విక్రమార్కుడు మళ్ళీ భేతాళుణ్ణి బంధించాడు. భేతాళుడు మళ్ళీ మరో కథ ప్రారంభించాడు.
ఒకప్పుడు ‘అవినాశి’ అనే నగరం ఉండేది. (వినాశం లేనిది అని ఆ పేరుకి అర్ధం.) ఆ నగరంలో దేవనాధుడు అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడి కొక కుమారుడు, అర్జున స్వామి. అతడు రూపవంతుడూ, గుణవంతుడు. అతడికి యుక్త వయస్సు వచ్చాక తండ్రి దేవనాధుడు, ఎన్నో ఊళ్ళు వెదికి తగిన కన్యని తెచ్చి వివాహం చేసాడు.
ఆ పిల్ల పేరు అనామతి. ఆమె అర్జునస్వామికి రూపంలోనూ, గుణంలోనూ తగిన భార్య. తీయని మాటలూ, చక్కని చేతలూ గలది. యువ దంపతులని చూసిన ఎవరైనా… వారు ఒకరి కొకరు తగి ఉన్నారనే వారు. గువ్వల జంట వంటి ఆ యువజంట, ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళు. క్షణమైనా ఒకరినొకరు ఎడబాయక ఉండేవాళ్ళు.
వారి తీరుని చూసి అందరూ ముచ్చట పడే వాళ్ళు.
ఇలా ఉండగా…ఓ నాటి రాత్రి…
చల్లగాలి వీస్తొందని భార్యభర్తలిద్దరూ, పెరట్లో మల్లెపందిరి ప్రక్కనే మంచం వేసుకు పడుకున్నారు. అది వెన్నెల రాత్రి! అర్జునస్వామి, అనామతి ఆరుబయట ఆదమరిచి నిదురిస్తున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఓ రాక్షసుడు వెళ్తోన్నాడు. అతడు భీకరంగా ఉన్నాడు. అతడి చూపులు అంతకంటే కౄరంగా ఉన్నాయి.
దిగువకి చూసిన రాక్షసుడి కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి. అతడికి అనామతి అద్భుతంగా అనిపించింది. ఆమె అందానికి అదిరిపోయాడు. అమాంతం క్రిందికి దిగి, ఆమెని ఎగరేసుకు పోయాడు. రాక్షస మాయ కారణంగా అనామతికి గానీ, అర్జునస్వామి గానీ నిద్రాభంగం కాలేదు.
తెల్లవారింది. అందరి కంటే ముందే లేచి గృహకృత్యాలలో నిమగ్నమయ్యే అనామతి ఏది? నిద్రలేచిన అర్జునస్వామికి భార్య ఎక్కడా కనబడలేదు. కుటుంబ సభ్యులంతా కూడా వెతికినా అనామతి జాడలేదు. ఎవరికీ ఏమీ తోచలేదు.
కీడెంచి మేలెంచమని, ఊళ్ళోని చెరువులూ నూతులూ కూడా గాలించారు. బంధుమిత్రులందరినీ వాకబు చేసారు. ఆమె ఆచూకీ తెలియ లేదు. అర్జునస్వామికి దుఃఖం కట్టలు దాటింది. అతడు ఎలాగైనా భార్య జాడ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో దేశాటనం బయలు దేరాడు.
అనామతి గురించి వెతుకుతూ ఎన్నో ప్రదేశాలు, ఊళ్ళూ, అడవులూ గాలించాడు. ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. నిరాశా నిస్పృహలతో, స్వంత ఊరు అవినాశికి తిరుగు ప్రయాణమయ్యాడు. లోలోపల మిణుకు మిణుకు మంటూ ఓ చిరు ఆశ… ‘ఒక వేళ ఈ పాటికి అనామతి ఇల్లు చేరిందేమోనని’.
తిరుగు ప్రయాణంలో, అలసటతోనూ, ఆకలి తోనూ ఉన్నాడు. అప్పటికి ఓ గ్రామం చేరాడు. ఓ బ్రాహ్మణ గృహం ఎంచుకొని ‘భోజనం పెట్ట’మని అడిగాడు. గృహస్థు భార్యని పిలిచి “అతిధికి భోజనం పెట్టు” అని చెప్పాడు.
ఆ గృహిణి అతడికి భోజనం వడ్డించే ప్రయత్నం చెయ్యబోగా…అర్జున స్వామి “అమ్మా! స్నాన సంధ్యలు ముగించుకొని ఆరగిస్తాను. భోజనం కట్టి ఇవ్వు” అని అర్ధించాడు.
గృహిణి ఒక చిన్న వెదురు బుట్టలో అరిటాకు వేసి, అందులో అన్నం పప్పూ కూరలూ సర్ధింది. ఓ చిన్న పిడతలో పెరుగు, ప్రక్కనే పండూ తాంబూలం ఉంచింది. భక్తిగా అతిధికి సమర్పించింది.
అర్జునస్వామి వారిని “అన్నదాతా! సుఖీభవ!” అంటూ ఆశీర్వదించి, తిన్నగా చెరువు గట్టుకు వెళ్ళాడు. చెరువులో నీళ్ళు నిర్మలంగా ఉన్నాయి. చెరువు ఒడ్డున పెద్ద మర్రి చెట్టుంది. దాని నీడ చల్లగా హాయిగా ఉంది. అర్జునస్వామి, భోజనం ఉన్న బుట్టని ఆ చెట్టు క్రింద ఉంచి, చెరువులో స్నానం, సంధ్యా వందనం పూర్తి చేసుకున్నాడు.
చెట్టు క్రింద కూర్చొని ఆవురావురుమంటూ అన్నం తినసాగాడు.
ఆ సమయంలో… మర్రి చెట్టు కొమ్మపైకి ఓ గ్రద్ద వచ్చి వాలింది. దాని గోళ్ళల్లో ఓ కాలనాగు గిలగిల్లాడుతుంది. చెట్టు కొమ్మపైన కూర్చున్న గ్రద్ద, ఆ పాముని ముక్కుతో పొడుచుకొని తినసాగింది.
మరణ యాతనకి పాము విలవిల్లాడుతూ విషం కక్కసాగింది. ఆ విషం తిన్నగా అర్జునస్వామి అన్నం తింటున్నా అరిటాకుపై సన్నని తుంపరగా పడసాగింది. ఎంత సన్నని బిందువులంటే…ఆరగిస్తున్న అర్జునస్వామికి సైతం దృష్టికి ఆననంత! అసలే ఆకలిగా ఉన్న అర్జునస్వామి, అన్నం పప్పూ కూరలతో స్వాదిష్టంగా ఉన్న భోజనాన్ని ఇష్టంగా ఆరగిస్తున్నాడు. అయితే కాస్సేపటికి, విషాహారం కారణంగా అతడు మృతి చెందాడు.
ఇదీ కథ!
అంటూ కథ ముగించిన భేతాళుడు…“విక్రమార్క మహీపాలా! ఈ బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చెందుతుంది? ఆహారాన్నిచ్చిన బ్రాహ్మణ దంపతులకా? పాముని చంపితిన్న గ్రద్దకా? విషం గక్కిన పాముకా? విషాహారాన్ని తిని మరణించిన అర్జునస్వామికా?” అనడిగాడు.
[త్వరపడి ఈ ప్రశ్నకు జవాబు చెప్పకండి. విక్రమాదిత్యుడి తర్కం చదివాక, అప్పుడు చెప్పండి.
భారతీయుల నమ్మకాల్లో…బ్రాహ్మణ హత్య (అంటే సత్వగుణ సంపన్నుడి హత్య) మహా పాపమనీ! దాన్ని బ్రహ్మహత్యాపాతకం అంటారు. అలాగే గోహత్య, స్త్రీ హత్య, శిశుహత్యలను కూడా పరమ పాపాలని నమ్మేవాళ్ళు. ఆ కోవలోకే చెందుతుంది ఆత్మహత్య కూడా! ఇప్పుడు నమ్మకాలూ బాగానే సడలి పోయాయి, దృక్పధాలూ మారిపోయాయి. ఎంత పాపానికైనా వెనుతీయని సమాజాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.]
విక్రమాదిత్యుడు స్ఫుటంగా “భేతాళా! ఇందులో ఎవరి తప్పూ లేదు. ఆకలిగొన్న అతిధిని సత్కరించటం గృహస్థు ధర్మంగా భావించి, బ్రాహ్మణ దంపతులు, అర్జునస్వామికి ఆహారం సమర్పించాడు. స్నాన సంధ్యలు ముగించి భోజనం చెయ్యడం సదాచారమని భావించి, అర్జునస్వామి చెరువుకు చేరాడు. చెట్టు నీడన కూర్చొని భోజనం చేసాడు.
గ్రద్ద తన ఆహారాన్ని తాను వేటాడి తెచ్చుకుంది. చెట్టు కొమ్మపై కూర్చొంది. మరణ యాతనకి పాము విషం గ్రక్కింది. పాములు గ్రద్దలకి దేవుడిచ్చిన ఆహారం. మరణ సమయాన విషం గ్రక్కడం పాము ప్రారబ్దం. అందుచేత వాటి దోషమూ లేదు.
అందుచేత వీరెవ్వరికీ బ్రహ్మహత్యా దోషం అంటదు. అయితే… ఎవరీ కథ విని, పూర్వాపరాలూ, ధర్మసూక్ష్మాలూ ఆలోచించకుండా… ‘ఫలానా వారికి బ్రహ్మహత్యా దోషం అంటుతుంది’ అంటారో, వారికి, ఈ బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది” అన్నాడు.
విక్రమార్కుడి విజ్ఞతకి భేతాళుడికి చెప్పలేనంత ఆనందం కలిగింది. చప్పట్లు చరుస్తూ తన ఆనందాన్నీ, అభినందననీ తెలిపాడు. అయితే మౌనభంగమైనందున మరుక్షణం మాయమై మోదుగ చెట్టు పైన మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు.
అది తెలుసు కాబట్టి విక్రమార్కుడూ వెనుదిరిగి మోదుగ చెట్టు వైపు అడుగులేసాడు.
కథా విశ్లేషణ:
బ్రహ్మహత్యా పాతకం వంటిది – ‘విషయం గూర్చి పూర్వాపరాలూ, మంచి చెడుగులూ తెలియకుండా మాట్లాడిన వారికి అంటుకుంటుంది’ అని చెప్పే ఈ కథ…శ్రోతలని అప్రమత్తుల్ని చేస్తుంది.
ఎన్నోసార్లు… ఎంతోమంది… తీరి కూర్చొని, అరుగుల మీదా, రచ్చబండలమీదా… తెగ తర్కాలు చేసేస్తుంటారు. ‘ఫలానా వాళ్ళ వ్యవహారంలో ఫలానా వాళ్ళది తప్పు’ ‘ఇది ఇలా చెప్పకూడదు’ ‘అలా చెయ్యాలి’… గట్రా తీర్పులు చెప్పేస్తుంటారు. తెలిసీ తెలియక, ఏదో మాట్లాడేస్తే, మనకే ప్రమాదం, మన విజ్ఞతే దెబ్బతింటుంది అనే హెచ్చరిక ఈ కథలో ఉంటుంది.
అందుకే…ఈ కథ చెప్పేటప్పుడు నేనెప్పుడూ “త్వరపడి బ్రహ్మహత్యా పాతకం ఫలానా వారికి చుట్టుకుంటుంది అని జవాబు చెప్పకండి. విక్రమాదిత్యుడి సమాధానం విన్నాక, అప్పుడు చెప్పండి” అని ముందుగానే చెప్పేస్తుంటాను. నోటి మాటని విజ్ఞతతో ఉపయోగించాలని చెప్పే ఈ కథ, ఎంతో విలువైనది!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
5 కామెంట్‌లు:
మీ భట్టి విక్రమార్క కధలంటే నాకు చాలా ఇష్టమండీ. రోజూ ఈ బ్లాగ్ చూస్తూంటాను కధ కోసం. చాలా రోజుల తరువాత ఇవాళ పోస్టు చేసారు :-)
ప్రసూన గారు: ఏం చెయ్యనండి. కనీసం ప్రతి మూడు రోజులకు ఒక కథన్నా పెడదామనుకుంటాను. ఈ సారి మరీ 15 రోజులై పోయింది. ఇక నుండి వెంట వెంటనే పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. :)
అమ్మ ఒడి గారు
చాలా బాగుంది.. నాకెప్పుడూ ఈ ప్రశ్న ఉండేది... చాలా మంది ఇంటి అరుగుల మీదనో, చెట్ల కిందనో కూచుని ధర్మ సలహాలు, న్యాయ నిర్ణయాలు చేస్తుంటారు.. అప్పుడప్పుడు వాటిలో తప్పు కనిపించి ఇదెలా కరెక్ట్ అని అనుకునేవాడిని .. పూర్తి అవగాహన లేకపోవటం వల్ల మధ్యలో కలుగ చేస్కోలేక పోయేవాడిని... ఆ తప్పుడు నిర్ణయాలు చెప్పిన వాళ్ళకీ పాపం అంటుతుంది.. తెలిసీ చెప్పని నా లాంటి వాల్ల కీ చుట్టుకుంటుంది.. ఈ కథ చదువుతుంటే ఎంతో ఆనందం కలిగిందండి..
ఈ పాప పుణ్యాల అలర్ట్ మనుష్యుల మదిలో నిలబడేలా చేయగలిగితే భూలోకం స్వర్గం అవుతుంది కదండి.
తెలిసీ తెలియక కానీ, తెలిసి కానీ, తెలియక కానీ.. స్వార్థ ఆలోచనలని చేసే వారిని పాప భీతి తప్పక ఆపుతుంది
అది ముందు పాప భీతి అయినా తర్వాత నిజాయితీ గా పరిణమిస్తుంది అనుకుంటాను..
Thank you for writing this chandamama story. write anouther 5 storys like this.
I super duper love it.
my father will send you another vedio.
From Kalyani to Lakshmi Aunty
కిరణ్ గారు: చాలా మంచి వ్యాఖ్య వ్రాసారు. కృతజ్ఞతలండి.
కళ్యాణి : బుడ్డీ! వీలైనంత మేరకూ కథలు వ్రాస్తాన్రా! గీతక్క {ఆహా!ఓహో!} బ్లాగులో కూడా కథలుంటాయి. అక్కడ కూడా కథలు చదువుకోవచ్చు. శుభాశీస్సులు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి