అనగా అనగా.....
ఛత్రపతి శివాజీ జీవితంలోని ఈ సంఘటన....
ఓ రోజు శివాజీ కొలువు తీరి ఉండగా, సభలోనికి ఓ అనుచరుడు ఓ అందమైన యువతిని వెంటబెట్టుకొని వచ్చాడు. అతడు వినయము, అతృతా నిండిన గొంతుతో “మహారాజా! ముస్లింల నివాస ప్రాంతంలో ఈ అందమైన ముస్లిం యువతిని పట్టుకున్నాను. ఈమెను మీకు కానుకగా ఇవ్వాలని తెచ్చాను” అన్నాడు.
ఆరోజుల్లో, ముస్లిం రాజ్యాల్లో, ఆ ముస్లిం రాజుల అనుచరులు అందమైన హిందూ యువతుల్ని నిర్భందించి తీసుకుపోవటం, ముస్లిం రాజులకీ, వారి రాజోద్యోగులకీ కానుకలుగా సమర్పించటం చేస్తుండేవాళ్ళు. బదులుగా రాజుల నుండీ, రాజోద్యోగుల నుండి ప్రయోజనాలు పొందుతుండేవాళ్ళు. [అంటే ప్రమోషన్లూ, అవార్డులూ, రివార్డులూ లేదా కేరీర్ లాంటివన్న మాట]ఒక్కోసారి వాళ్ళు ముస్లిం స్త్రీలనీ విడిచి పెట్టేవాళ్ళు కాదు. తమ స్వార్ధం, స్వసుఖవిషయంలో వాళ్ళకి మానవత్వం లేదు, మతం, కులం, పేదరికం, పాపం పుణ్యం – ఏవీ పట్టవు.
శివాజీ ముస్లిం రాజులకీ, ముస్లిం చక్రవర్తి ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు గనుక ఆయనకి ముస్లిం లంటే ద్వేషం ఉంటుందని ఆ అనుచరుడు అనుకొన్నాడు. ముస్లిం రాజులు హిందూ స్త్రీల మీద అత్యాచారాలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు గనుక ప్రతీకారంగా శివాజీ కూడా ముస్లిం స్త్రీలని అవమానిస్తాడు, అనుకొన్నాడు. అందుచేత అలాంటి చర్య తీసికున్నాడు. అలాంటి ముస్లిం యువతిని తెచ్చినందుకు తనను సత్కరిస్తాడని కూడా ఆశించాడు.
ఈ సంఘటనతో ఒక్కసారిగా సభమొత్తం నిశ్శబ్థం ఆవరించింది. సభికులంతా ఆశ్చర్యం తోనూ, ఉత్కంఠతోనూ చూస్తున్నారు. శివాజీ ఏమంటాడో నన్న కుతుహలం వాళ్ళందరిలోనూ ఉంది. ఆ ముస్లిం యువతి భయంతో వణుకుతోంది.
శివాజీ ఆమె వైపు తిరిగి “అమ్మా! భయపడకు!” అన్నాడు.
సభికుల వైపు తిరిగి “నిజంగానే ఈమె ఎంతో అందంగా ఉంది. ఈమె కడుపున నేను జన్మించి ఉంటే ఎంత అదృష్టవంతుడయ్యేవాడినో కదా! నా తల్లి కూడా ఈమెంతటి సౌందర్యవతి అయితే, నేను మరింత అందంగా ఉండి ఉండేవాడిని. ఈమె నా తల్లి జిజియా బాయి లాగే నాకు పూజ్యనీయురాలు” అన్నాడు.
చివరిగా తన అనుచరుడి వైపు చూచి “స్త్రీలని ఎలా గౌరవించాలో నేర్చుకో! పరస్త్రీలందరూ మనకు మాతృసమానులు. సగౌరవంగా ఈమెను, ఈమె ఇంట దిగవిడిచిరా!” అని ఆఙ్ఞాపించాడు.
శివాజీ ఆమెకు బహుమతులిచ్చి, రాచమర్యాదలతో ఆమెను స్వగృహానికి పంపించాడు. అదీ ఆయన నిబద్దత – ధర్మంపట్లా, నైతికత పట్లా, మానవతా విలువల పట్లా! వాస్తవానికి ధర్మం, నీతి, మానవీయ విలువలూ ఎప్పటికీ కులమత రాజకీయాలకూ, స్థలకాలమానాలకు అతీతమైనవి. వీటినే హిందూ ధర్మం చెప్తుంది. దానిని ఆచరించటమే నిజమైన హిందువు [మనిషి] చేయవలసినది.
ఇలాంటిదే మరో సంఘటన!
ఒకసారి శివాజీ మాతృశ్రీ జిజియాబాయి ఆయన్ని సింహఘడ్ ను గెలుచుకొని తనకు కానుకగా ఇమ్మని చెప్పింది. ఆయనీ కార్యాన్ని సాధించే పనిని తన అనుచరుడైన తానాజీకి అప్పగించాడు. తానాజీ శివాజీకి ఆప్తమిత్రుడు, అనుంగు అనుచరుడూ, మహా యోధుడు. ఈ వర్తమానం అందుకొనేటప్పటికి తానాజీ తన కుమారుడి వివాహానంతర విందు వినోద కార్యక్రమాల్లో ఉన్నాడు. అయితే వర్తమానం అందుకున్న మరుక్షణమే తానాజీ సింహఘడ్ మీదకి దాడికి సేనాసమేతుడై వెళ్ళాడు. తీవ్రపోరాటంతో సింహఘడ్ ని స్వాధీనం చేసుకొన్నాడు. అయితే ఆ పోరాటంలో తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు.
దుర్గాన్ని గెలుచుకొన్న తర్వాత, విజయచిహ్నంగా ఫిరంగి మ్రోగింపబడింది. ఫిరంగి శబ్థం విన్న శివాజీ సింహఘడ్ కి చేరుకొన్నాడు. కోట గుమ్మం దగ్గర శివాజీకి విజయ స్వాగతం ఇవ్వబడింది. కానీ శివాజీ మరుక్షణమే తానాజీ అక్కడ లేకపోవడాన్ని, ఆయన నిర్జీవ శరీరాన్ని గమనించాడు. ఇంతలో ఓ సైనికుడు సంతోషం, గర్వం నిండిన గొంతుతో “మహారాజా! మీరు సింహఘడ్ ని గెలుచుకొన్నారు” అన్నాడు. [బహుశః విజయవార్తని చెప్పినందుకు శివాజీ మహారాజు నుండి బహుమానాన్ని అతడు ఆశించి ఉండవచ్చు.]
శివాజీ అతడి వైపు వాడి చూపు చూసి, తీవ్రస్వరంతో “ఘడ్ తో ఆయా, లేకిన్ సింహ్ చలాయా!” అన్నాడు. [దుర్గం వచ్చింది కానీ సింహాన్ని కోల్పోయాను]
అదీ శివాజీ భావవాద దృక్పధం, ఆలోచనా సరళి! సింహఘడ్ దుర్గాన్ని గెలిచిన ఆనందం కన్నా, తన ప్రియమిత్రుడూ, మహా యోధుడు అయిన తానాజీ మరణంపట్ల దుఃఖమే ఆయన హృదయాన్ని తాకింది. ప్రతి విషయాన్ని, అనుభూతినీ రూపాయల్లోకి తర్జుమా చేసుకుంటున్న నేటి సమాజంలో ఈ ’భావం’ ఎందరికి అర్ధమౌతుందో భగవానుని కెఱుక.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
2 కామెంట్లు:
భాగుందండి.. నాకు మొదటి కధ తెలియదు. రెండవది తెలుసు.
ఆహా ఎంత హృద్యమైన కథనాలండీ, హిందూ మతం గురించి bad propaganda చేసే వాళ్ళు ఇలాంటి విషయాలు చదవాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి