అనగా అనగా.....
ఓ అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులూ, పక్షులూ ఉండేవి. అప్పటికి గుడ్లగూబలు కూడా పగలు తిరుగుతూ రాత్రి నిద్రపోయేవి.
ఓరోజు ఆ అడవి దాపులనే ఉన్న ఓగ్రామం నుండి ఓ కుర్రాడు ఉండేలు తీసుకొని అడవికి వచ్చాడు. వాడు బంక మట్టితో చిన్న గోళీకాయలంత ఉండలు చేసి ఉండేలులో బెట్టి పక్షుల్ని కొడుతున్నాడు. ఒకటి రెండు పిట్టలు వాడి బారిన పడ్డాయి. కొమ్మ మీద కూర్చొని దిక్కులు చూస్తున్న గుడ్లగూబకి రెక్కక్రింద ఉండేలు మట్టి ఉండ గుచ్చుకొంది. బాధతో కీచు మంది గుడ్లగూబ.
అంతలో అటువైపు కౄరజంతువులు రావడంతో ఉండేలు కుర్రాడు అక్కణ్ణుండి పారిపోయాడు.
గుడ్లగూబ బాధతో చెట్టుకొమ్మల్లో చతికిలబడింది. గట్టిగా ఏడవడం మొదలెట్టింది. కాకి దాన్ని చూసి మెల్లిగా దగ్గరికొచ్చింది.
"ఏం జరిగింది గూబమామా? ఎందుకు ఏడుస్తున్నావు?" అంది. గుడ్లగూబ ఎక్కిళ్ళుపెడుతూ “ఎవడో కుర్రవెధవ! రాయితో కొట్టాడు అల్లుడూ” అంది.
"అయితే వైద్యుడి దగ్గరికి పోరాదూ?" అంది కాకి సానుభూతిగా.
"వైద్యుడెక్కడున్నాడు?" మూలుగుతూ అడిగింది గుడ్లగూబ.
"కోకిలమ్మ చాలాబాగా వైద్యం చేస్తూంది. కాకపోతే వూరికే చేయదు. మనమే దైనా ప్రత్యుపకారం చెయ్యాలి" అంటూ కాకి వివరించింది.
గుడ్లగూబకి నొప్పి మరీ ఎక్కువై ఇంకా గట్టిగా ఏడుస్తోంది. పాపం! కాకికి దాన్ని చూసి చాలా జాలివేసింది.
గుడ్లగూబ రెక్కకి తన రెక్కలానించి మెల్లిగా దాన్ని కోకిలమ్మ దగ్గరికి తీసికెళ్ళింది.
"ఎవరికి జబ్బూ?" పరిశీలనగా చూస్తు అడిగింది కోకిలమ్మ.
"గూబ మామాకి. ప్రొద్దునే ఎవరో కుర్రకుంక రాయితో కొట్టాట్టా" చెప్పింది కాకి.
కోకిలమ్మ గుడ్లగూబని పరిక్షించింది. రెక్కక్రింద బంకమన్ను రాయి ముద్ద కనబడింది.
"వూ. వైద్యం చేస్తాను. మరి నాపారితోషికం ఎవరిస్తారు?" అంది ముందు జాగ్రత్తగా.
గూబ కుయ్యు మందిగాని “సరే నేనిస్తాను” అనలేదు.
కోకిలమ్మ మళ్ళీ అదే ప్రశ్నవేసింది.
ఈసారి గుడ్లగూబ మరింత గట్టిగా ఏడుపులూ పెడబొబ్బలూ పెట్టింది గానీ, వైద్యం ఖర్చు నేనిస్తాననలేదు.
ఇదంతా చూస్తూన్న కాకి, "ఫీజు దేముంది కోకిలమ్మ? ముందు రోగి ప్రాణం ముఖ్యం కదా? వైద్యం చెయ్యి” అంది ఆదుర్దాగా.
"మరి నా ఫీజు?" సందేహంగా అడిగింది కోకిలమ్మ.
"గూబమామా ఇస్తాడులే. నాదీ పూచీ!” అంది పుచిక్కని కాకి. ఎంతైనా వైద్యం చేయించుకొని ఫీజు ఎగ్గొట్టదులే గుడ్లగూబ అన్న భరోసాతో.
"సరే” అంటూ వైద్యం ప్రారంభించింది కోకిలమ్మ.
గుడ్లగూబని ఆ అడవిలో ఉన్న వేడినీటి బుగ్గ దగ్గరికి తీసికెళ్ళి వేడినీటిలో ఓ ఘడియ సేపు గుడ్లగూబ రెక్కలు తడిసేలా కూర్చోబెట్టింది. వెచ్చని నీటికి మట్టి ఉండ కరిగిపోయింది. గుడ్లగూబకి నొప్పి తగ్గిపోయింది. హుషారుగా పైకి లేచింది గుడ్లగూబ.
"నా ఫీజు?" వెంట బడింది కోకిలమ్మ.
"ఏం ఫీజు? నేనిస్తానన్నానా?" అంది దబాయింపుగా గుడ్లగూబ.
కోకిలమ్మ కాకి నడిగింది.
కాకి “అదేమిటి గూబ మామా! కోకిలమ్మ నీకు వైద్యం చేసింది కదా! మరి ఆఖర్చు ఇవ్వద్దూ” అంది.
"ఎవరు చెయ్యమన్నారు వైద్యం? నేనిస్తానన్నానా ఫీజు?" పెడసరంగా అంది గుడ్లగూబ. మరుక్షణమే అక్కణ్ణుంచి ఎగిరిపోయింది.
"కాకి! అదంతా నాకు తెలీదు. నువ్వు రోగిని నాదగ్గరికి తెచ్చావు. నీది పూచీ అంటేనే నేను వైద్యం చేసాను. కాబట్టి నువ్వే నా ఫీజు కట్టు” అంది కోకిలమ్మ.
"బాగుంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుంది. పోన్లే పాపం ఏడుస్తోందని సాయం వస్తే నేనేందుకు ఫీజు కట్టాలి? నువ్వు నాకు వైద్యం చేసావా ఏమిటి?" కాకి వాదన పెట్టుకొంది.
కాస్సేపటికి తగవు పెద్దదయ్యింది.
పది పక్షులు చుట్టూ చేరాయి. రాజు దగ్గర ఫిర్యాదు చేయటం మేలని అన్ని పక్షులూ సలహా ఇచ్చాయి.
సరేనని కాకి, కోకిలా, నెమలి రాజు ఆస్ధానానికి వెళ్ళివిన్నవించుకొన్నాయి.
పక్షుల రాజు నెమలి గుడ్లగూబని పిలిపించి విచారణ మొదలుపెట్టింది.
కోకిలమ్మ, కాకి వివరంగా అన్ని విషయాలూ చెప్పాయి. నెమలి గుడ్లగూబని సంజాయిషీ అడిగింది.
"రాజా! నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు. నాపాటికి నేను ఏడుస్తూంటే కాకి తీసుకెళ్ళింది. కోకిలమ్మ కి వైద్యం ఖర్చు చెల్లిస్తాననలేదు. కావాలంటే కోకిలమ్మనే అడగండి” అంది గుడ్లగూబ తన వాదనని బలంగావినిపిస్తూ.
కోకిలమ్మ “నిజమే ప్రభూ! అక్కడికీ నేను రెండు మూడు సార్లు నొక్కి అడిగాను. ఈ గుడ్లగూబ కుయ్యిమంది గాని వైద్యంకు కూలీ ఇస్తానన లేదు. కాకే నాదీ పూచి అంది. అందుకే వైద్యం చేసాను” అంది వినయంగా.
కాకి “అవును ప్రభూ! నొప్పితో ఏడుస్తూంటే నేనే గుడ్లగూబ వైద్యడి దగ్గరికి తీసికెళ్ళాను. కోకిలమ్మ కూలీ అడిగినప్పడు నొప్పితో జవాబు చెప్పలేక పోతుందను కొని నాదీ పూచి అన్నాను. ముందు వైద్యం అందితే గుడ్లగూబ ప్రాణం నిలబడుతుంది గదా అన్న తొందరలో అన్నాను. అంతే గాని ఏరు దాటి తెప్ప తగలేసినట్లు వైద్యం చేయించుకొని గుడ్లగూబ మాట మారుస్తూందనూ కోలేదు” అంది ఏడుపు గొంతుతో.
"అసలు నేను మాటే ఇవ్వలేదు ప్రభూ! ఇక మాట మార్చేందుకేముంది?" న్యాయచుక్క[లా పాయింట్] లేవనెత్తింది గుడ్లగూబ.
రాజ్యాంగ సంక్షోభంలో పడిపోయాడు నెమలి రాజు. పక్షి మేధావులతో చట్టసభా సంఘాన్ని [పార్లమెంటరీ సంఘాన్ని] నియమించాడు. వాళ్ళుకొన్నినెలలు అధ్యయనం చేసి రాజుకి నివేదిక ఇచ్చారు.
రాజు తీర్పు ఇచ్చేరోజు పక్షుల సభ కిక్కిరిసి పోయింది. అందరూ రాజు ఏం తీర్పు చెబుతాడా అని ఆత్రంగా ఎదురుచూస్తూన్నారు.
చివరకి నెమలి రాజు తీర్పు చెప్పాడు.
"కోకిలమ్మ, గుడ్లగూబకే వైద్యం చేసినా, కూలీ గురించి గుడ్లగూబతో ఒప్పందం చేసుకోలేదు. ఆ విషయమై ముందే కోకిలమ్మ పక్కా ఒప్పందం ఉంటే సమస్య లేక పోయేది. అయితే కాకి పూచిని నమ్మింది. ఆ విషయం కాకి కూడా ఒప్పకుంది. కాబట్టి కోకిలమ్మకి కాకి వైద్యపు కూలీ ఇచ్చితీరాలి”.
తీర్పు విని గుడ్లగూబ చప్పట్లు చరిచింది.
కోకిలమ్మ “హమ్మయ్య!” అనుకొంది.
పక్షులన్నీ బిత్తరపోయాయి.
కాకి ఘోల్లుమంది.
"మహాప్రభో! నాదగ్గర డబ్బెక్కడిది? ఏదో సాటి పక్షి బాధ పడుతోంది కదా అని సాయం వెళ్ళినందుకు నాకా శిక్ష” అక్రోశంతో అడిగింది కాకి.
"న్యాయశాస్త్ర పరంగా అంతే” అంది చట్టసభాసంఘం. అంగీకారంగా తలవూపింది నెమలి రాజు.
"పేదవాణ్ణి. కనికరించండి బాబోయ్!” ఏడుపులంకించుకొంది కాకి.
"డబ్బులేక పోతే నీ సేవతో బకాయి చెల్లించు” ఇదే తుది తీర్పన్నట్లు నెమలి రాజు సభాచాలించి ఇంటికెళ్ళి పోయింది.
ఆనాటి నుండి కోకిలమ్మ గుడ్లని కాకి పొదిగి, పిల్లల్ని పెంచసాగింది. ఆవిధంగా సేవ చేసి బకాయి తీర్చుకొంటుంది.
కానీ ఈ అన్యాయం చూసి పక్షులకి ఒళ్ళుమండింది. అన్నీ కలిసి గుడ్లగూబ అన్యాయాన్ని, అనైతికతనీ తిట్టి పోసాయి. అది కన్పిస్తే చాలు అసహ్యంతో మొహం తిప్పుకొన్నాయి. శాపనార్దాలు పెట్టాయి. అవమానించాయి.
దానితో గుడ్లగూబకి పక్షుల ముందుకు రావడానికి మొహం చెల్లక పగలు గూట్లోనో, చెట్టు తొర్రల్లోనో దాక్కుని రాత్రిళ్ళు ఆహారం వెదుక్కోవడం మొదలెట్టింది.
ఆనాటి నుండి ఈనాటి వరకూ కోకిల గుడ్లని పొదిగి పిల్లల్ని చేస్తూ కాకులూ, పగలు నిద్రపోయి రాత్రి సంచరిస్తూ గుడ్లగూబలు బ్రతకసాగాయి.
ఇదీ కథ!
మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.
ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
13 సంవత్సరాల క్రితం
0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి