RSS
Wecome to my Blog, enjoy reading :)

ఎవరు గొప్ప నిపుణులు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 26]

విక్రమాదిత్యుడు మోదుగ చెట్టు చేరి, పైకెక్కి శవాన్ని దించి భుజాన వేసుకుని, మౌనంగా బృహదారణ్యం కేసి నడవసాగాడు.

భేతాళుడు, ప్రతాపవంతుడైన విక్రమాదిత్యుణ్ణి చూసి "ఓ రాజా! విక్రమాదిత్యా! నీకు మరో కథ చెబుతాను. మౌనంగా విను" అని ఇలా చెప్పసాగాడు.

ఒకానొకప్పుడు అంగనం అనే పట్టణ మొకటి ఉండేది. అక్కడ ఆది విష్ణువనే బ్రాహ్మణుడుండేవాడు. అతడికి ముగ్గురు కుమారులు. వాళ్ళు అన్ని విద్యలతో పాటు కొన్ని ప్రత్యేక కళలూ, నైపుణ్యాలూ నేర్చారు.

ముగ్గురు యువకులూ ఆ నగరాధిపతి యోగదాసుడి కొలువులో చేరదలిచి రాజాస్థానానికి వెళ్ళారు. తమని తాము రాజుకు పరిచయం చేసుకున్నారు. రాజు వాళ్ళని "మీ విశిష్టతలేమిటి?" అని అడిగాడు.

అందరిలోకి పెద్దవాడు "మహారాజా! నేను తిండి సుఖమెరుగుదును. నేను తిన్న వాటి నాణ్యాతానాణ్యతలను వివరించగలను" అన్నాడు.

మధ్యవాడు "మహాప్రభు! నేను స్త్రీ సుఖమెరుగుదును. నాతో గడిపిన స్త్రీ బాగోగులని విశ్లేషించగలను" అన్నాడు.

చివరివాడు "రాజ రాజా! నేను నిద్రాసుఖమెరుగుదును. తల్పముల లోటుపాట్లని తెలియజేయగలను" అన్నాడు.

రాజుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. వారి కౌశలాన్ని పరీక్షించాలన్న కుతూహలం కలిగింది. తన ఆస్థాన పురోహితుణ్ణి పిలిచి, మొదటి వాడికి రకరకాల పిండి వంటలతో షడ్రసోపేతమైన భోజనం పెట్టమన్నాడు.

అతడు భుజించి వచ్చాక, రాజు అతడితో "ఓ యువకుడా! ఇప్పుడు నీవారగించిన భోజనం యొక్క విశేషమేమిటి?" అని అడిగాడు. దాని కతడు "మహారాజా! నవకాయ పిండి వంటలతో, రుచి శుచి గల ఆహారాన్ని వడ్డించారు. అయితే నేను ఆరగించిన శాల్యోదనం (వరి అన్నం) మాత్రం, శ్మశానపు మట్టి రంగు, రుచీ, వాసనా కలిగి ఉంది" అన్నాడు.

రాజు విచారించగా, ఆ బియ్యం పండిన పొలానికి ఎరువు, శ్మశాన భూమి నుండి పంపబడిందని తేలింది. రాజుకి అతడి ప్రతిభని చూసి ఆశ్చర్యం కలిగింది.

రాజు, తన ఆస్థాన నాట్యశాలలో నాట్యకత్తె, అద్భుతమైన అందగత్తె అయిన వేశ్య నొకామెని పిలిచి, ఆ రాత్రికి ముగ్గురు సోదరులలో మధ్యవాణ్ణి ఆదరించమని ఆజ్ఞాపించాడు.

మరునాటి ఉదయం రాజు మధ్యవాడితో "ఓ యువకుడా! రాత్రి నీవు మా ఆస్థాన నర్తకీమణులలో ఒకామెతో గడిపినావు కదా? నీ విశ్లేషణ ఏమిటి?" అని అడిగాడు.

మధ్యవాడు "మహారాజా! ఆమె అద్భుత సౌందర్యవతి, సంగీత నాట్యాల తెలిసిన నైపుణ్యవతి. కానీ, ఆమె సాంగత్యం గొర్రె కంపు కొట్టినది" అన్నాడు చటుక్కున!

రాజుకు చురుక్కుమంది. నర్తకీమణి పూర్వాపరాలను విచారించగా, ఆమె గొర్రెల కాపరుల ఇంట పుట్టినదని తేలింది. రాజుకి దిగ్ర్భాంతి కలిగింది.

అతడు, ముగ్గురిలో చివరి సోదరుణ్ణి పిలిచి, ప్రత్యేక పంకం మీద పవళించవలసిందిగా ఆజ్ఞపించాడు. అది హంసతూలికా తల్పం! దానిపైన ఏడు పరుపులు పరచబడ్డాయి. హంస, నెమలి వంటి పక్షులు ఈకలలో ఈనెలు తీసేసి, దూదితో కలిపి తయారు చేయబడిన, దిండ్లూ పరుపులవి. వాటిపైన పట్టు దుప్పట్లు పరిచారు. పాలనురగలా మెత్తగా... పరిమళద్రవ్యాలతో మత్తుగా... ఉన్న పడక మీద నిద్రకుపక్రమించాడు విప్ర యువకుడు.

మరునాటి ఉదయం రాజు అతణ్ణి "ఈ శయ్యపై నీవు పొందిన నిద్రాసుఖం ఎలా ఉంది?" అని అడిగాడు. దానికతడు "మహారాజా! ఈ పడక పై నిద్రతో, నా ఒళ్ళంతా ఒకటే నొప్పులు సంభవించాయి!" అన్నాడు.

రాజు సేవకులని పిలిచి, పడకంతా పరీక్షించమన్నాడు. సేవకులా పని చేస్తుండగా తాను స్వయంగా పర్యవేక్షించాడు. ఆ మంచం మీద పరచిన ఏడు పరుపులు అడుగున, ఓ పొడవాటి వెంట్రుక ఉంది. రాజు విస్మయంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.

ముగ్గురు యువకుల ప్రతిభా నైపుణ్యాలు అతడికెంతో ఆనందం కలిగించాయి. వారికి తన ఆస్థానంలో తగిన స్థానాలిచ్చి సత్కరించాడు.

భేతాళుడీ కథ చెప్పి ఇలా అడిగాడు.

"ఓ విక్రమార్క మహారాజా! ముగ్గురు బ్రాహ్మణ యువకులలో ఎవరు గొప్ప ప్రతిభావంతులు? ఎవరి నైపుణ్యం విశిష్టమైనది? వివరించి చెప్పు!" అన్నాడు.

విక్రమాదిత్యుడు "భేతాళా! మొదటి సోదరుడు భోజన సుఖం తెలిపాడు. రెండవ వాడు తాను ఆనందించిన స్త్రీ గురించి వివరించాడు. ఈ ఇద్దరూ కూడా, తాము జాగృదావస్థలో ఉన్నప్పుడు తమ అనుభవాలని గుర్తించి, వివరించారు. మూడవ వాడు నిద్రావస్థలో ఉండి కూడా తన సుషుప్తి అనుభవంలోని బాగోగులని విశ్లేషించాడు. కాబట్టి ముగ్గురిలో మూడవవాడు నైపుణ్యమే మరింత విశిష్టమైనది" అన్నాడు.

విక్రమాదిత్యుడి వివేకపూరితమైన సమాధానానికి భేతాళుడు ముగ్ధుడయ్యాడు. అయినా మౌనానికి భంగం ఏర్పడినందున, తక్షణమే విక్రమాదిత్యుడి భుజం మీద నుండి మాయమై, మోదుగ చెట్టు మీద ప్రత్యక్షమయ్యాడు.

ఇది ఊహించినందున, విక్రమాదిత్యుడు వెనుదిరిగి శ్మశానం వైపు అడుగులేసాడు.

కథ విశ్లేషణ:

ఆహార నిద్రా మైధునాలు... ఏ ప్రాణికైనా ప్రాధమిక అవసరాలు! వాటి బాగోగులు తెలుసుకోవటంలో ఈ ముగ్గురు సోదరులూ నిష్ణాతులు. సాధారణంగా.... ఎప్పుడూ ఎక్కడా వినబడని, కనబడని ప్రజ్ఞలివి. ఇలాంటి కథలు విన్నప్పుడు, వాళ్లలానే ఏవైనా ప్రత్యేక విద్యలు, ఎవరికీ తెలియనివి, అరుదైనవీ నేర్చుకోవాలనే ఉత్సాహం పిల్లల్లో కలుగుతుంది. అది గొప్ప ప్రయోజనం కదా!

ప్రపంచంలో మరెవ్వరూ గుర్తించనంతగా మన పూర్వీకులు, కళలని 64 గా గుర్తించారు. ఇవి గాకుండా కూడా, ఇంకా చాలా కళలున్నాయి. అలాంటివే ఈ కథలోని బ్రాహ్మణ యువకులు చూపించేవి. సాధన చేస్తే మన పనిలో, దైనందిన జీవితంలో ఇలాంటి ఎన్నో నైపుణ్యాలు సాధించవచ్చు.

ఇప్పుడు కార్పోరేట్ ప్రపంచంలో... టీ, మద్య తయారీ సంస్థల్లో టేస్టర్స్ ప్రతిభ, కథలోని మొదటి యువకుడి సునిశిత నైపుణ్యం వంటిదే!

ఇక్కడ మీకు కొన్ని చిన్న ఉదాహరణలు ఇస్తాను.

మా వారి చిన్నప్పుడు వాళ్ళ పొరుగింట్లో ఒకామె ఉండేది. ఆమెకి రోజు సినిమా (11 గంటలకు ఉదయపు ఆట) చూడటం వ్యసనం. పనులన్నీ ముగించుకొని, కిరోసిన్ స్టౌలో సరిగ్గా అన్నం ఉడకటానికి కావలసినంత కిరోసిన్ మాత్రమే పోసి, అన్నం పెట్టి సినిమాకెళ్ళి పోయేది. (అప్పటికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు సరికదా, గ్యాస్, ప్రెషర్ కుక్కర్ కూడా అందరికీ అందుబాటులో ఉండేవి కావు.) ఆవిడ సినిమా చూసి తిరిగి వచ్చేసరికి, సరిగ్గా అన్నం ఉడికి కూర్చునేది. స్టౌ ఆరిపోయి ఉండేది. కాకపోతే వత్తులూ కాలిపోతాయి. వత్తులు కొంచెం పైకిలాగి, మళ్ళీ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

అంత ఖచ్చితంగా కిరసనాయిల్ పరిమాణాన్ని లెక్కంచగల ఆమె నేర్పు ఆశ్చర్యం కలిగించేది.

అలాగే గుంటూర్లో మేం ఉప్పులూ పప్పులూ కొనే కిరాణా దుకాణం ఒకటి ఉండేది. వాళ్ళ షాపుకు వచ్చే కస్టమర్ ఒకతను లాయర్ ఉండేవాడు. అతడు ఎప్పుడు ఉల్లిపాయలు ఏరినా తూకం వేస్తే సరిగ్గా కిలో ఉండేవి. ఒక్క పాయ వెయ్యాల్సిన అవసరంగానీ తియ్యాల్సిన అవసరం గానీ వచ్చేది కాదు.

వీళ్ళు భట్టి విక్రమార్క కథలు చదివారో లేదో నాకు తెలియదు కాని, ఇలాంటి అనుభవాలు నాకూ ఉన్నాయి.

నా 11వ ఏట భట్టి విక్రమాదిత్య కథలు మొదటి సారి చదివాను. అప్పటి నుండి, ఎందరికి చెప్పి ఆనందించానో! అవి చదివినప్పటి నుండి విక్రమాదిత్యుడు నా రోల్ మోడల్! అతడిలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి కావాలని కలలు కనేదాన్ని!

ఈ సంఘటన జరిగినప్పుడు నాకు 15-16 ఏళ్ళుంటాయి. పదవతరగతి పరీక్ష వ్రాసేసి, వేసవి సెలవులని ఆనందిస్తున్నాను. ఓ రోజు రాత్రి రెండు గంటల దాకా ఏదో పెయింటింగ్ వేసి పండుకున్నాను. ఆ రీత్యా మర్నాటి మధ్యాహ్నం బాగా నిద్ర పోతున్నాను.

అప్పుడు మా వీధికి బంగారు నగలకి మెరుగు పెడతానంటూ.... ఎవరో ఒకతను వచ్చాడు. మా పొరుగింటి వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు కూడా, అతడి మాయ మాటల బుట్టలో పడ్డారు. మా ఇంటి వరండాలోనే అతడు సరంజామా అంతా సర్దుకొని పని ప్రారంభించాడు. మా అమ్మగాజులు, మా ప్రక్కింటామె గొలుసు గట్రాలకు మెరుగు పెట్టాడు. నిద్రపోతున్న నన్ను కుదిపి లేపి, నా గొలుసు ఇమ్మన్నారు. నిద్రమత్తులోనే గొలుసు తీసి ఇచ్చి మళ్ళీ నిద్రపోయాను. అతడు మెరుగు పెట్టాడు. అందరి కళ్ళ ఎదుటే పనంతా పూర్తి చేసి, కూలి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు.

నిద్రలేచాక నా గొలుసు నాకిచ్చింది మా అమ్మ. మెడలో వేసుకున్న వెంటనే నేను "ఇది నా గొలుసు కాదు" అన్నాను.

"ఠాఠ్! అతడు మా కళ్ళ ఎదుటే పని చేసాడు. అందరం ఎక్సరే కళ్ళతో కాపలా కాసాం. అతడు గొలుసు మార్చే అవకాశమే లేదు. ఇది నీ గొలుసే!" అన్నారు అమ్మానాన్న.

నా గొలుసు 24 గ్రాముల బరువుంటుంది. అప్పట్లోనూ, ఇప్పడంతగాక పోయినా, ఆ రోజులకి బంగారం ఖరీదే! నేను "గొలుసులో ఏదో మార్పుంది. ఇది నాది కాదు" అని గట్టిగా వాదించాను.

దాంతో అనుమానం వచ్చి మా నాన్న, మాకు నమ్మకంగా నగలు అమ్మే బంగారు నగల దుకాణానికి తీసికెళ్ళి, నగను పరిక్షించమన్నాడు. నగ తూకంలో తేడా వచ్చింది. నాలుగు గ్రాముల బంగారం తరుగువచ్చింది. మా అమ్మ గాజులు, ప్రక్కింటి వారి నగలూ కూడా అంతే! చూసుకుంటే దాదాపు సవరు బంగారం నష్టపోయాము.

నిస్సహాయతతో కూడిన కోపంతో మా నాన్న, "రాత్రంతా అడ్డమైన పుస్తకాలు చదువుతూనో, పిచ్చి బొమ్మలు వేసుకుంటూనో మేలుకోవడం, పగలు నిద్రపోవటం! మేలుకుని ఉంటే, చదువుకుంటున్న పిల్లవి, వాడి మోసం పసిగట్టే దానివి కదా?" అంటూ నన్ను చెడామడా తిట్టేసాడు. ఏంచేస్తాను? గమ్మున ఊరుకున్నానను కోండి.

కొన్ని రోజుల పోయి, కోపం తగ్గాక, అంత తక్కువ బరువు తేడా కనిపెట్టిన నన్ను, నా పరోక్షంలో మెచ్చుకున్నాడు. బంగారం పోయినందుకు బాధపడినా, నా సునిశిత పరిశీలనా నేర్పు పట్ల నాన్న ప్రశంస, నాకెంతో సంతోషం కలిగించింది.

అప్పుడే కాదు... మా బ్యాటరీ తయారీ సంస్థలో, మిక్సింగ్ యంత్రంలో లెడ్ ఆక్సైడు, పెరాక్సైడు, యాసిడ్ గట్రాలు కలిపి మిశ్రమం తయారు చేస్తాం. దాన్ని లెడ్ గ్రిడ్ కు అంటించి ఎలక్ట్రోడ్స్ (బ్యాటరీ ప్లేట్లు)ని తయారు చేస్తాం. అప్పుడు మిక్స్ అయిన కెమికల్‌ని చెక్కతో చేసిన ఘనంలో cm3 ఉన్న రంధ్రం చేసి అందులో కెమికల్ నింపి, సెన్సిటివ్ బ్యాలెన్స్‌తో బరువు కొలుస్తాం. అది 100 గ్రాములకు 5 గ్రాములు అటుఇటుగా ఉన్నా, మిక్సింగ్ సరిగ్గా ఉన్నట్లే! సరిగ్గా 100 గ్రాములు ఉంటే ఆ బ్యాచ్ ప్లేట్లు మరింత నాణ్యతతో ఉన్నట్లన్న మాట. దాన్ని crucible weight అంటాం.

ఆ క్రమంలో... మా ఫ్యాక్టరీలో వర్కర్స్, కెమికల్స్ మిక్చ్ చేసాక, క్రూసిబుల్ తీసుకొని నా దగ్గరికి వచ్చేవాళ్ళు. సరిగ్గా మిక్స్ అయ్యిందో లేదో పరిశీలించమని! దాన్ని తాకి స్పర్శతో, బొటన వేలు చూపుడు వేలు మధ్యా చిదిపి ధ్వనితోనూ కూడా well mixingని గుర్తించవచ్చు. ఆ విధంగా చెక్ చేసాక, క్రూసిబుల్ వెయిట్‌ని చేతిలోకి తీసుకోగానే అది 100 గ్రాములకి ఎంత ఎక్కువ లేదా తక్కువ ఉండగలదో చెప్పేసేదాన్ని! తర్వాత సెన్సిబుల్ బ్యాలెన్స్‌తో తూకం వేస్తే ఖచ్చితంగా అంతే ఉండేది. మా తమ్ముళ్ళు ఆశ్చర్యంగా అడిగే వాళ్ళు, అంత ఖచ్చితంగా ఎలా చెబుతావని. "జాగ్రత్తగా పరిశీలిస్తూ పోతే అదేం బ్రహ్మవిద్య కాదు" అనేదాన్ని!

పరిశీలించాలే గానీ ప్రతి మనిషిలోనూ... ఎన్నో నేర్పులూ, నైపుణ్యాలు!

అయితే ఇలాంటి కథలు, అలాంటి నైపుణ్యాల గురించి పిల్లల్ని ఉత్తేజితుల్ని చేస్తాయి, నైపుణ్యాలు సాధించాలనే వైపు ప్రోత్సహిస్తాయి. కథల పరమార్ధం పిల్లల్ని అలా తీర్చిదిద్దటమే కదా!

3 కామెంట్‌లు:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

Thanks for the nice stories లక్ష్మిగారు. మీ కథలు అన్నీ క్రమం తప్పకుండా చదువుతున్నాను, విశ్లేషణలు సైతం చాలా చక్కగా ఉంటున్నాయ్.

కిరణ్ చెప్పారు...

చిన్నప్పుడు అంటే రమ్మీ ఆట నేర్చుకున్న కొత్తలో బాగా ప్రాక్టీస్ చేయటం వళ్ళ నేమో.. తీసిన ప్రతి సారీ సరిగ్గా అందరికీ సరిపొయేలా పదమూడు పదమూడు ముక్కలు వచ్చేవి..
చివరగా రెండు కమ్మలు మిగతా పేక నుండి ఒకటి ఒపెన్ కార్డ్, ఇంకోకటి జోకరూ మాత్రం తీసేవాడిని..

amma odi చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారు, కిరణ్ గారు : ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి.

వేణూ శ్రీకాంత్ గారు:మీ అభిమానానికి నెనర్లండి!

కిరణ్ గారు: అభ్యాసంతో ఎందులోనైనా నేర్పు సాధించవచ్చండి. అదే ఈ కథలు చెప్తాయండి! నెనర్లు!

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes