RSS
Wecome to my Blog, enjoy reading :)

మృత సంజీవని – కొత్త సమాధానం ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 46]

విక్రమాదిత్యుడు మరోసారి భేతాళుడున్న శవాన్ని బంధించాడు. దాన్ని భుజాన పెట్టుకుని మౌనంగా బృహదారుణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడు పదిహేనవ కథ ప్రారంభించాడు.

“ఓ విక్రమాదిత్య మహారాజా! నీ పట్టుదల అనితర సాధ్యమైనది. నేనో కథ చెబుతాను. మార్గాయాసం మరిచి విను” అంటూ కథ కొనసాగించాడు.

ఒకానొకప్పుడు బ్రహ్మపురమనే బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. అందులో విష్ణు స్వామి అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడికి సంతతి లేదు. అందుచేత అతడెంతో దిగులు పడ్డాడు. ఎన్నో నోములూ, పూజలూ చేసాడు. చివరికి మహాశివుడి గురించి తీవ్ర తపమాచరించాడు. శివుడి దయతో, కొంత కాలానికి అతడికి సంతాన భాగ్యం కలిగింది. వరుసగా నలుగురు పుత్రులుదయించారు.

అతడువారినెంతో అల్లారుముద్దుగా పెంచి, తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పాడు. మరిన్ని విద్యలు నేర్పాలన్న అభిలాషతో, కుమారులు నలుగురూ దేశాటనం బయలు దేరారు. అలా నానా దేశాలూ తిరుగుతూ, చివరికి ఓ యోగిని ఆశ్రయించారు.

ఆ యోగి సకల విద్యా పారంగతుడు. మంత్ర తంత్ర విద్యలని సైతం ఎఱిగిన వాడు. బ్రాహ్మణ కుమారులు. అతణ్ణి శ్రద్ధా భక్తులతో సేవించారు. వారి శుశ్రూషలకు మెచ్చిన యోగి, వారికి వారి అభిరుచుని బట్టి మంత్ర తంత్ర విద్యలు నేర్పాడు. తర్కమీమాంసాలు మీద గానీ, వేద విద్య మీద గానీ, వారికి ఆసక్తి లేకపోయింది.

దాంతో మృత సంజీవని సహా ఎన్నో అపూర్వమైన మంత్ర విద్యలు గురువు దగ్గర నేర్చుకున్నారు. ఓ శుభ దినాన, యోగి వాళ్ళ నలుగురికీ ‘విద్యాభ్యాసం పూర్తయ్యిందనీ ఇక ఇళ్ళకి వెళ్ళవచ్చనీ’ ఆనతిచ్చాడు.

కుర్రాళ్ళు నలుగురూ ఎంతో ఆనందంతో గురువుకి నమస్కరించి, స్వగ్రామానికి పయన మయ్యారు. దారిలో నదీ నదాలు, కొండలూ లోయలూ, అరణ్యాలూ జనపదాలూ దాటుతూ, తమ విద్యా ప్రదర్శనతో ప్రజలని అబ్బుర పరుస్తూ ప్రయాణించసాగారు.

మార్గమధ్యంలో వారొక అడవిలో నుండి ప్రయాణించాల్సి వచ్చింది. అప్పటికే తమ విద్యా ప్రదర్శనలకి ప్రజలు పలికిన జేజేలతో వాళ్ళల్లో అహం తలకెక్కి ఉంది. స్కోత్కర్షతో భుజాలు పొంగి ఉన్నాయి. ఆత్మస్తుతి శృతి మించింది. తమని తామే ప్రశంసించుకుంటూ ప్రయాణిస్తున్నారు.

అంతలో, బాట ప్రక్కనే ఓ పులి చచ్చిపడి ఉంది. శరీరం కుళ్ళి కంపు కూడా మాసిపోయింది. చీమలు తినగా శిధిలమై, మిగిలిన శరీరావశేషాలున్నాయి. నలుగురు అన్నదమ్ములూ దాన్ని చూశారు. తలకెక్కిన అహంకారానికి ఇంగిత జ్ఞానం అడుగంటింది. చచ్చిన పులిని బ్రతికించి, కుక్కలా తమ వెంట బెట్టుకు వెళ్ళితే, జనం భయంతో, ఆశ్చర్యంతో మూర్ఛబోతారనిపించింది. ఆ ఊహే వాళ్ళకి మత్తు గొల్పింది.

మొదటి వాడు మంత్రాలు జపిస్తూ పులి కళేబరంలో మిగిలిన ఎముకలు పోగు చేసి నీటిని మంత్రించి చల్లాడు. వెంటనే పులి అస్థిపంజరం తయారయ్యింది.

రెండవ వాడు మంత్రం జపిస్తూ, దానికి రక్తమాంసాలు ప్రసాదించాడు. మూడవ వాడు మంత్రాలు జపించి దానికి చర్మమూ, గుండె వంటి ముఖ్యమైన అవయవాలనూ సృష్టించాడు.

నాలుగవ వాడు మంత్రం జపించి దానికి ప్రాణం పోసాడు. అప్పటికే మిగిలిన ముగ్గురూ చప్పట్లు చరుస్తూ పులి ప్రాణం పోసుకోవడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

నాలుగవ వాడి మంత్రోచ్ఛాటనతో పునర్జీవించిన పులి, తనకు ప్రాణదాతలైన తమ ఎదురుగా, వినయంగా నిలబడుతుందన్న ఊహతో, వొళ్ళు తెలియకుండా నిలబడి ఉన్న నలుగురినీ చూచి, పులి ఒక్కమారుగా గాండ్రించింది.

ఆకలితో నకనకలాడుతున్న పులి కంటికి నిండుగా ఆహారం కనబడింది. అది తమపై దాడి చేస్తోందన్న విషయం నలుగురు అన్నదమ్ములకీ అర్ధమయ్యేలోపునే, పులి నలుగురినీ చీల్చి పారేసింది. కడుపు నిండా తిన్నంత తిని, దాని దారిన అదిపోయింది.

ఇదీ కథ!

ఓ విక్రమార్క మహారాజా! నలుగురు బ్రాహ్మణ యువకులూ మృత్యువాత పడిన ఈ సంఘటనలో, ఈ బ్రహ్మహత్యా పాపం ఎవరికి చెందుతుంది?” అని అడిగాడు.

విక్రమాదిత్యుడు గొంతు సవరించుకుని “భేతాళుడా! నలుగురూ… విద్యాగర్వంతో, వినయాన్ని మరిచి విర్రవీగారు. అయితే మొదటి ముగ్గురి కారణంగా పులి శరీరాన్ని పొందిందే గానీ, చైతన్యాన్ని పొందలేదు. కాబట్టి ప్రాణహాని దాకా పరిస్థితి రాలేదు.

కనీసం చివరి వాడన్నా మంత్రప్రయోగం చేయటం ఆపి ఉంటే నలుగురు బ్రాహ్మణ యువకులూ బ్రతికి ఉండేవాళ్ళు. కాబట్టి మొదటి ముగ్గురి మృతి కారణంగా బ్రహ్మహత్యా దోషమూ, చివరి వాడి ఆత్మహత్యా పాపమూ కూడా, నాలుగో సోదరుడికే చెందుతాయి” అన్నాడు.

మరోసారి మౌనం భంగమైంది. భేతాళుడు అదృశ్యుడయ్యాడు.

కథా విశ్లేషణ: ఇది పంచతంత్రంలో కూడా ఉన్న కథ. చాలా చోట్ల విన్న కథ, చదివిన కథ. చివరికి పిల్లల పాఠాల్లో కూడా ఉన్న కథ! అయితే అంతగా ఆలోచించని సమాధానం ఈ కథలో ఉంటుంది.

పులి బ్రతకడానికి, అందరూ చావడానికీ నలుగురూ కారణమే అయినా… చివరి వాడి బాధ్యతే ఎక్కువ కాబట్టి, బ్రహ్మహత్యా పాపం అతడికే చుట్టుకుంటుందంటాడు విక్రమాదిత్యుడు.

చాలాసార్లు మనం ఇలాంతి స్థితిని గమనిస్తుంటాం. తలా కొంచెం అందరూ పాలుపంచుకున్న పని, చివరి క్షణంలో ఎవరి చేతుల్లో విఫలమయ్యిందో, వాళ్ళని బాధ్యుల్ని చేస్తున్నప్పుడు, “అతడొక్కణ్ణే అనడం దేనికి? అందరూ తలో చెయ్యివేసారు?” అంటుంటారు. దాంతో శిక్ష తీవ్రత పలుచనై పోతుంది.

నిజానికి చెడుకర్మల్లో… ఎవరి చేతుల్లో చివరి వైఫల్యం వచ్చిందో వాళ్ళని బాధ్యుల్ని చేస్తే…ఎవరికి వాళ్ళకే ఆ భయం ఉంటుంది. ఉదాహరణకి చేతులు మారుతున్న బాంబు ఎవరి చేతుల్లో పేలితే, వాళ్ళ ప్రాణాలు గాల్లో కలవటం తధ్యం అనే స్థితిలో… ఎవరికి వాళ్ళూ ఎంతో అప్రమత్నంగా ఉంటారో… ఇదీ అంతే!

అప్పుడు ఎవరికి వాళ్ళూ చెడు కర్మకి వెనుతీస్తారు కదా!

ఆ నీతినే ఈ కథ చెబుతుంది!

ప్రియురాలు, ప్రియుడు, భర్త – ఎవరు గొప్ప? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 45]

విక్రమాదిత్యుడు తన ప్రయత్నం మాన లేదు. మోదుగ చెట్టెక్కి భేతాళుడిని దించి నడక ప్రారంభించాడు. భేతాళుడూ తన ప్రయత్నమాపలేదు. మరో కథ ప్రారంభించాడు.

“ఓ విక్రమాదిత్యా భూపాలా! విను” అంటూ కొనసాగించాడు.

అలకాపురి అనే నగరంలో ఒక వైశ్యశ్రేష్ఠుడు ఉండేవాడు. అతడి పేరు ఈశ్వర శెట్టి. అతడికి ఒక కుమార్తె ఉంది. పేరు రమ్యవల్లి. ఆమె పేరుకు తగ్గట్లే రమ్యమైన పూలతీగ వలె ఉండేది. ఆమె యుక్త వయస్సులో ఉంది.

వారి నివాసానికి దగ్గరలోని బ్రాహ్మణ అగ్రహారంలో నివసించే సందీపుడనే బ్రాహ్మణ యువకుడు ఆమెని ప్రేమించాడు. రమ్యవల్లికీ అతడంటే అనురాగమే ఉండటం వలన వారిద్దరూ ప్రతీ రోజూ ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళు. పరస్పర సాన్నిహిత్యాన్ని ఆనందించే వాళ్ళు.

ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు అలకా పురి కి ప్రక్కనున్న నగరం నుండి ఓ వైశ్య యువకుడు, రంగనాధ శెట్టి అనేవాడు వచ్చి ఈశ్వర శెట్టిని కలుసుకున్నాడు. తనని తాను పరిచయం చేసుకొని పిల్లనివ్వమని అడిగాడు.

ఈశ్వర శెట్టి కి రంగనాధ శెట్టి కులగోత్రాలూ, రూపురేఖలూ, అర్హతలు నచ్చటంతో రమ్యవల్లినిచ్చి వివాహం చెయ్యడానికి అంగీకరించాడు. ముహుర్తం నిర్ణయించి, బంధుమిత్రులందర్నీ ఆహ్వానించి వైభవంగా పెళ్ళి జరిపించాడు.

ఇటు రమ్యవల్లి గానీ, అటు సందీపుడు గానీ తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పలేదు. పెళ్ళి వైభవోపేతంగా జరిగిపోయింది. రంగనాధ శెట్టి భార్యని వెంటబెట్టుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు. రమ్యవల్లి ప్రియుడైన సందీపుణ్ణి విడిచి వెళ్తున్నందుకు విపరీతంగా దుఃఖ పడింది.

అత్తగారిల్లు చేరినా, ప్రియుని వియోగ దుఃఖంతో కృంగి కృశించ సాగింది. కొన్ని రోజులకి ఆ వ్యధతో మరణించింది. ఆ వార్త విని సందీపుడు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చాడు. అన్నపానీయాలు నిద్రా విశ్రాంతులు మానివేసి, మనోవేదనతో మంచం పట్టాడు. కొద్ది రోజులకి అతడూ మరణించాడు.

రమ్యవల్లి మరణించడంతో ‘మనసు పడి వివాహం చేసుకున్న భార్య చనిపోయిందే’ – అన్న విచారంతో రమ్యవల్లి భర్త రంగనాధ శెట్టి కూడా దిగులు చెంది జబ్బున పడి మరణించాడు.

“ఓ విక్రమాదిత్య రాజేంద్రా! రమ్యవల్లి, ఆమె ప్రియుడు సందీపుడు, ఆమె భర్త రంగనాధ శెట్టి – ఈ ముగ్గురూ వ్యధ చెంది మరణించారు కదా! వీరిలో ఎవరు గొప్ప? వివరించి చెప్పు” అన్నాడు భేతాళుడు.

విక్రమాదిత్యుడు కొంత గంభీరంగా “ఓ భేతాళా! విను! రమ్యవల్లి, ఆమె ప్రియుడు సందీపుడూ… కొంతకాలం పరస్పర ప్రేమనీ, సాన్నిహిత్యాన్నీ అనుభవించారు. అందుచేత ఆ వియోగ దుఃఖాన్ని భరించలేక మనోవ్యధ చెంది మరణించారు. అయితే రమ్యవల్లి భర్త రంగనాధ శెట్టి అమాయకుడు. ముచ్చటపడి వివాహం చేసుకున్న భార్య మీద మమకారంతో, ఆమె మరణ దుఃఖాన్ని సహించలేక, బాధతో తాను మరణించాడు. కాబట్టి రంగనాధ శెట్టి గొప్పవాడు” అన్నాడు.

భేతాళుడు అంగీకార సూచకంగా తలాడించి “మౌనభంగమైంది మహారాజా! సెలవు” అంటూ మాయమై మోదుగ చెట్టు ఎక్కేసాడు.

చేజారిన మంత్రం కథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 44]

విక్రమాదిత్యుడు మరోసారి మోదుగ చెట్టెక్కి శవాన్ని దించి, భుజానికెత్తుకుని బృహదారణ్యం కేసి నడవసాగాడు. శవంలోని భేతాళుడు పదమూడవ కథ చెప్పడం ప్రారంభించాడు.

ఒకప్పుడు పుష్పపురం అనే నగరం ప్రక్కన ఓ శిధిలాలయం ఉండేది. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో అలమటిస్తూ ఆ కోవెలలో పడుకున్నాడు.

అంతలో అక్కడికి ఓ యోగి వచ్చాడు. ఆ బ్రాహ్మణుణ్ణి చూడగానే యోగికి అతడి పరిస్థితి మొత్తం అర్ధమయ్యింది. యోగికి అతడిపై జాలి కలిగింది. అతడికి సాయపడదలిచాడు. వెంటనే ఆ యోగి ఒక మంత్రాన్ని జపించాడు.

వెంటనే అక్కడొక ఇల్లు సృష్టింపబడింది. చుట్టూ ఉద్యానవనం, ప్రక్కనే చిన్న సరస్సు, ఇంటి లోపలంతా అందమైన, విలువైన వస్తువులూ, సామాగ్రితో సర్వ సంపన్నంగా ఉంది. ఆ ఇంటి వంట గదిలో రుచికరమైన భక్ష్యభోజ్యాలు, మధురఫలాలూ, పానీయాలూ ఉన్నాయి.

యోగి బ్రాహ్మణుడిని ఆ యింటి లోనికి తీసుకు వెళ్ళాడు. అక్కడి మృష్టాన్న భోజనాన్ని చూచి బ్రాహ్మణుడి కళ్ళు మెరిసాయి. యోగి అతడిని వాటిని తినవచ్చునని ఆదేశించాడు. ఆ పేద బ్రాహ్మణుడు ఎంతో సంతోషంతో ఆకలి తీర్చుకున్నాడు.

యోగికి ఆ అభాగ్యుడి పట్ల ఎంతో వాత్సల్యం కలిగింది. అతడికి మంత్రోపదేశం చేయదలిచి “నాయనా, నీకు దివ్య మంత్రం ఉపదేశిస్తాను. పవిత్ర స్నానం ఆచరించాలి. పద!” అంటూ అతణ్ణి సరస్సు దగ్గరికి తీసికెళ్ళాడు. అందులో పుణ్యస్నానమాచరించి రావలసిందని పంపాడు. బ్రాహ్మణుడు సరస్సులో మునిగాడు.

తొలి మునక వేసిన క్షణం అతడి కొక దృశ్యం మనోఫలకం మీద గోచరించింది. అందులో అతడి కుమారుడు అతని ఎదురుగా నిలబడి ఉన్నాడు. రెండవ మునకలో అతడికి అతడి భార్య కనిపించింది. మూడో మునకలో అతడి వృద్ధులైన తల్లిదండ్రులు కనిపించారు.

స్నానం ముగించి గట్టు మీది కొచ్చాక బ్రాహ్మణుడికి అదంతా తన ఊహేగాని, తన భార్యాపుత్రులూ, తల్లిదండ్రులూ అక్కడ లేరని అర్ధమయ్యింది.

బ్రాహ్మణుడు తన అనుభవాన్నంతా యోగికి వివరించి చెప్పాడు. యోగి ఒక్కక్షణంతో తన ప్రయత్నం వృధా అయ్యిందని గ్రహించాడు. విచారం నిండిన స్వరంతో “నాయనా! అనవసరంగా నిన్ను శ్రమకు గురి చేసాను, నేనూ శ్రమ తీసుకున్నాను. ఈ మంత్రం నీకు ఉపయోగించదు. భగవదనుగ్రహమిట్లున్నది. నీవు ఇంటికి పోయి తోచిన రీతిన బ్రతుకు” అని అతడిని దీవించి తన దారిన తాను పోయాడు.

బ్రాహ్మణుడు కొంత సేపు విచారించి, చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఇదీ కథ!

భేతాళుడింత వరకూ కథ చెప్పి “ఓ విక్రమాదిత్యా! యోగి ఎందుకా విధంగా చెప్పాడు? మంత్రం యోగికి ఫలవంతమైనప్పుడు, ఆ పేద బ్రాహ్మణుడికెందుకు ఫలించదు? బ్రాహ్మణుడు సరస్సులో స్నానమాడి వచ్చేంతలో యోగి మనస్సు మార్చుకున్నాడా? యోగికి అతడిపై కలిగిన వాత్సల్యం అంతలోనే కరిగి పోయిందా? తెలిసీ జవాబు చెప్పకపోతే నీ తల వేయి వక్కలౌతుందని నీకు తెలుసు. మౌనభంగమైతే నీ ఈ ప్రయత్నం ఫలిందనీ, నీకు తెలుసు కదా! ఇక జవాబు చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు ఓ సారి దీర్ఘ శ్వాస తీసుకుని “ఓ భేతాళా! విను! ఆ యోగి అమృత హృదయుడు. ఆ పేదవాడిపై ప్రేమా జాలీ కలవాడై మంత్రోపదేశం చేసి అతడికి సహాయం చేయాలనుకున్నాడు. యోగి వాత్సల్యం కరిగి పోలేదు, మనస్సూ మారిపోలేదు.

అయితే… పుణ్యవ్రతం ఆచరించాలన్నా, దైవధ్యానం చెయ్యాలన్నా, యోగాభ్యాసమూ మంత్రోచ్ఛాటనా చేయాలన్నా, ఏకాగ్రత అవసరం. పూర్తిగా మనస్సుని లగ్నం చేసి సాధన మీదే దృష్టి కేంద్రీకరించి, ఇతరమైన ఆలోచన లేవీ లేకుండా ఏకాగ్రచిత్తులైతేనే… ఏ వ్యక్తి అయినా సాధన చెయ్యగలడు. ఆ పేద బ్రాహ్మణుడికి మనస్సుని ఏకాగ్రం చేసే శక్తి లేదు. అది గ్రహించిన వాడై, యోగి తన ప్రయత్నం విరమించుకొని, తన దారిన తాను పోయాడు. అంతే! అది బ్రాహ్మణుడి అసక్తత గానీ యోగి అనాదరణ కాదు” అన్నాడు.

భేతాళుడీ జవాబుకి సంప్రీతుడైనాడు గానీ తక్షణమే అదృశ్యుడూ అయ్యాడు.

కథా విశ్లేషణ: దేన్ని సాధించాలన్నా, ఏకాగ్రత అవసరం అనే విషయాన్ని పిల్లల మనస్సుకి హత్తుకునేలా చెబుతుందీ కథ! అందునా మాయమంత్రాలు నేర్చుకోవటమనే కథలంటే పిల్లలకి మహా సరదా! అలాంటి చోట మంత్రం నేర్చుకునే అవకాశం పోవటమంటే, పిల్లలకది బాగా గుర్తుండి పోతుంది. ఆ విధంగా ‘ఏకాగ్రత సాధించాలి’ అనే ఆలోచన వాళ్ళలో రేకెత్తుతుంది.

మంత్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 43]

నీతి వర్ధనుడు తన దేశాటన విశేషాలన్నిటినీ వివరించాడు. వర్తక శ్రేష్ఠితో స్నేహం, సముద్ర ప్రయాణం, తుపానులో దారి తప్పి కనీవినీ ఎరగని దీవికి చేరటం, అక్కడి ఆలయం, అందులోని అపురూప సుందరి గురించీ… ఏదీ దాచకుండా పూసగుచ్చినట్లు వర్ణించాడు.

రాజు వంశమార్గుడికి ఆ దీవిని చూడాలనే కోరిక కలిగింది. ఓ రోజు, నీతి వర్ధనుణ్ణి వెంటబెట్టుకుని, తగిన సిబ్బందితో నౌకా ప్రయాణం ప్రారంభించి, గతంలో నీతి వర్ధనుడు చేరిన దీవికి ప్రయాణమయ్యారు. కొన్నిరోజుల తర్వాత ఆ దీవికి చేరారు.

రాజు పరివారంతో గుడిలోకి ప్రవేశించాడు. అద్భుతమైన శిల్పాలతో అలరారుతున్న కోవెల అది. ఆవరణలో చెట్టు క్రింద నిదురిస్తున్న లావణ్య రాశిని చూశాడు రాజు. ఆమె చాలా అందంగా ఉంది. రాజుకి ఆమె పట్ల అనురాగం కలిగింది.

అలికిడికి నిద్ర లేచిన ఆ యువతి, రాజుని చూసి ఆశ్చర్య పోయింది. రాజు వంశమార్గుడు తీయని మాటలతో తన ప్రేమను ఆమెకు తెలిపాడు. అతడి మాట తీరుకు, గంభీరమైన అతడి రూపానికీ ఆమె ముగ్ధురాలైంది. అంగీకార సూచకంగా ఆమె కళ్ళు మెరిసాయి.

తనలో ‘ఇతడు గొప్ప చక్రవర్తై ఉంటాడు. ఇతడి రూపురేఖ మన్మధుణ్ణి, రాచఠీవి దేవేంద్రుణ్ణి తలపిస్తున్నాయి’ అనుకొంది.

మెల్లిగా తలెత్తి “ఓ రాజా! నీవు రాజులలో ఇంద్రుడి వలె ఉన్నావు. నేను నీ ప్రేమని తిరస్కరించినట్లయితే, ఇంత అందమైన శరీరం కలిగి ఉండీ నిరర్ధకమే! అయితే, నీవు కొంత సమయం వేచి ఉండక తప్పదు. రానున్న అష్టమి లేదా అమావాస్య వరకూ వేచి ఉండగలవు” అంది.

అప్పటి వరకూ రాజు తన పరివారంతో కోవెలలోని దుర్గామాతని ఆరాధిస్తూ, ఆ యువతితో తీయని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసాడు. అష్టమి రానే వచ్చింది.

ఆమె కోవెలలో ఒక వత్రమాచరింప ప్రారంభించింది. అందుకోసం గుడి ఆవరణలోని పవిత్ర పుష్కరిణిలో స్నానానికి వెళ్ళింది. ఆ కోనేటిలో కలువలూ, తామరలూ ఉన్నాయి. నీరు స్వచ్ఛంగా ఉంది. సన్నని అలలతో మనోహరంగా ఉంది.

రాజు “నీటిలో పసిబిడ్డని ఒంటరిగా విడిచి పెట్టరాదు. అదే విధంగా… అందమైన యువతినీ ఏ వేళలోనూ ఒంటరిగా ఉంచరాదు” అనుకొని, కత్తి చేతబూని, ఆమెకు కనబడకుండా ఆమెకి రక్షణగా ఉన్నాడు.

అంతలో… భీకరమైన శబ్దం వచ్చింది. అదేమిటో గమనించే లోగానే, ఓ భీకరాకారుడైన రాక్షసుడు వచ్చాడు. అమాంతం ఆమెని ఎత్తి నోట్లో పెట్టుకు మింగేసాడు.

ఒక్కక్షణం రాజు వంశమార్గుడు నివ్వెర పడ్డాడు. మరుక్షణం, ఆ రాక్షసుడి ముందుకు దూకి, ఒక్క ఉదుటున కత్తితో వాడి పొట్ట చీల్చాడు. అందులో నుండి ఆ యువతి సురక్షితంగా బయటపడింది.

ఆశ్చర్యంగా చూస్తున్న రాజుతో ఆమె “ఓ రాజా! నేను మృగాంకుడి పెద్ద కుమార్తెను. నా తండ్రి దేవసభలో ఇంద్రుడికి ప్రీతిపాత్రుడైన పండితుడు. నా పేరు మృగనయని (జింక కన్నుల వంటి కన్నులు కలది అని ఆ పేరుకు అర్ధం.)

నా తర్వాత నా తండ్రికి నూరుగురు కొడుకులున్నారు. నా సోదరులందరి కంటే నా తండ్రికి నేనంటే అమిత ప్రేమ. ఏనాడూ నన్నూ చూడకుండా ఉండలేడు, నేను లేనిది భోజనమైనా చేయడు.

ఆ రోజులలో ఓ అష్టమినాడు, నేను గౌరీ వ్రతాన్ని ప్రారంభించాను.

దాంతో గుడిలో పూజాది కార్యక్రమాలు ఆలస్యం కావటంతో, ఆ రోజు భోజనానికి చాలా సమయం గడిచినా ఇంటికి వెళ్ళలేక పోయాను. నా తండ్రి నాకోసం చాలా సేపు వేచి ఉన్నాడు. అలసిపోయి, ఆకలితో ఎదురు చూస్తుండగా, నేను ఇల్లు చేరుకున్నాను.

ఆకలితో వివశుడై ఉన్న నా తండ్రి కోపం పట్టలేక, నిగ్రహం కోల్పోయి, ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో, నన్ను “నీవు రాక్షసుడి చేత మ్రింగ బడెదవు గాక!” అని శపించాడు.

నేను కొయ్యబారి పోయాను. ఉత్తర క్షణం ఆయన కాళ్ళ మీద పడి విలపించాను. నా తప్పేమీ లేదనీ, ఆలయంలో పూజ ఆలస్యమైందనీ విన్నవించాను. శాపాన్ని ఉపసంహరించమని వినయంతో అర్ధించాను. దుఃఖాతిశయంతో వణుకుతున్న నన్ను చూసి, నా తండ్రికి తెలివి వచ్చింది. అప్పటి వరకూ దయ్యంలా ఆయన్ని పట్టి ఉంచిన క్రోధం ఒక్కసారిగా చల్లారింది. తానేం చేసాడో స్పృహ కలిగింది. నాకంటే వ్యగ్రంగా ఆయన దుఃఖించాడు.

నన్ను దగ్గరికి తీసుకొని తల నిమురుతూ “నా చిట్టి తల్లి! రాక్షసుణ్ణి చంపి నిన్ను కాపాడి ప్రేమించగల సాహసి నీకు తారసపడి నప్పుడు ఈ శాపం ముగుస్తుంది. అప్పటి వరకూ ఆ పార్వతీ దేవినే సేవించు. అయితే ప్రతీ అష్టమి, అమావాస్యలనాడు రాక్షసుడు వచ్చి నిన్ను మ్రింగుతూనే ఉంటాడు. మరునాడు రాక్షసుడు నిన్ను బయటకు కక్కుతాడు” అని శాప విమోచనం అనుగ్రహించాడు.

ఆనాటి నుండీ, నేనీ ఆలయంలో దేవిని సేవిస్తూ, ఇక్కడే ఉంటున్నాను. ప్రతీ అష్టమికీ, అమావాస్యకీ రాక్షసుడి చేత మ్రింగబడుతూ, మర్నాడు విడుదల అవుతూ, నన్ను ఉద్దరించగల సాహస వీరుడి కోసం ఎదురు చూస్తూ గడుపుతున్నాను. ఇన్నాళ్ళకి నా పుణ్యం ఫలించి, నీవు వచ్చి రాక్షసుణ్ణి సంహరించి, నన్ను ఉద్దరించావు.

ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది. ఓ రాజా! నేను నీ సొత్తుని. నీవు నన్ను వివాహం చేసుకొని జీవితాన్ని ఆనందించ వచ్చు” అన్నది.

ఆమె మాటలకు వంశమార్గుడెంతో ఆనందించాడు. మృగనయని నిష్టగా తన గౌరీ వ్రతాన్ని పూర్తి చేసింది. కోవెలలోని దుర్గామాత ఎదుట వారిద్దరూ వివాహం చేసుకున్నారు. మృగనయనితో కలిసి రాజు వంశమార్గుడు, మంత్రి నీతి వర్ధనుణ్ణి, ఇతర పరివారాన్ని వెంట బెట్టుకుని తిరిగి వారణావతం చేరుకున్నారు. రాణి చంద్రవదన నూతన వధూవరులకు స్వాగత సత్కారాలు చేసింది.

నగరానికి చేరిన మరునాడు మంత్రి నీతి వర్ధనుడు ఉరిపోసుకుని చనిపోయాడు.

ఇదీ కథ!

అని చెప్పిన భేతాళుదు “ఓ విక్రమాదిత్య మహారాజా! ఇప్పుడు చెప్పు. నీతి వర్ధనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? మృగనయనిని పొందిన రాజుని చూచి ఈర్ష్య చెందాడా?” అని అడిగాడు.

విక్రమాదిత్యుడు అడ్డంగా తల నాడిస్తూ “భేతాళా! నీతి వర్ధనుడికి రాజు పట్ల గానీ, అతడి అదృష్టం పట్ల గానీ ఈర్ష్యాసూయల వంటివి ఉన్నట్లుగా తోచదు. బహుశః అతడు ఇలా ఆలోచించి ఉండవచ్చు. ‘చెడ్డవాడైన వ్యక్తికి నీతులు బోధించ రాదు. అది వ్యర్ధమైన పని. అదే విధంగా మిఠాయిలు ఇష్టపడే బాలుడికి మరిన్ని తీపి వస్తువులు ఈయరాదు. అది ఆ బాలుడి ఆరోగ్యానికి చేటు తెస్తుంది.

అయితే నేను… ‘అసలుకే స్త్రీ సౌందర్యం పట్ల మితిలేని మోహం గల వంశమార్గుడి’కి, ఉన్న పట్టమహిషి చాలదన్నట్లు మరొక సుందరిని కట్టబెట్టాను. ఇప్పుడు ఖచ్చితంగా రాజు మరింతగా సుఖ భోగాలలో తేలియాడతాడే తప్ప రాజ్య వ్యవహారాలు చూడడు.
దీనంతటికీ కారకుడను నేను గనుక ప్రజలు మళ్ళీ నన్ను నిందించక మానరు. ఇవేవీ ఆలోచించకుండా రాజుకు నేను ఏకాంత ద్వీపం గురించీ, అందులోని అందమైన యువతి మృగనయని గురించీ చెప్పి, రాజామెను వివాహమాడే పరిస్థితులు తెచ్చాను. ప్రజానింద భరింప శక్యం కానిది’ అనుకొన్నవాడై ఆత్మహత్యకు పాల్పడ్డాడు” అన్నాడు.

భేతాళుడు “భళా విక్రమాదిత్యా భళా! నీ సునిశిత మేధావిత్వానికి ఇవే నా జోతలు” అంటూ ప్రశంసిస్తూనే చప్పున మాయమై పోయాడు. చిరునవ్వు నవ్వుతూ విక్రమాదిత్యుడు మోదుగ చెట్టు వైపుకు దారి తీసాడు.

కథా విశ్లేషణ: ఈ కథలో విక్రమాదిత్యుడు… ‘మంత్రి నీతి వర్తనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోగలడు?’ అనే ప్రశ్నకు సునిశితమైన ఆలోచనతో జవాబిస్తాడు. ఒక వ్యక్తి ఒక పనిని నిర్వహించడానికి ఏయే ‘మోటివ్స్’ ఉండగలవో, వాటి గురించి ఎలా ఆలోచించాలో పిల్లలకి నేర్పే కథ ఇది!

దాదాపుగా ఇప్పుడు మన ఆధునిక నేరపరిశోధక విభాగాలు పనిచేసే తీరు ఇది! ఒక సంఘటన, ఓ దోపిడి, ఓ హత్య, ఓ నేరం… ఏది జరిగినా… ఎవరికి ఏ మోటివ్ ఉంది? ఏ పరిస్థితి ఇందుకు దారి తీసింది? – అనే కార్యకారణ సంబంధాన్ని ఛేదించే ఆలోచనా విధానం ఇది!

ఇలాంటి కథలు పిల్లలకి, ఆడుతూ పాడుతూ, చదువుతూ, వింటూనే, వాళ్ళకి తెలియకుండానే వారిలో సునిశిత ఆలోచనా శక్తిని ప్రేరేపిస్తాయి.
~~~~~~~~~

వంశ మార్గుడి కథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 42]

తర్వాతి ప్రయత్నంలో భేతాళుడు విక్రమాదిత్యుడికి మరొక కథ చెప్పటం ప్రారంభించాడు.

ఒకానొకప్పుడు వారణావతం అనే రాజ్యముండేది. దానికి రాజు వంశ మార్గుడు. [వంశానికే మార్గం చూపే వాడని అతడి పేరుకు అర్ధం.] అతడికి ఓ అందమైన భార్య ఉండేది. ఆమె పేరు చంద్రవదన. [చంద్రబింబం వంటి అందమైన ముఖం కలది అని అర్ధం.] పేరుకి తగ్గట్టే ఆమె అందాల భరిణె! అందానికి చందమామ!

రాజుకి భార్యంటే అమిత ప్రేమ, ఆకర్షణ. రాచకార్యాలన్నీ విడిచిపెట్టి దినమంతా ఆమెతోనే గడిపేవాడు.

ఆ రాజ్యపు మంత్రి పేరు నీతి వర్ధనుడు. [నీతిని వృద్ధి చేసే వాడని అర్ధం.] అతడెంతో మంచివాడు, తెలివైన వాడు. రాజు పరిపాలనా భారమంతా తనపై వదిలేసి అంతఃపురంలో రాణితో ఆటపాటలతో కాలం గడపటంతో మంత్రి రాజ్య భారమంతా వహించేవాడు.

నీతి నిజాయితీలతో, ధర్మబద్ధంగా పరిపాలన సాగేందుకు అన్ని విధాలా శ్రద్ధ తీసుకునేవాడు. కాలమిలా గడుస్తోంది. క్రమంగా ప్రజలు మంత్రిని శంకించ సాగారు. అతణ్ణి సందేహిస్తూ “ఈ మంత్రి చాలా తెలివైన వాడు. తన తెలివితేటలతో రాజుని ఏమార్చి, మరేవో విషయాలలో మునిగి తేలేటట్లు చేసాడు. ఆ నెపాన తానే అధికారమంతా చేతుల్లోకి తీసుకొని రాజ్యపాలన చేస్తున్నాడు” అని చాటుగా గుసగుసలు పోసాగారు.

ఆనోటా ఈ నోటా ఈ మాట మంత్రి చెవిన బడింది. అతడు దానికి చాలా మనస్తాపం చెందాడు. వికలమైన మనస్సుతో, దేశం విడిచి తీర్ధయాత్రకు బయలుదేరాడు. మంత్రి నీతి వర్ధనుడి దేశాటన గురించి ఇతర రాజోద్యోగులు వంశమార్గుడికి తెలియజేసారు.

రాజది విని విచారించాడు. ఇతర మంత్రులకూ, రాజోద్యోగులకూ పరిపాలనా బాధ్యతలు అప్పగించాడు.

నీతివర్ధనుడు పుణ్యక్షేత్రాలనీ, ఆయా ప్రదేశాల్లోని వింతలూ విశేషాలనీ చూస్తూ యాత్ర కొనసాగిస్తున్నాడు. మార్గవశాత్తూ అతడో రేవు పట్టణాన్ని చేరాడు. ఆ ఊళ్ళో ఓ వర్తక శ్రేష్ఠి ఉన్నాడు. అతడి తో మంత్రి నీతి వర్ధనుడికి చెలిమి కలిసింది.

ఇద్దరి అభిప్రాయాలూ, దృక్పధాలూ ఒకటి కావడంతో ఇరువురూ ఎన్నో విషయాలు చర్చిస్తూ హాయిగా కాలం గడపసాగారు. ఇద్దరూ తెలివైన వాళ్ళూ, పండితులూ కావటంతో, శాస్త్ర సాహిత్య విషయాలూ, కళాస్వాదనలూ, సత్సంగాలూ! రోజులు గడవసాగాయి.

రానూ రానూ వారి మైత్రి మరింత గాఢమైంది. ఓ రోజు… వర్తకుడు మంత్రితో “ఓ మిత్రుడా! నేను వ్యాపారనిమిత్తమై నా నౌకలో దేశాంతరం బయలు దేరనున్నాను. కొద్ది రోజులలోనే తిరిగి రాగలవాడను. నిన్ను వీడి వెళ్ళడానికి మనస్సొప్పడం లేదు. అయినా ఉదర పోషణార్ధం వృత్తి వ్యాపారాలు తప్పవు గదా! నేను తిరిగి వచ్చు వరకూ దయతో నీవిక్కడనే ఉండవలసిందిగా నా కోరిక” అన్నాడు.

నీతి వర్ధనుడు చిరునవ్వు నవ్వుతూ “ప్రియమిత్రుడా! నీవు లేని చోట నాకు మాత్రం పని యేమి ఉన్నది? ప్రపంచమున గల వింతలూ విడ్డూరాలూ చూడ వేడుక తోనే నేనిట్లు పుట్టిన భూమీ వదలి వచ్చితిని. కావున నీ నౌకలో నన్నూ గొనిపొమ్ము. ఇరువురమూ కలిసే వెళ్ళెదము గాక!” అన్నాడు.

వర్తక శ్రేష్ఠి ఇందుల కెంతో సంతోషించాడు. ఓ మంచి ముహుర్తాన నౌక బయలు దేరింది. నీలి సాగరపు అలలపై హుందాగా పయనిస్తోంది. సాగర సౌందర్యాన్ని, నీటి పక్షుల కోలాహలాన్ని, చల్లని గాలుల్నీ ఆనందిస్తూ మంత్రి తన ప్రియమిత్రుడితో మంచీ చెడు మాట్లాడుతూ కాలం గడుపుతున్నాడు.

దురదృష్టవశాత్తూ వాళ్ళ నౌక సముద్రపు తుఫానులో చిక్కుకుంది. సుడిగాలికి, రాకాసి అలలకీ ఆకులా అలల్లాడింది. నావికులెట్లో నౌకని నియంత్రంచ ప్రయత్నించసాగారు. తుఫాను తగ్గేటప్పటికి నౌక దారి తప్పి మరెటో పయనించింది.

నావికులకి అది పూర్తిగా కొత్త దారి కావటంతో, వారు కొంత వెఱగొంది, జాగరూకతతో నౌకని నడపసాగారు. అదృష్టం బాగుండి, భగవంతుడి కరుణ వారిపై ప్రసరించి, వారి నౌక ఓ దీవి చేరింది. నౌకకి లంగరు వేసారు. నావికులూ, సిబ్బంది దీవిలో చెట్లు నరికి నౌకలో వంట చెరకుకీ, ఇంధనానికీ ఏర్పాట్లు చేయదలిచారు. నౌక దిగి దీవిలో తిరగాడారు.

ఆ దీవిలో వారికొక ప్రాచీన ఆలయం కనిపించింది. అద్భుత శిల్ప సౌందర్యంతో చూడటానికి రెండు కళ్ళూ చాలననేంత అందంగా ఉంది. అయితే చిత్రంగా ఆ దేవాలయంలో గానీ, దీవిలో గానీ నరమానవ సంచారం లేదు. గర్భగుడి ఎదురుగా ఓ పెద్ద అశ్వత్ధ వృక్షం ఉంది. దాని క్రింద ఓ సౌందర్యవతి కూర్చొని ఉంది.

ఆలయమూ, ఆ యువతీ కూడా దేవలోకానికి చెందినట్లుగా ఉన్నారు తప్ప, భూలోకంలో అంతటి అందమైన దేవళం గానీ, అలాంటి యువతి గానీ ఉండరనిపించింది. దాంతో నావికులూ, నౌకా సిబ్బంది ఎంతో భీతిల్లారు. దేవతాలోకంలో అడుగుపెడితే శాపాలకు గురి కావచ్చొన్న వెరపుతో వడి వడిగా నౌక చేరి లంగరు తీసి, తెర చాపలెత్తి ప్రయాణం ప్రారంభించారు.

కొన్ని నాళ్ళకే తమ స్వస్థలానికి చేరారు. నీతి వర్ధనుడూ, అతడి మిత్రుడైన వర్తకుడూ కూడా వారితో పాటే తిరిగి వచ్చారు. ప్రయాణ ముచ్చట్లలో మరి మూడు నాలుగు దినాలు గడిచాయి. నీతి వర్ధనుడికి స్వదేశం మీదికి గాలి మళ్ళింది.

అతడు తన మిత్రుడైన వర్తక శ్రేష్ఠికి తన అభీష్టం చెప్పి వీడ్కొలు తీసుకున్నాడు. ప్రియమిత్రుడికి తగిన కానుకలిచ్చి ఆత్మీయంగా వీడ్కొలిచ్చాడు వర్తకశ్రేష్ఠి. నీతి వర్ధనుడు నేరుగా స్వదేశం బయలు దేరి కొన్నాళ్ళకు వారణావతం చేరాడు.

రాజు వంశమార్గుడతణ్ణి సాదరంగా ఆహ్వానించాడు.

“ఓ మంత్రీ! నీతి వర్ధనా! ఇన్నినాళ్ళూ నీవు క్షేమంగా ఉన్నావు కదా? ఎందుకు నీవు నన్నూ, మన దేశాన్నీ విడిచి వెళ్ళావు?” అని అడిగాడు.

నీతి వర్ధనుడు “మహారాజా! ప్రజలు నా గురించి ‘నేను మీకు బదులుగా రాజ్యాధికారం చలాయిస్తున్నాననీ, అందుకే మీరు ఇతరత్రా కాలం గడిపేటట్లుగా ప్రణాళికలు వేసాననీ’ నీలాపనిందలుగా అనుకోసాగారు. అందుచేత నాకు బాధ తోచింది. అందుకే మిమ్మల్నీ, దేశాన్నీ విడిచి తీర్ధయాత్రలకు పోయాను. దేశాటనంలో భాగంగా ఎక్కడెక్కడో తిరిగాను. ఎన్నెన్నో వింతలు చూసాను. అయితే నాకెక్కడా మనశ్శాంతి లభించలేదు. చివరికి మాతృభూమికి తిరిగి వచ్చాను” అన్నాడు.

రాజు వంశమార్గుడిది విని కొంత విచారించాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత “మంచిది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు, గతంలో వలె నీవు రాజ్యవ్యవహారాలు చక్క పెట్టగలవు. ఇంతకూ నీవు దేశాటనంలో ఏయే వింతలు చూచిన వాడవు. వినాలని కుతుహలంగా ఉంది. వివరించి చెప్పు” అన్నాడు.
~~~~~~

ఎవరు అత్యంత సుకుమారి! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 41]

విక్రమాదిత్యుడు అలసట గానీ, విసుగుదల గానీ తలచకుండా, మళ్ళీ మోదుగ వృక్షం చేరి భేతాళుని పట్టి బంధించి, భుజాన వేసుకుని బృహదారణ్య కేసి నడవసాగాడు. అది పదకొండవ ప్రయత్నమే అయినా ఆ మహారాజు జ్ఞాన శీలుడి కిచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చడంలో తొలిప్రయత్నమప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడో ఇప్పుడూ అంతే ఉత్సాహంగా ఉన్నాడు.

విక్రమాదిత్యుడు నడక ప్రారంభించగానే శవంలోని భేతాళుడు కథ ప్రారంభించాడు. “ఓ రాజాధిరాజా! ఇక కథ విను!” అంటూ కొనసాగించాడు.

పూర్వకాలంలో ఢిల్లీ నగరాన్ని వంశకేతుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడికి ముగ్గురు భార్యలు. రాణులు ముగ్గురూ కూడా సౌందర్యానికీ, సౌకుమార్యానికీ ప్రసిద్ధి చెందారు.

ఓనాటి సాయం సమయాన మహారాజు తన రెండవ భార్యతో రాజోద్యాన వనంలో చల్లగాలికి విహరిస్తున్నాడు. ఆ సమయంలో ఓ చిన్ని సీతాకోక చిలుక, రాణి సిగలోని పువ్వుల మీద వాలింది. దాని బరువుకి రాణికి శిరోభారం కలిగి స్పృహ తప్పి పడిపోయింది.

చందనం, శీతల పానీయాలతో దాసీ లామెను సేద తీర్చారు.

మరునాటి రాత్రి వేళ, మహారాజు మొదటి రాణితో రాజాంతఃపురపు ఉప్పరిగ (మేడ) మీద కూర్చుని కబుర్లు చెబుతున్నాడు. అది పున్నమి రాత్రి! వెన్నెల పుచ్చపువ్వులా పృధివంతా వెదజల్లుతోంది.

పూర్ణ చంద్రుని నిండు కాంతికి రాణి తెల్లని శరీరం మీద ఎర్రటి దద్దుర్లు లేచాయి. బాధతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దాస దాసీజనాలు, రాణిని అంతఃపుర మందిరం చేర్చి, చందనం, వట్టి వేళ్ళతో చికిత్స చేసి, శీతల పానీయాలతో సేద తీర్చారు.

ఆ మరునాటి మధ్యాహ్నం రాజు, మూడవ రాణితో కలిసి సంగీతాన్ని వింటూ ఆనందిస్తున్నాడు. సంగీత విద్వాంసుడు శ్రావ్యంగా పాడుతున్నాడు. ప్రక్క వాయిద్యాలతో ఇతర సంగీత కారులు అతడికి సహకరిస్తున్నారు. మంద్రంగా పరచుకున్న సంగీతం, శ్రోతలని ఏదో లోకాలలో విహరింప చేస్తోంది.

అంతలో ఎక్కడి నుండో…రోట్లో ధాన్యం పోసి రోకలితో దంచుతున్న చప్పుడు వినబడింది. ఆ రోకటి పోటు చప్పుడు వినగానే, మూడవ రాణి అరచేతుల్లో బొబ్బలెక్కి పోయాయి. బాధతో ఆమె చిన్నగా అరిచింది. ఆమె అరచేతులు చూస్తే… లేత గులాబి పువ్వుల్లా ఉన్న ఆమె అరచేతుల్లో కుంకుమపొడి చల్లినట్లుగా బొబ్బలు లేచాయి. బాధతో కన్నీరు తిరగగా, ఆమె స్పృహ తప్పి పడిపోయింది.

దాసీలు వచ్చి ఆమె అరచేతులకి వెన్నరాసి శైత్యోపచారాలు చేసారు.

భేతాళుడింత వరకూ కథ చెప్పి, “ఓ విక్రమాదిత్య రాజేంద్రా! ఈ ముగ్గురు రాణులలో, ఎవరు అత్యంత సుకుమారులు? వివరించి చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులు చిలిపి నవ్వుతో మెరుస్తుండగా, భేతాళుడి వైపు కోర చూపు చూస్తూ “భేతాళా! రెండవ రాణి కొప్పులో సీతాకోక చిలుక బరువుని అనుభవించి బాధకి స్పృహ తప్పిపోయింది. సీతా కోక చిలుక చిన్నదే అయినా, దాని భారం ఆ చిన్నది భరించలేక పోయింది. ఆమె అంతటి సుకుమారి!

అలాగే పెద్దరాణి చంద్రుని పున్నమి కాంతిని అనుభవించింది. అందరికీ చల్లని వెన్నెలగా తోచే నిండు పున్నమి వెలుగులోని వేడికి సొక్కి సోలి పోయింది. ఆమె సౌకుమార్యం అంతటిది.

అయితే మూడవ రాణి, ప్రత్యక్షంగా ఏ అనుభవమూ పొందకుండానే, దూరాన వేరెవరో దంచుతుండగా, ఆ శబ్దానికే చేతులు బొబ్బలెక్కి, స్పృహ తప్పి పోయింది. మొదటి ఇద్దరు రాణుల అనుభవం శారీరకమైతే, మూడవ రాణి అనుభవం మానసికం. కాబట్టి మూడవ రాణి సౌకుమార్యమే గొప్పది. ముగ్గురిలోకి మూడవ రాణి అత్యంత సుకుమారి” అన్నాడు.

భేతాళుడూ నవ్వుతూ విక్రమాదిత్యుడి భుజం మీద నుండి మాయమై మళ్ళీ చెట్టేక్కేసాడు.
~~~~~~~

భర్త, మోహితుడు, దొంగ – ఎవరు గొప్ప! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 40]

దొంగ ఓ క్షణం ఆలోచనలో పడ్డాడు. ఏమనుకున్నాడో ఏమో ఆమెను వెళ్ళనిచ్చాడు. అక్కడే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు.

మదన సేన నేరుగా చారు దత్తుడి ఇంటికి వెళ్ళింది. ఆమెని చూసి నిర్ఘాంత పడిన చారు దత్తుడితో “చారు దత్తా! నా మునుపటి ప్రమాణాన్ని నిలబెట్టుకుంటూ నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నువ్వు నా సౌందర్యాన్ని ఆనందించవచ్చు” అంది.

చారుదత్తుడు మరింతగా చేష్టులుడిగి పోయాడు. మరుక్షణం పశ్చాత్తాప పడ్డాడు. అతడు తనలో ‘ఈ యువతి, మదన సేన సామాన్యురాలు కాదు. ఈమె నిజాయితీ గలది, శీలవతి కూడాను. ఈమె పట్ల నేను చెడుగా ఆలోచించ కూడదు. ఈమె పతివ్రత’ అనుకున్నాడు.

అతడు ఆమె పాదల మీద వాలి క్షమార్పణ అడిగాడు. భర్తతో కలిసి నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో జీవించాల్సిందిగా దీవించి, వీడ్కొలిచ్చాడు. చారుదత్తుడు చూపిన పరిణతికీ, వాత్సల్యానికీ మదన సేన ఎంతో సంతోషించింది. అక్కడి నుండి వెనుదిరిగింది.

నేరుగా దొంగ ఎదురుచూస్తున్న చోటికి వచ్చింది. ఆమె తిరిగి వస్తుందో రాదో అనే అనుమానంతో అసహనంగా ఉన్న దొంగ, ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు, నమ్మశక్యం గానట్లు చూస్తున్న దొంగకి ఆమె జరిగిందంతా చెప్పింది. దొంగ అది విని నిరుత్తరు డయ్యాడు.

‘ఈ యువతి నిజంగా సామాన్యురాలు కాదు. పారిపోగల అవకాశం ఉన్నా కూడా ఇచ్చిన మాట కోసం తిరిగి వచ్చింది. ఈమె పాతివ్రత్యం కలది. కాబట్టే ఈమెపట్ల పాప చింతనని వదలిపెట్టాడు చారుదత్తుడు. ఈమెకు కీడు చేసినట్లయితే భగవంతుడు నన్ను క్షమించడు. ఈమె ఇప్పుడు నిస్సహాయంగా నాకు లొంగిపోయినా ఈమె కన్నీరైనా నన్ను శపించ గలదు’ అనుకున్నాడు.

పశ్చాత్తాపంతో ఆమె పాదాలపై బడ్డాడు. “అమ్మా! మన్నించు. నీవు నా సోదరీ తుల్యవు.” అంటూ క్షమాపణ కోరుకున్నాడు. అన్న వలె ఆదరించి, తన దగ్గరున్న ఆభరణాలని ఆమెకు కట్నంగా ఇచ్చి వీడ్కొలిచ్చాడు.

ఆమె సంతోషంగా భర్త దగ్గరికి తిరిగి వచ్చింది. జరిగిన విషయాలన్నీ భర్తకి పూసగుచ్చినట్లుగా చెప్పింది. తను నమ్మిన సత్యం తనను కాపాడినందుకు ఆమె ముఖం దీప్తిమంతంగా ఉంది. మంచితనాన్ని ఆస్వాదించిన ఆమె కళ్ళు కోటి చంద్రుల కాంతిని గుమ్మరిస్తున్నాయి.

అట్టి యువతీ రత్నాన్ని భార్యగా పొందిన తన అదృష్టానికి సముద్ర దత్తుడు ఎంతగానో మురిసిపోయాడు. ఆమెను దగ్గరికి తీసుకుని ఆశీర్వదించాడు. భార్యాభర్తలిద్దరూ చిరకాలం సుఖ సంతోషాలతో జీవించారు.

భేతాళుడు ఇంత వరకూ కథ చెప్పి, విక్రమాదిత్యుడితో “ఓ రాజాధిరాజా! మదన సేన భర్త సముద్రదత్తుడూ, ఆమె పై మోహం చెందిన చారుదత్తుడు, దొంగ – వీరందరిలో ఎవరు గొప్ప వారు? చెప్పు” అని అన్నాడు.

విక్రమార్కుడు గిరజాల జుట్టు ఊగుతుండగా సన్నగా నవ్వుతూ “భేతాళా విను! అందరిలోకి దొంగే గొప్పవాడు. మదన సేన భర్త సముద్ర దత్తుడు భార్య నిజాయితీ మీద నమ్మకంతో ఆమెకు అనుమతి ఇచ్చాడు. అతడి నమ్మకం నిజమైంది.
చారుదత్తుడు ఆమె నిజాయితీకి, సత్యవ్రతానికి బద్దుడై పశ్చాత్తాప్తుడైనాడు. అయితే దొంగ ప్రాధమికంగా చోరవృత్తిలో ఉన్నవాడు, దయా దాక్షిణ్యాలు లేని కౄరవృత్తి అది. అతడు యధేచ్ఛగా మదన సేన నగలతో పాటు, ఆమె పై అత్యాచారం జరిపి అయినా సరే, ఆమె అందాన్ని పొందగల అవకాశం ఉన్నవాడు.

అయినా గానీ, ఆమె పాతివ్రత్యానికి భయపడి, నిజాయితీకి అధీనుడై, పశ్చాత్తాపంతో చలించాడు. కాబట్టే ఆమెని స్వంత సోదరి వలె ఆదరించి పంపించాడు. తానెలా ప్రవర్తించినా, దొంగ కాబట్టి తన ఆచూకీ ఎవరికీ తెలియదు. అదే చారుదత్తుడికైతే అప్పటికి కోరికకి ప్రలోభపడినా, తర్వాత అపరాధానికి బాధ్యుడయ్యే అవకాశం ఉంది. దొంగకి అలాంటి ప్రమాదం లేదు. అయినా స్వయంగా తప్పు చేయడం నుండి విరమించు కున్నాడు. కాబట్టి దొంగే గొప్పవాడు” అన్నాడు.

విక్రమాదిత్యుడి సమాధానం వినగానే భేతాళుడు బిగ్గరగా నవ్వుతూ తిరిగి మోదుగ చెట్టు ఎక్కేసాడు.

కథా విశ్లేషణ: ఈ కథలో విక్రమాదిత్యుడు చూపించే తర్కం చక్కగా ఉంటుంది. ఒకే పని చేసిన వ్యక్తుల్ని వారి పరిస్థితుల్ని బట్టి విశ్లేషించడం పిల్లల్ని బాగా ఆకర్షిస్తుంది. ఇలాంటి కథల వలన వారిలో కుతూహలం కొద్దీ పఠనాసక్తి పెరుగుతుంది. వివేచనా శక్తి, విశ్లేషణా సామర్ధ్యం పెరుగుతాయి.

కట్టుబాటు వీడని మదన సేన! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 39]

మరోసారి విక్రమాదిత్యుడు భేతాళుని పట్టి బంధించి, బృహదారణ్యం వైపు నడవసాగాడు. భేతాళుడు ఎప్పటి లాగే కథ ప్రారంభించాడు. ఇది భేతాళుడు చెప్పిన పదవ కథ. భేతాళుడు “విక్రమార్క మహారాజా! విను” అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు ‘మగధ’ అనే రాజ్యం ఉండేది. దాని రాజధాని పేరు కోసల నగరం. మగధకు రాజు ధీర వీరుడు. అతడెంతో పరిపాలనా దక్షత గలవాడు.

ఆ నగరంలో ధనదత్తుడనే భాగ్యవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతడికి సంతానం లేదు. దాంతో అతడు శివుని గురించి భక్తి శ్రద్దలతో తపమాచరించాడు. మహాదేవుడి వరంతో అతడికొక కుమారుడు, కుమార్తె కలిగారు. కుమారుడికి ‘ధర్మదత్తుడ’నీ, కుమార్తెకు ‘మదన సేన’ అనీ పేర్లు పెట్టుకుని, ధనగుప్తుడు వాళ్ళిద్దరినీ అపురూపంగా పెంచసాగాడు.

పిల్లలిద్దరూ పెరిగి పెద్దయ్యారు. ధర్మదత్తుడు గురుకులంలో చేరి విద్యాబుద్దులు నేర్చాడు. అతడికొక స్నేహితుడున్నాడు. అతడి పేరు చారు దత్తుడు. ధర్మదత్తుడూ, చారు దత్తుడూ ఎంతో ప్రాణ మిత్రులైనందున, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. ‘ఒకే కంచం, ఒకే మంచం’ అన్నంతగా విడిపోని స్నేహంతో మెలిగే వారు.

ధనదత్తుడి కుమార్తె మదనసేన యుక్త వయస్కురాలైంది. ఆమె చాలా చక్కనిది. సుగుణ శీలి. ఒక నాడామె తలారా స్నానం చేసి జారుగా వేసిన జడతో, స్నేహితురాళ్ళతో కలిసి ఇంటి తోటలో బంతాట ఆడుకుంటోంది. గాలికి ఆమె ముంగురు లూగుతున్నాయి. పరుగెత్తి బంతిని పట్టుకుంటూ ఆమె ఆడుతుంటే, మెరుపు తీగ మెలికలు తిరిగినట్లుంది. ఆమె కిలకిల నవ్వులు చిలుకా కోకిలలు కబుర్లు చెబుతున్నట్లున్నాయి.

ఆ సమయంలో చారు దత్తుడు ధర్మదత్తుడితో కలిసి వచ్చాడు. మదన సేనను చూసి చారుదత్తుడు ముగ్ధుడైనాడు. ఆమె అందం, నవ్వు, మాట తీరు అతడికి మతి పోగొట్టాయి. మరునాడు అతడామెని తోటలో ఒంటరిగా కలుసుకున్నాడు.

ఆర్తితో “మదన సేనా! నీవు సౌందర్యవతివి. నీ అందాన్ని మరిచి పోలేకున్నాను. నీ మీద ప్రేమ, విరహంతో నిదుర రాకున్నది. దయ చేసి నన్ను అంగీకరించు.” అంటూ ప్రాధేయ పడ్డాడు.

మదన సేన తలెత్తి అతడి వైపు చూసింది. ఓ క్షణం మౌనంగా ఉంది. తర్వాత “చారు దత్తా! నా తల్లిదండ్రులు నన్ను సముద్ర దత్తుడికిచ్చి వివాహం చేయ నిశ్చయించారు. నేను వాగ్దత్తని. అది నీకూ తెలుసనుకుంటున్నాను. అయినా నీవు నా ముందు ప్రేమ ప్రసంగం తెచ్చావు. కానీ నేను కట్టుబాటు మీర గల దానిని కాను” అంది.

మదన సేనపై కోరికతో వివేకం కోల్పోయిన చారుదత్తుడు అక్కడే నిలబడి పోయాడు. ఆమె వైపు జాలిగా, అభ్యర్ధనగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.

మదన సేన “చారు దత్తా! నిన్ను నిరాశ పరచటం నా అభిమతం కాదు. త్వరలో నా వివాహం జరగనుంది. నా వివాహమైన మరునాడు, తొలిరాత్రికి పూర్వమే, నేను నీ వద్దకు రాగలను. నీ కోరిక తీర్చగల దానను. ఇదే నా ప్రమాణం. అప్పటి వరకూ నేను నా కట్టుబాటును దాటను. దయ చేసి వెళ్ళు” అంది.

చేసేది లేక చారు దత్తుడు వెనుదిరిగి పోయాడు. అప్పటి నుండి వారి ఇంటికి రాకపోకలు తగ్గించాడు. ధర్మదత్తుడెంత అడిగినా ఏదీ చెప్పలేదు.

కొన్ని రోజులు గడిచాయి. మదన సేన వివాహం సముద్ర దత్తుడితో అతి వైభవంగా జరిగింది. అందమైన భార్యని చూసుకుని సముద్ర దత్తుడెంతో మురిసిపోయాడు. తొలి రాత్రి నూతన వధూవరులిద్దరూ పడక గదికి చేరారు.

పూల సౌరభాలతో, వెన్నెల సోయగాలతో… పోటీ పడుతూ, మదన సేన శరీర గంధమూ, సౌందర్యమూ అతిశయిస్తున్నాయి. సముద్ర దత్తుడు ప్రేమగా భార్యను చేరబోయాడు. ఆమె అతణ్ణి ఆపుతూ “ఓ నా ప్రియపతీ! నాదొక ప్రార్ధన! దయ యుంచి వినుడు. మన వివాహానికి పూర్వం, నేను నా యింట నుండగా ఒక యువకుడు నా దగ్గరి కొచ్చాడు. నా మీద ప్రేమాతిశయాన్ని వివరించాడు.

నా వివాహమైన తొలి రాత్రి, నేనతడి కోరిక తీర్చగలనని ప్రమాణం చేసి ఉన్నాను. నా కట్టుబాటును దాటలేనని, కన్యాత్వమును వీడ జాలనని ఆ విధంగా ప్రమాణం చేసాను. ఇప్పుడా ప్రమాణాన్ని తృణీకరించుట ధర్మము కాదని మీకు చెబుతున్నాను. ఆపై మీ ఇచ్ఛ ఎట్లయిన, అట్లు నిర్ణయించి, నాకు ఆనతి నీయగలరు” అని విన్నవించింది.

ఇదంతా విని సుముద్ర దత్తుడు ఆశ్చర్య పోయాడు. ‘లోకంలో ఇట్టి కోరికలు కోరు వారుండవచ్చు గానీ, ఇట్టి ప్రమాణములు చేయు వారుందురా? ఈమె గుట్టు చప్పుడు గాక, ఏ తీరుగ నైనా ప్రవర్తించ వచ్చు. అట్లు చేయక, నా అనుమతి అడుగుతున్నది. ఈమె లోకంలో ఉండే ఇతర సాధారణ యువతుల వంటిది కాదు. ఈమెకు మోసపు బుద్ధి లేదు. ఈమెను విశ్వసించ దగు” అనుకున్నాడు.

మదన సేన వైపు చూస్తూ “మంచిది. పోయి రా!” అన్నాడు. ఆ విధంగా మదన సేన భర్త అనుమతి తీసుకుని, ఆ అర్ధరాత్రి సమయాన చారుదత్తుడి ఇంటికి బయలు దేరింది.

దారిలో ఒక గజదొంగ ఆమెను చూశాడు. ఆమె అందాన్ని చూసి అబ్బురపడ్డాడు. దారి కడ్డం వచ్చి ఆమె నాపాడు. తనతో గడపవలసిందిగా కోరాడు. మదన సేన చేతులు జోడిస్తూ “అయ్యా! ఎందుకు నా సాంగత్యాన్ని కోరుతావు? దాని తో ఒనగూడే ప్రయోజన మేముంది? నీవు దొంగవు. చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. నా ఈ నగలన్నీ తీసికొని, నన్ను విడిచి పెట్టు. విలువైన ఈ నగలన్నిటితో సంతోషంగా నీ దారిన నీవు పో” అంది.

దొంగ విలాసంగా నవ్వి “ఓ యువతీ రత్నమా! నీవంటి సౌందర్యవతితో గడపటం అన్నిటి కంటే విలువైనది” అన్నాడు. మదన సేన నిస్సహాయంగా నిలబడింది. ఓ క్షణం తర్వాత, తన కథంతా అతడికి వివరించి చెప్పింది.

“ఇప్పుడు నేను చారు దత్తుడికిచ్చిన మాట నిలుపుకునేందుకై వెళ్తున్నాను. దయ చేసి నన్ను వెళ్ళ నివ్వు. తిరిగి వచ్చేటప్పుడు నీ దగ్గరకు రాగలను” అంది.

~~~~~~

యువరాజు, మేకపోతు – ఎవరి వివేకం గొప్పది? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 38]

ఆ క్షణంలో... ఆ ప్రక్కనే రెండు మేకలున్నాయి. ఒకటి ఆడమేక(పెంటి), మరొకటి మగమేక (పోతు). పోతుమేక పెంటి దగ్గరికి ప్రేమగా చేరబోయింది. ఆడమేక దాని నాపుతూ. "నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే... అదిగో, ఆ బావి లోతట్టు గోడల మీద పచ్చని లేత చివురాకులున్నాయి. ఆ బావి మనకి దాపులనే ఉంది. నీవా లేచిగురాకులు తెచ్చి నాకిచ్చినట్లయితే నీ ప్రేమని అంగీకరిస్తాను" అంది.

మగమేక బావి వద్ద కెళ్ళి తొంగి చూసింది. బావి గోడలు పాకుడు పట్టి ఉన్నాయి. లోతట్టు గోడల కున్న పగుళ్ళలో పచ్చని మెత్తని పచ్చిక, చిగురాకులతో చిన్న చిన్న మర్రి మొక్కలూ పెరిగి ఉన్నాయి. గాలికి అవి ఊగుతున్నాయి, ఆకులు వెన్నెలలో మెరుస్తున్నాయి.వాటిని చూసి మగమేక ఓ క్షణం చింత పడింది. బావిలోకి ఓ సారి, పెంటి మేక వైపోసారి మార్చిమార్చి చూసింది.


మగమేక “ఓ ఆడుదానా! నీవు నీ కౄర బుద్ధిని చూపెట్టుకున్నావు. నీకు నా మీద ఏ మాత్రమూ ప్రేమలేదు. నేను ఆ బావి లోతట్టు గోడల్లోని చిగురాకులు తెచ్చేందుకు వెళ్ళినట్లయితే, ఆ పాకుడుకి జారి, బావిలో పడి చావగలను. నేను చచ్చాక నీవెవరి మీద ప్రేమ చూపుతావు? నా చావు తర్వాత నేనైనా నీ మీద ఎలా ప్రేమ చూపగలను? ఈ లోకంలో… ఎవరైనా, ఎవరినైనా ప్రేమిస్తే…తాను ప్రేమించిన వాళ్ళని సంతోష పెట్టి, వాళ్ళ శ్రేయస్సుని కాంక్షించాలి. కానీ నీకు నీ స్వార్ధం తప్ప నా శ్రేయస్సు పట్టలేదు.

కాబట్టి నీ ప్రేమతో నాకు ఒనగూడేదేమీ లేదు. నీవు ప్రేమించినా లేకపోయినా నాకు తేడాలేదు. నీలాంటి స్వార్ధపరుల కోసం అలాంటి అవివేకపు పనులు చేసే బుద్ధిహీనుడెవడు ఇక్కడ లేడు. ఫోఫో!” అని పెంటి మేకను కసిరింది.

చితిపై పరుండిన యువరాజు మణిమేఖులుడుకి మేకల భాష కూడా తెలుసు. పోతు, పెంటి మేకల సంభాషణంతా విన్న మణిమేఖులుడు ఆలోచనలో పడ్డాడు. అటు చూస్తే మగ మేక ఆడమేకని ఛీకొట్టి చక్కా పోయింది.

ఇటు చూస్తే మణిమేఖల భర్త చెప్పబోయే రహస్యం కోసం ఊపిరి బిగబట్టి చూస్తోంది. అది చెబితే తన ప్రాణానికే ప్రమాదం అన్న భర్త మాట అసలామెకి పట్టడం లేదు. తనని సంతోష పరచడం కోసం భర్త ప్రాణాలు ఒడ్డుతున్న స్పృహ అంతకంటే లేదు. చితిపై పడుకున్న భర్త ప్రాణం గురించి ఆమెకి చింతలేదు, అతడు చెప్పబోయే విషయం పట్ల కుతూహలమూ ఆతృతా తప్ప!

అది చూసిన మణిమేఖలుడు చితి మీది నుండి దిగ్గున లేచాడు. “ఏమిటేమిటి?” అంటూ వెంటపడుతున్న భార్య వైపు చూడను కూడా లేదు. మణిమేఖల విడిచి పెట్టలేదు.

దారి కడ్డం వచ్చి నిలబడింది. మణిమేఖలుడు భార్యని తిరస్కారంగా చూసి, ఆమెని విడిచి పెట్టి స్వదేశం వెళ్ళిపోయాడు. మరో యువతిని వివాహం చేసుకుని సుఖంగా ఉన్నాడు.

ఇదీ కథ!

అంటూ కథ ముగించిన భేతాళుడు “విక్రమాదిత్య రాజేంద్రా! ఈ కథలో ఎవరి వివేకం గొప్పది? నా ప్రశ్నకు జవాబు చెప్పు. అయితే నియమం నీకు తెలుసు కదా?” అన్నాడు.

విక్రమాదిత్యుడు చిన్నగా నవ్వుతూ “భేతాళా! నియమం తెలియకేం? ఇక నీ ప్రశ్నకు సమాధానం విను. నా అభిప్రాయంలో… మనం ఎవరినైనా ప్రేమించినట్లయితే, వారిని సంతోషపరచాలి, వాళ్ళు ప్రశాంతంగా, సౌఖ్యంగా ఉండేలా చూడాలి.

మణిమేఖలుడు తన భార్య మణిమేఖలని సంతోషంగా ఉంచేందుకు చావటానికి కూడా సిద్ధ పడ్డాడు. అయితే మణిమేఖలకు భర్త పట్ల ప్రేమ గానీ, కరుణ గానీ లేవు. ఆమెకతడి మరణం కూడా పట్టలేదు. అతడి మరణ సన్నద్ధత కంటే కూడా, అతడెందుకు నవ్వాడో…ఆ రహస్యం తెలుసు కోవాలన్నదే ఆమె ఆరాటం.

సకల విద్యలూ అభ్యసించినా గానీ, మానవుడైనా గానీ… మణిమేఖలుడు, మేకపోతు… ‘ప్రేమ’కు నిర్వచనాన్ని విప్పి చెప్పే వరకూ… ఆ సత్యాన్ని గ్రహించ లేకపోయాడు. మేకపోతు…ప్రేమకీ, స్వార్ధానికీ మధ్య ఉన్న విభజనని స్పష్టంగా చెప్పడమే గాక, అతడి కళ్ళెదుటే దాన్ని సంఘటనా పరంగా నిరూపించింది.

ఆ విధంగా మేకపోతు తార్కికతనీ, సునిశిత ఆలోచననీ కనబరచింది. కాబట్టి దాని వివేకమే గొప్పది. కనుక ఈ కథలో మణిమేఖలుడి కంటే కూడా మేకపోతే గొప్పది” అన్నాడు.

అది సరైన జవాబు కావటంతో భేతాళుడు చప్పట్లు చరిచి తన ఆమోదాన్ని తెలిపాడు. కానీ నిశ్శబ్దం భంగమైంది గనక, మెరుపులా మాయమై మోదుగ చెట్టెక్కేసాడు.

కథా విశ్లేషణ: ఈ కథలో ప్రేమకీ స్వార్ధానికి గల తేడాని, పిల్లలకే కాదు పెద్దలకీ ఆసక్తికరంగా ఉండేలా వివరించబడింది. నిజానికి పెంటి మేక వంటి స్త్రీలను చాలా మందినే చూస్తుంటాం, మన చుట్టు సమాజంలో!

ఉద్యోగ వర్గాల్లో చాలామంది లంచగొండుల్ని, అనేక రంగాల్లో ఎంతోమంది అవినీతిపరుల్ని చూస్తుంటాం. వాళ్ళ అవకతవకల్ని చూసి అసహ్యించుకుంటూ ఉంటాం.

నిజానికి కొందరు అవినీతి పరుల వెనక…వాళ్ళ భార్యల ప్రోద్బలం, బలవంతం ఎక్కువగా ఉంటాయి. లేచిగురు లడిగిన పెంటి మేకలాగా…నగలు, చీరలు, ఆస్తులు కార్లూ వంటి గొంతెమ్మ కోరికలు కోరుతూ, వాటిని ప్రేమకి ముడిపెట్టి భర్తల్ని అక్రమ సంపాదన చెయ్యమని కాల్చుకుతినే వాళ్ళని ఎంతోమందిని చూసాను.

ఆయా అవినీతి మార్గాల్లో భర్తలెంత వత్తిడికి గురైనా, బాధలు పడినా వాళ్ళకి పట్టదు.

నిజానికి ప్రేమంటే ఎదుటి వాళ్ళని సంతోషపరచటం, శాంతంగా సౌఖ్యంగా ఉండేలా చూడటం అనే జవాబు చెప్పటంలో విక్రమాదిత్యుడి వివేకం, వివేచన పిల్లల్ని ఆకర్షిస్తాయి. ఆ విధంగా ఈ కథలు మంచి మార్గంలో నడిచేటట్లు పిల్లలకి స్ఫూర్తి కలిగిస్తాయి.

~~~~~~~

మణి మేఖల – మణి మేఖలుడు! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 37]

తదుపరి ప్రయత్నంలో భేతాళుడు మరో కథ ప్రారంభించాడు.

ఒకప్పుడు ఉషాపురం అనే నగరం ఉండేది. (ఆ పేరుకు అర్ధం ‘ఉదయపు నగరం’ అని.) దానికి రాజు గృహ భుజుడు. అతడికొక కుమార్తె ఉంది. ఆమె పేరు మణిమేఖల. (అంటే మణులతో కూర్చిన దండ.)

ఆమె అందం గురించి దేశదేశాలలో పేరెన్నిక గలది. రాజు తన కుమార్తెను సకల విద్యాపారంగతుడికీ, అరవై నాలుగు కళలలో చతురుడికీ ఇచ్చి పెళ్ళి చేయాలని అభిలషిస్తున్నాడు. దాంతో యువరాణి వివాహానికై దేశదేశాలలో వెదకసాగాడు.

ఒకరోజు రాజు గృహ భుజుడికి సుదూర దేశంలో నున్న మణిమేఖులుడనే యువరాజు గురించి తెలిసింది. మణిమేఖలుడు స్పురద్రూపి, సౌందర్యవంతుడే గాక, సకల విద్యా పారంగతుడు, చతుష్పష్థి కళా ప్రపూర్ణుడు.

రాజు సంతోషంగా మణిమేఖలుడిని బంధుమిత్రులతో సహా రప్పించి, తన కుమార్తె మణిమేఖలని అతడికిచ్చి వివాహం చేసాడు. ఆ జంటని చూచి అందరూ అభినందించారు. నూతన వధూవరులిద్దరూ ఒండొకరి సానిహిత్యాన్ని ఆనందించసాగారు.

ఓనాటి రాత్రి... ఉషాపురంలోని మణిమేఖల మందిరంలో, వాళ్ళిద్దరూ హంసతూలికా తల్పంపైన శయనించి ఉన్నారు. పట్టు పరుపులపై పరచిన పాలనురుగు లాంటి దుప్పట్లు, ఆకాశంలోని వెన్నలని గదిలోకి తెచ్చి వెదజల్లుతున్నట్లున్నాయి. అగరుధూపాలు, పూలపరిమళాలు తుమ్మెదలకి మత్తెక్కిస్తున్నాయి.

భార్యభర్తలిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి శయ్యక్రింద ఒక చీమల బారు పోతున్నది. సరిగ్గా వారి పడక మధ్యలో, నిట్ట నిలువుగా విభజన రేఖ గీస్తున్నట్లుగా ఉన్నాయవి.

అంతలో ఉన్నట్లుండి, వరుసలో ముందు వెళ్తున్న చీమలు ఆగిపోయాయి. వెనక వస్తున్న చీమలు ముందున్న వాటిని "ఎందుకు ఆగిపోయారు?" అనడిగాయి.

ముందున్న చీమలు "ఇక్కడ ఓ మంచం ఉంది. దానిపైన కొత్తగా పెళ్ళైన జంట ఉంది. మనం వారి మంచం క్రింద, వారి మధ్య విభజన రేఖ గీస్తున్నట్లుగా నిట్టనిలువుగా ప్రయాణిస్తున్నాం. ‘అది ఎంత వరకూ సబబు?’ అని ఆలోచిస్తూ ఆగిపోయాయి" అన్నాయి.

వెనక ఉన్న చీమలు "దానికింత ఆలోచనెందుకు? మంచాన్ని ఎగరేసి పక్కకి త్రోసేద్దాం" అన్నాయి. ముందున్న చీమలు "అలాగే చేయవచ్చును గానీ, పడకపై నున్న భార్యభర్తలు ఒకరి సాన్నిహిత్యాన్నొకరు ఆనందిస్తూ ఏవో సరాగాలాడుకుంటున్నారు. వాళ్ళని అభ్యంతర పరచటం పాపకార్యమని సంకోచపడుతున్నాం" అన్నాయి.

మణిమేఖలుడు సకల కళా విశారదుడైనందున, అతడికి ‘చీమల భాష’ కూడా తెలుసు. ఆ సంభాషణంతా విన్న మణిమేఖలుడికి నవ్వు వచ్చింది. తమ దారి మార్చుకోవాలని గాక, తమ మంచాన్ని ఎగరేసి ప్రక్కకి త్రోసేయటంలోని పాపపుణ్యాల గురించి ఆలోచిస్తున్న చీమల్ని చూస్తూ, అతడు ఫకాలున నవ్వాడు.

అతడి ప్రక్కనే శయనించి ఉన్న మణిమేఖలకి భర్త ఎందుకు నవ్వాడో అర్ధం కాలేదు. బహుశః తనని చూసే నవ్వాడనుకొని చిన్నబుచ్చుకుంది. ఉండబట్టలేక "ఎందుకు నవ్వుతున్నావు?" అడిగింది.

అతడేదో చెప్పబోయేంతలో... ఇదంతా గమనించిన చీమలు "ఓ యువరాజా! మణిమేఖలుడా! మా సంభాషణ గురించి నీవు ఎవరికైనా చెప్పినట్లయితే, నీ తల వంద ముక్కలై మరణించగలవు సుమా!" అని శపించాయి.

దాంతో మణిమేఖలుడు మౌనంగా ఉండిపోయాడు. మణిమేఖల ఊరుకోలేదు. "నా ప్రియపతీ! ఎందుకు మౌనంగా ఉన్నావు? నా ప్రశ్నకు జవాబు చెప్పవేమి?" అంది.

మణిమేఖలుడు "ప్రియసఖీ! అది రహస్యం! ఆ విషయం ఇంతటితో వదిలిపెట్టు. దాని గురించి చెబితే నా ప్రాణాలకే ముప్పు. గనుక దాని గురించి మరిచిపో!" అన్నాడు.

మణిమేఖల నమ్మలేదు. ‘బహుశః తనని చూసే భర్త నవ్వి ఉంటాడు. చెప్పడం ఇష్టం లేక దాట వేస్తున్నాడు’ అనుకుంది. దాంతో..."నేనింత అడుగుతున్నా చెప్పడం లేదంటే నీకు నామీద ప్రేమ లేదు. ప్రేమ లేని చోట కలిసి జీవించి ఏం సుఖం? ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే నిప్పుల్లోనో నీళ్ళల్లోనో దూకి చావటం మేలు. ఊరి పెట్టుకు ఊసురు తీసుకున్నా నయమే! నేనిక బ్రతక జాలను" అంటూ దుఃఖ పడసాగింది.

భార్యమాటలు విని మణిమేఖలుడికి చాలా బాధ కలిగింది. అతడికి భార్యంటే చాలా ప్రేమ! ఆమె దుఃఖించటాన్ని చూడలేక పోయాడు. తనకి ఏమైనా సరే, ఆమెని సంతోష పెట్టాలనుకున్నాడు. దానితో భార్యని తీసుకుని, ఆ రాత్రి వేళ ఊరి బయటకు వెళ్ళాడు.

అక్కడ ఓ చితిపేర్చుకుని దానిపై పడుకున్నాడు. భార్యను దగ్గరికి పిలిచి, తానెందుకు నవ్వాడో చెప్పి, మరుక్షణం అగ్నిపెట్టుకు మరణించాలని అతడి ఆలోచన! అన్నీ సిద్ధం చేసుకుని మణిమేఖలని దగ్గరికి పిలిచాడు.

పైన చందమామ నిండుగా వెలుగుతున్నాడు. మణిమేఖల ముఖం కూడా చందమామలా వెలిగిపోతుంది. అయితే అతడి మీద ప్రేమతో కాదు, అతడు చెప్పబోయే రహస్యం పట్ల ఆతృత తో! అతడు నోరు విప్పి ఏదో అనబోయాడు.

ఆ క్షణంలో... ఆ ప్రక్కనే రెండు మేకలున్నాయి. ఒకటి ఆడమేక(పెంటి), మరొకటి మగమేక (పోతు). పోతుమేక పెంటి దగ్గరికి ప్రేమగా చేరబోయింది. ఆడమేక దాని నాపుతూ. "నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే... అదిగో, ఆ బావి లోతట్టు గోడల మీద పచ్చని లేత చివురాకులున్నాయి. ఆ బావి మనకి దాపులనే ఉంది. నీవా లేచిగురాకులు తెచ్చి నాకిచ్చినట్లయితే నీ ప్రేమని అంగీకరిస్తాను" అంది.

మగమేక బావి వద్ద కెళ్ళి తొంగి చూసింది. బావి గోడలు పాకుడు పట్టి ఉన్నాయి. లోతట్టు గోడల కున్న పగుళ్ళలో పచ్చని మెత్తని పచ్చిక, చిగురాకులతో చిన్న చిన్న మర్రి మొక్కలూ పెరిగి ఉన్నాయి. గాలికి అవి ఊగుతున్నాయి, ఆకులు వెన్నెలలో మెరుస్తున్నాయి.వాటిని చూసి మగమేక ఓ క్షణం చింత పడింది. బావిలోకి ఓ సారి, పెంటి మేక వైపోసారి మార్చిమార్చి చూసింది.

ధనలాలస - ధర్మనిరతి! (భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక - 36)

హఠాత్తుగా బ్రహ్మపురంలో ప్రత్యక్షమైన కార్పటికుడి గురించి క్షణాల్లో వార్త ఊరంతా ప్రాకి సంచలనం రేపింది. కార్పటికుడు నేరుగా వెళ్ళి రాజదర్శనం చేసుకున్నాడు.

చండసింహుడతణ్ణి "కార్పటికా! ఏమయ్యింది? నీవు వెళ్ళిన పనిని ఎంత వరకూ సాధించావు?" అనడిగాడు. కార్పటికుడు రాజుకు నమస్కరించి, తను బయలు దేరినప్పటి నుండీ అప్పటి వరకూ ఏం జరిగిందో, ఏదీ దాచకుండా చెప్పాడు.

రాజది విని ఆశ్చర్యపోయాడు. అతడికా ఆలయాన్ని, ఆ అద్భుత సుందరిని చూడాలనిపించింది. ఓ మంచిరోజున... రాజు, కార్పటికుడు నౌకమీద ప్రయాణం ప్రారంభించారు. కొంచెం కష్టపడినా గానీ, కార్పటికుడు గతంలో తను చేరిన దీవిని గుర్తించాడు.

వెంటనే, రాజు చండసింహుడు, కార్పటికుడు కాళికాదేవి ఆలయంలోకి వెళ్ళారు. రాజు కాళికా దేవికి పూజాదికాలు నిర్వహించాడు. తర్వాత ఆలయ ఆవరణలోకి వచ్చారు. మునుపటి లాగే, మర్రిచెట్టు నీడలో అరుగు మీద, అంతకు క్రితం కార్పటికుడు చూసిన వయ్యారి, విలాసంగా శయనించి ఉంది.

చుట్టూ పరిచారికలు, ఆమెకు సపర్యలు చేస్తున్నారు. రాజామెను చూశాడు. ‘కార్పటికుడు చెప్పింది నిజమే! ఈమె అద్భుత సౌందర్యవతి’ అనుకున్నాడు.

అదే సమయంలో ఆ యువతి కూడా రాజును చూసింది. కోర మీసం, గిరజాల జుట్టు, బలమైన భుజాలు, కండలు తిరిగిన ధృఢ శరీరుడైన రాజుని చూసి ఆమె మైమరచిపోయింది. శౌర్యాన్ని ప్రకటిస్తున్న అతడి దేహభాష, చురుకైన కంటి చూపు, ఆమెను రాజుపై ప్రేమలో పడదోసాయి.

చెలికత్తెలని పిలిచి, రాజును చూపి ఏదో చెప్పింది. ఇద్దరు చెలికత్తెలు రాజు దగ్గరికి వచ్చి నమస్కరించి, ఆమె పంపిన ప్రేమ సందేశాన్ని వినిపించారు. రాజామెను తన వద్దకు రావలసిందిగా కోరాడు. సంతోషంతో,వయ్యారంగా కదులుతూ ‘అందమే ప్రవహించుకొస్తుందా!’ అన్నట్లు ఆమె అతణ్ణి సమీపించింది.

చండసింహుడు "ఓ సౌందర్యరాశి! ఎవరు నీవు? ఇక్కడెందుకు ఉన్నావు?" అనడిగాడు.

తేనెలొలుకుతున్న స్వరంతో ఆమె "నేను నాగలోక యువరాణిని. నా పేరు నాగిని. ప్రతీరోజూ నేనీ కోవెలలో అమ్మవారిని సేవించుకునేందుకు వస్తాను. ఓ రాజా! నీ మీది వలపుతో నా తలపులు నిండిపోయాయి. నన్ను స్వీకరించు" అంది తలవాల్చుకుని.

చండసింహుడు కార్పటికుణ్ణి దగ్గరకు పిలిచి, ఆమెతో "ఓ నాగిని! నీ ప్రేమను అంగీకరించలేనందుకు నన్ను మన్నించాలి. ఇతడు నా ప్రియమిత్రుడు. ఇతడు నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడు. ఇతడి ప్రేమను అంగీకరించు" అన్నాడు.

ఒక్కక్షణం నాగిని అయోమయంగా చూసింది. చండసింహుడు, కార్పటికుడి ప్రేమను స్వీకరించ వలసిందిగా ఆమెకు నచ్చచెప్పాడు. ఆమె కార్పటికుణ్ణి పెళ్ళాడేందుకు అంగీకరించింది.

చండసింహుడు "కార్పటికా! ఆ రోజు, వేట వినోదం నాడు, నీవు నాకు రెండు ఉసిరి ఫలాలనిచ్చి నా దప్పిక తీర్చి, నా ప్రాణాలు కాపాడావు. అందుకు ప్రత్యుపకారంగా... ఇదిగో ఈ యువతీ రత్నాన్ని నీకిస్తున్నాను. ఈమెతో జీవితాన్ని ఆనందించుదువుగాక!" అన్నాడు.

కార్పటికుడు తలవంచి రాజుకు నమస్కరించాడు. కాళికా దేవి సమక్షంలో వారిద్దరికీ వివాహం జరిపించి, చండసింహుడు నాగినీ కార్పటికుల వద్ద సెలవు తీసుకున్నాడు. మరోసారి అమ్మవారిని నమస్కరించి, ఆలయ ప్రాంగణంలోని బావిలో మునిగాడు. తక్షణం బ్రహ్మపురంలో తన రాజ సౌధం ముందు నిలబడి ఉన్నాడు.

కార్పటికుడు నాగినితో సుఖంగా ఉన్నాడు. చండసింహుడు సింహళ రాకుమారిని పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు.

భేతాళుడు ఈ కథ చెప్పి "విక్రమాదిత్య రాజేంద్రా! కార్పటికుడు, రాజు చండసింహులలో ఎవరు గొప్పవారు?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు వెన్నెల కురిసినట్లు చిరునవ్వు నవ్వాడు. "భేతాళా! విను! కార్పటికుడు తన యజమాని అయిన రాజుకు సేవ చేసాడు. మిగిలిన పరివారం అలిసిపోయినా, అతడు రాజు వెన్నంటే ఉన్నాడు. ఓ ప్రక్క రాజు రక్షణ బాధ్యత నిర్వహిస్తూ కూడా, దరిదాపుల్లో ఏమేమి ఉన్నాయోనని గమనిస్తూ అప్రమత్నంగానూ ఉన్నాడు. కాబట్టే దాపులనే ఉన్న ఉసిరి చెట్టునీ, సరస్సునీ గుర్తించగలిగాడు. అది అతడికి వృత్తిపట్ల గల నిబద్దత! అయితే అది అతడి వృత్తిధర్మం కూడా! ఆలికి అన్నం పెట్టడం ఊరినుద్దరించినట్లుకాదు. కాబట్టి - అతడి పని అతడు నెరవేర్చడం గొప్పకాదు.

అయితే రాజు చండసింహుడు కార్పటికుడి పట్ల చూపిన కృతజ్ఞత గొప్పది. ఎందుకంటే - కార్పటికుడు చేసిన సేవకే రాజతడికి జీతమిస్తున్నాడు. అయినా అతడి వృత్తి నిబద్దతని, సేవాధర్మాన్ని గ్రహించి, ప్రత్యుపకారం చేసాడు. లోక సహజంగా... ధనికులు, యజమానులు, రాజులు, సేవకుల నుండి సేవలు పొందుతూ ‘అందుకు తాము ధనం చెల్లిస్తున్నాం కదా!’ అనుకుని ఉదాసీనంగా ఉంటారు. అలా గాకుండా... రాజు చండసింహుడు, తన సేవకుడి పట్ల ప్రభుధర్మాన్ని నిర్వర్తించాడు. కాబట్టి చండసింహుడే గొప్పవాడు!" అన్నాడు.

భేతాళుడు అంగీకార సూచకంగా తలవూపుతూ, విక్రమాదిత్యుడి భుజం పైనుండి మోదగచెట్టు మీదికి ఎగిరిపోయాడు. విక్రమాదిత్యుడు వెనుదిరిగాడు.

కధావిశ్లేషణ: వీరవర్ధనుడు, కార్పటికుడు - రెండు కథలలోనూ, విక్రమాదిత్యుడు రాజు పాటించినదే గొప్ప ధర్మనిరతి అంటాడు. ధనలాలసలోనూ ధర్మనిరతి గుర్తించటం గొప్పవిషయమే కదా మరి!

కార్పటికుని కథ ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 35]

విక్రమాదిత్యుడు భేతాళుని బృహదారణ్యం వైపుకు మోసుకెళ్తుండగా, ఎప్పటి లాగానే భేతాళుడు మరో కథ ప్రారంభించాడు. ఇది, ఎనిమిదవ కథ!

ఒకప్పుడు చండ సింహుడనే రాజుండేవాడు. అతడు బ్రహ్మపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలు తుండేవాడు. అతడు మంచివాడు, ప్రతాపవంతుడు, తన ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలవాడు.

ఒకరోజు... కార్పటికుడు అనే యోధుడు రాజు వద్దకు వచ్చి, తన యోగ్యతలు వివరించి కొలువునివ్వ వలసిందిగా అభ్యర్ధించాడు. చండసింహుడికి కార్పటికుడి స్వరూప స్వభావాలు నచ్చటంతో, తన వ్యక్తిగత అంగరక్షకుడిగా అతణ్ణి నియమించాడు.

కార్పటికుడు రాజునెంతో భక్తిశ్రద్ధలతో సేవిస్తుండేవాడు. ఇలా ఉండగా... ఓ రోజు రాజు చండసింహుడు సపరివారంతో అడవికి వేటకెళ్ళాడు. రాజెక్కిన గుర్రం, సైనికుల గుర్రాల కంటే చురుగ్గా ఉంది. అది మెరుపు వేగంతో అడవిలోకి దూసుకెళ్ళింది. రాజు వెంట ఉన్న బృందంలో సైనికుల గుర్రాలు గానీ, మంత్రి తదితర అనుచరుల గుర్రాలు గానీ, దాని వేగాన్ని అందుకోలేక పోయాయి.

క్షణాల్లో రాజు ఎక్కిన గుర్రం అడవి మలుపుల్లో మాయమైంది. కొంత సేపటికి రాజు, తాను పరివారం నుండి దూరంగా వచ్చేసానన్న విషయాన్ని గ్రహించాడు. గుర్రాన్ని అదిలించి, దాని నియంత్రించాడు. వెనుదిరిగి చూస్తే... ఒక్క కార్పటికుడు తప్ప మరెవ్వరూ కనుచూపు మేరలో లేరు. అదీ కార్పటికుడు తన గుర్రాన్ని పరుగుతో అనుసరించి రావటం చూసి, రాజు చండసింహుడు అమితాశ్చర్య పడ్డాడు.

అయితే అప్పటికే అతడు డస్సిపోయి ఉన్నాడు. గుర్రం దిగి, ప్రక్కనే ఉన్న మర్రిచెట్టు నీడన కూలబడ్డాడు. దాహంతో నోరెండిపోయింది. కార్పటికుణ్ణి చూసి ‘దాహం’ అన్నట్లుగా సైగ చేశాడు.

అప్పటికి కార్పటికుడు చెమటలు గ్రమ్మి ఉన్నాడు. ఆయాసంతో రొప్పుతున్నాడు. అయినా గానీ, తన విద్యుక్త కర్తవ్యాన్ని మాత్రం మరిచి పోలేదు. రాజుకు అంగరక్షకుడిగా పరిసరాలని నిశితంగా పరిశీలించటం తన విధి. అందులో భాగంగా, అతడు దారి పొడుగునా పరిసరాలు గమనిస్తూనే వచ్చాడు.

రాజు విశ్రాంతికై కూర్చున్న మర్రి చెట్టుకు దాపులనే ఊసిరి చెట్టుండటం, కార్పటికుడు గుర్తించి ఉన్నాడు. రాజు ‘దాహం’ అనగానే పరిగెత్తుకు పోయి రెండు ఉసిరి కాయలు తెచ్చి రాజుకిచ్చాడు.

దాపులనే సరస్సుని గమనించి పరుగున పోయి ఆకుదొన్నెలో నీటిని తెచ్చి రాజుకిచ్చాడు. అప్పటికే ఉసిరి కాయాలతో నోరు తడి చేసుకున్న రాజు, నీరు త్రాగి సేదతీరాడు. రాజు స్థిమిత పడ్డాక, కార్పటికుడు వెళ్ళి సరస్సు నీటితో దాహం తీర్చుకుని వచ్చాడు. అప్పటికి రాజ పరివారం అక్కడికి చేరుకుంది.

కాస్సేపు సేద తీరి, అంతా రాజధానికి తిరిగి ప్రయాణమయ్యారు. రాజు కార్పటికుని విధి నిర్వహణకి ఎంతగానో ముగ్ధుడయ్యాడు. రాజధాని చేరాక, రాజు చండసింహుడు, కార్పటికుణ్ణి తన అంగరక్షక దళానికి అధిపతిగా చేసి సత్కరించాడు.

రోజులు గడుస్తున్నాయి. చండసింహుడు సింహళ రాజకుమారిని వివాహమాడదలిచాడు. ఆమె చాలా అందమైనదీ, తెలివైనదే గాక సుగుణశాలి అని అతడు విని ఉన్నాడు. దాంతో అతడు కార్పటికుణ్ణి పిలిచి, సింహళం వెళ్ళి ఇతర వివరాలు తెలుసుకు రమ్మన్నాడు.

కార్పటికుడు, ఓ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అతడి నౌకలో సింహళానికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నాడు. (నేటి శ్రీలంకకు నాటి పేరు సింహళమే.) సముద్రయానం ప్రారంభమైంది. మార్గమధ్యంలో వారు పెను తుఫానులో చిక్కుకున్నారు. గాలివానలో వాళ్ళ నౌక చిగురుటాకులా ఊగిపోయింది. రాకాసి అలల్లో అల్లాడుతుంది. చివరికి ఓడ బద్దలైంది.

సముద్రపు నీళ్ళల్లో ఈదుతున్న కార్పటికుణ్ణి ఓ పేద్ద తిమింగలం అమాంతం మ్రింగేసింది. ఒరనున్న కత్తి తీసి, కార్పటికుడు, ఆ చేప కడుపును చీల్చుకుని బయటకు వచ్చాడు. అప్పటికి అతడికి కనుచూపు మేరలో ఓ దీవి కనపించింది.

ఈదుకుంటూ అతడా దీవి చేరుకున్నాడు. అక్కడ అతడికి అద్బుతమైన శిల్పకళతో అలరారుతున్న కాళికా దేవి ఆలయం కనబడింది. అతడు ఆలయం ప్రవేశించి, అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశాడు. తర్వాత ఆలయం ఆవరణలో శిల్పాలను చూస్తూ తిరగసాగాడు. అక్కడ ఓ పెద్ద మర్రివృక్షం ఉంది. దాని చుట్టూ అరుగు నిర్మించి ఉంది. శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ చెట్టు నీడలో, ఓ అందమైన యువతి వయ్యారంగా వాలి పడుకుని ఉంది.

ఆమె చుట్టు దాసీలున్నారు. చుక్కల్లో చంద్రుడిలా, సరస్సులో కలువలా... ఆమె, చెలుల మధ్య భాసిస్తోంది. ఆమె అందాన్ని చూడటానికి కార్పటికుడికి రెండు కళ్ళూ చాలలేదు. వర్ణించేందుకు మాటలు రాలేదు.

ఆమె నల్లని కురులు చీకటిని తలపిస్తూ చెలరేగుతున్నాయి. నునువైన శరీరంతో, తీర్చిదిద్దినట్లున్న ఒంపుసొంపులతో, దేవాలయ గోడల మీద ఉన్న శిల్పసుందరి, ప్రాణం పోసుకు వచ్చినట్లుంది. కార్పటికుడామెని చూడగానే ప్రేమలో పడి పోయాడు.

కాస్సేపలా ఆమెనే చూస్తూ నిలబడి పోయాడు. అది గమనించి, ఆమె చెలికత్తెలలో ఒకతె... అతడి దగ్గరి కొచ్చి ‘ఏమిటన్నట్లు’గా చూసింది. మరొకామె ‘ఇక దయచెయ్’ అన్నట్లుగా సైగ చేసింది. అతడు వాళ్ళద్దరినీ ప్రాధేయపడుతూ... తనకు వారి యజమానురాలిపై గల ప్రేమను వివరించి, తన ప్రేమ సందేశాన్ని ఆమె కందించమని ప్రార్ధించాడు.

ఏమనుకున్నారో ఏమో, ఆ చెలికత్తెలిద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళి, అతడి గురించి చెప్పారు. ఊపిరి బిగబట్టి అదంతా చూస్తున్నాడు కార్పటికుడు. ఆమె ఓ క్షణం అతడి వైపు తదేకంగా చూసింది. వీణ మీటినట్లున్న స్వరంతో "వెళ్ళి, ఆలయ ఆవరణలో ఉన్న బావిలో స్నానం చేసి రా!" అంది.

కార్పటికుడు ఆ దిగుడు బావిలోకి దిగి, స్నానం చేద్దామని బుడుంగున మునిగాడు. ఒక్క మునక వేసి పైకి తేలి చూస్తే... ఆశ్చర్యం! అతడు తన ఊరైన బ్రహ్మపురంలో రాజ ప్రసాదానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు.
~~~~~~

రాజు – సేవకుడు – ధర్మనిరతి ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 34]

విక్రమాదిత్యుడు విసుగు చెందకుండా మరోసారి మోదుగ వృక్షమెక్కి, భేతాళుండిన శవాన్ని దించి, భుజాన వేసుకొని, జ్ఞానశీలుడి కిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు బృహదారణ్యం కేసి నడవసాగాడు.

భేతాళుడూ విసుగు చెందకుండా మరో కథ ప్రారంభించాడు. "విక్రమాదిత్య మహారాజా! ఇది ఏడవ కథ" అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు శరభేశ్వరం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు సుగ్రీవుడు. అతడు మంచివాడు, సమర్ధుడు. రాజధాని నగరమైన శరభపురంలో వీరవర్ధనుడు అనే బ్రహ్మణుడుండేవాడు. అతడు వేద విద్యలతో పాటు క్షాత్రవిద్యలూ నేర్చిన వాడు. గొప్ప యోధుడు కూడా!

ఒక రోజు వీర వర్ధనుడు, రాజు సుగ్రీవుడి సభకు పోయి, తన అర్హతకు తగిన కొలువు అడిగాడు. సుగ్రీవుడు అతడి ముఖ వర్చస్సూ, మాటతీరూ, వినయ శీలాలకు ముచ్చటపడి, తన ఆంతరంగిక రక్షక సిబ్బందిలో ఒకరిగా నియమించాడు. నెలకు వెయ్యి బంగారు నాణాల జీతమూ నిర్ణయించాడు.

వీరవర్ధనుడు తన జీతాన్ని నాలుగు భాగాలుగా చేసాడు. ఒక భాగం, అంటే రెండువందల యాభై బంగారు నాణాలతో భగవంతుడిపై భక్తితో గుడులకూ, పూజలకూ వెచ్చించే వాడు. మరో భాగం కవి పండితులకూ, ఆశ్రితులకు వెచ్చించేవాడు. మరో భాగంతో పేదసాదలకు దాన ధర్మాలు చేసేవాడు. నాలుగో భాగంలో కుటుంబాన్ని పోషించే వాడు. అతడి ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఉండేవాళ్ళు.

ఇలా రోజులు గడుస్తుండగా, ఒక రోజు... వీరవర్ధనుడు విధి నిర్వహణలో ఉన్నాడు. అది రాత్రి సమయం. అతడు రాజు సుగ్రీవుడి అంతఃపుర రక్షణలో ఉన్నాడు. ఆ సమయంలో జడివాన ప్రారంభమైనది. ఈదురు గాలి... ఉరుములు... మెరుపులు! కుంభవృష్టి కురుస్తోంది.

క్షణాల్లో పరిస్థితి ప్రళయ భీకరంగా మారింది. పెనువృక్షాలు కూడా చిగురు టాకుల్లా ఊగిపోతున్నాయి. ఇంతలో నగరం వెలుపలి నుండి బిగ్గరగా ఏదో ధ్వని వినిపించింది. అది హృదయవిదారకంగా ఉంది. సుగ్రీవుడు "ఏమిటా శబ్ధం? ఎవరైనా వెళ్ళి అదేమిటో తెలుసుకుని రాగలరా?" అని అడిగాడు.

అతడి అంగరక్షకులలో అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. వీర వర్ధనుడు మాత్రం స్థిరమైన కంఠంతో "చిత్తం మహారాజా! నేనందుకు సిధ్దంగా ఉన్నాను" అన్నాడు. సుగ్రీవుడు సరే చూచి రమ్మన్నాడు.

వీరవర్ధనుడు తన ఆయుధాలను తీసుకుని తక్షణమే బయలు దేరాడు. రాజు సుగ్రీవుడికీ కుతుహలంగా ఉంది. దాంతో అతడు వీరవర్ధనుడి వెనకే అతణ్ణి అనుసరించ సాగాడు. వీరవర్ధనుడిదేమీ గమనించలేదు.

అతడు నేరుగా నగర ద్వారం చేరాడు. చుట్టూ పరిశీలిస్తూ ద్వారం దాటి నగరం బయటికి వచ్చాడు. అక్కడ ఓ స్త్రీ కూర్చుని బిగ్గరగా రోదిస్తోంది.

అతడామెని "అమ్మా! ఎవరు నీవు? నీ పేరేమిటి? నీ నివాసమేది? ఎందుకిలా దుఃఖిస్తున్నావు?" అనడిగాడు.

ఆమె అతడివైపు పరిశీలనగా చూస్తూ "ఓ బ్రాహ్మణోత్తమా! నేనీ నగర దేవత శరభేశ్వరిని. ఈ రాజ్యాధీశుడు సుగ్రీవుడి మరణం ఇక మూడు రోజులలో సంభవించనున్నది. అతడు సమర్ధుడూ, పిన్న వయస్కుడు. అతడి మరణానంతరం, ఈ రాజ్యమేమి కానున్నదో? అది తలచుకు దుఃఖిస్తున్నాను" అంది.

వీరవర్ధనుడు "అమ్మా! నీవీ నగర ప్రజలందరికీ తల్లివి. ఈ రాజ్యమాతవు. ఈ ప్రమాదం నుండి మహరాజుని కాపాడగల మార్గమేదీ లేదా? తల్లీ! దయతో చెప్పగలవు" అని ప్రార్ధించాడు.

శరభేశ్వరి "నాయనా! ప్రమాదాన్ని నివారించగల వ్యక్తి ఉంటే, దానికొక మార్గముంది" అంది. వీరవర్ధనుడు "తల్లీ! సెలవివ్వు! నీవు ఆశీర్వదిస్తే దాన్ని నేను నెరవేర్చగలను. నీవు నన్ను దీవిస్తే అసాధ్యమే ఉండదు. అందుచేత దయ ఉంచి తల్లీ, నాకా మార్గం ఉపదేశించు" అన్నాడు.

శరభేశ్వరి "వీర వర్ధనా! మహరాజు దీర్ఘాయువు కలిగి ఉండాలంటే, శరభపురంలో నివసించే 16 ఏళ్ళ బాలుడిని దుర్గామాతకి బలిగా ఇవ్వాలి. దుర్గా దేవి కోవెల ఈ సమీపంలోనే ఉంది. రాజు ప్రాణాలు కాపాడాలంటే ఇదొక్కటే మార్గం" అంది.

వీరవర్ధనుడు "తల్లీ! ఆ ప్రకారమే చేసేదగాక!" అన్నాడు. వెనుదిరిగి ఇంటికి పోయాడు. అతడికి 16 ఏళ్ళ పుత్రుడున్నాడు. అతడు కుటుంబ సభ్యులకు రాజుకు రానున్న మరణం గురించి, దేశానికి వాటిల్లే ప్రమాదం గురించీ చెప్పాడు. "దాన్ని నివారించటం మన బాధ్యత!" అన్నాడు. అందరూ అతడి మాటని సమర్ధించారు.

అతడు తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని దుర్గామాత గుడికి వెళ్ళాడు. అక్కడ పూజాదికాలన్నీ భక్తి శ్రద్ధలతో చేశాడు. భార్యా బిడ్డలు దేవికి నమస్కరిస్తుండగా, తన 16 ఏళ్ళ పుత్రుడి తలనరికి బలిపీఠంపై ఉంచాడు.

క్షణంలో జరిగిన ఆ సంఘటనకి అతడి భార్య, మిగిలిన పిల్లలు విభ్రాంతి పడి చూడసాగారు. వీరవర్ధనుడేమీ మాట్లాడలేదు. అతడి భార్యాబిడ్డలు ఒక్కసారిగా పెను దుఃఖానికి గురయ్యారు. తలా మొండెం విడిపడి ఉన్నపిల్లవాణ్ణి చూసి, గుండె చెదిరి ఒక్కమ్మడిగా అందరూ ప్రాణాలు విడిచారు. వీరవర్ధనుడు ఏకధారగా శోకించాడు.

దుర్గామాత వైపు తిరిగి "తల్లీ! ఈ దేశపు పౌరులుగా, దేశాన్ని కాపాడుకోవటం మా ధర్మం. రాజుకు అంగరక్షకుడిగా ఆయన ప్రాణాలు కాపాడటం నాకు సేవాధర్మం. అయితే భార్యాబిడ్డలనూ, తల్లిదండ్రులనూ కోల్పోయి, ఒంటి బ్రతుకు నేను ఈడ్చజాలను. నా ప్రాణాలూ తీసుకో!" అంటూ దేవి ముందు తన తల నరుక్కున్నాడు.

రాజు సుగ్రీవుడిదంతా మాటున నిలబడి చూస్తూనే ఉన్నాడు. అతడికి చాలా బాధ కలిగింది. తన కోసం, దేశం కోసం, ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోవటం చూసి పరితాపం చెందాడు. దుర్గాదేవి సన్నిధి చేరి "ఓ తల్లీ! ఇదే నా తల తీసుకో!" అంటూ ఖడ్గమెత్తి కంఠం నరుక్కోబోయాడు.

తక్షణమే మెరుపు మెరిసినట్లు, అతడి కళ్ళ ముందు దుర్గాదేవి ప్రత్యక్షమైంది. అమె రాజుని దీర్ఘాయువుగా దీవించి, వీరవర్ధనుడి కుటుంబాన్నంతటినీ పునర్జీవితులని చేసింది. వాళ్ళు తనని గమనించే లోగానే, రాజు సుగ్రీవుడు అక్కడి నుండి తప్పుకున్నాడు. ఏమీ తెలియనట్లుగా నగరానికి తిరిగి వచ్చాడు. కుటుంబంతో సహా వీరవర్ధనుడు దుర్గామాతకు మొక్కుకుని ఇంటికి తిరిగి వచ్చాడు.

మర్నాటి ఉదయం, రాజు సభలో "వీర వర్ధనా! రాత్రి నీవు నగర బాహ్యం నుండి వస్తున్న ధ్వని ఏమిటో తెలుసుకునేందుకు వెళ్ళావు కదా? దాని గురించి ఏం తెలుసుకున్నావు?" అనడిగాడు.

వీరవర్ధనుడి "మహారాజా! నేనక్కడికి వెళ్ళేసరికి ఓ స్త్రీ అక్కడ రోదిస్తూ ఉంది. నేనెంత అడిగినా ఆమె జవాబివ్వలేదు. అంతే! ఇంత కంటే ఏమీ లేదు" అన్నాడు.

వీరవర్ధునుడి దేశభక్తికీ, ప్రభుభక్తి కీ, నిజాయితీకీ సుగ్రీవుడెంత గానో సంతోషించాడు. నిష్కామపూరితమైన అతడి విధి నిర్వహణ, త్యాగశీలత చూసి ముగ్ధుడయ్యాడు.

సభికుల వైపు తిరిగి "నా ప్రియమైన సభాసదులారా! ఈ వీర వర్ధనుడు నా ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలని, తన కుటుంబ సభ్యుల ప్రాణాలని త్యాగం చేసాడు. అలాగయ్యీ, కనీసం నా మెప్పుకోసం కూడా, జరిగింది చెప్పాలనుకోలేదు. నిజంగా ఇతడు ఉత్తముడు" అంటూ... రాత్రి జరిగిందంటా వివరించాడు.

వీరవర్ధనుణ్ణి ఎంతగానో కొనియాడి, సత్కరించాడు. సభికులంతా కూడా వీరవర్ధనుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు.

భేతాళుడు ఈ కథ చెప్పి "విక్రమాదిత్య రాజేంద్రా! ఇదీ కథ! ఈ కథలో వీరవర్ధనుడు, రాజు సుగ్రీవుడు... ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు?" అని ప్రశ్నించాడు.

విక్రమాదిత్యుడు "నిశ్చయంగా రాజు సుగ్రీవుడు! ఎందుకంటే - వీర వర్ధనుడు రాజుకు అంగరక్షకుడు. రాజు ప్రాణాలను తన సర్వస్వం ధారపోసి అయినా కాపాడవలసిన విద్యుక్త ధర్మం కలవాడు. అతడూ అతడి కుటుంబమూ అందుకోసమే పోషించబడుతోంది. దేశరక్షణకు ప్రాణాలు అర్పించటం ప్రజల ధర్మం. అయితే, రాజు సుగ్రీవుడు తన ప్రజలలో ఒకరైన వీరవర్దనుడి కుటుంబ సభ్యుల మృతికి కలత చెంది, తన ప్రాణాలు త్యాగం చేసేందుకు సిద్దపడ్డాడు. అందుచేత నిశ్చయంగా రాజు సుగ్రీవుడు గొప్పవాడు" అన్నాడు.

అంతే! గలగలా నవ్వుతూ భేతాళుడు విక్రమాదిత్యుడు భుజమ్మీద నుండి మోదుగ వృక్షం మీదికి ఎగిరిపోయాడు. విక్రమాదిత్యుడు చిరునవ్వు చిందిస్తూ భుజాలెగరేసాడు.

వెనుతిరిగి మోదుగ చెట్టు వైపు అడుగులేసాడు.

~~~~~~

ఆడువారిని నమ్మరాదా !? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 33]

లాలస, నేరుగా పడక గదిలోకి జొరపడింది. మంచం మీద భర్త ఆదమరచి నిదుర బోతున్నాడు. లాలస, ఏం చెయ్యాలా అని కాస్సేపు ఆలోచించింది. భర్త చేతి సంచిలోంచి ఓ పోక చెక్కని తీసి సగానికి కత్తిరించింది. పోక చెక్కకీ, కత్తికీ రక్తం పూసింది.

అంతే! పెద్ద పెట్టున మొర్రోమని మొత్తుకుంది. ఆమె గావుకేకలకి భర్త వరకీర్తి ఉలిక్కిపడి లేచాడు. ఆమె చావుకేకలకి తల్లీదండ్రీ, సేవకులూ పరుగెత్తుకు వచ్చారు. లాలస ఏడుస్తూ "నా భర్త నా ముక్కు కోసాడు" అంది.

కోపంతో ఊగిపోయిన గిరి వర్ధనుడు అల్లుణ్ణి బంధించి, రాజ భటులకి ఫిర్యాదు చేసాడు. మర్నాటి ఉదయం రాజభటులు వాళ్ళందరినీ రాజు ఎదుట హాజరు పరిచారు. రాజు ధర్మకేసరి, వరకీర్తిని "నీ భార్య ముక్కు నెందుకు కోసావు?" అని ప్రశ్నించాడు.

అతడు ఘోల్లుమంటూ "మహారాజా! నాకేమీ తెలియదు. ఆమె కేకలకి నేను నిద్రలో నుండి లేచాను. అప్పటికే ఆమె రక్తసిక్తమైన నాసికతో ఏడుస్తూ ఉంది. అంతకు మించి నాకేదీ తెలియదు" అన్నాడు.

రాజు లాలసని వివరమడిగాడు. ఆమె వినయంగా "ఓ మహారాజా. నేనింత వరకూ ఎవరికీ ఏ కీడూ చేయని దానను. నా భర్తకు సైతం ఏ అపచారమూ చేయలేదు. అలాంటప్పుడు నా భర్తపై ఊరికే నిందనెందుకు వేస్తాను?" అంది తార్కికంగా.

అదే సమయంలో నగర గస్తీ భటులు రాజుకు దైనందిన నివేదిక యిస్తూ "మహారాజా! రాత్రి నగరంలో గస్తీ తిరుగుతూ, నగర వీధులలో కాపలా కాస్తున్నాము. అప్పుడు ఈ వైశ్య వ్యాపారి ఇంటి వెనుక, ఎవరో దాగి ఉన్నట్లని పించింది. దొంగేమోనని సందేహించి హెచ్చరించాము. ఎందుకైనా మంచిదని బాణప్రయోగం చేసాము. ఏ చప్పుడూ రానందున, ఎవరూ లేరనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాము" అని చెప్పారు.

రాజు ధర్మకేసరి, సైనికులని పిలిచి, వైశ్యుడి ఇంటి వెనుక వెదకి రమ్మని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ పాటించి భటులక్కడ వెదికి, తోటలో పడి ఉన్న బ్రాహ్మణ యువకుడి శవాన్ని రాజ సభకి తెచ్చారు. శవాన్ని పరీక్షించగా, బిగుసుకు పోయిన దాని నోటిలో, లాలస ముక్కు కొన ఉంది, ముక్కు పుడకతో సహా!

ఇంకేముంది? లాలస సాక్ష్యంతో సహా తిరుగులేకుండా దొరికిపోయింది. విచారణలో, శవం వైశ్య వ్యాపారి గిరివర్ధనుడి ఇంటి సమీపంలో నివసించే బ్రాహ్మణ యువకుడిదని తేలింది. లాలసకి అతడితో వివాహేతర సంబంధం ఉందని వెల్లడయ్యింది.

రాజు ధర్మసేనుడు అన్ని కోణాల్లో విషయ విచారణ చేసాడు. లాలస దాసి కూడా, ఆమె రహస్య ప్రణయ సంబంధాన్ని ధృవీకరించింది.

ధర్మకేసరి "ఓ వైశ్య యువతీ, లాలస! నిజం చెప్పు!" అని గద్దించి అడిగేసరికి ఆమె భయంతో గడగడ వణుకుతూ తప్పు ఒప్పుకుంది. రాజు లాలసకి శిరశ్చేదం శిక్షగా విధించాడు. వరకీర్తిని విడుదల చేసాడు.

ఈ కథంతా చెప్పిన మగ చిలుక, యువరాణి రత్నావళి వైపూ, యువరాజు పరాక్రమ కేసరి వైపూ పరిశీలనగా చూస్తూ "ఓ నూతన దంపతులారా! ఇప్పుడు చెప్పండి, లాలస ఎంత ధూర్తురాలో!? అందుకే నేను, ఆడవారిని నమ్మరాదని చెప్పాను" అన్నది.

యువరాణీ యువరాజులిద్దరూ, రెండు చిలకల వాదనలని పూర్వపక్షం చేస్తూ, సరైన వాదన వినిపించారు. అందులోని నిజాన్ని అంగీకరించిన చిలుకలు రెండూ, సంతోషంగా, ప్రేమలో పడ్డాయి. వాటి ఒద్దిక చూసి, కొత్త జంట కూడా మురిసిపోయింది.

భేతాళుడు కథ పూర్తి చేస్తూ "ఓ విక్రమాదిత్య మహారాజా! ఇదీ కథ! చిలకలని ఒప్పించేందుకు... యువరాణి యువరాజులు ఏ వాదన చెప్పి ఉంటారో చెప్పగలవా?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు "భేతాళా! నా అభిప్రాయంలో వారి వాదన ఇలా ఉండి ఉండాలి.

స్త్రీ పురుషు లింగ భేదాన్ని బట్టి గానీ, పేద ధనిక వర్గ భేదాన్ని బట్టి గానీ... మనుషుల్లోని మంచీ చెడూ, నీతీ అవినీతి ఉండవు. అది వ్యక్తుల సహజ స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బట్టి, వారి మంచీ చెడూ ప్రవర్తన ఉంటుంది. తర్కకేసరి, అలంకారి ల విషయంలో, తర్కకేసరి భార్యని మోసగించాడు, హత మార్చాడు. అమాయకమైన పిల్ల గనక, అలంకారి... భర్త చేతిలో మోసపోయింది.

లాలస, వరకీర్తి విషయంలో లాలస చెడ్డదే కాదు, కౄరత్వం గలది. ఆమె దుష్ట బుద్ధి కారణంగా, అక్కడికి రప్పించబడ్డ బ్రాహ్మణ యువకుడు, విధివశాత్తూ, ప్రాణాలు కోల్పోయాడు. అయినా ఏమాత్రం భయమూ, పాపభీతి, పశ్చాత్తాపం లేకుండా, లాలస... స్వీయరక్షణ కోసం, భర్త పైకి నేరం తోసి, అతడి ప్రాణాలకు ఎసరు పెట్టింది.

ఏం జరిగిందో తెలిసి ఉండీ, జరిగిన వాటిపై స్పష్టత ఉండీ కూడా, లాలస, భర్త ప్రాణాలకి ప్రమాదం తెచ్చిపెట్టే ప్రయత్నం చేసింది. తక్షణం చేసిన ఆలోచన కూడా కాదది. ఆమె ఆలోచించి వేసిన ప్రణాళిక!

తర్కకేసరి, తన భార్య అలంకారిని... తనని నమ్మనందుకూ, తనతో రానన్నందుకూ... కోపాద్రిక్తుడై, ఒళ్ళు తెలియని ఆవేశంలో, ఆ క్షణమే భార్యని కొట్టి చంపాడు. అదే లాలస అయితే, తన అవినీతి ప్రవర్తనని కప్పిపుచ్చుకునేందుకు, పధకం ఆలోచించి, భర్తని చంపించేందుకు కుట్ర పన్నింది. కాబట్టి - ఆమె మరింత చెడు నడత కలిగిందనాలి.

మంచి చెడు లింగభేదాన్ని బట్టి ఉండక పోయినా, సహజంగా స్త్రీలు దయతోనూ, ప్రేమార్ధ్ర హృదయంతోనూ ఉంటారు. సహనంగా బిడ్డని కడుపున మోసి, జన్మనిచ్చి, ఓర్పుతో పెంచే ప్రాకృతిక ప్రేమ కారణంగానేమో... స్త్రీలు, సహజంగా ఎక్కువ మంచితనంతో ఉంటారు. అలాగయ్యీ లాలస, లాలసత్వం కొద్దీ, ఇంతకి తెగించింది. గనుక నిశ్చయంగా ఆమె శిరశ్చేదానికి అర్హురాలు.

అంతే తప్ప, స్త్రీ పురుష భేదాన్ని బట్టి, మనుషులను నమ్మరానంత ప్రమాదం ఏమీ లేదు" అని చెప్పిఉంటారు" అన్నాడు.

భేతాళుడు ఆ సమాధానం విని సంతృప్తి పడ్డాడు. అయితే నిశ్శబ్దం భంగమైందిగా! అందుకే చటుక్కున మాయమై మోదుగ చెట్టెక్కేసాడు.

తప్పు చేయబోతే ముక్కు యిరుక్కుంది![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 32]

అలంకారికి భర్త భయం అర్ధమైంది. ఆమె అతణ్ని ఆపి "నీవు భయపడనవసరం లేదు. జరిగిందేమీ నేను నా తల్లిదండ్రులకి చెప్పలేదు. ఏనాటికైనా నీవు మనస్సు మార్చుకొని వస్తావని ఎదురు చూస్తున్నాను. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని నీవు ఇంటికి వచ్చావు. నాకదే సంతోషం! జరిగింది మరిచిపోయి ఇకనైనా హాయిగా ఉందాం" అంటూ తను తల్లిదండ్రులకి ఏమని చెప్పిందో అంతా వివరించింది.

దాంతో తర్కకేసరి ‘బ్రతుకు జీవుడా!’ అనుకున్నాడు. అలంకారి "రా! నా తల్లిదండ్రులు నీకోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు" అంటూ లోపలికి తీస్కెళ్ళింది. నిషాదశెట్టి దంపతులు అల్లుణ్ణి చూసి ఆనందంగా ఆదరించారు. జరిగింది మరిచిపొమ్మని ఓదార్చారు. ఇకనైనా దొంగలు తమ అల్లుడని క్షేమంగా విడిచిపెట్టారనుకొని, దేవుడికి మొక్కులు తీర్చుకున్నారు.

ఎప్పటిలాగే వ్యాపారాన్ని అప్ప చెప్పారు. మళ్ళీ రోజులు హాయిగా గడవసాగాయి. దాంతో మళ్ళీ తర్కకేసరికి వేశ్యా సంపర్కం కోసం కాళ్ళూ చేతులూ లాగసాగాయి. ఈసారి భార్యని ప్రాధేయపడ్డాడు. క్రిందటి సారిలా చెయ్యననీ, తనతో అభయసత్యానికి రమ్మనీ అడిగాడు. అలంకారి ఒప్పుకోలేదు. అతడి మీద ఆమెకి నమ్మకం కుదరలేదు.

దాంతో తర్కకేసరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన నెంతో ప్రేమించే భార్యని, తన తప్పు కడుపులో పెట్టుకు కాపాడిన భార్యని తల మీద మోది చంపేసాడు. ఆమె ఒంటి మీది నగానట్రా ఒలుచుకుని పారిపోయాడు.

కాబట్టే మగవారిని నమ్మరాదన్నాను" అంది ఆడ చిలుక ఆయాసంతో ఒగరుస్తూ!

అప్పటి వరకూ కథ చెబుతూ ఆడ చిలుక ఆయాసంతో ఒగరిస్తే, అది చెప్పిన కథ విని ఆవేశంతో ఒగర్చింది మగ చిలుక!

పరాక్రమ కేసరి, రత్నావళి, ఇదంతా విని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రత్నావళి మగ చిలుకతో "నీవెందుకు ఆడువారిని నమ్మరాదన్నావు?" అనడిగింది.

మగచిలుక, కోపాన్ని నియంత్రించుకుంటున్న స్వరంతో "యువరాణీ! విను" అని ఇలా చెప్పసాగింది.

ఒకప్పుడు అరిష్టపురం అనే నగరం ఉండేది. (దురదృష్ట నగరం అని ఆ పేరుకు అర్ధం.) ఆ నగరాన్ని ధర్మకేసరి అనే రాజు పాలిస్తుండేవాడు. (ధర్మాన్ని పాటించడంలో సింహం వంటి వాడని ఆ పేరుకి అర్ధం.)

ఆ నగరంలో గిరి వర్ధనుడు అనే వైశ్యుడుండేవాడు. అతడు గొప్ప ధనిక వ్యాపారి. అతడికి ఒకే ఒక్క కూతురు, లాలస. (ఆమె పేరుకు అర్ధం కోరిక అని!) ఆమె చక్కనిది. అయితే పేరుకు తగినది.

ఆమె యుక్తవయస్సులో ఉంది. అదే నగరంలో ఉన్న మరో వైశ్య యువకుడు వరకీర్తి, గిరి వర్ధనుణ్ణి కలుసుకొని పిల్లనిమ్మని అడిగాడు. గిరి వర్ధనుడికి అతడి కుటుంబ నేపధ్యమూ, అందచందాలు, గుణగణాలు నచ్చడంతో, లాలసని వరకీర్తి కిచ్చి పెళ్ళిచేసాడు.

కొన్ని రోజుల తర్వాత వరకీర్తి, లాలసని ఆమె పుట్టింట వదిలి పెట్టి, వ్యాపార నిమిత్తం దూరదేశాలకు వెళ్ళాడు. లాలస యవ్వనంలో ఉంది. భర్త దగ్గర లేడు. దాంతో ఆమె కోరికలని నియంత్రించుకోలేక, తమ ఇంటికి సమీపంలో నివసించే బ్రాహ్మణ యువకుణ్ణి ఒకణ్ణి ఆకర్షించి, అతడితో రహస్య ప్రణయం నడపసాగింది. (ఇలాంటి కథ పిల్లలకి చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే ఆమె అతడితో డ్యూయెట్ పాడేసింది అని చెబుతుంటాను.)

లాలస తన అక్రమ ప్రేమయణాన్ని అతి రహస్యంగా కొనసాగించింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఓరోజు... వ్యాపార నిమిత్తం దూరదేశాలకు వెళ్ళిన వరకీర్తి ఇంటికి తిరిగి వచ్చాడు. వ్యాపారంలో మంచి లాభాలు గడించినందుకు, అతడెంతో సంతోషంగా... భార్యకు, అత్తమామలకు విలువైన బహుమతులు తెచ్చాడు. లాలసకు పట్టు చీరలు, వజ్రాభరణాలు పట్టుకొచ్చాడు.

ఆ రోజు రాత్రి, లాలస, భర్తతో తియ్యగా మాట్లాడి, అతడు తెచ్చిన కానుకలని మెచ్చుకొని, అతణ్ణి ఆనందపరిచింది. భర్త నిద్రపోయాక, తనకి అత్యంత నమ్మకస్థురాలైన దాసీని పిలిచి, తన ప్రియుడైన బ్రాహ్మణ యువకుని, ఎవరూ చూడకుండా పిలుచుకు రమ్మంది. లాలస వివాహేతర ప్రేమ సంబంధం గురించి ఈ దాసీకి ముందే తెలుసు. లాలస ఇచ్చే కానుకలతో, ఆమెకి కావలసినట్లుగా మసలు కుంటుంది.

దాంతో దాసి, లాలస చెప్పినట్లుగానే బ్రహ్మణ యువకుణ్ణి పిలుచుకు వచ్చి, వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే సంకేత ప్రదేశంలో ఉంచింది. ఎప్పటి లాగే గిరి వర్ధునుడి భవంతి వెనుక తోటలో, ప్రహరీ గోడ ప్రక్కనే నక్కి ఆ బ్రాహ్మణ యువకుడు, లాలస కోసం ఎదురు చూడసాగాడు.

అప్పటికి అర్ధరాత్రి దాటింది. నగరానికి కాపలాకాసే గస్తీ సైనికులు అప్పుడే, అక్కడికి వచ్చారు. వైశ్య వ్యాపారి ఇంటి వెనక ఎవరో నక్కి ఉండటం గమనించారు. తమ విధి నిర్వహణలో భాగంగా అది వాళ్ళ దినచర్య. గిరి వర్ధనుడు ధనికుడు గనుక ఇంటి వెనుక ఎవరో దొంగ మాటు వేసాడేమో నని అనుమానించారు.

"ఎవరదీ!" అంటూ గట్టిగా గద్దించారు. బ్రాహ్మణ యువకుడు చీకట్లోకి తప్పుకున్నాడు. ‘ఎందుకొచ్చిన సందేహం?’ అన్నట్లుగా గస్తీ సైనికులు చీకట్లోకి బాణాలు వదిలారు. వాటిల్లో ఒకటి బ్రాహ్మణ యువకుడికి తగిలింది. గాయమైంది. బాధకి విలవిల్లాడినా, ఆ బ్రాహ్మణ యువకుడు గట్టిగా అరవలేదు.

‘ఎక్కడ తన అక్రమ సంబంధం బయటపడుతుందో’ అన్న భయం అతడిది. ఇంతలో బాధకి, రక్తస్రావానికి స్ఫృహ తప్పిపోయాడు. ఏ చప్పుడూ రాకపోవటంతో, గస్తీ సైనికులు తమ దారిన తాము పోయారు.

లాలస కదంతా తెలియదు. అప్పటికే ఆలస్యమైందనుకుంటూ ఆదర బాదరా వచ్చింది. ప్రియుణ్ణి ప్రేమతో పిలిచింది. బ్రాహ్మణ యువకుడి నుండి ఉలుకూ పలుకూ లేదు. లాలస, తాను ఆలస్యంగా వచ్చినందుకు అతడు కోపగించుకుంటున్నాడనుకొంది.

అతణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకుని వెనుక నుండి వచ్చి కౌగిలించుకుంది. గుసగుసలు పోతూ, ముందు కొచ్చి మూతిమీద ముద్దు పెట్టుకుంది. అప్పుడే ఆమె ముక్కు అతడి నోట చిక్కుకుంది. ఆమె కుదుపులకు, అప్పటి వరకు స్పృహతో లేని బ్రాహ్మణ యువకుడికి ఒక్కసారిగా స్పృహ వచ్చింది. మరుక్షణమే... ఆమె ముక్కు అతడి నోట ఉండగానే, అతడు ప్రాణాలు వదిలేసాడు.

ఈ హఠాత్పరిణామానికి నివ్వెర పోయిన లాలస, ఒక్కసారిగా లేచి నిలబడింది. ఆ దెబ్బకి ఆమె ముక్కు కొన కాస్తా తెగి, బ్రాహ్మణ యువకుడి శవం నోటిలో ఉండిపోయింది.

ఒక్కసారిగా లాలస భయంతో వణికి పోయింది. ఏం చెయ్యడానికీ తోచలేదు. ఒక్క పెట్టున ఇంట్లోకి పరుగెత్తుకొచ్చింది.

~~~~~~

మగవారినెందుకు నమ్మరాదు ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 31]

పంచవన్నెల చిలుక "ఓ యువరాజా! పరాక్రమ కేసరీ!విను...." అంటూ ఇలా కొనసాగించింది.

అభయ సత్యం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణంలో పేరెన్నికగన్న వైశ్య వ్యాపారి ఒకడుండేవాడు. అతడి పేరు వాల్మీకుడు. అతడికి తర్క కేసరి అనే కుమారుడుండేవాడు.(వాదనలో సింహం వంటి వాడని అతడి పేరుకు అర్ధం.) వాల్మీకుడు అత్యంత ధనవంతుడు. దాంతో ఏకైక కుమారుడైన తర్కకేసరిని అతి గారాబంగా పెంచాడు.

సహజంగానే... ఎదిగే కొద్దీ తర్కకేసరి, క్రమశిక్షణారాహిత్యంతో, పొగరబోతుగా, సోమరిగా, వ్యసన పరుడిగా తయారయ్యాడు. చిన్నప్పుడు ఆటపాటల మీద ఉండిన యావ కాస్తా, యవ్వనంలోకి వచ్చేసరికి వేశ్యల మీదికి పోవటంతో, తర్క కేసరి పూర్తిగా చెడు త్రోవ పట్టాడు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు... వాల్మీకుడు, కొడుకు తర్కకేసరిని సరైన మార్గంలో పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. నయానా భయానా... తాను నచ్చ చెప్పాడు, ఇతరుల చేత చెప్పించాడు. లాభం లేకపోయింది. ఏడ్చాడు, మొత్తుకున్నాడు. కొడుకు మాట వినలేదు. చివరికి గుండె రాయి చేసుకుని, ఇలాగే వదిలేస్తే కొడుకు ఆస్తుపాస్తులన్నిటినీ హారతి కర్పూరంలా సానివాడకి అర్పించేస్తాడని భయం వేసి, తర్కకేసరిని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. కడుపు కాలితేనన్నా బుద్ది మంచిమార్గం పడుతుందేమోనన్న ఆశ కొడగట్టిన దీపంలా వెలుగుతోంది ఆ తండ్రి మనస్సులో!

తర్కకేసరి ఇంటి చుట్టూ తచ్చట్లాడినా తండ్రి మనస్సు కరగలేదు. ఇక తప్పక తర్కకేసరి పట్టణంలో అక్కడా ఇక్కడా తిరిగాడు. ఆ పంచనా ఈ పంచనా పడుకున్నాడు. అందరూ అతణ్ణి ఛీ కొట్టడంతో, గత్యంతరం లేక ఊరు విడిచి పోయాడు.

ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ, చివరికి అలకాపూరి అనే పట్టణం చేరాడు. అక్కడ, పేరున్న ధనిక వ్యాపారి నిషాదశెట్టి అనే వైశ్యుడున్నాడు. అతడి దుకాణం చేరి, పని ఇమ్మని దీనంగా అడిగాడు. ఇతడి వాలకం చూసి జాలిపడిన నిషాద శెట్టి ఊరుపేరూ కనుక్కొని ‘సాటి వైశ్య యువకుడు కదా’ అనుకొని ఆదరించాడు.

తర్కకేసరి కూడా... అప్పటి వరకూ అనుభవించిన క్లేశాల రీత్యా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, యజమాని దగ్గర అణుకువగా పనిచేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి, నిషాద శెట్టికి తర్కకేసరి మీద మంచి అభిప్రాయం కలిగింది.

తన కుమార్తె అలంకారినిచ్చి తర్కకేసరి పెళ్ళి జరిపించాడు. ఒక్కగానొక్క కూతురితో పాటు, వ్యాపారాన్ని కూడా చేతిలో పెట్టాడు. డబ్బూ, ఆధిపత్యం చేతికొచ్చేసరికి, తర్కకేసరిలో మరోమనిషి మెల్లిగా నిద్రలేవటం మొదలయ్యింది.

ఓ రోజు నిషాదశెట్టి దగ్గరికి చేరి "మామగారూ! నేను చాలా రోజుల క్రితమే నా తల్లిదండ్రుల్నీ, ఇంటినీ విడిచి వచ్చాను. కోపం కొద్దీ ఇల్లు విడిచి వచ్చిన రీత్యా ఇన్ని రోజులూ ఏదీ ఆలోచించలేదు. ఇన్నాళ్ళాయే! ఇప్పుడెందుకో గానీ, నా భార్యని తీసుకుని నా తల్లిదండ్రుల దగ్గరికి ఓసారి వెళ్ళి రావాలనుంది. కోడల్ని వాళ్ళకి చూపించి, కొన్నిదినాలుండి, వాళ్ళని సంతోషపరచి తిరిగి ఇద్దరమూ వచ్చేస్తాం. కన్నవారి ఉసురు తగలక మానదంటారు. కాబట్టి నాకు అనుమతి నీయవలసింది" అన్నాడు.

నిషాదశెట్టి అందుకు అంగీకరించి, కూతురూ అల్లుడికి కొత్తబట్టలు నగలు బహుకరించాడు. వియ్యంకులకీ నగలూ దుస్తులతో పాటు మరెన్నో విలువైన కానుకలిచ్చి, అమ్మాయినీ అల్లుణ్ణి సాగనంపాడు.

తర్కకేసరి, అతడి భార్య అలంకారి, నిషాదశెట్టి దంపతుల దగ్గర వీడ్కొలు తీసుకొని, అభయసత్యం పట్టణానికి బయలుదేరారు. ప్రయాణపు దారిలో తర్కకేసరికి తండ్రి ఇంట తానుండగా... పనీపాటా లేకుండా జులాయిగా తిరిగిందీ, వేశ్యల ఇంట హద్దూ అదుపులేకుండా మద్యమాంసాలతో విచ్చలవిడిగా గడిపిందీ గుర్తుకొస్తోంది. తండ్రి దగ్గరుండగా ఏ పనీ చేయకుండా సోమరిగా గడిపేసాడు. ఇప్పుడు మామగారింట ఒళ్ళొంచి వ్యాపారం చేస్తున్నాడు. బుద్దిగా ఉంటున్నాడు.

గతం గుర్తుకొచ్చి తర్కకేసరి మనస్సు అడవి గుర్రంలా సానివాడ కేసి పరుగెత్తింది. క్రమంగా ‘భార్యనెలా మోసగించాలా?’ అన్న ఆలోచనలు అతడిని ఆక్రమించసాగాయి. అతడు భార్యతో "ఓనా ముద్దుల సతీ! అలంకారీ! ఈ అడవిలో దొంగలుంటారని పేరుంది. ఇన్ని నగలు వంటి మీదుంచుకొని ప్రయాణం శ్రేయస్కరం కాదు. కాబట్టి నగలన్నీ ఒలిచి మూటగట్టి నాకివ్వు. నేను జాగ్రత్త చేస్తాను" అన్నాడు.

ఆమె అలాగే చేసింది. మరుక్షణం తర్కకేసరి అలంకారిని బాటప్రక్కనే ఉన్న పాత బావిలోకి త్రోసేసి, నగలూ ఇతర విలువైన వస్తువులతో, గతంలో తాను ఆదరించిన వేశ్యల దగ్గరికి చేరాడు. అలంకారి బావిలో పడిన క్షణమే స్పృహ కోల్పోయింది. కొద్దిక్షణాల తర్వాత తేరుకొని, రక్షించమని కేకలు వేయటంతో, బాటసారులెవరో ఆమెని కాపాడారు. వాళ్ళ సాయంతో, ఎన్నో ప్రయాసలు పడి, అలంకారి తిరిగి అలకాపురిలోని తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది.

నిషాదశెట్టి... కూతురు ఒంటరిగా, దైన్యంతో తిరిగి రావటం చూసి బెదిరిపోయాడు.

"ఏమైంది తల్లీ" అనడిగాడు గాభరా పడుతూ!

"తండ్రీ! మేమిద్దరం వెళ్తూ ఉండగా దొంగల గుంపు మమ్మల్ని అటకాయించింది. నా నగలు డబ్బు అన్నీ దోచుకుంది. దొంగలు నన్ను కొట్టి బావిలోకి త్రోసి, నా భర్తని బందీగా తమ వెంట తీసుకుపోయారు. బాటసారుల సాయంతో నేనెలాగో ఇల్లు చేరగలిగాను" అంది.

తల్లిదండ్రులకి నిజం చెబితే... ‘ఒక్కగానొక్క కూతురి బ్రతుకు ఇలా అయ్యిందే’ అని వారు దుఃఖపడతారని, ఆమె జరిగిందేమీ తల్లిదండ్రులకు చెప్పలేదు. సరికదా, దొంగలని కట్టుకథలు చెప్పింది.

నిషాదశెట్టి కూతుర్ని ఓదార్చి "నువ్వు దిగులు పడకు తల్లీ! సేవకులని పంపి నీ భర్త కోసం వెతికిస్తాను" అన్నాడు. అలంకారి తల్లి, అల్లుడి క్షేమం కోరి పూజలూ వ్రతాలు చేయిస్తుండగా, తండ్రి అల్లుడి కోసం అన్వేషణ చేయిస్తున్నాడు. ఇలా కొన్నిరోజులు గడిచాయి.

ఇలా ఉండగా... తర్కకేసరి తెచ్చిన సొమ్ము ఖర్చయిపోగానే, వేశ్యలతణ్ణి తన్ని తగలేసారు. మళ్ళీ అతడి బ్రతుకు బజారు పాలయ్యింది. చేసేది లేక, తక్కుతూ తారుతూ తిరిగి అత్తగారిల్లు చేరాడు. అతడింటికి వచ్చేసరికి, సరిగ్గా ఎదురుగా భార్య అలంకారి ఉంది. అతడది ఊహించలేదు. తాను బావిలో తోసాడు గనక ఆమె అక్కడే మరణించి ఉంటుందనీ, దారిలో తాము పులివాతో, దొంగల బారినో పడ్డామని చెప్పే ప్రణాళికతో వచ్చాడు.

తీరా ఎదురుగా భార్య ఉండేసరికి గతుక్కుమన్నాడు. "ఈమె ఎలా బ్రతికి వచ్చింది? ఏమైనా గానీ... తన గురించీ, తన దురాగతం గురించీ తండ్రికి ఈ పాటికి చెప్పే ఉంటుంది. ఇప్పుడు అత్తమామలు నన్ను చంపిపాతరెయ్యటం ఖాయం" అనుకొని భయంతో వెనుదిరిగి పారిపోబోయాడు.

~~~~~~

చిలుకలు త్రికాలవేదులు ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 30]

విక్రమాదిత్యుడు విసుగు చెందకుండా, మోదుగ చెట్టు వద్దకు చేరి, మళ్ళీ భేతాళుని దించి భుజమ్మీద వేసుకుని, బృహదారణ్యం కేసి నడవ సాగాడు. యధాప్రకారం భేతాళుడు కథ ప్రారంభించాడు.

ఒకానొకప్పుడు పాటలీ పుత్రమనే నగర ముండేది. (పాటలీ పుష్పాలతో నిండి ఉన్న నగరమని దాని అర్ధం. ఇప్పటి మన పాట్నా పేరు, ఒకప్పుడు పాటలీ పుత్రమే!) విక్రమకేసరి అనే రాజు దాన్ని పరిపాలిస్తుండేవాడు. (పరాక్రమంలో సింహం వంటి వాడని ఆ పేరుకి అర్ధం.) అతడి కొక కుమారుడు. పేరు పరాక్రమ కేసరి. (ఈ పేరు అర్దమూ అదే!)

యువరాజు పరాక్రమ కేసరి అన్ని విద్యలూ అభ్యసించాడు. అన్నికళల్లో ఆరి తేరాడు. ధైర్యసాహసాలకు, పరాక్రమానికి అతడెంతో పేరుగాంచాడు. అతడొక అందమైన, పంచవన్నెల రామచిలకని పెంచుతుండేవాడు. అది మగ చిలుక. అది త్రికాల వేది కూడా! అంటే ఎవరికైనా... వారి భూత భవిష్యవర్తమానాలను చెప్పగలిగేది.

ఓరోజు, యువరాజు తన చిలుకని "ఓ పంచ వన్నెల రామచిలుకా! నువ్వు ఎవరికైనా... జీవితంలో జరిగిపోయినవీ, జరగబోయేవీ, జరుగుతున్నవి కూడా చెప్పగలవు కదా! చెప్పు. నా వివాహం ఎప్పుడు జరుగుతుంది?" అని అడిగాడు.

చిలుక కనురెప్పులల్లార్పుతూ "ఓ యువరాజా! వేదపురి అనే నగరమొకటి ఉంది. దానిని గదాధరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడికి సంతానం లేదు. దాంతో అతడు మహాశివుడి గురించి తపమాచరించాడు. శివుడు ప్రత్యక్షమై "ఓ రాజా! నీ తపస్సుకు మెచ్చాను. నీకే వరం కావాలో కోరుకో! అనుగ్రహిస్తాను" అన్నాడు.

మహాశివుణ్ణి చూసిన గదాధరుడు అమితానందంలో శివుని పరిపరి విధాల కీర్తించాడు. భక్తి పూర్వక స్వరంతో "ఓ దేవా! నాకు సంతానాన్ని ప్రసాదించు" అని కోరాడు. శివుడు "తధాస్తు" అన్నాడు. ఆ దేవదేవుని కరుణతో గదాధరునికి ఒక ఆడశిశువు కలిగింది. ఆ బిడ్డకు ‘రత్నావళి’ అని పేరుపెట్టి, అల్లారు ముద్దుగా పెంచారు రాజదంపతులు. ఆమె ఇప్పుడు యుక్త వయస్కురాలై ఉంది. ఆ యువరాణి సౌందర్యవతి, సౌశీల్యవతి.

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆమె కూడా నీకు లాగానే ఒక అందమైన పంచవన్నెల చిలుకని పెంచుచున్నది. అది సీత చిలుక! అంటే ఆడ చిలుకన్న మాట! అది కూడా నాలాగానే త్రికాల వేది.

నీలాగానే యువరాణి రత్నావళి కూడా, తన చిలుకని ‘తన వివాహమెప్పుడని’ అడిగింది. దానికా ఆడ చిలుక "ఓ అందాల రాణీ! యువతీ శిరోమణీ! పాటలీ పుత్రానికి రాజు విక్రమకేసరి. అతడి కుమారుడు పరాక్రమ కేసరి. అతడే నీకు తగిన భర్త" అని చెప్పింది.

రత్నావళి ఈ విషయాన్నంతా తండ్రి గదాధరుడికి వివరించి చెప్పింది. రాజదంపతులు ఆ అందాల భరిణెను నీకివ్వ దలిచారు. వాళ్ళంతా పాటలీ పుత్రం బయలు దేరారు. రత్నావళి పల్లకిలో ప్రయాణిస్తుండగా, రాజదంపతులు రధంలో వస్తున్నారు. మంత్రి సేనాపతుల బృందం గుర్రాలపై తరలి వస్తోంది. వాళ్ళంతా ఈ పాటికి మన నగర ద్వారానికి సమీపంలో ఉన్నారు" అని చెప్పింది.

పరాక్రమ కేసరి కిదంతా వినేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. తల్లిదండ్రుల కిదంతా తెలియ జేసాడు. విక్రమకేసరి దీనికెంతో సంతోషించి, రాణి, మంత్రులూ పరివారాన్ని తొడ్కొని గదాధరుడికీ, అతడి బృందానికీ ఘనస్వాగతం పలికాడు.

పలుకరింపులూ, పరామర్శలూ, రాచమర్యాదలూ అయ్యాక, అన్ని విషయాలు చర్చించుకొని, శుభమహుర్తం నిర్ణయించి పరాక్రమ కేసరికి, రత్నావళికి వివాహం జరిపించారు. వధూవరులు ఒకరికొకరు తీసిపోనట్లున్నారు. చిలుకా గోరింకల్లా ఉన్న జంటని అందరూ అభినందించారు. ఆశీర్వదించి మురిసి పోయారు.

పెళ్ళివేడుకల హడావుడీ పూర్తయ్యాక, ఓ రోజు వెన్నెల రాత్రి, ఏకాంత మందిరంలో ఒండొరుల సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తూ... నూతన దంపతులు పరాక్రమ కేసరి, రత్నావళి, కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రసంగవశాన సంభాషణ వారి చిలుకల మీదికి మళ్ళింది.

పరాక్రమ కేసరి "నా ప్రియసఖి! రత్నావళి! మనమింత వరకూ ఎంతో ప్రేమతో ఆనందంగా కాలం గడుపుతున్నాము. మన వివాహం మన రామచిలుకల వలన గదా జరిగింది? అవి కూడా మనలాగే ఆనందంగా ఉంటే, మనకి మరింత ఆనందంగా ఉంటుంది. నేను పెంచింది మగ చిలుక. నీవు పెంచింది ఆడ చిలుక. అవి పరస్పర మైత్రీ బంధాన్నీ, ప్రేమనీ ఆనందించేటట్లుగా, రెండింటినీ ఒకే పంజరంలో పెడదాం" అన్నాడు.

రత్నావళి ఇందుకు సంతోషంగా ఒప్పుకుంది. మరింత విశాలమైన అందమైన పంజరాన్ని తెప్పించి, అందులో రెండు చిలుకల్నీ విడిచిపెట్టారు.

మగ చిలుక తనని సమీపించేందుకు రాగానే, ఆడ చిలుక కోపంతో... ఎర్రటి ముక్కుని మరింతగా ఎర్రగా చేసుకుంటూ "ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు? అక్కడే ఆగు! మగవాళ్ళని నమ్మకూడదు" అంది.

అది వినగానే మగ చిలుక ముక్కుతో పాటు ముఖమంతా ఎర్రగా చేసుకుని "ఆ మాట కొస్తే ఆడవాళ్ళని అసలు నమ్మకూడదు"అంది. అంతే! అవి రెండూ గఁయ్యిమంటూ వాదులాడుకోసాగాయి. అప్పటికే నిద్రలోకి జారుకున్న కొత్త దంపతులు ఉలికిపాటుతో నిద్రలేచారు. "ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు?" అని ఏకకంఠంతో అడిగారు.

రెండు చిలుకలూ ఏం జరిగిందో వివరించాయి. దేని వాదన అది వినిపించింది. యువరాణీ, యువరాజుని తమ వివాదం తీర్చమని అడిగాయి. రత్నావళి, పరాక్రమ కేసరి బిత్తరపోయి విన్నారు.

చివరికి పరాక్రమ కేసరి ఆడచిలుకతో "నువ్వు మగవారిని నమ్మరాదని అనడానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.

గొంతు సవరించుకొని, ఆడ చిలుక ఇలా చెప్పసాగింది.

~~~~~~~~
కథా విశ్లేషణ:

ఈ కథలో... ఇంత వరకూ అద్భుతరసం నిండి ఉంటుంది. పంచవన్నెల రామచిలుకలు, మాట్లాడే చిలుకలు, కబుర్లు కథలు చెప్పే చిలుకలు! అందునా భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పే చిలుకలు... చిన్నారులని ఊర్రూతలూగిస్తాయి!

విరిబోణికి భర్త ఎవరు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 29]

కోవెల ఆవరణలో భర్త కోసం ఎదురు చూస్తున్న విరిబోణి, ఎంతకూ యశోవంతుడు తిరిగి రాకపోవటంతో కంగారు పడింది. ఆమె అన్న "నా ప్రియమైన చెల్లెలా! నీవు ఆందోళన చెందకు. నేను వెళ్ళి బావను పిలుచుకు వస్తాను." అని చెప్పి గుడిలోపలికి వెళ్ళాడు.

చూస్తే ఎదురుగా ఏముంది? భయానక దృశ్యం! భరించలేని దృశ్యం! తన ముద్దుల చెల్లెలి ప్రియతమ పతి తల, చెట్టు కొమ్మకు వేలాడుతోంది. శరీరం అమ్మవారి బలిపీఠంపైన పడి ఉంది. రక్తం చుట్టూ చిమ్మబడి ఉంది. ఆ దృశ్యం అతణ్ణి ఆపాద మస్తకం వణికించింది. నిన్న మొన్న పెళ్ళైన తన చెల్లెలికి, ఈ దుర్వార్త చెప్పేందుకు అతడికి మనస్సు రాలేదు. కూతురూ అల్లుళ్ళ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులని తలుచుకొని, అతడికి అంతులేని నైరాశ్యం కలిగింది.

ఎక్కడలేని తెగింపుతో, యశోవంతుడికి మాదిరి గానే, తన జుట్టునీ చెట్టు కొమ్మకి కట్టుకుని, కత్తి తీసుకొని తల నరుక్కున్నాడు. బావ గారి తల ప్రక్కనే అతడి తల వేలాడుతుండగా, మొండెమూ బావ దేహం ప్రక్కనే పడింది. రక్తం కలగలిసి పోయింది.

భర్త జాడలేదు. వెదకపోయిన అన్న జాడ కూడా లేకపోయేసరికి, విరిబోణి... ఇద్దర్ని వెదుకుతూ కోవెల లోకి ప్రవేశించింది. భయానక దృశ్యాన్ని చూసి తట్టుకోలేక పోయింది. అప్పటికే ఇద్దరూ విగత జీవులైనారు. గుండె బ్రద్దలైనంతగా దుఃఖించింది. దుఃఖాతిశయంతో ఆమె శరీరం వణుకుతోంది.

విహ్వల చిత్తయై "నా ప్రియమైన, సర్వస్వమైన భర్త మరణించాడు. ప్రేమగా చూసుకునే అన్నా మరణించాడు. ఇక నేనుండి ఏం లాభం? నా దైన్యపు ముఖమీ లోకానికెలా చూపించటం? తల్లిదండ్రుల దుఃఖాన్ని గానీ, అత్తమామల దుఃఖాన్ని గానీ ఎలా భరించటం? ఇంతకంటే చావు మేలు. అన్నా భర్తల దారిలోనే నేనూ పోయెద గాక!" అనుకున్నది.

దుఃఖాతిశయంతో, ఆవేశంతో కత్తి చేత బట్టి, శిరస్సు ఖండించుకోబోయింది. ఆ క్షణమే మెరుపు మెరిసినట్లు, భద్రకాళి ఆమె ముందు ప్రత్యక్షమైంది. (అవి ఆ రోజులు కాబట్టి, భక్తుల చావు తెగింపు చూసి, అమ్మవారు ప్రత్యక్షమైంది. ఈ కథ చెప్పేటప్పుడు పిల్లల ఆలోచన, అటు పోకుండా జాగ్రత్త తీసుకోవటం అవసరం. శక్తిమాన్ అనుకుని, మేడ పైనుండి దూకే చిన్ని హృదయాలవి! కల్పనకీ వాస్తవానికీ మధ్య రేఖ, వాళ్ళకి స్పష్టంగా కనబడదు కదా! అంత గాఢ భక్తి ఉంటే దైవదర్శనం సత్యమే కావచ్చు గాక గానీ, సామాన్య బాలకులకి అదేమో తెలియదు కదా!)

విరిబోణి, భద్రకాళి దర్శనంతో మాటలు రాక నిల్చుండి పోయింది. ఆ తల్లి విరిబోణిని వారిస్తూ "అమ్మాయీ! ఆగు! సాహసించకు! నీకేం కావాలో కోరుకో! నీవడిగిన వరాలిస్తాను" అని బుజ్జగించింది.

విరిబోణి కన్నీరు తుడుచుకుంటూ "అమ్మా! నా భర్తనీ, అన్ననీ పునర్జీవితుల్ని చెయ్యి. అంతకంటే కోరదగిన కోరిక లేదు నాకు" అంది.

భద్రకాళి "అమ్మాయి. అలాగే అనుగ్రహిస్తాను. వీరి శరీరాలకు తలలు చేర్చి, ఈ మంత్రజలం చల్లి, విభూది పూసి, ఈ బెత్తంతో తట్టు" అంటూ మంత్రజలాన్ని, విభూదిని, బెత్తాన్ని ఇచ్చి అంతర్ధాన మయ్యింది.

చెప్పలేనంత ఉద్విగ్నతతో... విరిబోణి, చెట్టుకు వేలాడుతున్న తలలు రెండింటినీ, నేలపై పడి ఉన్న మొండేలతో చేర్చి, మంత్రజలం చల్లింది. విబూది పూసి బెత్తంతో తట్టింది.

భద్రకాళి కరుణతో, ఇరువురూ ప్రాణాలతో లేచి కూర్చున్నారు. కానీ ఏం జరిగిందో గమనించేసరికి ఆమె నిర్ఘాంత పోయింది. ఉద్విగ్నతతోనూ, ఆతృతతోనూ... విరిబోణి, అన్న శరీరానికి భర్త శిరస్సునీ, భర్త శరీరానికి అన్న శిరస్సునీ అంటించింది.

ఇదీ కథ!

ఓ విక్రమార్క మహారాజా! నీవు మహిలోని రాజులందరిలో ఉత్తమోత్తమడవు. ఇప్పుడు పునర్జీవితులైన వారిలో, ఎవరు విరిబోణి భర్త?" అని అడిగాడు భేతాళుడు.

విక్రమాదిత్యుడు, కోర మీసాల మాటున, చిరునవ్వుతో పెదవులు మెరుస్తుండగా "భేతాళుడా! పునర్జీవితులైన తర్వాత, ఎవరు ఆమెని చూసి తన భార్యగా గుర్తిస్తారో.... అతడే ఆమె భర్త, ఎవరామెని చెల్లెలిగా గుర్తిస్తారో... అతడే ఆమె అన్న!"అన్నాడు.

భేతాళుడు తృప్తిగా తలాడిస్తూ, మౌనభంగమయ్యింది గనుక మాయమై పోయాడు.

కథ విశ్లేషణ:

సాధారణంగా.... జ్ఞాపకశక్తి, గుర్తుపట్టటం, గుర్తుంచుకోవటం మేధస్సుకు సంబంధించినవనీ,
ప్రేమ, ఆత్మీయత, కృతజ్ఞత వగైరా భావనలు హృదయానికి సంబంధితవనీ అంటారు.
మేధస్సుకు మెదడునీ,
ప్రేమానుభూతులకి హృదయాన్ని చిహ్నంగా చెబుతారు.

ఆ విధంగా చూస్తే గుండె i.e. హృదయం దేహంలో ఉంటే, మెదడు తలలో ఉంటుంది. అలాంటి చోట... దేహాన్ని భర్తగా గుర్తించాలా, తలని భర్తగా గుర్తించాలా?

విరిబోణి వైపు నుండి చూస్తే... ఈ మీమాంస అంతా ఉంటుంది. అయితే, విక్రమాదిత్యుడు విరిబోణి పరంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆమె భర్తా, అన్నల పరంగా చెప్పాడు. ఎవరామెని భార్యగా గుర్తిస్తారో అతడామె భర్త, ఎవరామెని సోదరిగా గుర్తిస్తారో అతడామె అన్న! పేచీ లేని పరిష్కారం కదా! అదీ... విక్రమార్కుడి సునిశిత ఆలోచనా పటిమ!

ఇలాంటి చమత్కార పూరిత కథలు విన్నప్పుడు పిల్లలు ఎంత ఉత్తేజమవుతారో! వాళ్ళని, అన్నిరకాలుగా ఉర్రూతలూగిస్తాయి ఇలాంటి కథలు! సునిశిత ఆలోచనా విధానం అప్రయత్నంగానే అలవడుతుంది.

~~~~~~~~~

విరిబోణి వివాహం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 28]

విక్రమాదిత్యుడు మరోసారి భేతాళుని బంధించి, భుజమ్మీద వేసుకొని నడుస్తుండగా, భేతాళుడు కథ ప్రారంభించాడు.

"విక్రమాదిత్యా! ఇది నేను నీకు చెబుతున్న కథలలో అయిదవది. సావధనుడవై విను" అంటూ కొనసాగించాడు.

ఒకానొకప్పుడు, సోమవేదిక అనే నగరముండేది. ఆ నగరాధీశుడి పేరు నీతివంశకేతు. [నీతే వంశపు జండాగా గలవాడు అని అతడి పేరుకు అర్ధం.] ఆ రాజెంతో మంచివాడు, సమర్ధుడు.

అతడు భద్రకాళీ భక్తుడు. తమ కులదేవతగా ఆ తల్లిని కొలిచేవాడు. అతడు భద్రకాళీ మాతకు గొప్ప ప్రాకారాలతో, గోపురాలతో కూడిన అద్భుత దేవాలయాన్ని నిర్మించాడు. బంగారు రధాన్ని, రత్నాభరణాలని సమకూర్చాడు. ప్రతీ ఏడాది, అమ్మ వారికి ఉత్సవాలు, పండుగలూ నిర్వహించేవాడు.

ఒక ఏడాది, సోమవేదిక లోని కాళీ మాత ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. చుట్టుప్రక్కల గ్రామాల నుండే గాక, ఎంతో దూరం నుండి కూడా, ఎందరో ప్రజలు ఆ జాతరకు వచ్చారు. అంతా కోలాహలంగా ఉంది. చిత్రవిచిత్ర వస్తువులు ప్రదర్శించేవాళ్ళు, అమ్మజూపేవాళ్ళు, రకరకాల తినుబండారాలు! అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు! ఇసుకవేస్తే రాలనంత మంది జనం ఉన్నారక్కడ! చెక్క భజనలు, కోలాటాలు, రంగుల రాట్నాలు, ఆట వస్తువులు... పానీయాలు... అరుపులూ కేకలు!

ఎక్కడ చూసినా జనమే! వాళ్ళల్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమె పేరు విరిబోణి. [పువ్వువంటి సుకుమారమైన దేహం కలది అని ఆమె పేరుకు అర్ధం.] అక్కడికి యశోవంతుడనే యువకుడూ వచ్చాడు. [కీర్తిగలవాడని అర్ధం.] యశోవంతుడు విరబోణిని చూశాడు. తొలి చూపులోనే ప్రేమలో కూరుకుపోయాడు.

ఎలాగైనా ఆమెనే వివాహమాడాలని నిర్ణయించుకున్నాడు. ఆమె దృష్టిలో పడాలని, కొన్ని చిరుప్రయత్నాలు చేశాడు. లాభం లేకపోయింది. అతడు గుడిలోకి వెళ్ళి, అమ్మవారిని దర్శించుకొని "తల్లీ! భద్రకాళీ! నువ్వు భక్తుల పాలిట కల్పవల్లివి. మా కోర్కెలు తీర్చే అమ్మవు. అమ్మా! నే మనస్సు పడ్డ పిల్ల, నన్ను ప్రేమించేటట్లు, ఆమెతో నాపెళ్ళి అయ్యేటట్లు అనుగ్రహించు. అదే జరిగితే, ఓ తల్లీ! నా తల నీకు సమర్పించుకుంటాను. ఇదిగో నా తల కత్తిరించుకొని, నాదేహం నీ ముందు బలిపీఠంపై పెడతానని ప్రమాణం చేస్తున్నాను. దయ చూడగదే తల్లీ!" అని మొక్కుకున్నాడు.

తర్వాత యశోవంతుడు తన తల్లిదండ్రుల దగ్గరికి చేరి, వాళ్ళకి విరిబోణిని చూపించి, "అమ్మా!నాన్న! ఆ పిల్ల నాకు నచ్చింది. ఆమెతోనే నా పెళ్ళి జరిపించండి" అని చెప్పాడు. వాళ్ళకీ ఆ పిల్ల నచ్చింది. వాళ్ళు ఆ పిల్ల పేరూ, ఊరూ తల్లిదండ్రుల వివరాలు సేకరించారు.

జాతర ముగిసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళాక, ఓ మంచిరోజు చూసుకుని, యశోవంతుడి తల్లిదండ్రులు ఇతర పెద్దల్ని తీసుకుని, విరిబోణి ఉండే గ్రామానికి వెళ్ళారు. విరిబోణి ఇంటికి వెళ్ళి, ఆమె తల్లిదండ్రులకి తమని తాము పరిచయం చేసుకున్నారు. ఆమాటా ఈమాటా అయ్యాక, తమ కుమారుడు యశోవంతుడికి విరిబోణి నివ్వాల్సిందిగా అడిగారు. విరిబోణి తల్లిదండ్రులకీ సంబంధం నచ్చటంతో అంగీకరించారు. అందరూ ఎంతో సంతోషించారు.

ఒక మంచి ముహుర్తాన... యశోవంతుడికీ, విరిబోణికీ వివాహం జరిగింది. బంధుమిత్రులంతా హాజరై వధువరులని దీవించారు. వివాహ విందు, ఉత్సవాలు ముగిసాక, విరిబోణి, సోమవేదికలోని అత్తగారింటికి కాపురానికి వచ్చింది. యశోవంతుడికి, భార్య విరిబోణితో జీవితం స్వర్గసమంగా ఉంది. విరిబోణి అందమైనదీ, మంచి ప్రవర్తన కలదీ కావటంతో, అందరి మనస్సులూ చూరగొంది. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి.

ఈ విధంగా కొన్ని నెలలు గడిచాక, విరిబోణి తల్లిదండ్రులు, రానున్న పెద్దపండుగకి కూతుర్ని అల్లుణ్ణీ పిలిచి, కొన్నాళ్ళు ఇంట నుంచుకొని ఆనందించాలనుకున్నారు. వాళ్ళు తమ పెద్దకొడుకుని పిలిచి "నాయానా! నీవు సోమవేదిక పురానికి వెళ్ళి, నీ చెల్లెలైన విరిబోణిని, ఆమె భర్తనీ పిలుచుకు రా! రానున్న పండగకి ఇంట అల్లుడూ కూతురితో ఆనందంగా గడపాలని మా కోరిక" అన్నారు.

అతడు సరేనని సోమవేదిక చేరి, యశోవంతుడికీ, అతడి తల్లిదండ్రులకీ తమ ఆహ్వానం అందించాడు. వాళ్ళూ పండుగకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అత్తగారింటికి బయలుదేరే లోపల, రాక రాక వచ్చిన బావమరిదికి, పట్నంలోని వింతలూ విశేషాలూ చూపించాలనుకున్నాడు యశోవంతుడు. ఊరంతా తిప్పి చూపించాడు.

ప్రయాణానికి ముందు రోజున... యశోవంతుడు, భార్యనీ, బావమరిదినీ వెంటబెట్టుకొని భద్రకాళి కోవెలకి వెళ్ళాడు. పూజాదికాలు ముగించుకున్నాక, ఆలయ ఆవరణలో ఓ చెట్టు క్రింద కూర్చున్నారు.

యశోవంతుడు "ఒక్క నిముషం! భద్రకాళీ తల్లికి మొక్కటం మరిచి పోయాను. ఇప్పుడే వస్తాను" అని చెప్పి గుడిలోకి వెళ్ళాడు.

ఆలయంలోకి వెళ్ళిన యశోవంతుడు, ఆ తల్లి ముందు నిలబడి "ఓ కాళీ మాతా! నేను కోరినట్లే విరిబోణితో నాపెళ్ళి జరిపించావు. తల్లీ! నా మాట నిలబెట్టుకుంటాను. ఇదే నా తలనిచ్చుకుంటున్నాను నీకు!" అంటూ... అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉన్న మర్రిచెట్టు కొమ్మకి తన జుట్టు కట్టుకున్నాడు. బొడ్డున దోపుకున్న కత్తి తీసుకుని, తన దేహం అమ్మవారి ముందున్న బలిపీఠం మీద పడేటట్లుగా తల నరుక్కున్నాడు. రక్తం ధార గడుతూ అతడి తల చెట్టు కొమ్మకు వ్రేలాడుతోంది.

~~~~~~~~~

జ్ఞాని, సూత్రజ్ఞుడు, శూరుడు - ఎవరు గొప్ప?[భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 27]

విక్రమాదిత్యుడు మళ్ళీ మోదుగ వృక్షాన్ని చేరాడు. అప్పటికే భేతాళుడు శవరూపంలో ఆ చెట్టు కొమ్మకి తల్లక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. ఒక్క క్షణం విక్రమాదిత్యుడికి ఆశ్చర్యం వేసింది. అయినా ప్రయత్నం విడిచిపెట్టలేదు. మరోసారి చెట్టెక్కి శవాన్ని దించి భుజమ్మీద వేసుకుని బృహదారణ్యంకేసి నడక ప్రారంభించాడు.

యధాప్రకారం, భేతాళుడు కథ ప్రారంభిస్తూ "విక్రమాదిత్య మహారాజా! ముందు కథ విను" అంటూ కొనసాగించాడు.

పూర్వకాలంలో మచ్చిలి అనే పట్టణం ఒకటి ఉండేది. అక్కడ అర్జునస్వామి అని ఓ ప్రముఖ బ్రాహ్మణుడుండే వాడు. అతడికొక కుమార్తె. ఆమె ఎంతో అందమైనది, అణకువ కలిగినది.

అర్జునస్వామి కుమర్తెని కంటికి రెప్పవలె కాపాడుతూ, ప్రేమగా పెంచాడు. ఒక రోజు వారి పట్టణానికి, ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చారు. వాళ్ళు అర్జునస్వామి కుమార్తె యొక్క అందం గురించి, మంచితనం గురించి విన్నారు.

అర్జునస్వామిని కలిసి కన్యాదానం చెయ్యమని అడిగారు. అర్జునస్వామి, వారిలో ఒకరికి తన బిడ్డనిచ్చి పెళ్ళి చెయ్యగలనన్నాడు. అంతలో అక్కడికి ఓ రాక్షసుడొచ్చాడు. అమాంతం ఆ బ్రాహ్మణుడి కుమార్తెని అపహరించుకు పోయాడు.

ఆమె తల్లిదండ్రులైన అర్జునస్వామి, అతడి భార్య గుండెలు బాదుకుని ఏడ్చారు. ముగ్గురు యువకులకు కూడా చాలా దుఃఖం కలిగింది.

వారిలో మొదటి వాడి పేరు జ్ఞాని. రెండవ వాడి పేరు సూత్రజ్ఞుడు. మూడవ వాడి పేరు శూరుడు. ముగ్గురూ కూడా సార్ధక నామధేయులు. జ్ఞాని ధ్యానంలో కూర్చుని, మనస్సుని ప్రపంచమంతా అన్వేషించేందుకు నియోగించాడు. జ్ఞాన నేత్రంతో ప్రపంచంలో తాను కోరుకున్న ఏ ప్రదేశాన్నైనా దర్శించగల విద్య అతడికి తెలుసు. (ఇప్పటి మన లైవ్ టెలికాస్ట్ చెయ్యగల ఎక్విప్డ్‌వ్యాన్ కున్న శక్తి వంటిదన్న మాట.)

ఆ శక్తితో జ్ఞాని (మొదటి యువకుడు) రాక్షసుడి నివాసం ఎక్కడో తెలుసుకుని, చెప్పాడు. రెండవ యువకుడు సూత్రజ్ఞుడు (అంటే అన్ని సూత్రాలు తెలిసిన వాడని అర్ధం.) తన విద్యాపరిజ్ఞానంతో ఒక రధాన్ని నిర్మించాడు. (ఇప్పటి మన ఇంజనీర్ల మాదిరిగా నన్న మాట.)

"ఈ రధం నేలమీద, నీటి మీద, గాలిలో కూడా మన ఆజ్ఞాననుసరించి ప్రయాణించగలదు. ఈ రధం మీద వెళ్ళి, ఆమెని కాపాడగల వారున్నారా? నేను రధాన్ని నిర్మించగలను గానీ, రాక్షసుణ్ణి యెదిరించలేను" అన్నాడు.

జ్ఞాని కూడా "నేను రాక్షసుడుండే చోటు గురించి చెప్పగలనే గానీ, అక్కడికి వెళ్ళి రాక్షసుడితో పోరాడలేను" అన్నాడు.

మూడవ యువకుడైన శూరుడు "ఓ సూత్రజ్ఞా! నేను వెళ్ళగలను. ఈ రధాన్ని యెలా నడిపించాలో నాకు తెలియజెయ్యి" అన్నాడు. సూత్రజ్ఞుడు శూరుడికి రధాన్ని నడిపించే విధివిధానాలని వివరించాడు. జ్ఞాని రాక్షసుడి నివాసం గురించిన ఆనవాళ్ళన్ని చెప్పాడు.

శూరుడు తన ఆస్త్ర శస్త్రాలన్నిటినీ తీసుకుని, కవచధారియై రధం యెక్కాడు. యెకాయకి రాక్షసుడి నివాసం చేరి, రాక్షసుడితో తలపడ్డాడు. హోరాహోరీ జరిగిన ఆ పోరులో చివరికి రాక్షసుణ్ణి హతమార్చాడు. అర్జునస్వామి కుమార్తెని రధమెక్కించుకొని మచ్చిలి పట్టణానికి తిరిగి వచ్చాడు. అందరూ ఎంతగానో ఆనందించాడు.

భేతాళుడీ కథ చెప్పి "ఓ ఉజ్జయినీ రాజ్యాధిపతీ! విక్రమాదిత్య మహారాజా! నువ్వు చెప్పు! జ్ఞాని, సూత్రజ్ఞుడు. శూరుడు... ఈ ముగ్గురు బ్రాహ్మణ యువకులలో, ఎవరు అర్జునస్వామి కుమార్తెని వివాహమాడేందుకు అర్హులు?" అనడిగాడు.

విక్రమాదిత్యుడు "ఓ భేతాళా! జ్ఞానీ, సూత్రజ్ఞుడు... ఇద్దరూ తమతమ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, విద్యలనీ ఉపయోగించి ఆ యువతిని కాపాడారు. అయితే ప్రమాదపు దరిదాపులకి పోలేదు. కానీ, శూరుడు తన ప్రాణాలను ఫణంగా పెట్టి, రాక్షసుడితో పోరాడి ఆమెని కాపాడాడు. కాబట్టి అతడే ఆమెని వివాహమాడటానికి అర్హుడు" అన్నాడు.

ఎప్పుడైతే విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పాడో, ఆ క్షణమే భేతాళుడు మాయమయ్యాడు.

కథ విశ్లేషణ:

ఈ కథలో... జ్ఞాని, సూత్రజ్ఞుల విద్యాకౌశలమూ గొప్పవే! జ్ఞానంతో, సూత్రజ్ఞత(అంటే సాంకేతికత!)తో ఎన్నో విషయాలు కనిపెట్టవచ్చు. టీవీ, కంప్యూటర్, రాకెట్, శాటిలైట్... ఇలా ఎన్నో వస్తువుల్ని కనిపెట్టవచ్చు. కానీ వారికంటే ధైర్యవంతుడు గొప్పవాడు. జ్ఞానం, టెక్నాలజీల కంటే ధైర్యం గొప్పది. ధైర్యం ఉన్నవాడు... లక్ష్యం కోసం ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టగలడు. ధైర్యం ఉన్నవాడు... సత్యాన్ని చూడగలడు, సత్యాన్ని పలక గలడు, సత్యం కోసం జీవించగలడు.

ఎంత తెలివితేటలున్నా, ఎంత శాస్త్రసాంకేతిక ప్రతిభా సామర్ధ్యాలతో పాటు, కళాకౌశాలాలు ఉన్నా, ధైర్యం లేకపోయినట్లయితే, అలాంటి వాళ్ళు... డబ్బున్న వాణ్ణి చూసో, బలమున్న వాణ్ణి చూసో... భయపడిపోయి, బానిస బ్రతుకు కయినా సిద్ధపడతారు. అంతేగానీ, ఎదురుతిరిగి పోరాడరు.

కాబట్టి... తెలివితేటల్ని, ప్రతిభాసామర్ధ్యాలని తక్కువ చేయరాదు గానీ, వాటితో బాటు, వాటికంటే ఎక్కువగానూ... ధైర్యాన్ని అలవరుచుకోవాలనీ, ధైర్యవంతుడే కథానాయకుడనీ ఈకథ పిల్లలకి చెబుతుంది. వాళ్ళల్లో ధైర్యశౌర్యాల్ని ప్రేరేపిస్తుంది.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes