RSS
Wecome to my Blog, enjoy reading :)

అమ్మ మనస్సు

అనగా అనగా .....

ఓ ఊరిలోని బ్రాహ్మణ వాడలో సరస్వతమ్మ అనే వితంతువు ఉండేది. ఆమెకు ఒకే ఒక్క కుమారుడు కాశీనాధుడు. కొడుకు పసివాడుగా ఉండగానే భర్తను పోగొట్టుకున్న సరస్వతమ్మ కాశీనాధుణ్ణి ఎంతో ప్రేమగా, అతిగారాబంగా పెంచింది.


కట్టడి చేసేందుకు తండ్రి లేని కారణంగానూ, తల్లి అతిగారాబంతోనూ కాశీనాధుడు ఎదిగే కొద్దీ బాధ్యత లేకుండానూ, వ్యసనపరుడు గానూ తయారయ్యాడు. మొదట్లో జూదమూ, మద్యమూ మరిగిన కాశీనాధుడు క్రమంగా వేశ్యాలోలుడయ్యాడు.


సరస్వతమ్మ కాశీనాధుణ్ణి సన్మార్గంలో పెట్టడానికి ఎన్నోప్రయత్నాలు చేసింది. కాశీనాధుడిలో మార్పులేదు సరికదా ఆస్తి హారతి కర్పూరంలా కరగబెట్టి వేశ్యలకు ఖర్చుపెట్టసాగాడు. ఊరిలోని పెద్దవాళ్ళూ, బంధువులూ మందలించబోతే నోటి దురుసుతో నానా మాటలూ అన్నాడు. వ్యవహారం చెయ్యి దాటిపోయింది. ఆ దిగులుతో సరస్వతమ్మ కృంగిపోసాగింది.


దాంతో ఊరిజనం మెరకవీధి మీనాక్షిని తిట్టిపోయసాగారు. ఎందుకంటే ఆవిడే మరి కాశీనాధుణ్ణి వినోదింపజేస్తున్న వేశ్య. దానితో మీనాక్షికి సరస్వతమ్మ అంటే గొంతుదాకా కోపం, ద్యేషం నిండిపోయాయి.


మరింత కసిగా, వేగంగా కాశీనాధుడి ఆస్తి అవగొట్టేసింది. ఓ రోజు ఎంతో నయగారంగా కాశీనాధుణ్ణి మాయ చేసి అతడి స్వంత ఇల్లు కూడా వ్రాయించేసుకొంది. సరస్వతమ్మ చేసేది లేక పూరింటిలోకి మారి ఇల్లు మీనాక్షికి స్వాధీనం చేసింది. అయినా కసి తీరని మీనాక్షి ఓ రోజు కాశీనాధుణ్ణి అతడి తల్లి గుండె తెచ్చివ్వమని కోరింది.


ఉఛ్ఛనీచాలు మరిచిన ఈ కామాంధుడు తల్లి దగ్గరికి వెళ్ళి తనకి ఆవిడ గుండె కావాలని అడిగాడు. అప్పటికే జీవితేచ్ఛ నశించిన సరస్వతమ్మ కన్నీరు నిండిన కళ్ళతో “తీసికెళ్ళునాయనా” అంటూ కత్తితో గుండెలు చీల్చుకొని మరణించింది.


తల్లిగుండెని దోసిట్లో పెట్టుకొని వేగంగా వీధిలోకి వచ్చిన కాశీనాధుడు పరుగు పరుగున నడుస్తూ మీనాక్షి ఇంటిదారి పట్టాడు. ఆ వేగంలో అతడి కాలు రాయికి కొట్టుకొని తూలి పడబోయాడు. మరుక్షణం అతడి చేతిల్లోని తల్లి గుండె “జాగ్రత్త నాయనా! పడతావు” అంది. అదీ తల్లి హృదయం!


అప్పటికి కళ్ళకి కప్పిన కామపు పొరలు తొలిగిన కాశీనాధుడు సత్యం గ్రహించి, తన కామక్రోధాల్ని వదిలి భక్తి మార్గాన్ని ముక్తి దారిని పట్టాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes