‘అనుభవమైతే గానీ తత్త్వం బోధ పడదంటారు’ పెద్దలు. అలాగే ‘తత్త్వం బోధపడితే గానీ సత్యం కళ్ళకు కనబడదు’. అందుకే పరిస్థితులు అర్ధం చేసుకోవాలంటే, దాని పూర్వాపరాలు ముందు తెలుసుకోవాలి. నిజానికి అవి పూర్వాపరాలు కాదు, పునాదులు.
అందుచేత ముందుగా ఆ పునాదుల గురించి చెబుతాను.
భారతీయులుగా మనం వేలసంవత్సరాల నుండి భగవద్గీతని నమ్ముతాం. భగవంతుడి శక్తిని, సత్యాన్ని నమ్ముతాం. కొన్ని నమ్మకాల పునాదుల మీద జీవన రమ్యహర్య్మాన్ని నిర్మించుకుంటాం. భారతీయుల రక్తంలో ఉంది ఈ నమ్మకాలతో కూడిన దృక్పధమే. అది చేటవంటిది. ప్రతిదానిలో చెడుని వదిలేసి మంచిని గ్రహించేటటువంటి బుద్ది. ఇలాంటి దృక్పధాన్ని, పురాణేతిహాసాలు, పండగలు, జీవన సరళి క్షణక్షణం సమాజానికి, వ్యక్తులకి నూరిపోసేవి.
కాబట్టే ఆ రోజుల్లో సర్వసంగ పరిత్యాగులు ఏంచెప్పినా ప్రజలు నమ్మేవాళ్ళు. అలాగే యోగులూ సామాజిక హితవు చెప్పేవాళ్ళు. ’సంసారమే త్యజించిన వారికి స్వార్ధం ఉండదు కదా! అందునా యోగి! ఇతడు మన హితవు కోరి చెబుతాడు. సత్యమే చెబుతాడు. మనం తిరగని ప్రాంతాలు ఇతడు తిరిగాడు. కాబట్టి మనకంటే ఇతడికి ఎక్కువ తెలుసు’ – ఇదీ యోగులని విశ్వసించటంలో ప్రజల దృక్పధం.
అయితే క్రమంగా ఆ స్థానాన్ని మీడియా ఆక్రమించాక, మంచి స్థానే చెడు ఎలా ఆక్రమించింది? ఆ మీడియా మరుగుపరచిన భారతీయ తత్త్వ చింతనని, తాత్త్విక మూలాలని, నమ్మకాల పునాదులని ఒకసారి పునః పరిశీలించాలి, జప్తికి తెచ్చుకోవాలి.
’చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు’, ’చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ!’ అంటారు పెద్దలు.
అంటే మనమేం చేస్తే ఆ ఫలితమే పొందుతామని దాని అర్ధం. మంచికి మంచి, చెడుకి చెడూ!
మనకున్న ప్రసిద్ధ పుణ్యకేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటి. ధూర్జటికవి పుణ్యమా అని శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తి మహాత్మ్యమూ అలా నిలిచి ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రం దగ్గర సువర్ణ ముఖి నది ప్రవహిస్తోంది. ఇప్పుడంటే నీళ్ళు లేక, ఇసుక పర్రలతో కన్పిస్తోంది గాని, ఒకప్పుడు నీటిగలగలలతో శ్రవణపేయంగా ఉండేది.
ఆ నదికి, ఆ గుడికి సంబంధించిన [విశేషం] కథ ఇది –
సర్పం, ఏనుగుల భక్తి పోరాటంతో ప్రసిద్దమైన ఈ ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు, వేలాదిగా శిల్పులూ, కూలీలు, ప్రజలు కూడా ఆ నిర్మాణ పనుల్లో పాలుపంచుకునేవారట.
సూర్యాస్తమయ వేళ, పనులు ముగించి, నదిలో కాళ్ళు చేతులూ కడుగుకొని, దోసిలిలో నీళ్ళు తీస్తే, ఆ దోసిట్లో తాము ఆ రోజు పడిన శ్రమకు తగిన కూలీ, బంగారు నాణాల రూపేణా దొరికేదట. ఎవరెంత పనిచేస్తే అంతగా! ఎక్కువపని చేసిన వారికి ఎక్కువ నాణాలు, తక్కువ పనిచేసిన వారికి తక్కువ నాణాలు. అందుకే ఆ నదికి ’సువర్ణముఖి’ అన్న పేరు వచ్చిందట.
పనిచెయ్యకుండా… చేసినట్లు నటిస్తే, లేదా మేస్త్రీ[పైఅధికారి]కి కాకా కొడితే పైఅధికారి డబ్బు ఇస్తాడేమో గానీ భగవంతుడివ్వడుగా![పైఅధికారి ఇచ్చింది కూడా వచ్చిన దారిలోనే పోవడం కద్దు. ఈ వైచిత్రి చూడగల కళ్ళుండాలి అంతే!] అంచేత ఈ పైరవీలన్నీ సువర్ణముఖి నది దగ్గర చెల్లేవి కాదన్నమాట.
ఈ కథ[విశేషం] చెబుతూ పెద్దలు “ఎవరు చూసినా చూడకపోయినా మనమేం చేస్తున్నామో భగవంతుడు చూస్తాడు. ఇవ్వాల్సిందే ఇస్తాడు. తస్మాత్ జాగ్రత్త!” అని చెప్పేవారు.
కాబట్టే మనం చేసిన మంచి, తరతరాలు మన పిల్లాపాపల్ని కాపాడుతుంది. చేసుకున్న చెడు భావితరాలని కూడా కట్టికుడుపుతుంది. అందుకే పాపభీతి, దైవభక్తి, పుణ్యప్రీతి ఉండాలి అనుకునేవాళ్ళు.
ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు – దీన్ని తమ జీవితాల్లోనూ, చుట్టూ అందరి జీవితాల్లోనూ పరిశీలించగలిగినా లేకపోయినా, ఇది సత్యం. సోదాహరణంగా కనబడినప్పుడయినా, దీన్ని నమ్మకతప్పదు.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
4 కామెంట్‌లు:
అవును ఈ కథ మా పెద్దవాళ్ళు/ఉపాధ్యాయులు చిన్నప్పుడు చెబుతూ ఉంటేవారు. ఇప్పుడు సువర్ణముఖిలో కేవలం వర్షాకాలంలో ఒక నెల లేదా రెండు నెలలు మాత్రమే సాగుతుంది. మిగతా కాలాల్లో అక్కడుండేది మురికి నీరు మాత్రమే....
Good One.
రవిచంద్ర గారు: మీరు చెప్పింది నిజమేనండి. ఆ నదిని చూసినప్పుడు, ఈ కథ గుర్తుకు వస్తూంది. అప్పుడు చాలా బాధగా అన్పిస్తుందండి. మీ వ్యాఖ్యకు నెనర్లు!
లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారు: నెనర్లండి!
ఆదిలక్ష్మి గారు,
బావుందండి.మీకు చాలా విషయాలు తెలుసులా ఉంది.సువర్ణముఖి నదికి ఆ పేరెలా వచ్చిందో అందంగా చెప్పారు.ఈ బ్లాగు నాకు బాగా నచ్చింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి