విక్రమాదిత్యుడు మరోసారి మోదుగ చెట్టెక్కి శవాన్ని దించి, భుజానికెత్తుకుని బృహదారణ్యం కేసి నడవసాగాడు. శవంలోని భేతాళుడు పదమూడవ కథ చెప్పడం ప్రారంభించాడు.
ఒకప్పుడు పుష్పపురం అనే నగరం ప్రక్కన ఓ శిధిలాలయం ఉండేది. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో అలమటిస్తూ ఆ కోవెలలో పడుకున్నాడు.
అంతలో అక్కడికి ఓ యోగి వచ్చాడు. ఆ బ్రాహ్మణుణ్ణి చూడగానే యోగికి అతడి పరిస్థితి మొత్తం అర్ధమయ్యింది. యోగికి అతడిపై జాలి కలిగింది. అతడికి సాయపడదలిచాడు. వెంటనే ఆ యోగి ఒక మంత్రాన్ని జపించాడు.
వెంటనే అక్కడొక ఇల్లు సృష్టింపబడింది. చుట్టూ ఉద్యానవనం, ప్రక్కనే చిన్న సరస్సు, ఇంటి లోపలంతా అందమైన, విలువైన వస్తువులూ, సామాగ్రితో సర్వ సంపన్నంగా ఉంది. ఆ ఇంటి వంట గదిలో రుచికరమైన భక్ష్యభోజ్యాలు, మధురఫలాలూ, పానీయాలూ ఉన్నాయి.
యోగి బ్రాహ్మణుడిని ఆ యింటి లోనికి తీసుకు వెళ్ళాడు. అక్కడి మృష్టాన్న భోజనాన్ని చూచి బ్రాహ్మణుడి కళ్ళు మెరిసాయి. యోగి అతడిని వాటిని తినవచ్చునని ఆదేశించాడు. ఆ పేద బ్రాహ్మణుడు ఎంతో సంతోషంతో ఆకలి తీర్చుకున్నాడు.
యోగికి ఆ అభాగ్యుడి పట్ల ఎంతో వాత్సల్యం కలిగింది. అతడికి మంత్రోపదేశం చేయదలిచి “నాయనా, నీకు దివ్య మంత్రం ఉపదేశిస్తాను. పవిత్ర స్నానం ఆచరించాలి. పద!” అంటూ అతణ్ణి సరస్సు దగ్గరికి తీసికెళ్ళాడు. అందులో పుణ్యస్నానమాచరించి రావలసిందని పంపాడు. బ్రాహ్మణుడు సరస్సులో మునిగాడు.
తొలి మునక వేసిన క్షణం అతడి కొక దృశ్యం మనోఫలకం మీద గోచరించింది. అందులో అతడి కుమారుడు అతని ఎదురుగా నిలబడి ఉన్నాడు. రెండవ మునకలో అతడికి అతడి భార్య కనిపించింది. మూడో మునకలో అతడి వృద్ధులైన తల్లిదండ్రులు కనిపించారు.
స్నానం ముగించి గట్టు మీది కొచ్చాక బ్రాహ్మణుడికి అదంతా తన ఊహేగాని, తన భార్యాపుత్రులూ, తల్లిదండ్రులూ అక్కడ లేరని అర్ధమయ్యింది.
బ్రాహ్మణుడు తన అనుభవాన్నంతా యోగికి వివరించి చెప్పాడు. యోగి ఒక్కక్షణంతో తన ప్రయత్నం వృధా అయ్యిందని గ్రహించాడు. విచారం నిండిన స్వరంతో “నాయనా! అనవసరంగా నిన్ను శ్రమకు గురి చేసాను, నేనూ శ్రమ తీసుకున్నాను. ఈ మంత్రం నీకు ఉపయోగించదు. భగవదనుగ్రహమిట్లున్నది. నీవు ఇంటికి పోయి తోచిన రీతిన బ్రతుకు” అని అతడిని దీవించి తన దారిన తాను పోయాడు.
బ్రాహ్మణుడు కొంత సేపు విచారించి, చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఇదీ కథ!
భేతాళుడింత వరకూ కథ చెప్పి “ఓ విక్రమాదిత్యా! యోగి ఎందుకా విధంగా చెప్పాడు? మంత్రం యోగికి ఫలవంతమైనప్పుడు, ఆ పేద బ్రాహ్మణుడికెందుకు ఫలించదు? బ్రాహ్మణుడు సరస్సులో స్నానమాడి వచ్చేంతలో యోగి మనస్సు మార్చుకున్నాడా? యోగికి అతడిపై కలిగిన వాత్సల్యం అంతలోనే కరిగి పోయిందా? తెలిసీ జవాబు చెప్పకపోతే నీ తల వేయి వక్కలౌతుందని నీకు తెలుసు. మౌనభంగమైతే నీ ఈ ప్రయత్నం ఫలిందనీ, నీకు తెలుసు కదా! ఇక జవాబు చెప్పు” అన్నాడు.
విక్రమాదిత్యుడు ఓ సారి దీర్ఘ శ్వాస తీసుకుని “ఓ భేతాళా! విను! ఆ యోగి అమృత హృదయుడు. ఆ పేదవాడిపై ప్రేమా జాలీ కలవాడై మంత్రోపదేశం చేసి అతడికి సహాయం చేయాలనుకున్నాడు. యోగి వాత్సల్యం కరిగి పోలేదు, మనస్సూ మారిపోలేదు.
అయితే… పుణ్యవ్రతం ఆచరించాలన్నా, దైవధ్యానం చెయ్యాలన్నా, యోగాభ్యాసమూ మంత్రోచ్ఛాటనా చేయాలన్నా, ఏకాగ్రత అవసరం. పూర్తిగా మనస్సుని లగ్నం చేసి సాధన మీదే దృష్టి కేంద్రీకరించి, ఇతరమైన ఆలోచన లేవీ లేకుండా ఏకాగ్రచిత్తులైతేనే… ఏ వ్యక్తి అయినా సాధన చెయ్యగలడు. ఆ పేద బ్రాహ్మణుడికి మనస్సుని ఏకాగ్రం చేసే శక్తి లేదు. అది గ్రహించిన వాడై, యోగి తన ప్రయత్నం విరమించుకొని, తన దారిన తాను పోయాడు. అంతే! అది బ్రాహ్మణుడి అసక్తత గానీ యోగి అనాదరణ కాదు” అన్నాడు.
భేతాళుడీ జవాబుకి సంప్రీతుడైనాడు గానీ తక్షణమే అదృశ్యుడూ అయ్యాడు.
కథా విశ్లేషణ: దేన్ని సాధించాలన్నా, ఏకాగ్రత అవసరం అనే విషయాన్ని పిల్లల మనస్సుకి హత్తుకునేలా చెబుతుందీ కథ! అందునా మాయమంత్రాలు నేర్చుకోవటమనే కథలంటే పిల్లలకి మహా సరదా! అలాంటి చోట మంత్రం నేర్చుకునే అవకాశం పోవటమంటే, పిల్లలకది బాగా గుర్తుండి పోతుంది. ఆ విధంగా ‘ఏకాగ్రత సాధించాలి’ అనే ఆలోచన వాళ్ళలో రేకెత్తుతుంది.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి