RSS
Wecome to my Blog, enjoy reading :)

ధారా నగరం – వేట వినోదం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 02]

అది ప్రాచీన కాలం!

ఈ కథ ప్రాచీన భారత దేశంలో సంభవించింది.

ఆ కాలంలో భారత దేశం భూలోక స్వర్గంలా ఉండేది. మూడు దిక్కులా ఆవరించిన సముద్రాలు, ఉత్తర దిక్కున ఠీవిగా నిలిచిన హిమాలయ పర్వతాలతో, వెల లేని రత్నాలూ విలువైన లోహాలూ కలిగి, ఒకేసారి నిండు గర్భిణి లాగానూ, పచ్చి బాలింత లాగానూ ఉండేది. వెండి బంగారు రాగి ఇనుము వంటి లోహాలూ, రత్నాలూ వజ్రలూ ప్రజలకి సునాయసంగా లభ్యమయ్యేవి.

చల్లని, సౌకర్యవంతమైన, అందమైన, పచ్చని ప్రకృతి పరచుకొని ఉండేది. ఆ జీవగడ్డపై సంవత్సరమంతా ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా పచ్చని పైరులు చిరుగాలికి ఊగుతుండేవి. నదీ నదాల గలగలలతో, పశుపక్షుల కిలకిలలతో, అరణ్యాలతో అలరారు తుండేది. అక్కడక్కడా విసిరేసినట్లుగా జనవాసాలు... గ్రామాలు, నగరాలు!

పచ్చని ప్రకృతిలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తుండేవాళ్ళు.

అలాంటి భారతదేశంలో అది దక్షిణ భూభాగం! పుడమి తల్లికి నుదుటి సింధూరంలా ధారానగరం అనే పట్టణం ఉండేది. ఆ నగరంలో ఇళ్ళన్నీ మిద్దెలూ మేడలే! పలు అంతస్ధుల భవనాలతో అందంగా ఉండే నగరం! అక్కడి ఇళ్ళకు తోరణాలుగా మామిడాకులు గాక, మణులతో చేసిన హారాలు వేలాడుతుండేవి. దొంగభయం లేదు. దోపిడిల భయమూ లేదు. ప్రజలంతా ఎంతో శాంతి సౌఖ్యాలతో ఉండేవాళ్ళు.

ధారా నగరం భోజరాజు యొక్క రాజధాని. భోజరాజు ఎంతో మంచివాడు, దయగలవాడు, ధర్మపరుడు. తన ప్రజల పట్ల బాధ్యత కలవాడు. అతడెల్లప్పుడూ తన ప్రజల క్షేమం గురించే ఆలోచించేవాడు. అతడి పన్ను విధానం ప్రజలకి ఏమాత్రం భారంగానూ, బాధ గానూ ఉండేది కాదు. అతడి పాలనా విధానం, పరిపాలనా యంత్రాంగం.... ఎల్లప్పుడూ ప్రజలకి సౌకర్యవంతంగా, ప్రజలని రక్షించేవిధంగా ఉండేది. అతడు తన రాజ్యంలోని ప్రజలని ప్రేమించేవాడు, అన్ని విధాలా రక్షించేవాడు. ప్రతిగా ప్రజలూ అతణ్ణి ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు.

ఒకరోజు భోజరాజు, తన ప్రధానమంత్రి బుద్ది సాగరుణ్ణి పిలిచాడు. బుద్ది సాగరుడు మంచివాడు, మేధావి, వివేకం గలవాడు. బుద్దిసాగరుడు అంటే సాగరము వంటి గొప్పబుద్ది కలవాడు, బుద్దికి సాగరము వంటి వాడు అని అర్ధం! అతడా పేరుకు తగినవాడు.

భోజరాజు "ప్రియమైన ప్రధానమంత్రి, బుద్ది సాగరా! మన గూఢచారులు తెల్పిన సమాచారం ప్రకారం, మన గ్రామీణులు కౄర, వన్య మృగాల వలన బాధలు పడుతున్నారు. అరణ్యాలు దట్టంగా ఉన్నాయి. వన్య, కౄర మృగాల సంఖ్య బాగా పెరిగిపోయింది. దాంతో అడవి మృగాలు పచ్చని పొలాలని నాశనం చేస్తున్నాయి. కౄర మృగాలు అమాయక గ్రామీణులని, వారి పెంపుడు జంతువులని గాయపరుస్తున్నాయి. ప్రజలని కాపాడటం మన ధర్మం! అందుచేత రేపటి రోజున వేటకు వెళ్ళాలని నిశ్చయించాను. అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. మన సైన్యంలో నుండి కొన్ని దళాలని సమాయత్త పరచండి. నగరంలో ఉత్సాహం గల యువకులని, వేటకు రావలసిందిగా దండోరా వేయించండి" అని అజ్ఞాపించాడు.

బుద్దిసాగరుడు చిరునవ్వుతో "చిత్తం మహారాజా! రేపటి ఉదయానికల్లా వేటకి అన్ని ఏర్పాట్లు చేస్తాను" అన్నాడు.

మరునాటి ఉదయానికి భోజరాజు వేట కెళ్ళేందుకు సిద్దమయ్యాడు. ఉత్సాహం గల చాలామంది యువకులు వేటకు తగిన ఆయుధాలు.... కత్తులూ, విల్లంబులూ, ఈటెలూ ధరించి, కోట ముందు సమావేశమయ్యారు. వారి కేరింతలతో అక్కడంతా సందడిగా ఉంది. సైనికులూ, యువకులూ కదం తొక్కుతూ, గొంతెత్తి పాడుతున్నారు. సంగీత పరికరాలతో పాటకు అందుకనుగుణంగా తాళం వేస్తున్నారు. వాళ్ళ పాటల రాగాలు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. రజోగుణాన్ని ప్రేరేపిస్తూ రోమాంచితం చేస్తున్నాయి. అక్కడంతా పండగ వాతావరణం వెలిసింది.

[మానవ మనస్తత్వాన్ని భగవద్గీత, మూడు రకాలుగా నిర్వచిస్తుంది. సత్త్వం, రజస్సు, తమోగుణం. మనుషులందరిలో ఈ మూడు గుణాలూ ఉంటాయి. రజస్తమో గుణాల కంటే సత్త్వ గుణం ఎక్కువగా ఉన్నవారిలో.... సహనం, జ్ఞానం, శాంత స్వభావం, అహింసాతత్త్వం వంటి లక్షణాలు ఉంటాయి. రజోగుణం ఎక్కువగా ఉన్నవారిలో.... ధైర్యసాహసాలు, పోరాటపటిమ, నాయకత్వ స్ఫూర్తి వంటి లక్షణాలు ఉంటాయి. తమోగుణం ఎక్కువగా ఉన్నవారిలో.... అవివేకం, వితండవాదం, సోమరితనం, నిద్ర వంటి లక్షణాలు ఉంటాయి.]

ఈ విధంగా రజోగుణ ప్రవర్ధమాన పరిస్థితులలో.... భోజరాజు, మంత్రి బుద్దిసాగరుడు, సైనికులూ, యువకులూ వేటకు బయలు దేరారు. అరణ్యప్రాంతం చేరారు. అరణ్య మధ్యంలో విడిదిని ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రివేళల విశ్రాంతికి, విందు వినోదాలకి గుడారాలు నిర్మించుకున్నారు.

పగటి వేళల్లో అడవి జంతువుల వేట కొనసాగించారు. డప్పు వంటి వాయిద్యాలని గట్టిగా మోగిస్తూ అరణ్య మృగాలని భయపెట్టారు. భయంతో వాటి ఆవాసాల నుండి బయటికొచ్చి పరుగులు తీస్తున మృగాల వెంటబడి వధించారు. కొందరు సైనికులు, రజోగుణ పూరిత రాగాలు మ్రోగిస్తుండగా.... భోజరాజు, అతడి పరివారమూ రణోత్సాహం వంటి హుషారుతో అరణ్యమృగాలని వేటాడారు. ఆ వేట అందర్నీ ఎంతో ఉత్సాహ పరిచింది. అందరూ దాన్ని ఎంతో ఆస్వాదించారు.

[ప్రాచీన కాలంలో పాలకులకి, సంపన్నులకి, ప్రజలకి వేట ఎంతో ప్రీతిపాత్రమైనదై ఉండేది. అప్పట్లో అరణ్యాలు దట్టంగా విస్తారంగా ఉండేవి. అడవి జంతువుల సంఖ్య, ప్రజల కంటే ఎక్కువగా ఉండేది. దాంతో ప్రజల, పెంపుడు జంతువుల ప్రాణాలకు, అడవి జంతువుల నుండి ప్రమాదం ఉండేది. జింకలూ, దుప్పుల వంటి సాధుజంతువులు పొలాల మీద పడి మేసేవి. భల్లూకాలు, కుందేళ్ళు దుంప పంటలని తవ్వి పారేసేవి. ఏనుగుల గుంపులు వంటివి, చెఱకు వంటి పైర్లను పీకి పాకాన పెట్టేవి.

వాటిని నియంత్రించటానికి వేట అనివార్యమై ఉండేది. ఇప్పటి స్థితి దీనికి విపర్యయం. ఇప్పుడు అడవుల కంటే అడవి ప్రాణుల కంటే జనాల సంఖ్య ఎక్కువ! ఇప్పుడు మనిషి నుండి జంతువులకి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు అడవులని సంరక్షించడం, అడవి జంతువులని సంరక్షించడం అనివార్యమైంది. కాబట్టి ఇప్పుడు వేట నిషిద్దం. అప్పుడు వేట వినోదం!]
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes