విక్రమాదిత్యుడు విసుగు చెందకుండా మరోసారి మోదుగ వృక్షమెక్కి, భేతాళుండిన శవాన్ని దించి, భుజాన వేసుకొని, జ్ఞానశీలుడి కిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు బృహదారణ్యం కేసి నడవసాగాడు.
భేతాళుడూ విసుగు చెందకుండా మరో కథ ప్రారంభించాడు. "విక్రమాదిత్య మహారాజా! ఇది ఏడవ కథ" అంటూ కొనసాగించాడు.
ఒకప్పుడు శరభేశ్వరం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు సుగ్రీవుడు. అతడు మంచివాడు, సమర్ధుడు. రాజధాని నగరమైన శరభపురంలో వీరవర్ధనుడు అనే బ్రహ్మణుడుండేవాడు. అతడు వేద విద్యలతో పాటు క్షాత్రవిద్యలూ నేర్చిన వాడు. గొప్ప యోధుడు కూడా!
ఒక రోజు వీర వర్ధనుడు, రాజు సుగ్రీవుడి సభకు పోయి, తన అర్హతకు తగిన కొలువు అడిగాడు. సుగ్రీవుడు అతడి ముఖ వర్చస్సూ, మాటతీరూ, వినయ శీలాలకు ముచ్చటపడి, తన ఆంతరంగిక రక్షక సిబ్బందిలో ఒకరిగా నియమించాడు. నెలకు వెయ్యి బంగారు నాణాల జీతమూ నిర్ణయించాడు.
వీరవర్ధనుడు తన జీతాన్ని నాలుగు భాగాలుగా చేసాడు. ఒక భాగం, అంటే రెండువందల యాభై బంగారు నాణాలతో భగవంతుడిపై భక్తితో గుడులకూ, పూజలకూ వెచ్చించే వాడు. మరో భాగం కవి పండితులకూ, ఆశ్రితులకు వెచ్చించేవాడు. మరో భాగంతో పేదసాదలకు దాన ధర్మాలు చేసేవాడు. నాలుగో భాగంలో కుటుంబాన్ని పోషించే వాడు. అతడి ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఉండేవాళ్ళు.
ఇలా రోజులు గడుస్తుండగా, ఒక రోజు... వీరవర్ధనుడు విధి నిర్వహణలో ఉన్నాడు. అది రాత్రి సమయం. అతడు రాజు సుగ్రీవుడి అంతఃపుర రక్షణలో ఉన్నాడు. ఆ సమయంలో జడివాన ప్రారంభమైనది. ఈదురు గాలి... ఉరుములు... మెరుపులు! కుంభవృష్టి కురుస్తోంది.
క్షణాల్లో పరిస్థితి ప్రళయ భీకరంగా మారింది. పెనువృక్షాలు కూడా చిగురు టాకుల్లా ఊగిపోతున్నాయి. ఇంతలో నగరం వెలుపలి నుండి బిగ్గరగా ఏదో ధ్వని వినిపించింది. అది హృదయవిదారకంగా ఉంది. సుగ్రీవుడు "ఏమిటా శబ్ధం? ఎవరైనా వెళ్ళి అదేమిటో తెలుసుకుని రాగలరా?" అని అడిగాడు.
అతడి అంగరక్షకులలో అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. వీర వర్ధనుడు మాత్రం స్థిరమైన కంఠంతో "చిత్తం మహారాజా! నేనందుకు సిధ్దంగా ఉన్నాను" అన్నాడు. సుగ్రీవుడు సరే చూచి రమ్మన్నాడు.
వీరవర్ధనుడు తన ఆయుధాలను తీసుకుని తక్షణమే బయలు దేరాడు. రాజు సుగ్రీవుడికీ కుతుహలంగా ఉంది. దాంతో అతడు వీరవర్ధనుడి వెనకే అతణ్ణి అనుసరించ సాగాడు. వీరవర్ధనుడిదేమీ గమనించలేదు.
అతడు నేరుగా నగర ద్వారం చేరాడు. చుట్టూ పరిశీలిస్తూ ద్వారం దాటి నగరం బయటికి వచ్చాడు. అక్కడ ఓ స్త్రీ కూర్చుని బిగ్గరగా రోదిస్తోంది.
అతడామెని "అమ్మా! ఎవరు నీవు? నీ పేరేమిటి? నీ నివాసమేది? ఎందుకిలా దుఃఖిస్తున్నావు?" అనడిగాడు.
ఆమె అతడివైపు పరిశీలనగా చూస్తూ "ఓ బ్రాహ్మణోత్తమా! నేనీ నగర దేవత శరభేశ్వరిని. ఈ రాజ్యాధీశుడు సుగ్రీవుడి మరణం ఇక మూడు రోజులలో సంభవించనున్నది. అతడు సమర్ధుడూ, పిన్న వయస్కుడు. అతడి మరణానంతరం, ఈ రాజ్యమేమి కానున్నదో? అది తలచుకు దుఃఖిస్తున్నాను" అంది.
వీరవర్ధనుడు "అమ్మా! నీవీ నగర ప్రజలందరికీ తల్లివి. ఈ రాజ్యమాతవు. ఈ ప్రమాదం నుండి మహరాజుని కాపాడగల మార్గమేదీ లేదా? తల్లీ! దయతో చెప్పగలవు" అని ప్రార్ధించాడు.
శరభేశ్వరి "నాయనా! ప్రమాదాన్ని నివారించగల వ్యక్తి ఉంటే, దానికొక మార్గముంది" అంది. వీరవర్ధనుడు "తల్లీ! సెలవివ్వు! నీవు ఆశీర్వదిస్తే దాన్ని నేను నెరవేర్చగలను. నీవు నన్ను దీవిస్తే అసాధ్యమే ఉండదు. అందుచేత దయ ఉంచి తల్లీ, నాకా మార్గం ఉపదేశించు" అన్నాడు.
శరభేశ్వరి "వీర వర్ధనా! మహరాజు దీర్ఘాయువు కలిగి ఉండాలంటే, శరభపురంలో నివసించే 16 ఏళ్ళ బాలుడిని దుర్గామాతకి బలిగా ఇవ్వాలి. దుర్గా దేవి కోవెల ఈ సమీపంలోనే ఉంది. రాజు ప్రాణాలు కాపాడాలంటే ఇదొక్కటే మార్గం" అంది.
వీరవర్ధనుడు "తల్లీ! ఆ ప్రకారమే చేసేదగాక!" అన్నాడు. వెనుదిరిగి ఇంటికి పోయాడు. అతడికి 16 ఏళ్ళ పుత్రుడున్నాడు. అతడు కుటుంబ సభ్యులకు రాజుకు రానున్న మరణం గురించి, దేశానికి వాటిల్లే ప్రమాదం గురించీ చెప్పాడు. "దాన్ని నివారించటం మన బాధ్యత!" అన్నాడు. అందరూ అతడి మాటని సమర్ధించారు.
అతడు తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని దుర్గామాత గుడికి వెళ్ళాడు. అక్కడ పూజాదికాలన్నీ భక్తి శ్రద్ధలతో చేశాడు. భార్యా బిడ్డలు దేవికి నమస్కరిస్తుండగా, తన 16 ఏళ్ళ పుత్రుడి తలనరికి బలిపీఠంపై ఉంచాడు.
క్షణంలో జరిగిన ఆ సంఘటనకి అతడి భార్య, మిగిలిన పిల్లలు విభ్రాంతి పడి చూడసాగారు. వీరవర్ధనుడేమీ మాట్లాడలేదు. అతడి భార్యాబిడ్డలు ఒక్కసారిగా పెను దుఃఖానికి గురయ్యారు. తలా మొండెం విడిపడి ఉన్నపిల్లవాణ్ణి చూసి, గుండె చెదిరి ఒక్కమ్మడిగా అందరూ ప్రాణాలు విడిచారు. వీరవర్ధనుడు ఏకధారగా శోకించాడు.
దుర్గామాత వైపు తిరిగి "తల్లీ! ఈ దేశపు పౌరులుగా, దేశాన్ని కాపాడుకోవటం మా ధర్మం. రాజుకు అంగరక్షకుడిగా ఆయన ప్రాణాలు కాపాడటం నాకు సేవాధర్మం. అయితే భార్యాబిడ్డలనూ, తల్లిదండ్రులనూ కోల్పోయి, ఒంటి బ్రతుకు నేను ఈడ్చజాలను. నా ప్రాణాలూ తీసుకో!" అంటూ దేవి ముందు తన తల నరుక్కున్నాడు.
రాజు సుగ్రీవుడిదంతా మాటున నిలబడి చూస్తూనే ఉన్నాడు. అతడికి చాలా బాధ కలిగింది. తన కోసం, దేశం కోసం, ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోవటం చూసి పరితాపం చెందాడు. దుర్గాదేవి సన్నిధి చేరి "ఓ తల్లీ! ఇదే నా తల తీసుకో!" అంటూ ఖడ్గమెత్తి కంఠం నరుక్కోబోయాడు.
తక్షణమే మెరుపు మెరిసినట్లు, అతడి కళ్ళ ముందు దుర్గాదేవి ప్రత్యక్షమైంది. అమె రాజుని దీర్ఘాయువుగా దీవించి, వీరవర్ధనుడి కుటుంబాన్నంతటినీ పునర్జీవితులని చేసింది. వాళ్ళు తనని గమనించే లోగానే, రాజు సుగ్రీవుడు అక్కడి నుండి తప్పుకున్నాడు. ఏమీ తెలియనట్లుగా నగరానికి తిరిగి వచ్చాడు. కుటుంబంతో సహా వీరవర్ధనుడు దుర్గామాతకు మొక్కుకుని ఇంటికి తిరిగి వచ్చాడు.
మర్నాటి ఉదయం, రాజు సభలో "వీర వర్ధనా! రాత్రి నీవు నగర బాహ్యం నుండి వస్తున్న ధ్వని ఏమిటో తెలుసుకునేందుకు వెళ్ళావు కదా? దాని గురించి ఏం తెలుసుకున్నావు?" అనడిగాడు.
వీరవర్ధనుడి "మహారాజా! నేనక్కడికి వెళ్ళేసరికి ఓ స్త్రీ అక్కడ రోదిస్తూ ఉంది. నేనెంత అడిగినా ఆమె జవాబివ్వలేదు. అంతే! ఇంత కంటే ఏమీ లేదు" అన్నాడు.
వీరవర్ధునుడి దేశభక్తికీ, ప్రభుభక్తి కీ, నిజాయితీకీ సుగ్రీవుడెంత గానో సంతోషించాడు. నిష్కామపూరితమైన అతడి విధి నిర్వహణ, త్యాగశీలత చూసి ముగ్ధుడయ్యాడు.
సభికుల వైపు తిరిగి "నా ప్రియమైన సభాసదులారా! ఈ వీర వర్ధనుడు నా ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలని, తన కుటుంబ సభ్యుల ప్రాణాలని త్యాగం చేసాడు. అలాగయ్యీ, కనీసం నా మెప్పుకోసం కూడా, జరిగింది చెప్పాలనుకోలేదు. నిజంగా ఇతడు ఉత్తముడు" అంటూ... రాత్రి జరిగిందంటా వివరించాడు.
వీరవర్ధనుణ్ణి ఎంతగానో కొనియాడి, సత్కరించాడు. సభికులంతా కూడా వీరవర్ధనుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు.
భేతాళుడు ఈ కథ చెప్పి "విక్రమాదిత్య రాజేంద్రా! ఇదీ కథ! ఈ కథలో వీరవర్ధనుడు, రాజు సుగ్రీవుడు... ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు?" అని ప్రశ్నించాడు.
విక్రమాదిత్యుడు "నిశ్చయంగా రాజు సుగ్రీవుడు! ఎందుకంటే - వీర వర్ధనుడు రాజుకు అంగరక్షకుడు. రాజు ప్రాణాలను తన సర్వస్వం ధారపోసి అయినా కాపాడవలసిన విద్యుక్త ధర్మం కలవాడు. అతడూ అతడి కుటుంబమూ అందుకోసమే పోషించబడుతోంది. దేశరక్షణకు ప్రాణాలు అర్పించటం ప్రజల ధర్మం. అయితే, రాజు సుగ్రీవుడు తన ప్రజలలో ఒకరైన వీరవర్దనుడి కుటుంబ సభ్యుల మృతికి కలత చెంది, తన ప్రాణాలు త్యాగం చేసేందుకు సిద్దపడ్డాడు. అందుచేత నిశ్చయంగా రాజు సుగ్రీవుడు గొప్పవాడు" అన్నాడు.
అంతే! గలగలా నవ్వుతూ భేతాళుడు విక్రమాదిత్యుడు భుజమ్మీద నుండి మోదుగ వృక్షం మీదికి ఎగిరిపోయాడు. విక్రమాదిత్యుడు చిరునవ్వు చిందిస్తూ భుజాలెగరేసాడు.
వెనుతిరిగి మోదుగ చెట్టు వైపు అడుగులేసాడు.
~~~~~~
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి