అనగా అనగా.....
ఒకసారి ’బిందుసారుడి వారసుడెవరు?’ అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.
బిందుసారుడు రాజగురువు, చాణక్యుడి సలహా కోసం ఆశ్రయించాడు. అప్పటికే శతాధిక వృద్ధుడైన ఆచార్యుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయమంతా సావధానంగా విన్నాక ఆయన “నాయనా! రేపు ఉదయమే నీ పుత్రులందర్నీ దేవీ అలయానికి రమ్మని ఆఙ్ఞాపించు. వచ్చేముందు బలవర్థకమైన ఆహారాన్ని భుజించి, మంచి వాహనాన్ని అధిరోహించి రమ్మని చెప్పు. దేవాలయంలో కూర్చునేటందుకు విలువైన ఆసనాన్ని వెంట తెచ్చుకొమ్మని చెప్పు” అన్నాడు.
బిందుసారుడలాగే తన కుమారులందరికీ ఆఙ్ఞాపించాడు. మహారాజు, మంత్రులూ, విషయం తెలిసిన ఇతర ప్రజలూ – అందరూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృత చెందారు.
నిర్ధేశింపబడిన సమయానికి రాకుమారులంతా దేవాలయం చేరారు. తమ ఆసనాలనీ వెంట తెచ్చుకున్నారు. ఒకరు బంగారు కుర్చీని తెచ్చుకున్నారు. ఒకరు దారుశిల్పంతో నిండిన ఆసనాన్ని తెచ్చుకొన్నారు. పట్టువస్త్రాలతోనూ, పరుపులతోనూ అలంకరించి ఆసనాన్ని మరోకరూ, ముత్యాలూ, రతనాలూ పొదగబడిన పీటను ఇంకొకరు తెచ్చుకున్నారు. ఒకొక్కరూ ఒకో వాహనం పైన వచ్చారు. ఒక రాకుమారుడు పల్లకిలో వచ్చాడు. ఒకరు గుర్రమీద, ఒకరు ఏనుగు అంబారీ పైనా, మరొకరు రధంలోనూ .... ఇలా ఎవరికి మంచిదనిపించిన వాహనం మీద వారు వచ్చారు.
దేవాలయ ప్రాంగణంలో మహారాజు, మంత్రులు, ఆచార్యుడు అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చోన్నారు. వారికి ఎదురుగా రాకుమారులంతా తమ తమ వెంట తెచ్చుకున్న ఆసనాలపై కూర్చొన్నారు. వారిలో అశోకుడు ఒక్కడే కటిక నేలపై కూర్చొని ఉన్నాడు. అది చూసి ఇతర రాకుమారుల ముఖమ్మీద ముసిముసినవ్వు కదలాడింది. అందులో హేళన మిళితమై ఉంది. దాసీ పుత్రుడికి అంతకంటే ఏం ఉంటుందన్న ఎగతాళి ఉంది.
ఆచార్యుడు అడిగాడు “మీరంతా ఒకరి తర్వాత ఒకరు, ఇక్కడికి వచ్చేముందు ఏ ఆహారం స్వీకరించారో చెప్పండి”.
రాకుమారులంతా తామేం తినివచ్చారో ఒకింత గర్వంగా చెప్పారు. అశోకుడి వంతు వచ్చింది. స్థిరమైన గొంతుతో అశోకుడు “గిన్నెడు పెరుగు” అన్నాడు. రాకుమారులంతా ఫక్కున నవ్వారు.
ఆచార్యుడు “బలవర్థమైన ఆహారం స్వీకరించి రమ్మని నీకిచ్చిన ఆఙ్ఞ. మరి పెరుగెందుకు తిన్నావు?" అని అడిగాడు.అశోకుడు తడబాటు పడకుండా “ఆచార్య! మీరిచ్చిన ఆఙ్ఞని నా తల్లికి యధాతధంగా చెప్పాను. ఆవిడ నాకు ఉదయమే పెద్దగిన్నెడు పెరుగు ఇచ్చింది. తల్లిగా ఆమెకు – బిడ్డకు మంచి ఆహారమేదో, సందర్భానికి తగిన ఆహారం ఏదో తెలుసు. కాబట్టి మారు మాట్లాడక ఆమె పెట్టింది తిని వచ్చాను” అన్నాడు.
చాణక్యుడు తలాడించి, "ఒకరి తర్వాత ఒకరు, మీరు ఇక్కడకు ఏయే వాహనాల మీద వచ్చారో చెప్పండి” అన్నాడు.
రాకుమారులంతా తాము ఏ వాహనాల మీద వచ్చిందీ చెప్పారు. అశోకుడి వంతు వచ్చినప్పుడు అతడు “నేను నడిచి వచ్చాను” అన్నాడు. ఈ సారి రాకుమారులు నవ్వే ధైర్యం చెయ్యలేదు. ఆచార్యుడు, తండ్రి, ఇతర పెద్దల ముఖాల్లోని గాంభీర్యం వాళ్ళని నవ్వే ధైర్యం చెయ్యనివ్వలేదు.
ఆచార్యుడు “ఆశోకా! నీకు నచ్చిన మంచి వాహనం మీద రమ్మని కదా నా ఆఙ్ఞ. మరి నడిచి వచ్చే నిర్ణయం ఎందుకు తీసికొన్నావు?"
అశోకుడు వినయంగా “ఆచార్య! నా దృష్టిలో నా కాళ్ళ కంటే గొప్ప వాహనం నాకు మరొకటి కన్పించలేదు. భగవంతుడు నాకు ఇంత బలమైన మంచి కాళ్ళను ఇవ్వకపోయి ఉంటే నేను రధం, అశ్వం, గజం వంటి ఏ ఇతర వాహనాన్ని ఉపయోగించలేను కదా” అన్నాడు.
ఆచార్యుడు చిరునవ్వు నవ్వాడు. “అశోకా! అందరూ బంగారం, ఇంకా విలువైన ఆసనాలు మీద కూర్చున్నారు. నీవు నేల పై ఎందుకు కూర్చున్నావు?” అన్నాడు.
అశోకుడు “ఆచార్య! నా దృష్టిలో భూమి – బంగారం లాంటి లోహాల కంటే, మణిమాణిక్యాల కంటే విలువైనది. ఎందుకంటే అవన్నీ మనకు భూమి నుండే లభిస్తాయి. భూమి కంటే మరేదీ విలువైనది లేదని నా అభిప్రాయం. అందుకే భూమినే ఆసనంగా చేసుకున్నాను!” అన్నాడు.
ఒక్కసారిగా చప్పట్లతో ఆ ప్రాంగణం మార్మోగింది. అందరూ అశోకుడి సునిశిత అలోచనా సరళినీ, దృక్పధాన్ని మెచ్చుకున్నారు. అశోకుడే బిందుసారుని వారసుడన్నది పరోక్షంగా ముద్రపడిపోయింది. బిందుసారుడు అశోకుడి తల్లీ, తన భార్య ఐన బ్రాహ్మణ రాణిని, కొడుకు నలా పెంచినందుకు ఎంతగానో అభినందించాడు. తానెంతో ఆనందించాడు.
ఇది మన చరిత్ర.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
4 కామెంట్లు:
ఇంతకుముందెప్పుడో చదివిన విషయమే కానీ మరచిపోయాను, గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
కన్నాగారు: నెనర్లండి.
ur storys is very good medam...
thank...u
అజ్ఞాత గారు: నెనర్లండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి