RSS
Wecome to my Blog, enjoy reading :)

అవినీతి, నీతిగా ఎలా మారిందంటే…….. మైనర్ బాబు కథ

అనగా అనగా.....


అది కృష్ణా జిల్లాలోని ఓ గ్రామం. మరీ పల్లెటూరు కాదు, అలాగని పట్టణం కూడా కాదు. ఆ వూరి జమీందారు గారికి పిల్లల్లేని కారణంగా బంధువుల కుర్రాణ్ణి దత్తత తెచ్చుకున్నారు. ఆ పిల్లవాడికి మైనారిటి తీరని కారణంగా ఆ దత్తుడిని, ’మైనర్ బాబ’ని పిలవటం మొదలెట్టారు. మైనర్ బాబు పెరిగి పెద్దై మేజర్ అయినా పేరు మాత్రం మైనరు బాబుగానే స్థిరపడిపోయింది.

సదరు మైనర్ బాబు పక్కమెడలాల్చీలూ, సైడు క్రాపులతో సోగ్గాడిలాగా తిరిగేవాడు. పిల్ల జమీందారు అయిన కారణంగా చదువైతే ఒంట బట్టలేదు గానీ సకల దుర్గణాలూ అంటుకున్నాయి.

ఇంతలో జమీందారు గారు పరమపదిస్తూ తన యావదాస్తినీ మైనర్ బాబు పరంచేసి పోయాడు. అప్పటికే పెళ్ళై పిల్లలున్న మైనర్ బాబు ఆస్తి చేతికి రావడంతో మరీ పైలాపచ్చీసుగా తిరగడం మొదలెట్టాడు. వారానికోసారి చెన్నాపట్నం ప్రయాణం – మందు, విందు, అందాల పొందు.

ఇంట్లో మైనర్ బాబు శ్రీమతి కన్నీళ్ళు పెట్టుకుంటూ, వూళ్ళోని ఆడంగుల సానుభూతితో ఓదార్పు పొందుతూ కాలం గడిపేస్తోంది. ఇలా ఉండగా ఓరోజు హఠాత్తుగా మైనర్ బాబు చెన్నాపట్నం నుండి సినిమాల్లో చిన్నాచితకా వేషాలేసి రాణించలేకపోయిన ఓ ఎక్స్ ట్రా ఆర్టిస్టు ’రాణి’ని లేపుకొచ్చి జమీందారు భవనం వెనకున్న ’ ఔట్ హౌవుస్’లో పెట్టాడు.

ఊరంతా ఈ వార్త గుప్పుమంది. మరి అవి ఇంకా విలువుల గురించి కనీసం మాట్లాడుకుంటున్న రోజులయ్యె. వారం పదిరోజులు జమీందారు భవంతి వచ్చీపోయే ఆడంగులతో, జమీందారిణి వెక్కిళ్ళతో, ఓదార్పులతో సందడే సందడి! జమీందారిణిని ఓదార్చాలని వచ్చేవాళ్ళకి – జమీందారిణి దుఃఖం కన్నా, చెన్నాపట్నం నుండి వచ్చిన ’ఫిల్మ్ స్టార్’ రాణి ఎలా ఉంటుందో చూడాలన్న కుతుహలమే ఎక్కువుంది.

దాంతో ఔట్ హౌస్ వైపు తొంగి తొంగి చూసే వాళ్ళు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఔట్ హౌస్ లో రాణితో పాటు ఆవిడ తమ్ముడూ, మరో పనిమనిషి కూడా వచ్చారు. ఈ పనిమనిషి మహా నేర్పరి. అన్నింటి గురించీ, అందరి గురించి ఆచూకీలూ, కూపీలూ అలవోకగా లాగేసేది. రాణి గారి తమ్ముడు వారానికి రెండుసార్లు చెన్నపట్నం వెళ్ళి వస్తూ ఉండేవాడు.

మొదట్లో ఊరంతా ’రాణి’ని విడ్డూరంగా చూసేవాళ్ళు. మెల్లిగా అలవాటై పోయారు. ఈ లోపులో రాణి జమిందారిణి గారికి, తన తమ్ముడు చెన్నపట్నం నుండి తెచ్చిన విదేశీ స్నోలూ, పౌడర్లూ, పిల్లలకి విదేశీ చాక్లెట్లూ, రంగు రిబ్బన్లూ, రంగు రంగుల విదేశీ బట్టలు లాంటి చిన్నచిన్న బహుమతులు పంపింది. ముందు తిరగ్గొట్టిన జమీందారిణి మెల్లిగా తీసికోవటం మొదలైట్టింది. పిల్లలకైతే చెన్నపట్మం వింతబొమ్మలు మహా నచ్చేసాయి. మెల్లిగా జమీందారు భవనానికి, ఔట్ హౌస్ కు రాకపోకలు కూడా మొదలైనవి.

మెల్లిగా ’రాణి’ని చూడవచ్చే ఆడంగులు పోగయ్యారు. తన ఇంటికి అతిధులొచ్చినప్పుడల్లా చప్పున కలిపే కాఫీ పౌడర్లూ, జపాన్ చాక్ లెట్లు, రుచి చూపించింది రాణి. జమీందారిణికి, రాణికి సంబంధాలు బలపడ్డాయి. కందకి లేని దురద కత్తి పీటకెందుకన్నట్లు ఊళ్ళో వాళ్ళు ’రాణి’తో స్నేహం మొదలెట్టారు. మెల్లిగా పెళ్ళి పేరంటాలకి రాణిని పిలవడంతో మొదలై, మొదటి తాంబూలం దాకా సాగింది. రాణి నివాసం ఔట్ హౌస్ నుండి జమీందారు భవంతికి మారింది.

క్రమంగా అందరూ ’రాణి’ని రెండో జమీందారిణిగా గుర్తించారు. ఓ పుకారు ఏమిటంటే ’ఇటీవలే రాణికి జ్వరం వస్తే జమీందారిణి రాణికి కాళ్ళు వత్తిందని.’

ఇలా అవినీతి క్రమంగా సమాజంలో నీతిగా చలామణి అవుతుందని ఈ కథ వలన తెలుస్తుంది. ఇలా విదేశీ పౌడర్లూ, రిబ్బన్లూ, బొమ్మలూ, కాఫీలు, చాక్ లెట్లు తో మొదలై మోజు[ఫ్యాషన్] మాటున ప్రతీ అవినీతి కూడా సమాజంలో జనామోదం [Stamp?] పొందేస్తుంది.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

5 కామెంట్‌లు:

bondalapati చెప్పారు...

బాగుందండీ ఆదిలక్ష్మి గారూ,
ఆర్ధిక సరళీకరణ తొ వచ్చిన విలువల మార్పు గురిచే కదా ఈ కథ?ఇప్పటి నుంచీ, కురచ బట్టలేసుకోవటం మా హక్కు అని వాదించే వాళ్ళని చూస్తేనో, లేక అత్త మామల పల్లెటూరి వాసనను భరించలేని వాళ్ళని చూస్తేనో, లేక మందు కొట్టటమూ, మగువలను పట్టటమూ సాధారణం అని వాదించే వాళ్ళను చూస్తేనో మీ కథ తప్పని సరి గా గుర్తుకు వస్తుంది నాకు...

amma odi చెప్పారు...

ఈ కథ నాది కాదండి. డి.వి.నరసరాజు గారు మూడు దశాబ్ధాల క్రితం వ్రాసింది.

Rao S Lakkaraju చెప్పారు...

ఇది బ్రతక నేర్చటం కి చక్కని ఉదాహరణ. రోజూ ఏడుస్తూ తిట్టుకుంటూ బ్రతకటం ఎందుకు. వదిలిపోనప్పుడు కలిసి జీవించటమే మార్గం.

అజ్ఞాత చెప్పారు...

visit godsavemedia.wordpress.com

amma odi చెప్పారు...

Rao S Lakkaraju గారు: :)))

అజ్ఞాత గారు: ఆ బ్లాగుని చూసానండి. నెనర్లు!

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes