RSS
Wecome to my Blog, enjoy reading :)

మిఠాయి కొట్టు

అనగా అనగా.....

చింతలపల్లి అనే ఓగ్రామం ఉండేది. ఆ గ్రామాధికారి పేరు ఆదిశేషయ్య. అతడి భార్య పేరు అనసూయమ్మ. కొద్దిరోజులు క్రితం వారి కుమార్తె పెళ్ళి అయ్యింది. ఇక పిల్లని చీరె సారెలతో అత్తవారింటికి పంపాలి.

ఓ రోజు ఉదయాన్నే అనసూయమ్మ భర్తతో “ఏమండోయ్! ఎల్లుండి గురువారం. ఆరోజు అమ్మాయిని అత్తవారింటికి పంపాలి. పది మణుగులు నేతి మిఠాయిలు కావాలి. సుబ్బయ్య మిఠాయిల దుకాణం నుండి తెప్పించండి” అంది.

ఆది శేషయ్య సాలోచనగా “అలాగే” అన్నాడు.

వెళ్ళి వీధి అరుగు మీద కూర్చున్నాడు. అనసూయమ్మ పనులు హడావుడిలో పడిపోయింది. రెండు ఘడియల తర్వాత చూస్తే ఆదిశేషయ్య వీధి అరుగు మీదే కూర్చోని ఏవో కచేరి [ఆఫీసు] కాగితాలు చూసుకుంటున్నాడు.

అనసూయమ్మ వీధి అరుగు దగ్గరికి వచ్చి భర్త వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.

కాస్త ఆగమన్నట్లుగా ఆదిశేషయ్య చేసైగ చేసాడు. ఆవిడ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నమయ్యింది. అప్పటికీ ఆది శేషయ్య వీధి అరుగు మీదే కూర్చోని, కచేరీ పనుల నిమిత్తమై తనకోసం వచ్చిన గ్రామస్తులతో మాట్లాడుతున్నాడు. అనసూయమ్మ అసహనంగా ఇంట్లోంచి బైటకొచ్చింది. ఆదిశేషయ్య నింపాదిగా ఉన్నాడు.

భోజనాలవేళ ఆవిడ భర్తమీద ఖయ్యిమంది. “పిల్లకి సారె చీరె లిచ్చి పంపాలి, మిఠాయిలు తెప్పించమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉలకరు, పలకరేం?” అంది రుసరుసలాడుతూ.

ఆదిశేషయ్య నిమ్మకు నీరెత్తినట్లు, నింపాదిగా “ఆపని మీదే ఉన్నానులే!” అన్నాడు.

అనసూయమ్మ తెల్లబోయింది. మాట్లాడకుండా వూరుకొంది. సాయంత్రమైంది. మిఠాయిలింటికి రాలేదు.

రాత్రి భోజనాల వేళ భర్తకి మరోసారి గుర్తు చేసింది అనసూయమ్మ.

“ఎల్లుండి కి కదా మిఠాయిలు కావాలి? రేపు తెస్తానులే!” అన్నాడు ఆదిశేషయ్య.

"ముందుగా చెప్పకపోతే అన్నిరకాలూ దొరకవద్దూ?" దీర్ఘం తీసింది అనసూయమ్మ.

"మరేం ఫర్లేదు. అన్నిరకాలూ ఉంటాయి. నామీద భరోసా ఉంచు” తొణకని కుండలా చెప్పాడు ఆదిశేషయ్య.

ఇంకేమన లేక మౌనంగా వూర్కొంది అనసూయమ్మ.

మర్నాటి సాయంత్రం వరకూ కూడా అదే తంతు నడిచింది వీధి అరుగుమీద. చేసేది లేక అనసూయమ్మ చూస్తూ ఊర్కొంది.

సాయంత్రానికి ఆదిశేషయ్య పనివాణ్ణి వెంట బెట్టుకుని సుబ్బయ్య మిఠాయి దుకాణానికి బయలుదేరాడు. కాస్సేపటికల్లా ఇరవై మణుగులు నేతి మిఠాయిలు ఇంట దిగాయి. అనసూయమ్మ తెల్లబోయింది.

భర్తకి మంచినీళ్ళందిస్తూ “కావలసింది పది మణుగులైతే ఇరవై మణుగులు తెచ్చారేం? డబ్బు దండుగ కాదూ?” అంది.
"అదేం లేదు! ఇరవై మణుగులు కలిపి ఐదు మణుగుల ఖరీదుకే వచ్చాయి” అన్నాడు ఆదిశేషయ్య విజయదరహాసంతో.

"అదేలా?" ఆశ్చర్యంగా అడిగింది అనసూయమ్మ.

గుబురుమీసాలు సవరించుకొంటూ చెప్పాడు ఆదిశేషయ్య.

"పిచ్చిదానా? నీకన్నీ తొందరే! హుటాహుటిన నిన్నే సుబ్బయ్య దుకాణానికి మిఠాయిల కోసం వెడితే మణుగు ఖరీదు నాలుగింతలుండేది. నిన్న పొద్దున నువ్వు చెప్పగానే అరుగు మీద కూర్చొని నాతో పనిబడి వచ్చిన వారందరితో ‘సుబ్బయ్య కొట్లో మిఠాయిలు చద్ది వాసన వస్తూన్నాయంటగా?’ అంటూ గాలివార్త వదిలాను. అది నమ్మింది కొందరూ, నాతో పని ఉంది కాబట్టి నన్ను ప్రసన్నం చేసికొనేందుకు నమ్మినట్లు నటించినది కొందరూ. ఏమైతేనేం? మొత్తానికి అందరూ కలిసి సుబ్బయ్యకొట్లో మిఠాయిలు చద్ది వాసన వస్తున్నాయనీ పుకారు, గాలివార్తని ఊరంతా టాంటాం వేసారు. ఒకరికి పదిమంది అదే మాట అనేసరికి నిన్న సాయంత్రానికి సుబ్బయ్య మిఠాయిల ధర సగానికి సగం తగ్గించి అమ్మాడు. వార్త ప్రచారం ఆగకపోయేసరికి ఈరోజు సాయంత్రానికి ధర నాలుగో వంతుకి తగ్గించాడు. ఇప్పడు ఇరవై మణుగుల నేతి మిఠాయిలు, ఐదు మణుగుల ధరకే వచ్చాయి”.

అనసూయమ్మ భర్త తెలివితేటలకు తెగ మురిసిపోయింది. కించిత్తు గర్వంగా ఆదిశేషయ్య అనసూయమ్మ కేసి చూస్తూ “చూసావా? ఏ పని చేసినా మనచేతికి తడి అంటకుండా చేయాలి, నేర్పుగా ఓర్పుగా పని చక్కబెట్టాలి” అన్నాడు తత్త్వం బోధిస్తూన్నట్లు.

“నిజమే సుమా!” అంటూ తలూపింది అనసూయమ్మ.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

బావి కప్ప - సముద్రపు కప్ప

అనగా అనగా.....

ఓసారి సముద్రంలో తుఫాను రేగింది. ఎగసి పడే అలలకీ, సుడి గాలికీ ఓ కప్ప విధివశాత్తు చిక్కుకొని ఎగిరివచ్చి దాపులనున్న గ్రామంలోని బావిలో పడింది. సముద్రపు కప్పని చూచి ఆ బావిలోనే చాలాకాలం నుండీ నివసిస్తూన్న కప్ప గెంతుకుంటూ దగ్గరికొచ్చింది.

"ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు?" వింతగా చూస్తూ సముద్రపు కప్పని అడిగింది బావికప్ప.

"నేను సముద్రపుకప్పని. సముద్రం నుండి ఎగిరి వచ్చి, ఖర్మకాలి ఈ బావిలో పడ్డాను” అంది కొంచెం దర్పం, కొంచెం విచారం కలిపిన స్వరంతో సముద్రపు కప్ప.

"ఎందుకంత విచారం? ఈ బావి చాలా పెద్దది" అంది ఓదార్పుగా బావి కప్ప.

సముద్రపు కప్ప నిస్పృహగా బావి కప్పవైపో చూపు విసిరి "సముద్రం చాలా పెద్దది!" అంది.

"ఎంత పెద్దది?" అంది బావికప్ప కుతూహలంగా!

"చాలా చాలా పెద్దది." అంది సముద్రపు కప్ప.

పాపం! తన జీవితంలో సంభవించిన అంత పెను విషాదాన్ని ఇంకా అది జీర్ణించుకోలేదు. దాని నిర్వేదంలో అది ఉంది.

ఇదంతా పట్టించుకోని బావికప్ప "ఎంతపెద్దది సముద్రం? ఇంత ఉంటుందా?" అంటు బావిలో ఓ వృత్తం గీచి చూపెట్టింది.

సముద్రపు కప్పకి నవ్వొచ్చింది. ఆపైన బావి కప్పపై జాలేసింది. ఓపిగ్గా "కాదు. ఇంకా పెద్దది" అంది.

"అవునా? అయితే ఇంతపెద్దదా?" ఈసారి ఇంకొంచెం పెద్దవృత్తం గీచి అడిగింది బావికప్ప కళ్ళింత చేసి,

ఈసారి సముద్రపు కప్పకి ఏడుపొచ్చింది.

"కాదు. చాలా చాలా పెద్దది." అంది విసుగ్గా.

బావికప్ప ఇంకా పట్టుదలగా మరి కొంచెం పెద్దవృత్తం గీచి "ఇంత పెద్దదా?" అనడిగింది.

ఇక తట్టుకోలేక కెవ్వున కేకపెట్టి ఘొల్లుమంది సముద్రపు కప్ప. ఇక ఎంత చెప్పినా బావికప్ప సముద్రపు విస్తారతని అర్ధం చేసుకోలేదని అర్ధం చేసుకొంది.

బావికప్పపై జాలి పడింది.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

కంచే చేను మేస్తే…

అనగా అనగా.....


పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ. ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ. అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు. అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది.

ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు. ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు. అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది. ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది. మెల్లిగా ఆమెని చేరి “ఓ సుందరీ! నీవెవ్వరు? ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు?” అనడిగాడు.

అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి “రాజా! నేను ముని కన్యను! ఈ అరణ్యంలోనే మా నివాసం” అంది.

రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు. ఆమె “రాజా! నేను ముని వృత్తిలో నున్నదానిని. మీరు దేశాన్నేలే మహారాజులు. మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా? కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు. నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి” అంది. వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు. చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు.

తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ “వద్దు. వద్దు! నన్ను చంపవద్దు” అన్నాడు.

“ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను” అన్నాడు రాక్షసుడు.

“చెప్పు. తప్పక నెరవేరుస్తా” అన్నాడు రాజు.

"నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు.

రాజు తంత్రవర్మ సరేనన్నాడు. రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు. సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు. చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు. వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు. రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు. [అదే ఇప్పటి పాలకులైతే తన్ని తీసికెళ్ళెవాళ్ళు. పాపం తంత్రవర్మ ఎంత స్వార్దపరుడైనా, ఎంతో కొంత నీతిపరుడే. అందుకే బేరమడిగాడు.]

ఆ బ్రాహ్మణుడు "రాజా! నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం. రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా! అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను. మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో!" అన్నాడు.

అంతలో అతడి భార్య "మహారాజా! నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు. అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు. అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను. కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి" అన్నది.

రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు. ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు. ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు.

సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి "విక్రమాదిత్య మహారాజా! ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు? అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది. జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను" అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా,

"భేతాళా! ఆబాలుడి నవ్వులో "ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు. రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం. అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి?" అన్నభావం ఉన్నది. అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు" అన్నాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇందులకేదో నిమిత్తముండి యుండవలయును

అనగా అనగా.....

చంపకవతి అనే పట్టణముండేది. అక్కడ సన్యాసులు చాలా మంది నివసిస్తూ ఉండేవాళ్ళు. వారిలో చూడాకర్ణుడనే సన్యాసి ఒకడుండే వాడు. అతడి కుటీరంలో హిరణ్యకుండనే ఎలుక ఓ కలుగు చేసికొని ఉండేది. ప్రతిరోజూ చూడా కర్ణుడు తాను భోజనం చేశాక మిగిలిన వంటకాలని భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్య మిద పెట్టి నిద్ర పోయేవాడు.

ఈ ఎలుక చప్పుడు చేయకుండా వచ్చి, చిలుక కొయ్య మేదికెగిరి ఆ వంటకాలని తినేసి పోతూ ఉండేది. ఓ రోజు చూడకర్ణుడు తనస్నేహితుడైన వీణాకర్ణుడనే మరో సన్యాసితో మాట్లాడుతూన్నాడు. కానీ అతడి దృష్టంతా చిలకకొయ్య మీదేఉంది. మాటిమాటికి పైకి చూస్తూ చేతికర్రతో నేలమీద అప్పుడప్పుడూ తట్టూతూ ఎలుకని దడిపించే పనిలో కొంత మునిగి ఉన్నాడు.

అది చూసి వీణాకర్ణుడు "చూడాకర్ణుడా! ఎందుకలా మాటిమాటికి పైకి చూస్తూ నేలమీద కర్రతో తట్టుతున్నావు?" అని అడిగాడు.

చూడాకర్ణుడు "ఒక ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీదికి ఎగిరి భిక్షా పాత్రలోని పదార్ధాలని తిని పోతున్నది. నాకు దీని బెడద ఎక్కువుగా ఉన్నది" అన్నాడు.

అదివిని వీణా కర్ణుడు చిలుక కొయ్యవైపు చూశాడు. అది నేల నుండి సుమారు అయిదారు అడుగుల ఎత్తున ఉంది. "ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుకకొయ్య! ఇంత అల్పజంతువునకు అంతఎత్తుకు ఎగిరే బలమెక్కడి నుండి వచ్చినది. మామూలు ఎలుకలు రెండు మూడడుగుల కంటే ఎత్తుకు గెంతలేవే? ఇది అయిదారడుగులు ఎలా ఎగిరి చిలుకకొయ్యమీది పద్దార్ధాలు మ్రింగగలుగుతోంది? ఇందులకేదో నిమిత్త ముండి యుండవలయును.

ఒకసారి నేనో బ్రాహ్మణుని ఇంట భిక్షకు పోయి ఉంటిని. అదే సమయంలో ఆబ్రాహ్మణుడు తనభార్యను చూచి "రేపు అమావాస్య. బ్రాహ్మాణులకు భోజనము పెట్టవలయుసు. ఏమేమి వంటకాలు చేయగలవు?" అన్నాడు. దానికావిడ కొంత పెడసరంగా "మగవాళ్ళు వస్తుసంభారాలు తెచ్చి, ఇంటపడేస్తె ఆడవాళ్ళు వండి వార్చుతారు గానీ, మీరు తేనిసరుకులు ఎక్కడి నుండి వస్తాయి?" అంది.

అదివిని అతడు కోపంగా "ఉన్నంతలో జరుపుకోవాలి గానీ, ఆర్భాటం చేయాలని పేరాస పడకూడదు" అన్నాడు.

దానికావిడ సౌమ్యంగా "అలాగే కానివ్యండి. రేపటి కార్యక్రమం ఉన్నంతలోనో సరిపెడతాను" అనిచెప్పంది. తర్వాత నువ్వులు కడిగి, దంచి ఎండపోసింది. ఆ రోజు ఎండ తీవ్రంగా ఉండటంతో నేను వారింటి ఎదురు చెట్టునీడలోని అరుగు మీదే విశ్రమించాసు. ఇంతలో ఓ కోడి వచ్చి ఆబ్రాహ్మణి ఆరబోసిన నువ్వులు కాళ్ళతో జీరి చెలిగి పారేసింది.

బ్రాహ్మణుడది చూసి, "ఈ నువ్వులు అంటుపడ్డవి. బ్రాహ్మణ భోజనానికి పనికి రావు. కాబట్టి వీటిని మారకం వేయి" అని భార్యకు చెప్పాడు. ఆవిడ సరేనని వాటిని చేట కెత్తింది. ఇంతలో నేను ఆవీధిలోని మరో ఇంటికి భిక్షకు పోయాను. ఆ బ్రాహ్మణి సరిగ్గా ఆ ఇంటికే వచ్చి "వదినా! ఈ నువ్వు పప్పు పుచ్చుకొని నువ్వులిస్తావా?" అని ఆఇంటి గృహిణిని అడిగింది. పాపమా ఇల్లాలు ఆనందంగా అంగీకరించి చేటలో నువ్వులు తీసికొని వచ్చి ఈమెతో మాట్లాడుతూ ఉంది. అంతలో ఆమె భర్త వచ్చాడు. "ఏమి బేరమాడు తున్నావు" అన్నాడు.

ఆవిడ సంతోషంగా "చేరడు నువ్వులిచ్చి దంచిన నువ్వుపప్పు పుచ్చుకొంటున్నాను" అంది.

ఆవిడ భర్త, ఆమాటలు విని "ఓసి వెర్రిదానా! చేరడు ముడి నువ్వులకు బదులుగా ఎవరయినా దంచిన నువ్వుపప్పులిచ్చెదరా! ఈమె ఇలా తెచ్చి ఇవ్వడానికి ఏదో రహస్యకారణం ఉండి ఉంటుంది. కాబట్టి ఆ నువ్వుపప్పు పుచ్చుకోకు" అన్నాడు.

అలాగే ఈ ఎలుకకు ఇంత బలం ఉండటానికి ఏదో రహస్య కారణం ఉండి ఉంటుంది. కారణం లేకుండా ఏవీ సంభవించవు" అంటూ ముగించాడు వీణా కర్ణుడు.

అదివిని సాలోచనగా చూడాకర్ణుడు "చూడగా ఈ ఎలుక ఇక్కడే ఎక్కడో ఓ కలుగు చేసికొని ఉంటున్నట్లుంది. దానికింత బలం ఉండాటానికి నిమిత్తమేది తెలిసినదికాదు. త్రవ్వి చూచెదను గాక" అన్నాడు.

ఆ తర్వాత చూడాకర్ణుడు ఒక గునపం తెచ్చి కుటీరమంతా వెదికి ఎలుక కలుగును కనిపెట్టి, తవ్వి పారేసాడు. ఆశ్చర్యం! మామూలుగా ఎలుక కలుగులో వడ్లూ, బియ్యం, గోధుమలులాంటి ధాన్యమో మరేదైనా తిండితిప్పలో ఉంటాయి గదా! కాని హిరణ్యకుడి కలుగులో కొన్ని బంగారు, వెండి నాణాలు కూడా ఉన్నాయి.

[నిజంగానే కొన్ని ఎలుకలు బంగారు, వెండి లాంటి మెరిసేవాటిని కలుగుల్లోకి లాక్కెళతాయి తెలుసా! నా చిన్నప్పుడు మాపిన్ని రెండు వరుసల బంగారు మంగళ సూత్రం గొలుసు పోయింది. ధాన్యం బస్తాలున్న గదిలో ఆవిడా, ఆవిడ భర్తా నిద్రపోయేవాళ్ళు. గొలుసుపోయిన తగాదాలో ఉమ్మడి కుటుంబం కాస్తా వేరు కాపురాలు పడ్డాయి. ఆర్నెల్ల తర్వాత, ధాన్యం బస్తాలు తీసినప్పుడు, బస్తాలు క్రింద ఎలుక కలుగు కనబడింది. తవ్వితే కుంచెడు [రమారమి రెండు కిలోలు] వడ్లూ, వాటితో పాటే బంగారు గొలుసు, ఇంకా మెరిసే పట్టు లేసుతాళ్ళు కనబడ్డాయి. శాస్త్రీయ కారణం నాకు తెలీదుగానీ కొన్ని ఎలుకలకి బంగారు రంగు మీద మోజుంటుందని మాత్రం చెప్పగలను.]

చూడాకర్ణుడు ఆనందంగా ఆ వెండి బంగారు నాణాల్ని సంగ్రహించి వీణా కర్ణుణితో "నీవు చెప్పినది నిజమే. ఈ ఎలుక దగ్గర రహస్య సంపద ఉన్నది. అందుకే దానికి మామూలు ఎలుకల కన్నా చాలా ఎక్కువ బలం ఉంది" అని చెప్పాడు.

కాబట్టి ప్రతీ అసాధారణ విషయం వెనుకా ఏదో కారణముండి ఉంటుంది.

అంటే ప్రతీదాని వెనుకా ....

ఇందుల కేదో నిమిత్త ముండి యుండవలయును.
ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇలాక్కూడా మనం నష్ట పోవచ్చు

ఆపరీక్షితకారి అనే బ్రాహ్మణుని కథ

ఒకా నొకప్పుడు గౌడ దేశం లోని ఓ అగ్రహారం లో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడు వేదాల్ని, సకల శాస్త్రాల్ని అధ్యయనం చేశాడు. అరిషడ్వర్గాల్ని [ఆరు భావోద్రేకాలు: కామ, క్రోధ, లోభ , మోహ, మద, మాత్సర్యాలు] అధిగమించడ మెలాగో తెలిసినవాడు.

అతడికి సంతానం లేదు. ఇది తప్ప అతడికి మరే కొరతా లేదు. అతడి భార్య యాఙ్ఞసేని. తనకు సంతానం లేకపోవడం చేత ఆవిడ బిడ్డల తల్లులైన తన ఇరుగుపొరుగు స్త్రీలను చూసి ఎంతో ముచ్చట పడుతుండేది బిడ్డల కోసం ఆరాటంతో ఆవిడ సాధువుల్ని, సాధువేష ధారుల్నీ కూడా భక్తిగా కొలిచేది. స్వాముల కాళ్ళ మీద పడి వేర్లూ, తాయత్తులూ కట్టించు కొంటూ ఉండేది. రాయి కనబడితే రాయికి, గుడి కనబడితే గుడికీ మ్రొక్కేది. ఎవ్వరే తీర్ధం పేరు చెబితే ఆ తీర్ధానికి పోయి మునకలు వేసేది. లోకంలో లేని వ్రతాలూ, నోములూ నోచేది. ఇలా కొంత కాలం గడిచింది.

కొన్నాళ్ళకి దేవుడి దయ కలిగిందో ఏమొ, యాఙ్ఞసేని గర్భవతై పండంటి కొడుకుని కన్నది. లేక లేక పుట్టిన బిడ్డని దేవశర్మ, యాఙ్ఞసేని ఆ బిడ్డని అపురూపంగా పెంచసాగారు. కంటికి రెప్పలాగ కాపాడుతూ, బిడ్డని గుండెల మీద బెట్టుకు పెంచుతూండె వారు. పిల్లవాడి పాదాలు తల్లిదండ్రుల అరచేతుల్లో తప్ప నేల నంటనంత అపురూపంగా కొడుకుని పెంచసాగారు.

ఓ రోజు యాఙ్ఞసేని కొడుకుకి స్నానం చేయించి, పాలిచ్చి, నిద్రపుచ్చి వుయ్యాలలో పడుకోబెట్టింది. బిడ్డని జాగ్రత్తగా చూస్తుండమని భర్తకి చెప్పి, ప్రక్క వీధి లోని పుట్టింటికి వెళ్ళింది.

ఆ రోజు పర్వదినం కావటంతో ఆ నగరపు రాజు దేవశర్మకు పవిత్రదానమియ్య దలిచి ఆహ్వానం పంపాడు. దేవశర్మకు రాజు గారిచ్చే ద్రవ్య కనక వస్త్ర ధాన్య దానం అత్యంత అవసరం.

అతడికేం చేయాలో తోచలేదు. "చాలా కాలం తర్వాత రాజుకి నా మీద దయ కలిగింది. పండిత ప్రకాండులెందరో ఉండగా దానం నాకే ఇవ్వదలిచి కబురంపాడు. నా భాగ్యమిట్లుండి , రాజు ఆహ్వానం పంపగా, నా అభాగ్య దేవత ఈ సంధర్భం లోనే నాకీ ఇబ్బంది తెచ్చి పెట్టింది. నా భార్య ఎప్పుడు రావాలి, నేనెప్పుడు రాజమందిరానికి పోవాలి. పోనీ నా భార్య రాక పోయినా రాజుమందిరానికి పోదామంటే పిల్లవాడికి రక్షణ గా ఇంట్లో ఇంకెవ్వరూ లేరు ఆలస్యం చేస్తే రాజు ఈ దానాన్ని ఇంకెవ్వరికైనా ఇచ్చేయగలడు . ఏం చేయను? ఓ వుపాయం ఉన్నది. నా ఇంట పెంపుడు ముంగిస వున్నది గదా! ఎంతో కాలం నుండీ దాన్ని నేను ప్రేమగా పెంచున్నాను . ఈ ముంగిని నా బిడ్డకు కాపలాగా పెట్టి రాజ మందిరానికి వెళ్తాను. దానం పుచ్చుకొని ఇంటనున్నట్లే పరుగెట్టుకొని వెనక్కి వస్తాను."

ఇలా ఆలోచించి దేవశర్మ తన పెంపుడు ముంగిసని చేతుల్లోకి తీసికొని, ప్రేమగా దాని శరీరం నిమిరి, ఊయలలోని బిడ్డని చూపించి కాపుండ మని సైగలతో సూచించి రాజమందిరానికి పోయాడు . ఆచారప్రకారం దానం పుచ్చుకొని రాజుని దీవించి పూజాదికాలు నిర్వహించాడు. ఆ అరఘడియ పాటూ అతడి దేహం రాజ మందిరం లోనూ, మనస్సు ఇంట వుయ్యాల లోని కొడుకు మీదనూ వున్నాయి.

ఆ సమయం లో ఓ నల్ల త్రాచు వారింటి మిద్దె పైనుండి లోనికి జారి ఉయ్యాల తాడు మీదుగా బిడ్డ పానుపు పైకి ప్రాకుతోంది. ముంగిస పాముని చూసింది. రాబోయె ప్రమాదం పసి కట్టింది. ఒక్క ఉదుటున పైకెగిరి పాము మెడ పట్టుకొంది. పాముని ముక్కలు ముక్కలు చేసి నేల మీద పారేసింది. రక్తపు చుక్కలు నేలంతా పడ్డాయి.

ఇంతలో దేవశర్మ రాజ మందిరంలో ఆచార వ్యవహారాలు పూర్తి చేసుకొని, దానం పుచ్చుకొని ఇంటి ముఖం పట్టాడు. కొడుకు మీది ప్రేమ, అభద్రతా తనని తరుముతుండగా కాలి మడమలు నేలనంటనంత వేగంగా ఇల్లు చేరాడు.

ముంగిస తన యజమాని పద సవ్వడి విన్నది యజమాని బిడ్డని కాపాడాను కదా అన్న ఆనందంతోనూ , తనకి అప్పగించిన పనిని విజయవంతంగా చేసేను గదా అన్న సంతోషం తోనూ, యజమాని పట్ల దానికి గల ప్రేమ తోనూ, ముంగిస పరుగున దేవశర్మకు వీధి వాకిట్లోకి ఎదురుబోయింది. దాని నోరు రక్తం తో నిండి ఉంది. లోని గది లోనుండి వీధి వాకిలి వరకూ రక్తపు బిందువులు పడి ఉన్నాయి.

ఎంతో ప్రేమ తోనూ, కృతఙ్ఞత తోనూ, ముంగిస దేవశర్మ కాళ్ళు నాకుతున్నది. దేవశర్మ ముంగిసనీ, దాని రక్తపు మూతినీ చూసాడు. ఒక్కసారిగా అతని గుండె బ్రద్దలైనంత పనయ్యింది. తుఫానులో ఊగే చెట్టులా అతని శరీరం వణికింది. ముంగిస తన బిడ్డని చంపి ఉంటుందని ఈ బ్రాహ్మణుడు అనుకొన్నాదు. విపరీతమైన కోపం తో ఊగి పోయాదు.

"ఓసి పాపిష్ఠి దాన! ఎంతోకాలం నుండి చేర దీసి పెంచానన్న కృతఙ్ఞతైనా లేదే నీకు? ఎలా చంప గలిగావు నా బిడ్డని" అంటూ మితిమీరిన కోపం తోనూ, ఆ చిన్ని ముంగిస కన్నా ఎంతో బలమైన వాడి నన్న అంతర్గత అహం తోనూ, ముందు వెనుకలు ఆలో చించని తొందర పాటు తనం తోనూ, లావు పాటి కర్రతో ముంగిస నెత్తిమీద బలంగా కొట్టాడు.

ఆ దెబ్బ సరిగ్గా ముంగిస తల పైన ఆయువు పట్టు పైన తగిలింది దాని కనుగ్రుడ్డ్లు వెలికి వచ్చాయి. నేల మీద పడింది . హోరుగాలిలో చిరుకొమ్మలా విలవిల లాడింది. పెద్దగా ఒక్క అరపు అరిచి ప్రాణాలు విడిచింది. తానెంతో ప్రేమగా దగ్గరికి వస్తే యజమాని ఎందుకు తనని కొట్టాడో అర్ధం కాని అమాయకత్వం దాని కళ్ళల్లో ఉంది. తానెంతో భాధ్యత గా యజమాని కొడుకు ప్రాణం కాపాడితే, అతడెందుకు తనని చావ గొట్టాడో అర్ధం కాని అయోమయం దాని చూపుల్లో ఉంది. ఆ బాధని చావు దాని కళ్ళల్లో శాశ్వతం చేసింది.

ఇదేమీ దేవశర్మ పట్టించు కోలేదు. అతడక్కడ ఆగనూ లేదు. ఇంటిలోనికి ఒక్క అంగలో పరుగు పెట్టాడు. గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. కొడుకు చని పోయి ఉంటాడని మానసికంగా సిధ్ధమై పోయాడు. ఒక్క ఉదుటున ఉయ్యాల చేరాడు . ఉయ్యలలో పరుపు మీద బిడ్డ ఆదమరచి నిద్రిస్తూనే ఉన్నాడు. బిడ్డని సజీవంగా చూసాక గాని దేవశర్మ ఆవేశం, ఆక్రోశం తీరలేదు. అప్పటికి గాని అతనికి బాహ్య స్పృహ కలగ లేదు. అప్పుడు చూశాడతడు నేల మీద పడి ఉన్న నల్ల త్రాచు శరీర ఖండాల్నీ, రక్తపు బిందువుల్నీ.

అప్పటికి గాని అతడికి పరిస్థితి అర్ధం కాలేదు. ఇప్పుడతడు ముంగిస కోసం ఆక్రోశపడ సాగాడు. రొమ్ము మీద, గుండెల మీద, తల మీద, కడుపు మీద కొట్టుకుంటూ బిగ్గరగా ఏడ్వటం మొదలు పెట్టాడు.

"ఎంత మూర్ఖుణ్ణి నేను! నా పెంపుడు ముంగిస నా బిడ్డ ప్రాణాలు కాపాడింది. నిజం చెప్పాలంటే నా ప్రాణాల్నే కాపాడింది. కానీ, నేనది నా బిడ్డని చంపేసిందనుకొన్నాను. అది ప్రేమగా నా దగ్గరికి వస్తే, నేను దాన్ని చంపి వేశాను. ఏ విషయమూ పరిశీలించ లేదు. ఒక్క నిముషమైనా ఆలోచించ లేదు. కొద్ది క్షణాలు ఆగి ఉన్నా , లేదూ కొన్ని అడుగులు ఇంటి లోపలికి వేసినా నిజం తెలుసుకొని ఉండేవాణ్ణి. నా పెంపుడు ప్రాణిని కాపాడుకొని ఉండేవాణ్ణి. నా కొడుకు పుట్టక ముందు నుండీ ఆ ముంగిసని నా స్వంత కొడుకు లాగా ఈ చేతుల్లో పెంచాను. ఇప్పుడు ఇదే చేతుల్తో దాన్ని చంపేసాను. ఎవ్వరు నాకు దాన్ని ప్రాణాలతో వెనక్కి ఇవ్వగలరు ? ఎవ్వరు కాలాన్ని వెనక్కి తేగలరు? ఎవ్వరు జరిగి పోయిన దారుణాన్ని వెనక్కి త్రిప్పగలరు? వేదాలు చదివీ, అరిషడ్వర్గాలని అణిచే మార్గాలని యెరిగీ, చర్య చేపట్టే ముందు ఒక్క క్షణం సహనం తో ఆలో చించ లేక పోయానే! నిజంగా, జీవితంలో క్రోధం ఎంత ప్రమాదకరం? కోపం ఎంత కీడు కలిగిస్తుంది. కోపం నా నిజ మైన శతృవు ."

అతడెంత ఏడ్చినా , ఇప్పుడెంతగా పశ్చాత్తాప పడినా అతడి అమాయకపు పెంపుడు ముంగిస మాత్రం అతడికిక లేదు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

బార్బర్ బంగారం

అనగా అనగా…

ఒకప్పుడు అక్బర్ ఆస్థానంలో ఓ ఆస్థాన మంగలి ఉండేవాడు. అతడు తన వృత్తిలో చాలా నేర్పరి. అతడు గడ్డం గీస్తే అక్బరుకి మల్లెపూల చెండుతో చెంపలు తడిమినట్లుంటుంది. అతడు తలపైన క్షౌరం చేస్తే ప్రేమగా తన మనమరాలు తన జుట్టుతో ఆడుకున్నంత హాయిగా ఉంటుంది. అతడు తైలమర్దనా చేసి ఒళ్ళంతా మాలీషు చేస్తే ఏదో లోకంలో విహరించినట్లుంటుంది. అందుచేత అక్బరుకి ఈ మంగలంటే కాస్త అభిమానం పెచ్చు. దానితో మంగలికి కూడా పాదూషా దగ్గర కాస్త చనువు ఉండేది.

ప్రతి రోజూ మంగలి ॒క్షుర కర్మ చేసేటప్పుడు పాదుషా యధాలాపంగా ఏదో మాట్లాడుతుండేవాడు. పాదుషా తనపాలన గురించి ప్రజలేం అనుకొంటున్నారని అంటే మంగలి పాదుషాని ప్రజలు దేవుడంటున్నారని, ఆయన పాలన అంతనీ ఇంతనీ పాదుషాని ఆకాశాని కెత్తేసేవాడు. తన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారని అక్బరు అడగటం ఆలస్యం ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారనీ, సిరిసంపదలతో తులతూగు తున్నారనీ చెప్పేవాడు. అందులో కొంత నిజం, మరికొంత ఎక్కువ అతిశయోక్తులు ఉండేవి.

ఇదంతా గమనిస్తున్న బీర్బలు మంత్రి వ్యవహరాన్ని ఇలాగే వదిలేస్తే ॒క్షేమం కాదనుకొన్నాడు. మంగలి, పాదుషా గారి శరీరానికి తైలం వేస్తే ఫరవాలేదు. మనస్సుకి వేస్తున్నాడు. అది పరిమితి దాటితే ప్రమాద హేతువే. ఏ శతృరాజైనా ఈ మంగలినే వేగుగా ప్రయోగిస్తే?

అందుచేత బీర్బలు మరునాడు నుండి పాదుషా క్షురకర్మ చేయుంచు కొనేటప్పడు తానూ పాదుషా ప్రక్కనే ఉంటూ పిచ్చాపాటి మాట్లాడసాగాడు. ఓ రోజు అలాగే పిచ్చాపాటి మాట్లాడతుండగా, తరచుగా పాదుషా అడిగే ప్రశ్నను ఈ సారి బీర్బల్ అడిగాడు, అక్బరు వారి పాలనలో ప్రజలెలా ఉన్నారని. మామూలుకంటే ఎక్కువ హుషారుగా మంగలి ప్రజలంతా భోగభాగ్యలతో తులతూగుతున్నారనీ, హాయిగా ఏ కష్టమూ లేకుండా ఉన్నారనీ, అంతా పాదుషా వారి చలవేననీ తెగతైలం వేసేశాడు.

ఇంతలో పాదుషాకి ॒క్షురకర్మ చేయటం పూర్తయింది. మంగలి కత్తి గట్రా శుభ్రం చేసుకోవటానికి ప్రక్కకి వెళ్ళాడు. బీర్బలు మంగలి పొదిని తెరిచాడు. అక్బరు, బీర్బల్ చర్యల్ని గమనిస్తూ మౌనంగా ఉన్నాడు. బీర్బల్ మంగలి పొది వెదుకుతున్నాడు. ఆశ్చర్యం! ఆ మంగలి వాని పెట్టెలో [పొది] లో కోడి గ్రుడ్డంత బంగారం ముద్ద ఉంది. గప్ చుప్ గా బీర్బల్ దాన్ని తీసి దాచేసాడు. ఏ పనీ బీర్బల్ వృధాగా చేయడనీ తేలిసిన అక్బర్ ఏం జరుగుతుందో చూడదలిచి ఏమి అనలేదు.

ఇంతలో మంగలి వచ్చి తన పెట్టి అడుగున బంగారం పోయిన సంగతి తెలియదుగనుక మామూలుగా కత్తి గట్రా సర్దుకొని పాదుషా దగ్గర సెలవు తీసికొన్నాడు.

మరునాడు మంగలి ముఖం వాడి పోయి ఉంది. ప్రపంచంలోని కష్టమంతా తనకే వచ్చినట్లున్నాడు. అతడి ముఖంలో దిగులూ, దుఃఖమూను.

చాలా నీరసంగా, నిస్తేజంగా పాదుషా వారికి గడ్డం గీస్తున్నాడు. నిన్నటి ప్రశ్ననే బీర్బల్ మళ్ళీ మంగలిని అడిగాడు. మంగలి నిట్టూరుస్తూ "ఏం చేప్పను హుజూర్! ప్రజలంతా నానా ఈతి బాధలతో సతమతమౌతున్నారు. దరిద్రం, అనారోగ్యం వారిని కుదిపెస్తున్నాయి. ఎటు చూసినా బాధార్తులే!" అన్నాడు.

అక్బరు కూ చాలా ఆశ్చర్యం వేసింది. అయినా మౌనంగానే ఉన్నాడు. ఈ రోజు మంగలి కత్తి కడగటానికి వెళ్ళినప్పడు బీర్బల్ మంగలి పొదిలో బంగారాన్ని యధాతధంగా పెట్టెసాడు. ఇదేమీ తెలియని మంగలి అదే దుఃఖభారంతో పాదుషా దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.

మరునాడు మంగలి ముఖం వెలిగిపోతుంది. హుషారుగా, ఆనందంగా పాదుషా వారికి క్షురకర్మ చేస్తున్నాడు. బీర్బల్ యధాలాపంగా అడిగినట్లు రోజుటి ప్రశ్నను వేశాడు. మంగలి ఎంతో ఆనందంగా "ప్రజలు ఆనందంతో నాట్యం చేస్తున్నంత హయిగా జీవిస్తున్నారు" అంటూ వెనకటి జవాబే చెప్పాడు. ఇందతా చూస్తూన్నా అక్బర్ ఫకాలుమని నవ్వాడు. మంగలికేమీ అర్దంకాలేదు. పాదుషా చిరునవ్వుతో "పోయిన నీ బంగారం తిరిగి దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు" అన్నాడు. మంగలి మ్రాన్పడి పోయాడు. "హుజూర్! నా బంగారం పోయి దొరికినట్లు తమరికెలా తెలుసు?" అన్నాడు.

అక్బర్ మాట్లాడకుండా చిరునవ్వుతో అతడికి బహుమతి ఇచ్చి పంపేశాడు. బీర్బల్ వైపు సహేతుకంగా చూశాడు.

బీర్బల్ చిరునవ్వునవ్వి "హుజూర్! తనపెళ్ళి విశ్వకళ్యాణం అనీ, తన చావు జగత్ర్పళయమనీ కొందరనుకొంటారు. పచ్చిస్వార్దం తప్ప అందులో మరేమి ఉండదు. అలాంటి వాళ్ళా మాటల్లో విశ్వసనీయత ఉండదు. అలాంటి వారి నివేదీకల్ని నమ్మరాదు" అన్నాడు.

అక్బర్, బీర్బల్ సునిశిత ఆలోచనా పటిమని మెచ్చుకొన్నాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes