RSS
Wecome to my Blog, enjoy reading :)

ఎవరు అత్యంత సుకుమారి! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 41]

విక్రమాదిత్యుడు అలసట గానీ, విసుగుదల గానీ తలచకుండా, మళ్ళీ మోదుగ వృక్షం చేరి భేతాళుని పట్టి బంధించి, భుజాన వేసుకుని బృహదారణ్య కేసి నడవసాగాడు. అది పదకొండవ ప్రయత్నమే అయినా ఆ మహారాజు జ్ఞాన శీలుడి కిచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చడంలో తొలిప్రయత్నమప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడో ఇప్పుడూ అంతే ఉత్సాహంగా ఉన్నాడు.

విక్రమాదిత్యుడు నడక ప్రారంభించగానే శవంలోని భేతాళుడు కథ ప్రారంభించాడు. “ఓ రాజాధిరాజా! ఇక కథ విను!” అంటూ కొనసాగించాడు.

పూర్వకాలంలో ఢిల్లీ నగరాన్ని వంశకేతుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడికి ముగ్గురు భార్యలు. రాణులు ముగ్గురూ కూడా సౌందర్యానికీ, సౌకుమార్యానికీ ప్రసిద్ధి చెందారు.

ఓనాటి సాయం సమయాన మహారాజు తన రెండవ భార్యతో రాజోద్యాన వనంలో చల్లగాలికి విహరిస్తున్నాడు. ఆ సమయంలో ఓ చిన్ని సీతాకోక చిలుక, రాణి సిగలోని పువ్వుల మీద వాలింది. దాని బరువుకి రాణికి శిరోభారం కలిగి స్పృహ తప్పి పడిపోయింది.

చందనం, శీతల పానీయాలతో దాసీ లామెను సేద తీర్చారు.

మరునాటి రాత్రి వేళ, మహారాజు మొదటి రాణితో రాజాంతఃపురపు ఉప్పరిగ (మేడ) మీద కూర్చుని కబుర్లు చెబుతున్నాడు. అది పున్నమి రాత్రి! వెన్నెల పుచ్చపువ్వులా పృధివంతా వెదజల్లుతోంది.

పూర్ణ చంద్రుని నిండు కాంతికి రాణి తెల్లని శరీరం మీద ఎర్రటి దద్దుర్లు లేచాయి. బాధతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దాస దాసీజనాలు, రాణిని అంతఃపుర మందిరం చేర్చి, చందనం, వట్టి వేళ్ళతో చికిత్స చేసి, శీతల పానీయాలతో సేద తీర్చారు.

ఆ మరునాటి మధ్యాహ్నం రాజు, మూడవ రాణితో కలిసి సంగీతాన్ని వింటూ ఆనందిస్తున్నాడు. సంగీత విద్వాంసుడు శ్రావ్యంగా పాడుతున్నాడు. ప్రక్క వాయిద్యాలతో ఇతర సంగీత కారులు అతడికి సహకరిస్తున్నారు. మంద్రంగా పరచుకున్న సంగీతం, శ్రోతలని ఏదో లోకాలలో విహరింప చేస్తోంది.

అంతలో ఎక్కడి నుండో…రోట్లో ధాన్యం పోసి రోకలితో దంచుతున్న చప్పుడు వినబడింది. ఆ రోకటి పోటు చప్పుడు వినగానే, మూడవ రాణి అరచేతుల్లో బొబ్బలెక్కి పోయాయి. బాధతో ఆమె చిన్నగా అరిచింది. ఆమె అరచేతులు చూస్తే… లేత గులాబి పువ్వుల్లా ఉన్న ఆమె అరచేతుల్లో కుంకుమపొడి చల్లినట్లుగా బొబ్బలు లేచాయి. బాధతో కన్నీరు తిరగగా, ఆమె స్పృహ తప్పి పడిపోయింది.

దాసీలు వచ్చి ఆమె అరచేతులకి వెన్నరాసి శైత్యోపచారాలు చేసారు.

భేతాళుడింత వరకూ కథ చెప్పి, “ఓ విక్రమాదిత్య రాజేంద్రా! ఈ ముగ్గురు రాణులలో, ఎవరు అత్యంత సుకుమారులు? వివరించి చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులు చిలిపి నవ్వుతో మెరుస్తుండగా, భేతాళుడి వైపు కోర చూపు చూస్తూ “భేతాళా! రెండవ రాణి కొప్పులో సీతాకోక చిలుక బరువుని అనుభవించి బాధకి స్పృహ తప్పిపోయింది. సీతా కోక చిలుక చిన్నదే అయినా, దాని భారం ఆ చిన్నది భరించలేక పోయింది. ఆమె అంతటి సుకుమారి!

అలాగే పెద్దరాణి చంద్రుని పున్నమి కాంతిని అనుభవించింది. అందరికీ చల్లని వెన్నెలగా తోచే నిండు పున్నమి వెలుగులోని వేడికి సొక్కి సోలి పోయింది. ఆమె సౌకుమార్యం అంతటిది.

అయితే మూడవ రాణి, ప్రత్యక్షంగా ఏ అనుభవమూ పొందకుండానే, దూరాన వేరెవరో దంచుతుండగా, ఆ శబ్దానికే చేతులు బొబ్బలెక్కి, స్పృహ తప్పి పోయింది. మొదటి ఇద్దరు రాణుల అనుభవం శారీరకమైతే, మూడవ రాణి అనుభవం మానసికం. కాబట్టి మూడవ రాణి సౌకుమార్యమే గొప్పది. ముగ్గురిలోకి మూడవ రాణి అత్యంత సుకుమారి” అన్నాడు.

భేతాళుడూ నవ్వుతూ విక్రమాదిత్యుడి భుజం మీద నుండి మాయమై మళ్ళీ చెట్టేక్కేసాడు.
~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes