RSS
Wecome to my Blog, enjoy reading :)

విక్రమాదిత్యుడి పట్టాభిషేకం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 11]

అప్పటి వరకూ, భర్తృహరి వృత్తాంతాన్ని వివరించిన వినోద రంజిత ప్రతిమ "ఓ భోజరాజా! ఇప్పటి వరకూ నేను చెప్పినది, భట్టి విక్రమాదిత్యుల తండ్రి, తోబుట్టువుల గాధ! ఇప్పుడు అసహాయ శూరుడైన విక్రమాదిత్యుడు, అనన్య మేధావి అయిన భట్టిల కథను చెబుతున్నాను. శ్రద్దగా విను" అని, ఇలా చెప్పసాగింది.

విక్రమాదిత్యుడు, తన సోదరుడైన భట్టిని ప్రధానమంత్రిగా నియుక్తుణ్ణి చేసి, రాజ్య పరిపాలన సాగించాడు. పాలనా విధానాలనీ, రాజ్య పరిస్థితులనీ అభివృద్ది చేశారు.

ఒకనాడు.... విక్రమాదిత్యుడు, భట్టిని పిలిచి "ప్రియమైన తమ్ముడా, భట్టీ! నా మనస్సులో ఒక కోరిక ఉన్నది. దానిని సాధించికునేందుకు నాకు నీ సహాయ సహకారాలు కావాలి. నా మదిలో ఒక ప్రణాళిక ఉన్నది. భావోద్రేకాలు లేకుండా దాని గురించి ఆలోచించి, విశ్లేషించి, దాని మంచి చెడుగుల గురించి నాకు చెప్పు. నీవు దానిని వ్యతిరేకించినట్లేయితే, నిర్మొహమాటంగా అదే చెప్పు. అంతేగానీ ‘అన్న అడిగాడు కదా!’ అనో, ‘రాజుగా నొచ్చుకుంటాననో’ భావించకు. క్షుణ్ణంగా ఆలోచించి, నీ ఇష్టాయిష్టాలను చెప్పు.

తండ్రి గారి నుండి మనకు సంక్రమించిన ఈ రాజ్యము చాలా చిన్నది. దీనితో సంతృప్తి పడటం నాకు ఇచ్చ గించకుండా ఉంది. సబబుగానూ తోచటం లేదు. ఇలాగే మనం జీవితాంతమూ గడిపితే, కూపస్థ మండూకాల వలె ఉండగలదు.

జీవితంలో పేరు ప్రఖ్యాతులు గానీ, సంతృప్తీ, సుఖసంపదలు గానీ ఉండవు. ఈ ప్రపంచమున జనియించినందుకు, మనము కొన్ని ఘన కార్యములు సాధించాలి. జనులది గాంచి మనలను ప్రశంసించాలి. సుదీర్ఘకాలము మనము ప్రజలకు గుర్తుండి పోవాలి.

కాబట్టి, మనము జైత్రయాత్ర కేగి, పలు రాజ్యములు జయించి, మన సామ్రాజ్యమును విస్తరించుదాం. తదుపరి మనమో గొప్ప, అందమైన నగరాన్ని, మన రాజధానిగా నిర్మిద్దాం. అందుకు తగిన ప్రదేశమును నీవే పోయి వెదకి రావాలి. అట్టి ప్రదేశము, నలు దిక్కులా పర్వత వలయములతో ఆవరించి ఉండాలి. నదీ పరివాహ ప్రాంతమై ఉండాలి. ప్రకృతి సౌందర్యముతో ఒప్పి ఉండాలి. అలాంటి చోట, సర్వశోభితమైన నగరాన్ని నిర్మిస్తే, అది దేవతల అమరావతి వలె అలరారు తుండాలి.

అటువంటి రాజధానిని నిర్మించి, సువిశాల ధరణీ వలాన్ని, సుదీర్ఘ కాలము సర్వ సమర్దంగా పరిపాలించాలి. తమ్ముడా! భట్టీ! ఇందుకు నీవే మంటావు?" అన్నాడు.

భట్టి చిరునవ్వుతో, "అన్నా! సత్యము చెప్పినావు. నా మనస్సున ఉన్నదే నీ నోట పలికావు. మన శరీరాలు వేరే గానీ, ఆత్మ లొక్కటే యనునట్లు, మన ఆలోచనలు ఒకటే, దృక్పధమూ ఒకటే! నీవు చెప్పినట్లే చేసేదము గాక! ముందుగా మన రాజ్యమును విస్తరిద్దాం. ఆ తర్వాత రాజధానికై స్థల విచారణ, సేకరణ, నిర్మాణమూ చేయవచ్చు" అన్నాడు.

ఒక సుముహుర్తాన, దైవపూజలు నిర్హహించి, భట్టి విక్రమాదిత్యులు, తమ సైన్య సమూహాలతో జైత్రయాత్రకు బయలు దేరారు. అది యుద్దానికి వెళ్తున్నట్లూ ఉంది, పండుగ ఉత్సాహంతో ఊరేగింపు వెళ్తున్నట్లూ ఉంది! సైనిక దళాలతో బాటుగా.... సంగీత వాయిద్యాలూ, యుద్దోత్సాహ పూరిత రాగాలతో మేళ తాళాలూ, సైనికులని రజోగుణంతో ఉర్రూతలూగిస్తున్నాయి. కవులు, గాయకులు, నటులూ, నర్తకులూ... ఒక వైపు యుద్ద భీకర స్థితిలో గడిపే సైన్యాలకు.... మరో వైపు ఉత్సాహ ఉల్లాసాలని అందిస్తున్నారు.

భట్టి విక్రమాదిత్యులు, ఎందరో రాజులని ఓడించి, తమ సామంతులుగా చేసుకుని, కప్పం కట్టించుకున్నారు. ఏడాది కింతని, ఆయా రాజ్యాల రాజులు భట్టి విక్రమాదిత్యులకు కప్పంగా సమర్పించుకోవటమే గాక, ఎన్నో విలువైన కానుకలని సమర్పించి, తమ చక్రవర్తిగా విక్రమాదిత్యుణ్ణి అంగీకరించారు.

ఆ విధంగా తమ సామ్రాజ్యాన్ని సువిశాలంగా విస్తరించి, భారీ సంపదలతో, విలువైన కానుకలతో, అనన్యమైన గెలుపుతో, తిరిగి కన్యాపురాన్ని చేరారు భట్టి విక్రమాదిత్యులు.

తర్వాత, ఒకరోజు.... ముందుగా అనుకున్న ప్రకారం, భట్టి అన్న అనుమతి తీసుకుని, రాజధానీ నగర నిర్మాణానికై తగిన ప్రదేశాన్ని వెదకబోయాడు. వాగులూ వంకలూ, కొండలూ గుట్టలూ... దుర్గమారణ్యాలూ, నదీ తీరాలు.... సవిస్తరంగా అన్వేషించాడు. అలా వెళ్తూ... భట్టి వింధ్య పర్వత ప్రాంతాలను చేరాడు. అతడికొక అందమైన ప్రదేశం కనిపించింది. చుట్టూ కొండలతో ఆవరించి ఉంది. గుణవతి నది ఓ ప్రక్కగా ప్రవహిస్తోంది. కనుల కింపైన అరణ్యం, అడవిలా గాక అందమైన ఉద్యానవనంలా ఉన్నది. భట్టికి అలాంటి చోటును చూసి ఎంతో సంతోషం, సంతృప్తీ కలిగాయి.

అక్కడ తమ రాజధానీ నగరాన్ని నిర్మించవచ్చని నిర్ణయించుకున్నారు. ఈ విషయాలన్నీ తన అన్నయైన విక్రమాదిత్యునికి ఎప్పుడెప్పుడు చెప్పుదునా అనే ఆతృతతో భట్టి తిరుగు ప్రయాణమయ్యాడు. కొద్ది దూరం నడిచినంతనే.... అతనికొక అందమైన సరోవరం, ఆ ప్రక్కనే ఒక పురాతన ఆలయం కనబడింది.

సరోవరంతో స్నానమాచరించి, దేవాలయంలోకి కెళ్లాడు. అది మహంకాళి ఆలయం. భట్టి, దేవీ దర్శనానికి ముందు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణం చేయబోయాడు. అతడి కొక శిలాశాసనం కంటబడింది. దానిపై చెక్కబడిన శాసనం అతడినాకర్షించింది. అందులో

"బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర భేదము లేక, ఏ వ్యక్తియైననూ దీని నాచరింప వచ్చును. సాహసియైన వాడు, ఈ ఆలయములోని పవిత్ర పుష్కరిణిలో స్నానమాచరించవలెను. సరోవరపు ఒడ్దున గల మఱ్ఱి వృక్షము నధిరోహించ వలెను. వటవృక్షము కొమ్మలు, సరోవరము పైకి వ్యాపించి ఉన్నవి. దానికి ఏడు ఉట్లు గలవు. సరోవరపు నీటి మధ్యలో శూలము కలదు. సరిగా దాని పైనే ఉట్లు వ్రేలాడు చున్నవి.

సాహసి ఆ ఏడుట్లును ఏక వ్రేటుగా తెగవేసి, ఉట్లు నీరు జేరక మునుపే, తల్లక్రిందులుగా శూలముపైకి ఉఱక వలెను. ఇవ్విధముగా ఎవరైతే ప్రాణత్యాగము చేయదురో, అట్టి వానికి మహంకాళి దర్శనమిచ్చి వరములనిచ్చును. దేవి కరుణ బొందిన అట్టి సాహసి, ఈ ధరావలయమునకు చక్రవర్తియై, సుదీర్ఘ కాలము రాజ్య పాలనము చేసి, భోగ భాగ్యములనూ, కీర్తి ప్రతిష్ఠలను పొందగలరు" అని వ్రాసి ఉంది.

~~~~~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes