RSS
Wecome to my Blog, enjoy reading :)

మంత్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 43]

నీతి వర్ధనుడు తన దేశాటన విశేషాలన్నిటినీ వివరించాడు. వర్తక శ్రేష్ఠితో స్నేహం, సముద్ర ప్రయాణం, తుపానులో దారి తప్పి కనీవినీ ఎరగని దీవికి చేరటం, అక్కడి ఆలయం, అందులోని అపురూప సుందరి గురించీ… ఏదీ దాచకుండా పూసగుచ్చినట్లు వర్ణించాడు.

రాజు వంశమార్గుడికి ఆ దీవిని చూడాలనే కోరిక కలిగింది. ఓ రోజు, నీతి వర్ధనుణ్ణి వెంటబెట్టుకుని, తగిన సిబ్బందితో నౌకా ప్రయాణం ప్రారంభించి, గతంలో నీతి వర్ధనుడు చేరిన దీవికి ప్రయాణమయ్యారు. కొన్నిరోజుల తర్వాత ఆ దీవికి చేరారు.

రాజు పరివారంతో గుడిలోకి ప్రవేశించాడు. అద్భుతమైన శిల్పాలతో అలరారుతున్న కోవెల అది. ఆవరణలో చెట్టు క్రింద నిదురిస్తున్న లావణ్య రాశిని చూశాడు రాజు. ఆమె చాలా అందంగా ఉంది. రాజుకి ఆమె పట్ల అనురాగం కలిగింది.

అలికిడికి నిద్ర లేచిన ఆ యువతి, రాజుని చూసి ఆశ్చర్య పోయింది. రాజు వంశమార్గుడు తీయని మాటలతో తన ప్రేమను ఆమెకు తెలిపాడు. అతడి మాట తీరుకు, గంభీరమైన అతడి రూపానికీ ఆమె ముగ్ధురాలైంది. అంగీకార సూచకంగా ఆమె కళ్ళు మెరిసాయి.

తనలో ‘ఇతడు గొప్ప చక్రవర్తై ఉంటాడు. ఇతడి రూపురేఖ మన్మధుణ్ణి, రాచఠీవి దేవేంద్రుణ్ణి తలపిస్తున్నాయి’ అనుకొంది.

మెల్లిగా తలెత్తి “ఓ రాజా! నీవు రాజులలో ఇంద్రుడి వలె ఉన్నావు. నేను నీ ప్రేమని తిరస్కరించినట్లయితే, ఇంత అందమైన శరీరం కలిగి ఉండీ నిరర్ధకమే! అయితే, నీవు కొంత సమయం వేచి ఉండక తప్పదు. రానున్న అష్టమి లేదా అమావాస్య వరకూ వేచి ఉండగలవు” అంది.

అప్పటి వరకూ రాజు తన పరివారంతో కోవెలలోని దుర్గామాతని ఆరాధిస్తూ, ఆ యువతితో తీయని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసాడు. అష్టమి రానే వచ్చింది.

ఆమె కోవెలలో ఒక వత్రమాచరింప ప్రారంభించింది. అందుకోసం గుడి ఆవరణలోని పవిత్ర పుష్కరిణిలో స్నానానికి వెళ్ళింది. ఆ కోనేటిలో కలువలూ, తామరలూ ఉన్నాయి. నీరు స్వచ్ఛంగా ఉంది. సన్నని అలలతో మనోహరంగా ఉంది.

రాజు “నీటిలో పసిబిడ్డని ఒంటరిగా విడిచి పెట్టరాదు. అదే విధంగా… అందమైన యువతినీ ఏ వేళలోనూ ఒంటరిగా ఉంచరాదు” అనుకొని, కత్తి చేతబూని, ఆమెకు కనబడకుండా ఆమెకి రక్షణగా ఉన్నాడు.

అంతలో… భీకరమైన శబ్దం వచ్చింది. అదేమిటో గమనించే లోగానే, ఓ భీకరాకారుడైన రాక్షసుడు వచ్చాడు. అమాంతం ఆమెని ఎత్తి నోట్లో పెట్టుకు మింగేసాడు.

ఒక్కక్షణం రాజు వంశమార్గుడు నివ్వెర పడ్డాడు. మరుక్షణం, ఆ రాక్షసుడి ముందుకు దూకి, ఒక్క ఉదుటున కత్తితో వాడి పొట్ట చీల్చాడు. అందులో నుండి ఆ యువతి సురక్షితంగా బయటపడింది.

ఆశ్చర్యంగా చూస్తున్న రాజుతో ఆమె “ఓ రాజా! నేను మృగాంకుడి పెద్ద కుమార్తెను. నా తండ్రి దేవసభలో ఇంద్రుడికి ప్రీతిపాత్రుడైన పండితుడు. నా పేరు మృగనయని (జింక కన్నుల వంటి కన్నులు కలది అని ఆ పేరుకు అర్ధం.)

నా తర్వాత నా తండ్రికి నూరుగురు కొడుకులున్నారు. నా సోదరులందరి కంటే నా తండ్రికి నేనంటే అమిత ప్రేమ. ఏనాడూ నన్నూ చూడకుండా ఉండలేడు, నేను లేనిది భోజనమైనా చేయడు.

ఆ రోజులలో ఓ అష్టమినాడు, నేను గౌరీ వ్రతాన్ని ప్రారంభించాను.

దాంతో గుడిలో పూజాది కార్యక్రమాలు ఆలస్యం కావటంతో, ఆ రోజు భోజనానికి చాలా సమయం గడిచినా ఇంటికి వెళ్ళలేక పోయాను. నా తండ్రి నాకోసం చాలా సేపు వేచి ఉన్నాడు. అలసిపోయి, ఆకలితో ఎదురు చూస్తుండగా, నేను ఇల్లు చేరుకున్నాను.

ఆకలితో వివశుడై ఉన్న నా తండ్రి కోపం పట్టలేక, నిగ్రహం కోల్పోయి, ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో, నన్ను “నీవు రాక్షసుడి చేత మ్రింగ బడెదవు గాక!” అని శపించాడు.

నేను కొయ్యబారి పోయాను. ఉత్తర క్షణం ఆయన కాళ్ళ మీద పడి విలపించాను. నా తప్పేమీ లేదనీ, ఆలయంలో పూజ ఆలస్యమైందనీ విన్నవించాను. శాపాన్ని ఉపసంహరించమని వినయంతో అర్ధించాను. దుఃఖాతిశయంతో వణుకుతున్న నన్ను చూసి, నా తండ్రికి తెలివి వచ్చింది. అప్పటి వరకూ దయ్యంలా ఆయన్ని పట్టి ఉంచిన క్రోధం ఒక్కసారిగా చల్లారింది. తానేం చేసాడో స్పృహ కలిగింది. నాకంటే వ్యగ్రంగా ఆయన దుఃఖించాడు.

నన్ను దగ్గరికి తీసుకొని తల నిమురుతూ “నా చిట్టి తల్లి! రాక్షసుణ్ణి చంపి నిన్ను కాపాడి ప్రేమించగల సాహసి నీకు తారసపడి నప్పుడు ఈ శాపం ముగుస్తుంది. అప్పటి వరకూ ఆ పార్వతీ దేవినే సేవించు. అయితే ప్రతీ అష్టమి, అమావాస్యలనాడు రాక్షసుడు వచ్చి నిన్ను మ్రింగుతూనే ఉంటాడు. మరునాడు రాక్షసుడు నిన్ను బయటకు కక్కుతాడు” అని శాప విమోచనం అనుగ్రహించాడు.

ఆనాటి నుండీ, నేనీ ఆలయంలో దేవిని సేవిస్తూ, ఇక్కడే ఉంటున్నాను. ప్రతీ అష్టమికీ, అమావాస్యకీ రాక్షసుడి చేత మ్రింగబడుతూ, మర్నాడు విడుదల అవుతూ, నన్ను ఉద్దరించగల సాహస వీరుడి కోసం ఎదురు చూస్తూ గడుపుతున్నాను. ఇన్నాళ్ళకి నా పుణ్యం ఫలించి, నీవు వచ్చి రాక్షసుణ్ణి సంహరించి, నన్ను ఉద్దరించావు.

ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది. ఓ రాజా! నేను నీ సొత్తుని. నీవు నన్ను వివాహం చేసుకొని జీవితాన్ని ఆనందించ వచ్చు” అన్నది.

ఆమె మాటలకు వంశమార్గుడెంతో ఆనందించాడు. మృగనయని నిష్టగా తన గౌరీ వ్రతాన్ని పూర్తి చేసింది. కోవెలలోని దుర్గామాత ఎదుట వారిద్దరూ వివాహం చేసుకున్నారు. మృగనయనితో కలిసి రాజు వంశమార్గుడు, మంత్రి నీతి వర్ధనుణ్ణి, ఇతర పరివారాన్ని వెంట బెట్టుకుని తిరిగి వారణావతం చేరుకున్నారు. రాణి చంద్రవదన నూతన వధూవరులకు స్వాగత సత్కారాలు చేసింది.

నగరానికి చేరిన మరునాడు మంత్రి నీతి వర్ధనుడు ఉరిపోసుకుని చనిపోయాడు.

ఇదీ కథ!

అని చెప్పిన భేతాళుదు “ఓ విక్రమాదిత్య మహారాజా! ఇప్పుడు చెప్పు. నీతి వర్ధనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? మృగనయనిని పొందిన రాజుని చూచి ఈర్ష్య చెందాడా?” అని అడిగాడు.

విక్రమాదిత్యుడు అడ్డంగా తల నాడిస్తూ “భేతాళా! నీతి వర్ధనుడికి రాజు పట్ల గానీ, అతడి అదృష్టం పట్ల గానీ ఈర్ష్యాసూయల వంటివి ఉన్నట్లుగా తోచదు. బహుశః అతడు ఇలా ఆలోచించి ఉండవచ్చు. ‘చెడ్డవాడైన వ్యక్తికి నీతులు బోధించ రాదు. అది వ్యర్ధమైన పని. అదే విధంగా మిఠాయిలు ఇష్టపడే బాలుడికి మరిన్ని తీపి వస్తువులు ఈయరాదు. అది ఆ బాలుడి ఆరోగ్యానికి చేటు తెస్తుంది.

అయితే నేను… ‘అసలుకే స్త్రీ సౌందర్యం పట్ల మితిలేని మోహం గల వంశమార్గుడి’కి, ఉన్న పట్టమహిషి చాలదన్నట్లు మరొక సుందరిని కట్టబెట్టాను. ఇప్పుడు ఖచ్చితంగా రాజు మరింతగా సుఖ భోగాలలో తేలియాడతాడే తప్ప రాజ్య వ్యవహారాలు చూడడు.
దీనంతటికీ కారకుడను నేను గనుక ప్రజలు మళ్ళీ నన్ను నిందించక మానరు. ఇవేవీ ఆలోచించకుండా రాజుకు నేను ఏకాంత ద్వీపం గురించీ, అందులోని అందమైన యువతి మృగనయని గురించీ చెప్పి, రాజామెను వివాహమాడే పరిస్థితులు తెచ్చాను. ప్రజానింద భరింప శక్యం కానిది’ అనుకొన్నవాడై ఆత్మహత్యకు పాల్పడ్డాడు” అన్నాడు.

భేతాళుడు “భళా విక్రమాదిత్యా భళా! నీ సునిశిత మేధావిత్వానికి ఇవే నా జోతలు” అంటూ ప్రశంసిస్తూనే చప్పున మాయమై పోయాడు. చిరునవ్వు నవ్వుతూ విక్రమాదిత్యుడు మోదుగ చెట్టు వైపుకు దారి తీసాడు.

కథా విశ్లేషణ: ఈ కథలో విక్రమాదిత్యుడు… ‘మంత్రి నీతి వర్తనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోగలడు?’ అనే ప్రశ్నకు సునిశితమైన ఆలోచనతో జవాబిస్తాడు. ఒక వ్యక్తి ఒక పనిని నిర్వహించడానికి ఏయే ‘మోటివ్స్’ ఉండగలవో, వాటి గురించి ఎలా ఆలోచించాలో పిల్లలకి నేర్పే కథ ఇది!

దాదాపుగా ఇప్పుడు మన ఆధునిక నేరపరిశోధక విభాగాలు పనిచేసే తీరు ఇది! ఒక సంఘటన, ఓ దోపిడి, ఓ హత్య, ఓ నేరం… ఏది జరిగినా… ఎవరికి ఏ మోటివ్ ఉంది? ఏ పరిస్థితి ఇందుకు దారి తీసింది? – అనే కార్యకారణ సంబంధాన్ని ఛేదించే ఆలోచనా విధానం ఇది!

ఇలాంటి కథలు పిల్లలకి, ఆడుతూ పాడుతూ, చదువుతూ, వింటూనే, వాళ్ళకి తెలియకుండానే వారిలో సునిశిత ఆలోచనా శక్తిని ప్రేరేపిస్తాయి.
~~~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes