RSS
Wecome to my Blog, enjoy reading :)

చిక్కుడు గింజకు చారలెందుకు వచ్చాయంటే!

అనగా అనగా.....

ఓ ఊరిలో ఓ అవ్వ ఉండేది. ఓ రోజు ఆవిడ వంట చేద్దామని పొయ్యి వెలిగించి, పొయ్యి మీద కుండ పెట్టింది. కుండలో కొన్ని నీళ్ళు పోసింది. ఎండుపుల్లలు బాగా మండేందుకు గాను కొన్ని బొగ్గు ముక్కలూ, వరిగడ్డి పోచలూ పొయ్యి పక్కన పెట్టుకుంది.

ఇంతలో ఓ గడ్డిపోచ ప్రక్కకు తప్పించుకుంది. ఓ బొగ్గుముక్క కూడా పొయ్యిలో పడకుండా పక్కకు గెంతింది. కానీ అప్పటికే పాపం దాని ఒంటికి కాస్త సెగ అంటుకుంది. అంతలో పొయ్యి మీది కుండలో నీళ్ళు మరగడం మొదలెట్టాయి. అవ్వ చేటలో కొన్ని చిక్కుడు గింజలు తెచ్చి కుండలో పోసింది. పొయ్యి ముందు కూర్చొని మంటెక్కువ పెట్టసాగింది.

ఇంతలో ఓ చిక్కుడు గింజ చేటలోంచి కుండలోని వేన్నీళ్ళలో పడకుండా తెలివిగా ప్రక్కకు జారి తప్పించుకుంది. చిక్కుడు గింజా, బొగ్గుముక్కా, గడ్డిపీచు కూడబలుక్కున్నాయి.

"అమ్మో. ఇక్కడే ఉంటే ఈ అవ్వ మనల్ని చూడకా మానదు. మంటల్లో వెయ్యక మానదు. పారిపోదాం” అనుకున్నాయి. గోడవారగా జరుగుతూ మెల్లిగా అవ్వ ఇంట్లోంచి బయట పడ్డాయి. వీధి ప్రక్కగా నక్కుతూ నక్కుతూ గాలికి కొట్టుకుపోతున్నట్లుగా నటిస్తూ పారిపోవటం మొదలెట్టాయి. అలా అలా వీధి చివరికి వచ్చేసాయి. వీధి చివర వాటికొక కాలువ అడ్డంగా ఉంది. ఆ చిన్న వీధి కాలువ వాటి ప్రాణానికి గంగా ప్రవాహమంత పెద్దగా కన్పించింది.

ఎలాదాటడం? గడ్దిపోచ, బొగ్గు ముక్కా, చిక్కుడు గింజ తీవ్రంగా ఆలోచించసాగాయి.

“ఐడియా!” ఒక్కసారిగా అరిచింది గడ్డిపోచ.

"ఏమిటి?" ఆత్రంగా అడిగాయి బొగ్గుముక్కా చిక్కుడు గింజా.

"నేను ఈ కాలువకి అడ్డంగా వంతెనలా పడుకుంటాను. నామీదుగా దాటండి మీ ఇద్దరూ!” అంది గడ్దిపోచ ఉత్సాహంగా.

"భలే భలే!” మరింత ఉత్సాహంగా అభినందించింది బొగ్గు ముక్క.

" ముందు నేను దాటుతాను” గోముగా అడిగింది చిక్కుడు గింజ.

గడ్దిపోచ కాలువకి అడ్డంగా పడుకుంది. దాని మీదుగా దాటుతూ చిక్కుడు గింజ ఆవలి వైపుకి చేరిపోయింది.

ఇక బొగ్గు ముక్క వంతు వచ్చింది. మెల్లిగా గడ్దిపోచ మీదకి ఎక్కి కాలవ దాటడం మొదలు పెట్టింది బొగ్గుముక్క. దానికి కొంచెం సెగ అంటుకొని ఉందయ్యె. గడ్డిపోచకి అది సోకింది. అప్పటికే బొగ్గుముక్క సగానికి వచ్చేసింది.

"త్వరగా దాటేయ్! నీ సెగకి నేను కాలిపోయేలా ఉన్నాను” గాబరా పడింది గడ్డిపోచ.

కంగారుగా కిందికి చూసింది బొగ్గుముక్క. సన్నని గడ్డిపోచపై తాను. క్రింద పారుతున్న నీళ్ళు. దెబ్బకి దానికి కళ్ళు తిరిగాయి. కాళ్ళు తడబడ్డాయి. కదల్లేక పోయింది. అది ఒకేచోట ఆగిపోయేసరికి, దాని సెగకి గడ్డిపోచ కాస్తా మధ్యకి తగలబడింది. దెబ్బకి కాలువలోకి రెండు ముక్కలుగా విరిగిపోయింది. దాంతో బొగ్గుముక్క నీళ్ళల్లో పడిపోయింది. పాపం రెండూ నీళ్ళల్లో కొట్టుకు పోతూ కేకలు పెట్టసాగాయి.

ఇదంతా చూసి ఒడ్డునున్న చిక్కుడు గింజ విరగబడి నవ్వింది. పడీ పడీ నవ్వింది. పొట్టపట్టుకొని పగల బడి నవ్వింది. క్రిందపడి దొర్లి దొర్లి నవ్వింది. ఆ దెబ్బకి దాని పొట్ట కాస్తా పగిలిపోయింది.

దాంతో అప్పటిదాకా నవ్వుతూ తుళ్ళుతూ, ఉన్న చిక్కుడు గింజ కాస్తా కుయ్యో మొర్రో మంటూ ఏడవటం మొదలు పెట్టింది. అప్పడే ఆ దారిలో వెళుతున్న దర్జీ ఒకడు దాన్ని చూసి చేతుల్లోకి తీసుకొని “ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు.

కళ్ళు తుడుచుకుంటూ సంగతంతా చెప్పింది చిక్కుడు గింజ.

దర్జీ దానివైపు జాలిగా చూస్తూ “చూశావా? గడ్డిపోచ, బొగ్గుముక్క నీకు మిత్రులు. నీలాంటి వాళ్ళే. పాపం గడ్డిపోచ నీకు సహాయం చేసింది. దాని సాయమే లేకుంటే నీవు కాలువ దాటలేవు కదా! గడ్డిపోచ బొగ్గుముక్కకీ సాయం చేయబోయి నీళ్ళల్లో పడిపోయింది. న్యాయంగా అయితే నువ్వు వాటికి సాయం చేయాలి. సాయం చేయలేక పోతే కనీసం సానుభూతి కలిగి ఉండాలి. అదేమీ లేకుండా వాటిని చూచి ఎగతాళి చేశావు. అవి నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే పగలబడి నవ్వావు. పొట్టపగిలేవరకూ నవ్వావు. తప్పు కదా!” అన్నాడు.

చిక్కుడు గింజ వెక్కిళ్ళు పెడుతూ “నిజమే! నాకు బుద్దొచ్చింది. దయచేసి నా పొట్ట కుట్టవా?" అంది జాలిగా.

దర్జీ జేబులో వెతుక్కుంటే సూది ఉంది గానీ మ్యాచింగ్ దారం దొరక లేదు. దాంతో ఉన్న దారంతో దాని పొట్టకుట్టేసాడు.

అందుకే ఇప్పటికీ నల్లని, ఎర్రని చిక్కుడు గింజల మీద తెల్లని చార, తెల్లని చిక్కుడుగింజల మీద నల్లటి చారా ఉంటాయి.

ఏ రంగులో ఉన్నా చిక్కుడు గింజలు రుచిగా ఉంటాయి.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

2 కామెంట్‌లు:

పద్మ చెప్పారు...

:) బావుందండి కథ.

మధురవాణి చెప్పారు...

very nice story! :)

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes