RSS
Wecome to my Blog, enjoy reading :)

రాజు – సేవకుడు – ధర్మనిరతి ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 34]

విక్రమాదిత్యుడు విసుగు చెందకుండా మరోసారి మోదుగ వృక్షమెక్కి, భేతాళుండిన శవాన్ని దించి, భుజాన వేసుకొని, జ్ఞానశీలుడి కిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు బృహదారణ్యం కేసి నడవసాగాడు.

భేతాళుడూ విసుగు చెందకుండా మరో కథ ప్రారంభించాడు. "విక్రమాదిత్య మహారాజా! ఇది ఏడవ కథ" అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు శరభేశ్వరం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు సుగ్రీవుడు. అతడు మంచివాడు, సమర్ధుడు. రాజధాని నగరమైన శరభపురంలో వీరవర్ధనుడు అనే బ్రహ్మణుడుండేవాడు. అతడు వేద విద్యలతో పాటు క్షాత్రవిద్యలూ నేర్చిన వాడు. గొప్ప యోధుడు కూడా!

ఒక రోజు వీర వర్ధనుడు, రాజు సుగ్రీవుడి సభకు పోయి, తన అర్హతకు తగిన కొలువు అడిగాడు. సుగ్రీవుడు అతడి ముఖ వర్చస్సూ, మాటతీరూ, వినయ శీలాలకు ముచ్చటపడి, తన ఆంతరంగిక రక్షక సిబ్బందిలో ఒకరిగా నియమించాడు. నెలకు వెయ్యి బంగారు నాణాల జీతమూ నిర్ణయించాడు.

వీరవర్ధనుడు తన జీతాన్ని నాలుగు భాగాలుగా చేసాడు. ఒక భాగం, అంటే రెండువందల యాభై బంగారు నాణాలతో భగవంతుడిపై భక్తితో గుడులకూ, పూజలకూ వెచ్చించే వాడు. మరో భాగం కవి పండితులకూ, ఆశ్రితులకు వెచ్చించేవాడు. మరో భాగంతో పేదసాదలకు దాన ధర్మాలు చేసేవాడు. నాలుగో భాగంలో కుటుంబాన్ని పోషించే వాడు. అతడి ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఉండేవాళ్ళు.

ఇలా రోజులు గడుస్తుండగా, ఒక రోజు... వీరవర్ధనుడు విధి నిర్వహణలో ఉన్నాడు. అది రాత్రి సమయం. అతడు రాజు సుగ్రీవుడి అంతఃపుర రక్షణలో ఉన్నాడు. ఆ సమయంలో జడివాన ప్రారంభమైనది. ఈదురు గాలి... ఉరుములు... మెరుపులు! కుంభవృష్టి కురుస్తోంది.

క్షణాల్లో పరిస్థితి ప్రళయ భీకరంగా మారింది. పెనువృక్షాలు కూడా చిగురు టాకుల్లా ఊగిపోతున్నాయి. ఇంతలో నగరం వెలుపలి నుండి బిగ్గరగా ఏదో ధ్వని వినిపించింది. అది హృదయవిదారకంగా ఉంది. సుగ్రీవుడు "ఏమిటా శబ్ధం? ఎవరైనా వెళ్ళి అదేమిటో తెలుసుకుని రాగలరా?" అని అడిగాడు.

అతడి అంగరక్షకులలో అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. వీర వర్ధనుడు మాత్రం స్థిరమైన కంఠంతో "చిత్తం మహారాజా! నేనందుకు సిధ్దంగా ఉన్నాను" అన్నాడు. సుగ్రీవుడు సరే చూచి రమ్మన్నాడు.

వీరవర్ధనుడు తన ఆయుధాలను తీసుకుని తక్షణమే బయలు దేరాడు. రాజు సుగ్రీవుడికీ కుతుహలంగా ఉంది. దాంతో అతడు వీరవర్ధనుడి వెనకే అతణ్ణి అనుసరించ సాగాడు. వీరవర్ధనుడిదేమీ గమనించలేదు.

అతడు నేరుగా నగర ద్వారం చేరాడు. చుట్టూ పరిశీలిస్తూ ద్వారం దాటి నగరం బయటికి వచ్చాడు. అక్కడ ఓ స్త్రీ కూర్చుని బిగ్గరగా రోదిస్తోంది.

అతడామెని "అమ్మా! ఎవరు నీవు? నీ పేరేమిటి? నీ నివాసమేది? ఎందుకిలా దుఃఖిస్తున్నావు?" అనడిగాడు.

ఆమె అతడివైపు పరిశీలనగా చూస్తూ "ఓ బ్రాహ్మణోత్తమా! నేనీ నగర దేవత శరభేశ్వరిని. ఈ రాజ్యాధీశుడు సుగ్రీవుడి మరణం ఇక మూడు రోజులలో సంభవించనున్నది. అతడు సమర్ధుడూ, పిన్న వయస్కుడు. అతడి మరణానంతరం, ఈ రాజ్యమేమి కానున్నదో? అది తలచుకు దుఃఖిస్తున్నాను" అంది.

వీరవర్ధనుడు "అమ్మా! నీవీ నగర ప్రజలందరికీ తల్లివి. ఈ రాజ్యమాతవు. ఈ ప్రమాదం నుండి మహరాజుని కాపాడగల మార్గమేదీ లేదా? తల్లీ! దయతో చెప్పగలవు" అని ప్రార్ధించాడు.

శరభేశ్వరి "నాయనా! ప్రమాదాన్ని నివారించగల వ్యక్తి ఉంటే, దానికొక మార్గముంది" అంది. వీరవర్ధనుడు "తల్లీ! సెలవివ్వు! నీవు ఆశీర్వదిస్తే దాన్ని నేను నెరవేర్చగలను. నీవు నన్ను దీవిస్తే అసాధ్యమే ఉండదు. అందుచేత దయ ఉంచి తల్లీ, నాకా మార్గం ఉపదేశించు" అన్నాడు.

శరభేశ్వరి "వీర వర్ధనా! మహరాజు దీర్ఘాయువు కలిగి ఉండాలంటే, శరభపురంలో నివసించే 16 ఏళ్ళ బాలుడిని దుర్గామాతకి బలిగా ఇవ్వాలి. దుర్గా దేవి కోవెల ఈ సమీపంలోనే ఉంది. రాజు ప్రాణాలు కాపాడాలంటే ఇదొక్కటే మార్గం" అంది.

వీరవర్ధనుడు "తల్లీ! ఆ ప్రకారమే చేసేదగాక!" అన్నాడు. వెనుదిరిగి ఇంటికి పోయాడు. అతడికి 16 ఏళ్ళ పుత్రుడున్నాడు. అతడు కుటుంబ సభ్యులకు రాజుకు రానున్న మరణం గురించి, దేశానికి వాటిల్లే ప్రమాదం గురించీ చెప్పాడు. "దాన్ని నివారించటం మన బాధ్యత!" అన్నాడు. అందరూ అతడి మాటని సమర్ధించారు.

అతడు తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని దుర్గామాత గుడికి వెళ్ళాడు. అక్కడ పూజాదికాలన్నీ భక్తి శ్రద్ధలతో చేశాడు. భార్యా బిడ్డలు దేవికి నమస్కరిస్తుండగా, తన 16 ఏళ్ళ పుత్రుడి తలనరికి బలిపీఠంపై ఉంచాడు.

క్షణంలో జరిగిన ఆ సంఘటనకి అతడి భార్య, మిగిలిన పిల్లలు విభ్రాంతి పడి చూడసాగారు. వీరవర్ధనుడేమీ మాట్లాడలేదు. అతడి భార్యాబిడ్డలు ఒక్కసారిగా పెను దుఃఖానికి గురయ్యారు. తలా మొండెం విడిపడి ఉన్నపిల్లవాణ్ణి చూసి, గుండె చెదిరి ఒక్కమ్మడిగా అందరూ ప్రాణాలు విడిచారు. వీరవర్ధనుడు ఏకధారగా శోకించాడు.

దుర్గామాత వైపు తిరిగి "తల్లీ! ఈ దేశపు పౌరులుగా, దేశాన్ని కాపాడుకోవటం మా ధర్మం. రాజుకు అంగరక్షకుడిగా ఆయన ప్రాణాలు కాపాడటం నాకు సేవాధర్మం. అయితే భార్యాబిడ్డలనూ, తల్లిదండ్రులనూ కోల్పోయి, ఒంటి బ్రతుకు నేను ఈడ్చజాలను. నా ప్రాణాలూ తీసుకో!" అంటూ దేవి ముందు తన తల నరుక్కున్నాడు.

రాజు సుగ్రీవుడిదంతా మాటున నిలబడి చూస్తూనే ఉన్నాడు. అతడికి చాలా బాధ కలిగింది. తన కోసం, దేశం కోసం, ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోవటం చూసి పరితాపం చెందాడు. దుర్గాదేవి సన్నిధి చేరి "ఓ తల్లీ! ఇదే నా తల తీసుకో!" అంటూ ఖడ్గమెత్తి కంఠం నరుక్కోబోయాడు.

తక్షణమే మెరుపు మెరిసినట్లు, అతడి కళ్ళ ముందు దుర్గాదేవి ప్రత్యక్షమైంది. అమె రాజుని దీర్ఘాయువుగా దీవించి, వీరవర్ధనుడి కుటుంబాన్నంతటినీ పునర్జీవితులని చేసింది. వాళ్ళు తనని గమనించే లోగానే, రాజు సుగ్రీవుడు అక్కడి నుండి తప్పుకున్నాడు. ఏమీ తెలియనట్లుగా నగరానికి తిరిగి వచ్చాడు. కుటుంబంతో సహా వీరవర్ధనుడు దుర్గామాతకు మొక్కుకుని ఇంటికి తిరిగి వచ్చాడు.

మర్నాటి ఉదయం, రాజు సభలో "వీర వర్ధనా! రాత్రి నీవు నగర బాహ్యం నుండి వస్తున్న ధ్వని ఏమిటో తెలుసుకునేందుకు వెళ్ళావు కదా? దాని గురించి ఏం తెలుసుకున్నావు?" అనడిగాడు.

వీరవర్ధనుడి "మహారాజా! నేనక్కడికి వెళ్ళేసరికి ఓ స్త్రీ అక్కడ రోదిస్తూ ఉంది. నేనెంత అడిగినా ఆమె జవాబివ్వలేదు. అంతే! ఇంత కంటే ఏమీ లేదు" అన్నాడు.

వీరవర్ధునుడి దేశభక్తికీ, ప్రభుభక్తి కీ, నిజాయితీకీ సుగ్రీవుడెంత గానో సంతోషించాడు. నిష్కామపూరితమైన అతడి విధి నిర్వహణ, త్యాగశీలత చూసి ముగ్ధుడయ్యాడు.

సభికుల వైపు తిరిగి "నా ప్రియమైన సభాసదులారా! ఈ వీర వర్ధనుడు నా ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలని, తన కుటుంబ సభ్యుల ప్రాణాలని త్యాగం చేసాడు. అలాగయ్యీ, కనీసం నా మెప్పుకోసం కూడా, జరిగింది చెప్పాలనుకోలేదు. నిజంగా ఇతడు ఉత్తముడు" అంటూ... రాత్రి జరిగిందంటా వివరించాడు.

వీరవర్ధనుణ్ణి ఎంతగానో కొనియాడి, సత్కరించాడు. సభికులంతా కూడా వీరవర్ధనుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు.

భేతాళుడు ఈ కథ చెప్పి "విక్రమాదిత్య రాజేంద్రా! ఇదీ కథ! ఈ కథలో వీరవర్ధనుడు, రాజు సుగ్రీవుడు... ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు?" అని ప్రశ్నించాడు.

విక్రమాదిత్యుడు "నిశ్చయంగా రాజు సుగ్రీవుడు! ఎందుకంటే - వీర వర్ధనుడు రాజుకు అంగరక్షకుడు. రాజు ప్రాణాలను తన సర్వస్వం ధారపోసి అయినా కాపాడవలసిన విద్యుక్త ధర్మం కలవాడు. అతడూ అతడి కుటుంబమూ అందుకోసమే పోషించబడుతోంది. దేశరక్షణకు ప్రాణాలు అర్పించటం ప్రజల ధర్మం. అయితే, రాజు సుగ్రీవుడు తన ప్రజలలో ఒకరైన వీరవర్దనుడి కుటుంబ సభ్యుల మృతికి కలత చెంది, తన ప్రాణాలు త్యాగం చేసేందుకు సిద్దపడ్డాడు. అందుచేత నిశ్చయంగా రాజు సుగ్రీవుడు గొప్పవాడు" అన్నాడు.

అంతే! గలగలా నవ్వుతూ భేతాళుడు విక్రమాదిత్యుడు భుజమ్మీద నుండి మోదుగ వృక్షం మీదికి ఎగిరిపోయాడు. విక్రమాదిత్యుడు చిరునవ్వు చిందిస్తూ భుజాలెగరేసాడు.

వెనుతిరిగి మోదుగ చెట్టు వైపు అడుగులేసాడు.

~~~~~~

ఆడువారిని నమ్మరాదా !? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 33]

లాలస, నేరుగా పడక గదిలోకి జొరపడింది. మంచం మీద భర్త ఆదమరచి నిదుర బోతున్నాడు. లాలస, ఏం చెయ్యాలా అని కాస్సేపు ఆలోచించింది. భర్త చేతి సంచిలోంచి ఓ పోక చెక్కని తీసి సగానికి కత్తిరించింది. పోక చెక్కకీ, కత్తికీ రక్తం పూసింది.

అంతే! పెద్ద పెట్టున మొర్రోమని మొత్తుకుంది. ఆమె గావుకేకలకి భర్త వరకీర్తి ఉలిక్కిపడి లేచాడు. ఆమె చావుకేకలకి తల్లీదండ్రీ, సేవకులూ పరుగెత్తుకు వచ్చారు. లాలస ఏడుస్తూ "నా భర్త నా ముక్కు కోసాడు" అంది.

కోపంతో ఊగిపోయిన గిరి వర్ధనుడు అల్లుణ్ణి బంధించి, రాజ భటులకి ఫిర్యాదు చేసాడు. మర్నాటి ఉదయం రాజభటులు వాళ్ళందరినీ రాజు ఎదుట హాజరు పరిచారు. రాజు ధర్మకేసరి, వరకీర్తిని "నీ భార్య ముక్కు నెందుకు కోసావు?" అని ప్రశ్నించాడు.

అతడు ఘోల్లుమంటూ "మహారాజా! నాకేమీ తెలియదు. ఆమె కేకలకి నేను నిద్రలో నుండి లేచాను. అప్పటికే ఆమె రక్తసిక్తమైన నాసికతో ఏడుస్తూ ఉంది. అంతకు మించి నాకేదీ తెలియదు" అన్నాడు.

రాజు లాలసని వివరమడిగాడు. ఆమె వినయంగా "ఓ మహారాజా. నేనింత వరకూ ఎవరికీ ఏ కీడూ చేయని దానను. నా భర్తకు సైతం ఏ అపచారమూ చేయలేదు. అలాంటప్పుడు నా భర్తపై ఊరికే నిందనెందుకు వేస్తాను?" అంది తార్కికంగా.

అదే సమయంలో నగర గస్తీ భటులు రాజుకు దైనందిన నివేదిక యిస్తూ "మహారాజా! రాత్రి నగరంలో గస్తీ తిరుగుతూ, నగర వీధులలో కాపలా కాస్తున్నాము. అప్పుడు ఈ వైశ్య వ్యాపారి ఇంటి వెనుక, ఎవరో దాగి ఉన్నట్లని పించింది. దొంగేమోనని సందేహించి హెచ్చరించాము. ఎందుకైనా మంచిదని బాణప్రయోగం చేసాము. ఏ చప్పుడూ రానందున, ఎవరూ లేరనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాము" అని చెప్పారు.

రాజు ధర్మకేసరి, సైనికులని పిలిచి, వైశ్యుడి ఇంటి వెనుక వెదకి రమ్మని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ పాటించి భటులక్కడ వెదికి, తోటలో పడి ఉన్న బ్రాహ్మణ యువకుడి శవాన్ని రాజ సభకి తెచ్చారు. శవాన్ని పరీక్షించగా, బిగుసుకు పోయిన దాని నోటిలో, లాలస ముక్కు కొన ఉంది, ముక్కు పుడకతో సహా!

ఇంకేముంది? లాలస సాక్ష్యంతో సహా తిరుగులేకుండా దొరికిపోయింది. విచారణలో, శవం వైశ్య వ్యాపారి గిరివర్ధనుడి ఇంటి సమీపంలో నివసించే బ్రాహ్మణ యువకుడిదని తేలింది. లాలసకి అతడితో వివాహేతర సంబంధం ఉందని వెల్లడయ్యింది.

రాజు ధర్మసేనుడు అన్ని కోణాల్లో విషయ విచారణ చేసాడు. లాలస దాసి కూడా, ఆమె రహస్య ప్రణయ సంబంధాన్ని ధృవీకరించింది.

ధర్మకేసరి "ఓ వైశ్య యువతీ, లాలస! నిజం చెప్పు!" అని గద్దించి అడిగేసరికి ఆమె భయంతో గడగడ వణుకుతూ తప్పు ఒప్పుకుంది. రాజు లాలసకి శిరశ్చేదం శిక్షగా విధించాడు. వరకీర్తిని విడుదల చేసాడు.

ఈ కథంతా చెప్పిన మగ చిలుక, యువరాణి రత్నావళి వైపూ, యువరాజు పరాక్రమ కేసరి వైపూ పరిశీలనగా చూస్తూ "ఓ నూతన దంపతులారా! ఇప్పుడు చెప్పండి, లాలస ఎంత ధూర్తురాలో!? అందుకే నేను, ఆడవారిని నమ్మరాదని చెప్పాను" అన్నది.

యువరాణీ యువరాజులిద్దరూ, రెండు చిలకల వాదనలని పూర్వపక్షం చేస్తూ, సరైన వాదన వినిపించారు. అందులోని నిజాన్ని అంగీకరించిన చిలుకలు రెండూ, సంతోషంగా, ప్రేమలో పడ్డాయి. వాటి ఒద్దిక చూసి, కొత్త జంట కూడా మురిసిపోయింది.

భేతాళుడు కథ పూర్తి చేస్తూ "ఓ విక్రమాదిత్య మహారాజా! ఇదీ కథ! చిలకలని ఒప్పించేందుకు... యువరాణి యువరాజులు ఏ వాదన చెప్పి ఉంటారో చెప్పగలవా?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు "భేతాళా! నా అభిప్రాయంలో వారి వాదన ఇలా ఉండి ఉండాలి.

స్త్రీ పురుషు లింగ భేదాన్ని బట్టి గానీ, పేద ధనిక వర్గ భేదాన్ని బట్టి గానీ... మనుషుల్లోని మంచీ చెడూ, నీతీ అవినీతి ఉండవు. అది వ్యక్తుల సహజ స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బట్టి, వారి మంచీ చెడూ ప్రవర్తన ఉంటుంది. తర్కకేసరి, అలంకారి ల విషయంలో, తర్కకేసరి భార్యని మోసగించాడు, హత మార్చాడు. అమాయకమైన పిల్ల గనక, అలంకారి... భర్త చేతిలో మోసపోయింది.

లాలస, వరకీర్తి విషయంలో లాలస చెడ్డదే కాదు, కౄరత్వం గలది. ఆమె దుష్ట బుద్ధి కారణంగా, అక్కడికి రప్పించబడ్డ బ్రాహ్మణ యువకుడు, విధివశాత్తూ, ప్రాణాలు కోల్పోయాడు. అయినా ఏమాత్రం భయమూ, పాపభీతి, పశ్చాత్తాపం లేకుండా, లాలస... స్వీయరక్షణ కోసం, భర్త పైకి నేరం తోసి, అతడి ప్రాణాలకు ఎసరు పెట్టింది.

ఏం జరిగిందో తెలిసి ఉండీ, జరిగిన వాటిపై స్పష్టత ఉండీ కూడా, లాలస, భర్త ప్రాణాలకి ప్రమాదం తెచ్చిపెట్టే ప్రయత్నం చేసింది. తక్షణం చేసిన ఆలోచన కూడా కాదది. ఆమె ఆలోచించి వేసిన ప్రణాళిక!

తర్కకేసరి, తన భార్య అలంకారిని... తనని నమ్మనందుకూ, తనతో రానన్నందుకూ... కోపాద్రిక్తుడై, ఒళ్ళు తెలియని ఆవేశంలో, ఆ క్షణమే భార్యని కొట్టి చంపాడు. అదే లాలస అయితే, తన అవినీతి ప్రవర్తనని కప్పిపుచ్చుకునేందుకు, పధకం ఆలోచించి, భర్తని చంపించేందుకు కుట్ర పన్నింది. కాబట్టి - ఆమె మరింత చెడు నడత కలిగిందనాలి.

మంచి చెడు లింగభేదాన్ని బట్టి ఉండక పోయినా, సహజంగా స్త్రీలు దయతోనూ, ప్రేమార్ధ్ర హృదయంతోనూ ఉంటారు. సహనంగా బిడ్డని కడుపున మోసి, జన్మనిచ్చి, ఓర్పుతో పెంచే ప్రాకృతిక ప్రేమ కారణంగానేమో... స్త్రీలు, సహజంగా ఎక్కువ మంచితనంతో ఉంటారు. అలాగయ్యీ లాలస, లాలసత్వం కొద్దీ, ఇంతకి తెగించింది. గనుక నిశ్చయంగా ఆమె శిరశ్చేదానికి అర్హురాలు.

అంతే తప్ప, స్త్రీ పురుష భేదాన్ని బట్టి, మనుషులను నమ్మరానంత ప్రమాదం ఏమీ లేదు" అని చెప్పిఉంటారు" అన్నాడు.

భేతాళుడు ఆ సమాధానం విని సంతృప్తి పడ్డాడు. అయితే నిశ్శబ్దం భంగమైందిగా! అందుకే చటుక్కున మాయమై మోదుగ చెట్టెక్కేసాడు.

తప్పు చేయబోతే ముక్కు యిరుక్కుంది![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 32]

అలంకారికి భర్త భయం అర్ధమైంది. ఆమె అతణ్ని ఆపి "నీవు భయపడనవసరం లేదు. జరిగిందేమీ నేను నా తల్లిదండ్రులకి చెప్పలేదు. ఏనాటికైనా నీవు మనస్సు మార్చుకొని వస్తావని ఎదురు చూస్తున్నాను. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని నీవు ఇంటికి వచ్చావు. నాకదే సంతోషం! జరిగింది మరిచిపోయి ఇకనైనా హాయిగా ఉందాం" అంటూ తను తల్లిదండ్రులకి ఏమని చెప్పిందో అంతా వివరించింది.

దాంతో తర్కకేసరి ‘బ్రతుకు జీవుడా!’ అనుకున్నాడు. అలంకారి "రా! నా తల్లిదండ్రులు నీకోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు" అంటూ లోపలికి తీస్కెళ్ళింది. నిషాదశెట్టి దంపతులు అల్లుణ్ణి చూసి ఆనందంగా ఆదరించారు. జరిగింది మరిచిపొమ్మని ఓదార్చారు. ఇకనైనా దొంగలు తమ అల్లుడని క్షేమంగా విడిచిపెట్టారనుకొని, దేవుడికి మొక్కులు తీర్చుకున్నారు.

ఎప్పటిలాగే వ్యాపారాన్ని అప్ప చెప్పారు. మళ్ళీ రోజులు హాయిగా గడవసాగాయి. దాంతో మళ్ళీ తర్కకేసరికి వేశ్యా సంపర్కం కోసం కాళ్ళూ చేతులూ లాగసాగాయి. ఈసారి భార్యని ప్రాధేయపడ్డాడు. క్రిందటి సారిలా చెయ్యననీ, తనతో అభయసత్యానికి రమ్మనీ అడిగాడు. అలంకారి ఒప్పుకోలేదు. అతడి మీద ఆమెకి నమ్మకం కుదరలేదు.

దాంతో తర్కకేసరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన నెంతో ప్రేమించే భార్యని, తన తప్పు కడుపులో పెట్టుకు కాపాడిన భార్యని తల మీద మోది చంపేసాడు. ఆమె ఒంటి మీది నగానట్రా ఒలుచుకుని పారిపోయాడు.

కాబట్టే మగవారిని నమ్మరాదన్నాను" అంది ఆడ చిలుక ఆయాసంతో ఒగరుస్తూ!

అప్పటి వరకూ కథ చెబుతూ ఆడ చిలుక ఆయాసంతో ఒగరిస్తే, అది చెప్పిన కథ విని ఆవేశంతో ఒగర్చింది మగ చిలుక!

పరాక్రమ కేసరి, రత్నావళి, ఇదంతా విని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రత్నావళి మగ చిలుకతో "నీవెందుకు ఆడువారిని నమ్మరాదన్నావు?" అనడిగింది.

మగచిలుక, కోపాన్ని నియంత్రించుకుంటున్న స్వరంతో "యువరాణీ! విను" అని ఇలా చెప్పసాగింది.

ఒకప్పుడు అరిష్టపురం అనే నగరం ఉండేది. (దురదృష్ట నగరం అని ఆ పేరుకు అర్ధం.) ఆ నగరాన్ని ధర్మకేసరి అనే రాజు పాలిస్తుండేవాడు. (ధర్మాన్ని పాటించడంలో సింహం వంటి వాడని ఆ పేరుకి అర్ధం.)

ఆ నగరంలో గిరి వర్ధనుడు అనే వైశ్యుడుండేవాడు. అతడు గొప్ప ధనిక వ్యాపారి. అతడికి ఒకే ఒక్క కూతురు, లాలస. (ఆమె పేరుకు అర్ధం కోరిక అని!) ఆమె చక్కనిది. అయితే పేరుకు తగినది.

ఆమె యుక్తవయస్సులో ఉంది. అదే నగరంలో ఉన్న మరో వైశ్య యువకుడు వరకీర్తి, గిరి వర్ధనుణ్ణి కలుసుకొని పిల్లనిమ్మని అడిగాడు. గిరి వర్ధనుడికి అతడి కుటుంబ నేపధ్యమూ, అందచందాలు, గుణగణాలు నచ్చడంతో, లాలసని వరకీర్తి కిచ్చి పెళ్ళిచేసాడు.

కొన్ని రోజుల తర్వాత వరకీర్తి, లాలసని ఆమె పుట్టింట వదిలి పెట్టి, వ్యాపార నిమిత్తం దూరదేశాలకు వెళ్ళాడు. లాలస యవ్వనంలో ఉంది. భర్త దగ్గర లేడు. దాంతో ఆమె కోరికలని నియంత్రించుకోలేక, తమ ఇంటికి సమీపంలో నివసించే బ్రాహ్మణ యువకుణ్ణి ఒకణ్ణి ఆకర్షించి, అతడితో రహస్య ప్రణయం నడపసాగింది. (ఇలాంటి కథ పిల్లలకి చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే ఆమె అతడితో డ్యూయెట్ పాడేసింది అని చెబుతుంటాను.)

లాలస తన అక్రమ ప్రేమయణాన్ని అతి రహస్యంగా కొనసాగించింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఓరోజు... వ్యాపార నిమిత్తం దూరదేశాలకు వెళ్ళిన వరకీర్తి ఇంటికి తిరిగి వచ్చాడు. వ్యాపారంలో మంచి లాభాలు గడించినందుకు, అతడెంతో సంతోషంగా... భార్యకు, అత్తమామలకు విలువైన బహుమతులు తెచ్చాడు. లాలసకు పట్టు చీరలు, వజ్రాభరణాలు పట్టుకొచ్చాడు.

ఆ రోజు రాత్రి, లాలస, భర్తతో తియ్యగా మాట్లాడి, అతడు తెచ్చిన కానుకలని మెచ్చుకొని, అతణ్ణి ఆనందపరిచింది. భర్త నిద్రపోయాక, తనకి అత్యంత నమ్మకస్థురాలైన దాసీని పిలిచి, తన ప్రియుడైన బ్రాహ్మణ యువకుని, ఎవరూ చూడకుండా పిలుచుకు రమ్మంది. లాలస వివాహేతర ప్రేమ సంబంధం గురించి ఈ దాసీకి ముందే తెలుసు. లాలస ఇచ్చే కానుకలతో, ఆమెకి కావలసినట్లుగా మసలు కుంటుంది.

దాంతో దాసి, లాలస చెప్పినట్లుగానే బ్రహ్మణ యువకుణ్ణి పిలుచుకు వచ్చి, వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే సంకేత ప్రదేశంలో ఉంచింది. ఎప్పటి లాగే గిరి వర్ధునుడి భవంతి వెనుక తోటలో, ప్రహరీ గోడ ప్రక్కనే నక్కి ఆ బ్రాహ్మణ యువకుడు, లాలస కోసం ఎదురు చూడసాగాడు.

అప్పటికి అర్ధరాత్రి దాటింది. నగరానికి కాపలాకాసే గస్తీ సైనికులు అప్పుడే, అక్కడికి వచ్చారు. వైశ్య వ్యాపారి ఇంటి వెనక ఎవరో నక్కి ఉండటం గమనించారు. తమ విధి నిర్వహణలో భాగంగా అది వాళ్ళ దినచర్య. గిరి వర్ధనుడు ధనికుడు గనుక ఇంటి వెనుక ఎవరో దొంగ మాటు వేసాడేమో నని అనుమానించారు.

"ఎవరదీ!" అంటూ గట్టిగా గద్దించారు. బ్రాహ్మణ యువకుడు చీకట్లోకి తప్పుకున్నాడు. ‘ఎందుకొచ్చిన సందేహం?’ అన్నట్లుగా గస్తీ సైనికులు చీకట్లోకి బాణాలు వదిలారు. వాటిల్లో ఒకటి బ్రాహ్మణ యువకుడికి తగిలింది. గాయమైంది. బాధకి విలవిల్లాడినా, ఆ బ్రాహ్మణ యువకుడు గట్టిగా అరవలేదు.

‘ఎక్కడ తన అక్రమ సంబంధం బయటపడుతుందో’ అన్న భయం అతడిది. ఇంతలో బాధకి, రక్తస్రావానికి స్ఫృహ తప్పిపోయాడు. ఏ చప్పుడూ రాకపోవటంతో, గస్తీ సైనికులు తమ దారిన తాము పోయారు.

లాలస కదంతా తెలియదు. అప్పటికే ఆలస్యమైందనుకుంటూ ఆదర బాదరా వచ్చింది. ప్రియుణ్ణి ప్రేమతో పిలిచింది. బ్రాహ్మణ యువకుడి నుండి ఉలుకూ పలుకూ లేదు. లాలస, తాను ఆలస్యంగా వచ్చినందుకు అతడు కోపగించుకుంటున్నాడనుకొంది.

అతణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకుని వెనుక నుండి వచ్చి కౌగిలించుకుంది. గుసగుసలు పోతూ, ముందు కొచ్చి మూతిమీద ముద్దు పెట్టుకుంది. అప్పుడే ఆమె ముక్కు అతడి నోట చిక్కుకుంది. ఆమె కుదుపులకు, అప్పటి వరకు స్పృహతో లేని బ్రాహ్మణ యువకుడికి ఒక్కసారిగా స్పృహ వచ్చింది. మరుక్షణమే... ఆమె ముక్కు అతడి నోట ఉండగానే, అతడు ప్రాణాలు వదిలేసాడు.

ఈ హఠాత్పరిణామానికి నివ్వెర పోయిన లాలస, ఒక్కసారిగా లేచి నిలబడింది. ఆ దెబ్బకి ఆమె ముక్కు కొన కాస్తా తెగి, బ్రాహ్మణ యువకుడి శవం నోటిలో ఉండిపోయింది.

ఒక్కసారిగా లాలస భయంతో వణికి పోయింది. ఏం చెయ్యడానికీ తోచలేదు. ఒక్క పెట్టున ఇంట్లోకి పరుగెత్తుకొచ్చింది.

~~~~~~

మగవారినెందుకు నమ్మరాదు ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 31]

పంచవన్నెల చిలుక "ఓ యువరాజా! పరాక్రమ కేసరీ!విను...." అంటూ ఇలా కొనసాగించింది.

అభయ సత్యం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణంలో పేరెన్నికగన్న వైశ్య వ్యాపారి ఒకడుండేవాడు. అతడి పేరు వాల్మీకుడు. అతడికి తర్క కేసరి అనే కుమారుడుండేవాడు.(వాదనలో సింహం వంటి వాడని అతడి పేరుకు అర్ధం.) వాల్మీకుడు అత్యంత ధనవంతుడు. దాంతో ఏకైక కుమారుడైన తర్కకేసరిని అతి గారాబంగా పెంచాడు.

సహజంగానే... ఎదిగే కొద్దీ తర్కకేసరి, క్రమశిక్షణారాహిత్యంతో, పొగరబోతుగా, సోమరిగా, వ్యసన పరుడిగా తయారయ్యాడు. చిన్నప్పుడు ఆటపాటల మీద ఉండిన యావ కాస్తా, యవ్వనంలోకి వచ్చేసరికి వేశ్యల మీదికి పోవటంతో, తర్క కేసరి పూర్తిగా చెడు త్రోవ పట్టాడు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు... వాల్మీకుడు, కొడుకు తర్కకేసరిని సరైన మార్గంలో పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. నయానా భయానా... తాను నచ్చ చెప్పాడు, ఇతరుల చేత చెప్పించాడు. లాభం లేకపోయింది. ఏడ్చాడు, మొత్తుకున్నాడు. కొడుకు మాట వినలేదు. చివరికి గుండె రాయి చేసుకుని, ఇలాగే వదిలేస్తే కొడుకు ఆస్తుపాస్తులన్నిటినీ హారతి కర్పూరంలా సానివాడకి అర్పించేస్తాడని భయం వేసి, తర్కకేసరిని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. కడుపు కాలితేనన్నా బుద్ది మంచిమార్గం పడుతుందేమోనన్న ఆశ కొడగట్టిన దీపంలా వెలుగుతోంది ఆ తండ్రి మనస్సులో!

తర్కకేసరి ఇంటి చుట్టూ తచ్చట్లాడినా తండ్రి మనస్సు కరగలేదు. ఇక తప్పక తర్కకేసరి పట్టణంలో అక్కడా ఇక్కడా తిరిగాడు. ఆ పంచనా ఈ పంచనా పడుకున్నాడు. అందరూ అతణ్ణి ఛీ కొట్టడంతో, గత్యంతరం లేక ఊరు విడిచి పోయాడు.

ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ, చివరికి అలకాపూరి అనే పట్టణం చేరాడు. అక్కడ, పేరున్న ధనిక వ్యాపారి నిషాదశెట్టి అనే వైశ్యుడున్నాడు. అతడి దుకాణం చేరి, పని ఇమ్మని దీనంగా అడిగాడు. ఇతడి వాలకం చూసి జాలిపడిన నిషాద శెట్టి ఊరుపేరూ కనుక్కొని ‘సాటి వైశ్య యువకుడు కదా’ అనుకొని ఆదరించాడు.

తర్కకేసరి కూడా... అప్పటి వరకూ అనుభవించిన క్లేశాల రీత్యా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, యజమాని దగ్గర అణుకువగా పనిచేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి, నిషాద శెట్టికి తర్కకేసరి మీద మంచి అభిప్రాయం కలిగింది.

తన కుమార్తె అలంకారినిచ్చి తర్కకేసరి పెళ్ళి జరిపించాడు. ఒక్కగానొక్క కూతురితో పాటు, వ్యాపారాన్ని కూడా చేతిలో పెట్టాడు. డబ్బూ, ఆధిపత్యం చేతికొచ్చేసరికి, తర్కకేసరిలో మరోమనిషి మెల్లిగా నిద్రలేవటం మొదలయ్యింది.

ఓ రోజు నిషాదశెట్టి దగ్గరికి చేరి "మామగారూ! నేను చాలా రోజుల క్రితమే నా తల్లిదండ్రుల్నీ, ఇంటినీ విడిచి వచ్చాను. కోపం కొద్దీ ఇల్లు విడిచి వచ్చిన రీత్యా ఇన్ని రోజులూ ఏదీ ఆలోచించలేదు. ఇన్నాళ్ళాయే! ఇప్పుడెందుకో గానీ, నా భార్యని తీసుకుని నా తల్లిదండ్రుల దగ్గరికి ఓసారి వెళ్ళి రావాలనుంది. కోడల్ని వాళ్ళకి చూపించి, కొన్నిదినాలుండి, వాళ్ళని సంతోషపరచి తిరిగి ఇద్దరమూ వచ్చేస్తాం. కన్నవారి ఉసురు తగలక మానదంటారు. కాబట్టి నాకు అనుమతి నీయవలసింది" అన్నాడు.

నిషాదశెట్టి అందుకు అంగీకరించి, కూతురూ అల్లుడికి కొత్తబట్టలు నగలు బహుకరించాడు. వియ్యంకులకీ నగలూ దుస్తులతో పాటు మరెన్నో విలువైన కానుకలిచ్చి, అమ్మాయినీ అల్లుణ్ణి సాగనంపాడు.

తర్కకేసరి, అతడి భార్య అలంకారి, నిషాదశెట్టి దంపతుల దగ్గర వీడ్కొలు తీసుకొని, అభయసత్యం పట్టణానికి బయలుదేరారు. ప్రయాణపు దారిలో తర్కకేసరికి తండ్రి ఇంట తానుండగా... పనీపాటా లేకుండా జులాయిగా తిరిగిందీ, వేశ్యల ఇంట హద్దూ అదుపులేకుండా మద్యమాంసాలతో విచ్చలవిడిగా గడిపిందీ గుర్తుకొస్తోంది. తండ్రి దగ్గరుండగా ఏ పనీ చేయకుండా సోమరిగా గడిపేసాడు. ఇప్పుడు మామగారింట ఒళ్ళొంచి వ్యాపారం చేస్తున్నాడు. బుద్దిగా ఉంటున్నాడు.

గతం గుర్తుకొచ్చి తర్కకేసరి మనస్సు అడవి గుర్రంలా సానివాడ కేసి పరుగెత్తింది. క్రమంగా ‘భార్యనెలా మోసగించాలా?’ అన్న ఆలోచనలు అతడిని ఆక్రమించసాగాయి. అతడు భార్యతో "ఓనా ముద్దుల సతీ! అలంకారీ! ఈ అడవిలో దొంగలుంటారని పేరుంది. ఇన్ని నగలు వంటి మీదుంచుకొని ప్రయాణం శ్రేయస్కరం కాదు. కాబట్టి నగలన్నీ ఒలిచి మూటగట్టి నాకివ్వు. నేను జాగ్రత్త చేస్తాను" అన్నాడు.

ఆమె అలాగే చేసింది. మరుక్షణం తర్కకేసరి అలంకారిని బాటప్రక్కనే ఉన్న పాత బావిలోకి త్రోసేసి, నగలూ ఇతర విలువైన వస్తువులతో, గతంలో తాను ఆదరించిన వేశ్యల దగ్గరికి చేరాడు. అలంకారి బావిలో పడిన క్షణమే స్పృహ కోల్పోయింది. కొద్దిక్షణాల తర్వాత తేరుకొని, రక్షించమని కేకలు వేయటంతో, బాటసారులెవరో ఆమెని కాపాడారు. వాళ్ళ సాయంతో, ఎన్నో ప్రయాసలు పడి, అలంకారి తిరిగి అలకాపురిలోని తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది.

నిషాదశెట్టి... కూతురు ఒంటరిగా, దైన్యంతో తిరిగి రావటం చూసి బెదిరిపోయాడు.

"ఏమైంది తల్లీ" అనడిగాడు గాభరా పడుతూ!

"తండ్రీ! మేమిద్దరం వెళ్తూ ఉండగా దొంగల గుంపు మమ్మల్ని అటకాయించింది. నా నగలు డబ్బు అన్నీ దోచుకుంది. దొంగలు నన్ను కొట్టి బావిలోకి త్రోసి, నా భర్తని బందీగా తమ వెంట తీసుకుపోయారు. బాటసారుల సాయంతో నేనెలాగో ఇల్లు చేరగలిగాను" అంది.

తల్లిదండ్రులకి నిజం చెబితే... ‘ఒక్కగానొక్క కూతురి బ్రతుకు ఇలా అయ్యిందే’ అని వారు దుఃఖపడతారని, ఆమె జరిగిందేమీ తల్లిదండ్రులకు చెప్పలేదు. సరికదా, దొంగలని కట్టుకథలు చెప్పింది.

నిషాదశెట్టి కూతుర్ని ఓదార్చి "నువ్వు దిగులు పడకు తల్లీ! సేవకులని పంపి నీ భర్త కోసం వెతికిస్తాను" అన్నాడు. అలంకారి తల్లి, అల్లుడి క్షేమం కోరి పూజలూ వ్రతాలు చేయిస్తుండగా, తండ్రి అల్లుడి కోసం అన్వేషణ చేయిస్తున్నాడు. ఇలా కొన్నిరోజులు గడిచాయి.

ఇలా ఉండగా... తర్కకేసరి తెచ్చిన సొమ్ము ఖర్చయిపోగానే, వేశ్యలతణ్ణి తన్ని తగలేసారు. మళ్ళీ అతడి బ్రతుకు బజారు పాలయ్యింది. చేసేది లేక, తక్కుతూ తారుతూ తిరిగి అత్తగారిల్లు చేరాడు. అతడింటికి వచ్చేసరికి, సరిగ్గా ఎదురుగా భార్య అలంకారి ఉంది. అతడది ఊహించలేదు. తాను బావిలో తోసాడు గనక ఆమె అక్కడే మరణించి ఉంటుందనీ, దారిలో తాము పులివాతో, దొంగల బారినో పడ్డామని చెప్పే ప్రణాళికతో వచ్చాడు.

తీరా ఎదురుగా భార్య ఉండేసరికి గతుక్కుమన్నాడు. "ఈమె ఎలా బ్రతికి వచ్చింది? ఏమైనా గానీ... తన గురించీ, తన దురాగతం గురించీ తండ్రికి ఈ పాటికి చెప్పే ఉంటుంది. ఇప్పుడు అత్తమామలు నన్ను చంపిపాతరెయ్యటం ఖాయం" అనుకొని భయంతో వెనుదిరిగి పారిపోబోయాడు.

~~~~~~

చిలుకలు త్రికాలవేదులు ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 30]

విక్రమాదిత్యుడు విసుగు చెందకుండా, మోదుగ చెట్టు వద్దకు చేరి, మళ్ళీ భేతాళుని దించి భుజమ్మీద వేసుకుని, బృహదారణ్యం కేసి నడవ సాగాడు. యధాప్రకారం భేతాళుడు కథ ప్రారంభించాడు.

ఒకానొకప్పుడు పాటలీ పుత్రమనే నగర ముండేది. (పాటలీ పుష్పాలతో నిండి ఉన్న నగరమని దాని అర్ధం. ఇప్పటి మన పాట్నా పేరు, ఒకప్పుడు పాటలీ పుత్రమే!) విక్రమకేసరి అనే రాజు దాన్ని పరిపాలిస్తుండేవాడు. (పరాక్రమంలో సింహం వంటి వాడని ఆ పేరుకి అర్ధం.) అతడి కొక కుమారుడు. పేరు పరాక్రమ కేసరి. (ఈ పేరు అర్దమూ అదే!)

యువరాజు పరాక్రమ కేసరి అన్ని విద్యలూ అభ్యసించాడు. అన్నికళల్లో ఆరి తేరాడు. ధైర్యసాహసాలకు, పరాక్రమానికి అతడెంతో పేరుగాంచాడు. అతడొక అందమైన, పంచవన్నెల రామచిలకని పెంచుతుండేవాడు. అది మగ చిలుక. అది త్రికాల వేది కూడా! అంటే ఎవరికైనా... వారి భూత భవిష్యవర్తమానాలను చెప్పగలిగేది.

ఓరోజు, యువరాజు తన చిలుకని "ఓ పంచ వన్నెల రామచిలుకా! నువ్వు ఎవరికైనా... జీవితంలో జరిగిపోయినవీ, జరగబోయేవీ, జరుగుతున్నవి కూడా చెప్పగలవు కదా! చెప్పు. నా వివాహం ఎప్పుడు జరుగుతుంది?" అని అడిగాడు.

చిలుక కనురెప్పులల్లార్పుతూ "ఓ యువరాజా! వేదపురి అనే నగరమొకటి ఉంది. దానిని గదాధరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడికి సంతానం లేదు. దాంతో అతడు మహాశివుడి గురించి తపమాచరించాడు. శివుడు ప్రత్యక్షమై "ఓ రాజా! నీ తపస్సుకు మెచ్చాను. నీకే వరం కావాలో కోరుకో! అనుగ్రహిస్తాను" అన్నాడు.

మహాశివుణ్ణి చూసిన గదాధరుడు అమితానందంలో శివుని పరిపరి విధాల కీర్తించాడు. భక్తి పూర్వక స్వరంతో "ఓ దేవా! నాకు సంతానాన్ని ప్రసాదించు" అని కోరాడు. శివుడు "తధాస్తు" అన్నాడు. ఆ దేవదేవుని కరుణతో గదాధరునికి ఒక ఆడశిశువు కలిగింది. ఆ బిడ్డకు ‘రత్నావళి’ అని పేరుపెట్టి, అల్లారు ముద్దుగా పెంచారు రాజదంపతులు. ఆమె ఇప్పుడు యుక్త వయస్కురాలై ఉంది. ఆ యువరాణి సౌందర్యవతి, సౌశీల్యవతి.

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆమె కూడా నీకు లాగానే ఒక అందమైన పంచవన్నెల చిలుకని పెంచుచున్నది. అది సీత చిలుక! అంటే ఆడ చిలుకన్న మాట! అది కూడా నాలాగానే త్రికాల వేది.

నీలాగానే యువరాణి రత్నావళి కూడా, తన చిలుకని ‘తన వివాహమెప్పుడని’ అడిగింది. దానికా ఆడ చిలుక "ఓ అందాల రాణీ! యువతీ శిరోమణీ! పాటలీ పుత్రానికి రాజు విక్రమకేసరి. అతడి కుమారుడు పరాక్రమ కేసరి. అతడే నీకు తగిన భర్త" అని చెప్పింది.

రత్నావళి ఈ విషయాన్నంతా తండ్రి గదాధరుడికి వివరించి చెప్పింది. రాజదంపతులు ఆ అందాల భరిణెను నీకివ్వ దలిచారు. వాళ్ళంతా పాటలీ పుత్రం బయలు దేరారు. రత్నావళి పల్లకిలో ప్రయాణిస్తుండగా, రాజదంపతులు రధంలో వస్తున్నారు. మంత్రి సేనాపతుల బృందం గుర్రాలపై తరలి వస్తోంది. వాళ్ళంతా ఈ పాటికి మన నగర ద్వారానికి సమీపంలో ఉన్నారు" అని చెప్పింది.

పరాక్రమ కేసరి కిదంతా వినేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. తల్లిదండ్రుల కిదంతా తెలియ జేసాడు. విక్రమకేసరి దీనికెంతో సంతోషించి, రాణి, మంత్రులూ పరివారాన్ని తొడ్కొని గదాధరుడికీ, అతడి బృందానికీ ఘనస్వాగతం పలికాడు.

పలుకరింపులూ, పరామర్శలూ, రాచమర్యాదలూ అయ్యాక, అన్ని విషయాలు చర్చించుకొని, శుభమహుర్తం నిర్ణయించి పరాక్రమ కేసరికి, రత్నావళికి వివాహం జరిపించారు. వధూవరులు ఒకరికొకరు తీసిపోనట్లున్నారు. చిలుకా గోరింకల్లా ఉన్న జంటని అందరూ అభినందించారు. ఆశీర్వదించి మురిసి పోయారు.

పెళ్ళివేడుకల హడావుడీ పూర్తయ్యాక, ఓ రోజు వెన్నెల రాత్రి, ఏకాంత మందిరంలో ఒండొరుల సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తూ... నూతన దంపతులు పరాక్రమ కేసరి, రత్నావళి, కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రసంగవశాన సంభాషణ వారి చిలుకల మీదికి మళ్ళింది.

పరాక్రమ కేసరి "నా ప్రియసఖి! రత్నావళి! మనమింత వరకూ ఎంతో ప్రేమతో ఆనందంగా కాలం గడుపుతున్నాము. మన వివాహం మన రామచిలుకల వలన గదా జరిగింది? అవి కూడా మనలాగే ఆనందంగా ఉంటే, మనకి మరింత ఆనందంగా ఉంటుంది. నేను పెంచింది మగ చిలుక. నీవు పెంచింది ఆడ చిలుక. అవి పరస్పర మైత్రీ బంధాన్నీ, ప్రేమనీ ఆనందించేటట్లుగా, రెండింటినీ ఒకే పంజరంలో పెడదాం" అన్నాడు.

రత్నావళి ఇందుకు సంతోషంగా ఒప్పుకుంది. మరింత విశాలమైన అందమైన పంజరాన్ని తెప్పించి, అందులో రెండు చిలుకల్నీ విడిచిపెట్టారు.

మగ చిలుక తనని సమీపించేందుకు రాగానే, ఆడ చిలుక కోపంతో... ఎర్రటి ముక్కుని మరింతగా ఎర్రగా చేసుకుంటూ "ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు? అక్కడే ఆగు! మగవాళ్ళని నమ్మకూడదు" అంది.

అది వినగానే మగ చిలుక ముక్కుతో పాటు ముఖమంతా ఎర్రగా చేసుకుని "ఆ మాట కొస్తే ఆడవాళ్ళని అసలు నమ్మకూడదు"అంది. అంతే! అవి రెండూ గఁయ్యిమంటూ వాదులాడుకోసాగాయి. అప్పటికే నిద్రలోకి జారుకున్న కొత్త దంపతులు ఉలికిపాటుతో నిద్రలేచారు. "ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు?" అని ఏకకంఠంతో అడిగారు.

రెండు చిలుకలూ ఏం జరిగిందో వివరించాయి. దేని వాదన అది వినిపించింది. యువరాణీ, యువరాజుని తమ వివాదం తీర్చమని అడిగాయి. రత్నావళి, పరాక్రమ కేసరి బిత్తరపోయి విన్నారు.

చివరికి పరాక్రమ కేసరి ఆడచిలుకతో "నువ్వు మగవారిని నమ్మరాదని అనడానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.

గొంతు సవరించుకొని, ఆడ చిలుక ఇలా చెప్పసాగింది.

~~~~~~~~
కథా విశ్లేషణ:

ఈ కథలో... ఇంత వరకూ అద్భుతరసం నిండి ఉంటుంది. పంచవన్నెల రామచిలుకలు, మాట్లాడే చిలుకలు, కబుర్లు కథలు చెప్పే చిలుకలు! అందునా భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పే చిలుకలు... చిన్నారులని ఊర్రూతలూగిస్తాయి!

విరిబోణికి భర్త ఎవరు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 29]

కోవెల ఆవరణలో భర్త కోసం ఎదురు చూస్తున్న విరిబోణి, ఎంతకూ యశోవంతుడు తిరిగి రాకపోవటంతో కంగారు పడింది. ఆమె అన్న "నా ప్రియమైన చెల్లెలా! నీవు ఆందోళన చెందకు. నేను వెళ్ళి బావను పిలుచుకు వస్తాను." అని చెప్పి గుడిలోపలికి వెళ్ళాడు.

చూస్తే ఎదురుగా ఏముంది? భయానక దృశ్యం! భరించలేని దృశ్యం! తన ముద్దుల చెల్లెలి ప్రియతమ పతి తల, చెట్టు కొమ్మకు వేలాడుతోంది. శరీరం అమ్మవారి బలిపీఠంపైన పడి ఉంది. రక్తం చుట్టూ చిమ్మబడి ఉంది. ఆ దృశ్యం అతణ్ణి ఆపాద మస్తకం వణికించింది. నిన్న మొన్న పెళ్ళైన తన చెల్లెలికి, ఈ దుర్వార్త చెప్పేందుకు అతడికి మనస్సు రాలేదు. కూతురూ అల్లుళ్ళ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులని తలుచుకొని, అతడికి అంతులేని నైరాశ్యం కలిగింది.

ఎక్కడలేని తెగింపుతో, యశోవంతుడికి మాదిరి గానే, తన జుట్టునీ చెట్టు కొమ్మకి కట్టుకుని, కత్తి తీసుకొని తల నరుక్కున్నాడు. బావ గారి తల ప్రక్కనే అతడి తల వేలాడుతుండగా, మొండెమూ బావ దేహం ప్రక్కనే పడింది. రక్తం కలగలిసి పోయింది.

భర్త జాడలేదు. వెదకపోయిన అన్న జాడ కూడా లేకపోయేసరికి, విరిబోణి... ఇద్దర్ని వెదుకుతూ కోవెల లోకి ప్రవేశించింది. భయానక దృశ్యాన్ని చూసి తట్టుకోలేక పోయింది. అప్పటికే ఇద్దరూ విగత జీవులైనారు. గుండె బ్రద్దలైనంతగా దుఃఖించింది. దుఃఖాతిశయంతో ఆమె శరీరం వణుకుతోంది.

విహ్వల చిత్తయై "నా ప్రియమైన, సర్వస్వమైన భర్త మరణించాడు. ప్రేమగా చూసుకునే అన్నా మరణించాడు. ఇక నేనుండి ఏం లాభం? నా దైన్యపు ముఖమీ లోకానికెలా చూపించటం? తల్లిదండ్రుల దుఃఖాన్ని గానీ, అత్తమామల దుఃఖాన్ని గానీ ఎలా భరించటం? ఇంతకంటే చావు మేలు. అన్నా భర్తల దారిలోనే నేనూ పోయెద గాక!" అనుకున్నది.

దుఃఖాతిశయంతో, ఆవేశంతో కత్తి చేత బట్టి, శిరస్సు ఖండించుకోబోయింది. ఆ క్షణమే మెరుపు మెరిసినట్లు, భద్రకాళి ఆమె ముందు ప్రత్యక్షమైంది. (అవి ఆ రోజులు కాబట్టి, భక్తుల చావు తెగింపు చూసి, అమ్మవారు ప్రత్యక్షమైంది. ఈ కథ చెప్పేటప్పుడు పిల్లల ఆలోచన, అటు పోకుండా జాగ్రత్త తీసుకోవటం అవసరం. శక్తిమాన్ అనుకుని, మేడ పైనుండి దూకే చిన్ని హృదయాలవి! కల్పనకీ వాస్తవానికీ మధ్య రేఖ, వాళ్ళకి స్పష్టంగా కనబడదు కదా! అంత గాఢ భక్తి ఉంటే దైవదర్శనం సత్యమే కావచ్చు గాక గానీ, సామాన్య బాలకులకి అదేమో తెలియదు కదా!)

విరిబోణి, భద్రకాళి దర్శనంతో మాటలు రాక నిల్చుండి పోయింది. ఆ తల్లి విరిబోణిని వారిస్తూ "అమ్మాయీ! ఆగు! సాహసించకు! నీకేం కావాలో కోరుకో! నీవడిగిన వరాలిస్తాను" అని బుజ్జగించింది.

విరిబోణి కన్నీరు తుడుచుకుంటూ "అమ్మా! నా భర్తనీ, అన్ననీ పునర్జీవితుల్ని చెయ్యి. అంతకంటే కోరదగిన కోరిక లేదు నాకు" అంది.

భద్రకాళి "అమ్మాయి. అలాగే అనుగ్రహిస్తాను. వీరి శరీరాలకు తలలు చేర్చి, ఈ మంత్రజలం చల్లి, విభూది పూసి, ఈ బెత్తంతో తట్టు" అంటూ మంత్రజలాన్ని, విభూదిని, బెత్తాన్ని ఇచ్చి అంతర్ధాన మయ్యింది.

చెప్పలేనంత ఉద్విగ్నతతో... విరిబోణి, చెట్టుకు వేలాడుతున్న తలలు రెండింటినీ, నేలపై పడి ఉన్న మొండేలతో చేర్చి, మంత్రజలం చల్లింది. విబూది పూసి బెత్తంతో తట్టింది.

భద్రకాళి కరుణతో, ఇరువురూ ప్రాణాలతో లేచి కూర్చున్నారు. కానీ ఏం జరిగిందో గమనించేసరికి ఆమె నిర్ఘాంత పోయింది. ఉద్విగ్నతతోనూ, ఆతృతతోనూ... విరిబోణి, అన్న శరీరానికి భర్త శిరస్సునీ, భర్త శరీరానికి అన్న శిరస్సునీ అంటించింది.

ఇదీ కథ!

ఓ విక్రమార్క మహారాజా! నీవు మహిలోని రాజులందరిలో ఉత్తమోత్తమడవు. ఇప్పుడు పునర్జీవితులైన వారిలో, ఎవరు విరిబోణి భర్త?" అని అడిగాడు భేతాళుడు.

విక్రమాదిత్యుడు, కోర మీసాల మాటున, చిరునవ్వుతో పెదవులు మెరుస్తుండగా "భేతాళుడా! పునర్జీవితులైన తర్వాత, ఎవరు ఆమెని చూసి తన భార్యగా గుర్తిస్తారో.... అతడే ఆమె భర్త, ఎవరామెని చెల్లెలిగా గుర్తిస్తారో... అతడే ఆమె అన్న!"అన్నాడు.

భేతాళుడు తృప్తిగా తలాడిస్తూ, మౌనభంగమయ్యింది గనుక మాయమై పోయాడు.

కథ విశ్లేషణ:

సాధారణంగా.... జ్ఞాపకశక్తి, గుర్తుపట్టటం, గుర్తుంచుకోవటం మేధస్సుకు సంబంధించినవనీ,
ప్రేమ, ఆత్మీయత, కృతజ్ఞత వగైరా భావనలు హృదయానికి సంబంధితవనీ అంటారు.
మేధస్సుకు మెదడునీ,
ప్రేమానుభూతులకి హృదయాన్ని చిహ్నంగా చెబుతారు.

ఆ విధంగా చూస్తే గుండె i.e. హృదయం దేహంలో ఉంటే, మెదడు తలలో ఉంటుంది. అలాంటి చోట... దేహాన్ని భర్తగా గుర్తించాలా, తలని భర్తగా గుర్తించాలా?

విరిబోణి వైపు నుండి చూస్తే... ఈ మీమాంస అంతా ఉంటుంది. అయితే, విక్రమాదిత్యుడు విరిబోణి పరంగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆమె భర్తా, అన్నల పరంగా చెప్పాడు. ఎవరామెని భార్యగా గుర్తిస్తారో అతడామె భర్త, ఎవరామెని సోదరిగా గుర్తిస్తారో అతడామె అన్న! పేచీ లేని పరిష్కారం కదా! అదీ... విక్రమార్కుడి సునిశిత ఆలోచనా పటిమ!

ఇలాంటి చమత్కార పూరిత కథలు విన్నప్పుడు పిల్లలు ఎంత ఉత్తేజమవుతారో! వాళ్ళని, అన్నిరకాలుగా ఉర్రూతలూగిస్తాయి ఇలాంటి కథలు! సునిశిత ఆలోచనా విధానం అప్రయత్నంగానే అలవడుతుంది.

~~~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes