RSS
Wecome to my Blog, enjoy reading :)

దొంగల నాయకుడు చచ్చేముందు ఎందుకు నవ్వి, ఏడ్చాడు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 50]

కళ్ళెదుట దొంగల నాయకుడి మరణాన్ని చూసిన రత్నావళి విహ్వలచిత్త అయ్యింది. అప్పటి కప్పుడు ఆ శశ్మాన వాటికలో చితి పేర్చుకుంది. దొంగల నాయకుడి తలను చేతబట్టి, చితి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. మండుతున్న అగ్నికీలలకి నమస్కరించి నిప్పుల్లోకి దూకింది.

ఆకాశం నుండి, జరుగుతున్నదంతా గమనిస్తున్నారు జగదాంబ, పరమేశ్వరులు. మాత పార్వతికి రత్నావళిని చూసి జాలి కలిగింది. పతి వంక సాభిప్రాయంగా చూసిందామె. అనుమతిస్తున్నట్లుగా నవ్వాడు జంగమ దేవర. మరుక్షణం పార్వతీ పరమేశ్వరులు, రత్నావళి ముందు ప్రత్యక్షమయ్యారు.

అంతే! నిప్పుల గుండం పూల రాశిలా మారి పోయింది.

పార్వతీదేవి “అమ్మాయీ! అంత సాహసం చేయకు. ఏం కావాలో కోరుకో!” అంది ప్రేమగా! ఆది దంపతులని చూసి రత్నావళి పరవశించి పోయింది. సంతోషాంతరంగంతో చేతులెత్తి నమస్కరిస్తూ, వారిని స్తుతించింది. “తండ్రీ గిరిశా! తల్లీ గిరిజా దేవి! మీరు జగత్తుకే తల్లిదండ్రులు. నామీద మీకు కరుణ ఉంటే నా మనోనాయకుడయిన ఈ దొంగల నాయకుడిని సజీవుణ్ణి చెయ్యండి. అతణ్ణి నేను పతిగా వరించాను. నామీద దయ యుంచి, నాకు పతి భిక్ష పెట్టండి. ఇది తప్ప నాకు మరో కోరిక లేదు” అని ప్రార్ధించింది.

శివపార్వతులు రత్నావళి పట్టుదలనీ, నిజాయితీ గల ప్రేమనీ చూసి ముచ్చట పడ్డారు. ‘తధాస్తు’ అన్నారు. వారిచ్చిన వర ప్రభావంతో, చచ్చిపడి ఉన్న దొంగల నాయకుడు పునర్జీవితుడైనాడు. నిద్ర నుండి లేచినట్లుగా కసిగంద కుండా ఉన్నాడు. వారిద్దరినీ ఆశీర్వదించి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యారు.

వీరకేశుడు, అతడి భార్యా, ఇదంతా చూసి ఆనందంతో తబ్బిబ్బయ్యారు. తల నరకబడిన దొంగ పునర్జీవితుడు కావటం చూసి, ప్రజలు ఆశ్చర్యం పట్టలేక పోయారు. అందరూ రత్నావళినీ, ఆమె ప్రేమ బలాన్నీ ఎంతగానో ప్రశంసించారు.

వీరకేశుడు, కూతురూ అల్లుడిని ఇంటికి తీసికెళ్ళి, బంధుమిత్రులందరినీ ఆహ్వానించి, రత్నావళిని దొంగల నాయకుడికిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

ఈ సమాచారమంతా వేగుల ద్వారా విన్న రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. రత్నావళి పట్టుదలనీ, నిజమైన ప్రేమనీ చూసి వెరగు పడ్డాడు. ఆమె స్వచ్ఛమైన ప్రేమ, భక్తి తలచి, పార్వతీ పరమేశ్వరులనే మెప్పించిన ఆమె పట్టుదలని చూసీ, వారిని గౌరవించటం తన విధి అనుకున్నాడు.

వీరకేశుణ్ణి దొంగల నాయకుణ్ణి సభకు పిలిపించి ఆదరించాడు. దొంగల నాయకుణ్ణి తన సైన్యానికి అధిపతిగా నియమించి సత్కరించాడు. దొంగల నాయకుడు కూడా, జరిగిందంతా చూసి చాలా మధనపడ్డాడు. ప్రేమ, పట్టుదల, భక్తి, మంచి చెడు... వంటి మానవీయ విలువలు అర్ధం చేసుకుని, అంకిత భావంతో పని చేయాలని నిశ్చయించుకున్నాడు. కొన్నాళ్ళకే ఎంతో సమర్ధుడైన, ధైర్యశాలి అయిన సైన్యాధిపతిగా ప్రజలందరి మన్ననా పొందాడు.

ఇదీ కథ!

భేతాళుడు ఈ కథ చెప్పి “ఓ విక్రమాదిత్య మహీపాలా! విన్నావు కదా కథ!? ఇప్పుడు చెప్పు. భటులతడి మరణ శిక్ష అమలు చేయబోయే ముందు, దొంగల నాయకుడు ముందు క్షణం నవ్వాడు. ఆ తర్వాత ఏడ్చాడు? ఎందుకలా చేసాడో చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు మృదుగంభీర స్వరంతో “భేతాళా! దొంగల నాయకుడు రత్నావళిని చూసి నవ్వాడు. తన గురించి ఏమీ తెలియకుండా, దొంగనని తెలిసీ, ఇంతటి సౌందర్యవతి తనని ప్రేమించి ఏడ్చుట చూసి అతనికి నవ్వు వచ్చింది. ఆమె తల్లిదండ్రుల దుఃఖం చూసి మనస్సు కరిగింది. అందుకోసమే మొదట నవ్వి పిదప ఏడ్చాడు” అన్నాడు.

భేతాళుడు గలగల నవ్వుతూ “మౌనభంగమైంది మహారాజా! అందుకో నా పరుగు” అంటూ మాయమై మోదుగ చెట్టెక్కాడు.

కథా విశ్లేషణ: ‘కట్టె కొట్టె తెచ్చె’ అన్నట్లుగా, ఈ కథని క్లుప్తంగా చెప్పేస్తే చాలా సామాన్యమైన కథ. రాజు దొంగని బంధించాడు, వ్యాపారి కూతురు ప్రేమించింది, దేవిని మెప్పించి బ్రతికించుకుంది – ఇలా! కానీ కథనంలో ‘పోతురాజు’ అంటూ... రాజూ దొంగల మధ్య సంభాషణ, వీరకేశుడూ రత్నావళిల మధ్య సంభాషణ, వీరకేశుడూ రాజుల మధ్య సంభాషణ... ఎంతో చక్కగా ఆసక్తికరంగా ఉంటాయి.

ఇలాంటి కథలు... కథనం ఎంతో ఆసక్తికరంగా ఉండి, చక్కని సంభాషణా శైలిని పిల్లలకు నేర్పుతాయి. ఎంతో కాలం, డబ్బూ వెచ్చించి నేర్చుకునే ‘కమ్యూనికేషన్ స్కిల్స్’ని అలవోకగా నేర్పే కథలివి.

మన పెద్దలు మనకందించిన వరాల మూటలివి.

~~~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes