అనగా అనగా.....
మహా భారతంలో, పాండవులు ఉద్యోగపర్వానంతరం ఉపప్లావ్యంలో నివసిస్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్దం అందరికీ వూహాతీతం కాదు. కురుపాండువులిద్దరూ పరస్పరం రాయబారాలు నడుపుతూనే మరోవైపు యుద్దసన్నద్దులై, సైన్యసమీకరణాలు చేస్తున్నారు.
సైన్యసమీకరణల సందర్భంలో ఒకరోజు ధర్మరాజు, అర్జునుణ్ణి శ్రీకృష్ణుని సహాయాన్ని అర్ధించడానికి పంపించాడు. అర్జునుడు ద్వారక చేరే సమయానికి, అదేపనిమీద దుర్యోధనుడు, అర్జునుడి కంటే ముందుగానే వచ్చి ఉన్నాడు.
దుర్యోధనుడు అర్జునుడి కంటే ముందుగానే కృష్ణమందిరం చేరాడు. ఆ సమయానికి కృష్ణుడు నిద్రిస్తున్నాడు లేదా నిద్ర నటిస్తున్నాడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుని తలవైపుగల ఆసనంలో కూర్చోన్నాడు, కాళ్ళవైపు ఆసనంలో కూర్చోవడంలో అవమానమని తలిచాడు. [అందులో తప్పేమి లేదనీ, అది అతడి ఇచ్చనీ అనుకోవచ్చు] కాస్సేపటికీ అక్కడికీ ప్రవేశించిన అర్జునుడు శ్రీకృష్ణుని పాదాల చెంత నిలిచి వేచిచూడసాగాడు. [అర్జునుడికి కృష్ణునిపట్ల భక్తి, గౌరవం, గురుభావనా ఉన్నాయి గనుక ఇది ఇతడి ఇచ్ఛ.]
కొద్దీక్షణాల తర్వాత శ్రీకృష్ణుడు లేచి ఇద్దరినీ కుశలమడిగాడు. తర్వాత ఏపని మీద వచ్చారో కనుక్కున్నాడు. ఇద్దరూ ‘రానున్న యుద్దంలో సహాయార్ధం వచ్చాం’ అన్నారు.
దుర్యోధనుడు:
"కృష్ణా, ముందుగా నేను వచ్చాను. కనుక ముందుగా నాకు సహాయం చేయటం న్యాయం” అన్నాడు.
శ్రీకృష్ణుడు:
ముందుగా వచ్చావు నీవు. కాని నేను ముందుముందుగా అర్జునుని చూశాను. మీరిద్దరూ నాకు బంధువులే. నా సహాయం మీ ఇద్దరికీ చెందాలి. నా సైన్యంలో 10,000 మంది నాకు సమానులైన వారు, నారాయణాంశగల యోధులున్నారు. వారొకవైపు. నేనొకవైపు. వారు యుద్ధం చేస్తారు. నేను యుద్ధం చేయను. యుద్ధంలో కావలసిన సలహాలు, మాట సహాయం చేస్తాను. ఇక మీకు ఏవికావాలో కోరుకొండి. కానీ అర్జునునికి ముందుగా కోరుకునే అవకాశం ఇస్తాను. ఏమందువు అర్జునా?
దుర్యోధనుడు:
కృష్ణా! నీయవచ్ఛక్తీనీ వినియోగించి, ఇందు అర్జునునకు భాగము కల్పించుటయే గాక కోరుకొనుటలోను అతడికీ ముందరవకాశ మొసంగి, బావా నీయభిప్రాయమేమి అని అడుగుచున్నావు. అహ! ఇంతకన్న ఎవరి అభిప్రాయమెట్లుండెడిది బావా?
శ్రీకృష్ణుడు:
బావా దుర్యోధనా! నీవు స్వతంత్రుడవు. అర్జునుడు సేవకుడు. అన్న ఆఙ్ఞలకు బద్దుడై చరిచెడి వాడు. అందుకే అలా వేరుగా అడగవలసి వచ్చింది.
దుర్యోధనుడు: [స్వగతంలో] కృష్ణుడెంత మోసము చేస్తున్నాడు? ఆయుధం పట్టడట, యుద్ధం చేయడట. ఊరికే సాయం చేస్తాడట. తన సైన్యాన్నంతా ఒకవైపు పెట్టి, తాను ఒక వైపు నిలుచున్నాడు. కంచిగరుడ సేవ లాంటి ఇతడితో ఏమీ ఉపయోగం? అర్జునుడు మాత్రం కృష్ణుణ్ణి ఎందుకు కోరుకుంటాడు? సైన్యాన్నే కోరుకుంటాడు.
కానీ అర్జునుడు కృష్ణుణ్ణే కోరుకుంటాడు. దుర్యోధనుడు “కృష్ణుని కపటోపాయము మనకే కలిసివచ్చింది” అనుకుంటూ సంతోషంగా సైన్యాన్ని తీసికొని, అర్జునునిపై జాలిపడి మరీ వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణుడు అర్జునుణ్ణి అడుగుతాడు, "ఆయుధపాణులైన యోధుల్ని వదిలి, ఒట్టిగోపాలుణ్ణి, నన్ను కోరుకున్నావు, బాలుడవువైతి వక్కటా” అంటాడు.
అర్జునుడు “కృష్ణా! నాకు యోధులు, ఆయుధాలు, నీ యుద్ధకౌశలం అక్కరలేదు. నీవు నా అండనుండుటయే చాలు. నేనే అన్నిటినీ గెలవగలను” అంటాడు.
ఆవిధంగా అర్జునుడు భావవాది గనుక, పదార్ధాన్ని గాక విల్ పవర్ నీ, తన ఆత్మబలాన్ని, సంకల్పబలాన్ని నమ్మాడు, లక్ష్యాన్ని ఛేదించాడు. ‘యతో ధర్మతతో జయః’ అన్నట్లు పాండవులు కురుక్షేత్రంలో గెలుపొందారు కదా!
ఇదీ కథ!
మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.
ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి