అనగా అనగా.....
అమృతాన్ని ఆశించి క్షీరసాగర మధనం చేస్తూంటే, అమృతం కంటే ముందు హాలాహలం ప్రభవించింది. వెలువడిన విషపుధాటికి లోకాలన్ని అల్లకల్లోలమయ్యాయి. హాలాహలపు జ్వాలలకు అందరూ హాహాకారాలు చేస్తున్నారు.
కాపాడమని పరమశివుని ప్రార్ధించారు. సమస్య తనది కాదు. మింగితేనే తననేమీ చేయలేని విషం, మింగకపోతే అసలేమీ చేయలేదు. అయినా లోకహితం కోరి ఆ విషాన్ని పానం చేశాడు పరమేశ్వరుడు. ఆయన ఆదిభిక్షువే, అయినా అది హాలాహలం. దాన్ని గొంతులోనే నిలిపివేసాడు శివుడు. అది ఆయన కంఠాన్ని నల్లగా మాడ్చింది. అందుకే శివుడిని గరళకంఠుడనీ, నీలకంఠుడనీ పిలుస్తారు. తన యోగశక్తితో హాలాహలాన్ని, దాని శక్తిని అణిచివేసాడు పరమశివుడు. అంత కష్టాన్ని – లోకహితం కోసం, లోకాలకు శ్రేయస్సు కలిగించటం కోసం భరించాడు.
విషపానం చేసే ముందు పార్వతీ దేవితో శివుడు “ఇందరి ప్రాణ రక్షణ నా చేతులలో ఉంది. శరణన్న వారిని రక్షించడం మన కర్తవ్యం. ఇప్పుడీ హాలాహలాన్ని తియ్యని పండులా ఆరగిస్తాను” అనగా ఆ యిల్లాలు చిరునవ్వుతో అంగీకరించింది.
“మ్రింగెడు వాడు విభుండని
మ్రింగెడిది గరళ మనియును
మేలని ప్రజకున్ మ్రింగమనె
సర్వ మంగళ! మంగళ సూత్రంబు
నెంత మది నమ్మినదో! “
అందుకే ఆ తల్లి లోకమాత.
అందుకే శివపార్వతులు ఆదిదంపతులు. సర్వలోకాల్లోని సకలప్రాణులకి జననీ జనకులు.
పరమశివుడు పచ్చివిషాన్ని కంఠాన బంధించేందుకు, తన యోగశక్తితో హాలాహలాన్ని అణిచేందుకు కన్నులు మూసుకొని వెత భరించాడు. ఎంతటి వారికైనా ఏ పనీ ’హాంఫట్’ అని అయిపోదు. దానికి కావలసిన ‘కర్తవ్య నిర్వహణ’ చేయవలసిందే. అందుచేత పరమశివునికీ ఆ ‘effort’ తప్పలేదు. కాబట్టే తర్వాత అమృతం పుట్టడం, దాని పంపకంలో జరిగిన గల్లంతూ, జగన్మోహినీ అవతారం శివుడు చూడలేదు.
ఆనాడు పరమశివుడు భరించిన వెతని తలుచుకుంటూ, శివరాత్రి నాడు, భక్తులందరూ శివనామ స్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తారు. ఉపవాస దీక్షలో గడుపుతారు. అదే శివరాత్రి పండుగ.
ఇదీ కథ!
మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం