RSS
Wecome to my Blog, enjoy reading :)

‘డుకృఞ్ కరణే ’ – అసలైన విద్యంటే....

ఆవి 8 వ శతాబ్ధి నాటి రోజులు. ఓనాడు కాశీపుర వీధుల్లో ఆది శంకరాచార్యులు, శిష్యసమేతంగా భిక్షార్ధియై వెళ్తున్నారు. ఓ ఇంటి వీధి అరుగు మీద, డెభై ఏళ్ళ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. పదేపదే గట్టిగా ’డుకృఞ్ కరణే, డుకృఞ్ కరణే’ అని వల్లిస్తున్నాడు. అది వ్యాకరణ సూత్రం. ఇతడు వృద్దుడు. కొన్ని దంతాలు ఊడిపోయి, కొన్ని వదులైపోయి మాట తొసి పోతున్నది. అసలు వ్యాకరణ సూత్రం ధ్వనిమారి, అతడి తొర్రినోట తప్పు పలుకుతున్నది. ముందుకూ వెనక్కీ ఊగుతూ, అతడు దాన్ని బట్టీ వేస్తున్నాడు. ఆ విధంగా సంపాదించిన పాండిత్యాన్ని – ఏ రాజుల ముందో, చక్రవర్తుల ముందో ప్రదర్శించి, సన్మానాలు, సంపదలూ పొందాలన్నది ఆ వృద్దుడి ఆకాంక్ష.

అది చూసి శంకరాచార్యుల వారికి ఆగ్రహం, జాలి కలిగాయి. ఎదుటి వాడు వృద్ధుడు. జీవితపు చివరిదశకు చేరినా సత్యమేమిటో ఇంకా గ్రహించలేకున్నాడు. ఇప్పటికీ సిరిసంపదలంటూ, సన్మానాలంటూ, పరుగులు పెడుతూనే ఉన్నాడు. అది చూసిన మరుక్షణం శంకరాచార్యుల వారినోట

భజగోవిందమ్ భజగోవిందమ్
గోవిందమ్ భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహిత కాలే
నహినహి రక్షతి డుకృఞ్ కరణే

అన్న శ్లోకం పలికిందట.

“ఓరి మూర్ఖుడా! అంత్యకాలం సమీపించినప్పుడు, ఈ లౌక్యపు విద్యలు, ‘ఉపాధి, సంపద’ ఇస్తాయని సాధన చేసిన ఈ కళలు నిన్ను రక్షించలేవు. ఇప్పటికైనా గోవిందుణ్ణి [భగవంతుణ్ణి] భజించు” అని దాని అర్ధం. ముక్కుముఖం తెలియని ఎదుటివాణ్ణి, వయో భేదాన్ని పట్టించుకోకుండా, ఙ్ఞాన భేదాన్ని పరిగణించి, శిష్యుణ్ణి మందలించినట్లుగా ‘మూఢమతే’ అని మందలిస్తూ, సత్యాన్ని బోధించినందుకేనేమో ఆది శంకరుల వారిని జగద్గురువని పిలుస్తారు. భజగోవింద శ్లోకాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్ర మాధుర్యంలో రంగరించి చెవులబడుతుంటే ఆత్మ విశ్వపర్యటన చేస్తున్నట్లుంటుంది.

తదుపరి శ్లోకాలలో కొన్ని జగద్గురు ఆది శంకరాచార్యుల వారి శిష్యులు పూరించారట. భజగోవింద శ్లోకాలని విన్నప్పుడు, చదివినప్పుడూ మనస్సులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.

ఆ వృద్ధుడు రాజు గారి నుండి ప్రశంసలూ, సన్మానాలు, తద్వారా కానుకలు, సంపదలు పొందాలని, వయసైపోయిన తర్వాత కూడా విద్యలు వల్లిస్తున్నాడు. విద్యా ప్రదర్శనతో, ఎలాగైనా రాజప్రీతిని పొందగలిగితే ఆర్ధికలాభం. ఇదీ ఆలోచన.

నిజానికి మన విద్యాసంస్థల్లో బోధించేది, సర్టిఫికేట్లు లో సూచించేది విద్య అనుకుంటాం గానీ, అది అసలైన విద్యకాదు. అది ’డుకృఞ్ కరణే’ వంటి విద్య మాత్రమే. అసలైన విద్య ఏమిటో, దాని పరమార్ధమేమిటో, నాకు చేతనైనట్లుగా మరో టపాలో వివరిస్తాను.

5 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

అది "డుకృఙ్ కరణే"

Ravi చెప్పారు...

రైట్ మీరన్నట్లు మన విద్యా విధానంలో అసలైన విద్యే కరువైంది.

Sravan Kumar DVN చెప్పారు...

ippati chaduvula gurinchi annamacharya kirtana :
http://annamacharya-lyrics.blogspot.com/2007/11/355natiki-nade-nacaduvu.html
ప|| నాటికి నాడే నాచదువు | మాటలాడుచును మరచేటిచదువు ||
చ|| ఎనయ నీతని నెరుగుటకే పో | వెనకవారు చదివినచదువు |
మనసున నీతిని మరచుటకే పో | పనివడి యిప్పటి ప్రౌఢలచదువు ||
చ|| తెలిసి యితనినే తెలియుటకే పో | తొలుత గృతయుగాదుల చదువు |
కలిగియీతని గాదననే పో | కలియుగంబులో గలిగిన చదువు ||
చ|| పరమై వేంకటపతి గనుటకే పో | దొరలగు బ్రహ్మాదుల చదువు |
సిరుల నితని మరచెడికొరకే పో | విరసపుజీవుల విద్యలచదువు ||

Wit Real చెప్పారు...

good note.

correct the time lines of Shankara to atleast 7th Century.

amma odi చెప్పారు...

కంది శంకరయ్య గారు : తప్పును దిద్దినందుకు నెనర్లు!
ఇనగంటి రవిచంద్ర గారు: అవునండి అసలైన విద్య కరువే!

శ్రావణ్ కుమార్ డివిఎన్ గారు: ఎంత చక్కని పాటను ఇచ్చారండి!సంతోషంగా ఉంది. నెనర్లు!

Wit Real గారు: Thanks for the correction.

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes