RSS
Wecome to my Blog, enjoy reading :)

విరిబోణికి భర్త ఎవరు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 29]

కోవెల ఆవరణలో భర్త కోసం ఎదురు చూస్తున్న విరిబోణి, ఎంతకూ యశోవంతుడు తిరిగి రాకపోవటంతో కంగారు పడింది. ఆమె అన్న "నా ప్రియమైన చెల్లెలా! నీవు ఆందోళన చెందకు. నేను వెళ్ళి బావను పిలుచుకు వస్తాను." అని చెప్పి గుడిలోపలికి వెళ్ళాడు.

చూస్తే ఎదురుగా ఏముంది? భయానక దృశ్యం! భరించలేని దృశ్యం! తన ముద్దుల చెల్లెలి ప్రియతమ పతి తల, చెట్టు కొమ్మకు వేలాడుతోంది. శరీరం అమ్మవారి బలిపీఠంపైన పడి ఉంది. రక్తం చుట్టూ చిమ్మబడి ఉంది. ఆ దృశ్యం అతణ్ణి ఆపాద మస్తకం వణికించింది. నిన్న మొన్న పెళ్ళైన తన చెల్లెలికి, ఈ దుర్వార్త చెప్పేందుకు అతడికి మనస్సు రాలేదు. కూతురూ అల్లుళ్ళ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులని తలుచుకొని, అతడికి అంతులేని నైరాశ్యం కలిగింది.

ఎక్కడలేని తెగింపుతో, యశోవంతుడికి మాదిరి గానే, తన జుట్టునీ చెట్టు కొమ్మకి కట్టుకుని, కత్తి తీసుకొని తల నరుక్కున్నాడు. బావ గారి తల ప్రక్కనే అతడి తల వేలాడుతుండగా, మొండెమూ బావ దేహం ప్రక్కనే పడింది. రక్తం కలగలిసి పోయింది.

భర్త జాడలేదు. వెదకపోయిన అన్న జాడ కూడా లేకపోయేసరికి, విరిబోణి... ఇద్దర్ని వెదుకుతూ కోవెల లోకి ప్రవేశించింది. భయానక దృశ్యాన్ని చూసి తట్టుకోలేక పోయింది. అప్పటికే ఇద్దరూ విగత జీవులైనారు. గుండె బ్రద్దలైనంతగా దుఃఖించింది. దుఃఖాతిశయంతో ఆమె శరీరం వణుకుతోంది.

విహ్వల చిత్తయై "నా ప్రియమైన, సర్వస్వమైన భర్త మరణించాడు. ప్రేమగా చూసుకునే అన్నా మరణించాడు. ఇక నేనుండి ఏం లాభం? నా దైన్యపు ముఖమీ లోకానికెలా చూపించటం? తల్లిదండ్రుల దుఃఖాన్ని గానీ, అత్తమామల దుఃఖాన్ని గానీ ఎలా భరించటం? ఇంతకంటే చావు మేలు. అన్నా భర్తల దారిలోనే నేనూ పోయెద గాక!" అనుకున్నది.

దుఃఖాతిశయంతో, ఆవేశంతో కత్తి చేత బట్టి, శిరస్సు ఖండించుకోబోయింది. ఆ క్షణమే మెరుపు మెరిసినట్లు, భద్రకాళి ఆమె ముందు ప్రత్యక్షమైంది. (అవి ఆ రోజులు కాబట్టి, భక్తుల చావు తెగింపు చూసి, అమ్మవారు ప్రత్యక్షమైంది. ఈ కథ చెప్పేటప్పుడు పిల్లల ఆలోచన, అటు పోకుండా జాగ్రత్త తీసుకోవటం అవసరం. శక్తిమాన్ అనుకుని, మేడ పైనుండి దూకే చిన్ని హృదయాలవి! కల్పనకీ వాస్తవానికీ మధ్య రేఖ, వాళ్ళకి స్పష్టంగా కనబడదు కదా! అంత గాఢ భక్తి ఉంటే దైవదర్శనం సత్యమే కావచ్చు గాక గానీ, సామాన్య బాలకులకి అదేమో తెలియదు కదా!)

విరిబోణి, భద్రకాళి దర్శనంతో మాటలు రాక నిల్చుండి పోయింది. ఆ తల్లి విరిబోణిని వారిస్తూ "అమ్మాయీ! ఆగు! సాహసించకు! నీకేం కావాలో కోరుకో! నీవడిగిన వరాలిస్తాను" అని బుజ్జగించింది.

విరిబోణి కన్నీరు తుడుచుకుంటూ "అమ్మా! నా భర్తనీ, అన్ననీ పునర్జీవితుల్ని చెయ్యి. అంతకంటే కోరదగిన కోరిక లేదు నాకు" అంది.

భద్రకాళి "అమ్మాయి. అలాగే అనుగ్రహిస్తాను. వీరి శరీరాలకు తలలు చేర్చి, ఈ మంత్రజలం చల్లి, విభూది పూసి, ఈ బెత్తంతో తట్టు" అంటూ మంత్రజలాన్ని, విభూదిని, బెత్తాన్ని ఇచ్చి అంతర్ధాన మయ్యింది.

చెప్పలేనంత ఉద్విగ్నతతో... విరిబోణి, చెట్టుకు వేలాడుతున్న తలలు రెండింటినీ, నేలపై పడి ఉన్న మొండేలతో చేర్చి, మంత్రజలం చల్లింది. విబూది పూసి బెత్తంతో తట్టింది.

భద్రకాళి కరుణతో, ఇరువురూ ప్రాణాలతో లేచి కూర్చున్నారు. కానీ ఏం జరిగిందో గమనించేసరికి ఆమె నిర్ఘాంత పోయింది. ఉద్విగ్నతతోనూ, ఆతృతతోనూ... విరిబోణి, అన్న శరీరానికి భర్త శిరస్సునీ, భర్త శరీరానికి అన్న శిరస్సునీ అంటించింది.

ఇదీ కథ!

ఓ విక్రమార్క మహారాజా! నీవు మహిలోని రాజులందరిలో ఉత్తమోత్తమడవు. ఇప్పుడు పునర్జీవితులైన వారిలో, ఎవరు విరిబోణి భర్త?" అని అడిగాడు భేతాళుడు.

విక్రమాదిత్యుడు, కోర మీసాల మాటున, చిరునవ్వుతో పెదవులు మెరుస్తుండగా "భేతాళుడా! పునర్జీవితులైన తర్వాత, ఎవరు ఆమెని చూసి తన భార్యగా గుర్తిస్తారో.... అతడే ఆమె భర్త, ఎవరామెని చెల్లెలిగా గుర్తిస్తారో... అతడే ఆమె అన్న!"అన్నాడు.

భేతాళుడు తృప్తిగా తలాడిస్తూ, మౌనభంగమయ్యింది గనుక మాయమై పోయాడు.

కథ విశ్లేషణ:

సాధారణంగా.... జ్ఞాపకశక్తి, గుర్తుపట్టటం, గుర్తుంచుకోవటం మేధస్సుకు సంబంధించినవనీ,
ప్రేమ, ఆత్మీయత, కృతజ్ఞత వగైరా భావనలు హృదయానికి సంబంధితవనీ అంటారు.
మేధస్సుకు మెదడునీ,
ప్రేమానుభూతులకి హృదయాన్ని చిహ్నంగా చెబుతారు.

ఆ విధంగా చూస్తే గుండె i.e. హృదయం దేహంలో ఉంటే, మెదడు తలలో ఉంటుంది. అలాంటి చోట... దేహాన్ని భర్తగా గుర్తించాలా, తలని భర్తగా గుర్తించాలా?

విరిబోణి వైపు నుండి చూస్తే... ఈ మీమాంస అంతా ఉంటుంది. అయితే, విక్రమాదిత్యుడు విరిబోణి పరంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆమె భర్తా, అన్నల పరంగా చెప్పాడు. ఎవరామెని భార్యగా గుర్తిస్తారో అతడామె భర్త, ఎవరామెని సోదరిగా గుర్తిస్తారో అతడామె అన్న! పేచీ లేని పరిష్కారం కదా! అదీ... విక్రమార్కుడి సునిశిత ఆలోచనా పటిమ!

ఇలాంటి చమత్కార పూరిత కథలు విన్నప్పుడు పిల్లలు ఎంత ఉత్తేజమవుతారో! వాళ్ళని, అన్నిరకాలుగా ఉర్రూతలూగిస్తాయి ఇలాంటి కథలు! సునిశిత ఆలోచనా విధానం అప్రయత్నంగానే అలవడుతుంది.

~~~~~~~~~

3 కామెంట్‌లు:

పరిమళం చెప్పారు...

ఇంతమంచి బ్లాగ్ మొదలుపెట్టి చిన్ననాటి కధలు మాకు గుర్తు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు

కాయ చెప్పారు...

నేనింకా తలలని బట్టి గుర్తు పట్టడమే అనుకున్నా... హహ .. అయినా.. తల లోనె కదా మెదడు ఉండేది.. ఈమె తన భార్య అని గుర్తు పట్టె శక్తి ఆ తలకె ఉంది. ఇంకా.. ఇప్పుడు ఆ భర్త కి అన్న యొక్క హ్రుదయం వచ్చింది అనుకోవాలా ?

amma odi చెప్పారు...

పరిమళం గారు, కాయ గారు: చాలా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.

పరిమళం గారు: మీ చిన్ననాటి కథలను గుర్తుకు తెస్తున్నందుకు సంతోషం అండి! వ్యాఖ్యానించినందుకు మీకే నా ధన్యవాదాలు!

కాయ గారు: తలా, మొండెం గొడవెందుకని, విరబోణి వైపు గాకుండా, భర్త, సొదరుల వైపు, ఎవరు, ఎలా గుర్తు పడితే అదే వరసపొమ్మని విక్రమార్కుడు అలా చెప్పాడు. నెనర్లు!

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes