RSS
Wecome to my Blog, enjoy reading :)

విరిబోణి వివాహం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 28]

విక్రమాదిత్యుడు మరోసారి భేతాళుని బంధించి, భుజమ్మీద వేసుకొని నడుస్తుండగా, భేతాళుడు కథ ప్రారంభించాడు.

"విక్రమాదిత్యా! ఇది నేను నీకు చెబుతున్న కథలలో అయిదవది. సావధనుడవై విను" అంటూ కొనసాగించాడు.

ఒకానొకప్పుడు, సోమవేదిక అనే నగరముండేది. ఆ నగరాధీశుడి పేరు నీతివంశకేతు. [నీతే వంశపు జండాగా గలవాడు అని అతడి పేరుకు అర్ధం.] ఆ రాజెంతో మంచివాడు, సమర్ధుడు.

అతడు భద్రకాళీ భక్తుడు. తమ కులదేవతగా ఆ తల్లిని కొలిచేవాడు. అతడు భద్రకాళీ మాతకు గొప్ప ప్రాకారాలతో, గోపురాలతో కూడిన అద్భుత దేవాలయాన్ని నిర్మించాడు. బంగారు రధాన్ని, రత్నాభరణాలని సమకూర్చాడు. ప్రతీ ఏడాది, అమ్మ వారికి ఉత్సవాలు, పండుగలూ నిర్వహించేవాడు.

ఒక ఏడాది, సోమవేదిక లోని కాళీ మాత ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. చుట్టుప్రక్కల గ్రామాల నుండే గాక, ఎంతో దూరం నుండి కూడా, ఎందరో ప్రజలు ఆ జాతరకు వచ్చారు. అంతా కోలాహలంగా ఉంది. చిత్రవిచిత్ర వస్తువులు ప్రదర్శించేవాళ్ళు, అమ్మజూపేవాళ్ళు, రకరకాల తినుబండారాలు! అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు! ఇసుకవేస్తే రాలనంత మంది జనం ఉన్నారక్కడ! చెక్క భజనలు, కోలాటాలు, రంగుల రాట్నాలు, ఆట వస్తువులు... పానీయాలు... అరుపులూ కేకలు!

ఎక్కడ చూసినా జనమే! వాళ్ళల్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమె పేరు విరిబోణి. [పువ్వువంటి సుకుమారమైన దేహం కలది అని ఆమె పేరుకు అర్ధం.] అక్కడికి యశోవంతుడనే యువకుడూ వచ్చాడు. [కీర్తిగలవాడని అర్ధం.] యశోవంతుడు విరబోణిని చూశాడు. తొలి చూపులోనే ప్రేమలో కూరుకుపోయాడు.

ఎలాగైనా ఆమెనే వివాహమాడాలని నిర్ణయించుకున్నాడు. ఆమె దృష్టిలో పడాలని, కొన్ని చిరుప్రయత్నాలు చేశాడు. లాభం లేకపోయింది. అతడు గుడిలోకి వెళ్ళి, అమ్మవారిని దర్శించుకొని "తల్లీ! భద్రకాళీ! నువ్వు భక్తుల పాలిట కల్పవల్లివి. మా కోర్కెలు తీర్చే అమ్మవు. అమ్మా! నే మనస్సు పడ్డ పిల్ల, నన్ను ప్రేమించేటట్లు, ఆమెతో నాపెళ్ళి అయ్యేటట్లు అనుగ్రహించు. అదే జరిగితే, ఓ తల్లీ! నా తల నీకు సమర్పించుకుంటాను. ఇదిగో నా తల కత్తిరించుకొని, నాదేహం నీ ముందు బలిపీఠంపై పెడతానని ప్రమాణం చేస్తున్నాను. దయ చూడగదే తల్లీ!" అని మొక్కుకున్నాడు.

తర్వాత యశోవంతుడు తన తల్లిదండ్రుల దగ్గరికి చేరి, వాళ్ళకి విరిబోణిని చూపించి, "అమ్మా!నాన్న! ఆ పిల్ల నాకు నచ్చింది. ఆమెతోనే నా పెళ్ళి జరిపించండి" అని చెప్పాడు. వాళ్ళకీ ఆ పిల్ల నచ్చింది. వాళ్ళు ఆ పిల్ల పేరూ, ఊరూ తల్లిదండ్రుల వివరాలు సేకరించారు.

జాతర ముగిసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళాక, ఓ మంచిరోజు చూసుకుని, యశోవంతుడి తల్లిదండ్రులు ఇతర పెద్దల్ని తీసుకుని, విరిబోణి ఉండే గ్రామానికి వెళ్ళారు. విరిబోణి ఇంటికి వెళ్ళి, ఆమె తల్లిదండ్రులకి తమని తాము పరిచయం చేసుకున్నారు. ఆమాటా ఈమాటా అయ్యాక, తమ కుమారుడు యశోవంతుడికి విరిబోణి నివ్వాల్సిందిగా అడిగారు. విరిబోణి తల్లిదండ్రులకీ సంబంధం నచ్చటంతో అంగీకరించారు. అందరూ ఎంతో సంతోషించారు.

ఒక మంచి ముహుర్తాన... యశోవంతుడికీ, విరిబోణికీ వివాహం జరిగింది. బంధుమిత్రులంతా హాజరై వధువరులని దీవించారు. వివాహ విందు, ఉత్సవాలు ముగిసాక, విరిబోణి, సోమవేదికలోని అత్తగారింటికి కాపురానికి వచ్చింది. యశోవంతుడికి, భార్య విరిబోణితో జీవితం స్వర్గసమంగా ఉంది. విరిబోణి అందమైనదీ, మంచి ప్రవర్తన కలదీ కావటంతో, అందరి మనస్సులూ చూరగొంది. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి.

ఈ విధంగా కొన్ని నెలలు గడిచాక, విరిబోణి తల్లిదండ్రులు, రానున్న పెద్దపండుగకి కూతుర్ని అల్లుణ్ణీ పిలిచి, కొన్నాళ్ళు ఇంట నుంచుకొని ఆనందించాలనుకున్నారు. వాళ్ళు తమ పెద్దకొడుకుని పిలిచి "నాయానా! నీవు సోమవేదిక పురానికి వెళ్ళి, నీ చెల్లెలైన విరిబోణిని, ఆమె భర్తనీ పిలుచుకు రా! రానున్న పండగకి ఇంట అల్లుడూ కూతురితో ఆనందంగా గడపాలని మా కోరిక" అన్నారు.

అతడు సరేనని సోమవేదిక చేరి, యశోవంతుడికీ, అతడి తల్లిదండ్రులకీ తమ ఆహ్వానం అందించాడు. వాళ్ళూ పండుగకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అత్తగారింటికి బయలుదేరే లోపల, రాక రాక వచ్చిన బావమరిదికి, పట్నంలోని వింతలూ విశేషాలూ చూపించాలనుకున్నాడు యశోవంతుడు. ఊరంతా తిప్పి చూపించాడు.

ప్రయాణానికి ముందు రోజున... యశోవంతుడు, భార్యనీ, బావమరిదినీ వెంటబెట్టుకొని భద్రకాళి కోవెలకి వెళ్ళాడు. పూజాదికాలు ముగించుకున్నాక, ఆలయ ఆవరణలో ఓ చెట్టు క్రింద కూర్చున్నారు.

యశోవంతుడు "ఒక్క నిముషం! భద్రకాళీ తల్లికి మొక్కటం మరిచి పోయాను. ఇప్పుడే వస్తాను" అని చెప్పి గుడిలోకి వెళ్ళాడు.

ఆలయంలోకి వెళ్ళిన యశోవంతుడు, ఆ తల్లి ముందు నిలబడి "ఓ కాళీ మాతా! నేను కోరినట్లే విరిబోణితో నాపెళ్ళి జరిపించావు. తల్లీ! నా మాట నిలబెట్టుకుంటాను. ఇదే నా తలనిచ్చుకుంటున్నాను నీకు!" అంటూ... అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉన్న మర్రిచెట్టు కొమ్మకి తన జుట్టు కట్టుకున్నాడు. బొడ్డున దోపుకున్న కత్తి తీసుకుని, తన దేహం అమ్మవారి ముందున్న బలిపీఠం మీద పడేటట్లుగా తల నరుక్కున్నాడు. రక్తం ధార గడుతూ అతడి తల చెట్టు కొమ్మకు వ్రేలాడుతోంది.

~~~~~~~~~

జ్ఞాని, సూత్రజ్ఞుడు, శూరుడు - ఎవరు గొప్ప?[భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 27]

విక్రమాదిత్యుడు మళ్ళీ మోదుగ వృక్షాన్ని చేరాడు. అప్పటికే భేతాళుడు శవరూపంలో ఆ చెట్టు కొమ్మకి తల్లక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. ఒక్క క్షణం విక్రమాదిత్యుడికి ఆశ్చర్యం వేసింది. అయినా ప్రయత్నం విడిచిపెట్టలేదు. మరోసారి చెట్టెక్కి శవాన్ని దించి భుజమ్మీద వేసుకుని బృహదారణ్యంకేసి నడక ప్రారంభించాడు.

యధాప్రకారం, భేతాళుడు కథ ప్రారంభిస్తూ "విక్రమాదిత్య మహారాజా! ముందు కథ విను" అంటూ కొనసాగించాడు.

పూర్వకాలంలో మచ్చిలి అనే పట్టణం ఒకటి ఉండేది. అక్కడ అర్జునస్వామి అని ఓ ప్రముఖ బ్రాహ్మణుడుండే వాడు. అతడికొక కుమార్తె. ఆమె ఎంతో అందమైనది, అణకువ కలిగినది.

అర్జునస్వామి కుమర్తెని కంటికి రెప్పవలె కాపాడుతూ, ప్రేమగా పెంచాడు. ఒక రోజు వారి పట్టణానికి, ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చారు. వాళ్ళు అర్జునస్వామి కుమార్తె యొక్క అందం గురించి, మంచితనం గురించి విన్నారు.

అర్జునస్వామిని కలిసి కన్యాదానం చెయ్యమని అడిగారు. అర్జునస్వామి, వారిలో ఒకరికి తన బిడ్డనిచ్చి పెళ్ళి చెయ్యగలనన్నాడు. అంతలో అక్కడికి ఓ రాక్షసుడొచ్చాడు. అమాంతం ఆ బ్రాహ్మణుడి కుమార్తెని అపహరించుకు పోయాడు.

ఆమె తల్లిదండ్రులైన అర్జునస్వామి, అతడి భార్య గుండెలు బాదుకుని ఏడ్చారు. ముగ్గురు యువకులకు కూడా చాలా దుఃఖం కలిగింది.

వారిలో మొదటి వాడి పేరు జ్ఞాని. రెండవ వాడి పేరు సూత్రజ్ఞుడు. మూడవ వాడి పేరు శూరుడు. ముగ్గురూ కూడా సార్ధక నామధేయులు. జ్ఞాని ధ్యానంలో కూర్చుని, మనస్సుని ప్రపంచమంతా అన్వేషించేందుకు నియోగించాడు. జ్ఞాన నేత్రంతో ప్రపంచంలో తాను కోరుకున్న ఏ ప్రదేశాన్నైనా దర్శించగల విద్య అతడికి తెలుసు. (ఇప్పటి మన లైవ్ టెలికాస్ట్ చెయ్యగల ఎక్విప్డ్‌వ్యాన్ కున్న శక్తి వంటిదన్న మాట.)

ఆ శక్తితో జ్ఞాని (మొదటి యువకుడు) రాక్షసుడి నివాసం ఎక్కడో తెలుసుకుని, చెప్పాడు. రెండవ యువకుడు సూత్రజ్ఞుడు (అంటే అన్ని సూత్రాలు తెలిసిన వాడని అర్ధం.) తన విద్యాపరిజ్ఞానంతో ఒక రధాన్ని నిర్మించాడు. (ఇప్పటి మన ఇంజనీర్ల మాదిరిగా నన్న మాట.)

"ఈ రధం నేలమీద, నీటి మీద, గాలిలో కూడా మన ఆజ్ఞాననుసరించి ప్రయాణించగలదు. ఈ రధం మీద వెళ్ళి, ఆమెని కాపాడగల వారున్నారా? నేను రధాన్ని నిర్మించగలను గానీ, రాక్షసుణ్ణి యెదిరించలేను" అన్నాడు.

జ్ఞాని కూడా "నేను రాక్షసుడుండే చోటు గురించి చెప్పగలనే గానీ, అక్కడికి వెళ్ళి రాక్షసుడితో పోరాడలేను" అన్నాడు.

మూడవ యువకుడైన శూరుడు "ఓ సూత్రజ్ఞా! నేను వెళ్ళగలను. ఈ రధాన్ని యెలా నడిపించాలో నాకు తెలియజెయ్యి" అన్నాడు. సూత్రజ్ఞుడు శూరుడికి రధాన్ని నడిపించే విధివిధానాలని వివరించాడు. జ్ఞాని రాక్షసుడి నివాసం గురించిన ఆనవాళ్ళన్ని చెప్పాడు.

శూరుడు తన ఆస్త్ర శస్త్రాలన్నిటినీ తీసుకుని, కవచధారియై రధం యెక్కాడు. యెకాయకి రాక్షసుడి నివాసం చేరి, రాక్షసుడితో తలపడ్డాడు. హోరాహోరీ జరిగిన ఆ పోరులో చివరికి రాక్షసుణ్ణి హతమార్చాడు. అర్జునస్వామి కుమార్తెని రధమెక్కించుకొని మచ్చిలి పట్టణానికి తిరిగి వచ్చాడు. అందరూ ఎంతగానో ఆనందించాడు.

భేతాళుడీ కథ చెప్పి "ఓ ఉజ్జయినీ రాజ్యాధిపతీ! విక్రమాదిత్య మహారాజా! నువ్వు చెప్పు! జ్ఞాని, సూత్రజ్ఞుడు. శూరుడు... ఈ ముగ్గురు బ్రాహ్మణ యువకులలో, ఎవరు అర్జునస్వామి కుమార్తెని వివాహమాడేందుకు అర్హులు?" అనడిగాడు.

విక్రమాదిత్యుడు "ఓ భేతాళా! జ్ఞానీ, సూత్రజ్ఞుడు... ఇద్దరూ తమతమ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, విద్యలనీ ఉపయోగించి ఆ యువతిని కాపాడారు. అయితే ప్రమాదపు దరిదాపులకి పోలేదు. కానీ, శూరుడు తన ప్రాణాలను ఫణంగా పెట్టి, రాక్షసుడితో పోరాడి ఆమెని కాపాడాడు. కాబట్టి అతడే ఆమెని వివాహమాడటానికి అర్హుడు" అన్నాడు.

ఎప్పుడైతే విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పాడో, ఆ క్షణమే భేతాళుడు మాయమయ్యాడు.

కథ విశ్లేషణ:

ఈ కథలో... జ్ఞాని, సూత్రజ్ఞుల విద్యాకౌశలమూ గొప్పవే! జ్ఞానంతో, సూత్రజ్ఞత(అంటే సాంకేతికత!)తో ఎన్నో విషయాలు కనిపెట్టవచ్చు. టీవీ, కంప్యూటర్, రాకెట్, శాటిలైట్... ఇలా ఎన్నో వస్తువుల్ని కనిపెట్టవచ్చు. కానీ వారికంటే ధైర్యవంతుడు గొప్పవాడు. జ్ఞానం, టెక్నాలజీల కంటే ధైర్యం గొప్పది. ధైర్యం ఉన్నవాడు... లక్ష్యం కోసం ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టగలడు. ధైర్యం ఉన్నవాడు... సత్యాన్ని చూడగలడు, సత్యాన్ని పలక గలడు, సత్యం కోసం జీవించగలడు.

ఎంత తెలివితేటలున్నా, ఎంత శాస్త్రసాంకేతిక ప్రతిభా సామర్ధ్యాలతో పాటు, కళాకౌశాలాలు ఉన్నా, ధైర్యం లేకపోయినట్లయితే, అలాంటి వాళ్ళు... డబ్బున్న వాణ్ణి చూసో, బలమున్న వాణ్ణి చూసో... భయపడిపోయి, బానిస బ్రతుకు కయినా సిద్ధపడతారు. అంతేగానీ, ఎదురుతిరిగి పోరాడరు.

కాబట్టి... తెలివితేటల్ని, ప్రతిభాసామర్ధ్యాలని తక్కువ చేయరాదు గానీ, వాటితో బాటు, వాటికంటే ఎక్కువగానూ... ధైర్యాన్ని అలవరుచుకోవాలనీ, ధైర్యవంతుడే కథానాయకుడనీ ఈకథ పిల్లలకి చెబుతుంది. వాళ్ళల్లో ధైర్యశౌర్యాల్ని ప్రేరేపిస్తుంది.

ఎవరు గొప్ప నిపుణులు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 26]

విక్రమాదిత్యుడు మోదుగ చెట్టు చేరి, పైకెక్కి శవాన్ని దించి భుజాన వేసుకుని, మౌనంగా బృహదారణ్యం కేసి నడవసాగాడు.

భేతాళుడు, ప్రతాపవంతుడైన విక్రమాదిత్యుణ్ణి చూసి "ఓ రాజా! విక్రమాదిత్యా! నీకు మరో కథ చెబుతాను. మౌనంగా విను" అని ఇలా చెప్పసాగాడు.

ఒకానొకప్పుడు అంగనం అనే పట్టణ మొకటి ఉండేది. అక్కడ ఆది విష్ణువనే బ్రాహ్మణుడుండేవాడు. అతడికి ముగ్గురు కుమారులు. వాళ్ళు అన్ని విద్యలతో పాటు కొన్ని ప్రత్యేక కళలూ, నైపుణ్యాలూ నేర్చారు.

ముగ్గురు యువకులూ ఆ నగరాధిపతి యోగదాసుడి కొలువులో చేరదలిచి రాజాస్థానానికి వెళ్ళారు. తమని తాము రాజుకు పరిచయం చేసుకున్నారు. రాజు వాళ్ళని "మీ విశిష్టతలేమిటి?" అని అడిగాడు.

అందరిలోకి పెద్దవాడు "మహారాజా! నేను తిండి సుఖమెరుగుదును. నేను తిన్న వాటి నాణ్యాతానాణ్యతలను వివరించగలను" అన్నాడు.

మధ్యవాడు "మహాప్రభు! నేను స్త్రీ సుఖమెరుగుదును. నాతో గడిపిన స్త్రీ బాగోగులని విశ్లేషించగలను" అన్నాడు.

చివరివాడు "రాజ రాజా! నేను నిద్రాసుఖమెరుగుదును. తల్పముల లోటుపాట్లని తెలియజేయగలను" అన్నాడు.

రాజుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. వారి కౌశలాన్ని పరీక్షించాలన్న కుతూహలం కలిగింది. తన ఆస్థాన పురోహితుణ్ణి పిలిచి, మొదటి వాడికి రకరకాల పిండి వంటలతో షడ్రసోపేతమైన భోజనం పెట్టమన్నాడు.

అతడు భుజించి వచ్చాక, రాజు అతడితో "ఓ యువకుడా! ఇప్పుడు నీవారగించిన భోజనం యొక్క విశేషమేమిటి?" అని అడిగాడు. దాని కతడు "మహారాజా! నవకాయ పిండి వంటలతో, రుచి శుచి గల ఆహారాన్ని వడ్డించారు. అయితే నేను ఆరగించిన శాల్యోదనం (వరి అన్నం) మాత్రం, శ్మశానపు మట్టి రంగు, రుచీ, వాసనా కలిగి ఉంది" అన్నాడు.

రాజు విచారించగా, ఆ బియ్యం పండిన పొలానికి ఎరువు, శ్మశాన భూమి నుండి పంపబడిందని తేలింది. రాజుకి అతడి ప్రతిభని చూసి ఆశ్చర్యం కలిగింది.

రాజు, తన ఆస్థాన నాట్యశాలలో నాట్యకత్తె, అద్భుతమైన అందగత్తె అయిన వేశ్య నొకామెని పిలిచి, ఆ రాత్రికి ముగ్గురు సోదరులలో మధ్యవాణ్ణి ఆదరించమని ఆజ్ఞాపించాడు.

మరునాటి ఉదయం రాజు మధ్యవాడితో "ఓ యువకుడా! రాత్రి నీవు మా ఆస్థాన నర్తకీమణులలో ఒకామెతో గడిపినావు కదా? నీ విశ్లేషణ ఏమిటి?" అని అడిగాడు.

మధ్యవాడు "మహారాజా! ఆమె అద్భుత సౌందర్యవతి, సంగీత నాట్యాల తెలిసిన నైపుణ్యవతి. కానీ, ఆమె సాంగత్యం గొర్రె కంపు కొట్టినది" అన్నాడు చటుక్కున!

రాజుకు చురుక్కుమంది. నర్తకీమణి పూర్వాపరాలను విచారించగా, ఆమె గొర్రెల కాపరుల ఇంట పుట్టినదని తేలింది. రాజుకి దిగ్ర్భాంతి కలిగింది.

అతడు, ముగ్గురిలో చివరి సోదరుణ్ణి పిలిచి, ప్రత్యేక పంకం మీద పవళించవలసిందిగా ఆజ్ఞపించాడు. అది హంసతూలికా తల్పం! దానిపైన ఏడు పరుపులు పరచబడ్డాయి. హంస, నెమలి వంటి పక్షులు ఈకలలో ఈనెలు తీసేసి, దూదితో కలిపి తయారు చేయబడిన, దిండ్లూ పరుపులవి. వాటిపైన పట్టు దుప్పట్లు పరిచారు. పాలనురగలా మెత్తగా... పరిమళద్రవ్యాలతో మత్తుగా... ఉన్న పడక మీద నిద్రకుపక్రమించాడు విప్ర యువకుడు.

మరునాటి ఉదయం రాజు అతణ్ణి "ఈ శయ్యపై నీవు పొందిన నిద్రాసుఖం ఎలా ఉంది?" అని అడిగాడు. దానికతడు "మహారాజా! ఈ పడక పై నిద్రతో, నా ఒళ్ళంతా ఒకటే నొప్పులు సంభవించాయి!" అన్నాడు.

రాజు సేవకులని పిలిచి, పడకంతా పరీక్షించమన్నాడు. సేవకులా పని చేస్తుండగా తాను స్వయంగా పర్యవేక్షించాడు. ఆ మంచం మీద పరచిన ఏడు పరుపులు అడుగున, ఓ పొడవాటి వెంట్రుక ఉంది. రాజు విస్మయంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.

ముగ్గురు యువకుల ప్రతిభా నైపుణ్యాలు అతడికెంతో ఆనందం కలిగించాయి. వారికి తన ఆస్థానంలో తగిన స్థానాలిచ్చి సత్కరించాడు.

భేతాళుడీ కథ చెప్పి ఇలా అడిగాడు.

"ఓ విక్రమార్క మహారాజా! ముగ్గురు బ్రాహ్మణ యువకులలో ఎవరు గొప్ప ప్రతిభావంతులు? ఎవరి నైపుణ్యం విశిష్టమైనది? వివరించి చెప్పు!" అన్నాడు.

విక్రమాదిత్యుడు "భేతాళా! మొదటి సోదరుడు భోజన సుఖం తెలిపాడు. రెండవ వాడు తాను ఆనందించిన స్త్రీ గురించి వివరించాడు. ఈ ఇద్దరూ కూడా, తాము జాగృదావస్థలో ఉన్నప్పుడు తమ అనుభవాలని గుర్తించి, వివరించారు. మూడవ వాడు నిద్రావస్థలో ఉండి కూడా తన సుషుప్తి అనుభవంలోని బాగోగులని విశ్లేషించాడు. కాబట్టి ముగ్గురిలో మూడవవాడు నైపుణ్యమే మరింత విశిష్టమైనది" అన్నాడు.

విక్రమాదిత్యుడి వివేకపూరితమైన సమాధానానికి భేతాళుడు ముగ్ధుడయ్యాడు. అయినా మౌనానికి భంగం ఏర్పడినందున, తక్షణమే విక్రమాదిత్యుడి భుజం మీద నుండి మాయమై, మోదుగ చెట్టు మీద ప్రత్యక్షమయ్యాడు.

ఇది ఊహించినందున, విక్రమాదిత్యుడు వెనుదిరిగి శ్మశానం వైపు అడుగులేసాడు.

కథ విశ్లేషణ:

ఆహార నిద్రా మైధునాలు... ఏ ప్రాణికైనా ప్రాధమిక అవసరాలు! వాటి బాగోగులు తెలుసుకోవటంలో ఈ ముగ్గురు సోదరులూ నిష్ణాతులు. సాధారణంగా.... ఎప్పుడూ ఎక్కడా వినబడని, కనబడని ప్రజ్ఞలివి. ఇలాంటి కథలు విన్నప్పుడు, వాళ్లలానే ఏవైనా ప్రత్యేక విద్యలు, ఎవరికీ తెలియనివి, అరుదైనవీ నేర్చుకోవాలనే ఉత్సాహం పిల్లల్లో కలుగుతుంది. అది గొప్ప ప్రయోజనం కదా!

ప్రపంచంలో మరెవ్వరూ గుర్తించనంతగా మన పూర్వీకులు, కళలని 64 గా గుర్తించారు. ఇవి గాకుండా కూడా, ఇంకా చాలా కళలున్నాయి. అలాంటివే ఈ కథలోని బ్రాహ్మణ యువకులు చూపించేవి. సాధన చేస్తే మన పనిలో, దైనందిన జీవితంలో ఇలాంటి ఎన్నో నైపుణ్యాలు సాధించవచ్చు.

ఇప్పుడు కార్పోరేట్ ప్రపంచంలో... టీ, మద్య తయారీ సంస్థల్లో టేస్టర్స్ ప్రతిభ, కథలోని మొదటి యువకుడి సునిశిత నైపుణ్యం వంటిదే!

ఇక్కడ మీకు కొన్ని చిన్న ఉదాహరణలు ఇస్తాను.

మా వారి చిన్నప్పుడు వాళ్ళ పొరుగింట్లో ఒకామె ఉండేది. ఆమెకి రోజు సినిమా (11 గంటలకు ఉదయపు ఆట) చూడటం వ్యసనం. పనులన్నీ ముగించుకొని, కిరోసిన్ స్టౌలో సరిగ్గా అన్నం ఉడకటానికి కావలసినంత కిరోసిన్ మాత్రమే పోసి, అన్నం పెట్టి సినిమాకెళ్ళి పోయేది. (అప్పటికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు సరికదా, గ్యాస్, ప్రెషర్ కుక్కర్ కూడా అందరికీ అందుబాటులో ఉండేవి కావు.) ఆవిడ సినిమా చూసి తిరిగి వచ్చేసరికి, సరిగ్గా అన్నం ఉడికి కూర్చునేది. స్టౌ ఆరిపోయి ఉండేది. కాకపోతే వత్తులూ కాలిపోతాయి. వత్తులు కొంచెం పైకిలాగి, మళ్ళీ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

అంత ఖచ్చితంగా కిరసనాయిల్ పరిమాణాన్ని లెక్కంచగల ఆమె నేర్పు ఆశ్చర్యం కలిగించేది.

అలాగే గుంటూర్లో మేం ఉప్పులూ పప్పులూ కొనే కిరాణా దుకాణం ఒకటి ఉండేది. వాళ్ళ షాపుకు వచ్చే కస్టమర్ ఒకతను లాయర్ ఉండేవాడు. అతడు ఎప్పుడు ఉల్లిపాయలు ఏరినా తూకం వేస్తే సరిగ్గా కిలో ఉండేవి. ఒక్క పాయ వెయ్యాల్సిన అవసరంగానీ తియ్యాల్సిన అవసరం గానీ వచ్చేది కాదు.

వీళ్ళు భట్టి విక్రమార్క కథలు చదివారో లేదో నాకు తెలియదు కాని, ఇలాంటి అనుభవాలు నాకూ ఉన్నాయి.

నా 11వ ఏట భట్టి విక్రమాదిత్య కథలు మొదటి సారి చదివాను. అప్పటి నుండి, ఎందరికి చెప్పి ఆనందించానో! అవి చదివినప్పటి నుండి విక్రమాదిత్యుడు నా రోల్ మోడల్! అతడిలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి కావాలని కలలు కనేదాన్ని!

ఈ సంఘటన జరిగినప్పుడు నాకు 15-16 ఏళ్ళుంటాయి. పదవతరగతి పరీక్ష వ్రాసేసి, వేసవి సెలవులని ఆనందిస్తున్నాను. ఓ రోజు రాత్రి రెండు గంటల దాకా ఏదో పెయింటింగ్ వేసి పండుకున్నాను. ఆ రీత్యా మర్నాటి మధ్యాహ్నం బాగా నిద్ర పోతున్నాను.

అప్పుడు మా వీధికి బంగారు నగలకి మెరుగు పెడతానంటూ.... ఎవరో ఒకతను వచ్చాడు. మా పొరుగింటి వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు కూడా, అతడి మాయ మాటల బుట్టలో పడ్డారు. మా ఇంటి వరండాలోనే అతడు సరంజామా అంతా సర్దుకొని పని ప్రారంభించాడు. మా అమ్మగాజులు, మా ప్రక్కింటామె గొలుసు గట్రాలకు మెరుగు పెట్టాడు. నిద్రపోతున్న నన్ను కుదిపి లేపి, నా గొలుసు ఇమ్మన్నారు. నిద్రమత్తులోనే గొలుసు తీసి ఇచ్చి మళ్ళీ నిద్రపోయాను. అతడు మెరుగు పెట్టాడు. అందరి కళ్ళ ఎదుటే పనంతా పూర్తి చేసి, కూలి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు.

నిద్రలేచాక నా గొలుసు నాకిచ్చింది మా అమ్మ. మెడలో వేసుకున్న వెంటనే నేను "ఇది నా గొలుసు కాదు" అన్నాను.

"ఠాఠ్! అతడు మా కళ్ళ ఎదుటే పని చేసాడు. అందరం ఎక్సరే కళ్ళతో కాపలా కాసాం. అతడు గొలుసు మార్చే అవకాశమే లేదు. ఇది నీ గొలుసే!" అన్నారు అమ్మానాన్న.

నా గొలుసు 24 గ్రాముల బరువుంటుంది. అప్పట్లోనూ, ఇప్పడంతగాక పోయినా, ఆ రోజులకి బంగారం ఖరీదే! నేను "గొలుసులో ఏదో మార్పుంది. ఇది నాది కాదు" అని గట్టిగా వాదించాను.

దాంతో అనుమానం వచ్చి మా నాన్న, మాకు నమ్మకంగా నగలు అమ్మే బంగారు నగల దుకాణానికి తీసికెళ్ళి, నగను పరిక్షించమన్నాడు. నగ తూకంలో తేడా వచ్చింది. నాలుగు గ్రాముల బంగారం తరుగువచ్చింది. మా అమ్మ గాజులు, ప్రక్కింటి వారి నగలూ కూడా అంతే! చూసుకుంటే దాదాపు సవరు బంగారం నష్టపోయాము.

నిస్సహాయతతో కూడిన కోపంతో మా నాన్న, "రాత్రంతా అడ్డమైన పుస్తకాలు చదువుతూనో, పిచ్చి బొమ్మలు వేసుకుంటూనో మేలుకోవడం, పగలు నిద్రపోవటం! మేలుకుని ఉంటే, చదువుకుంటున్న పిల్లవి, వాడి మోసం పసిగట్టే దానివి కదా?" అంటూ నన్ను చెడామడా తిట్టేసాడు. ఏంచేస్తాను? గమ్మున ఊరుకున్నానను కోండి.

కొన్ని రోజుల పోయి, కోపం తగ్గాక, అంత తక్కువ బరువు తేడా కనిపెట్టిన నన్ను, నా పరోక్షంలో మెచ్చుకున్నాడు. బంగారం పోయినందుకు బాధపడినా, నా సునిశిత పరిశీలనా నేర్పు పట్ల నాన్న ప్రశంస, నాకెంతో సంతోషం కలిగించింది.

అప్పుడే కాదు... మా బ్యాటరీ తయారీ సంస్థలో, మిక్సింగ్ యంత్రంలో లెడ్ ఆక్సైడు, పెరాక్సైడు, యాసిడ్ గట్రాలు కలిపి మిశ్రమం తయారు చేస్తాం. దాన్ని లెడ్ గ్రిడ్ కు అంటించి ఎలక్ట్రోడ్స్ (బ్యాటరీ ప్లేట్లు)ని తయారు చేస్తాం. అప్పుడు మిక్స్ అయిన కెమికల్‌ని చెక్కతో చేసిన ఘనంలో cm3 ఉన్న రంధ్రం చేసి అందులో కెమికల్ నింపి, సెన్సిటివ్ బ్యాలెన్స్‌తో బరువు కొలుస్తాం. అది 100 గ్రాములకు 5 గ్రాములు అటుఇటుగా ఉన్నా, మిక్సింగ్ సరిగ్గా ఉన్నట్లే! సరిగ్గా 100 గ్రాములు ఉంటే ఆ బ్యాచ్ ప్లేట్లు మరింత నాణ్యతతో ఉన్నట్లన్న మాట. దాన్ని crucible weight అంటాం.

ఆ క్రమంలో... మా ఫ్యాక్టరీలో వర్కర్స్, కెమికల్స్ మిక్చ్ చేసాక, క్రూసిబుల్ తీసుకొని నా దగ్గరికి వచ్చేవాళ్ళు. సరిగ్గా మిక్స్ అయ్యిందో లేదో పరిశీలించమని! దాన్ని తాకి స్పర్శతో, బొటన వేలు చూపుడు వేలు మధ్యా చిదిపి ధ్వనితోనూ కూడా well mixingని గుర్తించవచ్చు. ఆ విధంగా చెక్ చేసాక, క్రూసిబుల్ వెయిట్‌ని చేతిలోకి తీసుకోగానే అది 100 గ్రాములకి ఎంత ఎక్కువ లేదా తక్కువ ఉండగలదో చెప్పేసేదాన్ని! తర్వాత సెన్సిబుల్ బ్యాలెన్స్‌తో తూకం వేస్తే ఖచ్చితంగా అంతే ఉండేది. మా తమ్ముళ్ళు ఆశ్చర్యంగా అడిగే వాళ్ళు, అంత ఖచ్చితంగా ఎలా చెబుతావని. "జాగ్రత్తగా పరిశీలిస్తూ పోతే అదేం బ్రహ్మవిద్య కాదు" అనేదాన్ని!

పరిశీలించాలే గానీ ప్రతి మనిషిలోనూ... ఎన్నో నేర్పులూ, నైపుణ్యాలు!

అయితే ఇలాంటి కథలు, అలాంటి నైపుణ్యాల గురించి పిల్లల్ని ఉత్తేజితుల్ని చేస్తాయి, నైపుణ్యాలు సాధించాలనే వైపు ప్రోత్సహిస్తాయి. కథల పరమార్ధం పిల్లల్ని అలా తీర్చిదిద్దటమే కదా!

మంత్రవాది కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 25]

విక్రమాదిత్యుడు మళ్ళీ మోదుగు చెట్టెక్కి, తల్లక్రిందులుగా వేలాడుతున్న శవాన్ని దించి, భుజాన వేసుకుని బృహదారణ్యంలోని భద్రకాళి దేవాలయం కేసి నడవసాగాడు.

శవంలోని భేతాళుడు "ఓ విక్రమాదిత్య మహారాజా! నీకొక కథ చెబుతాను. దాని మీద ఓ ప్రశ్న వేస్తాను. నాకు జవాబు చెప్పకు. అప్పుడు నేను నీకు వశుడౌతాను. నీ బంటునై నీవు చెప్పిన పనులు చేస్తాను. కానీ జవాబు తెలిసీ చెప్పక పోయావో, నీ తల వేయి వక్కలు కాగలదు. తస్మాత్ జాగ్రత్త!" అని కథ చెప్పటం మొదలెట్టాడు.

బ్రహ్మచక్రం అనే ఊరిలోని బ్రాహ్మణ అగ్రహారంలో జటా గోపుడనే విప్రుడుందేవాడు. అతడి కొక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె అందాల బరిణె. (అందమంతా తెచ్చి ఓ చిన్ని బరిణె(డబ్బీ)లో పోసినట్లుందన్న మాట.) సుగుణాల రాశి. ఆ అమ్మాయి పేరు మృదుభాషిణి. (మృదువైన తీయని మాటలు మాట్లాడునది అని అర్ధం.) పేరుకు తగ్గట్టే ఆ పిల్ల మాట తీరు, నడవడిక ముగ్ధ మనోహరంగా ఉండేవి.

అందచందాలకు, ప్రవర్తనకు ఆమెకున్న మంచిపేరు తెలిసి, ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమెని పెళ్ళాడ గోరి వచ్చారు. ఒకడు ఆమె తండ్రియైన జటాగోపుణ్ణి కలిసి కన్యాదానం చెయ్యమని అర్ధించాడు. జటాగోపుడు సరేనన్నాడు.

మరొకడు ఆమె తల్లి, ఏటి నుండి నీళ్ళు తెస్తుండగా కలిసి, కాళ్ళ మీద పడి పిల్లనివ్వమని అడిగాడు. అతడి వినయ సౌశీల్యసౌందర్యాలు నచ్చి, ఆమె అలాగేనంటూ మాట ఇచ్చింది. మూడో వాడు, ఆ పిల్ల అన్నను కలిసి ప్రాధేయపడ్డాడు. అతడి స్నేహిశీలం, కలుపుగోలు తనం, మృదౌభాషిణి సోదరుడికి తెగ నచ్చేసాయి. దాంతో తన చెల్లెలిని అతడి కిచ్చి పెళ్ళి చేసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చాడు.

తీరా ఇంటికొచ్చి విషయం ముగ్గురికీ తెలిసాక, ఎవరికి వాళ్ళే, తమ మాటే నెగ్గాలని దెబ్బలాడుకోసాగారు. ఎవరికి వారికీ తమ మాటే చెల్లాలని, తము నిర్ణయించిన వాడికే మృదుభాషిణినిచ్చి పెళ్ళి చెయ్యాలనో పంతం హెచ్చింది.

ఇదంతా చూసిన సున్నిత మనస్కురాలైన మృదుభాషిణి చాలా ఆందోళనకూ, ఆవేదనకూ గురయ్యింది. ఎంతో వ్యధకు గురై మరణించింది. అమ్మ నాన్న అన్నలలో బాటు, ఆమె గురించి తెలిసిన ఊరి వాళ్ళు కూడా ఎంతో దుఃఖించారు.

ఆమె భౌతిక కాయాన్ని శశ్మానానికి తీసుకు వెళ్ళి, హిందూ సాంప్రదాయ ప్రకారం చితి పేర్చి దహనం చేశారు. ఆమెని పెళ్ళాడగోరి వచ్చిన బ్రాహ్మణ యువకులు ముగ్గురూ కూడా ఎంతో దుఃఖించారు.

వారిలో ఒకడు... మృదుభాషిణి చితి లోంచి కొంత బూడిదనీ, ఎముకలనీ తీసుకుని కాశీ నగరానికి బయలు దేరాడు. కాశీ క్షేత్రంలో అన్నపూర్ణా విశ్వేశ్వర స్వాములని దర్శించి, ఆమె కోసం ప్రార్ధించాలనుకున్నాడతడు.

మరొకడు... మృదుభాషిణి మరణంతో మనస్సు విరిగి, ఇహలోక బంధాలెంత అశాశ్వతమో ఆలోచిస్తూ, శ్మశానవైరాగ్యం కొద్దీ దేశాటనకు బయలు దేరాడు. మూడోవాడు... కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూ శ్మశానంలోనే కూలబడ్డాడు.

దేశాటనకి బయలు దేరిన రెండవ వాడు చిత్తమొచ్చినట్లు తిరగసాగాడు. ఆ పర్యటనలో ఓ రోజు ఓ గ్రామం చేరాడు. ఎండ మండుతోంది. మధ్యాహ్నమైంది. ఒక బ్రాహ్మణ గృహం చూసుకుని ఆ పూటకి ఆశ్రయం అడిగాడు. ఆ ఇంటి వాళ్ళు అతడిని అతిధిగా అంగీకరించి స్వాగతించారు.

ఆ యింటి పెరటిలో బావి దగ్గర స్నానం చేసి, మామిడి చెట్టు క్రింది గట్టు మీద అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. గృహస్తుల వంటగది అతడికి కనిపిస్తూనే ఉంది.

ఆ ఇంటి ఇల్లాలు వంట చేస్తూ ఉంది. వారింట సంవత్సరపు బిడ్డడున్నాడు. దోగాడుతూ వచ్చి తల్లిని మాటికీ విసిగిస్తున్నాడు. గిన్నెలన్నీ లాగుతున్నాడు. తల్లి చీర కుచ్చిళ్ళు గుంజుతున్నాడు. కాలికీ చేతికీ అడ్డం పడి ఏడుస్తున్నాడు. తల్లి ఎంత వారించినా, బుజ్జగించినా లాభం లేకపోయింది.

చివరికి సహనం కోల్పోయిన ఆ తల్లి, బిడ్డని విసిరి పొయ్యి మంటలో వేసింది. కణకణ మండుతున్న పొయ్యిలో, పసిబిడ్డ క్షణాల్లో కాలి బూడిద అయ్యాడు.

ఇదంతా చూస్తున్న అతిధి(మృదుభాషిణి ని పెళ్ళాడగోరిన రెండవ యువకుడు) ఒక్కసారిగా కెవ్వున అరిచాడు. "ఓరి భగవంతుడా!" అంటూ రెండు కళ్ళూ మూసుకున్నాడు. అతడి శరీరం గజగజా వణుకుతున్నది.

అవధుల్లేని ఆగ్రహంతో ఒక్కసారిగా అరుగు మీంచి లేచి నిల్చున్నాడు. గృహిణి అతణ్ణి చూసి దగ్గరి కొచ్చింది. అతడామె వైపు కొఱకొఱ చూస్తూ "ఓ బ్రాహ్మణి! నీవు మహా పాపివి. కౄరరాక్షసివి. నీ స్వంత బిడ్డనే చంపిన దానివి. నీ అంతటి ఘోర పాపి మరెవ్వరూ ఉండరు. నీ ఇంట అన్నపు మెతుకు ముట్టిన వాడికి పుట్టగతులుండవు. రాక్షసీ! చిన్న పాపడిని, పొయ్యి మంటలో వేసి చంపావే, కన్న తల్లి వేనా నువ్వు? నీ ముఖం చూసినా పాపమే! నీ ఇంట ఇక క్షణ మాగను. నీ తిండి నాకక్కర లేదు" అనేసి చరాలున పోబోయాడు.

ఆ ఇంటి ఇల్లాలు, అతడి పాదాలపై బడి ప్రార్ధించింది. "అయ్యా! సహనం పొందండి. అతిధి యైన మీరు మా ఇంట భోజనం చేయకుండా వెళ్తే, గృహిణిగా నేను అధర్మం పాటించిన దానినౌతాను. దయ చేసి ఆగండి" అని అతణ్ణి ఆపు చేస్తూ, పొయ్యిలొంచి కుర్రవాడి ఎముకల్నీ, బూడిదనీ కట్టెతో బయటకు తీసి, కుప్పగా చేర్చి, దానిపై నీళ్ళు సంప్రొక్షిస్తూ మృత సంజీవనీ మంత్రోచ్ఛటన చేసింది. ఆశ్చర్యం! మరుక్షణం పిల్లవాడు, సంతోషంగా బంతిలా ఆడుకుంటూ ప్రత్యక్షమయ్యాడు.

చూస్తున్న బ్రాహ్మణ యువకుడు నిరుత్తరుడయ్యాడు. కొన్ని క్షణాల తర్వాత తేరుకొని ఆ గృహిణి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు.
"అమ్మా! దయచేసి నాకా మంత్రం ఉపదేశించు" అని ప్రార్ధించాడు.

ఆ బ్రాహ్మణి చిరునవ్వుతో "అయ్యా! మా ఇంటికి అతిధి మీరు. ముందు మీరు భోజనం చేయండి. తప్పకుండా నేను మీకా మంత్రాన్ని ఉపదేశిస్తాను. మీరు అభోజనంగా, అసంతృప్తిగా మా ఇంటి నుండి వెళ్తే, అది మాకు శ్రేయస్కరం కాదు" అంది.

అతడు సంతోషంగా ఆ ఇంట భోజనం చేశాడు. ఆమె చిన్నారి కుమారుడిని ముద్దు చేస్తూ హాయిగా గడిపాడు. ఆ ఇల్లాలు అతడికి మృతసంజీవని మంత్రాన్ని ఉపదేశించింది.

మంత్రాన్ని పొందాడు గనుక అతడు మంత్రవాది అని పిలవబడ్డాడు. అవధుల్లేని ఆనందంతో మంత్రవాది బ్రహ్మ చక్రానికి తిరిగి వచ్చాడు! మృదుభాషిణిని పునరుజ్జీవితురాలిని చెయ్యగలను కదా అన్న ఆనందంలో, ఆతృతగా శ్మశానానికి వెళ్ళాడు. అప్పుడక్కడ ఎవరూ లేరు. మృదుభాషిణిని పెళ్ళాడ గోరి వచ్చిన వారిలో, మూడో యువకుడు ఇప్పటికీ ఏడుస్తూ శ్మశానంలోనే ఉన్నాడు. తైల సంస్కారం లేని జుట్టు, శుచీ శుభ్రతా లేని దేహం, పోషకాహారం లేని ప్రాణంతో పిచ్చివాడిలా ఉన్నాడు.

మంత్రవాది మృదుభాషిణి చితివైపు చూశాడు. అక్కడ ఆమె బూడిదగానీ, ఎముకలు గానీ ఏవీ లేవు. మంత్రవాది ఉత్సాహమంతా నీరు గారిపోయింది. నిరాశతో దుఃఖం వచ్చింది. సరిగ్గా అప్పుడే... మృదుభాషిణి అస్థికలూ, చితాభస్మమూ తీసుకొని కాశీకి పోయిన, మొదటి యువకుడు తిరిగి వచ్చాడు. కాశీలో ఆమె అస్థికలని గంగలో కలిపాక, కొన్నిటిని తీసుకొని తిరిగి బ్రహ్మచక్రానికి వచ్చాడు. వాళ్ళ ఆచారం ప్రకారం క్రతువులేవో నిర్వహించాలని అతడి ఊహ!

విషయం తెలిసి అతడు మృదుభాషిని చితాభస్మాన్ని, అస్థికల్నీ ఇచ్చాడు. మంత్రవాది వాటిని కుప్పగా పోసి, నీళ్ళు సంప్రోక్షిస్తూ మంత్రం చదివాడు. నిద్ర నుండి లేచినట్లు మృదుభాషిణి పునరుజ్జీవితురాలై లేచి కూర్చుంది.

వార్త ఊరు ఊరంతా ప్రాకింది. మృదుభాషిణిని తీసుకొని, ముగ్గురు యువకులూ జటాగోపుడి ఇల్లు చేరారు. మళ్ళీ రచ్చ మొదలు! ఆమె నాదంటే నాదని ముగ్గురు యువకులూ కలహించసాగారు. ఆమె అమ్మా, నాన్న, అన్నా కూడా, ఆమెను ఎవరికివ్వాలా అని గొడవ పడసాగారు.

ఇంత వరకూ కథ చెప్పిన భేతాళుడు "ఓ విక్రమాదిత్య మహారాజా! నీవు సాహసికుడవు. ఆ యోగి కోరిక తీర్చుట కొరకు, శవరూపంలోని నన్ను ఈ అర్ధరాత్రి వేళ మోసికొని పోతున్నావు. అంతేగాక నీవు సకల విద్యా పారంగతుడవు. కనుక ఓ రాజా! నీవు నిర్ణయించి చెప్పు! మృదుభాషిణిని పెళ్ళాడేందుకు అర్హుడెవరు?" అనడిగాడు.

విక్రమాదిత్యుడు "ఓ భేతాళుడా! మృదుభాషిణి చితాభస్మాన్నీ, అస్థికలనీ భద్రపరచి, కాశీకి తీసికెళ్ళి తెచ్చిన వాడు ఆమెకు పుత్ర సమానుడు. కాబట్టి అతడామెని పెళ్ళాడేందుకు అనర్హుడు. మృత సంజీవనీ మంత్రం నేర్చి, ఆమెకు పునఃప్రాణం పోసిన మంత్రవాది ఆమెకు పితృసమానుడు. కాబట్టి అతడూ ఆమెని వివాహమాడ తగడు. శ్మశానంలో కూర్చొని, ఏడుస్తూ ఉండిపోయిన మూడవ యువకుడే ఆమెని పెళ్ళాడెందుకు అర్హుడు" అన్నాడు.

ఇంకేముంది? మౌనభంగం అయ్యింది. భేతాళుడు మాయం! మోదుగ చెట్టు పైకి చేరటం ఖాయం! విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి శ్మశానం వైపు అడుగు లేసాడు.

కథా విశ్లేషణ:

ఈ కథలో ఇన్ని మలుపులు ఉండగా, చాలా చోట్ల టూకీగా కథని చెప్పటం చూశాను. నిజానికి అద్భుతరసం నిండి ఉన్న ఈ కథలో... ముగ్గురు యువకులు పోటీ పడటం, వధువు మరణించటం, ఒకడు కాశీకి పోవటం, ఒకడు దేశాటనం పోవటం, మరొకడు ఏడుస్తూ కూర్చొవటం, దేశాటనం పోయిన వాడికి హిమాలయాల్లో ఓ యోగి మంత్రం ఉపదేశించటంగా... ఈ కథ ఎన్టీఆర్ విక్రమార్క విజయం, భట్టి విక్రమార్కల్లో కూడా ఉంది. నిజానికి అది రసం పిండేసిన పిప్పిలాంటి కథ!

అతిధి ధర్మాన్నీ, బ్రాహ్మణితో మంత్రవాది సంభాషణనీ వివరించే కథలోని మలుపులు ఎంతో ఆసక్తికరంగా, అద్భుత రసంతో నిండి ఉంటాయి. అవన్నీ వదిలేసి రామాయాణాన్ని ‘కట్టె కొట్టె తెచ్చె’ అని చెప్పినట్లుగా చెబితే... నేర్చుకోవడానికి, ఆనందించడానికి ఏం మిగులు తుంది? ఈ కథలే కాదు, సాంప్రదాయ బద్దమైన ఇలాంటి జానపద కథలూ, పంచతంత్ర కథలూ కూడా, రసం పిండేసిన పిప్పిలాంటివే ప్రచారంలోనూ, ప్రచురణలోనూ ఉన్నాయి.

అసలైన కథలని అవలోకిస్తే అదో అద్భుత ప్రపంచమే!

ఇక్కడ ఓ గమ్మత్తు ఏమిటంటే, ముగ్గురు యువకుల్లో ఒకడు కాశీకి పోయాడు, మరొకడు దేశాటనం పోయాడు. ఎక్కడికీ పోకుండా, ఏమీ చేయకుండా, ఊరికే ఏడుస్తూ కూర్చున్న వాడికి ఫలితం దక్కింది. చాలా తక్కువసార్లు ఇలా జరుగుతుంది. పనిచెయ్యకుండా ఫలితం దక్కటం! దీన్నే మరో కోణంలో చూస్తే మిగిలిన ఇద్దరి కన్నా, ఏడుస్తూ కూర్చున్న వాడిలో "ఫీల్’ ఎక్కువగా ఉంది. బహుశః అందుకే పిల్ల దక్కిందేమో! :)

ముప్పొద్దులా తినమన్న నందీశ్వరుడు!

గోపూజ హిందూ జీవన విధానంలో ఓ భాగం. పుణ్యక్షేత్రదర్శనంలోనూ, శుక్రవారాల్లోనూ గోవుల్ని విశేషంగా పూజిస్తారు. ఇక పంటల పండుగ సంక్రాంతి మరునాడు కనుమపండుగ అంటూ పశువుల్ని పూజిస్తారు.

అందునా ఆరోజు ఆవుల్నీ, ఎద్దుల్నీ ముఖంగాక తోకని పూజిస్తారు. పశు సంతతి వృద్ధిని కోరుతూ, అలా పూజిస్తారని ఒక వాదన ఉంది. దీని గురించి మరో ఆసక్తికరమైన కధొకటి ఉంది.

అదేమిటంటే -

అప్పటికి మనుష్యులు ఇంకా వ్యవసాయం నేర్చుకోలేదట. అస్థిర నివాసులై, ప్రకృతిలో దొరికినవి తింటూ కాలం వెళ్ళబుచ్చుకున్నారట.

అప్పుడోరోజు... మహాశివుడు నందీశ్వరుణ్ణి పిలిచి, "నందీ! భూలోకానికి వెళ్ళి మానవులకి, ముప్పొద్దులా స్నానం చెయ్యమనీ, ఒక పొద్దు తిండి తిన మనీ’ చెప్పిరా!" అన్నాడట.

నందీశ్వరుడు అలాగే వెళ్ళొచ్చాడు. తిరిగి వచ్చిన నందీశ్వరుణ్ణి మహాశివుడు "నందీ! చెప్పి వచ్చావా?" అనడిగాడు.

"చెప్పాను స్వామీ!" అన్నాడు నంది.

"ఏం చెప్పావు?" అన్నాడు స్వామి.

" ‘ముప్పొద్దులా తినండి. ఒకపొద్దు స్నానించండి’ అని చెప్పాను స్వామీ" అన్నాడు నందీశ్వరుడు.

"ఏడ్చినట్లుంది! మూడు పొద్దులా తింటే తిండెక్కడ సరిపోతుంది?" అన్నాడు స్వామి.

నంది నాలుక్కరుచుకొని "పొరపాటయ్యింది స్వామీ" అన్నాడు.

"నువ్వే ఆ పొరపాటు దిద్దుదువు గాక! ఇక నుండీ... నీవు, భార్యా పుత్ర పుత్రీ సమేతంగా, భూలోకానికి పో! నీవూ, నీ పుత్రులూ దుక్కి దున్నటం దగ్గర నుండి పంట పండించీ, నీ భార్యాపుత్రికలు పాలిచ్చీ, మానవుల కడుపులు నింపండి, పొండి" అన్నాడట శివుడు.

ఆనాటి నుండి ఆవులూ, ఎద్దులూ మన కడుపులు నింపుతుండగా... మహాశివుడు, మనుష్యులకి వాటి ఆలనా పాలనా చూడవలసిన విధిని నిర్ణయించాడట.

కొన్నాళ్ళ తర్వాత, మనిషి పశుగణాల పరిరక్షణ సరిగా చేస్తున్నాడో లేదో తెలుసుకుందామని, అవుల్నీ, ఎద్దుల్నీ "మనిషి మిమ్మల్ని బాగా మేపుతున్నాడా?" అని మహాశివుడు అడిగితే, అవి లేదన్నట్లు తల అడ్డంగా ఊపి అబద్దం చెప్పాయట. అయితే తోకలని నిలువుగా ఊపి నిజం చెప్పాయట.

అప్పటి నుండీ మనుష్యులు, అబద్దం చెప్పిన ఆవు శిరస్సు కంటే, తోకని మరింత శ్రద్దగా పూజిస్తారని జానపద కథ.

ఏదేమైనా హిందువులు పశుగణాలని శ్రద్దగా పూజిస్తారన్నది మాత్రం నిజం.

ఆషామాషీగా తీర్పులు చెబితే ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 24]

"యువరాణి పద్మావతి విషయంలో, తండ్రినైన నేను పక్షపాతరహితంగా న్యాయవిచారణ చేయలేను. కాబట్టి నీవే న్యాయం పరికించు" అన్నరాజుతో...

మంత్రి "ఓ మహారాజా! స్త్రీని చంపడం కంటె మహాపాపం ఇంకొకటి లేదు. కాబట్టి పద్మావతికి మరణ శిక్ష విధించలేం. కనుక ఆమెని దేశ బహిష్కారం చేద్దాం. అదే ఆమెకి తగిన శిక్ష!" అన్నాడు గంభీరంగా!

రాజు విచారంగా సైనికులను పిలిచి "ఓ భటులారా! రాణీ వాసం నుండి యువరాణీ పద్మావతిని తీసికెళ్ళి, దుర్గమారణ్యాల నడుమ విడిచి రండి" అని అజ్ఞపించాడు.

రాజభటులు రాజాజ్ఞను శిరసావహించి, పద్మావతిని అడవి మధ్యలో వదిలారు. భయ విహ్వలయైన పద్మావతి, తన విధిని నిందించుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించసాగింది.

అప్పుడామెని, ఆ అరణ్య మధ్యంలో దేవపురం యువరాజు వజ్రకూటుడు, మంత్రి కుమారుడు తమ నిజరూపాలతో కలుసుకున్నారు. ఆమె తన చెలికాడిని గుర్తించి, ఆశ్చర్య పోయింది. ప్రక్కనే ఉన్న మంత్రి కుమారుణ్ణి చూసి, అతణ్ణి చంపబూనిన తన పన్నాగం గుర్తొచ్చి, మన్నించమని మనస్ఫూర్తిగా వేడుకొంది.

వారామెని చిరునవ్వుతో ఆశ్వాసించి, జరిగినదంతా వివరించారు. తర్వాత వారంతా దేవపురం చేరారు. దేవపురం రాజు ప్రతాపవంతుడు, తన కుమారుడి ప్రేమ వృత్తాంతాన్ని అంగీకరించి, పద్మావతి వజ్రకూటుల వివాహం జరిపించాడు. వివాహ నేపధ్యంలో నేత్రపురానికి కబురు పంపేలోగా జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

అప్పుటికే... నేత్రపురంలో, పద్మావతి తండ్రియైన ఉత్తానపాదుడు, కుమార్తె విషయంలో జరిగిన వాటిని నమ్మలేక, ఆమె ఎడబాటును సహించలేక, దిగులుతో మరణించాడు. ఆమె తల్లి కూడా... భర్త మరణాన్ని, కుమార్తె దురదృష్టాన్ని తట్టుకోలేక మృతి చెందింది.

భేతాళుడు విక్రమాదిత్యునికి ఈ కథ చెప్పి, "విక్రమాదిత్యా! ఈ కథను సావధానుడవై విన్నావు కదా? ఇందులో రాజు ఉత్తాన పాదుడు, అతడి భార్య మరణాలకు సంబంధించిన పాపం ఎవరికి చెందుతుంది? ఈ ప్రశ్నకు నీవు జవాబు చెప్ప వలసి ఉంటుంది" అన్నాడు.

విక్రమాదిత్యుడు చిరునవ్వుతో తలాడించి, "భేతాళా! విను! దేవపుర యువరాజు వజ్రకూటుడు, మంత్రి కుమారుడు, నేత్రపుర యువరాణి పద్మావతి, తమతమ భావోద్వేగాల మేరకు ప్రవర్తించారు. ఉత్తానపాదుడు, అతడి భార్య కూడా, మానవ సహజమైన భావోద్రేకాల మేరకు బాధననుభవించి మరణించారు.

అయితే.... న్యాయం చెప్పవలసిన స్థానంలో ఉండి, నేత్రపురపు మంత్రి, పద్మావతి విషయంలో తన ధర్మాన్ని సరిగా పాటించలేదు. తన కుమార్తెను సందేహించవలసి ఉన్నందున, తీర్పు నిష్పక్షపాతంగా చెప్పలేనని తలచిన ఉత్తాన పాదుడు, ఆ బాధ్యతను మంత్రికి అప్పగించాడు.

మంత్రి, పద్మావతి విషయంలో ఏం జరిగిందో విచారించలేదు. పద్మావత కి సంజాయిషీ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా, ఏక పక్షంగా తాము విన్న వివరాల మీద ఆధారపడి తీర్పు చెప్పాడు. జరిగిన దేమిటో పూర్వాపరాలు తెలుసుకోకుండానే, పద్మావతిని శవాలను పీక్కుతినే దోషిగా నిర్ధారణ చేసి, శిక్షని నిర్ణయించాడు.

అందుచేత రాజు రాణిల అర్ధాంతర మృతికి సంబంధించిన పాపం అతడికి చెందుతుంది" అన్నాడు.

ఈ విధంగా భేతాళుడు ప్రశ్న సంధించాడు. విక్రమాదిత్యుడు సమాధానం అందించాడు. విక్రమాదిత్యుడి మౌనం భంగమైంది. మరుక్షణమే విక్రమాదిత్యుడి భుజం మీది శవంలో అవాహనుడైన భేతాళుడు, శవంతో సహా మాయమై, తిరిగి మోదుగు చెట్టెక్కాడు. విక్రమాదిత్యుడది గమనించి, వెనుదిరిగి శ్మశానం వైపు అడుగువేసాడు. దూరాన మోదుగ చెట్టుకు వేలాడుతూ శవం కనబడుతోంది. చుట్టూ చీకటి చిక్కబడుతోంది.

~~~~~

కథా విశ్లేషణ:

ఈ కథ మనకి న్యాయమూర్తి బాధ్యత ఎంత గురుతరమైనదో తెల్పుతుంది. తెలిసి గానీ, తెలియక గానీ, అధర్మతీర్పు చెబితే, ఆ పాపం అతడికే చుట్టుకుంటుందనే నమ్మకం అనివార్యంగా, న్యాయమూర్తి, నిష్పాక్షిక న్యాయం చేసేటట్లు, తగిన తీర్పు చెప్పేటట్లు చేస్తుంది.

అలాంటి స్థితి నుండి నేటి సమాజం ఎక్కడికి ప్రయాణించింది?
కక్షిదారుల నుండి డబ్బులు తీసుకుని తీర్పులు చెప్పే న్యాయమూర్తుల దాకా,
అందుకోసం న్యాయవాదులతో లోతట్టు స్నేహ సంబంధాలు కొనసాగించే న్యాయమూర్తుల దాకా,
పదోన్నతుల కోసం అధికార పార్టీకి అనుకూలంగా తీర్పులు వెలువరించే న్యాయమూర్తుల దాకా!

సంస్కృతినీ, నమ్మకాలనీ వదిలిపెట్టి, దమ్మిడీల కోసం పరుగులు పెడితే, సమాజం ఇక్కడికే ప్రయాణిస్తుంది. దమ్మిడీల పరుగులో వేగనిరోధకల్లాగా... ఇలాంటి కథలూ, ఇతిహాసాలూ పనిచేస్తాయి. అందుకే, పనిగట్టుకుని మరీ... కథలని, ప్రజల జీవితం నుండి తరిమేసి, గోచీపాతలు వేసుకునే నాయికల ప్రేమకథలతో, ప్రజా జీవితాలని కుమ్మేసే కుటిల యత్నాలు ముమ్మరంగా నడుస్తుంటాయి.

ఇలాంటి జవాబు చెప్పాడంటే మహారాజుగా న్యాయనిర్ధారణ చేసేటప్పుడు విక్రమాదిత్యుడు ఎంత జాగరూకుడై ఉంటాడో తెలుస్తోంది.

~~~~~~

మంత్రి కుమారుడి మాయోపాయం ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 23]

పాయసం తిన్న కుక్క ప్రాణాలు విడవటంతో, యువరాజు ఖంగుతిని, "ఇంత పన్నాగాన్ని నేను పసికట్టలేదు" అన్నాడు. మంత్రి కుమారుడు "యువరాజా! ఆమెనంత ప్రతికూలంగా చూడకు. నీ మీద ప్రేమతో, ఆమె నా చావుకోరుకుంది. నీ సాన్నిహిత్యం పట్ల ఆమెకున్న అభద్రత అది!" అన్నాడు.

దానికి పరిష్కారం కోసం వాళ్ళిద్దరూ కాస్సేపు ఆలోచించారు. ఆమెని తమ నగరానికి తీసికెళ్ళి వివాహం చేసుకోవటమే తగిన పరిష్కారమని తోచింది యువరాజుకి. ఇంత జరిగాక పద్మావతి తండ్రియైన ఉత్తాన పాదుడి దగ్గరి కెళ్ళి పిల్లనడగాలని పించలేదు. ఎంతో తెలివైన పద్మావతికీ ఒక పాఠం నేర్పాలనుకున్నారు.

మంత్రి కుమారుడు బాగా ఆలోచించి "మంచిది, మిత్రుడా! ఆమె దగ్గరికెళ్ళి నాకు పాయసం ఇచ్చానని చెప్పు. కొంత తడవు ఆమెతో గడిపాక, ఆమె నిద్రించే సమయంలో, మెడలోని ముత్యాల హారాన్ని తస్కరించి తీసుకురా! వచ్చే ముందు, నీ చేతి మూడు వ్రేళ్ళ గోటి గుర్తులు పడేలా, ఆమె వక్షస్థలం మీద గుచ్చి, వచ్చెయ్" అని చెప్పాడు.

ఆ రాత్రి, యువరాజు తన మిత్రుడైన మంత్రి కుమారుడు చెప్పినట్లే చేసి, ముత్యాల దండ తీసుకొచ్చాడు.

మరునాటి ఉదయం, మంత్రి కుమారుడు తాను యోగిలా వేషం ధరించి, యువరాజుకి తన శిష్యుడి వేషం వేసాడు. ఇద్దరూ శశ్మానం ప్రక్క నున్న చెట్టు క్రింద కూర్చొని, తపస్సు నటించారు. అలా కొంత సేపు, అటు ఇటు పోయే ప్రజల కంట బడ్డాక, గురువు [మంత్రి కుమారుడు], శిష్యుణ్ణి [యువరాజుని] పిలిచి "నువ్వు పోయి రాచ వీధిలో ఈ ముత్యాల హారాన్ని ప్రదర్శించు. రాజు దాన్ని గురించి నిన్ను ప్రశ్నించినప్పుడు, నా గురించి వివరించి, ఇక్కడికి తీసుకురా!" అని చెప్పాడు.

యువరాజు అలాగే చేసాడు. రాజు ఉత్తాన పాదుడికి, రాచవీధిలో సాధువు శిష్యుడొకడు, మంచి మేలిమి ముత్యాల హారాన్ని ప్రదర్శిస్తూ, అమ్మకానికి పెట్టాడని తెలియ వచ్చింది. రాజతణ్ణి పిలిపించి, ధర ఎంతని వాకబు చేసాడు.

శిష్యుడిలా నటిస్తున్న యువరాజు అమాయకంగా ముఖం పెట్టి "మహారాజా! నా కదేమీ తెలియదు. మా గురువు గారు మీకన్ని విషయాలు చెప్పగలరు. మీరాయన్ని దర్శించడం మంచిది. శశ్మానం ప్రక్కన ఆయన ధ్యానం చేసుకుంటున్నారు" అన్నాడు.

ముత్యాల హారాన్ని పరిశీలించిన రాజుకి, అది తన కుమార్తె పద్మావతి దని అనుమానం వచ్చింది. దాంతో అతడు ఆ యోగిని చూడాలని తీర్మానించుకున్నాడు. మంత్రితో కలిసి మాయాయోగిని చూడబోయాడు.

చెట్టుక్రింద ధ్యాన ముద్రలో ఉన్న మాయా యోగి దగ్గరికి చేరి, రాజు, మంత్రి అతడికి నమస్కరించారు. అతడు వీళ్ళని దీవించి ప్రక్కనే కూర్చొనమని ఆదేశించాడు. రాజు అతణ్ణి ముత్యాల హారం గురించి అడిగాడు.

యోగి "ఓ రాజా! నేనిక్కడ ధ్యానం చేసుకుంటున్నాను. అయితే ప్రతీ రాత్రి, ఒక అందమైన యువతి ఇక్కడికి రావటం చూశాను. ఆమె శశ్మానం చేరి, చితిలో సగం కాలిన శవాల్ని బైటకు లాగి, పీక్కు తింటోంది. అలా ఆమె చాలా ఆకలిగా, ఆబగా తినటం గమనించాను. ఆకలి చల్లారాక, తృప్తిగా తలాడించి, ఆమె మీ నగరం వైపు వెళ్తోంది. ప్రతీ రోజూ ఇలాగే జరుగుతోంది.

ఆమెని పరీక్షింపగోరి, నిన్నటి రాత్రి, ఆమెని నా త్రిశూలంతో అడ్డగించాను. నా త్రిశూలంతో ఆమె గుండెల మీద పొడిచి "ఎవరు నువ్వు" అని గద్దించాను. అమె గజగజ వణికింది. నా పాదాల మీద పడి ప్రాధేయపడుతూ, తన మెడలో నుండి ముత్యాల హారం తీసిచ్చింది.

చేతులు జోడించి ఆర్దిస్తూ " ఓ యోగి పుంగవా! రక్షించు. నా రహస్యాన్ని కాపాడు. ఎవరికీ బహిరంగ పరచకు" అని ప్రార్దించింది.

నా కామెను చూసి జాలి కలిగింది. "అమ్మాయీ! ఎవరు నువ్వు? ఎందుకింత భయంకర నీచ కృత్యం చేస్తున్నావు?" అని అడిగాను.

"అయ్యా! నా పేరు పద్మావతి! నేనిలా చేయకపోతే నా కడుపు నిండదు" అనేసి పరుగెత్తి పారిపోయింది. అందుచేత ఈ ముత్యాల హారం నాది కాదు. అందుచేత దీన్ని నా శిష్యుడికిచ్చి రాజ వీధిలో ప్రదర్శించమన్నాను. ఆ విధంగా దాని స్వంత దారుకి ఆ దండని చేర్చాలన్నది నా ఉద్దేశం. ఏమైతేనేం, విషయం మీకు తెలిసింది. ఈ హార మెవ్వరిదో విచారించి, స్వంతదారుడికి దీన్ని అందచేయండి" అన్నాడు మాయోయోగి.

ఇదంతా విని రాజు ఉత్తాన పాదుడు దిగ్భ్రాంతి పడినాడు. అన్యమనస్కంగానే మాయాయోగి వద్ద, అతడి శిష్యుని వద్ద సెలవు పుచ్చుకొని, మంత్రితో సహా నేత్రపురానికి తిరిగి వచ్చాడు.

మాయాయోగి చెప్పినదంతా వినేసరికి, ఉత్తానపాదుడు తన కుమార్తె పద్మావతినే శంకించాడు. రాజమందిరం చేరాక, రాణిని పిలిచీ, విషయమంతా వివరించాడు.

సందేహం తీరక "రాణీ! మన కుమార్తె పద్మావతి దగ్గరకు పోయి, ఆమె మెడనూ, హృదయసీమనీ పరీక్షించిరా!" అని పంపాడు. రాణి ముత్యాల హారాన్ని తమ కుమార్తెదిగా గుర్తించింది.

భర్త చెప్పినట్లే పోయి పద్మావతి మెడనూ, వక్ష స్థలాన్నీ పరీక్షించింది. యువరాణి వక్షస్థలం మీద మూడు గాయపు గుర్తులున్నాయి. తల్లి కుమార్తెతో "పద్మావతి! ఇది నీ ముత్యాల హారమే కదా?" అని ప్రశ్నించింది, దండ చూపిస్తూ!

పద్మావతి ఒక్కసారిగా కలవర పడింది. తల్లి దండ్రులకి తన రహస్య ప్రణయ వ్యవహారం తెలిసి పోయిందని తలచింది. సిగ్గూ, భయం, తప్పు చేసానన్న లజ్జా భావం ముప్పిరి గొనగా, కన్నీళ్ళతో తలదించుకుంది.

రాణి తిరిగి వెళ్ళి రాజుకన్నీ వివరించింది. ఇద్దరికీ చాలా బాధ కలిగింది. రాజది దిగమింగుకుంటూ, "ఓ మంత్రీ! ఈ వ్యవహారంలో నీవే తీర్పు చెప్పాలి. ఇట్టి నీచకార్యం చేసింది, యువరాణి అయినా, మరొకరు అయినా.... మనం మన ధర్మం తప్పకూడదు. యువరాణి పద్మావతి విషయంలో, తండ్రినైన నేను పక్షపాతరహితంగా న్యాయవిచారణ చేయలేను. కాబట్టి నీవే న్యాయం పరికించు" అన్నాడు.

~~~~~~

పిసినారి ధనయ్య!

అనగా అనగా….

ఓ ఊళ్ళో ధనయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు వట్టి ఆశపోతు. మీదు మిక్కిలి పిసినారి కూడాను. లాభాల మీద ఆశకొద్దీ కల్తీ నెయ్యి అమ్మేవాడు.

ఓసారి ఊరికామందు ఇంట్లో పెళ్ళికి కూడా కల్తీనెయ్యి సరఫరా చేశాడు. ఆ నేతితో చేసిన మిఠాయిలు తిన్న చుట్టాలందరికీ వాంతులయ్యాయి.

దాంతో ఊరికామందు ధనయ్యని పిలిపించి పంచాయితీ పెట్టించాడు. నెయ్యి కల్తీదని ఋజువు కావటంతో ధనయ్యని దోషిగా నిర్ధారించాడు. దాంతో శిక్ష ఖరారయ్యింది.

వెయ్యి వరహాల జరిమానా విధించారు. పిసినారి ధనయ్య కట్టలేనన్నాడు.

వంద కొరడా దెబ్బలు విధించారు. దెబ్బలు తినలేనన్నాడు.

అయితే మణుగు నెయ్యి తాగమన్నారు. ఆశపోతు ధనయ్యకి ఈ శిక్ష లాభసాటిగా అన్పించింది. సరేనన్నాడు.

కానీ సగం నెయ్యి తాగేసరికీ గుడ్లు తేలేసాడు.

దాంతో కొరడాదెబ్బలు తింటానన్నాడు. కానీ యాభై దెబ్బలు తినేసరికీ బేర్ మన్నాడు.

నోరు మూసుకుని వెయ్యి వరహాలు జరిమానా కట్టి ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు.

పిసినారి ధనయ్యకి తగిన శాస్తి జరిగిందని ఊళ్ళో వాళ్ళంతా నవ్వుకున్నారు. ధనయ్య మాత్రం తన పిసినారితనంతోనూ, ఆశపోతుతనంతోనూ వరసగా అన్ని శిక్షలూ అనుభవించి, అసలు అదే సరైన శిక్ష అన్పించుకున్నాడు.


~~~~~~~~~~

పైన కోపం – లోన ప్రేమ ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 22]

పదవకొండవ రోజున, పేదరాశి పెద్దమ్మకి మరిన్ని విలువైన కానుకలిచ్చి రకరకాలుగా ధైర్యం చెప్పి, పద్మావతికి సందేశం పంపారు. భయం భయంగానే అయినా, పేద రాశి పెద్దమ్మ పద్మావతి దగ్గరికి పోయి, పూల దండలిచ్చి, ఎవరూ లేకుండా చూసి గుసగుసగా దేవపురం యువరాజు వజ్రకూటుని గురించి చెప్పింది. అడవిలో సరస్సు దగ్గరి సంగతులు కూడా గుర్తు చేసింది.

ఈ సారీ పద్మావతి కోపమే చూపించింది. కుడిచేతి మూడువేళ్ళు ఎర్రని కుంకుమలో ముంచి, ముసలిదాని గుండెల మీద, పమిటపైన మూడు గుర్తులు పడేలా ఓ పోటు పొడిచింది. సుతారంగా తిడుతూ, తన మందిరపు దొడ్డివాకిలి ద్వారా పూటకూళ్ళ ముసలమ్మని వెళ్ళగొట్టింది.

పేదరాశి పెద్దమ్మ ఏడుస్తూ పోయి, యువరాజుకూ, మంత్రి కుమారుడికీ జరిగిందంతా చెప్పింది. ఆమెకు మరిన్ని కానుకలిచ్చి సంతోషపరిచాడు మంత్రి కుమారుడు. పద్మావతి ఇలా కోపం చూపించటం, రెండోసారి కూడా జరిగే సరికి, యువరాజుకి నిరాశ తోచింది. చింత పడ్డాడు.

మంత్రి కుమారుడు యువరాజుని ఓదార్చి, ఉత్సాహపరిచాడు "నా ప్రియమైన మిత్రుడా, యువరాజా! దిగులుపడకు! యువరాణి నిన్ను తన అంతఃపురపు వెనక గుమ్మం ద్వారా రమ్మనీ, అదీ మూడురోజుల తర్వాత రమ్మనీ కబురు పంపింది. ఆమె ఇప్పుడు ఋతు క్రమంలో ఉన్నందున, నిన్ను మూడు రోజుల గడువు కోరింది. అది నీకు సంకేతంగా ఉండేందుకే, ఎర్రని కుంకుమ గుర్తులు పడే విధంగా ముసలమ్మ పమిట మీద కొట్టి, వెనుక గుమ్మం ద్వారా పంపింది" అని విడమరిచాడు.

[పైకి చూడటానికి యువరాణి కోపం చూపించినట్లే ఉంటుంది. అందులో నుండే యువరాజుకు సందేశం పంపింది. ఈ ముసలి దానికి మాత్రం అదేమీ తెలియదు. జీవిత కాలం పాటు యువరాణి కోపమే గుర్తుండి పోతుంది. అదీ సంకేత భాషలో సౌలభ్యం!]

యువరాజుకి ఎంతో సంతోషం కలిగింది. మూడు రోజులు ఎలాగో ఓపిక పట్టాడు. నాలుగో రోజు చీకటి పడినాక దేవపురం యువరాజు వజ్రకూటుడు... అభ్యంగన స్నానమాచరించి, పట్టు పీతంబరాలు రత్నాభరణాలు ధరించి, పద్మావతి మందిరానికి, వెనుక గుమ్మం ద్వారా వెళ్లాడు. రహస్యంగా ఆమె అతణ్ణి కలుసుకుంది.

ఆనాటి నుండి ఆమెతో యువరాజు 10 రోజుల పాటు ఆనందంగా గడిపాడు. ఎవరికీ తెలియకుండా, తన అంతరంగిక మందిరంలో అతణ్ణి రహస్యంగా దాచి ఉంచింది పద్మావతి. ఆమె ఆటపాటలతో, సాన్నిహిత్యంతో... యువరాజుకు రోజులు క్షణాల్లా గడిచిపోయాయి.

అందమైన పద్మావతి... పలుకనేర్చిన చిన్నారి, పలు కళలు నేర్చిన వయ్యారి కావటంతో, ఆమె ప్రేమలో బడి యువరాజు, తన ప్రాణస్నేహితుడైన మంత్రి కుమారుణ్ణి కూడా మరిచిపోయాడు. ఇలా పది రోజులు గడిచేసరికి, ఓ రోజు రాజకుమారుడికి తన మిత్రుడు గుర్తుకొచ్చి బెంగ తోచింది.

"ఎంత చెడ్డవాడిని నేను? చిన్న నాటి నుండీ... నేనూ, మంత్రి కుమారుడూ, కన్నూ కనురెప్ప వలె కలిసి యుంటిమి కదా? కలిసి విద్యలు నేర్చి, కలిసి తిరిగి, కలిసి బ్రతికినాము. ఇప్పటి వరకు అతడినొక్క దినమైననూ విడిచి యుండలేదు. నేటికి, ఈ సుందర నారితో వలపు రీత్యా, నా ప్రియమిత్రుణ్ణి మరచినాను గదా?" అని ఆలోచిస్తూ యువరాజు చింతా క్రాంతుడయ్యాడు.

దాంతో నిరుత్సాహంగా ఒక మూల కూర్చొండి పోయాడు. యువరాణి పద్మావతి ఇదంతా గమనించింది. అతడి దరిచేరి, "ఓ ప్రియా! యువరాజా! నీవీ రోజు మునుపటి లా లేవు. ఏదో దిగులుతో, నిరుత్సాహంతో ఉన్నావు. నీకు నా సాన్నిహిత్యము విసుగు కలిగించి నదా? నా ప్రేమ నీకు చేదైనదా?" అని అడిగింది.

యువరాజు; "లేదు ప్రేయసీ! అలా అనుకోకు. నాకు నీవనిన ఎంతో ప్రేమ! నాకు చిన్ననాటి నెచ్చెలి యెకడు కలడు. అతడు మా మంత్రి కుమారుడు. బాల్యము నుండీ మేమిరువురమూ ఒకే కంచం, ఒకే మంచము మాదిరి కలిసిమెలిసి యుంటిమి. అతడి సాయముతోనే, నేను నిన్ను కలుసుకోగలిగితిని. మీ నగరమునకునూ ఇద్దరం కలిసే వచ్చి యున్నాము. ఇప్పుడు పది రోజులుగా అతడి ఊసైననూ ఎత్తక, నీ సాంగత్యమున బడి అతనిని వదిలి ఉంటిని. ఇది తలంచి నాకు తప్పు చేసినట్లని పించుచున్నది. లజ్జా భావము కలుగుచున్నది. అంతే! అందుకే దిగులుగా నుంటిని" అన్నాడు.

అది వినగానే పద్మావతి మనస్సులో అసంతృప్తి, అసూయ కలిగాయి. తన ప్రియునికి తనకంటే అతని బాల్య మిత్రుడే ఎక్కువ కావటం ఆమెకి క్రోధం కలిగించింది. అయితే ఇవేవీ ఆమె బయట పెట్టలేదు. కొన్ని క్షణాల తర్వాత, తనకు అత్యంత నమ్మకస్తురాలైన చెలికత్తెను పిలిచి, పాయసము చేసి తెమ్మన్నది. చెలికత్తె తెచ్చిన పాయసంలో విషం కలిపి, యువరాజు దగ్గరికి వచ్చింది.

"ఓ యువరాజా! నా ప్రియ సఖా! నీవు దిగులు చెందకు. మీ స్నేహితుడు నాకునూ ఆదర పాత్రుడే! నా కానుకగా ఈ పాయసమును తీసికెళ్ళి నీ మిత్రుని కిమ్ము. అతడీ పాయసమును ఆరగించిన పిదప, అతనితో కొంత సమయము సంతోషముగా గడిపి రమ్ము" అంటూ పాయసము గిన్నెను యువరాజు కిచ్చింది.

దాంతో యువరాజుకి ఆమె మీద మరింత ప్రేమ కలిగింది. ఆమెతో కొన్ని క్షణాలు మురిపాలాడి, పాయసం గిన్నె తీసుకొని, స్నేహితుడి దగ్గరికి బయలు దేరాడు. పద్మావతి మీద గల అనురాగం కొద్దీ, అతడేదీ శంకించలేదు.

స్నేహితుణ్ణి చూడగానే సంతోషంగా పలకరించి, పాయసం గిన్నె ఇచ్చాడు. ఎంతో ప్రేమతో కబుర్లు చెబుతూ, పాయసం తాగ మన్నాడు. మంత్రి కుమారుడు గిన్నెలోకి తీక్షణంగా చూసి "యువరాజా! నీ బాల్య మిత్రుణ్ణయిన నన్ను చంపటానికి, పాయసంలో విషం కలిపి తెచ్చావా?" అన్నాడు.

అది విని యువరాజు బిత్తర పోయాడు. ‘ఎందుకిలా అంటున్నాడతడు? ఎంతో ప్రేమతో నేను పాయసం తీసుకు వస్తే..., నేనెంతో ప్రేమతో తెచ్చానో, తానంత ప్రేమతో దాన్ని ఆరగించక, ఇలా సందేహిస్తున్నాడేమిటి? ఇతడికి నా మీద స్నేహం తగ్గి పోయిందా?’... అనుకుంటూ అలాగే చూడసాగాడు.

మంత్రి కుమారుడిదంతా గమనిస్తూనే ఉన్నాడు. పాయసపు పాత్రతో వీధిలోనికి వచ్చి, ఊరకుక్కని పిలిచి, పాత్ర దాని ముందుంచాడు. పాయసం తిన్న కుక్క మరుక్షణం క్రిందపడి, గిలగిల కొట్టుకుని ప్రాణాలు విడిచింది.


~~~~~~~~~~~

మూగ బాసల అర్ధాలేమిటి? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 21]

భేతాళుడు మొదటి కథ ప్రారంభించాడు.

ఒకప్పుడు దేవాపురం అనే నగరం ఉండేది. ఆ నగరాధీశుడి పేరు ప్రతాపవంతుడు. అతడికొక కుమారుడు; పేరు వజ్రకూటుడు. ప్రతాప వంతుడి మంత్రికీ ఒక కుమారుడున్నాడు. రాజు, మంత్రి కుమారులిద్దరూ సమ వయస్కులు. ప్రాణ స్నేహితులు కూడా! అనతి కాలంలోనే గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసి, ఇరువురూ నగరానికి తిరిగి వచ్చారు.

నెలకో రోజు ఇద్దరూ కలిసి, సపరివార సమేతంగా వేటకై అడవికి వెళ్ళేవారు.

అదే విధంగా, ఓ రోజు యువరాజు, మంత్రి కుమారుడూ వేట కెళ్ళారు. అడవిలో వేటాడుతుండగా వాళ్ళకొక సుందర సరోవరం కనబడింది. ఆ సరస్సులో అందమైన యువతి ఒకామె జలకాలాడుతోంది. ఆమెని చూడగానే యువరాజు ముగ్ధుడై పోయాడు. తొలి చూపులోనే ప్రేమలో పడి పోయాడు. ఒడ్డుకు చేరుకున్న ఆమె కూడా యువరాజుని చూసింది. అతడి అందమైన రూపానికి ఆమె కూడా ముగ్దురాలై, ప్రేమలో పడింది.

చెంపలు ఎర్రబడగా తల దించుకొంది. యువరాజు రెప్పలార్పక ఆమెనే చూస్తున్నాడు. ఆ యువతి క్రిందికి వంగి, కొలనులో నుండి పద్మాన్ని కోసింది. పద్మాన్ని తన రెండూ కళ్ళకూ తాకించుకొంది. దాన్ని మునిపంట కొరికి, పాదాల మీద వేసుకుంది. మరోసారి కొలనులో నుండి కలువ పూవు నొకదాన్ని కోసింది. ఆ పూవును సున్నితంగా ముద్దాడి, హృదయానికి తాకించుకుంది. ఆపైన సిగలో పెట్టుకొని, రాకుమారుడి వైపు క్రీగంట చూసి, ముసిముసి నవ్వులతో అక్కడి నుండి వెళ్ళిపోయింది.

ఆమె అందాన్నీ, చేతల్నీ చూసి యువరాజు దిమ్మెర పోయాడు. మంత్రి కుమారుడితో "మిత్రుడా! ఆ యువతి నా మనస్సు హరించింది. చూడగా ఆమె చేతలకేదో సంకేతార్ధమున్నట్లు తోచుచున్నది. ఆమె చర్యల కేది అర్ధమై ఆలోచించి చెప్పు" అన్నాడు.

మంత్రి కుమారుడు కొన్ని క్షణాలు ఆలోచించి "యువరాజా! ఆమె పద్మాన్ని కనులకి తాకించుకొంది. ఆ విధంగా ఆమె తన నివాసం ఈ దాపులనే ఉన్న నేత్రపురమని చెప్పింది. పద్మాన్ని మునిపంట కొరికింది. ఆ విధంగా ఆమె తన పేరు పద్మావతి అని చెప్పింది. పిదప పద్మాన్ని పాదాల మీద పడవేసింది. అంటే ఆమె తండ్రి పేరు ఉత్తాన పాదుడన్న మాట.

ఆమె కలువ పూవును ముద్దాడి, హృదయానికి తాకించుకొంది. కలువ పూవు చంద్రుని ప్రేయసి. ప్రేమకు చిహ్నం. ఆ విధంగా, ఆమె తాను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని సంకేతమిచ్చింది. కలువని సిగలో తురిమి, మిమ్మల్ని ఓరకంట చూసి, ముసిముసిగా నవ్వి వెళ్ళిపోయిందంటే అర్ధం, మీరు తనని రహస్యంగా వచ్చి కలుసుకోమని. ఇవీ ఆమె చర్యలకు అర్ధాలు" అన్నాడు సాలోచనగా!

యువరాజుకి పట్టలేనంత సంతోషం కలిగింది. వేట చాలించి, పరివారంతో కలిసి దేవపురానికి తిరిగి వెళ్ళారు. తర్వాత ఇద్దరే మారువేషాల్లో బయలు దేరి, నేత్రపురం వెళ్లారు. అక్కడికి వెళ్ళి వాకబు చేస్తే తేలిందేమంటే - ఉత్తాన పాదుడు నేత్రపురాధీశుడు. పద్మావతి అతడి కుమార్తె.

అంతఃపురంలో ఉండే యువరాణి నెలా కలవటం? రాజు, మంత్రి కుమారులిద్దరూ, పద్మావతి దాసదాసీ జనుల వివరాలు సేకరించారు. యువరాణి పద్మావతికి పూమాలికలు అల్లి తీసికెళ్ళే దాసీ గురించి తెలుసుకున్నారు. ఆమె పూటకూళ్ళ ఇల్లు కూడా నడిపే పేదరాశి పెద్దమ్మ. పూలదండలని వైనవైనాలుగా అల్లే ఆమె చాతుర్యం రీత్యా, ప్రతీరోజూ యువరాణికి ఆమె పూలమాలలు తీసికెళ్ళి ఇచ్చేందుకు నియమింపబడింది.

రాజు, మంత్రి కుమారులిద్దరూ పూటకూళ్ళ అవ్వ ఇంట బస చేసారు. [పూర్వకాలపు హోటళ్ళనే పూటకూళ్ళ ఇళ్ళనే వాళ్ళు. అక్కడ డబ్బులిస్తే బస, ఆహారం దొరుకుతాయి.] విలువైన కానుకలిచ్చి, పూటకూళ్ళ అవ్వను బాగా మంచి చేసుకున్నారు. రెండు రోజులున్నాక అవ్వకు అన్ని విషయాలు చెప్పి, ఆమె ద్వారా పద్మావతికి తన రాక గురించి సందేశం పంపించాడు యువరాజు.

పూటకూళ్ళ అవ్వ యువరాణికి పూదండలిచ్చాక, ఎవరూ లేకుండా చూసి, యువరాజు రాక గురించీ, ఇతర వివరాలన్నీ చెప్పింది. అదంతా వినగానే పద్మావతి కోపంతో భగ్గుమంది. తన పదివేళ్ళనీ తెల్లని చల్లని చందనంలో ముంచి, ముసలవ్వ బుగ్గల మీద పదివేళ్ళ గుర్తులు పడేలాగా, చెంపల మీద సున్నితంగా కొట్టింది.

ఆపైన తిట్టి వెళ్ళగొట్టింది. పేద రాశి పెద్దమ్మ, యువరాణి కోపాన్ని చూసి, తిట్లు వినీ, దెబ్బలు తినీ, భయంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చింది. పులి పంజా నుండి తప్పించుకొచ్చిన లేడి కూనలా గజగజా వణుకుతూ, రాజు, మంత్రి కుమారులకి చెంపమీద వేళ్ళ గుర్తులు చూపిస్తూ పొగిలి పొగిలి ఏడ్చింది. యువరాజు ఏదో చెప్పబోయాడు.

అవ్వ”చాలు నాయనలారా చాలు! బహుశః ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసు కాబోలు. అందుకే అమాయకపు ముసలి దాన్ని నన్నెంచుకున్నారు. ఇంత వయస్సు వచ్చి, మీ చేతుల్లో ఇలా మోసగించబడ్డాను. ఇంతకూ మిమ్మల్నన పనేమిటి? ఇందులో మీ తప్పేం లేదు. తప్పంతా నాది. మిమ్మల్ని నమ్మి, ఈ వయస్సులో ఇలా భంగపడ్డాను!” అంటూ అంగలార్చింది.

పేదరాసి పెద్దమ్మ పెడబొబ్బలు విని యువరాజు మ్రాన్పుడిపోయాడు. యువరాణి పద్మావతికి కోపం రావట మేమిటని నిర్ఘాంతపడ్డాడు. పాపం, యువరాజుకి బెంగ కూడా వేసింది.

మంత్రి కుమారుడు యువరాజును ఊరడించి, ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయాడు. "ఓ యువరాజా! ఆమె సామాన్యురాలు కాదు. ఎంత అందమైనదో, అంత తెలివైనది. ఆమె పేదరాశి పెద్దమ్మ చెంపల మీద, తెల్లని గంధంలో ముంచిన పదివేళ్ళ గుర్తులు పడేలా సున్నితంగా కొట్టింది. నిజంగా కోపం ఉన్నదే అయితే సున్నితంగా కొట్టదు. చెంపలు వాతలు తేలేలా కొట్టి ఉండేది. అంతే కాదు, కేవలం తిట్లతో సరిపెట్టేది కాదు, రాజు గారితో చెప్పి ముసలవ్వకు శిక్ష వేయించేది. కాబట్టి, ఆమెకు నీ మీద ప్రేమలేదని బెంగపడకు.

ఒక ప్రత్యేక సంకేతాన్నిచ్చేందుకే ఆమె ఇలా చేసింది" అన్నాడు. యువరాజు ఆతృతగా "అవునా? ఏమిటా సంకేతం?" అనడిగాడు.

మంత్రి కుమారుడు "ఇప్పుడున్నవి శుక్ల పక్షపు రోజులు. ఈ రోజు పంచమి. రానున్న రోజులన్నీ వెన్నెల రోజులే! నేటికి పదవ రోజున పున్నమి. తర్వాత కృష్ణ పక్షపు రోజులొస్తాయి. అప్పుడంతా చీకటిగా ఉంటుంది. కాబట్టి, మిమ్మల్ని పదిరోజులు పాటు వేచి ఉండమన్న సంకేతం పంపింది." అని విడమరిచి చెప్పాడు. యువరాజు స్థిమితపడ్డాడు. పదిరోజులు పది యుగాలుగా గడిపాడు. నిరీక్షణ అంతూ దరీ లేనట్లు తోచింది. పదిరోజులు గడిచాయి. పదకొండవ రోజున…

~~~~~~~~~

జ్ఞానమూ ప్రతికూలాంశం కావటం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 20]

విక్రమాదిత్యుడి సహాయంతో భేతాళుని వశపరుచుకొని, పిదప అతణ్ణి వెయ్యవ బలిగా కాళికాదేవిని సమర్పించవలెనన్నది జ్ఞాన శీలుని పన్నాగం.

దాంతో, మర్నాడు అతడొక సామాన్య సాధు వేషంలో, విక్రమాదిత్యుని సభా భవనానికి వెళ్ళి, మహారాజుకు కానుకగా ఒక దానిమ్మ పండుని సమర్పించాడు. ఒక్క మాటైనా మాట్లాడకుండా, మరుక్షణం అక్కడి నుండి నిష్ర్కమించాడు. కొన్ని రోజుల పాటు నిరంతరాయంగా అదే ప్రకారం చేసాడు.

అలాగే... ఒక రోజు ఈ సాధువు దానిమ్మ పండు విక్రమాదిత్యునికి సమర్పించి వెళ్ళిపోయాడు. మహారాజు దాన్ని ప్రక్కనే ఉన్న చిన్న బల్లపై ఉంచాడు. సభా భవనాన్ని ఆనుకొని రాజోద్యాన వనం ఉంది. కిటికీ లో నుండి పూదోట కనువిందు చేస్తుంటుంది. ఆ తోటలో చెట్టు కొమ్మమీద కూర్చొన్న కోతి దృష్టిని, ఈ దానిమ్మ పండు ఆకర్షించింది.

అది అమాంతం కిటికీ లో నుండి లోపలికి దుమికి, పండు చేతిలోకి తీసుకొని కసుక్కున కొరికింది.

ఆశ్చర్యం!

సన్నిని నీటి గొట్టం నుండి నీటి ధార ఎగజిమ్మినట్లు, దానిమ్మ పండులో నుండి కెంపులు జల జలా రాలి క్రింది పడ్డాయి. ఒక్కసారిగా సభలోని వాళ్ళంతా దిగ్ర్భమ చెందారు. విక్రమాదిత్యు మహారాజు, ప్రతీ రోజూ సాధువు యిస్తూ వచ్చిన దానిమ్మ పండ్లను, రాజమందిరంలో ఓ ప్రక్కన ఉంచి పట్టించుకోలేదు.


దాంతో విక్రమార్కుడు సేవకులను పిలిచి, ఆ పళ్ళన్నిటినీ తీసుకు రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. దానిమ్మ పళ్ళను కోస్తే, ఒక్కోపండులో గింజలపేర్చి ఉన్నట్లుగా, మణిమాణిక్యాలున్నాయి! ఒక దానిలో రత్నాలు, మరో దానిలో మరకతాలు, ఇంకో దానిలో పుష్యరాగాలు, గోమేధీకాలు, తెల్లని మేలి ముత్యాలు... ఇలా!

అన్ని పళ్ళనూ కోసేటప్పటికి అక్కడ నవరత్నాలు రాశిగా పడ్డాయి. అదంతా చూసి సభికులూ, రాజూ కూడా ఆశ్చర్య పోయారు. విక్రమాదిత్యుడు ప్రతీ రోజూ తనకు పండ్లని సమర్పిస్తున్న సాధువు గురించి ఆలోచించాడు. తానెప్పుడూ అతడిని ఆదరించి పలకరించనందుకు చింతించాడు. ఒక్క మాట కూడా మాట్లాడ కుండా, తన పలకరింపును ఆశించకుండా, పండు సమర్పించి వెళ్ళిపోయే సాధువు పట్ల రాజుకు ఆశ్చర్యం గౌరవం కలిగాయి.

మరునాడు కూడా ఆ సాధువు సభలోకి వచ్చి, రాజుకు పండు సమర్పించాడు. విక్రమాదిత్యుడు అతణ్ణి ఆపి, ఆదరంగా పలకరించి, సుఖాసీనుణ్ణి చేసాడు. అతిధి మర్యాదలన్నీ చేసి, గౌరవంగా, "ఓ తపస్వీ! నా నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? ఎందుకిలా మమ్మల్ని బహుకరిస్తున్నారు? నేను మీకు చెయ్యగల కార్యమేదైనా ఉంటే సెలవియ్యండి. తప్పక నెరవేరుస్తాను" అన్నాడు.

సామాన్య సాధు వేషంలో ఉన్న జ్ఞానశీలుడు, "ఓ రాజోత్తమా! చాలా రోజులుగా నాకొక ఆకాంక్ష ఉన్నది. అది నెరవేర్చగలనని నీవు నాకు ప్రమాణం చేస్తేనే, నేను నీకది వివరించగలను." అన్నాడు.

విక్రమాదిత్యుడు చిరునవ్వుతో "మీరు కోరినట్లే చేయగలను" అన్నాడు.

అంతట జ్ఞానశీలుడు "ఓ రాజేంద్రా! నా పేరు జ్ఞానశీలుడు. ఇక్కడికి దాపుల నున్న బృహదారణ్యంలోని కాళికా దేవి ఆలయంలో నేనొక యాగం నిర్వహిస్తున్నాను. రానున్న అమావాస్యకు ముందు రోజు, దయ ఉంచి నీవక్కడికి వచ్చినట్లయితే, అప్పుడు నీవు నాకు చేయగల ఉపకారం గురించి చెబుతాను. నీవు నాకై అది నెరవేర్చాలి. దాంతో నా యాగం పరి సమాప్తి కాగలదు" అన్నాడు అభ్యర్ధనగా!

విక్రమాదిత్యుడు ఆనందంగా అంగీకరించాడు. రాజిచ్చిన హామీతో జ్ఞాన శీలుడక్కడి నుండి వీడ్కొలు తీసుకున్నాడు.

అమావాస్యకు ముందు రోజు, విక్రమాదిత్యుడు బృహదారణ్యంలోని కాళీ మాత గుడికి వెళ్ళాడు. జ్ఞాన శీలుడు అత్యంత సంతోషంతో రాజుని ఆహ్వానించాడు. విక్రమాదిత్యుడు చెప్పమన్నట్లు చూశాడు.

జ్ఞాన శీలుడు "ఓ మహారాజా! నీవు సత్యవాక్పరిపాలకుడవు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇచ్చటికి వచ్చావు. నేను నిన్నిక్కడికు ఎందుకు పిలిచానంటే -ఇక్కడకు అరామడ దూరంలో ఓ గొప్ప మోదుగ వృక్ష ముంది. శవ రూపంలో భేతాళుడు ఆ చెట్టు కొమ్మకు తల్లక్రిందులుగా వ్రేళ్ళాడుతుంటాడు. అతడెవ్వరికీ వశువు కాడు. అతణ్ణి వశపరుచుకోగల వాడవు నీవే! ఏ దోక విధంగా అతడిని నీవిక్కడకు తీసుకు రావాలి. ఇదే నీవు నాకోసం నిర్వర్తింపవలసిన కార్యం!" అన్నాడు.

విక్రమాదిత్యుడందుకు సమ్మతించి, భేతాళుడి కోసం బయలు దేరాడు. జ్ఞాన శీలుడందుకెంతో సంతోషించి, యాగాన్ని పూర్తి చేసేందుకు కావలసిన ఇతర ఏర్పాట్లు చేసుకోవడంలో మునిగి పోయాడు. అసలిందుకే అతడు విక్రమాదిత్యుడిని వెయ్యవ బలిగా ఎంపిక చేసుకొంది!

విక్రమాదిత్యుడు మోదుగ వృక్షాన్ని చేరి, దాని మీది శవాన్ని నిశవంగా గమనించాడు. చుట్టూ చీకటి! శ్మశానాన్ని తలపించే వాతావరణం, నిశ్శబ్ధం! రాజు కివన్నీ పట్టలేదు. చెట్టెక్కి శవాన్ని దించి భుజన వేసుకొని, కాళీ మాత ఆలయం వైపు అడుగులు వేశాడు.

శవంలోని భేతాళుడు విక్రమాదిత్యుణ్ణి పరిశీలించాడు.

భేతాళుడు "రాజా! ఎందుకు నన్ను మోసుకెళ్తున్నావు? నేనెవవ్వరికీ లొంగను. నేను నీకు వశుడను కావలెనంటే ఒక షరతు ఉంది. నేను నీకొక కథ చెబుతాను. ముగింపులో కథను గురించి ఒక ప్రశ్న అడుగుతాను. దానికి నీవు సరైన సమాధానం చెప్పాలి. అయితే నా ప్రశ్నకు జవాబు చెప్పేందుకు నీవు మౌనం వీడితే, మరుక్షణం నేను నీ భుజంపై అదృశ్యమై చెట్టుపై నుంటాను. అలాగని జవాబు తెలిసీ చెప్పకుండా మౌనాన్ని పాటిస్తే, నీతల వెయ్యి వక్కలౌతుంది. ఇదీ నియమం" అన్నాడు.

విక్రమాదిత్యుడందుకు అంగీకార సూచకంగా తలాండించాడు. మౌనాన్ని వీడక చిరునవ్వు నవ్వాడు. భేతాళుడు మొదటి కథ ప్రారంభించాడు.

[ఇక్కడ ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే - కథ ద్వారా భేతాళుడిచ్చే ప్రవల్లిక (పజిల్ వంటి ప్రశ్నని)ని విక్రమాదిత్యుడు పరిష్కరించాలి. కానీ, విక్రమాదిత్యుడు మౌనభంగం చేసి ప్రశ్నకు జవాబిచ్చాడో... భేతాళుడు తిరిగి చెట్టెక్కేస్తాడు. తెలిసీ జవాబు చెప్పక పోతే... తల వెయ్యి వక్కలౌతుంది. విక్రమాదిత్యుడు సకల శాస్త్ర పారంగతుడు గనక, అతడు ఎలాంటి ప్రశ్నకైనా జవాబు చెప్పగలడు. దాంతో మౌనభంగమౌతుంది. అప్పుడు భేతాళుడు వశుడు కాడు. ‘భేతాళుడి ప్రశ్నకు విక్రమాదిత్యుడికి సమాధానం తెలియక పోవటం’ మాత్రమే దీనికి పరిష్కారం అవుతుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా, జ్ఞానం కలిగి ఉండటం అనుకూలాంశం (Advantage) అవుతుంది. ఇక్కడ అది ప్రతికూలాంశం (Disadvantage) గా ఉంటుంది. అదే గమ్మత్తు!]

~~~~~~~~~

భట్టి విక్రమాదిత్యుల అన్ని కథలు !

01. భారతీయ సంస్కృతీ సంపద [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 01]

02. ధారా నగరం – వేట వినోదం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 02]

03. శరవణ భట్టు మంచె కథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 03]

04. సువర్ణ సింహాసనం – మెట్టుకో బొమ్మ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 04]

05. వినోద రంజిత ప్రారంభించిన కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 05]

06. చంద్రవర్ణుడి కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 06]

07. అలంకార వల్లి – చంద్రవర్ణుడు [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 07]

08. చంద్రవర్ణుడి వివాహం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 08]

09. భట్టి విక్రమాదిత్యుల జననం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 09]

10. భర్తృహరి కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 10]

11. విక్రమాదిత్యుడి పట్టాభిషేకం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 11]

12. మేధో సాహసాల మేలు కలయిక![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 12]

13. ఉజ్జయినీ నగర నిర్మాణం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 13]

14. రంభ, ఊర్వశుల నాట్య వివాదం ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 14]

15. దేవేంద్రుని ఆహ్వానం! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 15]

16. ఎవరు గొప్ప నాట్యగత్తె !? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 16]

17. ఇంద్రుడిచ్చిన సింహాసనం! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 17]

18. సహస్రాయుష్మాన్ భవ ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 18]

19. మదనాభిషేక ప్రతిమ చెప్పిన కథ ప్రారంభం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 19]

20. భట్టి విక్రమాదిత్యుడు అన్ని కథలు !

21. జ్ఞానమూ ప్రతికూలాంశం కావటం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 20]

22. మూగ బాసల అర్ధాలేమిటి? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 21]

23. పైన కోపం – లోన ప్రేమ ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 22]

24. మంత్రి కుమారుడి మాయోపాయం ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 23]

25. ఆషామాషీ తీర్పులు చెబితే ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 24]

26. మంత్రవాది కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 25]

27. ఎవరు గొప్ప నిపుణులు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 26]

28. జ్ఞాని, సూత్రజ్ఞుడు, శూరుడు – ఎవరు గొప్ప?[భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 27]

29. విరిబోణి వివాహం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 28]

30. విరిబోణికి భర్త ఎవరు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 29]

31. చిలుకలు త్రికాలవేదులు ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 30]

32. మగవారినెందుకు నమ్మరాదు ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 31]

33. తప్పు చేయబోతే ముక్కు యిరుక్కుంది![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 32]

34. ఆడువారిని నమ్మరాదా !? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 33]

35. రాజు – సేవకుడు – ధర్మనిరతి ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 34]

36. కార్పటికుని కథ ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 35]

37. ధనలాలస – ధర్మనిరతి! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 36]

మదనాభిషేక ప్రతిమ చెప్పిన కథ ప్రారంభం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 19]

రెండవ రోజు.... భోజరాజు, అతడి మంత్రులూ, పరివారమూ, సభాసదులూ తమ దైనందిన కార్యక్రమాలు ముగించుకొని, ఎంతో ఆతృతతో సభకు విచ్చేసారు.

భోజరాజు సువర్ణ సింహాసనాన్ని సమీపించాడు. సభికులంతా ఊపిరి బిగబట్టి చూడసాగారు. భోజరాజు తొలి మెట్టు మీద కాలు మోపాడు. వినోదరంజిత ప్రతిమ మౌనంగా ఉండిపోయింది. అతడు రెండవ మెట్టుపై కాలుపెట్టేందుకు పాదం ఎత్తాడు. అంతలోనే రెండవ మెట్టు మీద ఉన్న బొమ్మ చప్పట్లు చరుస్తూ బిగ్గరగా నవ్వింది.

ఆ బొమ్మ "చాలు భోజరాజా చాలు! నీ శ్రేయస్సు కోరి, మేము నీతీధర్మాలను చెబుతున్నాము. బహుశః వాటిని నీవు గ్రహించటం లేదు కాబోలు. నల్లని బండరాయిని మనం నీటిలో పెక్కు దినాలుంచి, తీసి కడిగినప్పటికీ, దాని నలుపు పోయి తెల్లగాను రాదు, మృదువుగానూ మారదు. ఇదీ అట్లే ఉన్నది.

తొలి మెట్టుపై గల వినోదరంజిత ప్రతిమ, నీకెన్నో విషయాలు చెప్పి యున్నది. కానీ నీవు పెడచెవిన బెట్టినావు. పైగా గొప్ప ఆడంబర సరళితో, మంత్రి పరివార సభికుల సహితంగా సింహాసనమెక్కగా వచ్చినావు. ఓ భోజరాజా! ఈ సువర్ణ సింహాసనము నీకు లభ్యమగునను కొనుచున్నావా?

నీ ప్రయత్నము, చిటారు కొమ్మనున్న తేనెపట్టును అందుకోవాలని, రెండు కాళ్ళు లేని అవిటి వాడు ఆశించినట్లుగా ఉంది. చాలు. ఇక్కడితో ఆగుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము. లేనిచో వెనుదిరిగి ఇంటికి బొమ్ము.

నీవీ సింహాసనమును పొందలేవని తెలుసుకో! ఓ భోజరాజా! నేను తదుపరి విషయాలను చెప్పుచున్నాను వినుము. విక్రమార్కుడు దయామూర్తి. కరుణాత్మడు. నీతీ ధర్మాలు గల వాడు. సహన శీలి. సహాయ శాలి. శాంతమూర్తి. ప్రేమాదరాలు గలవాడు. ధైర్య సాహసాలు గలవాడు. దైవభక్తి గలవాడు. ధర్మం పట్ల ధృఢమైన నమ్మకాలున్నవాడు. నీలో ఈ లక్షణాలు ఉన్నాయా? నీవు విక్రమాదిత్యునితో సరిపోలవని నిశ్చయంగా చెప్పగలను. కాబట్టి... సింహాసనాన్నధిరోహించాలనే కాంక్ష వదిలి, వెనక్కి మరలు!" అన్నది.

భోజరాజు, అతడి మంత్రులు కొన్ని క్షణాలు లజ్జ బిడియాలతో మాట్లాడక నిలుచున్నారు. పిదప భోజరాజు "ఓ ప్రతిమా మణీ! మీ మహారాజు యొక్క గుణగణాలు గురించి, మరింతగా వినవలెనని కోరుతున్నాము. అవి మాకు వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యి" అన్నాడు.

సువర్ణ ప్రతిమ అతడి సుగుణశీలానికి, వినయానికి సంతృప్తి చెంది "ఓ భోజ రాజేంద్రా! విను. నేను ఈ సింహాసనము పైని రెండవ మెట్టు పై గల ప్రతిమను. నా పేరు మదనాభిషేక. నిన్నటి దినాన, వినోద రంజిత ప్రతిమ చెప్పినట్లుగా... విక్రమాదిత్యుడు ఏడాదికి ఆరు మాసములు రాజ్యపాలన చేస్తూ, మిగిలిన ఆరు మాసములు దేశాటనంలో భాగంగా వివిధ ప్రదేశాలు సందర్శిస్తూన్నాడు.

ఆ రోజులలో ఉజ్జయినీ నగరానికి పది ఆమడల దూరంలో దట్టమైన అరణ్యముండెడిది. దాన్ని బృహదారణ్యమని పిలిచేవాళ్ళు. ఆ ఆరణ్యంలో కాళీకా దేవి ప్రాచీనాలయమొకటి ఉండేది. దానికి అర్ధామడ దూరంలో ఒక మోదుకు వృక్షం ఉండేది. [దాని ఆకులతో ఒకప్పుడు విస్తళ్ళు కుట్టేవారు. బాదం చెట్టు ఆకుల్లాగే!]

ఆ పెను వృక్షపు ఒక కొమ్మకు, తల్లక్రిందులుగా, భేతాళుడు శవ రూపంలో వేలాడు తుండేవాడు. [భేతాళుడు భూతాలకు రాజు. మహా శివుని ప్రమధ గణాలలో ఒక గణాధిపతి.]

అట్టి బృదహరణ్యంలో, జ్ఞాన శీలుడనే యోగి ఉండేవాడు. అతడు దీర్ఘకాలం తపస్సు చేసాడు. దాంతో ఎంతో శక్తి సంపన్నుడయ్యాడు. అయితే ఇతడు సద్గుణుడూ, కరుణా హృదయుడు కాడు.

ఒక నాడు అతడు తపస్సు వదిలి, భేతాళుని వశపరుచు కోవాలనీ, కాళికా దేవి కృపను పొందాలనీ తలచాడు. దేవీ ఆలయాన్ని చేరి, పూజాదికాలూ, క్రతువులూ నిర్వహించాడు.

నిరంతరాయంగా, కాళిక దేవి ప్రీత్యర్దమై, క్రతువు నాచరించ సాగాడు. దుశ్శీలుడైనా... అతడి కఠోర దీక్షకూ, మొక్కవోని సాధనకూ సంప్రీతురాలై, కాళికా దేవి అతడి యెదుట ప్రత్యక్షమైంది.

[నిజానికి తపస్సు అంటేనే సాధన. ఏళ్ళ తరబడి, నేటి శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు కూడా తపస్సు వంటివే! ఆయా పరిశోధనలలో వారు చేసే సాంకేతిక ఆవిష్కరణలు, దేవతల వరాల వంటివి. పురాణ కథలలో వరాలతో పొందిన విమానాది యంత్రాలు, మంత్రోచ్ఛాటనతో ఎవరికైనా ఉపయోగ పడటం వంటిదే... ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ యంత్రాలు!]

కాళికా దేవి, అతణ్ణి "ఓయీ! జ్ఞాన శీలా! ఏమి కావాలి నీకు?" అని అడిగింది.

అతడు "ఓ తల్లీ! విశ్వమాతా! నీవు ఎల్లప్పుడూ నా పట్ల సంప్రీతి కలిగి ఉండాలి.[ఎంత తెలివైన కోరికో చూడండి.] భేతాళుడు నాకు వశుడై, నా బంటుగా ఉండాలి. ఈ సకల ప్రపంచానికి నేను సామ్రాట్టుని కావాలి. ముసలి తనమూ మరణమూ లేకుండా, విక్రమాదిత్యుని సువర్ణ సింహాసనం మీద కూర్చొని, ఈ ధరావలయాన్నంతా నేను పరిపాలించాలి. ఇదీ నా కోరిక!" అన్నాడు.

కాళికా దేవి మర్మగర్భంగా నవ్వుతూ "ఓ యోగీ! నీవు పరమ కఠోరమైన కోరిక కోరుతున్నావు. అది తీరవలెనంటే నీవు వెయ్యిమంది రాజుల శిరస్సులు ఖండించి, ఈ యాగాగ్నిలో వ్రేల్చాలి. విను, అందులో వెయ్యవ రాజు అసమాన శూరుడూ, సద్గుణ శోభితుడూ అయి ఉండాలి. ఇది సాధ్యం గానట్లయితే, నీకు సముడైన యోగి తలను ఖండించి, బలిగా ఈ పీఠముపై నుంచి, పిదప యాగాగ్నిలో బడవేయుము" అని చెప్పి అంతర్ధాన మయ్యింది.

జ్ఞానశీలుడు వెయ్యిమంది రాజుల శిరస్సులను బలి యివ్వటానికే నిశ్చయించు కున్నాడు. ఎందుకంటే - తనకు సమానుడైన యోగి లభ్యంకావటం అసంభవం గనుక!

999 మంది రాజులను... యోగి వేషమున, తీయని మాటలతో, ఆశలు రేపి, మోసగించి తెచ్చి బలి యిచ్చాడు. ఇక ఒకే ఒక తల బాకీ ఉంది. వెయ్యవ బలిగా... జ్ఞానశీలుడు విక్రమాదిత్యుని ఎంచుకున్నాడు. అసమాన శూరుడూ, సర్వ సల్లక్షణ శోభితుడూ విక్రమాదిత్యుడే! అతడి సహాయంతో భేతాళుని వశపరుచుకొని, పిదప అతణ్ణే వెయ్యవ బలిగా దేవికి సమర్పించవలెనన్నది జ్ఞానశీలుని పన్నాగం.
~~~~~~~~~~

సహస్రాయుష్మాన్ భవ ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 18]

ఆ విధముగా భట్టి పట్టు విడవకుండా ప్రార్దిస్తుండేసరికి, చివరికి కాళికాదేవి, భట్టిని మరింతగా పరీక్షింపనెంచి "మంచిది భట్టీ! నే చెప్పునది శ్రద్ధతో వినుము. నీ అన్నయైన విక్రమార్కుని శిరస్సును ఖండించి, నా ముందున్న బలిపీఠముపై బెట్టుము. అట్లయిన నీవడిగిన వరము నీయగలదానను" అన్నది.

భట్టి "సరి" యంటూ, విక్రమాదిత్యుని మందిరమునకు వెళ్ళాడు. ఆ అర్దరాత్రి సమయాన విక్రమాదిత్యుడు నిద్రించుచున్నాడు. భట్టి రాజు శయ్యను సమీపించాడు. ఆ శయన మందిరం, దేదీపమానముగా వెలుగుచున్న దీపాలతో పట్టపగలు వలె ఉన్నది.

భట్టి ఒర నుండి కత్తి తీసినాడు. దీపపు వెలుగులలో కత్తి అంచు పదునుగా మెరుస్తోంది. ఒక చేత కత్తిబట్టి, మరో చేత్తో విక్రమార్కుని తట్టి లేపాడు.

కళ్ళు తెరచిన విక్రమార్కుడు యెదుట భట్టిని చూచి "నా ప్రియమైన తమ్ముడా, భట్టి! ఇంత అర్దరాత్రి వేళ నీవిచ్చటికి వచ్చిన కారణమేమిటి?" అనినాడు.

భట్టి "ఓ రాజాధిరాజా! ఒక కార్యమునకై నాకు నీ తల అవసరపడినది. అందులకై అర్ధరాత్రి నీ మందిరమునకు వచ్చితిని" అన్నాడు. మరుక్షణం విక్రమార్కుడు "అటులైన తీసికో" అంటూ తిరిగి పరుండినాడు.

భట్టి విక్రమాదిత్యుని శిరస్సును ఖండించి, ఆ తలను చేత బట్టి, కాళికాలయమునకు వెళ్ళాడు.

ఖండించిన విక్రమాదిత్యుని శిరస్సును బలిపీఠం మీద ఉంచి, భట్టి భద్రకాళిని ప్రార్దించాడు. ఆ తల్లి ప్రత్యక్షమై, భట్టికి ఈ భూమిపై రెండు వేల యేళ్ళు బ్రతుకునట్లుగా వరమిచ్చింది.

తక్షణమే భట్టి విరగబడి నవ్వడం ప్రారంభించాడు. కాళికాదేవి, "భట్టీ! ఏల నవ్వుచున్నావు?" అని అడిగింది.

భట్టి వినయంగా "ఓ తల్లీ! మృఢానీ! రుద్రాణీ! దేవేంద్రుడు మా యన్న విక్రమాదిత్యునకు అమరావతిలో, నిండు కొలువులో, దేవతలు, మహర్షులు మహామహులందరి సమక్షంలో, వెయ్యేండ్లు రాజ్యమేలునట్లు వరమిచ్చినాడు. ఇది జరిగి నెల్లాళ్ళు కూడా కాలేదు. నెల లోపుననే, స్వయముగా నేనే, మా యన్న శిరమును ఖండించితిని. ఆయన మరణించినాడు. దేవేంద్రుడి వరమిట్లు తప్పిపోయినది. మరి నీవిచ్చిన వరమెట్లగునో? ఇది తలంచియే నవ్వితిని" అన్నాడు.

భట్టి బుద్ధి కుశలత కూ, సమయ స్ఫూర్తికీ, కాళికా దేవి ఎంతో సంతోషించింది. అతడి మేధస్సునూ, భక్తి వినయాలను, తన యందు నమ్మకమూ చూసి, ఆనందించింది. ఆ విధంగా భట్టి అమ్మవారి పరీక్షలో నెగ్గాడు.

ఆ తల్లి చిరునవ్వుతో "భట్టీ! నీవు తెలివైన వాడివి. నీ మేధస్సు, సాహసం, సమయస్ఫూర్తి... దేవతలలో సైతం కాన రాదు" అంది మెచ్చుకోలుగా.

భట్టి వినయంతో చేతులు జోడిస్తూ "తల్లీ! దేవతలతో నన్ను పోల్చరాదు. నేను మానవ మాత్రుడను" అన్నాడు.

కాళీమాత "భట్టీ! ఓ మంత్రీ! నా వరములను శంకింపకు. ఇంకా నీకేమైనా కోరికలుంటే అడుగు" అన్నది.

భట్టి "అమ్మా! విక్రమాదిత్యుని బ్రతికింపుము" అన్నాడు. ఆ తల్లి నవ్వుతూ, విక్రమాదిత్యుని బ్రతికించు ఉపాయం జెప్పి, అంతర్ధాన మయ్యింది.

భట్టి సంతోషానికి అవధులు లేకపోయాయి. విక్రమాదిత్యుని ఖండిత శిరస్సును తీసుకొని, రాజ మందిరానికి పోయి, దేహానికి తల చేర్చాడు. దేవీ సూక్తాన్ని జపిస్తూ, కోవెల నుండి తెచ్చిన మంత్రజలాన్ని చల్లాడు. మరు క్షణం విక్రమాదిత్యుడు నిద్ర నుండి మేల్కొన్నట్లుగా లేచి కూర్చున్నాడు.

"భట్టీ! ఏమయ్యింది?" అనడిగాడు. భట్టి జరిగిందంతా చెప్పాడు. అది విని విక్రమార్కుని కెంతో సంతోషం కలిగింది. అయితే భట్టి విచారంలో మునిగి పోయాడు. అతడికి తన పొరబాటు అర్ధమయ్యింది.

"అన్నా! విక్రమాదిత్యా! నీవు స్వర్గానికి పోయి, ఈ భూమిపై వెయ్యేళ్ళు రాజ్యమేలునట్లు వరమందినావు. నా గురించి మరిచినావు. అది నాకు విచారమును, పరితాపమును కలిగించినది. అందుచేత నేను కాళీ మాతను ప్రార్ధించాను. అయితే ఆ కినుకలో, నేను రెండు వేల యేళ్ళు బ్రతుకునట్లు వరమడిగాను. కానీ ఇప్పుడు నాకు వాస్తవం అర్ధమౌతుంది. నీ తోడు లేకుండా, మోడులా... నేనెలా బ్రతక గలను? అయ్యో! ఎంత తప్పు చేసాను?" అని చింతించాడు.

విక్రమాదిత్యుడు "తమ్ముడా భట్టి! అది నీ తప్పు కాదు. నిశ్చయంగా నా పొరబాటే! స్వర్గలోకమున నుండగా నీ గురించి మరిచినాను. కానీ నీ తోడు లేకుండా నేనూ బ్రతకలేను. అది నాకు సంతోషము కాదు. అందుకే, నీవు వచ్చి నా తల నడిగినప్పుడు సంతోషముగా ఇచ్చాను. ఇప్పుడు ఇద్దరమూ సంకటంలో పడ్డాము. ఎలా దీనిని పరిష్కరించగలం?" అన్నాడు సాలోచనగా.

[ఇది మానవ మనస్తత్త్వ రీత్యా కూడా యదార్ధమే! ఆగ్రహంగా ఉన్నప్పుడు మరేవీ గుర్తు రావు. అన్న తనని మర్చిపోయాడు అనే కోపంలో భట్టి ఒకటికి రెండువేల యేళ్ళు బ్రతికేటట్లు వరం కోరుకున్నాడు. అలాగే అత్యంత ఆనందంగా ఉన్నప్పుడు కూడా మరేవీ గుర్తుకు రావు. స్వర్గంలో ఉన్నప్పుడు విక్రమాదిత్యుడు, భట్టి గురించి మర్చిపోయాడు.]

ఇద్దరూ కాస్సేపు ఆలోచనలో మునిగి పోయారు. కొంత సమయం గడిచింది. ఒక్క క్షణం! భట్టి ముఖం సంతోషంతో వెలిగి పోయింది. "అన్నా!" అని అరిచాడు. విక్రమాదిత్యుడు చెప్పమన్నట్లుగా చూసాడు.

భట్టి "దేవేంద్రుడు మీకు వెయ్యేళ్ళు ఈ సింహాసనం మీద కూర్చొని రాజ్యమేలునట్లుగా వరమిచ్చాడు. కాబట్టి సంవత్సరంలో ఆరు మాసములు మీరు రాజ్య పాలన చేయండి. మిగిలిన ఆరు మాసములు ఈ భూమీ మీద గల వింతలూ విడ్డూరాలు చూస్తూ, దేశాటనం చేయండి. మీరు లేని ఆరునెలలు నేను రాజ్య పాలనాభారం వహిస్తాను. మనమిద్దరం కలిసి దేశాటనం చేయబోయినప్పుడు, మన మంత్రులు రాజ్య రక్షణ పర్యవేక్షిస్తారు. దీనికి మీరేమంటారు?" అన్నాడు.

పట్టరాని సంతోషంతో విక్రమార్కుడు, తన ప్రియమైన తమ్ముడు భట్టిని కౌగిలించుకున్నాడు.

ఆ రోజు నుండి భట్టి విక్రమాదిత్యులరువురూ కలసిమెలసి, రాజ్య పాలన మొదలు అన్నివిషయాలలోనూ చర్చించుకుంటూ, సహకరించుకుంటూ గడప సాగారు. ఒకరి నొకరు గౌరవించుకుంటూ, ఒకరి నొకరు ప్రేమించుకుంటూ....! వారి మధ్య ప్రేమాను బంధం, వారి రాజోచిత జీవితానికి.... బంగారానికి పరిమళం అద్దినట్లుగా శోభాయమానం అయ్యింది.

రాజ్యంలోని రైతుల, ఇతర వృత్తుల ప్రజల ఆదాయం నుండి 6 వ వంతను శిస్తుగా గ్రహిస్తూ... ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని, వారి సమస్యలు పరిష్కరిస్తూ, రాజ్యపాలన సాగించారు. ప్రతీ విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటూ, రాజ్యాన్ని, పరిపాలనని పర్యవేక్షించారు. రాజోద్యోగులందరూ వినయంతోనూ, సేవాభావంతోనూ.... అటు రాజు మంత్రులనీ, ఇటు ప్రజలనీ సేవించుకుంటున్నారు.

రాజ్యంలో పౌరులూ, పాలనాధికారులూ, అన్ని వృత్తుల వాళ్ళు ఒకరికొకరు సహకరించు కుంటూ, సదవ గాహనతో వ్యవహరిస్తున్నారు. పిల్లి ఎలుకలు కలిసి ఒకేచోట ఆడుకుంటున్నాయి. పులీ ఆవులు ఒకే ఒడ్డున నీరు త్రాగుతున్నాయి. నెలకు నాలుగు వానలు కురుస్తున్నాయి. పంటలు విరివిగా పండుతున్నాయి. వాతావరణ చల్లగా, పచ్చగా, ఆహ్లాదంగా ఉంది.

ఇంత వరకూ కథ చెప్పి, వినోద రంజిత ప్రతిమ, "ఓ భోజ రాజేంద్రా! విన్నావు కదా, విక్రమాదిత్యుని ధైర్యసాహసాల గురించీ, ధర్మ వర్తన గురుంచీ! ఈ ప్రపంచమున తమ్ముడి కోరిక తీర్చటానికై తన తలనిచ్చే వారెవ్వరైనా ఉన్నారా?

విక్రమాదిత్యుని సౌశీల్య గుణములలో నూరింట ఒక వంతైనా, నీవు కలిగి ఉన్న పక్షంలో, ఈ సింహాసన మధిరోహించే ప్రయత్నం చెయ్యి. లేదా... వచ్చిన దోవను బట్టి ఇంటికి బోవుట మేలు!" అని మౌనం వహించింది.

భోజరాజు, అతడి ప్రధాని బుద్దిసాగరుడు, ఇతర మంత్రులూ, సర్వసభికులూ... అప్పటి వరకూ అమిత ఆశ్చర్యంతో, వినోద రంజిత చెప్పిన కథను విన్నారు. తిరిగి చూస్తే ఏముంది? అప్పటికే సూర్యాస్తమయం అయిపోయింది. సభని మరునాటికి వాయిదా వేసి, అందరూ ఇళ్ళకి మరలారు.

భోజరాజు అంతఃపురాన్ని చేరి... ఆలోచిస్తూనే, స్నానపానాదులు ముగించి నిద్రకుపక్రమించాడు.

~~~~~~~~

ఇంద్రుడిచ్చిన సింహాసనం! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 17]

విక్రమాదిత్యుడికి వీడ్కొలు ఇస్తూ, దేవేంద్రుడా మహారాజును ఎంతగానో సత్కరించాడు. ప్రశంసలతో బాటుగా ప్రేమాదరణలనీ పంచాడు. ముప్పది రెండు మెట్లతో ఉన్న ఈ స్వర్ణ సింహాసనాన్ని, దేవేంద్రుడు విక్రమాదిత్యునికి కానుకగా ఇచ్చాడు. ఒకో మెట్టు పైనా ఒకో సుందర సువర్ణ ప్రతిమలున్న ఈ సింహాసనం అపూర్వమైనది. ఇంద్ర పట్టాభిషేక మహోత్సవ సమయంలో, దేవేంద్రుడికి, మహాశివుడు ఇచ్చిన సింహాసనమిది.

దేవేంద్రుడు "ఓ విక్రమాదిత్య భూపతీ! నీవు ఈ సువర్ణ సింహాసనాసీనుడివై వెయ్యేండ్లు రాజ్య మేలెదవు గాక! ఇది నేను నీకు ప్రీతితో ఇస్తున్న వరము. నీకు సర్వదా శుభమగు గాక!" అన్నాడు.

విక్రమాదిత్యుడు దేవేంద్రునికి వినయమంతోనూ, మైత్రితోనూ నమస్కరించి, కృతజ్ఞతలు తెలిపి, వీడ్కొలు తీసుకున్నాడు. దేవేంద్రుడు మాతలికి విక్రమాదిత్యుని ఉజ్జయినిలో దింపి రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.

మాతలి ఎంతో వినయ విధేయతలతోనూ, ఆరాధన తోనూ... విక్రమాదిత్యునికి చేయి అందించి, రధమున ఆసీనుణ్ణి చేసి, స్వర్ణ సింహాసనముతో సహా ఉజ్జయినికి తీసుకు వచ్చాడు. విక్రమాదిత్యుడి ఆనతి మేరకు, ఉజ్జయిని మహాంకాళి ఆలయము వద్ద దిగవిడిచి, వీడ్కొలు తీసుకున్నాడు.

విక్రమాదిత్యుడు ముందుగా కాళికాదేవి కోవెలలోకి వెళ్ళి, పూజాదికాలు ముగించి, తదుపరి తన భవనానికేగినాడు. భట్టి రాజుని చూడవచ్చాడు.

విక్రమాదిత్యుడు "తమ్ముడా!భట్టి! దేవేంద్రుడు ప్రీతితో నాకు స్వర్ణ సింహాసనమును బహుకరించినాడు. అది ఉజ్జయిని కాళీమాత ఆలయము వద్ద ఉన్నది. సేవకులను పంపి, దానిని తెప్పించి, మన సభా భవనమున ప్రతిష్ఠించు" అని ఆజ్ఞాపించాడు.

భట్టి ఆ ఏర్పాట్లన్నీ కావించి, అన్న దగ్గరకు తిరిగి వచ్చాడు. "ఓ విక్రమాదిత్య మహారాజా! మీరు అమరావతికి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకూ జరిగిన వాటినన్నింటి గురించీ తెలుసుకోవాలని, మాకందరికీ ఎంతో కుతుహలంగా ఉంది. దయచేసి వివరించండి" అన్నాడు.

విక్రమాదిత్యుడన్నీ పూసగుచ్చినట్లుగా వివరించాడు. స్వర్ణ సింహాసనాన్ని చూపుతూ "సభాసదులారా! తమ్ముడా, భట్టీ! ఈ బంగారు సింహాసనాన్ని మహేశ్వరుడు దేవేంద్రుని కిచ్చినాడట. నాయందు ప్రీతితో, దేవేంద్రుడిది నాకిచ్చినాడు. దీనిపై గూర్చుండి వెయ్యేండ్లు రాజ్యమేలునట్లుగా, దేవేంద్రుడు నాకు వరమొసంగినాడు. మాతలి రధముపై దీన్నితెచ్చినాడు. ఇదీ జరిగిన విశేషము" అన్నాడు.

భట్టీ "అన్నా! నీవు వెయ్యేళ్ళు రాజ్యమేలునట్లు వరము నందినావు. నీ ప్రియ సోదరుడనైన నా కొఱకు ఏ వరమునూ తేలేదా?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు "తమ్ముడా! మరచినాను" అన్నాడు ఒకింత విచారంగా!

భట్టి "నిజము. అది సహజమే! స్వర్గమునకు బోయినపుడు భూమిపైని విషయములు, బంధములు మరచుట సహజము. సరియె, పోనిమ్ము! గడిచిపోయిన వాటిపై దుఃఖించడం ఎందుకు? గతించిన వాటికై ఇప్పుడు దుఃఖించినా ప్రయోజనమేమున్నది?" అన్నాడు, ఒకింత కినుకగా!

ఈ విధంగా పలికి, భట్టి, అన్న వద్ద సెలవు పుచ్చుకొని తన మందిరానికి వెళ్ళాడు. పంచభక్ష్య పరమాన్నములతో కూడిన రాజోచిత భోజనాన్ని ఆరగించి, పట్టుపరుపులు పరచిన హంస తూలికా తల్పం పైన పవళించాడు. కానీ భట్టికి నిద్ర రాకున్నది.

"నేనూ రెండు వేల ఏళ్ళు బ్రతకవలెనని ఆకాంక్ష కలుగుచున్నది. అది యెట్లు సాధ్యమగును? విక్రమాదిత్యుడు దేవేంద్రుని మెప్పించి వరమును పొందినాడు. నేనేమి చేయవలె? ఆ! నేనెందుకు మా కులదేవతయైన మహంకాళి దేవి అనుగ్రహముపొంది వరముల గోరరాదు? అవును! అదే సరియైన పని." అనుకున్నాడు.

ఇట్లాలోచించిన భట్టి, దిగ్గునలేచి, రత్నాభరణములనూ, రత్నఖచిత ఖడ్గమునూ ధరించి, అప్పటికప్పుడే... రాత్రి పది ఘడియల వేళ భద్రకాళి గుడికేగినాడు.

ఆ సమయానికి ఉజ్జయినీ కాళీమాత ఆలయమున లేదు. నగర రక్షణనూ, బాగోగులనూ పర్యవేక్షించేందుకు, నగర సందర్శన చేయబోయినది. ఆలయమున దేవీ విగ్రహమందు తేజస్సులో వ్యత్యాసమును బట్టి, భట్టి ఇది గ్రహించినాడు. దేవళమునకు కాపున్న భూతగణముల పారద్రోలి, దేవళం తలుపులు బంధించి, అమ్మవారి విగ్రహం ఎదుట పద్మాసనస్థుడై ధ్యానమగ్నుడైనాడు.

కొంత తడవుకు కాళికా దేవి ఆలయమునకు తిరిగి వచ్చింది. ఆ తల్లికి అసాధ్యమన్నది లేకున్ననూ, తల్లిబిడ్డల నాడించి వినోదించురీతిన, తాను ఆలయములోనికి ప్రవేశించుటకు బంధించిన తలుపులు అడ్డుగానున్నట్లు "భట్టీ! తలుపులు తీయు"మన్నది.

భట్టి వినక ధ్యానము కొనసాగించినాడు. కాళీమాత నామాన్ని ఉచ్ఛరిస్తున్నాడు. ఆ తల్లి ముదముతో భట్టి ఎదుట ప్రత్యక్షమైనది. ఆమెకు భట్టి యొక్క భక్తి, వినయాలు చూసి ముచ్చట కలిగింది. "బిడ్డా, భట్టీ! ఇంత రాత్రివేళ ఏల ఇక్కడికి వచ్చితివి? ఎందుకీ విధమున నా నామస్మరణ చేయుచున్నావు?" అని అడిగింది.

భట్టి ఆ తల్లికి నమస్కరిస్తూ "అమ్మా! మా బంగారు తల్లి! వరాల తల్లి! సౌందర్యరూపిణీ! దయామూర్తీ! నీవు అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకివి! నీకు వేనవేల నమస్కారములు. ఎందులకు నిన్ను ప్రార్దించుచుంటినని అడిగితివి కదా? నాకు నీవు వరములు ప్రసాదించగలవు తల్లీ!" అన్నాడు.

భద్రకాళి "వత్సా! ఏమి కావలయును నీకు?" అనడిగింది.

భట్టి "తల్లీ! సకల జగత్తుకూ రక్షణ నిచ్చుదానవు. నీ భక్తుడూ, నా సోదరుడూ అయిన విక్రమాదిత్యుడు... అమరావతి కేగి, ఇంద్రుని మెప్పించి, ఈ భూమిపై వెయ్యేళ్ళు రాజ్యమేలునట్లు వరములు పొందినాడు. నన్ను మరచినాడు. దేవేంద్రుడిచ్చిన సువర్ణ సింహాసనముతో తిరిగి వచ్చినాడు.

నాకు నీవు తప్ప ఇతరులు తెలియదు. నీవు తప్ప అన్యధా శరణ్యము లేదు. నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను. నిన్నే కొలుచుచున్నాను. నిన్నే సేవించుకుంటున్నాను. నాకు నీవే రక్ష! కాబట్టే - నీ భక్తుడైన నేను నీ దగ్గరికీ వచ్చినాను. నీ దగ్గరకు గాక ఎటుకేగ గలను? నీవు తప్ప ఎవరు నా ఆశలు తీర్చువారు? తల్లీ! ఓ అమ్మా! ఈ భూమిపై రెండు వేల ఏళ్ళు, సుఖంబుగా బ్రతుకు నటుల నాకు వరమీయ గదే!"అని ప్రార్దించాడు.

ఇది విని కాళికా దేవి "ఓ మంత్రీ! భట్టీ! నీకు నేనట్టి వరములనీయలేను" అని మౌనము దాల్చింది. భట్టిని పరీక్షింపవలెనని ఆ తల్లి సంకల్పం! భట్టి ఆమెను పరిపరి విధముల ప్రార్దించినాడు.

"ఓ తల్లి! నీవు అమ్మలగన్న యమ్మవు. దయా రూపిణివి. విశ్వమాతా! నీకు అసాధ్యమన్నది లేదు. నీవే కాదనిన ఈ జగత్తున ఔనను వారెవ్వరు? నన్ను కరుణింపవే తల్లీ!" అంటూ పట్టు విడవకుండా దేవిని ప్రార్దించాడు.

సువర్ణముఖి నది కథ!

‘అనుభవమైతే గానీ తత్త్వం బోధ పడదంటారు’ పెద్దలు. అలాగే ‘తత్త్వం బోధపడితే గానీ సత్యం కళ్ళకు కనబడదు’. అందుకే పరిస్థితులు అర్ధం చేసుకోవాలంటే, దాని పూర్వాపరాలు ముందు తెలుసుకోవాలి. నిజానికి అవి పూర్వాపరాలు కాదు, పునాదులు.

అందుచేత ముందుగా ఆ పునాదుల గురించి చెబుతాను.

భారతీయులుగా మనం వేలసంవత్సరాల నుండి భగవద్గీతని నమ్ముతాం. భగవంతుడి శక్తిని, సత్యాన్ని నమ్ముతాం. కొన్ని నమ్మకాల పునాదుల మీద జీవన రమ్యహర్య్మాన్ని నిర్మించుకుంటాం. భారతీయుల రక్తంలో ఉంది ఈ నమ్మకాలతో కూడిన దృక్పధమే. అది చేటవంటిది. ప్రతిదానిలో చెడుని వదిలేసి మంచిని గ్రహించేటటువంటి బుద్ది. ఇలాంటి దృక్పధాన్ని, పురాణేతిహాసాలు, పండగలు, జీవన సరళి క్షణక్షణం సమాజానికి, వ్యక్తులకి నూరిపోసేవి.

కాబట్టే ఆ రోజుల్లో సర్వసంగ పరిత్యాగులు ఏంచెప్పినా ప్రజలు నమ్మేవాళ్ళు. అలాగే యోగులూ సామాజిక హితవు చెప్పేవాళ్ళు. ’సంసారమే త్యజించిన వారికి స్వార్ధం ఉండదు కదా! అందునా యోగి! ఇతడు మన హితవు కోరి చెబుతాడు. సత్యమే చెబుతాడు. మనం తిరగని ప్రాంతాలు ఇతడు తిరిగాడు. కాబట్టి మనకంటే ఇతడికి ఎక్కువ తెలుసు’ – ఇదీ యోగులని విశ్వసించటంలో ప్రజల దృక్పధం.

అయితే క్రమంగా ఆ స్థానాన్ని మీడియా ఆక్రమించాక, మంచి స్థానే చెడు ఎలా ఆక్రమించింది? ఆ మీడియా మరుగుపరచిన భారతీయ తత్త్వ చింతనని, తాత్త్విక మూలాలని, నమ్మకాల పునాదులని ఒకసారి పునః పరిశీలించాలి, జప్తికి తెచ్చుకోవాలి.

’చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు’, ’చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ!’ అంటారు పెద్దలు.

అంటే మనమేం చేస్తే ఆ ఫలితమే పొందుతామని దాని అర్ధం. మంచికి మంచి, చెడుకి చెడూ!

మనకున్న ప్రసిద్ధ పుణ్యకేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటి. ధూర్జటికవి పుణ్యమా అని శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తి మహాత్మ్యమూ అలా నిలిచి ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రం దగ్గర సువర్ణ ముఖి నది ప్రవహిస్తోంది. ఇప్పుడంటే నీళ్ళు లేక, ఇసుక పర్రలతో కన్పిస్తోంది గాని, ఒకప్పుడు నీటిగలగలలతో శ్రవణపేయంగా ఉండేది.

ఆ నదికి, ఆ గుడికి సంబంధించిన [విశేషం] కథ ఇది –

సర్పం, ఏనుగుల భక్తి పోరాటంతో ప్రసిద్దమైన ఈ ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు, వేలాదిగా శిల్పులూ, కూలీలు, ప్రజలు కూడా ఆ నిర్మాణ పనుల్లో పాలుపంచుకునేవారట.

సూర్యాస్తమయ వేళ, పనులు ముగించి, నదిలో కాళ్ళు చేతులూ కడుగుకొని, దోసిలిలో నీళ్ళు తీస్తే, ఆ దోసిట్లో తాము ఆ రోజు పడిన శ్రమకు తగిన కూలీ, బంగారు నాణాల రూపేణా దొరికేదట. ఎవరెంత పనిచేస్తే అంతగా! ఎక్కువపని చేసిన వారికి ఎక్కువ నాణాలు, తక్కువ పనిచేసిన వారికి తక్కువ నాణాలు. అందుకే ఆ నదికి ’సువర్ణముఖి’ అన్న పేరు వచ్చిందట.

పనిచెయ్యకుండా… చేసినట్లు నటిస్తే, లేదా మేస్త్రీ[పైఅధికారి]కి కాకా కొడితే పైఅధికారి డబ్బు ఇస్తాడేమో గానీ భగవంతుడివ్వడుగా![పైఅధికారి ఇచ్చింది కూడా వచ్చిన దారిలోనే పోవడం కద్దు. ఈ వైచిత్రి చూడగల కళ్ళుండాలి అంతే!] అంచేత ఈ పైరవీలన్నీ సువర్ణముఖి నది దగ్గర చెల్లేవి కాదన్నమాట.

ఈ కథ[విశేషం] చెబుతూ పెద్దలు “ఎవరు చూసినా చూడకపోయినా మనమేం చేస్తున్నామో భగవంతుడు చూస్తాడు. ఇవ్వాల్సిందే ఇస్తాడు. తస్మాత్ జాగ్రత్త!” అని చెప్పేవారు.

కాబట్టే మనం చేసిన మంచి, తరతరాలు మన పిల్లాపాపల్ని కాపాడుతుంది. చేసుకున్న చెడు భావితరాలని కూడా కట్టికుడుపుతుంది. అందుకే పాపభీతి, దైవభక్తి, పుణ్యప్రీతి ఉండాలి అనుకునేవాళ్ళు.

ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు – దీన్ని తమ జీవితాల్లోనూ, చుట్టూ అందరి జీవితాల్లోనూ పరిశీలించగలిగినా లేకపోయినా, ఇది సత్యం. సోదాహరణంగా కనబడినప్పుడయినా, దీన్ని నమ్మకతప్పదు.

ఎవరు గొప్ప నాట్యగత్తె!? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 16]

మరునాటి సభకు విక్రమాదిత్యుడు రహస్యంగా విభిన్న రకాల, వాసనల పుష్పములను సేకరించాడు. రంభ ఊర్వశుల నాట్య కౌశలాన్ని పరీక్షించేటందుకు, ఆ పుష్పాలతో రెండు దండలను కూర్చాడు. ఆ దండల నడుమ విష కీటకాలని ఉంచాడు. దండలను ఎంత నేర్పుగా అల్లాడంటే..... ఇతరులెవరు చూసినా విరిదండ విలక్షణంగా ఉందనుకుంటారే గాని, లోపల పురుగులున్నాయని గుర్తించలేరు. రెండు దండలనూ విక్రమాదిత్యుడు సభకు తీసుకుని వెళ్ళాడు.

రంభ ఊర్వశుల నాట్య పోటీ ప్రారంభమైంది.

విక్రమాదిత్యుడు వాళ్ళిద్దరినీ దగ్గరికి పిలిచి, "మీరు రిక్త హస్తాలతో నాట్యం చేస్తే, అదంత ఆకర్షణీయంగా ఉండదు. కాబట్టి, ఇదిగో ఈ పూలహారాలని చేత ధరించి, నాట్యం చేయండి" అంటూ.... రంభ ఊర్వశిలకి చెరో దండనీ అందించాడు. వాళ్ళిద్దరూ నాట్యాన్ని పునఃప్రారంభించారు.

నాట్యం చేస్తున్న వేళ, రంభ, తన చేతిలోని దండని గట్టిగా పట్టుకుంది. దానితో దండలోపల దాచబడిన క్రిములు వత్తిడికి గురయ్యాయి. ఆమెని ఇబ్బంది పెట్టసాగాయి. దాంతో ఆమె నాట్యానికి అంతరాయం ఏర్పడసాగింది. శృతిలయలకు అనుగుణంగా పడాల్సిన అడుగులు తాళం తప్పుతున్నాయి. ఆమె చేతిలోని దండ నుండి పువ్వులు రాలి పడుతున్నాయి.

అదే సమయంలో ఊర్వశి, తన చేతిలోని దండని అలవోకగా పట్టుకొని నాట్యం చేయసాగింది. దానితో దండ లోపలి క్రిములకి ఏ వత్తిడీ కలగ లేదు. అవీ ఆమెని ఇబ్బంది పెట్టలేదు. ఆమె నాట్యం నిరంతరాయంగా, శృతిలయలకు అనుగుణంగా, తాళ బద్దంగా సాగుతోంది. ప్రేక్షకులని సమ్మోహన పరుస్తోంది. ఆమె చేతిలోని దండలో పువ్వులు... ఆమెలాగే అందంగా, ముగ్ద మనోహరంగా ఉన్నాయి.

వారి నాట్య ప్రదర్శన ముగిసాక, దేవేంద్రుడు "ఓ విక్రమాదిత్యా! సాహసీ! సునిశిత దృష్టి కలవాడా! ఈ నాట్య పోటీలో విజేత ఎవరు? రంభ, ఊర్వశిలలో ఎవరిని ఉత్తమ నాట్య ప్రవీణగా నీవు నిర్ణయించావు?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు చిరునవ్వుతో "దేవేంద్ర! ఊర్వశి ఉత్తమ నాట్యగత్తె" అన్నాడు స్థిరంగా!

దేవేంద్రుడు ఓ క్షణం ఆశ్చర్యచకితుడయ్యాడు. కుతూహలంగ "ఎలా నిర్ణయించగలవు?" అన్నాడు.

విక్రమాదిత్యుడు.... రంభ, ఊర్వశిలిద్దరినీ పిలిచి "నేను మీకిచ్చిన దండలేవి?" అని అడిగాడు.

వెంటనే ఊర్వశి తన చేతిలోని పూలహారాన్ని విక్రమాదిత్యుడికి అంద చేసింది. దాన్లోని పూలన్నీ చెక్కు చెదరనట్లుగా, తాజాగా, ముగ్దగా ఒదిగి ఉన్నాయి. రంభ, నాట్యం మధ్యలోనే తన చేతిలోని పూదండని దూరంగా గిరాటు వేసింది. అందులోని క్రిములు ఆమె చేతుల మీద పారాడి, కుట్టి, ఇబ్బంది పెట్టాయి మరి!

విక్రమాదిత్యుడు అడగటంతో, రంభ... సభామండపంలో తాను పూదండని విసిరిన చోటి కెళ్ళి, దాన్ని తెచ్చి అందించింది. అందులోకి పుష్పాలు కొన్ని రాలిపడి పోయి, అక్కడక్కడా దారం బయటపడింది.

ఆ దండలని చూపుతూ విక్రమాదిత్యుడు "దేవేంద్రా! ఈ రెండు దండలలోని వ్యత్యాసాన్ని గమనించండి. రంభ దండతో నాట్యం చేయలేక దూరంగా విసిరివేసింది. ఊర్వశి దండ చేతనుంచుకునే నాట్యమాడింది. నేనిద్దరికీ దండలిచ్చి, వాటిని చేత ధరించి నాట్యం చేయమన్నాను. బహుశః రంభ ఈ దండభారాన్ని సైపలేకపోయినట్లుంది" అన్నాడు మర్మగర్భంగా!

ఇలా అంటూనే విక్రమాదిత్యుడు, రెండు దండలనీ విడదీసాడు. వాటిల్లోంచి విషక్రిములు బయటకు వచ్చాయి. అది చూసి అందరూ ఆశ్చర్య పడుతుండగా విక్రమాదిత్యుడు "దేవేంద్రా! ఊర్వశి పూలదండని అలవోకగా పట్టుకోవటం చేత, ఈ క్రిములామెని పీడింపలేదు. రంభ పూదండని గట్టిగా పట్టుకోవటం చేత, అవి ఆమెని గాయపరిచాయి. కాబట్టి, ఆమె దండని గిరాటు వేసింది.

ఊర్వశికి, తన నాట్య కౌశలం మీద తనకి నమ్మకం ఉంది. ఆమె విజయాన్ని గురించి ఆందోళన చెందలేదు. కాబట్టి - ఆమె ప్రశాంత చిత్తంతో, స్వేచ్ఛగా నాట్యం సలిపింది. కనుక దండని అలవోకగా పట్టుకుంది.

రంభ తన నాట్యం గురించి, విజయం గురించి ఆందోళిత హృదయంతో ఉంది. దాంతో ఆమె తన నాట్యగతిని తప్పింది. నాట్య మాడు వేళ, ఆమె వత్తిడితోనూ, గెలుపు గురించిన బెంగతోనూ ఉంది. దాంతో దండని గట్టిగా పట్టుకుంది. దాంతో అందులోని క్రిములామెని కుట్టి బాధించాయి. అది భరించలేక రంభ దండని విసిరి కొట్టింది.

అదీ... వీరిద్దరి నాట్య కౌశలంలోని వ్యత్యాసం! అందుచేతే, నేను ఈ నాట్య పోటీలో విజేతని ఊర్వశిగా నిర్ణయించాను" అన్నాడు.

[నిజానికి ఇది భాగవద్గీతలో చెప్పబడిన బుద్దియోగమే! కర్మణ్యేవాధికారస్తే.... శ్లోకంలో, శ్రీకృష్ణుడు చెప్పినది ఇదే! మనం మన పని గురించే ఆలోచించాలి గానీ, ఫలితాన్ని గురించి కాదు. ఫలితం గురించిన ఆందోళన వదిలి, పని మీదే మన ఏకాగ్రత నిలిపినప్పుడు, విజయం దానంతట అదే వస్తుంది. ఈ విషయాన్ని, ఈ కథ... పిల్లల మనస్సులకి హత్తుకునేంతగా, ఆసక్తికరంగా చెబుతుంది.]

విక్రమాదిత్యుడి తీర్పు వినగానే, దేవసభలోని దేవతలు, మునులూ, మహామహులందరూ... హర్షాతిరేకంతో, జయజయ ధ్వానాలు చేసారు. విక్రమాదిత్యుడి మేధస్సునీ, సునిశిత ఆలోచనా పటిమనీ ప్రశంసించారు.

దేవేంద్రుడు ఊర్వశిని విజేతగా ప్రకటించి, గొప్ప కానులిచ్చాడు. రంభనూ ఉత్సాహపరుస్తూ, తగిన విధంగా సన్మానించాడు. ఆ సంఘటనని సభలోని అందరూ ఎంతో ఆనందించారు.

దేవేంద్రుడు "విక్రమాదిత్యా! నీవిచ్చటనే మా అతిధిగా మరో నాలుగు రోజులుండ వలెను. ఒక గొప్ప కానుకను నేను నీకివ్వనున్నాను" అన్నాడు ఎంతో ప్రేమాదరాలతో!

విక్రమాదిత్యుడికి దేవేంద్రుని పలుకులు ప్రవల్లిక[puzzle]లా తోచాయి. అయితే... కుతూహలం కొద్దీ కూడా, దేవేంద్రుడివ్వ బోయే ‘గొప్ప కానుక’ ఏమిటని అడగలేదు. విక్రమాదిత్యుడు అంతటి స్థిరబుద్ది కలవాడు, వస్తు సామాగ్రి, విలువైన కానుకల పట్ల మోహం లేని వాడు.
~~~~~~~

మెహమూద్ – కార్త్యవీర్యార్జునుడు !

ముందుగా ఒకటికి రెండు కథలు చెప్పి, వాటి అనువర్తనతో మా బ్లాగు చుట్టాలని అలరించాలని….

కైరో నగరంలో ఉన్న మెహమూద్, జరీనా దంపతులకు ఉన్న ఆస్తంతా ఒక బక్కచిక్కిన గొర్రెపిల్ల మాత్రమే!

ఒకనాడు జరీనా భర్తతో “ఏమండీ! నెలరోజుల్లో వర్షాకాలం రాబోతుంది. అప్పుడు కూలి పనులుండవు. అందుకని ముందుగానే మనగొర్రె పిల్లని అమ్మేసి ఆ డబ్బులు దాచుకుంటే మేలు” అని సలహా ఇచ్చింది.

సరేనని మెహమూద్ గొర్రెపిల్లని సంతలో అమ్మకానికి పెట్టాడు. అయితే ఆ బక్కగొర్రెను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. చేసేది లేక వెనుదిరిగి వస్తుంటే దారిలో ఒక శ్మశానం దగ్గర పచ్చిక విస్తారంగా ఉండడం కన్పించింది. ‘గొర్రెనిక్కడ ఎలా గోలా కొన్నాళ్ళు ఉంచితే, పచ్చిక తిని బలంగా తయారవుతుంది. అప్పుడు అమ్మితే మంచి ధర పలుకుతుంది’ అనుకుని ఒక ఉపాయం ఆలోచించాడు.

తిన్నగా కాటికాపరి ఆలీఖాన్ వద్ద కెళ్ళి “ఆలీభాయ్! నీకు ఈ గొర్రెపిల్లను కానుకగా యిద్దామని వచ్చాను” అన్నాడు.

“ఎందుకు?” అనడిగాడు ఆలీఖాన్ ఆశ్చర్యంగా.

“మరేం లేదు భాయ్! నేనా ఒంటరివాడిని. చనిపోతే నన్ను ఎవరు పూడ్చి పెడతారు? అందుకని ముందే సుంకంగా గొర్రెపిల్లని ఇద్దామని వచ్చా” అన్నాడు మెహమూద్. వీడెవడో మూర్ఖుడులా ఉన్నాడనుకున్న ఆలీఖాన్ లోలోపల సంతోషించి “ఓ! నిక్షేపంగా! నీవు చచ్చిన తరువాత నీ శవాన్ని పాతిపెడతానులే!” అంటూ గొర్రెపిల్లను తీసుకున్నాడు.

కొన్నాళ్ళు గడిచేసరికి గొర్రె తెగ బలిసింది. అది గమనించిన మెహమూద్, ఆలీఖాన్ దగ్గరకు వెళ్ళి “భాయ్! నేను మక్కా పోతున్నాను. నువ్వూ మూటాముల్లే సర్ధుకుని బయల్దేరు!” అంటూ తొందర చేశాడు.

“నీకు మతి చలించలేదు కదా? నీతో నేనెందుకు?” అన్నాడు ఆలీఖాన్.

“భలే వాడివే. నేను చస్తే పాతిపెట్టడానికి గొర్రెను తీసుకున్నావుగా? మరి నేను మక్కాలో పోతేనో? కాబట్టి పదపద” అన్నాడు మెహమూద్. ఆలీఖాన్ కి ఆరికాలి మంట నెత్తి కెక్కింది. “ఏంటీ? నీ గొర్రెను తీసుకున్న పాపానికి నీతో ఊరేగాలా? కుదర్దు. కావాలంటే నీ గొర్రె పిల్లని నువ్వే పట్టుకుపో” అంటూ కేకలేశాడు.

ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న మెహమూద్ “సరే… మరి నీ ఇష్టం!” అంటూ గొర్రెను తీసుకుని, తిన్నగా సంతకి వెళ్ళి మంచి ధరకి దాన్ని అమ్మేశాడు. వర్షాకాలంలో ఆ దంపతులకు ఏ లోటూ రాలేదు.

శ్రీపాద సత్యనారాయణ గారు వ్రాయగా, ఈనాడులో నేను చదివిన కథ ఇది. ఇందులో తెలివిగలిగిన మెహమూద్ [పేదవాడే కావచ్చు గాక] తన మేధోబలంతో కాటికాపరి అలీఖాన్ ని మోసగించాడు. ఎక్కడా “నా గొర్రెని నాకు ఇచ్చెయ్!” అన లేదు. కాటికాపరే, తనంతట తానే “గొర్రెని తీసేసుకో!” అనేలా చేసాడు. వెరసి కాటికాపారి కష్టాన్ని, మెహమూద్ దోచుకున్నాడు.

మరో కథ చూద్దాం. ఇది మన పురాణాల్లోని [భాగవతం] కథ. నరనారాయణులు తపస్సు చేసుకుంటూ ఉండగా, కార్త్యవీర్యార్జునుడు అనే రాజు, యుద్దకాంక్షతో అన్నిదేశాలూ తిరుగుతూ, ఆయా రాజుల్ని ఓడిస్తూ, యుద్దోన్మాదంతో తిరుగుతూ ఉంటాడు. అతడి యుద్దోన్మాదాన్ని భరించలేక, కొందరతడికి, “ఆశ్రమంలో నరనారాయణులున్నారు. వాళ్ళతో యుద్ధం చెయ్యి! నీ యుద్దకాంక్ష చల్లారుతుంది” అని సలహా ఇస్తారు.

కార్తవీర్యార్జునుడికి వేయిభుజాలు[చేతులు] ఉంటాయి. అమిత బలవంతుడు. ఆ బలగర్వంతోనే అందర్నీ యుద్దానికి ఆహ్వానిస్తూ, ఆ గెలుపులలో కలిగిన విజయగర్వంతో మరింత విర్రవీగుతూ, చివరికి యుద్దోన్మాది అయ్యాడు. అలాంటి కార్త్యవీర్యార్జునుడికి పైసలహా నచ్చింది. దాంతో నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి చేరాడు. యుద్దఘర్జనలు చేస్తూ వారిరువురినీ యుద్దానికి పిలిచాడు.

వారు “ఎందుకయ్యా యుద్దం! మేం ప్రశాంతంగా తపస్సు ఆచరిస్తున్నాం! మమ్మల్నెందుకు అలజడి చేస్తావు? వెళ్ళు!” అన్నారు. అతడు విన్పించుకోలేదు. ’యుద్ధం చెయ్యడానికి భయం కాబోలు!’ అని వెక్కిరించాడు. చేవలేదని ఛీత్కరించాడు. ఓడిపోతారని సంకోచమంటూ రెచ్చగొట్టాడు. ’యుద్ధం చెయ్యమని తన చేతులు తీటపెడుతున్నాయనీ, యుద్ధం చెయ్యకతప్పదనీ’ అన్నాడు. ’యుద్ధం చేస్తే వాళ్ళ ఓటమి, తన గెలుపూ ఖాయమనీ’ ప్రగల్భాలు పలికాడు.

అతడి గోలతో నరనారాయణుల ప్రశాంతత దెబ్బతింటోంది. చివరికి నారాయణ ప్రేరితుడై, నరుడు కార్త్యవీర్యార్జునుడితో యుద్ధం చేసేటందుకు లేచాడు. ఒక ధర్భను మంత్రించి, అదే శరంగా అంటే ఆయుధంగా సంధించాడు. కార్త్యవీర్యార్జునుడు ఎంతగా పెనుగులాడినా, ప్రతిఘటించ ప్రయత్నించినా నరుడు ప్రయోగించిన ఆయుధంతో యుద్ధం చెయ్యలేకపోయాడు. చివరికది అతడి 998 చేతులనూ ఖండించి, రెండు చేతులను వదలివేసింది.

పరాజితుడైన కార్త్యవీర్యార్జునుడు భయంతో, పశ్చాత్తాపంతో నరనారాయణుల కాళ్ళపైబడ్డాడు. అప్పుడు వారిరువురూ “కార్త్యవీర్యార్జునా! బలం ఉన్నది బలహీనులని బాధించేందుకు కాదు. వారిని రక్షించేటందుకు! ఇకనైనా బుద్ధిగా ప్రజలని, బలహీనులని కాపాడుతూ రాజ్యం చేసుకో!” అని చెప్పి పంపారు.

ఆ విధంగా భారతీయ ఇతిహాసాలు ’బలం ఉంటే, అది శారీరక బలం కానివ్వండి, మేధోబలం [తెలివి] కానివ్వండి, ఆ బలంతో బలహీనులని రక్షించాలి గానీ దగా చేయకూడదు, బాధించకూడదు’ అని చెబుతాయి! ఇలాంటి ధర్మాలని ప్రభోదిస్తూ భారతీయ ఇతిహాసాలు ప్రజా దృక్పధాన్ని పాపం, పుణ్యం అని ప్రభావపరుస్తాయి. కాబట్టే హిందూమతాన్ని మతాలకతీతంగా జీవన సరళి అనీ, సనాతన ధర్మమనీ అంటారు.

’నేను తెలివైన వాణ్ణి. చట్టప్రకారం వ్యాపారం చేసాను’ అని తను చేసిన మోసాన్ని సమర్దించుకుంటూ, ఎవరైనా అంటే…. ఏమనగలం? చట్టం మానవనిర్మితం. అది రాజ్యాంగం అనబడే ఓ పుస్తకాన్ని బట్టిఉంటుంది. కాని ధర్మం మానవత్వాన్ని బట్టి ఉంటుంది. దృక్పధాన్ని బట్టి ఉంటుంది. దాన్ని మతం ప్రబోధిస్తుంది. కాబట్టే ఏకాదశ నాడు ఉపవాసం చేసి [ఫలహారాలు తిని అన్నం తినకపోవటం ఉపవాసం కాదు, అసలు ఆహారమే గ్రహించక పోవటం ఉపవాసం అవుతుంది] ఆకలిని అనుభవపూర్వకంగా గుర్తుచేసుకున్న తర్వాత, ద్వాదశి రోజున అతిధి అభ్యాగతులకు భోజనం పెట్టి, ఆపైన ద్వాదశి పారాయణ చేయటం అన్నది సాంప్రదాయంగా ఉండేది.

డబ్బున్నవాడు పేదలకి దానధర్మాలు చేయటం, బలవంతుడు బలహీనుల్ని రక్షించటం అన్న క్షాత్రధర్మాన్ని పాటించటం, పండితుడు శాస్త్రజ్ఞానాన్ని ప్రజలకి బోధించటం – ఇలాంటి వాటిని తమకు తామే, స్వచ్ఛందంగా, తమ విద్యుక్తధర్మంగా పాటించి ఆచరించటం – ఇలాంటి వాటిని ఏ చట్టమూ ప్రేరేపించలేదు, ప్రజలు పాటించేలా చేయలేదు. వీటిని ఆచరించేలా చేసేది ప్రజల దృక్పధం మాత్రమే. ఆ దృక్పధాన్ని, అంటే ఆలోచనా సరళిని, పాపం పుణ్యం పేరిట ప్రభావ పరిచేది మత విశ్వాసాలే!

అలాంటిచోట, మత విశ్వాసాలని ధ్వంసం చేస్తే, ఇక ఆ జాతిని ధ్వంసం చేయటం ప్రాణంలేని కట్టెను తగలబెట్టినంత సులభం! కాబట్టి ప్రతీ మనిషి ఆర్ధికాభివృద్ధితోపాటు, ఆత్మోన్నతి కోసం ప్రయత్నించక తప్పదు. భాగవతంలో – ‘ధర్మమంటే సత్యమూ, భూతదయ, దానము, తపస్సు – ఈ నాలుగూ ధర్మం యొక్క పాదాలు’ అని చెప్పబడుతుంది.

దేవేంద్రుని ఆహ్వానం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 15]

ఇంకా ఆలస్యం చేస్తే.... నారద మహర్షికి ఆగ్రహం కలిగి శపించగలడని, మాతలికి భయం కలిగింది. దేవేంద్రుని రధాన్ని అలంకరించి, ఆకాశమార్గాన భూలోకానికి ప్రయాణ మయ్యాడు. రాత్రి పదహారు ఘడియలకు అతడు ఉజ్జయినీ నగరాన్ని చేరాడు. [ఘడియలన్నవి ఆనాటి కాలమానం.]

మాతలి దేవరధాన్ని ఉజ్జయినీ మహంకాళి ఆలయ సమీపంలో నిలిపాడు. విక్రమాదిత్యుని మందిరాని కేగి, విక్రమాదిత్యుని చూచి నమస్కరించాడు. "ఓ రాజేంద్రా! దేవేంద్రుడు మిమ్ము జూడగోరి యున్నాడు. నేను ఇంద్ర సారధి యగు మాతలిని. దేవపతి ఆనతి మీద మిమ్ములను స్వర్గమునకు తీసికొని పోవుటకు రధమును తెచ్చిన వాడను. మీ అభిప్రాయం బేమి?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు ప్రక్కనే ఉన్న భట్టిని సాభిప్రాయముగా తిలకించాడు. భట్టి కొన్ని క్షణాలు ఆలోచించి, "మహారాజా! ఇది ఎంతో విశేషమూ, ప్రత్యేకమూ కూడా! మీ కీర్తి చంద్రికలు స్వర్గలోకానికీ పరివ్యాప్తి చెంది ఉండవచ్చు. లేకున్న దేవేంద్రుడే మిమ్మల్ని ఆహ్వానించడు గదా? మీరు జాగు సేయక, తక్షణమే ప్రయాణమవ్వండి. ఇందులో శంకించడానికేమీ లేదు" అన్నాడు.

విక్రమాదిత్యుడు పట్టుపుట్టములనూ, రత్నాభరణములనూ ధరించి, భద్రకాళీ దేవాలయమునకు పోయినాడు. మహంకాళీ దివ్యదర్శనము చేసి కొని "ఓ దేవీ! ఓ తల్లీ! నీవు సమస్త లోకమాతవు. నన్నూ, ఈ లోకమును గాచు అమ్మవు. నేను నీ బిడ్డను. నీ భక్తుడను. దయతో నన్ను అనుగ్రహించు! కరుణా మూర్తివై నన్ను రక్షించు!!" అని ప్రార్దించాడు.

మహంకాళీ మాత అతడి ముందు ప్రత్యక్షమైంది. చిరునవ్వుతో "వత్సా, విక్రమాదిత్యా! నీవు స్వర్గమునకు వెళ్ళుము. ఈ యాత్ర నీకు శుభాన్నీ, కీర్తినీ కలిగించ గలదు. స్వర్గ భూలోకములలోని అందరికీ అది సంతోషాన్ని ఇవ్వగలదు" అని దీవించి... విభూతి, నిమ్మపండుల నిచ్చింది.

విక్రమాదిత్యుడు భక్తితో వాటిని స్వీకరించి, దేవరధాన్ని చేరాడు. అది దేవ రధమైనందున విక్రమాదిత్యుడు, ఎక్కబోయే ముందు దానికి ప్రదక్షిణలాచరించి, భక్తితో నమస్కరించాడు. పిదప కుడిపాదమెత్తి రధం మీద ఉంచాడు. అతడు రెండవ పాదమెత్తి రధములోనికి ఎక్కక మునుపే, మాతలి రధాన్ని, వాయువేగంతో ముందుకి ఉరికించ బోయాడు.

అయితే విక్రమాదిత్యుడు ఆందోళన చెందలేదు. అతడు తన పాదాలని భూమి మీద, రధం మీదా గట్టిగా నొక్కి ఉంచి స్థిరంగా నిలబడ్డాడు. ఆశ్చర్యం! రధం అంగుళం కూడా ముందుకి కదలలేదు.

మాతలి ఆశ్చర్యం పోయాడు. "ఏమిటది? రధం ఎందుకు కదలటం లేదు. ఏమి ఆశ్చర్యం ఇది? కారణమేమై ఉంటుంది?" అని ఆలోచిస్తూ వెనుదిరిగి చూశాడు. చిరునవ్వుతో స్థిరంగా నిలిచి ఉన్న విక్రమాదిత్యుణ్ణీ, అతడి ప్రయత్నాన్నీ గమనించాడు. మాతలికి భయమూ, విభ్రమమూ కలిగాయి.

‘నారద మహర్షి చెప్పినది సత్యమే! నేను దానిని సరికాదనుకొంటిని. ఇప్పుడీ వింతను కనులారా చూచితిని. మానవ మాత్రుడీ అద్భుతము చేయజాలడు. ఈ విక్రమాదిత్య మహారాజు నిజముగా దేవతా సముడే!’ అనుకున్నాడు.

వెంటనే మాతలి రధము దిగి వచ్చి, విక్రమాదిత్యుని ఎదుట నిలిచాడు. విక్రమాదిత్యునికి నమస్కరించి, "ఓ విక్రమాదిత్యా! రాజోత్తమా! నా తప్పును మన్నించు" అని ప్రార్దించాడు. మాతలికి ఎంతో సిగ్గుగానూ, పశ్చాత్తాపం గానూ తోచింది. అతడి మాటల్లో వినయం ఉంది. ముఖంలో దైన్యం ఉంది.

విక్రమాదిత్యుడు సాదరంగా చిరునవ్వు నవ్వి అతణ్ణి ఆశ్వాశించాడు. పిదప రధారూఢుడైన విక్రమాదిత్యుని మాతలి అమరావతికి ఆకాశ మార్గాన తీసికెళ్ళాడు. ఎంతో వినయ విధేయతలతో అతణ్ణి ఇంద్రసభకు తోడ్కొని పోయాడు.

విక్రమాదిత్యుడు ఇంద్రుడికి నమస్కరించాడు. దేవేంద్రుడు విక్రమాదిత్యుని చూడగానే ఎంతో ప్రసన్నుడయ్యాడు. తనలో ‘నారద మహర్షి సత్యము పలికినాడు. ఈతడి తేజస్సు దేవతలతో సరితూగు నట్టిది’ అనుకున్నాడు.

దేవేంద్రుడు విక్రమాదిత్యుడిని ఎంతో గౌరవంగా, ఆత్మీయ అతిధిగా ఆదరించాడు. సభలో విక్రమాదిత్యుడు సుఖాసీనుడయ్యాక, దేవేంద్రుడు "విక్రమాదిత్య మహరాజా! మీ రాజ్యము సస్యశ్యామలంగా, సిరిసంపదలతో నిండి ఉన్నదా? మీ ప్రజలు మీ పట్ల గౌరవ విధేయతలతో మొలుగు తున్నారు కదా? నీవు ప్రజల యోగ్యతా యోగ్యతలనీ, సామర్ద్య అసమర్దతలనీ ఎరింగి, వారికి కావలసిన అన్ని సదుపాయములూ సమకూర్చుతున్నావా? నీ రాజ్యమున ప్రజలకు నీ మంత్రులూ, రాజోద్యోగులూ ఇష్టులై ఉన్నారా?" అంటూ ప్రశ్నించాడు.

[చూడండి! ఒక రాజును అడిగిన ప్రశ్నలలోనే ఒక రాజ్యం, ఎలా ఉండాలో, పరిపాలనా విధానం (Administration) ఎలా ఉండాలో స్ఫురింపు ఉంది. రాజు ప్రజలకి అన్నీ సమకూర్చాలి. రాజు ప్రజల చేత గౌరవింపబడాలి. ప్రజలు ఉద్యోగులంటే ఇష్టం కలిగి ఉండాలి. ఇప్పటి స్థితో?]

విక్రమాదిత్యుడు "దేవేంద్రా! మీ దయతో మా రాజ్యంలో అన్నీ శుభప్రదంగానూ, ప్రవర్ధమానంగానూ ఉన్నాయి" అని ప్రత్యుత్తర మిచ్చాడు. దేవేంద్రుడు విక్రమాదిత్యునికి అతిధి గృహన్ని, అతిధి మర్యాదలని అమరించాడు. కామధేనువు విక్రమాదిత్యునికి కావలసిన వస్తు సంబరాలని, అమృతమయ ఆహారాన్ని సమకూరుస్తోంది.

విక్రమాదిత్యుడీ విధంగా పక్షం రోజుల పాటు దేవలోకములో గడిపాడు. ప్రతిదినమూ రెండు సార్లు దేవసభకు హాజరయ్యాడు. శాస్త్ర చర్చలలోనూ, ఆధ్యాత్మక చర్చలలోనూ పొల్గొనే వాడు. వివిధ విషయాలపై విక్రమాదిత్యుడి ఆకళింపును చూచి దేవేంద్రుని కెంతో ఆనందమూ, ప్రీతీ కలిగాయి.

ఒకనాటి సభలో... రంభ, ఊర్వశులిద్దరూ నాట్య చేయసాగారు. ఇద్దరూ అందంగా, ధగధగలాడే రత్నాభరణ భూషణులై, మిలమిల లాడే వస్త్రధారులై మెరిసి పోతున్నారు.

వారి నాట్య ప్రదర్శన సాగుతుండగా దేవేంద్రుడు, "ఓ విక్రమాదిత్య మహరాజా! రంభ, ఊర్వశి లిద్దరిలో ఎవరు గొప్ప నాట్య ప్రవీణులో నీవు నిర్ణయించాలి" అన్నాడు.

విక్రమాదిత్యుడు "రేపటి సభలో నా నిర్ణయం చెబుతాను. ఇప్పటికి వారిద్దరి నృత్యాన్ని ఆపించండి" అన్నాడు.

వారి నృత్య పోటీ మరునాడు కొనసాగించ వలసిందిగా ఆజ్ఞాపించ బడింది.
~~~~~

రంభ, ఊర్వశుల నాట్య వివాదం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 14]

వినోద రంజిత ప్రతిమ, ఇంత వరకూ కథ చెబుతూ ఇలా అంది. "ఓ భోజ రాజేంద్రా! తదుపరి కథని శుద్దాత్ముడవూ, శ్రద్దాత్ముడవూ అయి విందువు గాక!" అంటూ... ఇలా కొనసాగించింది.

భట్టి విక్రమాదిత్యుల పాలనలో రోజులలా హాయిగా గడిచి పోతుండగా...

ఒకనాడు...

అమరావతీ నగరంలో దేవ నర్తకీ మణులైన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమా, ఘృతాచి, పుంజక స్థల మొదలైన వారి మధ్య ఒక వివాదం తలెత్తింది. చివరికది రంభ ఊర్వశిల మధ్య, ఇద్దరిలో ఎవరు గొప్ప నాట్యగత్తెలనే వివాదంగా పరిణమించింది.

వారిరువురూ నేను గొప్పంటే, నేను గొప్పని ఒకరి నొకరు సవాలు చేసుకోసాగారు. ఇది దేవేంద్రుడి చెవి దాకా చేరింది. దేవలోక వాసుల మధ్య ఎటువంటి వివాదాలూ రేకెత్తటం దేవేంద్రుడికి సబబుగా తోచలేదు.

అతడు రంభ, ఊర్వశులిద్దరిని పిలిపించి, "రంభా, ఊర్వశీ! ఎందుకిలా మీలో మీరు జగడము లాడుచున్నారు? మీలో ఒకరు, మరొకరి కంటే గొప్పవారైన గానీ, లేక తక్కువైన గానీ ఏమన్నది? దాని వలన ఒనగూడు లాభమేముంది? కాబట్టి మీ జగడముల కట్టిపెట్టి, ప్రశాంతముగా ఉండగలరని నా అభీష్టము" అనినాడు.

రంభూర్వశులిద్దరూ దేవేంద్రునికి వినయంగా నమస్కరించారు. "దేవేంద్రా! నీవు దేవతలకథిపతివి. అసమర్దులూ, నైపుణ్య హీనులూ, ఏ విధంగానూ తమది తాము నిరూపించుకోలేక బ్రతుకీడ్చగలరు. మేమలా బ్రతుక నిచ్చగించము. మన ప్రతిభాపాటవాలని బట్టే, ప్రజలలో మన గౌరవాదరాలుండ గలవు.

రాజైన వాడు... సమర్దులనీ, అసమర్దులనీ ఒకే విధముగా జమ కట్టరాదు. రాజు తన ప్రజలలో, అర్హతానర్హతలను బట్టి ఆదరించినప్పుడే అతడు నీతిని పాటించినట్లుగును. లేకున్న అది పాపమగును" అన్నారు.

దేవేంద్రుడా మాటలలోని సత్యమును గుర్తించినాడు.

"సరే! మీరిరవురూ నాట్యములో పోటీ పడుదురేని, రేపటి దినమున, తగిన ఆహార్య అలంకారములతో సభకు రండి! మీ కౌశలమును బట్టి నాట్య ప్రదర్శన చేయండి. దేవ సభలోని మహామహులు, మీలో ఎవరు ఉత్తమ నాట్యగత్తెలో నిర్ణయించగలరు" అని ఆజ్ఞాపించాడు.

ఆ ప్రకారం, దేవసభలో రంభూర్వశులిద్దరూ, అద్బుతంగా అలంకరించుకొని, అంతకంటే అద్భుతరీతిలో తమ నాట్య ప్రదర్శన కావించారు. అందమైన, అనేక రీతుల లోన, వారు ప్రదర్శించిన అభినయం సభికులందరినీ ఎంతో అలరించింది.

ఇరువురూ అందంగా ఉన్నారు. అందంగా అలంకరించుకున్నారు. పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు! అభినయమూ పోటాపోటీగా ఉన్నది. దేవేంద్రుడు కూడా వారిద్దరిలో ఎవరు గొప్పగా నాట్యము సలిపారో నిర్ణయించలేక పోయాడు. సభలోని మహామహులను, నిర్ణయం చేయవలసిందిగా కోరాడు. ఎవరూ జవాబివ్వలేదు.

దేవేంద్రుడు అక్కడున్న మహర్షులతో "మహామునులారా! రంభ, ఊర్వశీల నాట్య ప్రదర్శనను తిలకించారు కదా? వారిలో ఎవరు ఉత్తమ కళాకారిణో నిర్ణయించండి" అని అభ్యర్దించాడు. మునులు సైతం న్యాయ నిర్ణయం చేయలేకపోయారు. మౌనమే జవాబయ్యింది.

అప్పుడు నారద మహర్షి, సభనవలోకించి, దేవేంద్రుడి వైపు తిరిగి, "ఓ దేవేంద్రా! రంభూర్వశుల అద్భుత కళాకౌశలాన్ని, అషామాషీగా తలచి, మనకి తోచిన నిర్ణయం చెప్పుట సరియైనది కాదు. అట్లు చెప్పినా అది వృధానే అవుతుంది తప్ప, వారి వివాదమూ తీరదు. కాబట్టే, అర్హత లేనిదే పదుగురు గొప్పవారు కూర్చుండు సభలకు వెళ్ళరాదంటారు పెద్దలు!

ఎందుకంటే... ఒక వ్యక్తి, ఏదైనా సభలో.... తెలిసి గానీ, తెలియక గానీ... ఏదైనా మాట్లాడినా, అన్నియూ తెలిసి కూడా మౌనం పాటించినా... అది చివరికి ఆ వ్యక్తికి అపఖ్యాతినే కలిగిస్తుంది.

పెక్కుమంది ఉన్న సభలలో, అందరికీ అమోద యోగ్యమయ్యే విధంగా ‘నిర్ణయాలు చేయటం’ చాలా చిక్కులతో కూడి ఉంటుంది. కనుక, రంభ, ఊర్వశీలలో ఎవరు ఉత్తమ నాట్యగత్తో చెప్పటం కష్టమైన పనే! ఎటుల నిర్ణయించగలం? ఈ సమస్యను పరిష్కరించగల పురుషుడు భూలోకమున ఉన్నాడు. అతడన్ని కళలలో ఆరితేరిన వాడు. విక్రమాదిత్యుడను పేర ప్రసిద్దడైన వాడు. అతడు గొప్పయోధుడు, సాహసీ! అతడి సోదరుడు భట్టి గొప్ప మేధావి. భట్టి ప్రధానమంత్రిగా, విక్రమాదిత్యుడు వైభవంగా రాజ్యమేలు తున్నాడు.

వాళ్ళిద్దరూ స్వేచ్ఛాప్రియులూ, శాంతి కాముకులూ! వాళ్ళు జ్ఞానానికి, కరుణకీ, సహాయ ప్రవృత్తికీ, ధైర్య సాహసాలకు ప్రతిరూపాలు! అరవై నాలుగు కళలలోనూ ఆరితేరిన వారు. మనుస్మృతిని చక్కగా ఎఱిగిన వారు. [మనుస్మృతి ని ఆనాటి రాజ్యాంగం అనవచ్చు.]
అట్టి విక్రమాదిత్యుని నీవు దేవసభకు ఆహ్వానించి, రంభ ఊర్వశిల మధ్య గెలుపెవరిదో అతడి ద్వారా తెలుసుకో! అట్లు కానిచో, కల్పాంతమైననూ, రంభూర్వశూలలో ఎవరు గొప్పో తేల్చుటకు ఎవరికినీ సాధ్యము కాదు" అన్నాడు.

ఇది విని దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. ఆశ్చర్యపడ్డాడు కూడా! తనలో "ఓహో! భూలోకమున అంతటి గొప్ప వ్యక్తి గలడా? లేకున్న దేవముని, సర్వజన పూజితుడూ అయిన నారద మహర్షి ఎందుకిట్లు చెప్పును! అంతటి గొప్ప వ్యక్తిని చూచి తీరవలయును" అనుకొన్నాడు.

తన సారధియైన మాతలిని పిలిచి "ఓ మాతలీ! నీవు భూలోకమున గల ఉజ్జయినీ నగరానికి పోవలెను. ఆ నగరాధీశుడైన విక్రమాదిత్యుని దర్శించి, నా ఆహ్వానము తెలియ బరచి, అతడి నిక్కడికి తోడ్కొని రమ్ము" అని ఆజ్ఞాపించాడు.

అది విని మాతలి కొంత విభ్రాంతి పడినాడు. తనలో "ఏమిటీ విపరీతమూ? ఈ స్వర్గలోకమున దేవతలూ, సత్త్వగుణ పూరితులైన మహామునులూ ఉన్నారు. అట్టి స్వర్గలోకమునకు, నేను భూలోకమున గల రజోగుణ పూరితుడైన ఒక మహారాజును తీసుకొని రావలెనా? దేవేంద్రునకు మతిభ్రంశం కాలేదు కదా?" అని తలపోస్తూ, దేవేంద్రుని ఆజ్ఞకు ఉలకక పలకక నిలచుండినాడు. అట్లని తన అయిష్టతను వ్యక్తీకరించు ధైర్యము చేయలేకపోయాడు. తనలో తాను "నా అయిష్టతను దేవేంద్రునకు చెప్పినట్లయితే, అది తప్పుగా పరిణమించవచ్చు" అని సందేహిస్తూ, భూలోకము వైపుకు చూచుచూ మౌనంగా ఉండిపోయాడు.

బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షికి, మాతలి మధన అర్దమయ్యింది. ఆయన చిరునవ్వుతో "మాతలి! నీ సందేహము నాకు తెలుసు! అయితే నీవు ఉజ్జయినీ పురాధీశుడైన విక్రమాదిత్యుని గురించి సందేహించవలదు. అతడు దేవతలకు దీటైన వాడు. నీవు వెంటనే వెళ్ళి అతనిని పిలుచుకు రాగలవు" అన్నాడు.

~~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes