అనగా అనగా.....
ఓ దేశరాజధాని నగరం. రాజుగారి పుట్టినరోజు ఉత్సవసభ జరుగుతోంది. సభా ప్రాంగణం ప్రజలతో క్రిక్కిరిసి ఉంది. రాజు గారిని పొగుడుతూ సైన్యాధికారి ఉపన్యాసించాడు. ప్రజలంతా ఆ’సొల్లు’విని గట్టిగా జేజేలు పలికారు. తర్వాత మంత్రి! ప్రజలీసారి మరింత గట్టిగా చప్పట్లూ కొట్టి, హర్షధ్యానాలు చేశారు.
తర్వాత రాజుగారు కృతఙ్ఞతలు చెబుతూ ఉపన్యసించారు. ఈ సారి ప్రజలంతా దిక్కులు పిక్కటిల్లేలా చప్పట్లు చరుస్తూ, జేజేలు పలుకుతూ రాజుగారి పట్ల తమ విధేయత చాటుకున్నారు. సభకు రాకపోతే, రాజుగారిని పొగడక పోతే ఎక్కడ రాజుగారికి కోపం వస్తుందోనన్న భయం, రాజుకు కోపం వస్తే తమకి నష్టం అన్న ఆతృతా వారిలో ఉంది.
ఆ సభలో ఓ మూల ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడు మౌనంగా ఉన్నాడు. చప్పట్లూ కొట్టలేదు, జేజేలు పలకలేదు. ప్రజలకి అతణ్ణి చూసి ఆశ్చర్యం వేసింది. గుసగుసలు పోయారు. విషయం రాజుగారి దాకా పోయింది. ఆయన గుర్రుమన్నాడు. విచారణ మొదలైంది. మంత్రి దర్పంగా, కాస్త కోపంగా “మేమంతా మన రాజు గారిని కీర్తిస్తుంటే నువ్వు మౌనంగా ఎందుకున్నావ్? నీకు రాజంటే భయం భక్తీ లేవా?” అన్నాడు.
చిరునవ్వు నవ్వాడు ఆ వ్యక్తి. చిర్రెత్తుకొచ్చింది అందరికీ.
"జవాబు చెప్పు?" హుంకరించాడు సైన్యాధికారి.
ఆవ్యక్తి ప్రశాంతంగా “అయ్యా! మీరంతా ఈ రాజుగారు సర్వాధికారి అని కదా ఆయన్ని పొగుడుతున్నారు! ఈ రాజుగారి పాలనలో జరుగుతున్న అన్యాయాలు మీకు తెలుసు. అయినా అవేవి మాట్లాడకుండా రాజుని పొగుడుతున్నారు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని మెచ్చుకోవాలని, రాజుగారి దయ మీమీద ఉండాలని, రాజు గారికి మీరు ప్రీతిపాత్రులు కావాలని!
అటువంటప్పుడు ఈ రాజు గారి కంటే కూడా గొప్పవాడు, సర్వాధికారి అయిన దేవుడి దయ నామీద ఉండాలనీ, దేవుడు నన్ను మెచ్చుకోవాలని, దేవుడికి నేను ప్రీతిపాత్రుణ్ణి కావాలని అనుకుంటే తప్పేమిటి?" అన్నాడు.
సభలో ఒక్కసారిగా నిశ్శబ్ధం!
రాజుకి ఙ్ఞానోదయమైంది. ప్రజలకీ ’సత్యం’ గోచరమైంది.
రాజు ఆవ్యక్తికి క్షమాపణా, కృతఙ్ఞతలూ చెప్పుకొని, తర్వాత నుండీ తన కర్తవ్యం అయిన ’ప్రజా శ్రేయస్సు’కోసం పాటు పడ్డాడు.
ఇదీ కథ!
మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.
ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి