భారతీయ జానపద కథలు!
అది నిజంగా భారతీయ సంస్కృతీ సంపద!
వారసత్వంగా సంక్రమించిన సుందర సారస్వతం!
సాహితీ విలువలతో, రమణీయ పదబంధాలతో, వ్యాకరణాత్మకంగా, సంగీత భరితంగా, రసభరితంగా అలరారే కావ్యాలూ, నాటకాలు, కీర్తనలూ, కృతులూ!
ఇక[ఒకప్పుడు] రామాయణ భారతాలు భారతీయులకు సర్వేంద్రియాలు. ఏ విషయాన్నైనా చూసేది, వినేది, ఆఘ్రాణించేది, ఆస్వాదించేది రామాయణ భారతాలనే కళ్ళు, చెవులు, నాసికా నాలుకలతోనే!
కవులని, అందునా భక్త కవులని సాక్షాత్తూ భగవంతుడి స్వరూపం గానే కొలుస్తారు భారతీయులు. భారత కర్త వేదవ్యాసుణ్ణి శంకరరూపుడిగా సేవిస్తే... రామాయణ కర్త వాల్మీకిని ఆదికవిగా ఆదరిస్తారు.
వాల్మీకి గురించి ఎంత అందంగా అనుభూతిస్తారో చూడండి.
కూజంతం రామ రామేతి I మధురమ్ మధురాక్షరమ్ II
ఆరుహ్య కవితా శాఖాం I వందే వాల్మీకి కోకిలమ్ II
కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని, వాల్మీకి అనే కవికోకిల, మధురమూ మధురాక్షరమూ అయిన రామనామాన్ని పాడుతోందట! ఎంత సౌందర్య సంపూర్ణ ఆస్వాదనో!
రామాయణ భారతాలు ఇతిహాసాలైతే....భారతీయ జనసామాన్యంలోకి చొచ్చుకుపోయిన జానపద సాహిత్యమూ పేరెన్నిక గన్నదే! ప్రజలని ప్రభావ పరిచినదే!
అలాంటి జానపద సాహిత్యంలో.... భట్టి విక్కమార్కుల కథలది ప్రత్యేక స్థానం. విక్రమాదిత్యుడు మహారాజు, భట్టి ఆయనకు మహామంత్రి. విక్రమాదిత్యుడి గొప్పతనమూ, ఆయనకు సోదరుడూ మంత్రీ కూడా అయిన భట్టి మేధావిత్వం గురించిన కథలివి.
ఈ కథలు దాదాపు 365 ఉండేవి. రోజుకో కథ చెప్పుకుంటే, పూర్తికావటానికి సంవత్సరం పడుతుంది. ఇప్పుడు కొన్ని కథలే లభ్యమౌతున్నాయి. ఒక కథలో నుండి మరో కథ, కంఫ్యూటర్ లో మనం ఒక విండో లోంచి మరో దానిలోకి, ఒక ఫోల్డర్ లోంచి మరో దాన్లోకి ప్రయాణించినట్లుగా ఉంటుంది. కథల నిండా అద్భుతరసమే! సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే సంఘటనలు, కథల్లో మలుపులు, స్ఫూర్తి నింపే సాహసాలు, చక్కని వర్ణనలతో పాటు, సాహసాలు, వితరణ శీలం, ఇతరులకు సహాయపడటం వంటి మానవ సహజ సుగుణాలకు ప్రాధాన్యత కనబడుతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే - ఈ కథలలో అవధుల్లేనంతటి ఊహాశక్తితో, అజ్ఞాత కవి ఎవరో, మనల్ని అద్భుతలోకాల్లోకి.... అతివేగంగా, అతి రమ్యంగా తీసికెళతాడు.
ప్రాచీనకాలంలో, సంస్కృత లిపిలో ‘భట్టి విక్రమార్క సంవాదం’ పేరిట ఒక గ్రంధం ఉండేదట. కాలక్రమంలో దాని లభ్యత మృగ్యమైంది. తెలుగులోకీ, ఇతర భాషల్లోకీ ఈ కథల అనువాదాలున్నాయి. చాలా కథలు, తరం నుండి తరానికి ‘అమ్మమ్మ తాతయ్యల దగ్గర కథలు చెప్పించుకోవడం’ రూపేణా సంక్రమించాయి.
వీటిల్లో కొన్ని కథలని, పిల్లల పుస్తకాలలో చదివాను. భట్టి విక్రమార్క పేరుతో గ్రాంధిక భాషలో ఉన్న పుస్తకాన్ని, తొలిగా నా పదకొండవ ఏట చదివాను. కొన్ని కథలు సినిమాలుగా చూశాను. [చదివిన వాటితో పోల్చుకుంటే సినిమాలు పరమ చప్పగా ఉన్నాయి.] ఈ కథలని నేనెంతగా ఆనందించానంటే - చిన్నప్పటి నుండీ వీటిని మా అమ్మనాన్నలకి, మా వీధిలో అందరికీ చెప్పాను.
స్కూల్లో చదివేటప్పుడు ఈ కథలు చెప్పినందుకు ప్రతిఫలంగా, నా నేస్తాలు నా పుస్తకాల పెట్టె మోసిపెట్టేవాళ్ళు, వాళ్ళ తాయిలాల్లో వాటాలిచ్చేవాళ్ళు. మా పాపకి, నా శిష్యులకీ... అందరికీ చెప్పాను.
ఎప్పుడు ఎవరికి చెప్పినా.... శ్రోతల్లో ఎంతో సంభ్రమాశ్చర్యాలూ, సంతోషమూను! చెప్తూ నేనూ ఎంతో ఆనందించేదాన్ని. మా పెళ్ళైన కొత్తలో మా వారూ నేనూ కూడా, ఎంచక్కా ఈ కథలు చెప్పేసుకున్నాం. మరి అద్భుతరసంతో నిండిన ఊహకందని మలుపులున్న కథలవి! ఎన్నిసార్లు ఆనందించినా విసుగెత్తదు.
అందుకే పిల్లలూ పెద్దలూ అందరికీ చెప్పేదాన్ని. నిజానికి నేను, పిల్లలకి చెప్పడం ప్రారంభించేదాన్ని. కాస్సేపయ్యాక చూస్తే చుట్టూ పెద్దలు కూడా చేరి ఉండేవాళ్ళు. ఇది నన్నెంత ఉత్సాహ పరిచేదంటే - ఆ కథలని నా పద్దతిలో, చిన్న చిన్న మార్పులు చేసి చెప్పేదాన్ని.
నిజానికి ఈ కథలు, పిల్లల్లో చక్కని వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ధృఢమైన, నిర్దిష్టమైన వ్యక్తిత్వాన్ని! ఇలాంటి కాల్పనిక కథలు చదవటం రీత్యా, పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది. తమదైన ప్రపంచాన్ని ఆనందిస్తారు. దాంతో సృజనాత్మకత పెరుగుతుంది. ధైర్య సాహసాలు, పట్టుదల, సహనం, పెద్దల పట్ల వినయం, భక్తి, నమ్మకం వంటి మానవీయ విలువలు అలవడతాయి.
అంతేకాదు, తార్కిక ఆలోచన, సునిశిత పరిశీలన, విషయ విశ్లేషణ, సాహసాలకు పూనుకోవటం, సవాళ్ళను స్వీకరించటం వంటి లక్షణాలూ గ్రహిస్తారు. ఈ కథలు వాళ్ళని చక్కని మార్గంలో నడిపిస్తాయి. భావప్రసార శక్తిని పెంపొందిస్తాయి. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, ఎలా ప్రభావితుల్ని చేయాలి, ఎలా స్ఫూర్తిపూరితులని చేయాలి, ఇతరులని ఎలా ఒప్పించి తమ మార్గంలోకి తెచ్చుకోవాలి, ఎలా సంతోషపరచాలి... ఇలాంటివన్నీ! వీటితో పాటు.... సమయోచితంగా, సందర్బోచితంగా, హాస్య స్ఫూరకంగా ఎలా మాట్లాడాలో కూడా!
ఈ కథలు పూర్తయ్యేసరికల్లా, కథనాయకులైన భట్టి, విక్రమాదిత్యులు పిల్లలకు ఆదర్శం, ‘రోల్ మోడల్స్’ అయిపోతారు. వాళ్ళలాగే తామూ అన్నీ కళలనీ, జ్ఞానాన్ని నేర్చేసుకోవాలనిపిస్తుంది.
నిజానికి ఈ కథల సృష్టికర్త ఎవరో తెలియదు. భట్టి విక్రమార్కులు ఉజ్జయినీ నగరాన్ని, వేల సంవత్సరాల పాటు పరిపాలించిన మంత్రి, చక్రవర్తులని నమ్మకం. అతిశయోక్తులున్నా అది చారిత్రక సత్యం అంటారు. కల్పనలు జోడించబడినా, ఈ కథలు పిల్లల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.
ఈ కథల ప్రభావం నామీద చాలా ఉందని నేను అనుకుంటాను. చదువరుల మీద ఈ కథలు వేసే ముద్ర బలమైనది. ఎన్నోసార్లు ఈ కథలని ఎందరికో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ బ్లాగ్లోకంలో, మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. ఇంతకు ముందు ఇంగ్లీషులో సగభాగం వ్రాసాను.
మీ ఇళ్ళల్లోని చిన్నారులకి, ఈ మజాని పంచుతారని ఆశిస్తూ.... దఫాలుగా ఈ కథా పరంపర....!
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
3 కామెంట్‌లు:
చాలా మంచి ప్రయత్నమండి. మీరు రాయబోయె ఆ కధా స్రవంతి కోసం వేయికళ్లతో ఎదరుచూస్తూ
-సుధాకర్
మీకు తెలిసిన కథలన్నీ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా రాయండి. మన ముందు తరాల వారికి ఇవే మనం ఇవ్వబోయే విజ్ఞానం.
సుధాకర్ గారు, రవిచంద్ర గారు: మీ ప్రోత్సాహానికి నెనర్లండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి