RSS
Wecome to my Blog, enjoy reading :)

సహస్రాయుష్మాన్ భవ ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 18]

ఆ విధముగా భట్టి పట్టు విడవకుండా ప్రార్దిస్తుండేసరికి, చివరికి కాళికాదేవి, భట్టిని మరింతగా పరీక్షింపనెంచి "మంచిది భట్టీ! నే చెప్పునది శ్రద్ధతో వినుము. నీ అన్నయైన విక్రమార్కుని శిరస్సును ఖండించి, నా ముందున్న బలిపీఠముపై బెట్టుము. అట్లయిన నీవడిగిన వరము నీయగలదానను" అన్నది.

భట్టి "సరి" యంటూ, విక్రమాదిత్యుని మందిరమునకు వెళ్ళాడు. ఆ అర్దరాత్రి సమయాన విక్రమాదిత్యుడు నిద్రించుచున్నాడు. భట్టి రాజు శయ్యను సమీపించాడు. ఆ శయన మందిరం, దేదీపమానముగా వెలుగుచున్న దీపాలతో పట్టపగలు వలె ఉన్నది.

భట్టి ఒర నుండి కత్తి తీసినాడు. దీపపు వెలుగులలో కత్తి అంచు పదునుగా మెరుస్తోంది. ఒక చేత కత్తిబట్టి, మరో చేత్తో విక్రమార్కుని తట్టి లేపాడు.

కళ్ళు తెరచిన విక్రమార్కుడు యెదుట భట్టిని చూచి "నా ప్రియమైన తమ్ముడా, భట్టి! ఇంత అర్దరాత్రి వేళ నీవిచ్చటికి వచ్చిన కారణమేమిటి?" అనినాడు.

భట్టి "ఓ రాజాధిరాజా! ఒక కార్యమునకై నాకు నీ తల అవసరపడినది. అందులకై అర్ధరాత్రి నీ మందిరమునకు వచ్చితిని" అన్నాడు. మరుక్షణం విక్రమార్కుడు "అటులైన తీసికో" అంటూ తిరిగి పరుండినాడు.

భట్టి విక్రమాదిత్యుని శిరస్సును ఖండించి, ఆ తలను చేత బట్టి, కాళికాలయమునకు వెళ్ళాడు.

ఖండించిన విక్రమాదిత్యుని శిరస్సును బలిపీఠం మీద ఉంచి, భట్టి భద్రకాళిని ప్రార్దించాడు. ఆ తల్లి ప్రత్యక్షమై, భట్టికి ఈ భూమిపై రెండు వేల యేళ్ళు బ్రతుకునట్లుగా వరమిచ్చింది.

తక్షణమే భట్టి విరగబడి నవ్వడం ప్రారంభించాడు. కాళికాదేవి, "భట్టీ! ఏల నవ్వుచున్నావు?" అని అడిగింది.

భట్టి వినయంగా "ఓ తల్లీ! మృఢానీ! రుద్రాణీ! దేవేంద్రుడు మా యన్న విక్రమాదిత్యునకు అమరావతిలో, నిండు కొలువులో, దేవతలు, మహర్షులు మహామహులందరి సమక్షంలో, వెయ్యేండ్లు రాజ్యమేలునట్లు వరమిచ్చినాడు. ఇది జరిగి నెల్లాళ్ళు కూడా కాలేదు. నెల లోపుననే, స్వయముగా నేనే, మా యన్న శిరమును ఖండించితిని. ఆయన మరణించినాడు. దేవేంద్రుడి వరమిట్లు తప్పిపోయినది. మరి నీవిచ్చిన వరమెట్లగునో? ఇది తలంచియే నవ్వితిని" అన్నాడు.

భట్టి బుద్ధి కుశలత కూ, సమయ స్ఫూర్తికీ, కాళికా దేవి ఎంతో సంతోషించింది. అతడి మేధస్సునూ, భక్తి వినయాలను, తన యందు నమ్మకమూ చూసి, ఆనందించింది. ఆ విధంగా భట్టి అమ్మవారి పరీక్షలో నెగ్గాడు.

ఆ తల్లి చిరునవ్వుతో "భట్టీ! నీవు తెలివైన వాడివి. నీ మేధస్సు, సాహసం, సమయస్ఫూర్తి... దేవతలలో సైతం కాన రాదు" అంది మెచ్చుకోలుగా.

భట్టి వినయంతో చేతులు జోడిస్తూ "తల్లీ! దేవతలతో నన్ను పోల్చరాదు. నేను మానవ మాత్రుడను" అన్నాడు.

కాళీమాత "భట్టీ! ఓ మంత్రీ! నా వరములను శంకింపకు. ఇంకా నీకేమైనా కోరికలుంటే అడుగు" అన్నది.

భట్టి "అమ్మా! విక్రమాదిత్యుని బ్రతికింపుము" అన్నాడు. ఆ తల్లి నవ్వుతూ, విక్రమాదిత్యుని బ్రతికించు ఉపాయం జెప్పి, అంతర్ధాన మయ్యింది.

భట్టి సంతోషానికి అవధులు లేకపోయాయి. విక్రమాదిత్యుని ఖండిత శిరస్సును తీసుకొని, రాజ మందిరానికి పోయి, దేహానికి తల చేర్చాడు. దేవీ సూక్తాన్ని జపిస్తూ, కోవెల నుండి తెచ్చిన మంత్రజలాన్ని చల్లాడు. మరు క్షణం విక్రమాదిత్యుడు నిద్ర నుండి మేల్కొన్నట్లుగా లేచి కూర్చున్నాడు.

"భట్టీ! ఏమయ్యింది?" అనడిగాడు. భట్టి జరిగిందంతా చెప్పాడు. అది విని విక్రమార్కుని కెంతో సంతోషం కలిగింది. అయితే భట్టి విచారంలో మునిగి పోయాడు. అతడికి తన పొరబాటు అర్ధమయ్యింది.

"అన్నా! విక్రమాదిత్యా! నీవు స్వర్గానికి పోయి, ఈ భూమిపై వెయ్యేళ్ళు రాజ్యమేలునట్లు వరమందినావు. నా గురించి మరిచినావు. అది నాకు విచారమును, పరితాపమును కలిగించినది. అందుచేత నేను కాళీ మాతను ప్రార్ధించాను. అయితే ఆ కినుకలో, నేను రెండు వేల యేళ్ళు బ్రతుకునట్లు వరమడిగాను. కానీ ఇప్పుడు నాకు వాస్తవం అర్ధమౌతుంది. నీ తోడు లేకుండా, మోడులా... నేనెలా బ్రతక గలను? అయ్యో! ఎంత తప్పు చేసాను?" అని చింతించాడు.

విక్రమాదిత్యుడు "తమ్ముడా భట్టి! అది నీ తప్పు కాదు. నిశ్చయంగా నా పొరబాటే! స్వర్గలోకమున నుండగా నీ గురించి మరిచినాను. కానీ నీ తోడు లేకుండా నేనూ బ్రతకలేను. అది నాకు సంతోషము కాదు. అందుకే, నీవు వచ్చి నా తల నడిగినప్పుడు సంతోషముగా ఇచ్చాను. ఇప్పుడు ఇద్దరమూ సంకటంలో పడ్డాము. ఎలా దీనిని పరిష్కరించగలం?" అన్నాడు సాలోచనగా.

[ఇది మానవ మనస్తత్త్వ రీత్యా కూడా యదార్ధమే! ఆగ్రహంగా ఉన్నప్పుడు మరేవీ గుర్తు రావు. అన్న తనని మర్చిపోయాడు అనే కోపంలో భట్టి ఒకటికి రెండువేల యేళ్ళు బ్రతికేటట్లు వరం కోరుకున్నాడు. అలాగే అత్యంత ఆనందంగా ఉన్నప్పుడు కూడా మరేవీ గుర్తుకు రావు. స్వర్గంలో ఉన్నప్పుడు విక్రమాదిత్యుడు, భట్టి గురించి మర్చిపోయాడు.]

ఇద్దరూ కాస్సేపు ఆలోచనలో మునిగి పోయారు. కొంత సమయం గడిచింది. ఒక్క క్షణం! భట్టి ముఖం సంతోషంతో వెలిగి పోయింది. "అన్నా!" అని అరిచాడు. విక్రమాదిత్యుడు చెప్పమన్నట్లుగా చూసాడు.

భట్టి "దేవేంద్రుడు మీకు వెయ్యేళ్ళు ఈ సింహాసనం మీద కూర్చొని రాజ్యమేలునట్లుగా వరమిచ్చాడు. కాబట్టి సంవత్సరంలో ఆరు మాసములు మీరు రాజ్య పాలన చేయండి. మిగిలిన ఆరు మాసములు ఈ భూమీ మీద గల వింతలూ విడ్డూరాలు చూస్తూ, దేశాటనం చేయండి. మీరు లేని ఆరునెలలు నేను రాజ్య పాలనాభారం వహిస్తాను. మనమిద్దరం కలిసి దేశాటనం చేయబోయినప్పుడు, మన మంత్రులు రాజ్య రక్షణ పర్యవేక్షిస్తారు. దీనికి మీరేమంటారు?" అన్నాడు.

పట్టరాని సంతోషంతో విక్రమార్కుడు, తన ప్రియమైన తమ్ముడు భట్టిని కౌగిలించుకున్నాడు.

ఆ రోజు నుండి భట్టి విక్రమాదిత్యులరువురూ కలసిమెలసి, రాజ్య పాలన మొదలు అన్నివిషయాలలోనూ చర్చించుకుంటూ, సహకరించుకుంటూ గడప సాగారు. ఒకరి నొకరు గౌరవించుకుంటూ, ఒకరి నొకరు ప్రేమించుకుంటూ....! వారి మధ్య ప్రేమాను బంధం, వారి రాజోచిత జీవితానికి.... బంగారానికి పరిమళం అద్దినట్లుగా శోభాయమానం అయ్యింది.

రాజ్యంలోని రైతుల, ఇతర వృత్తుల ప్రజల ఆదాయం నుండి 6 వ వంతను శిస్తుగా గ్రహిస్తూ... ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని, వారి సమస్యలు పరిష్కరిస్తూ, రాజ్యపాలన సాగించారు. ప్రతీ విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటూ, రాజ్యాన్ని, పరిపాలనని పర్యవేక్షించారు. రాజోద్యోగులందరూ వినయంతోనూ, సేవాభావంతోనూ.... అటు రాజు మంత్రులనీ, ఇటు ప్రజలనీ సేవించుకుంటున్నారు.

రాజ్యంలో పౌరులూ, పాలనాధికారులూ, అన్ని వృత్తుల వాళ్ళు ఒకరికొకరు సహకరించు కుంటూ, సదవ గాహనతో వ్యవహరిస్తున్నారు. పిల్లి ఎలుకలు కలిసి ఒకేచోట ఆడుకుంటున్నాయి. పులీ ఆవులు ఒకే ఒడ్డున నీరు త్రాగుతున్నాయి. నెలకు నాలుగు వానలు కురుస్తున్నాయి. పంటలు విరివిగా పండుతున్నాయి. వాతావరణ చల్లగా, పచ్చగా, ఆహ్లాదంగా ఉంది.

ఇంత వరకూ కథ చెప్పి, వినోద రంజిత ప్రతిమ, "ఓ భోజ రాజేంద్రా! విన్నావు కదా, విక్రమాదిత్యుని ధైర్యసాహసాల గురించీ, ధర్మ వర్తన గురుంచీ! ఈ ప్రపంచమున తమ్ముడి కోరిక తీర్చటానికై తన తలనిచ్చే వారెవ్వరైనా ఉన్నారా?

విక్రమాదిత్యుని సౌశీల్య గుణములలో నూరింట ఒక వంతైనా, నీవు కలిగి ఉన్న పక్షంలో, ఈ సింహాసన మధిరోహించే ప్రయత్నం చెయ్యి. లేదా... వచ్చిన దోవను బట్టి ఇంటికి బోవుట మేలు!" అని మౌనం వహించింది.

భోజరాజు, అతడి ప్రధాని బుద్దిసాగరుడు, ఇతర మంత్రులూ, సర్వసభికులూ... అప్పటి వరకూ అమిత ఆశ్చర్యంతో, వినోద రంజిత చెప్పిన కథను విన్నారు. తిరిగి చూస్తే ఏముంది? అప్పటికే సూర్యాస్తమయం అయిపోయింది. సభని మరునాటికి వాయిదా వేసి, అందరూ ఇళ్ళకి మరలారు.

భోజరాజు అంతఃపురాన్ని చేరి... ఆలోచిస్తూనే, స్నానపానాదులు ముగించి నిద్రకుపక్రమించాడు.

~~~~~~~~

2 కామెంట్‌లు:

Manikanth.P. చెప్పారు...

Bhatti vikramarkula anuraagam, aapyayatha, sodhara bhavam, okarikai okaru padu thapana entho spoorthi daayakam ! chaala bagundhi ... marunadu inko bomma cheppe kathakai vechi choosthoo ...

Regards,
Manikanth.P.

amma odi చెప్పారు...

రెండో బొమ్మ కథ చెప్పటం మొదలు పెట్టిందండి! ఇక మీదే ఆలస్యం. :)

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes