RSS
Wecome to my Blog, enjoy reading :)

మంత్రవాది కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 25]

విక్రమాదిత్యుడు మళ్ళీ మోదుగు చెట్టెక్కి, తల్లక్రిందులుగా వేలాడుతున్న శవాన్ని దించి, భుజాన వేసుకుని బృహదారణ్యంలోని భద్రకాళి దేవాలయం కేసి నడవసాగాడు.

శవంలోని భేతాళుడు "ఓ విక్రమాదిత్య మహారాజా! నీకొక కథ చెబుతాను. దాని మీద ఓ ప్రశ్న వేస్తాను. నాకు జవాబు చెప్పకు. అప్పుడు నేను నీకు వశుడౌతాను. నీ బంటునై నీవు చెప్పిన పనులు చేస్తాను. కానీ జవాబు తెలిసీ చెప్పక పోయావో, నీ తల వేయి వక్కలు కాగలదు. తస్మాత్ జాగ్రత్త!" అని కథ చెప్పటం మొదలెట్టాడు.

బ్రహ్మచక్రం అనే ఊరిలోని బ్రాహ్మణ అగ్రహారంలో జటా గోపుడనే విప్రుడుందేవాడు. అతడి కొక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె అందాల బరిణె. (అందమంతా తెచ్చి ఓ చిన్ని బరిణె(డబ్బీ)లో పోసినట్లుందన్న మాట.) సుగుణాల రాశి. ఆ అమ్మాయి పేరు మృదుభాషిణి. (మృదువైన తీయని మాటలు మాట్లాడునది అని అర్ధం.) పేరుకు తగ్గట్టే ఆ పిల్ల మాట తీరు, నడవడిక ముగ్ధ మనోహరంగా ఉండేవి.

అందచందాలకు, ప్రవర్తనకు ఆమెకున్న మంచిపేరు తెలిసి, ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమెని పెళ్ళాడ గోరి వచ్చారు. ఒకడు ఆమె తండ్రియైన జటాగోపుణ్ణి కలిసి కన్యాదానం చెయ్యమని అర్ధించాడు. జటాగోపుడు సరేనన్నాడు.

మరొకడు ఆమె తల్లి, ఏటి నుండి నీళ్ళు తెస్తుండగా కలిసి, కాళ్ళ మీద పడి పిల్లనివ్వమని అడిగాడు. అతడి వినయ సౌశీల్యసౌందర్యాలు నచ్చి, ఆమె అలాగేనంటూ మాట ఇచ్చింది. మూడో వాడు, ఆ పిల్ల అన్నను కలిసి ప్రాధేయపడ్డాడు. అతడి స్నేహిశీలం, కలుపుగోలు తనం, మృదౌభాషిణి సోదరుడికి తెగ నచ్చేసాయి. దాంతో తన చెల్లెలిని అతడి కిచ్చి పెళ్ళి చేసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చాడు.

తీరా ఇంటికొచ్చి విషయం ముగ్గురికీ తెలిసాక, ఎవరికి వాళ్ళే, తమ మాటే నెగ్గాలని దెబ్బలాడుకోసాగారు. ఎవరికి వారికీ తమ మాటే చెల్లాలని, తము నిర్ణయించిన వాడికే మృదుభాషిణినిచ్చి పెళ్ళి చెయ్యాలనో పంతం హెచ్చింది.

ఇదంతా చూసిన సున్నిత మనస్కురాలైన మృదుభాషిణి చాలా ఆందోళనకూ, ఆవేదనకూ గురయ్యింది. ఎంతో వ్యధకు గురై మరణించింది. అమ్మ నాన్న అన్నలలో బాటు, ఆమె గురించి తెలిసిన ఊరి వాళ్ళు కూడా ఎంతో దుఃఖించారు.

ఆమె భౌతిక కాయాన్ని శశ్మానానికి తీసుకు వెళ్ళి, హిందూ సాంప్రదాయ ప్రకారం చితి పేర్చి దహనం చేశారు. ఆమెని పెళ్ళాడగోరి వచ్చిన బ్రాహ్మణ యువకులు ముగ్గురూ కూడా ఎంతో దుఃఖించారు.

వారిలో ఒకడు... మృదుభాషిణి చితి లోంచి కొంత బూడిదనీ, ఎముకలనీ తీసుకుని కాశీ నగరానికి బయలు దేరాడు. కాశీ క్షేత్రంలో అన్నపూర్ణా విశ్వేశ్వర స్వాములని దర్శించి, ఆమె కోసం ప్రార్ధించాలనుకున్నాడతడు.

మరొకడు... మృదుభాషిణి మరణంతో మనస్సు విరిగి, ఇహలోక బంధాలెంత అశాశ్వతమో ఆలోచిస్తూ, శ్మశానవైరాగ్యం కొద్దీ దేశాటనకు బయలు దేరాడు. మూడోవాడు... కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూ శ్మశానంలోనే కూలబడ్డాడు.

దేశాటనకి బయలు దేరిన రెండవ వాడు చిత్తమొచ్చినట్లు తిరగసాగాడు. ఆ పర్యటనలో ఓ రోజు ఓ గ్రామం చేరాడు. ఎండ మండుతోంది. మధ్యాహ్నమైంది. ఒక బ్రాహ్మణ గృహం చూసుకుని ఆ పూటకి ఆశ్రయం అడిగాడు. ఆ ఇంటి వాళ్ళు అతడిని అతిధిగా అంగీకరించి స్వాగతించారు.

ఆ యింటి పెరటిలో బావి దగ్గర స్నానం చేసి, మామిడి చెట్టు క్రింది గట్టు మీద అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. గృహస్తుల వంటగది అతడికి కనిపిస్తూనే ఉంది.

ఆ ఇంటి ఇల్లాలు వంట చేస్తూ ఉంది. వారింట సంవత్సరపు బిడ్డడున్నాడు. దోగాడుతూ వచ్చి తల్లిని మాటికీ విసిగిస్తున్నాడు. గిన్నెలన్నీ లాగుతున్నాడు. తల్లి చీర కుచ్చిళ్ళు గుంజుతున్నాడు. కాలికీ చేతికీ అడ్డం పడి ఏడుస్తున్నాడు. తల్లి ఎంత వారించినా, బుజ్జగించినా లాభం లేకపోయింది.

చివరికి సహనం కోల్పోయిన ఆ తల్లి, బిడ్డని విసిరి పొయ్యి మంటలో వేసింది. కణకణ మండుతున్న పొయ్యిలో, పసిబిడ్డ క్షణాల్లో కాలి బూడిద అయ్యాడు.

ఇదంతా చూస్తున్న అతిధి(మృదుభాషిణి ని పెళ్ళాడగోరిన రెండవ యువకుడు) ఒక్కసారిగా కెవ్వున అరిచాడు. "ఓరి భగవంతుడా!" అంటూ రెండు కళ్ళూ మూసుకున్నాడు. అతడి శరీరం గజగజా వణుకుతున్నది.

అవధుల్లేని ఆగ్రహంతో ఒక్కసారిగా అరుగు మీంచి లేచి నిల్చున్నాడు. గృహిణి అతణ్ణి చూసి దగ్గరి కొచ్చింది. అతడామె వైపు కొఱకొఱ చూస్తూ "ఓ బ్రాహ్మణి! నీవు మహా పాపివి. కౄరరాక్షసివి. నీ స్వంత బిడ్డనే చంపిన దానివి. నీ అంతటి ఘోర పాపి మరెవ్వరూ ఉండరు. నీ ఇంట అన్నపు మెతుకు ముట్టిన వాడికి పుట్టగతులుండవు. రాక్షసీ! చిన్న పాపడిని, పొయ్యి మంటలో వేసి చంపావే, కన్న తల్లి వేనా నువ్వు? నీ ముఖం చూసినా పాపమే! నీ ఇంట ఇక క్షణ మాగను. నీ తిండి నాకక్కర లేదు" అనేసి చరాలున పోబోయాడు.

ఆ ఇంటి ఇల్లాలు, అతడి పాదాలపై బడి ప్రార్ధించింది. "అయ్యా! సహనం పొందండి. అతిధి యైన మీరు మా ఇంట భోజనం చేయకుండా వెళ్తే, గృహిణిగా నేను అధర్మం పాటించిన దానినౌతాను. దయ చేసి ఆగండి" అని అతణ్ణి ఆపు చేస్తూ, పొయ్యిలొంచి కుర్రవాడి ఎముకల్నీ, బూడిదనీ కట్టెతో బయటకు తీసి, కుప్పగా చేర్చి, దానిపై నీళ్ళు సంప్రొక్షిస్తూ మృత సంజీవనీ మంత్రోచ్ఛటన చేసింది. ఆశ్చర్యం! మరుక్షణం పిల్లవాడు, సంతోషంగా బంతిలా ఆడుకుంటూ ప్రత్యక్షమయ్యాడు.

చూస్తున్న బ్రాహ్మణ యువకుడు నిరుత్తరుడయ్యాడు. కొన్ని క్షణాల తర్వాత తేరుకొని ఆ గృహిణి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు.
"అమ్మా! దయచేసి నాకా మంత్రం ఉపదేశించు" అని ప్రార్ధించాడు.

ఆ బ్రాహ్మణి చిరునవ్వుతో "అయ్యా! మా ఇంటికి అతిధి మీరు. ముందు మీరు భోజనం చేయండి. తప్పకుండా నేను మీకా మంత్రాన్ని ఉపదేశిస్తాను. మీరు అభోజనంగా, అసంతృప్తిగా మా ఇంటి నుండి వెళ్తే, అది మాకు శ్రేయస్కరం కాదు" అంది.

అతడు సంతోషంగా ఆ ఇంట భోజనం చేశాడు. ఆమె చిన్నారి కుమారుడిని ముద్దు చేస్తూ హాయిగా గడిపాడు. ఆ ఇల్లాలు అతడికి మృతసంజీవని మంత్రాన్ని ఉపదేశించింది.

మంత్రాన్ని పొందాడు గనుక అతడు మంత్రవాది అని పిలవబడ్డాడు. అవధుల్లేని ఆనందంతో మంత్రవాది బ్రహ్మ చక్రానికి తిరిగి వచ్చాడు! మృదుభాషిణిని పునరుజ్జీవితురాలిని చెయ్యగలను కదా అన్న ఆనందంలో, ఆతృతగా శ్మశానానికి వెళ్ళాడు. అప్పుడక్కడ ఎవరూ లేరు. మృదుభాషిణిని పెళ్ళాడ గోరి వచ్చిన వారిలో, మూడో యువకుడు ఇప్పటికీ ఏడుస్తూ శ్మశానంలోనే ఉన్నాడు. తైల సంస్కారం లేని జుట్టు, శుచీ శుభ్రతా లేని దేహం, పోషకాహారం లేని ప్రాణంతో పిచ్చివాడిలా ఉన్నాడు.

మంత్రవాది మృదుభాషిణి చితివైపు చూశాడు. అక్కడ ఆమె బూడిదగానీ, ఎముకలు గానీ ఏవీ లేవు. మంత్రవాది ఉత్సాహమంతా నీరు గారిపోయింది. నిరాశతో దుఃఖం వచ్చింది. సరిగ్గా అప్పుడే... మృదుభాషిణి అస్థికలూ, చితాభస్మమూ తీసుకొని కాశీకి పోయిన, మొదటి యువకుడు తిరిగి వచ్చాడు. కాశీలో ఆమె అస్థికలని గంగలో కలిపాక, కొన్నిటిని తీసుకొని తిరిగి బ్రహ్మచక్రానికి వచ్చాడు. వాళ్ళ ఆచారం ప్రకారం క్రతువులేవో నిర్వహించాలని అతడి ఊహ!

విషయం తెలిసి అతడు మృదుభాషిని చితాభస్మాన్ని, అస్థికల్నీ ఇచ్చాడు. మంత్రవాది వాటిని కుప్పగా పోసి, నీళ్ళు సంప్రోక్షిస్తూ మంత్రం చదివాడు. నిద్ర నుండి లేచినట్లు మృదుభాషిణి పునరుజ్జీవితురాలై లేచి కూర్చుంది.

వార్త ఊరు ఊరంతా ప్రాకింది. మృదుభాషిణిని తీసుకొని, ముగ్గురు యువకులూ జటాగోపుడి ఇల్లు చేరారు. మళ్ళీ రచ్చ మొదలు! ఆమె నాదంటే నాదని ముగ్గురు యువకులూ కలహించసాగారు. ఆమె అమ్మా, నాన్న, అన్నా కూడా, ఆమెను ఎవరికివ్వాలా అని గొడవ పడసాగారు.

ఇంత వరకూ కథ చెప్పిన భేతాళుడు "ఓ విక్రమాదిత్య మహారాజా! నీవు సాహసికుడవు. ఆ యోగి కోరిక తీర్చుట కొరకు, శవరూపంలోని నన్ను ఈ అర్ధరాత్రి వేళ మోసికొని పోతున్నావు. అంతేగాక నీవు సకల విద్యా పారంగతుడవు. కనుక ఓ రాజా! నీవు నిర్ణయించి చెప్పు! మృదుభాషిణిని పెళ్ళాడేందుకు అర్హుడెవరు?" అనడిగాడు.

విక్రమాదిత్యుడు "ఓ భేతాళుడా! మృదుభాషిణి చితాభస్మాన్నీ, అస్థికలనీ భద్రపరచి, కాశీకి తీసికెళ్ళి తెచ్చిన వాడు ఆమెకు పుత్ర సమానుడు. కాబట్టి అతడామెని పెళ్ళాడేందుకు అనర్హుడు. మృత సంజీవనీ మంత్రం నేర్చి, ఆమెకు పునఃప్రాణం పోసిన మంత్రవాది ఆమెకు పితృసమానుడు. కాబట్టి అతడూ ఆమెని వివాహమాడ తగడు. శ్మశానంలో కూర్చొని, ఏడుస్తూ ఉండిపోయిన మూడవ యువకుడే ఆమెని పెళ్ళాడెందుకు అర్హుడు" అన్నాడు.

ఇంకేముంది? మౌనభంగం అయ్యింది. భేతాళుడు మాయం! మోదుగ చెట్టు పైకి చేరటం ఖాయం! విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి శ్మశానం వైపు అడుగు లేసాడు.

కథా విశ్లేషణ:

ఈ కథలో ఇన్ని మలుపులు ఉండగా, చాలా చోట్ల టూకీగా కథని చెప్పటం చూశాను. నిజానికి అద్భుతరసం నిండి ఉన్న ఈ కథలో... ముగ్గురు యువకులు పోటీ పడటం, వధువు మరణించటం, ఒకడు కాశీకి పోవటం, ఒకడు దేశాటనం పోవటం, మరొకడు ఏడుస్తూ కూర్చొవటం, దేశాటనం పోయిన వాడికి హిమాలయాల్లో ఓ యోగి మంత్రం ఉపదేశించటంగా... ఈ కథ ఎన్టీఆర్ విక్రమార్క విజయం, భట్టి విక్రమార్కల్లో కూడా ఉంది. నిజానికి అది రసం పిండేసిన పిప్పిలాంటి కథ!

అతిధి ధర్మాన్నీ, బ్రాహ్మణితో మంత్రవాది సంభాషణనీ వివరించే కథలోని మలుపులు ఎంతో ఆసక్తికరంగా, అద్భుత రసంతో నిండి ఉంటాయి. అవన్నీ వదిలేసి రామాయాణాన్ని ‘కట్టె కొట్టె తెచ్చె’ అని చెప్పినట్లుగా చెబితే... నేర్చుకోవడానికి, ఆనందించడానికి ఏం మిగులు తుంది? ఈ కథలే కాదు, సాంప్రదాయ బద్దమైన ఇలాంటి జానపద కథలూ, పంచతంత్ర కథలూ కూడా, రసం పిండేసిన పిప్పిలాంటివే ప్రచారంలోనూ, ప్రచురణలోనూ ఉన్నాయి.

అసలైన కథలని అవలోకిస్తే అదో అద్భుత ప్రపంచమే!

ఇక్కడ ఓ గమ్మత్తు ఏమిటంటే, ముగ్గురు యువకుల్లో ఒకడు కాశీకి పోయాడు, మరొకడు దేశాటనం పోయాడు. ఎక్కడికీ పోకుండా, ఏమీ చేయకుండా, ఊరికే ఏడుస్తూ కూర్చున్న వాడికి ఫలితం దక్కింది. చాలా తక్కువసార్లు ఇలా జరుగుతుంది. పనిచెయ్యకుండా ఫలితం దక్కటం! దీన్నే మరో కోణంలో చూస్తే మిగిలిన ఇద్దరి కన్నా, ఏడుస్తూ కూర్చున్న వాడిలో "ఫీల్’ ఎక్కువగా ఉంది. బహుశః అందుకే పిల్ల దక్కిందేమో! :)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

one more good story from you!

Thanks for sharing with us!

amma odi చెప్పారు...

అజ్ఞాత గారు:నెనర్లండి!

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes