RSS
Wecome to my Blog, enjoy reading :)

ఉజ్జయినీ నగర నిర్మాణం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 13]

భట్టి ఇదంతా రెప్పవాల్చక, ఊపిరి పీల్చక చూస్తున్నాడు. విక్రమాదిత్యుడి శిరస్సు త్రిశూలాన్ని తాకిన క్షణాన, భట్టి కళ్ళ ముందు పెద్ద మెరుపు మెరిసినట్లయ్యింది. ఆ వెలుగుకతడు కళ్ళు మూసుకున్నాడు. క్షణం తర్వాత కళ్ళు తెరిచి చూస్తే... అతడి ముందు ట్రిశూలమూ లేదు, విక్రమాదిత్యుడి దేహమూ లేదు.

భట్టి, విక్రమాదిత్యుడి ప్రాణశ్శరీరాలను మహంకాళీ మాత కాపాడి ఉంటుందని ఊహించాడు. వెంటనే ఆలయంలోకి పరిగెత్తాడు. అక్కడ అమ్మవారి విగ్రహం ముందు, విక్రమాదిత్యుడి శరీరం పరుండబెట్టి ఉంది. విక్రమాదిత్యుడు స్పృహలో లేడు.

భట్టి దీనిని ముందే ఊహించాడు. మహంకాళి దివ్యవిగ్రహానికి చేతులు జోడించి నమస్కరిస్తూ.... భట్టి " ఓ తల్లీ! సంతోష ప్రదాయనీ! సాధు జన కల్పవల్లీ! దీనుల పాలిట అమృత వల్లీ! భయోత్పాత నాశినీ! సంకట హారిణీ! దయామూర్తీ! శాంకరీ! శాంభవీ! పరమేశ్వరీ! పరమానంద స్వరూపిణీ! భవానీ! కాళీ! భద్రకాళీ! పరమానంద కాళీ! ఓంకారీ! క్రీంకారీ! హ్రీంకారీ! సర్వజనులకూ మాతృమూర్తివి నీవు! మము దయజూడవే మాతా! నీ దయార్ధ్ర దృక్కులకై విక్రమార్కుడీ సాహసానికి పూనుకున్నాడు. ఓ భక్త జన ప్రియ మాతా! మమ్ము రక్షించు! విక్రమాదిత్యుని దీవించు!!" అని ప్రార్దించాడు.

మహంకాళీ మాతకు విక్రమాదిత్యుడి సాహసం పట్లా, భట్టి మృదు మధుర భాషణ పట్లా ఎంతో ప్రీతి కలిగింది. ఆ తల్లి కరుణతో, విక్రమాదిత్యుడు స్పృహలోకి వచ్చాడు. దేవి వాళ్ళ ముందు చిరునవ్వుతో ప్రత్యక్షమైంది.

భట్టి విక్రమాదిత్యుల ఆనందానికి అవధులు లేకపోయాయి. పరమానందంతో, భక్తి పారవశ్యంతో, ఆ తల్లికి నమస్కరించి, స్త్రోత్రాలు చేశారు. ఆ తల్లి ప్రసన్నంగా "వత్సలారా! ఏమి మీ కోరిక? మీకేమీ వరములు కావలెనో కోరుకోండి, తీర్చెద గాక!" అంది.

విక్రమాదిత్యుడు వినయంగా చేతులు జోడించి, "తల్లీ! ఇచ్చోటన ఒక అందమైన, మహా నగరాన్ని నిర్మించాలని మా ఆకాంక్ష! ఈ ఆలయానికి దాపుననే, ఎటు చూసినా 10 ఆమడలుండే విధంగా... చక్కని, భారీ నగరాన్ని నిర్మించునట్లు మమ్మల్ని ఆశీర్వదించు! అట్టి నగరాన్ని నిర్మించేందుకు, సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి పాలించేందుకు, మాకు ఐశ్వర్యం కావాలి. వీటన్నిటినీ సాధించేందుకు నీ కరుణ కావాలి" అన్నాడు. [దూరాన్ని ఆమడలలో కొలవటం అప్పటి లెక్క.]

కాళీ మాత, చిరునవ్వుతో, ప్రేమ నిండిన కళ్ళతో - "బిడ్డలారా! మీరు కోరిన ప్రతీ వరాన్నీ అనుగ్రహిస్తున్నాను. ఈ ఆలయమునకు ఈశాన్య దిక్కున తవ్వేనట్లయితే... నవ రత్నాలూ, బంగారమూ ఉన్న నిధి నిక్షేపాలని పొందగలరు. ఇక్కడే నగర నిర్మాణము గావించి, సామ్రాజ్య స్థాపన చేయ గలరు. ఉజ్జయిని అను పేరున అది మిక్కిలి ప్రసిద్ది చెందగలదు" అని వరమిచ్చి, వారిరువురినీ దీవించి అంతర్దాన మైంది.

భట్టి విక్రమాదిత్యులు ఎంతగానో ఆనందించారు. [ఉజ్జయినీ కాళీ ఆలయం ఇప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అష్టాదశ శక్తి పీఠములలో అది ఒకటి!]

భట్టి విక్రమాదిత్యులు, సైన్యాన్ని, కూలీలని నియోగించి, దేవీ కోవెలకు ఈశాన్య దిక్కున తవ్వించారు. నవరత్నాలతో నిండిన, బంగారు గని కనుగొన్నారు. వెలలేని ఆ సంపదని ఉపయోగించి, వాళ్ళు ఉజ్జయినీ నగరాన్ని, అతి సుందరంగా నిర్మించారు. రాజాంతఃపురాలు, నివాస విలాస భవనాలు, రాజోద్యోగ కార్యాలయ భవనాలు, ఉద్యాన వనాలు, క్రీడా మైదానాలు, సుందర సరోవరాలు, సభాభవనాలు, వస్తు విక్రయ ప్రదర్శన శాలలు, దేవాలయాలు, కళామందిరాలు... ఇలా కావలసిన అన్ని వసతులనీ సమకూర్చుకున్నారు.

తమ పూర్వ రాజధాని యైన కన్యాపురానికి, తమ అనుచరుణ్ణి సామంత రాజుగా నియమించి, పరిపాలనా కట్టుదిట్టాలన్నీ చేశారు.

ఒక శుభముహుర్తాన, తమ కుటుంబ సభ్యులూ, ఆశ్రితులూ, అనుచరులూ వెంటరాగా ఉజ్జయినీ నగర ప్రవేశం చేశారు. అది గొప్ప ఉత్సవంగా నిర్వహించారు. మహంకాశీ దేవికి అంగరంగ వైభవంగా పూజాదికాలు, ఉత్సవాలు జరిపించారు. మంత్రులూ, సైన్యాధికారులూ, పాలనాధికారులూ... మొదలు దిగువ స్థాయి రాజోద్యోగుల వరకూ, అందరికీ, వారి వారి స్థాయిని బట్టి, తగిన నివాసాలను కేటాయించారు. సామాన్య ప్రజలకు వారి వృత్తులకు, స్థాయిలకూ తగిన ఆవాసాలని కల్పించారు.

అందమైన, సౌకర్యవంతమైన, విశాలమైన నగరం! చుట్టూ అందమైన ప్రకృతి! పర్వతాలు వరస పెట్టని గోడలా విలసిల్లుతోంది. ప్రక్కనే నదీ ప్రవాహపు గలగల! నీటికి కొఱత లేదు. సారవంతమైన నేలతో ఆహారానికి కొఱత లేదు. చల్లని ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో, అందరూ ఆనందంగా జీవిస్తున్నారు.

భట్టి విక్రమాదిత్యులు మరోసారి తమ సామ్రాజ్యాన్ని పర్యటించి, పటిష్టపరుచు కున్నారు. సర్వ సమర్దమైన, పటిష్ఠమైన పాలనా విధానాలని ప్రవేశపెట్టి నిర్వహించారు. ఉజ్జయినీ రాజ్యప్రజలు, దేనికీ కొరతలేకుండా... చోర ప్రకృతి ఉత్పాత భయాలు లేకుండా.... ప్రశాంతంగా, హాయిగా ఉన్నారు.

రాజు ధర్మపరుడైతే... ఆ రాజ్యంలో వరదలూ, కరువులూ, భూకంపాలూ, వంటి ప్రకృతి ఉత్పాతాలుండవట. విక్రమాదిత్యుడి పాలనలో నెలకు నాలుగు వానలు కురిసేవి. రైతులకి పుష్కలంగా పంటలు పండేవి. ధన ధాన్యాలతో, సిరి సంపదలతో, సుఖశాంతులతో ఎల్లెడలా సంతోషం వెల్లి విరుస్తుండేది.

మానసిక ఉల్లాసానికి, కళలూ సాహిత్యమూ ఇతోధికంగా పోషింపబడేవి. స్వయంగా 64 కళలలో ఆరితేరిన భట్టి విక్రమాదిత్యులు, అన్ని విషయాలని పర్వవేక్షించే వాళ్ళు. సమర్దులైన, నీతి పరులైన ఉద్యోగులని నియమించి, ఎక్కడా ఏ అసౌకర్యమూ, అన్యాయమూ ప్రజలకి కలగకుండా జాగ్రత్త తీసుకునేవాళ్ళు.

అధ్యాత్మిక ఉన్నతికై.... ప్రజలలో భక్తి భావనలు, భావోద్రేక అతిక్రమణకై విద్యాంసుల, మునుల ప్రవచనాలు నడిచేవి. ‘యధా రాజాః తధా ప్రజాః’ అన్నట్లు ప్రజలూ ధర్మపరులై మెలిగే వాళ్ళు.

అదంతా కాళీ మాత కృపగా భావించి, అందరూ ఆ దేవిని సేవించే వాళ్ళు!

పంటలు సమృద్దిగా పండుతున్నాయి. ప్రజలు సంతృప్తిగా బ్రతుకు తున్నారు.

ఇలా ఉండగా....
~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes