RSS
Wecome to my Blog, enjoy reading :)

ధనలాలస - ధర్మనిరతి! (భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక - 36)

హఠాత్తుగా బ్రహ్మపురంలో ప్రత్యక్షమైన కార్పటికుడి గురించి క్షణాల్లో వార్త ఊరంతా ప్రాకి సంచలనం రేపింది. కార్పటికుడు నేరుగా వెళ్ళి రాజదర్శనం చేసుకున్నాడు.

చండసింహుడతణ్ణి "కార్పటికా! ఏమయ్యింది? నీవు వెళ్ళిన పనిని ఎంత వరకూ సాధించావు?" అనడిగాడు. కార్పటికుడు రాజుకు నమస్కరించి, తను బయలు దేరినప్పటి నుండీ అప్పటి వరకూ ఏం జరిగిందో, ఏదీ దాచకుండా చెప్పాడు.

రాజది విని ఆశ్చర్యపోయాడు. అతడికా ఆలయాన్ని, ఆ అద్భుత సుందరిని చూడాలనిపించింది. ఓ మంచిరోజున... రాజు, కార్పటికుడు నౌకమీద ప్రయాణం ప్రారంభించారు. కొంచెం కష్టపడినా గానీ, కార్పటికుడు గతంలో తను చేరిన దీవిని గుర్తించాడు.

వెంటనే, రాజు చండసింహుడు, కార్పటికుడు కాళికాదేవి ఆలయంలోకి వెళ్ళారు. రాజు కాళికా దేవికి పూజాదికాలు నిర్వహించాడు. తర్వాత ఆలయ ఆవరణలోకి వచ్చారు. మునుపటి లాగే, మర్రిచెట్టు నీడలో అరుగు మీద, అంతకు క్రితం కార్పటికుడు చూసిన వయ్యారి, విలాసంగా శయనించి ఉంది.

చుట్టూ పరిచారికలు, ఆమెకు సపర్యలు చేస్తున్నారు. రాజామెను చూశాడు. ‘కార్పటికుడు చెప్పింది నిజమే! ఈమె అద్భుత సౌందర్యవతి’ అనుకున్నాడు.

అదే సమయంలో ఆ యువతి కూడా రాజును చూసింది. కోర మీసం, గిరజాల జుట్టు, బలమైన భుజాలు, కండలు తిరిగిన ధృఢ శరీరుడైన రాజుని చూసి ఆమె మైమరచిపోయింది. శౌర్యాన్ని ప్రకటిస్తున్న అతడి దేహభాష, చురుకైన కంటి చూపు, ఆమెను రాజుపై ప్రేమలో పడదోసాయి.

చెలికత్తెలని పిలిచి, రాజును చూపి ఏదో చెప్పింది. ఇద్దరు చెలికత్తెలు రాజు దగ్గరికి వచ్చి నమస్కరించి, ఆమె పంపిన ప్రేమ సందేశాన్ని వినిపించారు. రాజామెను తన వద్దకు రావలసిందిగా కోరాడు. సంతోషంతో,వయ్యారంగా కదులుతూ ‘అందమే ప్రవహించుకొస్తుందా!’ అన్నట్లు ఆమె అతణ్ణి సమీపించింది.

చండసింహుడు "ఓ సౌందర్యరాశి! ఎవరు నీవు? ఇక్కడెందుకు ఉన్నావు?" అనడిగాడు.

తేనెలొలుకుతున్న స్వరంతో ఆమె "నేను నాగలోక యువరాణిని. నా పేరు నాగిని. ప్రతీరోజూ నేనీ కోవెలలో అమ్మవారిని సేవించుకునేందుకు వస్తాను. ఓ రాజా! నీ మీది వలపుతో నా తలపులు నిండిపోయాయి. నన్ను స్వీకరించు" అంది తలవాల్చుకుని.

చండసింహుడు కార్పటికుణ్ణి దగ్గరకు పిలిచి, ఆమెతో "ఓ నాగిని! నీ ప్రేమను అంగీకరించలేనందుకు నన్ను మన్నించాలి. ఇతడు నా ప్రియమిత్రుడు. ఇతడు నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడు. ఇతడి ప్రేమను అంగీకరించు" అన్నాడు.

ఒక్కక్షణం నాగిని అయోమయంగా చూసింది. చండసింహుడు, కార్పటికుడి ప్రేమను స్వీకరించ వలసిందిగా ఆమెకు నచ్చచెప్పాడు. ఆమె కార్పటికుణ్ణి పెళ్ళాడేందుకు అంగీకరించింది.

చండసింహుడు "కార్పటికా! ఆ రోజు, వేట వినోదం నాడు, నీవు నాకు రెండు ఉసిరి ఫలాలనిచ్చి నా దప్పిక తీర్చి, నా ప్రాణాలు కాపాడావు. అందుకు ప్రత్యుపకారంగా... ఇదిగో ఈ యువతీ రత్నాన్ని నీకిస్తున్నాను. ఈమెతో జీవితాన్ని ఆనందించుదువుగాక!" అన్నాడు.

కార్పటికుడు తలవంచి రాజుకు నమస్కరించాడు. కాళికా దేవి సమక్షంలో వారిద్దరికీ వివాహం జరిపించి, చండసింహుడు నాగినీ కార్పటికుల వద్ద సెలవు తీసుకున్నాడు. మరోసారి అమ్మవారిని నమస్కరించి, ఆలయ ప్రాంగణంలోని బావిలో మునిగాడు. తక్షణం బ్రహ్మపురంలో తన రాజ సౌధం ముందు నిలబడి ఉన్నాడు.

కార్పటికుడు నాగినితో సుఖంగా ఉన్నాడు. చండసింహుడు సింహళ రాకుమారిని పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు.

భేతాళుడు ఈ కథ చెప్పి "విక్రమాదిత్య రాజేంద్రా! కార్పటికుడు, రాజు చండసింహులలో ఎవరు గొప్పవారు?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు వెన్నెల కురిసినట్లు చిరునవ్వు నవ్వాడు. "భేతాళా! విను! కార్పటికుడు తన యజమాని అయిన రాజుకు సేవ చేసాడు. మిగిలిన పరివారం అలిసిపోయినా, అతడు రాజు వెన్నంటే ఉన్నాడు. ఓ ప్రక్క రాజు రక్షణ బాధ్యత నిర్వహిస్తూ కూడా, దరిదాపుల్లో ఏమేమి ఉన్నాయోనని గమనిస్తూ అప్రమత్నంగానూ ఉన్నాడు. కాబట్టే దాపులనే ఉన్న ఉసిరి చెట్టునీ, సరస్సునీ గుర్తించగలిగాడు. అది అతడికి వృత్తిపట్ల గల నిబద్దత! అయితే అది అతడి వృత్తిధర్మం కూడా! ఆలికి అన్నం పెట్టడం ఊరినుద్దరించినట్లుకాదు. కాబట్టి - అతడి పని అతడు నెరవేర్చడం గొప్పకాదు.

అయితే రాజు చండసింహుడు కార్పటికుడి పట్ల చూపిన కృతజ్ఞత గొప్పది. ఎందుకంటే - కార్పటికుడు చేసిన సేవకే రాజతడికి జీతమిస్తున్నాడు. అయినా అతడి వృత్తి నిబద్దతని, సేవాధర్మాన్ని గ్రహించి, ప్రత్యుపకారం చేసాడు. లోక సహజంగా... ధనికులు, యజమానులు, రాజులు, సేవకుల నుండి సేవలు పొందుతూ ‘అందుకు తాము ధనం చెల్లిస్తున్నాం కదా!’ అనుకుని ఉదాసీనంగా ఉంటారు. అలా గాకుండా... రాజు చండసింహుడు, తన సేవకుడి పట్ల ప్రభుధర్మాన్ని నిర్వర్తించాడు. కాబట్టి చండసింహుడే గొప్పవాడు!" అన్నాడు.

భేతాళుడు అంగీకార సూచకంగా తలవూపుతూ, విక్రమాదిత్యుడి భుజం పైనుండి మోదగచెట్టు మీదికి ఎగిరిపోయాడు. విక్రమాదిత్యుడు వెనుదిరిగాడు.

కధావిశ్లేషణ: వీరవర్ధనుడు, కార్పటికుడు - రెండు కథలలోనూ, విక్రమాదిత్యుడు రాజు పాటించినదే గొప్ప ధర్మనిరతి అంటాడు. ధనలాలసలోనూ ధర్మనిరతి గుర్తించటం గొప్పవిషయమే కదా మరి!

1 కామెంట్‌లు:

కిరణ్ చెప్పారు...

అవునండి. ధన లాలస అనుకోకపోయినా..రాజు కాబట్టి అలా చేయకపోయినా అడిగే వారుండరు..అయినప్పటికీ ఈ రాజులు తాము యజమానులం కాదు ..నలుగురికి ఆదర్శవంతం గా ఉండాల్సిన వ్యక్తులం అని గుర్తించగలిగారు...
మదిలో నిలిచిపోయేలా...తీయగా ఉంటున్నాయి కథలు .....కృతజ్ఞతలండి...

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes