… దొంగల నాయకుణ్ణి చూసిన వేళా విశేషమో, లేక అతడి రూప విలాసమో గానీ, తొలిక్షణంలోనే అతనిపై ప్రేమలో పడింది.

బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చుట్టుకుంటుంది? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 47]

విక్రమార్కుడు మళ్ళీ భేతాళుణ్ణి బంధించాడు. భేతాళుడు మళ్ళీ మరో కథ ప్రారంభించాడు.

ఒకప్పుడు ‘అవినాశి’ అనే నగరం ఉండేది. (వినాశం లేనిది అని ఆ పేరుకి అర్ధం.) ఆ నగరంలో దేవనాధుడు అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడి కొక కుమారుడు, అర్జున స్వామి. అతడు రూపవంతుడూ, గుణవంతుడు. అతడికి యుక్త వయస్సు వచ్చాక తండ్రి దేవనాధుడు, ఎన్నో ఊళ్ళు వెదికి తగిన కన్యని తెచ్చి వివాహం చేసాడు.

ఆ పిల్ల పేరు అనామతి. ఆమె అర్జునస్వామికి రూపంలోనూ, గుణంలోనూ తగిన భార్య. తీయని మాటలూ, చక్కని చేతలూ గలది. యువ దంపతులని చూసిన ఎవరైనా… వారు ఒకరి కొకరు తగి ఉన్నారనే వారు. గువ్వల జంట వంటి ఆ యువజంట, ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళు. క్షణమైనా ఒకరినొకరు ఎడబాయక ఉండేవాళ్ళు.

వారి తీరుని చూసి అందరూ ముచ్చట పడే వాళ్ళు.

ఇలా ఉండగా…ఓ నాటి రాత్రి…

చల్లగాలి వీస్తొందని భార్యభర్తలిద్దరూ, పెరట్లో మల్లెపందిరి ప్రక్కనే మంచం వేసుకు పడుకున్నారు. అది వెన్నెల రాత్రి! అర్జునస్వామి, అనామతి ఆరుబయట ఆదమరిచి నిదురిస్తున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఓ రాక్షసుడు వెళ్తోన్నాడు. అతడు భీకరంగా ఉన్నాడు. అతడి చూపులు అంతకంటే కౄరంగా ఉన్నాయి.

దిగువకి చూసిన రాక్షసుడి కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి. అతడికి అనామతి అద్భుతంగా అనిపించింది. ఆమె అందానికి అదిరిపోయాడు. అమాంతం క్రిందికి దిగి, ఆమెని ఎగరేసుకు పోయాడు. రాక్షస మాయ కారణంగా అనామతికి గానీ, అర్జునస్వామి గానీ నిద్రాభంగం కాలేదు.

తెల్లవారింది. అందరి కంటే ముందే లేచి గృహకృత్యాలలో నిమగ్నమయ్యే అనామతి ఏది? నిద్రలేచిన అర్జునస్వామికి భార్య ఎక్కడా కనబడలేదు. కుటుంబ సభ్యులంతా కూడా వెతికినా అనామతి జాడలేదు. ఎవరికీ ఏమీ తోచలేదు.

కీడెంచి మేలెంచమని, ఊళ్ళోని చెరువులూ నూతులూ కూడా గాలించారు. బంధుమిత్రులందరినీ వాకబు చేసారు. ఆమె ఆచూకీ తెలియ లేదు. అర్జునస్వామికి దుఃఖం కట్టలు దాటింది. అతడు ఎలాగైనా భార్య జాడ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో దేశాటనం బయలు దేరాడు.

అనామతి గురించి వెతుకుతూ ఎన్నో ప్రదేశాలు, ఊళ్ళూ, అడవులూ గాలించాడు. ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. నిరాశా నిస్పృహలతో, స్వంత ఊరు అవినాశికి తిరుగు ప్రయాణమయ్యాడు. లోలోపల మిణుకు మిణుకు మంటూ ఓ చిరు ఆశ… ‘ఒక వేళ ఈ పాటికి అనామతి ఇల్లు చేరిందేమోనని’.

తిరుగు ప్రయాణంలో, అలసటతోనూ, ఆకలి తోనూ ఉన్నాడు. అప్పటికి ఓ గ్రామం చేరాడు. ఓ బ్రాహ్మణ గృహం ఎంచుకొని ‘భోజనం పెట్ట’మని అడిగాడు. గృహస్థు భార్యని పిలిచి “అతిధికి భోజనం పెట్టు” అని చెప్పాడు.

ఆ గృహిణి అతడికి భోజనం వడ్డించే ప్రయత్నం చెయ్యబోగా…అర్జున స్వామి “అమ్మా! స్నాన సంధ్యలు ముగించుకొని ఆరగిస్తాను. భోజనం కట్టి ఇవ్వు” అని అర్ధించాడు.

గృహిణి ఒక చిన్న వెదురు బుట్టలో అరిటాకు వేసి, అందులో అన్నం పప్పూ కూరలూ సర్ధింది. ఓ చిన్న పిడతలో పెరుగు, ప్రక్కనే పండూ తాంబూలం ఉంచింది. భక్తిగా అతిధికి సమర్పించింది.

అర్జునస్వామి వారిని “అన్నదాతా! సుఖీభవ!” అంటూ ఆశీర్వదించి, తిన్నగా చెరువు గట్టుకు వెళ్ళాడు. చెరువులో నీళ్ళు నిర్మలంగా ఉన్నాయి. చెరువు ఒడ్డున పెద్ద మర్రి చెట్టుంది. దాని నీడ చల్లగా హాయిగా ఉంది. అర్జునస్వామి, భోజనం ఉన్న బుట్టని ఆ చెట్టు క్రింద ఉంచి, చెరువులో స్నానం, సంధ్యా వందనం పూర్తి చేసుకున్నాడు.

చెట్టు క్రింద కూర్చొని ఆవురావురుమంటూ అన్నం తినసాగాడు.

ఆ సమయంలో… మర్రి చెట్టు కొమ్మపైకి ఓ గ్రద్ద వచ్చి వాలింది. దాని గోళ్ళల్లో ఓ కాలనాగు గిలగిల్లాడుతుంది. చెట్టు కొమ్మపైన కూర్చున్న గ్రద్ద, ఆ పాముని ముక్కుతో పొడుచుకొని తినసాగింది.

మరణ యాతనకి పాము విలవిల్లాడుతూ విషం కక్కసాగింది. ఆ విషం తిన్నగా అర్జునస్వామి అన్నం తింటున్నా అరిటాకుపై సన్నని తుంపరగా పడసాగింది. ఎంత సన్నని బిందువులంటే…ఆరగిస్తున్న అర్జునస్వామికి సైతం దృష్టికి ఆననంత! అసలే ఆకలిగా ఉన్న అర్జునస్వామి, అన్నం పప్పూ కూరలతో స్వాదిష్టంగా ఉన్న భోజనాన్ని ఇష్టంగా ఆరగిస్తున్నాడు. అయితే కాస్సేపటికి, విషాహారం కారణంగా అతడు మృతి చెందాడు.

ఇదీ కథ!

అంటూ కథ ముగించిన భేతాళుడు…“విక్రమార్క మహీపాలా! ఈ బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చెందుతుంది? ఆహారాన్నిచ్చిన బ్రాహ్మణ దంపతులకా? పాముని చంపితిన్న గ్రద్దకా? విషం గక్కిన పాముకా? విషాహారాన్ని తిని మరణించిన అర్జునస్వామికా?” అనడిగాడు.

[త్వరపడి ఈ ప్రశ్నకు జవాబు చెప్పకండి. విక్రమాదిత్యుడి తర్కం చదివాక, అప్పుడు చెప్పండి.

భారతీయుల నమ్మకాల్లో…బ్రాహ్మణ హత్య (అంటే సత్వగుణ సంపన్నుడి హత్య) మహా పాపమనీ! దాన్ని బ్రహ్మహత్యాపాతకం అంటారు. అలాగే గోహత్య, స్త్రీ హత్య, శిశుహత్యలను కూడా పరమ పాపాలని నమ్మేవాళ్ళు. ఆ కోవలోకే చెందుతుంది ఆత్మహత్య కూడా! ఇప్పుడు నమ్మకాలూ బాగానే సడలి పోయాయి, దృక్పధాలూ మారిపోయాయి. ఎంత పాపానికైనా వెనుతీయని సమాజాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.]

విక్రమాదిత్యుడు స్ఫుటంగా “భేతాళా! ఇందులో ఎవరి తప్పూ లేదు. ఆకలిగొన్న అతిధిని సత్కరించటం గృహస్థు ధర్మంగా భావించి, బ్రాహ్మణ దంపతులు, అర్జునస్వామికి ఆహారం సమర్పించాడు. స్నాన సంధ్యలు ముగించి భోజనం చెయ్యడం సదాచారమని భావించి, అర్జునస్వామి చెరువుకు చేరాడు. చెట్టు నీడన కూర్చొని భోజనం చేసాడు.

గ్రద్ద తన ఆహారాన్ని తాను వేటాడి తెచ్చుకుంది. చెట్టు కొమ్మపై కూర్చొంది. మరణ యాతనకి పాము విషం గ్రక్కింది. పాములు గ్రద్దలకి దేవుడిచ్చిన ఆహారం. మరణ సమయాన విషం గ్రక్కడం పాము ప్రారబ్దం. అందుచేత వాటి దోషమూ లేదు.

అందుచేత వీరెవ్వరికీ బ్రహ్మహత్యా దోషం అంటదు. అయితే… ఎవరీ కథ విని, పూర్వాపరాలూ, ధర్మసూక్ష్మాలూ ఆలోచించకుండా… ‘ఫలానా వారికి బ్రహ్మహత్యా దోషం అంటుతుంది’ అంటారో, వారికి, ఈ బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది” అన్నాడు.

విక్రమార్కుడి విజ్ఞతకి భేతాళుడికి చెప్పలేనంత ఆనందం కలిగింది. చప్పట్లు చరుస్తూ తన ఆనందాన్నీ, అభినందననీ తెలిపాడు. అయితే మౌనభంగమైనందున మరుక్షణం మాయమై మోదుగ చెట్టు పైన మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు.

అది తెలుసు కాబట్టి విక్రమార్కుడూ వెనుదిరిగి మోదుగ చెట్టు వైపు అడుగులేసాడు.

కథా విశ్లేషణ:
బ్రహ్మహత్యా పాతకం వంటిది – ‘విషయం గూర్చి పూర్వాపరాలూ, మంచి చెడుగులూ తెలియకుండా మాట్లాడిన వారికి అంటుకుంటుంది’ అని చెప్పే ఈ కథ…శ్రోతలని అప్రమత్తుల్ని చేస్తుంది.

ఎన్నోసార్లు… ఎంతోమంది… తీరి కూర్చొని, అరుగుల మీదా, రచ్చబండలమీదా… తెగ తర్కాలు చేసేస్తుంటారు. ‘ఫలానా వాళ్ళ వ్యవహారంలో ఫలానా వాళ్ళది తప్పు’ ‘ఇది ఇలా చెప్పకూడదు’ ‘అలా చెయ్యాలి’… గట్రా తీర్పులు చెప్పేస్తుంటారు. తెలిసీ తెలియక, ఏదో మాట్లాడేస్తే, మనకే ప్రమాదం, మన విజ్ఞతే దెబ్బతింటుంది అనే హెచ్చరిక ఈ కథలో ఉంటుంది.

అందుకే…ఈ కథ చెప్పేటప్పుడు నేనెప్పుడూ “త్వరపడి బ్రహ్మహత్యా పాతకం ఫలానా వారికి చుట్టుకుంటుంది అని జవాబు చెప్పకండి. విక్రమాదిత్యుడి సమాధానం విన్నాక, అప్పుడు చెప్పండి” అని ముందుగానే చెప్పేస్తుంటాను. నోటి మాటని విజ్ఞతతో ఉపయోగించాలని చెప్పే ఈ కథ, ఎంతో విలువైనది!

మృత సంజీవని – కొత్త సమాధానం ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 46]

విక్రమాదిత్యుడు మరోసారి భేతాళుడున్న శవాన్ని బంధించాడు. దాన్ని భుజాన పెట్టుకుని మౌనంగా బృహదారుణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడు పదిహేనవ కథ ప్రారంభించాడు.

“ఓ విక్రమాదిత్య మహారాజా! నీ పట్టుదల అనితర సాధ్యమైనది. నేనో కథ చెబుతాను. మార్గాయాసం మరిచి విను” అంటూ కథ కొనసాగించాడు.

ఒకానొకప్పుడు బ్రహ్మపురమనే బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. అందులో విష్ణు స్వామి అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడికి సంతతి లేదు. అందుచేత అతడెంతో దిగులు పడ్డాడు. ఎన్నో నోములూ, పూజలూ చేసాడు. చివరికి మహాశివుడి గురించి తీవ్ర తపమాచరించాడు. శివుడి దయతో, కొంత కాలానికి అతడికి సంతాన భాగ్యం కలిగింది. వరుసగా నలుగురు పుత్రులుదయించారు.

అతడువారినెంతో అల్లారుముద్దుగా పెంచి, తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పాడు. మరిన్ని విద్యలు నేర్పాలన్న అభిలాషతో, కుమారులు నలుగురూ దేశాటనం బయలు దేరారు. అలా నానా దేశాలూ తిరుగుతూ, చివరికి ఓ యోగిని ఆశ్రయించారు.

ఆ యోగి సకల విద్యా పారంగతుడు. మంత్ర తంత్ర విద్యలని సైతం ఎఱిగిన వాడు. బ్రాహ్మణ కుమారులు. అతణ్ణి శ్రద్ధా భక్తులతో సేవించారు. వారి శుశ్రూషలకు మెచ్చిన యోగి, వారికి వారి అభిరుచుని బట్టి మంత్ర తంత్ర విద్యలు నేర్పాడు. తర్కమీమాంసాలు మీద గానీ, వేద విద్య మీద గానీ, వారికి ఆసక్తి లేకపోయింది.

దాంతో మృత సంజీవని సహా ఎన్నో అపూర్వమైన మంత్ర విద్యలు గురువు దగ్గర నేర్చుకున్నారు. ఓ శుభ దినాన, యోగి వాళ్ళ నలుగురికీ ‘విద్యాభ్యాసం పూర్తయ్యిందనీ ఇక ఇళ్ళకి వెళ్ళవచ్చనీ’ ఆనతిచ్చాడు.

కుర్రాళ్ళు నలుగురూ ఎంతో ఆనందంతో గురువుకి నమస్కరించి, స్వగ్రామానికి పయన మయ్యారు. దారిలో నదీ నదాలు, కొండలూ లోయలూ, అరణ్యాలూ జనపదాలూ దాటుతూ, తమ విద్యా ప్రదర్శనతో ప్రజలని అబ్బుర పరుస్తూ ప్రయాణించసాగారు.

మార్గమధ్యంలో వారొక అడవిలో నుండి ప్రయాణించాల్సి వచ్చింది. అప్పటికే తమ విద్యా ప్రదర్శనలకి ప్రజలు పలికిన జేజేలతో వాళ్ళల్లో అహం తలకెక్కి ఉంది. స్కోత్కర్షతో భుజాలు పొంగి ఉన్నాయి. ఆత్మస్తుతి శృతి మించింది. తమని తామే ప్రశంసించుకుంటూ ప్రయాణిస్తున్నారు.

అంతలో, బాట ప్రక్కనే ఓ పులి చచ్చిపడి ఉంది. శరీరం కుళ్ళి కంపు కూడా మాసిపోయింది. చీమలు తినగా శిధిలమై, మిగిలిన శరీరావశేషాలున్నాయి. నలుగురు అన్నదమ్ములూ దాన్ని చూశారు. తలకెక్కిన అహంకారానికి ఇంగిత జ్ఞానం అడుగంటింది. చచ్చిన పులిని బ్రతికించి, కుక్కలా తమ వెంట బెట్టుకు వెళ్ళితే, జనం భయంతో, ఆశ్చర్యంతో మూర్ఛబోతారనిపించింది. ఆ ఊహే వాళ్ళకి మత్తు గొల్పింది.

మొదటి వాడు మంత్రాలు జపిస్తూ పులి కళేబరంలో మిగిలిన ఎముకలు పోగు చేసి నీటిని మంత్రించి చల్లాడు. వెంటనే పులి అస్థిపంజరం తయారయ్యింది.

రెండవ వాడు మంత్రం జపిస్తూ, దానికి రక్తమాంసాలు ప్రసాదించాడు. మూడవ వాడు మంత్రాలు జపించి దానికి చర్మమూ, గుండె వంటి ముఖ్యమైన అవయవాలనూ సృష్టించాడు.

నాలుగవ వాడు మంత్రం జపించి దానికి ప్రాణం పోసాడు. అప్పటికే మిగిలిన ముగ్గురూ చప్పట్లు చరుస్తూ పులి ప్రాణం పోసుకోవడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

నాలుగవ వాడి మంత్రోచ్ఛాటనతో పునర్జీవించిన పులి, తనకు ప్రాణదాతలైన తమ ఎదురుగా, వినయంగా నిలబడుతుందన్న ఊహతో, వొళ్ళు తెలియకుండా నిలబడి ఉన్న నలుగురినీ చూచి, పులి ఒక్కమారుగా గాండ్రించింది.

ఆకలితో నకనకలాడుతున్న పులి కంటికి నిండుగా ఆహారం కనబడింది. అది తమపై దాడి చేస్తోందన్న విషయం నలుగురు అన్నదమ్ములకీ అర్ధమయ్యేలోపునే, పులి నలుగురినీ చీల్చి పారేసింది. కడుపు నిండా తిన్నంత తిని, దాని దారిన అదిపోయింది.

ఇదీ కథ!

ఓ విక్రమార్క మహారాజా! నలుగురు బ్రాహ్మణ యువకులూ మృత్యువాత పడిన ఈ సంఘటనలో, ఈ బ్రహ్మహత్యా పాపం ఎవరికి చెందుతుంది?” అని అడిగాడు.

విక్రమాదిత్యుడు గొంతు సవరించుకుని “భేతాళుడా! నలుగురూ… విద్యాగర్వంతో, వినయాన్ని మరిచి విర్రవీగారు. అయితే మొదటి ముగ్గురి కారణంగా పులి శరీరాన్ని పొందిందే గానీ, చైతన్యాన్ని పొందలేదు. కాబట్టి ప్రాణహాని దాకా పరిస్థితి రాలేదు.

కనీసం చివరి వాడన్నా మంత్రప్రయోగం చేయటం ఆపి ఉంటే నలుగురు బ్రాహ్మణ యువకులూ బ్రతికి ఉండేవాళ్ళు. కాబట్టి మొదటి ముగ్గురి మృతి కారణంగా బ్రహ్మహత్యా దోషమూ, చివరి వాడి ఆత్మహత్యా పాపమూ కూడా, నాలుగో సోదరుడికే చెందుతాయి” అన్నాడు.

మరోసారి మౌనం భంగమైంది. భేతాళుడు అదృశ్యుడయ్యాడు.

కథా విశ్లేషణ: ఇది పంచతంత్రంలో కూడా ఉన్న కథ. చాలా చోట్ల విన్న కథ, చదివిన కథ. చివరికి పిల్లల పాఠాల్లో కూడా ఉన్న కథ! అయితే అంతగా ఆలోచించని సమాధానం ఈ కథలో ఉంటుంది.

పులి బ్రతకడానికి, అందరూ చావడానికీ నలుగురూ కారణమే అయినా… చివరి వాడి బాధ్యతే ఎక్కువ కాబట్టి, బ్రహ్మహత్యా పాపం అతడికే చుట్టుకుంటుందంటాడు విక్రమాదిత్యుడు.

చాలాసార్లు మనం ఇలాంతి స్థితిని గమనిస్తుంటాం. తలా కొంచెం అందరూ పాలుపంచుకున్న పని, చివరి క్షణంలో ఎవరి చేతుల్లో విఫలమయ్యిందో, వాళ్ళని బాధ్యుల్ని చేస్తున్నప్పుడు, “అతడొక్కణ్ణే అనడం దేనికి? అందరూ తలో చెయ్యివేసారు?” అంటుంటారు. దాంతో శిక్ష తీవ్రత పలుచనై పోతుంది.

నిజానికి చెడుకర్మల్లో… ఎవరి చేతుల్లో చివరి వైఫల్యం వచ్చిందో వాళ్ళని బాధ్యుల్ని చేస్తే…ఎవరికి వాళ్ళకే ఆ భయం ఉంటుంది. ఉదాహరణకి చేతులు మారుతున్న బాంబు ఎవరి చేతుల్లో పేలితే, వాళ్ళ ప్రాణాలు గాల్లో కలవటం తధ్యం అనే స్థితిలో… ఎవరికి వాళ్ళూ ఎంతో అప్రమత్నంగా ఉంటారో… ఇదీ అంతే!

అప్పుడు ఎవరికి వాళ్ళూ చెడు కర్మకి వెనుతీస్తారు కదా!

ఆ నీతినే ఈ కథ చెబుతుంది!

ప్రియురాలు, ప్రియుడు, భర్త – ఎవరు గొప్ప? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 45]

విక్రమాదిత్యుడు తన ప్రయత్నం మాన లేదు. మోదుగ చెట్టెక్కి భేతాళుడిని దించి నడక ప్రారంభించాడు. భేతాళుడూ తన ప్రయత్నమాపలేదు. మరో కథ ప్రారంభించాడు.

“ఓ విక్రమాదిత్యా భూపాలా! విను” అంటూ కొనసాగించాడు.

అలకాపురి అనే నగరంలో ఒక వైశ్యశ్రేష్ఠుడు ఉండేవాడు. అతడి పేరు ఈశ్వర శెట్టి. అతడికి ఒక కుమార్తె ఉంది. పేరు రమ్యవల్లి. ఆమె పేరుకు తగ్గట్లే రమ్యమైన పూలతీగ వలె ఉండేది. ఆమె యుక్త వయస్సులో ఉంది.

వారి నివాసానికి దగ్గరలోని బ్రాహ్మణ అగ్రహారంలో నివసించే సందీపుడనే బ్రాహ్మణ యువకుడు ఆమెని ప్రేమించాడు. రమ్యవల్లికీ అతడంటే అనురాగమే ఉండటం వలన వారిద్దరూ ప్రతీ రోజూ ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళు. పరస్పర సాన్నిహిత్యాన్ని ఆనందించే వాళ్ళు.

ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు అలకా పురి కి ప్రక్కనున్న నగరం నుండి ఓ వైశ్య యువకుడు, రంగనాధ శెట్టి అనేవాడు వచ్చి ఈశ్వర శెట్టిని కలుసుకున్నాడు. తనని తాను పరిచయం చేసుకొని పిల్లనివ్వమని అడిగాడు.

ఈశ్వర శెట్టి కి రంగనాధ శెట్టి కులగోత్రాలూ, రూపురేఖలూ, అర్హతలు నచ్చటంతో రమ్యవల్లినిచ్చి వివాహం చెయ్యడానికి అంగీకరించాడు. ముహుర్తం నిర్ణయించి, బంధుమిత్రులందర్నీ ఆహ్వానించి వైభవంగా పెళ్ళి జరిపించాడు.

ఇటు రమ్యవల్లి గానీ, అటు సందీపుడు గానీ తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పలేదు. పెళ్ళి వైభవోపేతంగా జరిగిపోయింది. రంగనాధ శెట్టి భార్యని వెంటబెట్టుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు. రమ్యవల్లి ప్రియుడైన సందీపుణ్ణి విడిచి వెళ్తున్నందుకు విపరీతంగా దుఃఖ పడింది.

అత్తగారిల్లు చేరినా, ప్రియుని వియోగ దుఃఖంతో కృంగి కృశించ సాగింది. కొన్ని రోజులకి ఆ వ్యధతో మరణించింది. ఆ వార్త విని సందీపుడు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చాడు. అన్నపానీయాలు నిద్రా విశ్రాంతులు మానివేసి, మనోవేదనతో మంచం పట్టాడు. కొద్ది రోజులకి అతడూ మరణించాడు.

రమ్యవల్లి మరణించడంతో ‘మనసు పడి వివాహం చేసుకున్న భార్య చనిపోయిందే’ – అన్న విచారంతో రమ్యవల్లి భర్త రంగనాధ శెట్టి కూడా దిగులు చెంది జబ్బున పడి మరణించాడు.

“ఓ విక్రమాదిత్య రాజేంద్రా! రమ్యవల్లి, ఆమె ప్రియుడు సందీపుడు, ఆమె భర్త రంగనాధ శెట్టి – ఈ ముగ్గురూ వ్యధ చెంది మరణించారు కదా! వీరిలో ఎవరు గొప్ప? వివరించి చెప్పు” అన్నాడు భేతాళుడు.

విక్రమాదిత్యుడు కొంత గంభీరంగా “ఓ భేతాళా! విను! రమ్యవల్లి, ఆమె ప్రియుడు సందీపుడూ… కొంతకాలం పరస్పర ప్రేమనీ, సాన్నిహిత్యాన్నీ అనుభవించారు. అందుచేత ఆ వియోగ దుఃఖాన్ని భరించలేక మనోవ్యధ చెంది మరణించారు. అయితే రమ్యవల్లి భర్త రంగనాధ శెట్టి అమాయకుడు. ముచ్చటపడి వివాహం చేసుకున్న భార్య మీద మమకారంతో, ఆమె మరణ దుఃఖాన్ని సహించలేక, బాధతో తాను మరణించాడు. కాబట్టి రంగనాధ శెట్టి గొప్పవాడు” అన్నాడు.

భేతాళుడు అంగీకార సూచకంగా తలాడించి “మౌనభంగమైంది మహారాజా! సెలవు” అంటూ మాయమై మోదుగ చెట్టు ఎక్కేసాడు.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes