RSS
Wecome to my Blog, enjoy reading :)

మృత సంజీవని – కొత్త సమాధానం ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 46]

విక్రమాదిత్యుడు మరోసారి భేతాళుడున్న శవాన్ని బంధించాడు. దాన్ని భుజాన పెట్టుకుని మౌనంగా బృహదారుణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడు పదిహేనవ కథ ప్రారంభించాడు.

“ఓ విక్రమాదిత్య మహారాజా! నీ పట్టుదల అనితర సాధ్యమైనది. నేనో కథ చెబుతాను. మార్గాయాసం మరిచి విను” అంటూ కథ కొనసాగించాడు.

ఒకానొకప్పుడు బ్రహ్మపురమనే బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. అందులో విష్ణు స్వామి అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడికి సంతతి లేదు. అందుచేత అతడెంతో దిగులు పడ్డాడు. ఎన్నో నోములూ, పూజలూ చేసాడు. చివరికి మహాశివుడి గురించి తీవ్ర తపమాచరించాడు. శివుడి దయతో, కొంత కాలానికి అతడికి సంతాన భాగ్యం కలిగింది. వరుసగా నలుగురు పుత్రులుదయించారు.

అతడువారినెంతో అల్లారుముద్దుగా పెంచి, తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పాడు. మరిన్ని విద్యలు నేర్పాలన్న అభిలాషతో, కుమారులు నలుగురూ దేశాటనం బయలు దేరారు. అలా నానా దేశాలూ తిరుగుతూ, చివరికి ఓ యోగిని ఆశ్రయించారు.

ఆ యోగి సకల విద్యా పారంగతుడు. మంత్ర తంత్ర విద్యలని సైతం ఎఱిగిన వాడు. బ్రాహ్మణ కుమారులు. అతణ్ణి శ్రద్ధా భక్తులతో సేవించారు. వారి శుశ్రూషలకు మెచ్చిన యోగి, వారికి వారి అభిరుచుని బట్టి మంత్ర తంత్ర విద్యలు నేర్పాడు. తర్కమీమాంసాలు మీద గానీ, వేద విద్య మీద గానీ, వారికి ఆసక్తి లేకపోయింది.

దాంతో మృత సంజీవని సహా ఎన్నో అపూర్వమైన మంత్ర విద్యలు గురువు దగ్గర నేర్చుకున్నారు. ఓ శుభ దినాన, యోగి వాళ్ళ నలుగురికీ ‘విద్యాభ్యాసం పూర్తయ్యిందనీ ఇక ఇళ్ళకి వెళ్ళవచ్చనీ’ ఆనతిచ్చాడు.

కుర్రాళ్ళు నలుగురూ ఎంతో ఆనందంతో గురువుకి నమస్కరించి, స్వగ్రామానికి పయన మయ్యారు. దారిలో నదీ నదాలు, కొండలూ లోయలూ, అరణ్యాలూ జనపదాలూ దాటుతూ, తమ విద్యా ప్రదర్శనతో ప్రజలని అబ్బుర పరుస్తూ ప్రయాణించసాగారు.

మార్గమధ్యంలో వారొక అడవిలో నుండి ప్రయాణించాల్సి వచ్చింది. అప్పటికే తమ విద్యా ప్రదర్శనలకి ప్రజలు పలికిన జేజేలతో వాళ్ళల్లో అహం తలకెక్కి ఉంది. స్కోత్కర్షతో భుజాలు పొంగి ఉన్నాయి. ఆత్మస్తుతి శృతి మించింది. తమని తామే ప్రశంసించుకుంటూ ప్రయాణిస్తున్నారు.

అంతలో, బాట ప్రక్కనే ఓ పులి చచ్చిపడి ఉంది. శరీరం కుళ్ళి కంపు కూడా మాసిపోయింది. చీమలు తినగా శిధిలమై, మిగిలిన శరీరావశేషాలున్నాయి. నలుగురు అన్నదమ్ములూ దాన్ని చూశారు. తలకెక్కిన అహంకారానికి ఇంగిత జ్ఞానం అడుగంటింది. చచ్చిన పులిని బ్రతికించి, కుక్కలా తమ వెంట బెట్టుకు వెళ్ళితే, జనం భయంతో, ఆశ్చర్యంతో మూర్ఛబోతారనిపించింది. ఆ ఊహే వాళ్ళకి మత్తు గొల్పింది.

మొదటి వాడు మంత్రాలు జపిస్తూ పులి కళేబరంలో మిగిలిన ఎముకలు పోగు చేసి నీటిని మంత్రించి చల్లాడు. వెంటనే పులి అస్థిపంజరం తయారయ్యింది.

రెండవ వాడు మంత్రం జపిస్తూ, దానికి రక్తమాంసాలు ప్రసాదించాడు. మూడవ వాడు మంత్రాలు జపించి దానికి చర్మమూ, గుండె వంటి ముఖ్యమైన అవయవాలనూ సృష్టించాడు.

నాలుగవ వాడు మంత్రం జపించి దానికి ప్రాణం పోసాడు. అప్పటికే మిగిలిన ముగ్గురూ చప్పట్లు చరుస్తూ పులి ప్రాణం పోసుకోవడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

నాలుగవ వాడి మంత్రోచ్ఛాటనతో పునర్జీవించిన పులి, తనకు ప్రాణదాతలైన తమ ఎదురుగా, వినయంగా నిలబడుతుందన్న ఊహతో, వొళ్ళు తెలియకుండా నిలబడి ఉన్న నలుగురినీ చూచి, పులి ఒక్కమారుగా గాండ్రించింది.

ఆకలితో నకనకలాడుతున్న పులి కంటికి నిండుగా ఆహారం కనబడింది. అది తమపై దాడి చేస్తోందన్న విషయం నలుగురు అన్నదమ్ములకీ అర్ధమయ్యేలోపునే, పులి నలుగురినీ చీల్చి పారేసింది. కడుపు నిండా తిన్నంత తిని, దాని దారిన అదిపోయింది.

ఇదీ కథ!

ఓ విక్రమార్క మహారాజా! నలుగురు బ్రాహ్మణ యువకులూ మృత్యువాత పడిన ఈ సంఘటనలో, ఈ బ్రహ్మహత్యా పాపం ఎవరికి చెందుతుంది?” అని అడిగాడు.

విక్రమాదిత్యుడు గొంతు సవరించుకుని “భేతాళుడా! నలుగురూ… విద్యాగర్వంతో, వినయాన్ని మరిచి విర్రవీగారు. అయితే మొదటి ముగ్గురి కారణంగా పులి శరీరాన్ని పొందిందే గానీ, చైతన్యాన్ని పొందలేదు. కాబట్టి ప్రాణహాని దాకా పరిస్థితి రాలేదు.

కనీసం చివరి వాడన్నా మంత్రప్రయోగం చేయటం ఆపి ఉంటే నలుగురు బ్రాహ్మణ యువకులూ బ్రతికి ఉండేవాళ్ళు. కాబట్టి మొదటి ముగ్గురి మృతి కారణంగా బ్రహ్మహత్యా దోషమూ, చివరి వాడి ఆత్మహత్యా పాపమూ కూడా, నాలుగో సోదరుడికే చెందుతాయి” అన్నాడు.

మరోసారి మౌనం భంగమైంది. భేతాళుడు అదృశ్యుడయ్యాడు.

కథా విశ్లేషణ: ఇది పంచతంత్రంలో కూడా ఉన్న కథ. చాలా చోట్ల విన్న కథ, చదివిన కథ. చివరికి పిల్లల పాఠాల్లో కూడా ఉన్న కథ! అయితే అంతగా ఆలోచించని సమాధానం ఈ కథలో ఉంటుంది.

పులి బ్రతకడానికి, అందరూ చావడానికీ నలుగురూ కారణమే అయినా… చివరి వాడి బాధ్యతే ఎక్కువ కాబట్టి, బ్రహ్మహత్యా పాపం అతడికే చుట్టుకుంటుందంటాడు విక్రమాదిత్యుడు.

చాలాసార్లు మనం ఇలాంతి స్థితిని గమనిస్తుంటాం. తలా కొంచెం అందరూ పాలుపంచుకున్న పని, చివరి క్షణంలో ఎవరి చేతుల్లో విఫలమయ్యిందో, వాళ్ళని బాధ్యుల్ని చేస్తున్నప్పుడు, “అతడొక్కణ్ణే అనడం దేనికి? అందరూ తలో చెయ్యివేసారు?” అంటుంటారు. దాంతో శిక్ష తీవ్రత పలుచనై పోతుంది.

నిజానికి చెడుకర్మల్లో… ఎవరి చేతుల్లో చివరి వైఫల్యం వచ్చిందో వాళ్ళని బాధ్యుల్ని చేస్తే…ఎవరికి వాళ్ళకే ఆ భయం ఉంటుంది. ఉదాహరణకి చేతులు మారుతున్న బాంబు ఎవరి చేతుల్లో పేలితే, వాళ్ళ ప్రాణాలు గాల్లో కలవటం తధ్యం అనే స్థితిలో… ఎవరికి వాళ్ళూ ఎంతో అప్రమత్నంగా ఉంటారో… ఇదీ అంతే!

అప్పుడు ఎవరికి వాళ్ళూ చెడు కర్మకి వెనుతీస్తారు కదా!

ఆ నీతినే ఈ కథ చెబుతుంది!

ప్రియురాలు, ప్రియుడు, భర్త – ఎవరు గొప్ప? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 45]

విక్రమాదిత్యుడు తన ప్రయత్నం మాన లేదు. మోదుగ చెట్టెక్కి భేతాళుడిని దించి నడక ప్రారంభించాడు. భేతాళుడూ తన ప్రయత్నమాపలేదు. మరో కథ ప్రారంభించాడు.

“ఓ విక్రమాదిత్యా భూపాలా! విను” అంటూ కొనసాగించాడు.

అలకాపురి అనే నగరంలో ఒక వైశ్యశ్రేష్ఠుడు ఉండేవాడు. అతడి పేరు ఈశ్వర శెట్టి. అతడికి ఒక కుమార్తె ఉంది. పేరు రమ్యవల్లి. ఆమె పేరుకు తగ్గట్లే రమ్యమైన పూలతీగ వలె ఉండేది. ఆమె యుక్త వయస్సులో ఉంది.

వారి నివాసానికి దగ్గరలోని బ్రాహ్మణ అగ్రహారంలో నివసించే సందీపుడనే బ్రాహ్మణ యువకుడు ఆమెని ప్రేమించాడు. రమ్యవల్లికీ అతడంటే అనురాగమే ఉండటం వలన వారిద్దరూ ప్రతీ రోజూ ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళు. పరస్పర సాన్నిహిత్యాన్ని ఆనందించే వాళ్ళు.

ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు అలకా పురి కి ప్రక్కనున్న నగరం నుండి ఓ వైశ్య యువకుడు, రంగనాధ శెట్టి అనేవాడు వచ్చి ఈశ్వర శెట్టిని కలుసుకున్నాడు. తనని తాను పరిచయం చేసుకొని పిల్లనివ్వమని అడిగాడు.

ఈశ్వర శెట్టి కి రంగనాధ శెట్టి కులగోత్రాలూ, రూపురేఖలూ, అర్హతలు నచ్చటంతో రమ్యవల్లినిచ్చి వివాహం చెయ్యడానికి అంగీకరించాడు. ముహుర్తం నిర్ణయించి, బంధుమిత్రులందర్నీ ఆహ్వానించి వైభవంగా పెళ్ళి జరిపించాడు.

ఇటు రమ్యవల్లి గానీ, అటు సందీపుడు గానీ తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పలేదు. పెళ్ళి వైభవోపేతంగా జరిగిపోయింది. రంగనాధ శెట్టి భార్యని వెంటబెట్టుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు. రమ్యవల్లి ప్రియుడైన సందీపుణ్ణి విడిచి వెళ్తున్నందుకు విపరీతంగా దుఃఖ పడింది.

అత్తగారిల్లు చేరినా, ప్రియుని వియోగ దుఃఖంతో కృంగి కృశించ సాగింది. కొన్ని రోజులకి ఆ వ్యధతో మరణించింది. ఆ వార్త విని సందీపుడు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చాడు. అన్నపానీయాలు నిద్రా విశ్రాంతులు మానివేసి, మనోవేదనతో మంచం పట్టాడు. కొద్ది రోజులకి అతడూ మరణించాడు.

రమ్యవల్లి మరణించడంతో ‘మనసు పడి వివాహం చేసుకున్న భార్య చనిపోయిందే’ – అన్న విచారంతో రమ్యవల్లి భర్త రంగనాధ శెట్టి కూడా దిగులు చెంది జబ్బున పడి మరణించాడు.

“ఓ విక్రమాదిత్య రాజేంద్రా! రమ్యవల్లి, ఆమె ప్రియుడు సందీపుడు, ఆమె భర్త రంగనాధ శెట్టి – ఈ ముగ్గురూ వ్యధ చెంది మరణించారు కదా! వీరిలో ఎవరు గొప్ప? వివరించి చెప్పు” అన్నాడు భేతాళుడు.

విక్రమాదిత్యుడు కొంత గంభీరంగా “ఓ భేతాళా! విను! రమ్యవల్లి, ఆమె ప్రియుడు సందీపుడూ… కొంతకాలం పరస్పర ప్రేమనీ, సాన్నిహిత్యాన్నీ అనుభవించారు. అందుచేత ఆ వియోగ దుఃఖాన్ని భరించలేక మనోవ్యధ చెంది మరణించారు. అయితే రమ్యవల్లి భర్త రంగనాధ శెట్టి అమాయకుడు. ముచ్చటపడి వివాహం చేసుకున్న భార్య మీద మమకారంతో, ఆమె మరణ దుఃఖాన్ని సహించలేక, బాధతో తాను మరణించాడు. కాబట్టి రంగనాధ శెట్టి గొప్పవాడు” అన్నాడు.

భేతాళుడు అంగీకార సూచకంగా తలాడించి “మౌనభంగమైంది మహారాజా! సెలవు” అంటూ మాయమై మోదుగ చెట్టు ఎక్కేసాడు.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes