RSS
Wecome to my Blog, enjoy reading :)

పిల్లనిచ్చి పెళ్ళి చేయటం అంటే ఏమిటి? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 52]

కొత్తగా వచ్చిన సుకేశిని పట్ల యువరాణి అమిత ప్రేమతో, స్నేహంతో ఉంటోందనీ, ఇద్దరూ ఒకరొనొకరు వీడనంత మైత్రితో మెలుగు తున్నారనీ అందరూ అనుకున్నారు. రోజులిలా గడుస్తున్నాయి.

ఇంతలో.... ఒక రోజు, పొరుగు రాజ్యపు యువరాజు, కార్తికేయుణ్ణి చూడవచ్చాడు. అతడిది ఆర్ధికంగా, సైన్యపరంగా కార్తికేయుడి కంటే బలమైన రాజ్యం. అతడు కార్తికేయుణ్ణి భగవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని అర్ధించాడు. పైకి అది అర్ధింపులా కనబడినా, అందులో ఉన్నది ఆజ్ఞే!

అయితే ఇతడు కౄరుడు. అందుచేత కార్తికేయుడికి, తన కుమార్తెను అతడికిచ్చి వివాహం చేయటం ఇష్టం లేదు. అది పైకి చెబితే..... ఇతడు వియ్యం వదిలి కయ్యానికి కాలు దువ్వగలడు. ఎలా ఈ విపత్తు దాటటం? రాజుకేమీ పాలుపోలేదు.

దిగులుగా కార్తికేయుడు, భగవతి మందిరానికి వచ్చాడు. అతడికి కుమార్తె ప్రక్కనే సుకేశిని (మారు వేషంలో ఉన్న ధనస్వామి) కనబడింది. ఒక్కసారిగా రాజు బుర్రలో ఉపాయం మెరిసింది. తన కూతురికి బదులుగా, సుకేశిని నిచ్చి, పొరుగు దేశపు యువరాజుకిచ్చి వివాహం జరిపించాడు.

తన కూతురు అందమైనదని తెలుసు గానీ ఎలా ఉంటుందో తెలియదు గనుక అందులో ఏ ప్రమాదమూ లేదనుకున్నాడు రాజు. అదీగాక, సుకేశిని తండ్రి అయినా, ఇందుకు కోపగించుకోడనుకున్నాడు.

పెళ్ళి అయ్యాక..... చీరె సారెలిచ్చి వీడ్కొలిచ్చేసాడు. సుకేశిని రూపంలో ఉన్న ధనస్వామికీ, భగవతికీ ముంచుకొచ్చిన ఈ సంఘటనతో, ఏం చెయ్యాలో బోధపడలేదు. ఇంతలోనే సుకేశిని(ధనస్వామి) భర్తతో అత్తవారింటికి పోవలసి వచ్చింది. దాంతో దారిలో, పెళ్ళి బృందంలో నుండి తప్పించుకున్నాడు. ఆడవేషం తీసేసి పరుగందుకున్నాడు. ఎలాగోలాగ, ఎవరూ చూడకుండానే గండం గడిచి బయట పడ్డాడు.

అటుప్రక్క, ఏమయ్యిందో ఏమోననే గుండె గుబిల్లుతో ఉంది భగవతి.

ఇంతలో లోకదేవుడు, తమ పూర్వపు ప్రణాళిక ప్రకారం, రాజు కార్తికేయుణ్ణి కలుసుకున్నాడు. వెంట చూడచక్కని ఓ యువకుణ్ణి తీసుకు పోయాడు. రాజుతో “రాజోత్తమా! ఆ కాశీ విశ్వేశ్వరుడి కరుణతో, నీ సహకారంతో, సుఖంగా కాశీయాత్ర ముగించుకు వచ్చాను. ఇదిగో ఈతడు నా మిత్రుడి శిష్యుడు. నా కుమార్తె సుకేశిని ని ఇతడికిచ్చి వివాహం చేయ తలచి వచ్చాను. ఇన్నాళ్ళూ నా బిడ్డను సంరక్షించినందుకు ఎంతగానో కృతజ్ఞణ్ణి. దయతో నా కుమార్తెను నాతో పంపగలరు” అన్నాడు. ఆ విధంగా ధనస్వామిని రాజమందిరం నుండి గుట్టుగా బయటకు తీసుకు వెళ్ళాలన్నది, వాళ్ళు పూర్వం రచించుకున్న ప్రణాళిక.

రాజిది ఊహించలేదు. ముందు పొరుగు రాజుతో యుద్దం తప్పించుకోవటమే ధ్యాసగా సుకేశిని తో వివాహం జరిపించేసాడు. మెల్లిగా సమస్య పరిష్కరించు కోవచ్చనుకున్నాడు. ఇప్పుడీ మునితో అసత్యమాడ సాహసించలేక పోయాడు. ముని శపించగలడని రాజు భయం.

దానితో ముని పాదాల మీద పడి “స్వామీ! దయ చేసి నన్ను క్షమించండి. మీ అనుమతి లేకుండా, మీ కుమార్తె వివాహం పొరుగు దేశపు యువరాజుతో జరిపించేసాను. అతడితో నా కుమార్తె వివాహం తప్పించేందుకు మీ కుమార్తె నిచ్చి పెళ్ళి చేసాను. క్షమించండి” అని ప్రాధేయపడ్డాడు.

ఇది ఏమాత్రం ఊహించని లోకదేవుడు, నివ్వెరపడి, నోటమాట రాక నిలబడి పోయాడు. మునికి కోపం వచ్చిందను కొని, రాజు వణికి పోయాడు. మరుక్షణం “మీ కుమార్తెకు బదులుగా, ఇదిగీ నా కుమార్తెను ధారబోస్తాను. భగవతికి ఈ యువకుడితో పెళ్ళి జరిపిస్తాను. నన్ను మన్నించండి” అంటూ... మారుమాటకు తావివ్వకుండా, లోకదేవుడు వెంట దెచ్చిన యువకుడికి భగవతినిచ్చి వివాహం జరిపించాడు.

దాంతో ఇక ఏ విషయమూ మాట్లాడేందుకు లోకదేవుడు అమితంగా భయపడి పోయాడు. ఏమాత్రం ఊహించని సంఘటనలు, వరుసగా, వేగంగా జరిగి పోతున్నాయయ్యె! రాజు కన్నీటితో తన కుమార్తెకు వీడ్కొలిచ్చి ‘విధి వ్రాతకు తల వొగ్గక ఎవరికైనా తప్పదు గదా!’ అని సరిపెట్టుకుని, దుఃఖాన్ని దిగమింగుకున్నాడు.

కిమ్మనకుండా లోకదేవుడు, తన మిత్రుడి శిష్యుడిగా చెప్పుకున్న యువకుణ్ణీ, భగవతినీ వెంట బెట్టుకుని, తన ఇంటికి బయలు దేరాడు. దారిలో ధనస్వామి వచ్చి వాళ్ళని కలిసాడు.

ధనస్వామి ఆ యువకుడితో “భగవతీ నేనూ.... పరస్పరం ప్రేమించుకున్నాం. ఆమె నన్ను వరించింది. నేనామెని వరించాను. ఆమె నా భార్య. కాబట్టి ఆమెను నాకు అప్పగించు” అన్నాడు.

దానికా యువకుడు “ఈమె తండ్రి ఈమెను నాకిచ్చి పెళ్ళి చేసాడు. వేదమంత్రాల సాక్షిగా, రాజమందిరంలో, ఈమె తండ్రి ఈమెను నాకు ధారపోసాడు. కాబట్టి ఈమె నా భార్య. నేను విడిచి పెట్టను” అన్నాడు.

భేతాళుడింత వరకూ కథ చెప్పి “విక్రమార్క ధరణీ పాలా! యువరాణి భగవతి ఎవరికి చెందుతుందో చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు చిరునవ్వు నవ్వాడు. ఆ అమవాస్య నిశిలో, నిండు చంద్రుడిలా అతడి మోము వెలిగి పోయింది. మంద్ర గంభీర స్వరంతో “నా అభిప్రాయంలో వివాహం అంటే.... ‘ఇదిగో ఇక నుండీ ఈ యువతీ ఈ యువకుడూ ఒకరికొకరు చెందుతారు’ అని ప్రకటన! వారిద్దరూ కలిసి జీవయాత్ర సాగిస్తారనే ప్రకటన! అటువంటి వివాహం, అందరి చేతా అంగీకరింపబడుతుంది, అధికృతమైనది.

ఆ విధంగా, రాజు కార్తికేయుడు, తన కుమార్తె భగవతిని, ఆ యువకుడి కిచ్చి పెళ్ళి చేసాడు. పదుగురి ఎదుటా ‘వారి జీవితాలు కలిసి సాగనున్నాయని’ ఆ విధంగా ప్రకటించాడు. భగవతీ, ధనస్వామీ ఒకరినొకరు ప్రేమించి ఉండవచ్చు. ఒండొరుల సాన్నిహిత్యాన్ని ఆనందించి ఉండొచ్చు.

అయితే వారి అనుబంధం ప్రకటితమైనది కాదు. అది రహస్యమై కొనసాగింది. అది పాపంతో కలగలిసి పోయింది. కనీసం తన వివాహ సందర్భంలోనైనా, భగవతి తమ అనుబంధాన్ని ప్రకటించి ఉన్నా, ధనస్వామి సుకేశినిగా తన వివాహం పొరుగు దేశపు యువరాజుతో నిర్వహింపబడుతున్నప్పుడు ప్రకటించి ఉన్నా, అది కొంత సరియైన బాట తొక్కి ఉండేది.

కాబట్టి ఇప్పుడు భగవతీ ధనస్వాముల అనుబంధం అక్రమమైనది గానే తలంచాలి. కనుక, తండ్రి పెళ్ళి చేసి యిచ్చిన యువకుడికే ఆమె దక్కాలి. అదే న్యాయం!” అన్నాడు.

విక్రమార్క మహారాజు ఈ విధంగా సమాధానం చెప్పగానే భేతాళుడు మోదంతో తల ఊపి చెట్టెక్కేసాడు.
~~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes