RSS
Wecome to my Blog, enjoy reading :)

ఛత్రపతి శివాజీ సాహసాలు - 2

అనగా అనగా.....

మన చరిత్రలో జరిగిన నిజ సంఘటనలు!

ఓ సారి ఔరంగజేబు ముస్లిం సైనికులు తమ దుర్గం మీదకి దాడికి వస్తున్నారని శివాజీ సేనకి సమాచారం అందింది. తామున్న చోటుకు చేరాలంటే సన్నని లోయలో నుండి ప్రయాణించాలి. శివాజీ సేన, ముస్లిం సైనికులు లోయలో నుండి ప్రయాణిస్తుండగా, సైనికుల మీదికీ, వారి గుర్రాల మీదికి పెద్దపెద్దబండరాళ్ళని కొండ అంచుల నుండి క్రిందికి దొర్లించారనీ ఆ విధంగా వారిని పార దోలారనీ కథనాలున్నాయి.

మరోసారి ఔరంగజేబు మద్దతుదారులైన ఓ సామంత ముస్లింరాజు శివాజీ దుర్గం మీదకి దండయాత్ర కొచ్చాడట. అంత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు శివాజీ దగ్గర చాలినంత ధనమూ లేదు, సైన్యం లేదు, ఆయుధాలు లేవు. ఉన్నది సంకల్పమూ, ధైర్యమూ, మేధస్సులే [లగాన్ సినిమాలో ఇండియన్ టీం లాగా].

ఉన్న పరిమిత వనరులతోనే ప్రతివ్యూహం పన్నారు. రాత్రికి శతృశిబిరం ఎక్కడ విడిది చేస్తుందో అంచనా వేసారు, ఆనుపానులు కనిపెట్టారు. దానికి తగిన దూరంలో కనుచూపులో ఉండేటట్లు తమ విడిది [campaign] నిర్మించారు. గుడారాలు వేసారు. కాగడాలు వెలిగించారు. గస్తీ ఏర్పాట్లు చేశారు.

దూరం నుండి ఇదంతా చూసిన శతృసైనికులకి ఆ చీకట్లో మండుతున్న కాగడాలు. లెక్కకు మిక్కిలి గుడారాలు గుబులు పుట్టించాయి. గెలవగలమన్న ఆశనీ, ధైర్యాన్ని కోల్పోయారు. కాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇలాంటి ప్రయత్నాల్లో శివాజీ, ఆయన అనుచరులూ, ఉన్నది కొద్దిమందే అయినా గుర్రాలు, ఉడుములూ, కోతులూ, పావురాలని కూడా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకున్నారట.

ఈవిధంగా ధనబలాన్ని, అధికార బలాన్ని, కేవలం మనోబలంతో ఎదుర్కొన్న యోధులు మరాఠాలు. ఒకసారి ఔరంగజేబు శివాజీ తండ్రిని బంధించి, చర్చల కంటూ శివాజీని పిలిపించి బంధించాడు. శివాజీ చెరసాల నుండి మాసిన బట్టల మూటలో దాక్కొని చాకలి వాడి సాయంతోనూ, తన అనుచరుల సాయంతోను తప్పించుకున్నాడట.

ఆ సమయంలో ఆ మాసిన బట్టల మూటని చెరసాల కావలి వాళ్ళు గానీ పట్టుకుంటే, శివాజీతో పాటు చాకలి వాడూ మరణాన్ని ఎదుర్కొక తప్పదు. అయినా వాళ్ళు వెనుకడుగు వేయలేదు. తమ ‘కర్తవ్యం’గా, దేన్ని తమంత తాముగా స్వీకరించారో, ఆ సంస్కృతీ పునఃప్రతిష్ఠ పట్ల వారి కున్న నిబద్దత అది! ధర్మ స్ఫూర్తి అది!

మరోసారి కూడా ఔరంగజేబు శివాజీని, ఆయన జ్యేష్ఠపుత్రుడు శంభాజీని నిర్భందించాడు. శివాజీని చంపితే తన రాజ్యంలో పెద్దసంఖ్యలో ఉన్న హిందువుల్లో అసంతృప్తి, తిరుగుబాటూ వస్తుందని భయపడి, సరియైన అదను కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్ని నెలలు గడిచాయి. శివాజీ జబ్బుపడినట్లు నమ్మించాడు. అయన అనుచరులు శివాజీ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ దైవపూజలు నిర్వహించేవారు. ప్రతీరోజూ జైలులోని ఖైదీలకి, కావలి భటులకీ ప్రసాదాలు పంచిపెట్టేవారు.

మొదట్లో జైలు కావలి భటులూ, ఇతర సిబ్బంది ఈ ప్రసాదాలూ, మిఠాయిలు పట్ల జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ముందుగా పరీక్షించాక గానీ పంచి పెట్ట నిచ్చేవాళ్ళు కాదు, తామూ తినే వాళ్ళు కాదు. అయితే మిఠాయిల్లో ఏ మతలబు లేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. నెమ్మదిగా ప్రసాదాలని పరీక్షించటంలో ఓ సాచాటు వచ్చింది. యధాలాపంగా స్వీకరించటం మొదలు పెట్టారు. పరిస్థితి మామూలుగా, శాంతిపూరితంగా ఉంది.

ఓ రోజు ప్రసాదంగా జైలుకు లడ్డూలు పంపబడ్డాయి. అయితే వీటిలో మత్తు పదార్ధం కలపబడింది. లడ్డూలు తిన్న జైలు సిబ్బంది, కావలి భటులూ, ఇతరులూ స్పృహ కోల్పోయారు. తన అనుచరులూ, జైలులో తన అనుకూలురుల సాయంతో శివాజీ, శంభాజీ కూడా జైలు నుండి తప్పించుకోగలిగారు.

[’ఇది కుట్రకాదా’ అని ఎవరైనా వాదిస్తే వారికి సమాధానం చెప్పకుండా ఊరుకోవాల్సిందే. ఎందుకంటే ముస్లిం రాజుల కుట్రల వెనుక నున్న ’ఇన్ ట్యూషన్’కీ, శివాజీ జైలు నుండి తప్పించుకోవాడానికి పన్నిన పధకానికి వెనుక నున్న ’ఇన్ ట్యూషన్’కీ తేడా గమనించని వాళ్ళతో, వాదించి మాత్రం సాధించగల ప్రయోజనం ఏముంది?]

శివాజీ సమాజంలో నీతినీ, ధర్మాన్ని, సంస్కృతినీ తిరిగి స్థాపించడానికి ఎంతో దీక్షతో పోరాడాడు. అదే అయన జీవిత లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొడానికైనా, ప్రాణాలొడ్డానికైనా ఏక్షణమూ వెనుకాడలేదు. తన రాజ్యాన్ని సైతం ప్రజలకు తాను ఆదర్శంగా ఉండేలాగా, ప్రజలు కూడా నీతీ ధర్మాల్ని ఆచరించేలాగా, ఉత్తేజపరుస్తూ పరిపాలించాడు.

మన వీరుడు ఛత్రపతి శివాజీ !

అనగా అనగా.....

మన చరిత్రలో జరిగిన కథ!

ఛత్రపతి శివాజీ ’రాజ’ కుటుంబం నుండి రాలేదు. సాధారణ రాజోద్యోగ కుటుంబం నుండే వచ్చాడు. ఆయన దృఢ సంకల్పం, మంచి చేయాలనే దృక్పధం భగవంతుడి నుండీ, పురాణీతిహాసాల నుండి, ధర్మతత్త్వ చింతన నుండీ ఆయన పొందిన స్ఫూర్తి, ఆయనలోని ఉత్తేజం, ఆయన అనుచరుల్లోకి ప్రవహించి ప్రజ్వరిల్లింది. సమిష్టి కృషి అద్భుతాన్ని ఆవిష్కరించింది.

ఈ ప్రయత్నంలో ఓసారి శివాజీ షెయిస్తఖాన్ ని ఎదుర్కొనాల్సి వచ్చింది. షెయిస్తఖాన్ ఏడడుగుల ఎత్తులో, శరీరక బలంతో, కౄరుడిగానూ, రాక్షసుడిగానూ పేరు పడ్డాడు. ఔరంగజేబు తరుపున శివాజీతో చర్చించడానికి వస్తున్నాడు. అయితే ఇది పైకారణం మాత్రమే. ఆ వంకతో శివాజీని చంపడమే అతడి లక్ష్యం. ఈ విషయం శివాజీకి తన వేగుల ద్వారా ముందే తెలుసు.

శివాజీ ఆ ప్రమాదాన్ని[రిస్క్ ని] ఎదుర్కొనేందుకే నిశ్చయించుకున్నాడు. ఈ సంఘటనని ఎదుర్కొడానికి బయలుదేరేముందు శివాజీ తన అనుచరులందర్నీ జాగరూకుల్ని చేసి, తదుపరి కర్తవ్వాన్ని వివరించాడు. ఒకవేళ షెయిస్తఖాన్ తో పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోయినా, సమాజంలో నీతినీ, విలువల్నీ హిందూ సంస్కృతినీ పునఃప్రతిష్టించే పనిని తాము కొనసాగించాలని ప్రభోదించాడు. అవీ వారి ధైర్యసాహసాలూ, ధృఢ సంకల్పాలు!

ప్రతిపాదిత సమయానికి శివాజీ, షెయిస్తఖాన్ ని కలిసేందుకు బయలుదేరాడు. రహస్యంగా తన చేతి పది వెళ్ళకు పులిగోళ్ళను పోలిన ఇనుపగోళ్ళను తగిలించుకున్నాడు. షెయిస్తఖాన్ విశాలంగా నవ్వుతూ శివాజీని ఆహ్వానించాడు. స్నేహాన్ని వ్యక్తీకరిస్తూ శివాజీని కౌగిలించుకున్నాడు. నిజానికది మృత్యుకౌగిలి; శివాజీకైనా, షెయిస్తఖాన్ కైనా. ఆ కౌగిలింతలోనే శివాజీని పిడిబాకుతో పొడిచి చంపాలని షెయిస్తఖాన్ ప్రయత్నించాడు.

అయితే శివాజీ షెయిస్తఖాన్ కంటే చురుగ్గానూ, వేగంగానూ కదిలాడు. షెయిస్తఖాన్ తనను బాకుతో పొడవబోయే లోగానే తాను అతని వీపుని తన ఇనుపగోళ్ళతో చీల్చివేశాడు. అది చూసి షెయిస్తఖాన్ సైనికులు మ్రాన్పడిపోయాడు. తమ శిబిరంలోకి వచ్చి తమ నాయకుణ్ణి చంపే సాహసాన్ని వాళ్ళు ఊహించలేదు. వారా దిగ్ర్భమ నుండి తేరు కొనే లోగానే శివాజీ సైన్యం వారిపై దాడి చేసింది. అప్పటికే భయభ్రాంతులైన షెయిస్తఖాన్ సైనికులు పలాయనం చిత్తగించారు.

ఆ విధంగా శివాజీ కర్తవ్యం కంటే ప్రాణాలు విలువైనవి కావని నిరూపించాడు. ఎందుకంటే వ్యక్తి జీవితం ఈ ప్రపంచంలో ఎప్పటికీ తాత్కాలికమే. కానీ ధర్మం, విలువలు మాత్రం శాశ్వతం. మనం ఎలా బ్రతికినా, ఏదో ఒక రోజున చావడం ఖాయం. కానీ చావనిది సంస్కృతి, ధర్మమే.

మరో కమ్మని కథ లాంటి విషయం కోసం వేచి చూడండి.

భారతీయ వారసత్వానికి ప్రతీక రాణి పద్మిని !

అనగా అనగా.....

మన చరిత్రలో జరిగిన నిజ సంఘటనలు!

13వ శతాబ్ధంలో మరొక మహ్మదీయుడు అల్లా ఉద్దీన్ ఖీల్జీ భారతదేశంలోని, రాజ పుత్ర రాజ్యం చిత్తోడ్ ఘడ్ మీదకి దండయాత్ర చేశాడు. అప్పటికి చిత్తోడ్ ఘడ్ రాజు రాణా రత్నసింహుడు. ఆయన భార్య రాణి పద్మిని. ఆమె అద్భుత సౌందర్యవతిగానూ, విదుషీమణిగానూ, పేరుగాంచింది. ఆమెను కాంక్షించి అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ ఘడ్ పై అనేక సార్లు దండయాత్ర చేశాడు. కానీ గెలవలేకపోయాడు.

చివరికి ఒక రాయబారి ద్వారా రాణా రత్నసింహుడికి ఒక వర్తమానం పంపించాడు. “రాణి పద్మిని సౌందర్యం గురించి నేను చాలా విని ఉన్నాను. ఆ ప్రఖ్యాతి లోని నిజం తెలుసుకోవాలని, ఒక్కసారి ఆమెను చూడాలని కోరుకున్నాను. ఒక్కసారి ఆమెని చూడగలిగితే, నేను యుద్ధం విరమించి వెనక్కి వెళ్ళిపోతాను” అన్నది ఆ వర్తమాన సారాంశం.

రాజు రాణా రత్నసింహుడు, మంత్రులూ ఆలోచించారు. రాణి పద్మినితో చర్చించారు. చివరికి వారంతా “అల్లా ఉద్ధీన్ ఖిల్జీని మన రాజ్యానికి ఒక స్నేహితుడిగా భావించి విందుకు ఆహ్వానిద్దాం. మన సౌహార్ర్ధాన్ని, స్నేహాన్ని మనం చూపిద్దాం. ఏవిధంగా చూసినా యుద్ధం కంటే శాంతి గొప్పది కదా! రాణి పట్ల అతని దృష్టి నీచమైనది కాదని అతడి వర్తమానం చెబుతోంది. ప్రఖ్యాతి గాంచిన విషయం పట్ల గల కుతుహలమే నంటున్నాడు కాబట్టి రాణి ప్రతిబింబాన్ని అతడికి అద్దంలో చూపుదాం. మన రాణి గారికి సోదర తుల్యుడుగా అతణ్ణి గౌరవిద్దాం” అని తీర్మానించారు.

ఆ విధంగానే అతడికి కబురుపంపారు. అతడీ ఆహ్వానాన్ని అందుకుంటూ తనను తాను రాణీ పద్మినికి సోదర తుల్యుడిగానూ, రాజూకూ, చిత్తోడిఘడ్ ప్రజలకూ మిత్రుడిగానూ ప్రకటించుకున్నాడు. విందు రోజున రాజు రాణారత్నసింహుడు, మంత్రులూ, చిత్తోడ్ ఘడ్ ప్రజలూ అల్లా ఉద్దీన్ ఖీల్జీని విశిష్ట అతిధిగా గౌరవించారు. విందు తర్వాత రాణీ పద్మిని ప్రతిబింబాన్ని అద్దంలో అతిధికి చూపారు. ఆ సౌందర్యం చూచి అతడు అబ్బురపడ్డాడు. తన నైచ్యాన్ని పైకి ప్రదర్శించలేదు. తన అతిధి నటనను కొనసాగిస్తూ రాణా రత్నసింహుని ప్రతి విందుకు ఆహ్వానించాడు. రాజు ఇది అంగీకరించాడు.

తదుపరి రత్నసింహుడు కొద్దిపాటి పరివారంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ విడిదికి విందుకు వెళ్ళాడు. అతిధి మర్యాదని ఊహించారే గానీ కుట్ర అనుకోలేదు. ఎందుకంటే నమ్మకద్రోహం అంతగా భారతీయులకి తెలీదు. అతిధి మర్యాదులకు బదులుగా రత్నసింహుడు దగాని అందుకున్నాడు. రాజును బంధించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ రాణి పద్మినికి తనకు లొంగిపోవలసిందిగా కబురు పంపించాడు.

అల్లా ఉద్దీన్ ఖిల్జీ రత్నసింహుణ్ణి ’అతిధి’ అంటూ ఆహ్వానించాడు. మానవీయ విలువల్ని నమ్మి, రాణా రత్నసింహుడు పరిమిత పరివారంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ విడిదికి వచ్చాడు. కాబట్టే అతడు రత్నసింహుని బంధించగలిగాడు. ఇది కుట్రే కదా! ఇదే పని అల్లా ఉద్దీన్ ఖిల్జీ అతిధిగా చిత్తోడ్ ఘడ్ కు వచ్చినప్పుడు [అప్పుడతనిదీ పరిమిత పరివారమే] రత్నసింహుడు చేసి ఉంటే? అతిధిని ఆదరించాలి, నమ్మించి మోసగించ కూడదు లాంటి నీతుల్ని తలచకుండా అల్లా ఉద్దీన్ ఖిల్జీని బంధించిన, చంపేసినా ఏం చేయగలిగి ఉండేవాడు? కేవలం మానవతా విలువల్నీ, సత్యం పలకడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లాంటి నీతి, ధర్మం పాటించారు గనుక భారతీయ రాజులు అలాంటి కుట్రలు చేయలేదు. నేటికీ పాకిస్తాన్ మన పట్ల అదే విధమైన మోసాలు చేస్తూనే ఉంది.

ఆ విధంగా అల్లా ఉద్దీన్ ఖిల్జీ చేతిలో మోసానికి గురయ్యాక, రాణి పద్మిని, మంత్రులు కలిసి బాగా ఆలోచించి అల్లాఉద్దీన్ ఖిల్జీకి మరునాడు రాణి పద్మిని అతడికి లొంగిపోగలదని కబురు పంపారు.

మరునాడు పల్లకీల ’కాన్వాయ్’ అల్లాఉద్దీన్ ’కాంపైన్’ చేరింది. అల్లాఉద్దీన్ ఖిల్జీ ఆనందానికి అంతులేదు. ప్రఖ్యాతి గాంచిన అపురూప సౌందర్యవతి తన సొత్తు కాబోతోంది. తానామెను అందుకోబోతున్నాడు. ఆ పరవశంతో అతడు రాణీ గారి పల్లకీకి ఎదురు వెళ్ళి స్వాగతించాడు. అయితే అతడు స్వాగతించింది పరిచారికుల వేషంలో ఉన్న సైనికులకి.

రాణి పద్మిని పల్లకీలో సైతం స్త్రీ వేషంలో ఉన్న యోధుడున్నాడు. ’మోసం’ అంటూ గావు కేకలు పెట్టిన అల్లాఉద్దీన్ ఖిల్జీ అనివార్యమైన యుద్దాన్ని ఎదుర్కొన్నాడు. వీరోచితంగా పోరాడిన రాజ పుత్ర వీరులు రాణా రత్నసింహుని విడిపించుకొని పోయారు. దీనితో అల్లా ఉద్దీన్ ఖిల్జీ క్రుద్ద్రుడయ్యాడు. సహజమే కదా! తాను ఎదుటి వాళ్ళను మోసగించగలిగినప్పుడు అది తన తెలివీ లేదా సామర్ధ్యం అనుకొని సంతోషాన్ని గర్వాన్ని పొందినప్పుడు, తాను ఇతరుల చేతిలో మోసపోతే అసహనానికి క్రోధానికి గురవుతారు కదా!

తర్వాతి ప్రయత్నంలో అల్లా ఉద్దీన్ ఖీల్జీ మరింత సైన్య సమీకరణ చేసుకొని మరీ, చిత్తోడ్ ఘడ్ మీదికి దండయాత్ర చేశాడు. కోటని వశపరుచు కొన్నాడు. రాణా రత్నసింహుణ్ణి, ఇతర యోధుల్ని చంపేసాడు. కానీ ఎంతో కాంక్షతో అంతఃపురాల్లోకి ప్రవేశించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీకి కనబడింది అందాల రాశులు కాదు, బూడిద రాశులు. రాణి పద్మినితో సహా రాణివాసపు స్త్రీలందరూ శతృరాజుల అత్యాచారాన్ని తమ శరీరాల మీదా, మనుస్సుల మీదా కూడా నిరోధించటానికి, వారి రాకకు ముందే అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకొన్నారు. ఆవిధంగా నైతికత కాపాడు కోవటానికీ తమ జీవితాల్ని తృణప్రాయంగా, [ గరిక పోచల్ని వదిలినంత తేలికగా] వదిలివేశారు.

అంతేగాని ఆధునిక ప్రగతి సూత్రం “When the rape is unavoidable, enjoy it” అనుకోలేదు. అత్యాచారాల్లాంటి నైచ్యాన్ని భరించటం కంటే మరణం మేలన్నది వారి వివేచన. అలాంటి నైచ్యాన్ని నివారించటానికి వారు ఇతరుల్ని హత్య చేయాటానికైనా వెనుదీయరు, ఆత్మహత్య చేసుకోవాటానికైనా వెనుదీయరు. భారతీయ రక్తంలోనే అంతటి పౌరుషం నైతికత, సత్యం విషయంలో ఉంది.

ఇది నిజంగా జరిగిన సంఘటన. మన చరిత్ర.

పిల్లి గంపల వంశం పిట్టకథ

అనగా అనగా.....

ఒకవూరిలో ఓ పెద్ద మోతుబరి కుటుంబం ఉండేది. తరతరాలుగా ఉమ్మడి కుటుంబం. తాతలు తరం, తండ్రుల తరంతో వెరసి అప్పటికి ఆ కుటుంబంలో 30 మంది దాకా పెద్దవాళ్ళు, 50 మంది దాకా పిల్లవాళ్ళు, గొడ్డూ గోదా, పిల్లా మేకా, పాడిపంట!

పెద్దలోగిలిలో అంతా కలిసే ఉంటారు. అత్తలూ, కోడళ్ళూ అంతా సఖ్యంగా, తోబుట్టువులూ, దాయాదులూ సమైక్యంగా పనులు చేసుకుంటూ సుఖంగా ఉండే వాళ్ళూ. పాడీపంట ఎక్కువే, పిల్ల సైన్యమూ ఎక్కువే కావటంతో వాళ్ళ ఇంట్లో ఎలుకల బాధ మెండుగా ఉండేది. దాంతో పదిపన్నెండు పిల్లుల్ని పెంచేవాళ్ళు. రోజూ పిల్లలతో పాటే ఉదయాన్నే పిల్లులకి కూడా పాలబువ్వా, పెరుగన్నమూ పెట్టేవాళ్ళు.

అయితే పండగ రోజున మాత్రం దైవ పూజ అయ్యేదాకా పిల్లలకి కూడా ఏమీ పెట్టరు గదా! అసలే ఆ రోజుల్లో ఆచారాలు గట్టిగా పాంటించే వాళ్ళయ్యె! పిల్లలు పెద్దలకి భయపడో, దేవుడి మీద భక్తితోనో ఓర్చుకొనేవాళ్ళు. కానీ పిల్లులు మాత్రం ఆడవాళ్ళ కాళ్ళకి చుట్టుకుంటూ పనులు చేసుకోనివ్వకుండా ’మియ్యాం’ అంటూ వెంటపడేవి.

దాంతో పూజయ్యే దాకా పిల్లుల్ని గంపక్రింద కప్పెట్టటం చేసేవాళ్ళు. రాను రాను అదో ఆచారం లాగా పండగ రోజు ఉదయాన్నే పిల్లుల్ని గంపక్రింద కప్పెట్టి పూజ పూర్తయ్యాక విడిచిపెట్టటం చేసేవాళ్ళు. దాంతో వాళ్ళది పిల్లిగంపల వంశం అనే సార్ధక నామం ఏర్పడింది.

కాలం గడిచింది. రోజులు మారాయి. ఉమ్మడి కుటుంబం, చిన్న [న్యూక్లియర్] కుటుంబాలయ్యింది. తర్వాతి తరాల్లో ఓ కుటుంబం ముంబాయి అపార్ట్ మెంట్లులో కాపురముంటూ కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేస్తుంది.

కానీ తమ ఆచారం ప్రకారం పండగ నాడు పిల్లుల్ని వెదుక్కొచ్చి, గంపల తెచ్చి కప్పిపెట్టటం అంటే చచ్చే చావయ్యిందిట. గంపలు కొని, పండగలయ్యాక పదిలంగా అటకల మీద ఉంచటం, పిల్లుల్ని వెదకటం – ఓహ్! భీభత్సం! చివరకి తెలిసిన వాళ్ళ ’పెట్’ పిల్లుల్ని అరువు తెచ్చుకోవటం, పిల్లుల్ని పెంచే వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం లాంటి నానా యాతనలూ పడ్డారట.

పిల్లుల్ని పెంచుదామంటే భార్యభర్తలిద్దరు ఉద్యోగం చేసే చోట దాన్ని పదిలంగా పెంచనూ లేరు, పోనీ పెంచుదామన్నా అది ప్రక్క వారి అపార్ట్ మెంట్లో ఏదైనా గల్లంతు చేసిందంటే ఆ’న్యూసెన్సూ’ ’నాన్ సెన్సు’ భరించటం కష్టం.

ఇదంతా చెప్పుకొని సదరు గృహస్తూ నిట్టూర్చాడట.
ఇదీ కథ!
[ఈ పిట్టకథ నేను డి.వి. నరసరాజు గారు ఒక రాజకీయ వ్యాసంలో వ్రాయగా చదివాను]

ఆనాడు అవసరం నుండి ఆచారం పుట్టింది. ఆలోచన లేని ఆచరణ ఈ రోజు ఆచారం పేరిట విచారం పుట్టిస్తోంది. లోపం ఎక్కడుంది? నిశ్చయంగా `అనాలోచన’ లోనే కదా? అనాలోచనకి తర్వాతి పరిణామం మూర్ఖత్వమే.

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

సింహాలు మీరు

అనగా అనగా.....

నిండు గర్భిణి అయిన ఒక సింహాం, ఆహారం కోసం తిరుగుతూ, ఒక గొర్రెలమందను చూచి, దాన్లోకి దుమికింది. కానీ ఆ శ్రమకు ఓర్వజాలక, ఈని, అది వెంటనే మరణించింది. దాని బిడ్డ, గొర్రెల పోషణ క్రిందనే పెరిగి, వాటితోపాటు గడ్డిమేస్తూ, వాటిలాగానే గొర్రె అరపు అరుస్తూండినది. పెద్దదైన తర్వాత కూడ, తాను ‘గొర్రె’ అనే దాని తలపు.

మరొక సింహాం ఒకనాడు, ఆ ప్రాంతానికి ఆహారార్ధం వచ్చి, ఆ మందలో సింహాం ఉండడం, గొర్రెలలాగా అదీ పారిపోవడమూ చూసి అశ్చర్యపోయింది. దాని దగ్గరకు వెళ్లి, అది గొర్రెకాదనీ, సింహామనీ తెలుపడానికి ప్రయత్నించింది కాని, అది అందకుండా పారిపోసాగింది.

సమయం కోసం వేచి ఉండి, ఒకరోజు ఆ ‘గొర్రె – సింహం’ నిద్రిస్తూండగా, దగ్గరకు వెళ్ళి, “నువ్వు సింహనివి” అని దానికి చెప్పింది. “కాదు, నేను గొర్రెనే” అంటూ అది గొర్రెఅరుపు అరిచింది. అంతట ఈ సింహం దాన్ని ఒక చెరువు దగ్గరికి లాక్కునిపోయి, తమ ఉభయుల ప్రతిబింబాల్ని చెరువు నీటిలో చూపిస్తూ, "బాగా చూడు, నువ్వు ఎవరివో యిప్పటికైనా తెలుసుకో” అన్నది సింహం.

అంతట, ఆ ‘గొర్రె – సింహం’ నీళ్లలో కనిపించే తన ప్రతిబింబాన్ని, ఆ సింహాన్ని పోల్చిచూసుకొన్నది. క్షణమాత్రంలో తాను సింహామనే సత్యం దానికి స్ఫురించింది. వెంటనే దాని గొర్రె అరుపు మాయమై, సింహగర్జనం వెలువడింది.

మనం అపరిశుద్ధులం అని ఎన్నడూ అనకండి. పరిశుద్దులమనే అనండి. మనం స్వల్పులమనీ, జన్మిస్తామనీ, మరణిస్తామనీ గాఢభ్రాంతిని ఒక దాన్ని కల్పించుకొని ఉన్నాం. అందువల్ల మనల్ని ఎప్పుడూ అకారణ భీతి వెన్నాడుతోంది. సింహాలు మీరు! నిత్యం పరిశుద్ధం, పరిపూర్ణం అయిన అత్మయే మీరు. విశ్వశక్తి మీలో అణగి ఉంది.

’మిత్రమా! ఏడుస్తున్నా వెందుకు? నీకు జననమరణాలు లేవు, వ్యాధి దుఃఖాలు లేవు. అనంతమైన అకాశం వంటివాడివి నువ్వు. రంగు రంగుల మబ్బులు దాని నావరించి, ఒక క్షణ మాత్రం క్రీడించి మాయమౌతూ ఉంటవి. కానీ, అకాశ మెప్పుడూ, నిత్యవినీల కాంతిమయమే. దుర్జనత్వం మనకేల కనిపిస్తోంది?’

నేను ఆత్మను. విశ్వంలో ఏదీ నన్ను చంపలేదు’అని మానవుడికి వ్యక్తపరిచే ధైర్యాన్ని అలవరుచుకోండి. అప్పుడు మీరు ముక్తులవుతారు.

[వివేకానంద చెప్పిన కథలు నుండి దీనిని తీసుకొన్నాను.]

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

బిందుసారుడి వారసుడెవరు?

అనగా అనగా.....

ఒకసారి ’బిందుసారుడి వారసుడెవరు?’ అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.

బిందుసారుడు రాజగురువు, చాణక్యుడి సలహా కోసం ఆశ్రయించాడు. అప్పటికే శతాధిక వృద్ధుడైన ఆచార్యుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయమంతా సావధానంగా విన్నాక ఆయన “నాయనా! రేపు ఉదయమే నీ పుత్రులందర్నీ దేవీ అలయానికి రమ్మని ఆఙ్ఞాపించు. వచ్చేముందు బలవర్థకమైన ఆహారాన్ని భుజించి, మంచి వాహనాన్ని అధిరోహించి రమ్మని చెప్పు. దేవాలయంలో కూర్చునేటందుకు విలువైన ఆసనాన్ని వెంట తెచ్చుకొమ్మని చెప్పు” అన్నాడు.

బిందుసారుడలాగే తన కుమారులందరికీ ఆఙ్ఞాపించాడు. మహారాజు, మంత్రులూ, విషయం తెలిసిన ఇతర ప్రజలూ – అందరూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృత చెందారు.

నిర్ధేశింపబడిన సమయానికి రాకుమారులంతా దేవాలయం చేరారు. తమ ఆసనాలనీ వెంట తెచ్చుకున్నారు. ఒకరు బంగారు కుర్చీని తెచ్చుకున్నారు. ఒకరు దారుశిల్పంతో నిండిన ఆసనాన్ని తెచ్చుకొన్నారు. పట్టువస్త్రాలతోనూ, పరుపులతోనూ అలంకరించి ఆసనాన్ని మరోకరూ, ముత్యాలూ, రతనాలూ పొదగబడిన పీటను ఇంకొకరు తెచ్చుకున్నారు. ఒకొక్కరూ ఒకో వాహనం పైన వచ్చారు. ఒక రాకుమారుడు పల్లకిలో వచ్చాడు. ఒకరు గుర్రమీద, ఒకరు ఏనుగు అంబారీ పైనా, మరొకరు రధంలోనూ .... ఇలా ఎవరికి మంచిదనిపించిన వాహనం మీద వారు వచ్చారు.

దేవాలయ ప్రాంగణంలో మహారాజు, మంత్రులు, ఆచార్యుడు అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చోన్నారు. వారికి ఎదురుగా రాకుమారులంతా తమ తమ వెంట తెచ్చుకున్న ఆసనాలపై కూర్చొన్నారు. వారిలో అశోకుడు ఒక్కడే కటిక నేలపై కూర్చొని ఉన్నాడు. అది చూసి ఇతర రాకుమారుల ముఖమ్మీద ముసిముసినవ్వు కదలాడింది. అందులో హేళన మిళితమై ఉంది. దాసీ పుత్రుడికి అంతకంటే ఏం ఉంటుందన్న ఎగతాళి ఉంది.

ఆచార్యుడు అడిగాడు “మీరంతా ఒకరి తర్వాత ఒకరు, ఇక్కడికి వచ్చేముందు ఏ ఆహారం స్వీకరించారో చెప్పండి”.

రాకుమారులంతా తామేం తినివచ్చారో ఒకింత గర్వంగా చెప్పారు. అశోకుడి వంతు వచ్చింది. స్థిరమైన గొంతుతో అశోకుడు “గిన్నెడు పెరుగు” అన్నాడు. రాకుమారులంతా ఫక్కున నవ్వారు.

ఆచార్యుడు “బలవర్థమైన ఆహారం స్వీకరించి రమ్మని నీకిచ్చిన ఆఙ్ఞ. మరి పెరుగెందుకు తిన్నావు?" అని అడిగాడు.అశోకుడు తడబాటు పడకుండా “ఆచార్య! మీరిచ్చిన ఆఙ్ఞని నా తల్లికి యధాతధంగా చెప్పాను. ఆవిడ నాకు ఉదయమే పెద్దగిన్నెడు పెరుగు ఇచ్చింది. తల్లిగా ఆమెకు – బిడ్డకు మంచి ఆహారమేదో, సందర్భానికి తగిన ఆహారం ఏదో తెలుసు. కాబట్టి మారు మాట్లాడక ఆమె పెట్టింది తిని వచ్చాను” అన్నాడు.

చాణక్యుడు తలాడించి, "ఒకరి తర్వాత ఒకరు, మీరు ఇక్కడకు ఏయే వాహనాల మీద వచ్చారో చెప్పండి” అన్నాడు.

రాకుమారులంతా తాము ఏ వాహనాల మీద వచ్చిందీ చెప్పారు. అశోకుడి వంతు వచ్చినప్పుడు అతడు “నేను నడిచి వచ్చాను” అన్నాడు. ఈ సారి రాకుమారులు నవ్వే ధైర్యం చెయ్యలేదు. ఆచార్యుడు, తండ్రి, ఇతర పెద్దల ముఖాల్లోని గాంభీర్యం వాళ్ళని నవ్వే ధైర్యం చెయ్యనివ్వలేదు.

ఆచార్యుడు “ఆశోకా! నీకు నచ్చిన మంచి వాహనం మీద రమ్మని కదా నా ఆఙ్ఞ. మరి నడిచి వచ్చే నిర్ణయం ఎందుకు తీసికొన్నావు?"

అశోకుడు వినయంగా “ఆచార్య! నా దృష్టిలో నా కాళ్ళ కంటే గొప్ప వాహనం నాకు మరొకటి కన్పించలేదు. భగవంతుడు నాకు ఇంత బలమైన మంచి కాళ్ళను ఇవ్వకపోయి ఉంటే నేను రధం, అశ్వం, గజం వంటి ఏ ఇతర వాహనాన్ని ఉపయోగించలేను కదా” అన్నాడు.

ఆచార్యుడు చిరునవ్వు నవ్వాడు. “అశోకా! అందరూ బంగారం, ఇంకా విలువైన ఆసనాలు మీద కూర్చున్నారు. నీవు నేల పై ఎందుకు కూర్చున్నావు?” అన్నాడు.

అశోకుడు “ఆచార్య! నా దృష్టిలో భూమి – బంగారం లాంటి లోహాల కంటే, మణిమాణిక్యాల కంటే విలువైనది. ఎందుకంటే అవన్నీ మనకు భూమి నుండే లభిస్తాయి. భూమి కంటే మరేదీ విలువైనది లేదని నా అభిప్రాయం. అందుకే భూమినే ఆసనంగా చేసుకున్నాను!” అన్నాడు.

ఒక్కసారిగా చప్పట్లతో ఆ ప్రాంగణం మార్మోగింది. అందరూ అశోకుడి సునిశిత అలోచనా సరళినీ, దృక్పధాన్ని మెచ్చుకున్నారు. అశోకుడే బిందుసారుని వారసుడన్నది పరోక్షంగా ముద్రపడిపోయింది. బిందుసారుడు అశోకుడి తల్లీ, తన భార్య ఐన బ్రాహ్మణ రాణిని, కొడుకు నలా పెంచినందుకు ఎంతగానో అభినందించాడు. తానెంతో ఆనందించాడు.

ఇది మన చరిత్ర.

అధికారం Vs బుర్ర

అనగా అనగా.....

అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే దేశం.


ఆ దేశాన్ని తైమూర్ పాలిస్తుండేవాడు. ఇతడు పేరుకే రాజుగానీ, పరమ పిసినారి, స్వార్ధపరుడూను. అతడికి ఈర్ష్యాసూయలు కూడా ఎక్కువే.

ఎప్పుడూ నసీరుద్దీన్ నుండి సలహాలు తీసుకొంటాడే గానీ ఏనాడు మంచి పారితోషికం ఇవ్వడు.

నసీరుద్దీన్ తనకి ఒక గుర్రం కావాలని తైమూర్ ని అర్ధించాడు. పిసినారి తైమూర్ కి నసీరుద్దీన్ కి గుర్రాన్నివ్వడం ఇష్టంలేదు. ఇవ్వక తప్పేట్లు లేదు.

దాంతో ఓ ముసలి చచ్చు గుర్రాన్ని నసీరుద్దీన్ కిచ్చాడు.

ఇలా ఉండగా ఓ రోజు.....

తైమూర్ తన పరివారంతో కలిసి వేటకి బయలుదేరాడు. నసీరుద్దీన్ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు.
అందరూ గోబీ ఎడారి చేరారు.

ఇంతలో గాలి, దుమ్ము రేగాయి. మేఘాలు కమ్ముకొచ్చాయి. అంతలోనే ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలయ్యింది.

తైమూర్, అతని సైనికులు ఎక్కిన గుర్రాలు బలంగా ఉన్నాయి. ఆ గుర్రాలు మీద వాళ్ళంతా ఒక్క ఉదుటున దౌడు తీయిస్తూ వెనక్కి ఊళ్ళోకి మళ్ళారు. అయినా గానీ ఊరు చేరే లోగా తడిసి ముద్దయ్యారు. నసీరుద్దీన్ గుర్రం ముసలిది, ఒక్కచిక్కినది అయిన చచ్చు గుర్రంమయ్యే.


గాలి మొదలవ్వగానే అది అడుగు తీసి అడుగు వెయ్యకుండా, ఉన్న చోటునే బిర్ర బిగిసినట్లు నిలబడి పోయింది. ఎంత అదిలించినా కదల్లేదు, మెదల్లేదు. చేసేది లేక నసీరుద్దీన్ గుర్రం దిగాడు. వర్షం మొదలయ్యేలోగా బట్టలు విప్పి ఆ గుర్రం క్రింద దాచాడు. ఎడారిలో తడుస్తూ అలాగే నిలబడ్డాడు.

వర్షం తగ్గాక ఒళ్ళార్చుకొని, గుర్రం క్రింద దాచిన దుస్తులు తొడుక్కొని గుర్రమెక్కి ఊళ్ళోకి వచ్చాడు.

కొంచెమైనా తడవకుండా, పొడి దుస్తులతో వచ్చిన నసీరుద్దీన్ ని చూచి తైమూర్ ఆశ్చర్యపోయాడు.

"అదేమిటయ్యా నసీరుద్దీన్. ఎంత వేగంగా వచ్చినా మేం ముద్దగా తడిసిపోయాము. నువ్వెలా తడవకుండా వచ్చావు? ఎక్కడున్నావు ఇప్పటి దాకా?" కుతుహలంగా అడిగాడు తైమూర్.

"అహా..హా! ఏం చెప్పను హూజూర్! అద్బుతం. అమోఘం.” ఇంకా పరవశంలోనే ఉన్నట్లు నటిస్తూ మైమరుపుగా అన్నాడు నసీరుద్దీన్.

తైమూర్ కుతుహలం మరింత పెరిగిపోయింది.

"ఏమిటి అద్భుతం? త్వరగా చెప్పవయ్యా!” అంటూ తొందర పెట్టాడు తైమూర్.

"హూజూర్! ముందుగా నేను మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి” అన్నాడు నసీరుద్దీన్.

"ఎందుకు?" ఆత్రంగా అడిగాడు తైమూర్.

"ఇంత అద్భుతమైన గుర్రాన్ని నాకు ఇచ్చినందుకు హూజూర్!” మరింత వినయంగా అన్నాడు నసీరుద్దీన్.
అయోమయంగా చూశాడు తైమూర్.

"నన్ను వివరంగా చెప్పనివ్వండి హూజూర్! గాలీ వానా మొదలవ్వగానే మీరంతా వేగంగా ఊరి వైపు దౌడు తీశారా? సరిగ్గా అప్పడే నేనూ నా గుర్రాన్ని అదిలించాను. అప్పుడు జరిగింది అద్భుతం! మీరిచ్చిన గుర్రం సామాన్యమైనది కాదు హూజూర్! అది ఆకాశంలో ఎగర గలదు. వాన మొదలు కాగానే అది నన్ను మబ్బుల్లోకి తీసికెళ్ళింది. ఎంత పైకంటే అప్పుడు కురుస్తోన్న మేఘం కంటే పైకి. ఆ మేఘల్లోని నందనవనం లాంటి తోటకి తీసికెళ్ళింది. అక్కడ ఎంత బాగుందనుకొన్నారు హూజూర్! పరిమళాలు వెదజల్లే పూలు, మధురమైన ఫలాలు, పక్షులు కిలకిలా రావాలు. అక్కడ ఎంచక్కా విహరించాను. తిరిగి రావాలనే అనిపించలేదు. కానీ మీరు నాగురించి వాకబు చేసి, నేనేమయ్యానో అని కంగారు పడతారని వచ్చేసాను” భావాన్ని అభినయీస్తూ, దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించాడు నసీరుద్దీన్.

తైమూర్ కి మతిపోయింది.

అంత అద్భుతమైన గుర్రాన్ని తేరగా నసీరుద్దీన్ కి ఇచ్చేసినందుకు ఏడుపొచ్చింది. ఎలాగైనా ఆ గుర్రాన్ని తిరిగి పొందాలని “నసీరుద్దీన్. నీకిచ్చిన గుర్రం ముసలిది. ఆకాశంలో ఎగర గలదేమో గానీ, మామూలు సమయాల్లో వేగంగా పరిగెత్తలేదు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. నీకు మరో మంచి గుర్రం ఇస్తాను” అన్నాడు.

నసీరుద్దీన్ నసుగుతూ “హూజూర్! ఇచ్చిన వస్తువు తిరిగి తీసికొన్నారనీ చెడ్డపేరు మీకు వస్తుందేమో! నా మూలంగా మీకు చెడ్డపేరు రావడం నాకిష్టం లేదు” అన్నాడు.

నసీరుద్దీన్ ని బ్రతిమాలి బామాలి, ఎదురు డబ్బిచ్చి, మరో మంచి గుర్రాన్నిచ్చి నసీరుద్దీన్ దగ్గరున్న ముసలి చచ్చు గుర్రాన్ని తిరిగి కొనుక్కున్నాడు తైమూర్.

మర్నాడు వాళ్ళు మళ్ళీ వేటకి వెళ్ళారు. గోబీ ఎడారి లోకి ప్రవేశించగానే, ముందు రోజులాగే ఆ రోజూ గాలీ వానా వచ్చాయి.
మంచి బలమైన గుర్రం ఎక్కిన నసీరుద్దీన్ ఆఘామేఘాల మీద ఊళ్ళోకి దౌడాయించాడు.

తైమూర్ ఎక్కిన ముసలి చచ్చూ గుర్రం, గాలీ వానా మొదలవ్వగానే శిలా విగ్రహం లాగా నిలబడిపోయింది. తైమూర్ దాన్ని కొరడాతో కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. బండతిట్లు తిట్టాడు. తన్నాడు. ఉహూ! ఏం చేసినా ఆ ముసలి గుర్రం అడుగు తీసి అడుగు వేయ్యలేదు. వర్షంలో ముద్దగా తడిసిపోయాడు తైమూర్.

ఆ తడిసిన దుస్తులతోనే వర్షం తగ్గాక ఊళ్ళోకి తిరిగి వచ్చాడు. దాంతో బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది.

ఆ రాత్రి నీరసంగా పక్కమీదకి వాలుతున్నప్పుడు అర్ధమయ్యింది తైమూర్ కి.......

తను, ముసలి గుర్రాన్నిచ్చినందుకే నసీరుద్దీన్ తనకి గుణపాఠం నేర్పాడని. అంతే!

కన్నంలో తేలు కుట్టిన దొంగలా కిక్కురమన కుండా ఉండిపోయాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

గీతా ప్రియకు జన్మదిన శుభాకాంక్షలు!

అనగా అనగా....

పదిహేనేళ్ళ క్రితం
సరిగ్గా ఈ రోజు
నవ్వులన్నీ తెచ్చి కుప్పబోసినట్లుగా
వారసత్వానికీ వారధిగా
దేవుడు మాకు పంపిన గొప్పకానుక!

మా పాప ఫణి గీతా ప్రియదర్శిని!!

మా పాపకి జన్మదిన శుభాకాంక్షలతో....

అమ్మ మనస్సు

అనగా అనగా .....

ఓ ఊరిలోని బ్రాహ్మణ వాడలో సరస్వతమ్మ అనే వితంతువు ఉండేది. ఆమెకు ఒకే ఒక్క కుమారుడు కాశీనాధుడు. కొడుకు పసివాడుగా ఉండగానే భర్తను పోగొట్టుకున్న సరస్వతమ్మ కాశీనాధుణ్ణి ఎంతో ప్రేమగా, అతిగారాబంగా పెంచింది.


కట్టడి చేసేందుకు తండ్రి లేని కారణంగానూ, తల్లి అతిగారాబంతోనూ కాశీనాధుడు ఎదిగే కొద్దీ బాధ్యత లేకుండానూ, వ్యసనపరుడు గానూ తయారయ్యాడు. మొదట్లో జూదమూ, మద్యమూ మరిగిన కాశీనాధుడు క్రమంగా వేశ్యాలోలుడయ్యాడు.


సరస్వతమ్మ కాశీనాధుణ్ణి సన్మార్గంలో పెట్టడానికి ఎన్నోప్రయత్నాలు చేసింది. కాశీనాధుడిలో మార్పులేదు సరికదా ఆస్తి హారతి కర్పూరంలా కరగబెట్టి వేశ్యలకు ఖర్చుపెట్టసాగాడు. ఊరిలోని పెద్దవాళ్ళూ, బంధువులూ మందలించబోతే నోటి దురుసుతో నానా మాటలూ అన్నాడు. వ్యవహారం చెయ్యి దాటిపోయింది. ఆ దిగులుతో సరస్వతమ్మ కృంగిపోసాగింది.


దాంతో ఊరిజనం మెరకవీధి మీనాక్షిని తిట్టిపోయసాగారు. ఎందుకంటే ఆవిడే మరి కాశీనాధుణ్ణి వినోదింపజేస్తున్న వేశ్య. దానితో మీనాక్షికి సరస్వతమ్మ అంటే గొంతుదాకా కోపం, ద్యేషం నిండిపోయాయి.


మరింత కసిగా, వేగంగా కాశీనాధుడి ఆస్తి అవగొట్టేసింది. ఓ రోజు ఎంతో నయగారంగా కాశీనాధుణ్ణి మాయ చేసి అతడి స్వంత ఇల్లు కూడా వ్రాయించేసుకొంది. సరస్వతమ్మ చేసేది లేక పూరింటిలోకి మారి ఇల్లు మీనాక్షికి స్వాధీనం చేసింది. అయినా కసి తీరని మీనాక్షి ఓ రోజు కాశీనాధుణ్ణి అతడి తల్లి గుండె తెచ్చివ్వమని కోరింది.


ఉఛ్ఛనీచాలు మరిచిన ఈ కామాంధుడు తల్లి దగ్గరికి వెళ్ళి తనకి ఆవిడ గుండె కావాలని అడిగాడు. అప్పటికే జీవితేచ్ఛ నశించిన సరస్వతమ్మ కన్నీరు నిండిన కళ్ళతో “తీసికెళ్ళునాయనా” అంటూ కత్తితో గుండెలు చీల్చుకొని మరణించింది.


తల్లిగుండెని దోసిట్లో పెట్టుకొని వేగంగా వీధిలోకి వచ్చిన కాశీనాధుడు పరుగు పరుగున నడుస్తూ మీనాక్షి ఇంటిదారి పట్టాడు. ఆ వేగంలో అతడి కాలు రాయికి కొట్టుకొని తూలి పడబోయాడు. మరుక్షణం అతడి చేతిల్లోని తల్లి గుండె “జాగ్రత్త నాయనా! పడతావు” అంది. అదీ తల్లి హృదయం!


అప్పటికి కళ్ళకి కప్పిన కామపు పొరలు తొలిగిన కాశీనాధుడు సత్యం గ్రహించి, తన కామక్రోధాల్ని వదిలి భక్తి మార్గాన్ని ముక్తి దారిని పట్టాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes