RSS
Wecome to my Blog, enjoy reading :)

భేతాళుని కథలో భాగవత గాథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 53]

ఇన్ని ప్రయత్నాలతో విక్రమాదిత్యుడు విసుగు చెందలేదు. పైగా భేతాళుడు చెబుతున్న కథల పట్ల తడవ తడవకీ మరింత కుతూహల పడసాగాడు. దాంతో పందొమ్మిదో మారు మోదుగ చెట్టెక్కి భేతాళుడున్న శవాన్ని దించి, భుజాన పెట్టుకుని బృహదారణ్యం వైపు నడక సాగించాడు. భేతాళుడూ ఊరుకోలేదు. మరో కథ ప్రారంభించాడు.

“విక్రమాదిత్య ధరణీ పాలా! విను” అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు పద్మపురం అనే నగరముండేది. దానికి రాజు జీమూత వాహనుడు. (నిజానికి ఇది భాగవతంలోని కథ. భట్టి విక్రమార్క కథల్లోకి చొప్పించబడి ఉండాలి.) ఆనాటి రాజులందరిలో జీమూత వాహనుడు ఉత్తమోత్తముడు. అతడికి సుసంపన్నమైన సైన్యం ఉండేది. సుశిక్షితులైన అధికార యంత్రాంగం ఉండేది.

అయినా గానీ.... రాజు, ప్రచ్ఛన్న వేషంలో స్వయంగా రాజ్యమంతటా పర్యటించి, ప్రజల బాగోగులు తెలుసుకుంటూ, వారిని కన్నబిడ్డల్లా కాపాడుతూ ఉండేవాడు. వేగులు తెచ్చే సమాచారంతో, తను స్వయంగా తెలుసుకున్న విషయాలను సరిపోల్చుకుని, పాలనా పరిస్థితులనీ, ప్రజల స్థితిగతులనూ అంచనా వేసుకునేవాడు.

అందుకే తరచుగా మారువేషంలో నగర పర్యటన చేసేవాడు.

ఆ రోజులలో పద్మపురం ప్రక్కనే ఓ చిన్నపాటి అడవి ఉండేది. అందులో చాలా పాములుండేవి. ప్రతీ రోజూ గరుడుడు వచ్చి పాముల్ని చంపి తినేవాడు. మహా విష్ణువు వాహనమైన గరుడుడు మహాబల సంపన్నుడు. అలాంటి గరుత్మంతుడు ప్రతీ రోజూ, ఏమాత్రం కనికరం లేకుండా, కనబడిన పాముల్ని కనబడినట్లు పట్టుకుని చంపి తినే వాడు.

ఆ కారణంనా ఆ చిట్టడివిలోని పాములన్ని భయోతాత్పతంలో పడి ఉన్నాయి. ఓ రోజు పాములన్నీ ఓ చోట సమావేశమైనాయి. తమ మృత్యు ప్రమాదం గురించి చర్చించుకున్నాయి. చివరికి తామంతా కలిసి గరుడుడికి ఓ విన్నపం చేయాలని నిశ్చయించుకున్నాయి. ఆపైన గరుడుడి రాక కోసం ఎదురు చూసాయి. అంతలో గరుడుడు రానే వచ్చాడు.

పాములన్నీ కలిసి ఏక కంఠంతో “హే గరుడా! మాదో ప్రార్ధన. దయతో ఆలకించు” అన్నాయి. గరుడుడు “ఏమిటి?” అన్నాడు. పాములు “గరుడా! నీవు మహావిష్ణువు వాహనుడవు. ఆ దేవదేవుని నీ బలమైన రెక్కల మధ్య మోసి మహిమాన్వితుడవైనావు. మేము నీ సేవకులం. నీకు ఆహారంగా అనుగ్రహించబడిన వాళ్ళం.

మా ఈ చిన్న పాముల గుంపు, గుట్టుగా ఈ చిట్టడవిలో బ్రతుకుతూ ఉంది. ప్రతీ రోజూ నీవు వచ్చి, కనబడిన పాముని కనబడినట్లు చంపి తింటున్నావు. దాంతో మేం దినదినం ప్రాణ గండంగా జీవిస్తున్నాం. ప్రతి దినమూ మృత్యువు మా వాకిట నిలిచే ఉంటోంది. నిత్యం భయంతో బ్రతుకు లీడుస్తున్నాం.

బ్రతికి ఉన్న క్షణాలైనా ప్రశాంతత లేకుండా పోయింది. దానితో మొత్తంగా మా జాతే సర్వనాశనం అయ్యే స్థితిలో ఉంది. ఆవల నీకూ ఆహార లభ్యతలో లోపం ఏర్పడగలదు. కావున మాది ఓ చిన్న విన్నపం. దయతో ఆలకించ వలసింది.

ప్రతీ దినం నీకు ఆహారంగా, మేం ఇంటి కొకరంగా వంతు లేసుకుని రోజు కొకరంగా వస్తాము. ఈ వంతుల పద్ధతిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ జవదాటం. దయ చేసి నీవు, నీకు ఆనాటికి ఆహారమయ్యే వంతు గల పామును తప్ప, ఇతర వాటి జోలికి రానట్లయితే మేం బ్రతికిన నాలుగు నాళ్ళయినా ప్రశాంతంగా, భయరహితంగా బ్రతక గలము.

ఇదీ మా ప్రార్ధన! ఓ గరుడా! దయతో అంగీకరించగలవు. నీవు బలాఢ్యుడవు. మేము అల్పులము. కరుణతో చూడు!” అని ప్రార్ధించాయి.

గరుడుడు వాటి ప్రార్ధన మన్నించాడు. ఆనాటి నుండి గరుడుడు, విచ్చల విడిగా పాముల్ని వేటాడి, చంపి తినడం మాని వేసాడు. ఆ రోజుటి వంతు ప్రకారం, తనకి ఆహారంగా వచ్చే పాముని మాత్రమే భుజించి వెళ్ళిపోసాగాడు. రోజులు గడుస్తున్నాయి.

ఒక రోజు.... ఆనాటి వంతుగా శంఖచూడుడు అనే పాము వంతు వచ్చింది. అది దాని తల్లికి ఏకైక సంతానం. ఆ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడ్వసాగింది. సరిగ్గా ఆనాడే జీమూత వాహనుడు తన రాజ్యపు మంచి చెడులను పర్యవేక్షించేందుకు నగర పర్యటనకి వచ్చాడు. నగరానికి దాపులనే ఉన్న ఈ చిట్టడివిలో, ఈ పాము తల్లి దుఃఖం చూసి, ఆయన చలించి పోయాడు.

“తల్లీ! ఎందుకిలా దుఃఖిస్తున్నావు?” అని అడిగాడు.

ఆ తల్లి తన శోక కారణాన్ని వివరించి చెప్పింది. జీమూత వాహనుడు ఆమెను ఓదార్చి, ఆమె పుత్రుణ్ణి కాపాడగలనని అభయమిచ్చాడు. అప్పటికే గరుడుడికి ఆహారంగా కొండకొమ్ముకి చేరిన శంఖచూడుణ్ణి వెదుక్కుంటూ వెళ్ళి కలిసాడు.

“శంఖచూడా! నీప్రాణం కాపాడతానని నీ తల్లికి మాట ఇచ్చాను. ఈ రోజు గరుడునికి ఆహారమయ్యే వంతు నీదని నాకు తెలుసు. నీ బదులుగా నేను గరుడునికి ఆహారమౌతాను. నీవు ఇంటికి వెళ్ళి, నీ తల్లికి సంతోషం కలిగించు” అన్నాడు.

దానికి శంఖచూడుడు “ఓ రాజా! ఈ లోకానికి నా జీవితం వల్ల ఒనగూడే ప్రయోజనమేమిటి? నేను అల్ప జీవిని. అంతేగాక విష ప్రాణిని. నీవు జీవించి ఉన్నట్లయితే.... మన దేశానికెంతో మేలు చేకూర గలదు. నీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. నీవు స్వార్ధపూరితుడైన పాలకుడవు కావు. నీతి పరుడవు. అట్టి ఉత్తముడవైన నీవు, నా వంటి అల్పప్రాణికి బదులుగా మరణించటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అందుచేత నీవన్న దానికి నేను సమ్మతించను” అన్నాడు.

జీమూత వాహనుడు.... శంఖచూడుడి నిబ్బరానికి, ఉన్నత వ్యక్తిత్వానికి ముచ్చట పడ్డాడు. దాంతో, సర్పబాలుడికి రాజు “నేను నీ తల్లికి, నిన్ను కాపాడతానని ప్రమాణం చేసాను. దాన్ని అతిక్రమించ లేను. కావున నీవు ఇంటికెళ్ళు. గరుడిడికి నేను ఆహారమౌతాను” అంటూ నచ్చ జెప్ప జూసాడు.

ఈ విధంగా వారిద్దరూ వాదించుకుంటుండగానే, గరుడుడు అక్కడికి వచ్చాడు. అందునా ఆకలి గొని ఉన్నాడు. జీమూత వాహనుడు గరుడినితో

“ఓ గరుడా! పక్షీంద్రా! ఈ రోజు నీకు అహారం కావలసిన వంతు ఈ శంఖచూడునిది. అయితే దయ చేసి, అతడిని విడిచిపెట్టు. బదులుగా నన్ను నీ ఆహారంగా గ్రహించు. ఇతడు తన తల్లికి ఒకే ఒక్క బిడ్డడు” అన్నాడు చేతులు జోడిస్తూ!

ఆ మాటలకు గరుడుడు ఆశ్చర్యపోయాడు. పరోపకారానికై శరీర త్యాగానికి సిద్దపడిన జీమూత వాహనుణ్ణి చూసి, గరుడునికి ముచ్చట కలిగింది. వాత్సల్యంగా అతడి వైపు చూస్తూ “ఓ రాజా! నీ మంచితనం, త్యాగనిరతి చూసి నాకెంతో సంతోషం కలిగింది. పరోపకారివైన నీ పట్ల నేనెంతో అపేక్ష పొందాను. నీవేది కోరినా అనుగ్రహిస్తాను. చెప్పు. నీకేది కోరిక” అని అడిగాడు.

జీమూత వాహనుడు గరుడునికి నమస్కరిస్తూ “ఓ గరుడా! విష్ణు వాహనా! నా కొరకై నేనేది నిన్ను కోరను. అయితే ఈ రోజు నుండి నీవీ అడవిలోని పాములని చంపి తినకు. ఇదే నేను నిన్ను కోరే వరం!” అన్నాడు.

గరుడుడు జీమూత వాహనుడిని అనుగ్రహించాడు. నాటి నుండి ఆ అడవికి రావడం మాని వేసాడు. అప్పటి నుండీ ఆ అడవిలోని పాములన్ని నిర్భయంగా బ్రతికాయి.

ఇదీ కథ!

భేతాళుడు ఇంత వరకూ కథ చెప్పి “ఓ విక్రమాదిత్య రాజేంద్రా! శంఖచూడుడు, జీమూత వాహనుడు, గరుడుడు.... ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప?” అని అడిగాడు.

విక్రమాదిత్యుడు “భేతాళా! విను! జీమూత వాహనుడు ఆ దేశానికి రాజు. రాజుగా తన రాజ్యంలోని వారి క్షేమం చూడటం, ఆశ్రితులందరి ప్రాణాలు కాపాడటం అతడి బాధ్యత. అందుచేత, శంఖచూడుడికి బదులుగా తాను గరుడుడికి ఆహారమవ్వాలని, జీమూత వాహనుడు భావించడం సబబే! అది అతడి బాధ్యతే తప్ప వేరు కాదు.

అదే విధంగా ఆ రాజ్య నివాసిగా శంఖచూడుడి బాధ్యత రాజును సేవించడం! అందుచేత జీమూత వాహనుడి ప్రతిపాదనని తిరస్కరించి, గరుడునికి తానే ఆహారం కావాలనుకోవటంలో శంఖచూడుడు చూపినదీ, బాధ్యతే తప్ప వేరే కాదు.

అయితే.... గరుడునికి పాములు భగవంతుడిచ్చిన ఆహారం. అంతేగాక, గరుడుడు శంఖచూడుడు వంటి పాముల కన్నా, జీమూత వాహనుడి వంటి రాజుల కన్నా బలవంతుడు. అతడికి ఎదురు లేదు. అయినా.... రాజుకి ప్రమాణం చేసిన రీత్యా, అడవిలోని పాముల జోలికిక రాలేదు. కాబట్టి గరుడుడే గొప్ప!” అన్నాడు.

ఆ విధంగా మౌనం భంగమైంది. భేతాళుని శవం మాయమైంది.

కథా విశ్లేషణ: ఈ కథ భాగవతంలోనిది. జానపదుల కల్పనలో నుండి విక్రమాదిత్యుడికి భేతాళుడు చెప్పిన కథగా పరిణమించి ఉంటుంది. అయితే ఎవరు గొప్ప అనే ప్రశ్ననూ, దానికి విక్రమాదిత్యుడి జవాబుగా..... చక్కని తర్కాన్ని అందించే ఈ కథ, పిల్లలనే గాక పెద్దలనీ అలరిస్తుంది.
~~~~~~~

పిల్లనిచ్చి పెళ్ళి చేయటం అంటే ఏమిటి? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 52]

కొత్తగా వచ్చిన సుకేశిని పట్ల యువరాణి అమిత ప్రేమతో, స్నేహంతో ఉంటోందనీ, ఇద్దరూ ఒకరొనొకరు వీడనంత మైత్రితో మెలుగు తున్నారనీ అందరూ అనుకున్నారు. రోజులిలా గడుస్తున్నాయి.

ఇంతలో.... ఒక రోజు, పొరుగు రాజ్యపు యువరాజు, కార్తికేయుణ్ణి చూడవచ్చాడు. అతడిది ఆర్ధికంగా, సైన్యపరంగా కార్తికేయుడి కంటే బలమైన రాజ్యం. అతడు కార్తికేయుణ్ణి భగవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని అర్ధించాడు. పైకి అది అర్ధింపులా కనబడినా, అందులో ఉన్నది ఆజ్ఞే!

అయితే ఇతడు కౄరుడు. అందుచేత కార్తికేయుడికి, తన కుమార్తెను అతడికిచ్చి వివాహం చేయటం ఇష్టం లేదు. అది పైకి చెబితే..... ఇతడు వియ్యం వదిలి కయ్యానికి కాలు దువ్వగలడు. ఎలా ఈ విపత్తు దాటటం? రాజుకేమీ పాలుపోలేదు.

దిగులుగా కార్తికేయుడు, భగవతి మందిరానికి వచ్చాడు. అతడికి కుమార్తె ప్రక్కనే సుకేశిని (మారు వేషంలో ఉన్న ధనస్వామి) కనబడింది. ఒక్కసారిగా రాజు బుర్రలో ఉపాయం మెరిసింది. తన కూతురికి బదులుగా, సుకేశిని నిచ్చి, పొరుగు దేశపు యువరాజుకిచ్చి వివాహం జరిపించాడు.

తన కూతురు అందమైనదని తెలుసు గానీ ఎలా ఉంటుందో తెలియదు గనుక అందులో ఏ ప్రమాదమూ లేదనుకున్నాడు రాజు. అదీగాక, సుకేశిని తండ్రి అయినా, ఇందుకు కోపగించుకోడనుకున్నాడు.

పెళ్ళి అయ్యాక..... చీరె సారెలిచ్చి వీడ్కొలిచ్చేసాడు. సుకేశిని రూపంలో ఉన్న ధనస్వామికీ, భగవతికీ ముంచుకొచ్చిన ఈ సంఘటనతో, ఏం చెయ్యాలో బోధపడలేదు. ఇంతలోనే సుకేశిని(ధనస్వామి) భర్తతో అత్తవారింటికి పోవలసి వచ్చింది. దాంతో దారిలో, పెళ్ళి బృందంలో నుండి తప్పించుకున్నాడు. ఆడవేషం తీసేసి పరుగందుకున్నాడు. ఎలాగోలాగ, ఎవరూ చూడకుండానే గండం గడిచి బయట పడ్డాడు.

అటుప్రక్క, ఏమయ్యిందో ఏమోననే గుండె గుబిల్లుతో ఉంది భగవతి.

ఇంతలో లోకదేవుడు, తమ పూర్వపు ప్రణాళిక ప్రకారం, రాజు కార్తికేయుణ్ణి కలుసుకున్నాడు. వెంట చూడచక్కని ఓ యువకుణ్ణి తీసుకు పోయాడు. రాజుతో “రాజోత్తమా! ఆ కాశీ విశ్వేశ్వరుడి కరుణతో, నీ సహకారంతో, సుఖంగా కాశీయాత్ర ముగించుకు వచ్చాను. ఇదిగో ఈతడు నా మిత్రుడి శిష్యుడు. నా కుమార్తె సుకేశిని ని ఇతడికిచ్చి వివాహం చేయ తలచి వచ్చాను. ఇన్నాళ్ళూ నా బిడ్డను సంరక్షించినందుకు ఎంతగానో కృతజ్ఞణ్ణి. దయతో నా కుమార్తెను నాతో పంపగలరు” అన్నాడు. ఆ విధంగా ధనస్వామిని రాజమందిరం నుండి గుట్టుగా బయటకు తీసుకు వెళ్ళాలన్నది, వాళ్ళు పూర్వం రచించుకున్న ప్రణాళిక.

రాజిది ఊహించలేదు. ముందు పొరుగు రాజుతో యుద్దం తప్పించుకోవటమే ధ్యాసగా సుకేశిని తో వివాహం జరిపించేసాడు. మెల్లిగా సమస్య పరిష్కరించు కోవచ్చనుకున్నాడు. ఇప్పుడీ మునితో అసత్యమాడ సాహసించలేక పోయాడు. ముని శపించగలడని రాజు భయం.

దానితో ముని పాదాల మీద పడి “స్వామీ! దయ చేసి నన్ను క్షమించండి. మీ అనుమతి లేకుండా, మీ కుమార్తె వివాహం పొరుగు దేశపు యువరాజుతో జరిపించేసాను. అతడితో నా కుమార్తె వివాహం తప్పించేందుకు మీ కుమార్తె నిచ్చి పెళ్ళి చేసాను. క్షమించండి” అని ప్రాధేయపడ్డాడు.

ఇది ఏమాత్రం ఊహించని లోకదేవుడు, నివ్వెరపడి, నోటమాట రాక నిలబడి పోయాడు. మునికి కోపం వచ్చిందను కొని, రాజు వణికి పోయాడు. మరుక్షణం “మీ కుమార్తెకు బదులుగా, ఇదిగీ నా కుమార్తెను ధారబోస్తాను. భగవతికి ఈ యువకుడితో పెళ్ళి జరిపిస్తాను. నన్ను మన్నించండి” అంటూ... మారుమాటకు తావివ్వకుండా, లోకదేవుడు వెంట దెచ్చిన యువకుడికి భగవతినిచ్చి వివాహం జరిపించాడు.

దాంతో ఇక ఏ విషయమూ మాట్లాడేందుకు లోకదేవుడు అమితంగా భయపడి పోయాడు. ఏమాత్రం ఊహించని సంఘటనలు, వరుసగా, వేగంగా జరిగి పోతున్నాయయ్యె! రాజు కన్నీటితో తన కుమార్తెకు వీడ్కొలిచ్చి ‘విధి వ్రాతకు తల వొగ్గక ఎవరికైనా తప్పదు గదా!’ అని సరిపెట్టుకుని, దుఃఖాన్ని దిగమింగుకున్నాడు.

కిమ్మనకుండా లోకదేవుడు, తన మిత్రుడి శిష్యుడిగా చెప్పుకున్న యువకుణ్ణీ, భగవతినీ వెంట బెట్టుకుని, తన ఇంటికి బయలు దేరాడు. దారిలో ధనస్వామి వచ్చి వాళ్ళని కలిసాడు.

ధనస్వామి ఆ యువకుడితో “భగవతీ నేనూ.... పరస్పరం ప్రేమించుకున్నాం. ఆమె నన్ను వరించింది. నేనామెని వరించాను. ఆమె నా భార్య. కాబట్టి ఆమెను నాకు అప్పగించు” అన్నాడు.

దానికా యువకుడు “ఈమె తండ్రి ఈమెను నాకిచ్చి పెళ్ళి చేసాడు. వేదమంత్రాల సాక్షిగా, రాజమందిరంలో, ఈమె తండ్రి ఈమెను నాకు ధారపోసాడు. కాబట్టి ఈమె నా భార్య. నేను విడిచి పెట్టను” అన్నాడు.

భేతాళుడింత వరకూ కథ చెప్పి “విక్రమార్క ధరణీ పాలా! యువరాణి భగవతి ఎవరికి చెందుతుందో చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు చిరునవ్వు నవ్వాడు. ఆ అమవాస్య నిశిలో, నిండు చంద్రుడిలా అతడి మోము వెలిగి పోయింది. మంద్ర గంభీర స్వరంతో “నా అభిప్రాయంలో వివాహం అంటే.... ‘ఇదిగో ఇక నుండీ ఈ యువతీ ఈ యువకుడూ ఒకరికొకరు చెందుతారు’ అని ప్రకటన! వారిద్దరూ కలిసి జీవయాత్ర సాగిస్తారనే ప్రకటన! అటువంటి వివాహం, అందరి చేతా అంగీకరింపబడుతుంది, అధికృతమైనది.

ఆ విధంగా, రాజు కార్తికేయుడు, తన కుమార్తె భగవతిని, ఆ యువకుడి కిచ్చి పెళ్ళి చేసాడు. పదుగురి ఎదుటా ‘వారి జీవితాలు కలిసి సాగనున్నాయని’ ఆ విధంగా ప్రకటించాడు. భగవతీ, ధనస్వామీ ఒకరినొకరు ప్రేమించి ఉండవచ్చు. ఒండొరుల సాన్నిహిత్యాన్ని ఆనందించి ఉండొచ్చు.

అయితే వారి అనుబంధం ప్రకటితమైనది కాదు. అది రహస్యమై కొనసాగింది. అది పాపంతో కలగలిసి పోయింది. కనీసం తన వివాహ సందర్భంలోనైనా, భగవతి తమ అనుబంధాన్ని ప్రకటించి ఉన్నా, ధనస్వామి సుకేశినిగా తన వివాహం పొరుగు దేశపు యువరాజుతో నిర్వహింపబడుతున్నప్పుడు ప్రకటించి ఉన్నా, అది కొంత సరియైన బాట తొక్కి ఉండేది.

కాబట్టి ఇప్పుడు భగవతీ ధనస్వాముల అనుబంధం అక్రమమైనది గానే తలంచాలి. కనుక, తండ్రి పెళ్ళి చేసి యిచ్చిన యువకుడికే ఆమె దక్కాలి. అదే న్యాయం!” అన్నాడు.

విక్రమార్క మహారాజు ఈ విధంగా సమాధానం చెప్పగానే భేతాళుడు మోదంతో తల ఊపి చెట్టెక్కేసాడు.
~~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes