అనగా అనగా.....
ఒకవూరిలో ఓ పెద్ద మోతుబరి కుటుంబం ఉండేది. తరతరాలుగా ఉమ్మడి కుటుంబం. తాతలు తరం, తండ్రుల తరంతో వెరసి అప్పటికి ఆ కుటుంబంలో 30 మంది దాకా పెద్దవాళ్ళు, 50 మంది దాకా పిల్లవాళ్ళు, గొడ్డూ గోదా, పిల్లా మేకా, పాడిపంట!
పెద్దలోగిలిలో అంతా కలిసే ఉంటారు. అత్తలూ, కోడళ్ళూ అంతా సఖ్యంగా, తోబుట్టువులూ, దాయాదులూ సమైక్యంగా పనులు చేసుకుంటూ సుఖంగా ఉండే వాళ్ళూ. పాడీపంట ఎక్కువే, పిల్ల సైన్యమూ ఎక్కువే కావటంతో వాళ్ళ ఇంట్లో ఎలుకల బాధ మెండుగా ఉండేది. దాంతో పదిపన్నెండు పిల్లుల్ని పెంచేవాళ్ళు. రోజూ పిల్లలతో పాటే ఉదయాన్నే పిల్లులకి కూడా పాలబువ్వా, పెరుగన్నమూ పెట్టేవాళ్ళు.
అయితే పండగ రోజున మాత్రం దైవ పూజ అయ్యేదాకా పిల్లలకి కూడా ఏమీ పెట్టరు గదా! అసలే ఆ రోజుల్లో ఆచారాలు గట్టిగా పాంటించే వాళ్ళయ్యె! పిల్లలు పెద్దలకి భయపడో, దేవుడి మీద భక్తితోనో ఓర్చుకొనేవాళ్ళు. కానీ పిల్లులు మాత్రం ఆడవాళ్ళ కాళ్ళకి చుట్టుకుంటూ పనులు చేసుకోనివ్వకుండా ’మియ్యాం’ అంటూ వెంటపడేవి.
దాంతో పూజయ్యే దాకా పిల్లుల్ని గంపక్రింద కప్పెట్టటం చేసేవాళ్ళు. రాను రాను అదో ఆచారం లాగా పండగ రోజు ఉదయాన్నే పిల్లుల్ని గంపక్రింద కప్పెట్టి పూజ పూర్తయ్యాక విడిచిపెట్టటం చేసేవాళ్ళు. దాంతో వాళ్ళది పిల్లిగంపల వంశం అనే సార్ధక నామం ఏర్పడింది.
కాలం గడిచింది. రోజులు మారాయి. ఉమ్మడి కుటుంబం, చిన్న [న్యూక్లియర్] కుటుంబాలయ్యింది. తర్వాతి తరాల్లో ఓ కుటుంబం ముంబాయి అపార్ట్ మెంట్లులో కాపురముంటూ కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేస్తుంది.
కానీ తమ ఆచారం ప్రకారం పండగ నాడు పిల్లుల్ని వెదుక్కొచ్చి, గంపల తెచ్చి కప్పిపెట్టటం అంటే చచ్చే చావయ్యిందిట. గంపలు కొని, పండగలయ్యాక పదిలంగా అటకల మీద ఉంచటం, పిల్లుల్ని వెదకటం – ఓహ్! భీభత్సం! చివరకి తెలిసిన వాళ్ళ ’పెట్’ పిల్లుల్ని అరువు తెచ్చుకోవటం, పిల్లుల్ని పెంచే వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం లాంటి నానా యాతనలూ పడ్డారట.
పిల్లుల్ని పెంచుదామంటే భార్యభర్తలిద్దరు ఉద్యోగం చేసే చోట దాన్ని పదిలంగా పెంచనూ లేరు, పోనీ పెంచుదామన్నా అది ప్రక్క వారి అపార్ట్ మెంట్లో ఏదైనా గల్లంతు చేసిందంటే ఆ’న్యూసెన్సూ’ ’నాన్ సెన్సు’ భరించటం కష్టం.
ఇదంతా చెప్పుకొని సదరు గృహస్తూ నిట్టూర్చాడట.
ఇదీ కథ!
[ఈ పిట్టకథ నేను డి.వి. నరసరాజు గారు ఒక రాజకీయ వ్యాసంలో వ్రాయగా చదివాను]
ఆనాడు అవసరం నుండి ఆచారం పుట్టింది. ఆలోచన లేని ఆచరణ ఈ రోజు ఆచారం పేరిట విచారం పుట్టిస్తోంది. లోపం ఎక్కడుంది? నిశ్చయంగా `అనాలోచన’ లోనే కదా? అనాలోచనకి తర్వాతి పరిణామం మూర్ఖత్వమే.
మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి