RSS
Wecome to my Blog, enjoy reading :)

భర్తృహరి కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 10]

భర్తృహరి కన్యాపురానికి రాజుగా, భట్టి విక్రమాదిత్యులిద్దరూ అన్ని విషయాలనీ పర్యవేక్షిస్తుండగా సుఖంగా ఉన్నాడు. అతడు పెక్కు మంది అమ్మాయిలను వివాహం చేసుకున్నాడు. అతడికి తండ్రికిచ్చిన మాట గుర్తుంది. అందుచేత తన రాణులు ఋతుమతులైన పన్నెండు రోజుల పర్యంతమూ వారి మందిరాలకు వెళ్ళక, ఇతర భార్యలతో గడుపుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఆ విధంగా సంతాన సాఫల్యతని నిరోధించటమన్నది అతడి ఉద్దేశం.

[ఆ రోజులలో సంతాన నిరోధక ఔషధాల వంటివి లేవు కదా!]

ఇలా రోజులు గడుస్తుండగా... ఒకనాడు...

చాంద్యోగ ఋషి అను గొప్ప తపస్సంపన్నుడు ఉండేవాడు. ఆయనని అందరూ సాక్షాత్తు శివ స్వరూపుడని కొనియాడేవారు. ఋష్యోత్తమడైన చాంద్యోగ మహర్షి, ఒకనాడు పదునాలుగు లోకాలను సందర్శించబోయాడు. దేవలోకం నుండి భూలోకానికి వస్తున్నప్పుడు, మార్గవశాన ఆయన ఒకింత సేపు నందనోద్యాన వనంలో విశ్రమించాడు. అక్కడ ఆయన కొక దివ్యఫలం లభించింది.

ఆయన భూలోకంలో ప్రవేశించాక, నేరుగా భర్తృహరి ఆస్థానానికి వచ్చాడు. భర్తృహరి చాంద్యోగ మహర్షిని చూడగానే, ఆ బ్రహ్మతేజస్సు చూసి ఎవరో మహానుభావుడని పోల్చుకున్నాడు. వెంటనే సింహాసనం దిగి వచ్చి, మహర్షికి పాదాభివందనం చేసి, స్వాగత సత్కారాలు చేశాడు.

మహర్షి పాదాలు కడిగి, అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు. తన సింహాసనం మీద మహర్షిని కూర్చుండబెట్టి సేవకుడి మాదిరిగా భక్తి శ్రద్దలతో పరిచర్యలు చేశాడు. వినయ విధేయతలతో కూడిన అతడి ప్రవర్తనకు మహర్షి ఎంతో సంప్రీతుడయ్యాడు.

వాత్సల్యంతో "రాజా! భర్తృహరీ! నేను చాంద్యోగ ఋషిని. నా తపశ్శక్తితో పదునాలుగు లోకాల్లోనూ సంచరించ గలవాడిని. నేను స్వర్గలోకములో ఉండగా, ఇంద్రుని నందనోద్యాన వనంలో నాకీ పండు లభించినది. ఇది దివ్య ఫలము. దీని నారగించిన వారు, నిత్య యవ్వనులై జరామరణ భయము లేక యుందురు. నిత్య యవ్వనుడనై, జరామరణాలు లేక నేను బ్రతికిననూ, నా వలన ఈ జగత్తునకుపయోగమేమిటి? నీవీ ఫలమును భుజించినట్లయితే, ధర్మపాలన చేయగలవు. నీ రాజ్య ప్రజలు సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యలతో ఉండగలరు. ధర్మము పరిరక్షింపబడగలదు. కాబట్టి, రాజువైన నీవు ఈ ఫలమును తినుటకు అర్హుడవు. అందుచేత నీకీ ఫలమును కానుకగా నీయవలెనని వచ్చితిని. ఈ దివ్యఫలమును స్వీకరింపుము. నీకు జయమగు గాక!" అని భర్తృహరిని ఆశీర్వదించాడు.

భర్తృహరి భక్తి శ్రద్దలతో పండుని స్వీకరించి, చాంద్యోగ మహర్షికి కృతజ్ఞతలు తెల్పుకున్నాడు. అతిధి సత్కారాలు పొంది, చాంద్యోగ మహర్షి వీడ్కొలు తీసుకున్నాడు.

రాచకార్యాల అనంతరం, భర్తృహరి తన అంతఃపురానికి వెళ్ళాడు. అతడికి ఎందరో రాణులున్నా, పట్టపు రాణి మోహనాంగి పట్ల భర్తృహరికి అనురాగము మెండు. [మోహనాంగి అనగా మోహము కలిగించు దేహము కలది అని అర్దం.]

ఆమె అతడి మొదటి భార్య. భర్తృహరి మోహనాంగికి దివ్యఫల మహిమను వివరించి చెప్పాడు. ఎంతో ప్రేమగా "ప్రియసఖి! ఈ ఫలమును నేను ఆరగించినట్లయితే, నిత్యయవ్వనుడనై చిరకాలము జీవించగలను. కానీ నా కళ్ళ ముందు నువ్వు ఈ అందమైన రూపము వయో వృద్ద భారమై మరణిస్తావు. అది నేను భరించలేను. నాకు నీపైన అంత ప్రేమ! కాబట్టి ఈ పండును నీవు ఆరగించు" అన్నాడు.

మోహనాంగి వయ్యారంగా పండు నందుకొని ప్రక్కన ఉంచింది. మధురమైన మాటలతో, ప్రేమాస్పద చర్యలతో భర్తకు ఆనందం కలిగించింది. అయితే ఈ మోహనాంగి, భర్త పట్ల నిజమైన ప్రేమ గలది కాదు. ఆమెకు రధ సారధియైన ‘సాహిణి’ అనువానితో రహస్య ప్రేమాయణం ఉన్నది.

మరునాటి ఉదయం మోహనాంగి, రహస్యంగా సాహిణికి ఆ పండునిస్తూ దాని విశిష్టతని తెలియబరిచింది. ఈ రధసారధి ‘సాహిణి’కి రాజ ప్రసాదంలో పరిచారికగా పనిచేయ మరొక మహిళతో రహస్య ప్రేమ సంబంధం ఉంది. ఆ పరిచారిక రాజాంతఃపురాన్ని శుభ్రం చేస్తూ ఉంటుంది. పేడ, మట్టితో అంతఃపుర పరిసరాలని అలికి ముగ్గులు పెడుతూ ఉంటుంది.

సాహిణి ఆ పరిచారికని ఆ రోజు సాయంత్రం కలుసుకున్నాడు. కాసేపు ఇష్టాపూర్తిగా గడిపాక, సాహిణి పరిచారికకి పండునిచ్చి, దాని ప్రత్యేకతని చెప్పాడు. ఆ పరిచారిక "సరే! ఇంటికెళ్ళి స్నానం చేశాక, ఈ పండు తింటాను" అనేసి పోయింది.

పరిచారిక పండుని పేడ గంప మీద పెట్టుకొని, గంప నెత్తిన పెట్టుకుని, ఇంటికి బయలు దేరింది. ఆమె రాజవీధిలో నడిచి పోతుండగా... అప్పుడే భర్తృహరి రాజ ప్రాసాదపు ఉప్పరిగ [మేడ] మీద చల్లగాలిని ఆస్వాదిస్తూ, పచార్లు చేస్తూ ఉన్నాడు. రోజు వారీ దినచర్య నుండి ఆ విధంగా విశ్రాంతి పొందడం రాజుకు అలవాటు.

యధాలాపంగా వీధిలోకి చూసిన భర్తృహరికి, పరిచారిక నెత్తి మీది గంపలో పేడ మీద దివ్యఫలం కనిపించింది. మరుక్షణమే దాన్ని అతడు గుర్తు పట్టాడు. అతడికి చాలా ఆశ్చర్యం కలిగింది. తాను పట్టపు రాణి కిచ్చిన దివ్యఫలం ఈ పేడ గంపలోకి ఎలా వచ్చింది?

భర్తృహరి వెంటనే భటులని పిలిచి, ఆ పరిచారికని తన సముఖానికి రప్పించమని అజ్ఞాపించాడు. క్షణాలలో ఆమె రాజు ముందు ప్రవేశ పెట్టబడింది.

భర్తృహరి ఆమెను "చూడమ్మా! ఈ పండు నీకెక్కడిది?" అని అడిగాడు. ఉత్తర క్షణంలో పరిచారిక గడగడ వణుకుతూ "మహారాజా! క్షమించండి! అంతఃపుర రధసారధి సాహిణి నాకీ పండునిచ్చాడు. అతడికిది ఎలా వచ్చిందో నేనెరుగను" అన్నది.

రాజు సాహిణిని తీసుకు రమ్మన్నాడు. భటులదే చేశారు. అక్కడున్న పరిచారికనీ, దివ్యఫలాన్ని చూసే సరికే, సాహిణికి పైప్రాణాలు పైనే పోయాయి. అతడికి ప్రమాదం అర్ధమయ్యింది. "నేను సత్యాన్ని దాచిపెట్టలేను. అలా చేసినట్లయితే నిజం బైటపడ్డాకనైనా రాజు నా తల తీయించగలడు" అనుకున్నాడు.

భయంతో వణుకుతూ రాజు పాదాలపై పడ్డాడు. "మహారాజా! దయ చేసి నన్ను క్షమించండి. మహారాణి మోహనాంగీ దేవి నాకీ పండునిచ్చింది" అన్నాడు.

రథసారధి వాలకాన్ని బట్టి, భర్తృహరికి సత్యమేమిటో అప్పటికే బోధపడింది.

పరిచారిక నుండి పండుని గ్రహించి శుభ్రపరచమని దాసీలకు ఆజ్ఞాపించాడు. రధసారధినీ, పరిచారికనీ మన్నించి పంపించి వేసాడు.

పండు చేత బట్టుకొని రాణీ వాసానికి వెళ్ళాడు. మోహనాంగి చిరునవ్వుతో రాజుకు స్వాగతం పలికింది. ‘వేళ కాని వేళ ఎందుకు వచ్చాడా?’ అని మనస్సులో ఆలోచిస్తూనే ఉంది. ఇంతలో భర్తృహరి "మోహనాంగీ! నిన్నటి దినం నీకు నేనొక దివ్య ఫలాన్ని ఇచ్చాను కదా? అది ఎక్కడ?" అని అడిగాడు.

మోహనాంగి "దాని నప్పుడే ఆరగించాను మహాప్రభూ!" అంది.

భర్తృహరి గుంభనంగా "అయితే మరి ఇది నా చేతికి ఎలా వచ్చింది?" అన్నాడు.

భర్త చేతిలో పండుని చూసి మోహనాంగి దిగ్ర్భాంతికీ, భయానికీ గురైంది. ఏం జరిగి ఉంటుందో, ఏం జరగ బోతోందో ఆమె కర్థమయ్యింది. నిజం దాచి ప్రయోజనం లేదనిపించింది. మరుక్షణం భర్త పాదాల మీద వ్రాలి క్షమించమని ప్రార్దించింది.

భర్తృహరి స్వయంగా పండితుడు. జ్ఞాని. అతడామెపై కోపగించలేదు. అసలతడికి ఎవరి మీదా కోపం రాలేదు. ఇహలోకం మీద మాత్రం విరక్తి కలిగింది. అతడు తన భార్యల నందరినీ పిలిచి, "నేను అరణ్యాలకు పోయి తపస్సు చేసుకోవాలని నిశ్ఛయించుకున్నాను. ఈ క్షణమే మిమ్మల్ని త్యజిస్తున్నాను. మీరు మీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు. మీ నగలను, ఇతర సంపదను తీసుకుని, మీకు ఇష్టమైన వారిని వివాహమాడి, సుఖంగా ఉండండి" అంటూ రాణీ వాసపు స్త్రీలందరికీ అనుమతి నిచ్చాడు.

తన సోదరులైన విక్రమాదిత్యుని రాజు గానూ, భట్టిని మంత్రిగానూ పట్టాభిషిక్తులని చేసి, సన్యాసాశ్రమం స్వీకరించాడు. సోదరులిద్దరినీ మనస్ఫూర్తిగా దీవించి, దివ్యఫలం భుజించి, తపస్సుకై అడవులకు వెళ్ళాడు.

[భారతీయుల సంస్కృత సాహిత్యంలో భర్తృహరి సుభాషితాలు జగత్ర్పసిద్ది పొందాయి. కవితా ఝరితో నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలుగా గల ఈ సుభాషిత త్రిశతి మనోహరంగా ఉంటుంది. ప్రకృతితో సరిపోల్చుతూ, కవితాత్మకంగా, మనో విశ్లేషణని సైతం వెలువరించిన భర్తృహరి శ్లోకాలను, తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి, తీయ తీయగా అనువదించాడు. ఆ సుభాషిత త్రిశతి కర్త ఈ భర్తృహరియే అని ప్రతీతి!

ఇక్కడ మరో అంశం ఆసక్తి కరమైనది.... చాంద్యోగ మహర్షికి దివ్య ఫలం లభించింది. దాన్ని భుజిస్తే జరామరణ భయం లేకుండా నిత్య యవ్వనులై జీవించవచ్చు. అయితే మహర్షి ‘ఆ విధంగా జీవించే తన వలన, ప్రపంచానికి లాభమేమిటి?’ అనుకొని పండు తెచ్చి రాజైన భర్తృహరికి ఇచ్చాడు.

భర్తృహరి దాన్ని, భార్య మీద ప్రేమ కొద్దీ, ఆమెకిచ్చాడు. చివరికి అదే పండు కారణంగా... ఇహలోక బంధాలను రోసి తపస్సుకై అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళేటప్పుడు పండు నారగించాడు. రాజుగా సుఖభోగ జీవితాన్ని ఆనందించేందుకు పండును భుజించడానికి ఇష్టపడని వాడు, అడవికి తపస్సు చేసుకునేందుకు వెళ్తూ భుజించాడు.

ఎందుకంటే - సుదీర్ఘ కాలం తపస్సు చేసైనా ‘సత్యాన్ని తెలుసుకోవాలి, ముక్తిని పొందాలి’ అదీ అతడి ఆకాంక్ష! రాజుగా ఉన్నప్పుడు తన సుఖం కంటే తన వారి సుఖం ఆశించాడు. సన్యసించాక సత్యాన్ని కాంక్షించాడు. అదీ అతడి దృక్పధం!]

8 కామెంట్‌లు:

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

ఆదిలక్ష్మి గారు,మంచి ప్రయత్నం.ఓపికగా అన్ని కథలు వ్రాస్తున్నారు.మీకు జోహార్లు.భట్టి విక్రమార్కుల కథలు మొత్తం కలిపి సంకలనం గా తయారైన పుస్తకం ఏదైనా ఉంటే చెప్పండి.

amma odi చెప్పారు...

మీ అభిమానానికి నెనర్లు! ఇదే పేరుతో ఉంటుందండి. ఎక్కువగా పుణ్యక్షేత్రాలలో దొరుకుతుంది. కాకపోతే గ్రాంధిక భాషలో ఉంటుంది. ముద్రారాక్షసాలతో ఉంటుంది! :) చదివితే మాత్రం అద్బుతలోక విహారం చేయిస్తుంది.

ranjani చెప్పారు...

బొమ్మల భట్టి విక్రమార్క కథలు @ Archive.org
part 1 and part 2

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

రంజని గారు కృతజ్ఞతలు

amma odi చెప్పారు...

రంజని గారు: పంచతంత్ర కథలు ఉన్న లింకులు ఏమయినా తెలిస్తే చెప్పగలరా?

సత్యేంద్ర చెప్పారు...

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు:
నాకు తెలిసిన పుస్తకం వివరాలు, (అదే పుస్తకం నుంచి)

భట్టి విక్రమార్క కథలు
రచయిత- శ్రి ఇచ్ఛాపురపు రామచంద్రం.

రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి. ఫొన్.2473444
ప్రింటింగ్ - వాసు ఆఫ్ సెట్, విజయవాడ. ఫొన్. 2438324
వెల. రూ 100/-
ముద్రణ : జనవరి 2005


రంజని గారు: కృతజ్ఞతలు
ఆదిలక్ష్మి గారు: కృతజ్ఞతలు

సత్యేంద్ర చెప్పారు...

ఆదిలక్ష్మి గారు:

పంచతంత్ర కథలు

http://www.andhrafolks.net/ReadArticle.asp?Type=K&ID=713&PageNum=1

amma odi చెప్పారు...

రంజని గారు, సత్యేంద్ర గారు: కృతజ్ఞతలండి!

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes