RSS
Wecome to my Blog, enjoy reading :)

రంభ, ఊర్వశుల నాట్య వివాదం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 14]

వినోద రంజిత ప్రతిమ, ఇంత వరకూ కథ చెబుతూ ఇలా అంది. "ఓ భోజ రాజేంద్రా! తదుపరి కథని శుద్దాత్ముడవూ, శ్రద్దాత్ముడవూ అయి విందువు గాక!" అంటూ... ఇలా కొనసాగించింది.

భట్టి విక్రమాదిత్యుల పాలనలో రోజులలా హాయిగా గడిచి పోతుండగా...

ఒకనాడు...

అమరావతీ నగరంలో దేవ నర్తకీ మణులైన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమా, ఘృతాచి, పుంజక స్థల మొదలైన వారి మధ్య ఒక వివాదం తలెత్తింది. చివరికది రంభ ఊర్వశిల మధ్య, ఇద్దరిలో ఎవరు గొప్ప నాట్యగత్తెలనే వివాదంగా పరిణమించింది.

వారిరువురూ నేను గొప్పంటే, నేను గొప్పని ఒకరి నొకరు సవాలు చేసుకోసాగారు. ఇది దేవేంద్రుడి చెవి దాకా చేరింది. దేవలోక వాసుల మధ్య ఎటువంటి వివాదాలూ రేకెత్తటం దేవేంద్రుడికి సబబుగా తోచలేదు.

అతడు రంభ, ఊర్వశులిద్దరిని పిలిపించి, "రంభా, ఊర్వశీ! ఎందుకిలా మీలో మీరు జగడము లాడుచున్నారు? మీలో ఒకరు, మరొకరి కంటే గొప్పవారైన గానీ, లేక తక్కువైన గానీ ఏమన్నది? దాని వలన ఒనగూడు లాభమేముంది? కాబట్టి మీ జగడముల కట్టిపెట్టి, ప్రశాంతముగా ఉండగలరని నా అభీష్టము" అనినాడు.

రంభూర్వశులిద్దరూ దేవేంద్రునికి వినయంగా నమస్కరించారు. "దేవేంద్రా! నీవు దేవతలకథిపతివి. అసమర్దులూ, నైపుణ్య హీనులూ, ఏ విధంగానూ తమది తాము నిరూపించుకోలేక బ్రతుకీడ్చగలరు. మేమలా బ్రతుక నిచ్చగించము. మన ప్రతిభాపాటవాలని బట్టే, ప్రజలలో మన గౌరవాదరాలుండ గలవు.

రాజైన వాడు... సమర్దులనీ, అసమర్దులనీ ఒకే విధముగా జమ కట్టరాదు. రాజు తన ప్రజలలో, అర్హతానర్హతలను బట్టి ఆదరించినప్పుడే అతడు నీతిని పాటించినట్లుగును. లేకున్న అది పాపమగును" అన్నారు.

దేవేంద్రుడా మాటలలోని సత్యమును గుర్తించినాడు.

"సరే! మీరిరవురూ నాట్యములో పోటీ పడుదురేని, రేపటి దినమున, తగిన ఆహార్య అలంకారములతో సభకు రండి! మీ కౌశలమును బట్టి నాట్య ప్రదర్శన చేయండి. దేవ సభలోని మహామహులు, మీలో ఎవరు ఉత్తమ నాట్యగత్తెలో నిర్ణయించగలరు" అని ఆజ్ఞాపించాడు.

ఆ ప్రకారం, దేవసభలో రంభూర్వశులిద్దరూ, అద్బుతంగా అలంకరించుకొని, అంతకంటే అద్భుతరీతిలో తమ నాట్య ప్రదర్శన కావించారు. అందమైన, అనేక రీతుల లోన, వారు ప్రదర్శించిన అభినయం సభికులందరినీ ఎంతో అలరించింది.

ఇరువురూ అందంగా ఉన్నారు. అందంగా అలంకరించుకున్నారు. పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు! అభినయమూ పోటాపోటీగా ఉన్నది. దేవేంద్రుడు కూడా వారిద్దరిలో ఎవరు గొప్పగా నాట్యము సలిపారో నిర్ణయించలేక పోయాడు. సభలోని మహామహులను, నిర్ణయం చేయవలసిందిగా కోరాడు. ఎవరూ జవాబివ్వలేదు.

దేవేంద్రుడు అక్కడున్న మహర్షులతో "మహామునులారా! రంభ, ఊర్వశీల నాట్య ప్రదర్శనను తిలకించారు కదా? వారిలో ఎవరు ఉత్తమ కళాకారిణో నిర్ణయించండి" అని అభ్యర్దించాడు. మునులు సైతం న్యాయ నిర్ణయం చేయలేకపోయారు. మౌనమే జవాబయ్యింది.

అప్పుడు నారద మహర్షి, సభనవలోకించి, దేవేంద్రుడి వైపు తిరిగి, "ఓ దేవేంద్రా! రంభూర్వశుల అద్భుత కళాకౌశలాన్ని, అషామాషీగా తలచి, మనకి తోచిన నిర్ణయం చెప్పుట సరియైనది కాదు. అట్లు చెప్పినా అది వృధానే అవుతుంది తప్ప, వారి వివాదమూ తీరదు. కాబట్టే, అర్హత లేనిదే పదుగురు గొప్పవారు కూర్చుండు సభలకు వెళ్ళరాదంటారు పెద్దలు!

ఎందుకంటే... ఒక వ్యక్తి, ఏదైనా సభలో.... తెలిసి గానీ, తెలియక గానీ... ఏదైనా మాట్లాడినా, అన్నియూ తెలిసి కూడా మౌనం పాటించినా... అది చివరికి ఆ వ్యక్తికి అపఖ్యాతినే కలిగిస్తుంది.

పెక్కుమంది ఉన్న సభలలో, అందరికీ అమోద యోగ్యమయ్యే విధంగా ‘నిర్ణయాలు చేయటం’ చాలా చిక్కులతో కూడి ఉంటుంది. కనుక, రంభ, ఊర్వశీలలో ఎవరు ఉత్తమ నాట్యగత్తో చెప్పటం కష్టమైన పనే! ఎటుల నిర్ణయించగలం? ఈ సమస్యను పరిష్కరించగల పురుషుడు భూలోకమున ఉన్నాడు. అతడన్ని కళలలో ఆరితేరిన వాడు. విక్రమాదిత్యుడను పేర ప్రసిద్దడైన వాడు. అతడు గొప్పయోధుడు, సాహసీ! అతడి సోదరుడు భట్టి గొప్ప మేధావి. భట్టి ప్రధానమంత్రిగా, విక్రమాదిత్యుడు వైభవంగా రాజ్యమేలు తున్నాడు.

వాళ్ళిద్దరూ స్వేచ్ఛాప్రియులూ, శాంతి కాముకులూ! వాళ్ళు జ్ఞానానికి, కరుణకీ, సహాయ ప్రవృత్తికీ, ధైర్య సాహసాలకు ప్రతిరూపాలు! అరవై నాలుగు కళలలోనూ ఆరితేరిన వారు. మనుస్మృతిని చక్కగా ఎఱిగిన వారు. [మనుస్మృతి ని ఆనాటి రాజ్యాంగం అనవచ్చు.]
అట్టి విక్రమాదిత్యుని నీవు దేవసభకు ఆహ్వానించి, రంభ ఊర్వశిల మధ్య గెలుపెవరిదో అతడి ద్వారా తెలుసుకో! అట్లు కానిచో, కల్పాంతమైననూ, రంభూర్వశూలలో ఎవరు గొప్పో తేల్చుటకు ఎవరికినీ సాధ్యము కాదు" అన్నాడు.

ఇది విని దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. ఆశ్చర్యపడ్డాడు కూడా! తనలో "ఓహో! భూలోకమున అంతటి గొప్ప వ్యక్తి గలడా? లేకున్న దేవముని, సర్వజన పూజితుడూ అయిన నారద మహర్షి ఎందుకిట్లు చెప్పును! అంతటి గొప్ప వ్యక్తిని చూచి తీరవలయును" అనుకొన్నాడు.

తన సారధియైన మాతలిని పిలిచి "ఓ మాతలీ! నీవు భూలోకమున గల ఉజ్జయినీ నగరానికి పోవలెను. ఆ నగరాధీశుడైన విక్రమాదిత్యుని దర్శించి, నా ఆహ్వానము తెలియ బరచి, అతడి నిక్కడికి తోడ్కొని రమ్ము" అని ఆజ్ఞాపించాడు.

అది విని మాతలి కొంత విభ్రాంతి పడినాడు. తనలో "ఏమిటీ విపరీతమూ? ఈ స్వర్గలోకమున దేవతలూ, సత్త్వగుణ పూరితులైన మహామునులూ ఉన్నారు. అట్టి స్వర్గలోకమునకు, నేను భూలోకమున గల రజోగుణ పూరితుడైన ఒక మహారాజును తీసుకొని రావలెనా? దేవేంద్రునకు మతిభ్రంశం కాలేదు కదా?" అని తలపోస్తూ, దేవేంద్రుని ఆజ్ఞకు ఉలకక పలకక నిలచుండినాడు. అట్లని తన అయిష్టతను వ్యక్తీకరించు ధైర్యము చేయలేకపోయాడు. తనలో తాను "నా అయిష్టతను దేవేంద్రునకు చెప్పినట్లయితే, అది తప్పుగా పరిణమించవచ్చు" అని సందేహిస్తూ, భూలోకము వైపుకు చూచుచూ మౌనంగా ఉండిపోయాడు.

బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షికి, మాతలి మధన అర్దమయ్యింది. ఆయన చిరునవ్వుతో "మాతలి! నీ సందేహము నాకు తెలుసు! అయితే నీవు ఉజ్జయినీ పురాధీశుడైన విక్రమాదిత్యుని గురించి సందేహించవలదు. అతడు దేవతలకు దీటైన వాడు. నీవు వెంటనే వెళ్ళి అతనిని పిలుచుకు రాగలవు" అన్నాడు.

~~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes